వార్తల్లో ప్రాంతాలు

మాస్కోలో రోబోస్టేషన్‌ ఇంటరాక్టివ్‌ మ్యూజియం

రోబోల వినియోగం విస్తృతం అవుతున్న నేపథ్యంలో వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు రష్యా రాజధాని మాస్కోలో రోబోస్టేషన్‌ ఇంటరాక్టివ్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్, దక్షిణకొరియా, చైనా, జపాన్‌ సహా వివిధ దేశాలకు చెందిన 40 రోబోలు దీంట్లో కొలువుదీరాయి. ఇక్కడ రోబోలు చేసే విన్యాసాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో వినియోగించే రోబోల నుంచి వినోదం పంచే రోబోల వరకు ఈ మ్యూజియంలో ఉన్నాయి. సందర్శకులు రోబోలను తమతో ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఈ మ్యూజియంలోని రోబోలను అద్దెకు ఇస్తారు.

వనపర్తి జిల్లా తూంకుంటలో వీరశిల్పం గుర్తింపు

→తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూంకుంటలో వీరశిల్పాన్ని గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు డా.బైరోజు శ్యాంసుందర్‌ తెలిపారు.
→ఈ విగ్రహం క్లోరైట్‌ శిలతో చెక్కి, మూడు అడుగుల ఎత్తు ఉందన్నారు. గుర్రం మీద వీరుడి పేరు వడ్డిపల్లి గణపయగా రాసి ఉన్న నామశాసనాన్ని కనుగొన్నారు.
→ కాకతీయుల పాలన అనంతరం 14వ శతాబ్దపు తెలుగు లిపిలో ఈ శాసనం ఉంది. మందపు రాతి పలక మీద ఒకవైపే ఉబ్బెత్తుగా చెక్కి ఉందీ అర్ధశిల్పం.
→ ఈ శిల్పంలో వీరునికి శిరస్సు లేదు. అశ్వారోహకుడై కుడిచేత పొడవైన బల్లెం పట్టుకున్నాడు.
→ సాధారణంగా వీరగల్లులు అర్ధశిల్పాలుగానే ఉంటాయని, పూర్తి శిల్పాలు అత్యంత అరుదని శ్యాంసుందర్‌ తెలిపారు.
→ వెలమ నాయకులు తొలుత ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లు నుంచి పాలించినట్లు చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతి సన్నటి నది

→ప్రపంచంలోనే అతి సన్నటి హులాయి. చైనాలోని మంగోలియాలో ఉందీ నది. దీని వెడల్పు కొన్ని సెంటీమీటర్లే. కొన్ని ప్రాంతాల్లో ఈ నదిపై నుంచి ఒకే ఉదుటన దాటొచ్చు కూడా.
→హులాయి నది పొడవు 17 కిలోమీటర్లు. సగటు వెడల్పు మాత్రం 15 సెంటీమీటర్లే. కొన్ని చోట్ల అయితే ఇంతకన్నా తక్కువగానే ఉంటుంది.
→చైనా నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఈ నది గత 10 వేల ఏళ్లుగా ప్రవహిస్తూనే ఉంది.
→భూగర్భ నీటి బుడగ నుంచి ఈ నది ప్రవాహం ప్రారంభమై హెగ్జిగ్టెన్‌ గ్రాస్‌లాండ్‌లోని దలాయ్‌ నూర్‌ సరస్సులో కలుస్తుంది.

బ్రిటిష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం

→కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు.
→సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు.
→చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో వెలుగు చూసిన ఈ భూగర్భ జలాశయాన్ని 1890లో బ్రిటిష్‌ వారు నిర్మించినట్లు అక్కడ శిలాఫలకం ఉంది.
→తాగునీటి అవసరాల కోసం ఇక్కడ నీటిని నిల్వ చేసుకునేవారని, అవసరమైనప్పుడు గ్రావిటీ ద్వారా కడపకు తీసుకెళ్లేవారని నిపుణులు చెబుతున్నారు.
→కట్టడంలో సిమెంటు, కాంక్రీటు వాడకుండా కేవలం సున్నం గచ్చుతో నిర్మించిన జలాశయం నేటికీ చెక్కుచెదరలేదు.

కెరిమెరిలో బయల్పడిన నత్తగుల్ల శిలాజాలు

→తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ జిల్లా కెరిమెరి పరిసరాల్లో అరుదైన నత్తగుల్ల శిలాజాల్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది.
→ఆ ప్రాంతంలో జరిపిన సర్వేలో ఇవి వెలుగు చూసినట్లు బృందం సభ్యుడు అహోబిలం కరుణాకర్‌ వెల్లడించారు.
→ఇవి గతంలో తిర్యాణి ప్రాంతంలో బయటపడిన ‘ఫిసా’ తరగతి కంటే భిన్నమైనవని, పురాజీవశాస్త్ర రీత్యా వీటి వయసు 6.5 కోట్ల సంవత్సరాలు ఉంటుందని చెప్పారు.

జౌళిలో పదో శతాబ్దపు చాముండి విగ్రహం గుర్తింపు

→తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని జౌళి గ్రామంలో అత్యంత పురాతనమైన పదో శతాబ్దపు చాముండి విగ్రహాన్ని గుర్తించినట్లు తెలిపారు.
→విగ్రహంపై కిరీటం, కంఠాభరణాలు కలిగి నాలుగు చేతుల్లో ఢమరుకం, ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. 16వ శతాబ్దపు నాగదేవత, వీరగల్లు, శృంగారాన్ని ప్రతిబింభించే విగ్రహాలు, ఇసుకరాతిపై చెక్కిన పానపట్టం, శివలింగ ప్రతిమలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రాచీన విగ్రహాలు వెలుగులోకి రావడంతో ఈ గ్రామానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని పేర్కొన్నారు.

పాముల పుట్టలో 10వ శతాబ్ది జైన శిల్పాల గుర్తింపు

→సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని పుల్లూరు గ్రామంలో ఓ పాములపుట్టలో కూరుకుపోయిన జైన విగ్రహాల్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఈ శిల్పాలు సుమారు వెయ్యేళ్ల క్రితం నాటివి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్, సభ్యులు అహోబిలం కరుణాకర్, నసీరుద్దీన్, అన్వర్‌ బాషాలతో కలిసి 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు, పక్కనే మాతంగ యక్షుడి శిల్పాలను పరిశీలించారు. పద్మాసనంలో ధ్యానముద్రలో ఉన్న నల్ల శాసనపు రాతి మహావీరుడి శిల్పం క్రీ.శ. 10వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పాలించిన వేములవాడ చాళుక్యుల కాలానికి చెందింది అని శివనాగిరెడ్డి వివరించారు.