ప్రజాదరణలో నంబర్ వన్.. భారత ప్రధాని
→ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
→ఈమేరకు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది.
→సర్వే చేసిన 13 మంది ప్రముఖ నేతలకు గాను అత్యధికంగా 71% ప్రజాదరణతో భారత ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు.
→43% ప్రజామోదంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి ఈ జాబితాలో ఆరో స్థానం దక్కింది.
→ మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66% ప్రజాదరణతో రెండో స్థానంలో నిలిచారు.
→ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగీ 60%తో మూడో స్థానాన్ని సాధించారు.
→జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా (48%), జర్మనీ ఛాన్స్‌లర్ ఒలఫ్ స్కాల్జ్ (44%)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
→కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌లు 7, 8 స్థానాలను దక్కించుకున్నారు.
→బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ 26% ప్రజామోదంతో ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు.
→జనవరి 13-19 మధ్య వారం పాటు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించిన మార్నింగ్ కన్సల్ట్ తాజా రేటింగ్స్‌ను విడుదల చేసింది.
ఎన్నికల బరిలో కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్
→ఎన్నికల బరిలో నిలిచేందుకు వయసు అడ్డంకి కాదని శిరోమణి అకాలీదల్ వ్యవస్థాపకుడు, 94 ఏళ్ల ప్రకాశ్ సింగ్ బాదల్ నిరూపించారు.
→దేశంలోనే అత్యధిక వయసు కలిగిన అభ్యర్థిగా పోటీలో నిలిచారు. 92 ఏళ్ల వయసులో బరిలో నిలిచిన సీపీఎం నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ రికార్డును అధిగమించారు.
→ప్రకాశ్ సింగ్ బాదల్ లాంబి స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాదల్ లాంబి స్థానం నుంచి 11 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అరుణాచల్ టు లద్దాఖ్.. 5 నెలల్లో 4,625 కి.మీ. యాత్ర
→ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ ఇప్పుడు 50 ఏళ్లు పైబడ్డ పది మంది మహిళల జట్టుతో అరుణాచల్ ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు హిమాలయ పర్వతశ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ రోజైన మార్చి 8న బచేంద్రిపాల్ 67వ ఏట అడుగు పెడతారు. అదే రోజున ప్రారంభమయ్యే ఈ యాత్ర 37 పర్వత మార్గాల గుండా అయిదు నెలల్లో 4,625 కిలోమీటర్లు సాగనుంది. వీటిలో 17,320 అడుగుల ఎత్తుతో పర్వతారోహకుల సామర్థ్యాన్ని పరీక్షించే లంఖాగా పర్వత మార్గం కూడా ఉంది.
→ లద్దాఖ్‌లోని ద్రాస్ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంతో యాత్ర ముగుస్తుంది. ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ సంయుక్తంగా ‘ఫిట్ ఇండియా’ బ్యానరుపై ఈ యాత్రను నిర్వహిస్తోంది.
అంటార్కిటికా యాత్రకు అభిషేక్ సొబ్బన ఎంపిక
అంటార్కిటికాలో వాతావరణ మార్పుల్ని పరిశీలించేందుకు ‘అంటార్కిటికా ఎక్స్‌పిడీషన్ - 2022’ పేరిట నిర్వహిస్తున్న యాత్రకు నెల్లూరు జిల్లాకు చెందిన అభిషేక్ సొబ్బన ఎంపికయ్యారు. ఆయనతో పాటు 45 దేశాలకు చెందిన 150 మందికి పైగా ఈ యాత్రలో పాల్గొననున్నారు.
‘2041 ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు రాబర్ట్ స్వాన్ ‘ది లీడర్‌షిప్ ఆన్ ది ఎడ్జ్’ కార్యక్రమంలో భాగంగా అంటార్కిటికా ఎక్స్‌పిడీషన్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. 2022లో మార్చి 17 నుంచి 28వ తేదీ మధ్య ఈ యాత్ర జరగనుంది. భూతాపం కారణంగా అంటార్కిటికాలో మంచు కరిగిపోవడం, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, అక్కడి జీవజాలానికి ఏర్పడుతున్న ముప్పు తదితర అంశాలను యువ బృందం తెలుసుకుంటుంది.
విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన 19 ఏళ్ల యువతి
అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన అద్భుత ఘనత 19 ఏళ్ల జారా రూథర్‌ఫర్డ్‌కు దక్కింది. ఆమె బెల్జియన్-బ్రిటిష్ పైలట్. బెల్జియంలోని కోర్ట్‌రైలో ఓ చిన్న విమాన స్థావరం నుంచి 155 రోజుల క్రితం తన సాహసయాత్రను ప్రారంభించింది. ఏకంగా 52 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ సురక్షితంగా కోర్ట్‌రైకి చేరుకున్నారు. అతిచిన్న వయసులో ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె పేరు గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికాకు చెందిన శేష్టా వైజ్ (30 ఏళ్ల వయసులో) పేరిట ఉంది.
ఆదాయంలో టాప్-10లో సింధు
→అత్యధిక ఆదాయం కలిగిన క్రీడాకారిణుల టాప్-10 జాబితాలో భారత స్టార్ పి.వి.సింధు చోటు సంపాదించింది. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచింది.
→2016 రియో ఒలింపిక్స్‌లో రజతం అనంతరం సింధు బ్రాండ్ విలువ అమాంతం పెరగడంతో 2018లో తొలిసారిగా ఆమె ఫోర్బ్స్ టాప్-10లో స్థానం సాధించింది.
→నిరుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గడంతో సింధు స్పాన్సర్ల జాబితాలో మరిన్ని సంస్థలు చేరాయి. దీంతో 2021లో రూ.53.50 కోట్లు (సుమారు) ఆదాయంతో సింధు ఏడో స్థానంలో నిలిచింది.
→జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా రూ.425 కోట్లతో అగ్రస్థానం సొంతం చేసుకుంది.
→సెరెనా విలియమ్స్ రూ.340 కోట్లు, వీనస్ విలియమ్స్ రూ.84 కోట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
→బైల్స్ (అమెరికా) రూ.81.5 కోట్లతో నాలుగు, ముగురుజా (స్పెయిన్) రూ.60 కోట్లతో అయిదు, జిన్ యంగ్ (దక్షిణ కొరియా) రూ.55.50 కోట్లతో ఆరో స్థానాల్లో ఉన్నారు.
న్యూజిలాండ్ ఎంపీగా మేఘన
ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన(18) న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైంది. ఆ దేశ నామినేటెడ్ ఎంపీ పదవుల ఎంపిక నేపథ్యంలో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా ‘వాల్కటో’ ప్రాంతం నుంచి ఎంపికయ్యారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. మేఘన అక్కడే పుట్టి పెరిగారు.
అణు ఇంధన నౌకకు మహిళా కమాండర్
→అమెరికా నౌకాదళ చరిత్రలో మొదటిసారిగా అణు ఇంధనంతో నడిచే విమాన వాహక నౌకకు ఓ మహిళ నాయకత్వం వహిస్తున్నారు.
→అణుశక్తి నౌక యు.ఎస్.ఎస్. అబ్రహం లింకన్ సారథిగా నియమితులైన కెప్టెన్ బావర్న్‌ష్మిట్ ఆ అరుదైన గౌరవం చేజిక్కించుకున్నారు.
→అబ్రహం లింకన్ నౌక సమూహంలో అత్యాధునిక యుద్ధ విమానాలు, ఒక గైడెడ్ మిసైల్ క్రూయిజర్ నౌక, మూడు డిస్ట్రాయర్ నౌకలు ఉంటాయి.
→ఈ సమూహం ఇండో - పసిఫిక్ జలాలకు పయనమై వెళుతోంది.
→అబ్రహం లింకన్ నౌక 294 రోజుల పాటు ప్రపంచ సముద్రాలను చుట్టివచ్చింది. బావర్న్‌ష్మిట్ గతంలో హెలికాప్టర్ సముద్ర దళానికి నాయకత్వం వహించారు.
→ఆమెకు మొత్తం 3,000 గంటలసేపు విమానాలు, హెలికాప్టర్లను నడిపిన అనుభవం ఉంది. గత ఏడాది ఆగస్టులో కెప్టెన్ వాల్ట్ స్లాటర్ నుంచి బావర్న్‌ష్మిట్ కమాండర్ బాధ్యతలు స్వీకరించారు.