యునెస్కో వెబ్‌సైట్‌లో హిందీ
→ ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది.
→ ప్రపంచ వారసత్వం కేంద్రం (వరల్డ్ హెరిటేజ్ సెంటర్) వెబ్‌సైట్‌లో భారత్‌కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.
→ ఈ మేరకు యునెస్కో (పారిస్)లో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ వీ శర్మకి ఈ విషయాన్ని వెల్లడించింది.
→ జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని యునెస్కోలో వర్చువల్‌గా నిర్వహించారు.
→ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ సాధించిన కీలక అంశాలు, దాని ప్రాముఖ్యతను విశాల్ వీ శర్మ ఇందులో వివరించారు.
ఆంగ్‌సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలుశిక్ష
→సైనిక ప్రభుత్వం చేతిలో పదవీచ్యుతురాలైన మయన్మార్ నేత ఆంగ్‌సాన్ సూకీకి అక్కడి కోర్టు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
→వాకీటాకీల అక్రమ దిగుమతి, వినియోగం, కరోనా నిబంధనల ఉల్లంఘన కేసుల్లో చెరో రెండేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ ఆదేశాలిచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.
→ మరో రెండు అభియోగాల్లోనూ ఆమెకు గత నెలలో కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా, సైనిక ప్రభుత్వం దాన్ని సగానికి తగ్గించింది.
→ 2021 ఫిబ్రవరిలో సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం ఆమెపై 12కు పైగా అభియోగాలను మోపింది.
→ వీటన్నింటిలో దోషిగా తేలితే 76 ఏళ్ల సూకీ వందేళ్లకు పైగా కారాగారంలోనే గడపాల్సి ఉంటుంది.
టోంగాలో అగ్నిపర్వతం విస్ఫోటనం
→పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.
→దీంతో హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ కోస్ట్ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
→ఆ సమయంలో టోంగాకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీలో దాదాపు 8 నిమిషాల పాటు పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు వినిపించాయి.
→అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన ప్రాంతానికి 65 కిలోమీటర్ల దూరంలోని టోంగా రాజధాని నుకులోఫాలో 1.2 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి.
→పశ్చిమ తీరానికి సునామీ హెచ్చరికలను అమెరికా వాతావరణ విభాగం జారీ చేసింది.
→టోంగాలో లక్షా ఐదు వేల మంది నివసిస్తున్నారు.
→2014, 2015లోనూ టోంగాలో సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్, రష్యా యుద్ధనౌకల విన్యాసాలు
→అరేబియా సముద్రంలో భారత్, రష్యాలకు చెందిన యుద్ధనౌకలు విన్యాసాలు నిర్వహించాయి.
→మన నౌకాదళానికి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ కోచి, రష్యన్ యుద్ధనౌక అడ్మిరల్ ట్రిబుట్స్ ఇందులో పాల్గొన్నాయి.
→ఈ సందర్భంగా ఉమ్మడిగా సాగడం, పరస్పరం సమన్వయం చేసుకోవడం, ఒక యుద్ధనౌకపై ఉన్న హెలికాప్టర్ మరో షిప్‌పై దిగడం వంటి అభ్యాసాలు చేపట్టినట్లు భారత నౌకాదళం తెలిపింది.
భారత్ సరిహద్దులో మాధేశ్ ప్రదేశ్
→భారత్ సరిహద్దులో ఆగ్నేయంగా ఉన్న ప్రావిన్సు-2కు మాధేశ్ ప్రదేశ్ అనే పేరు పెట్టాలని నేపాల్ నిర్ణయించింది.
→దీనికి రాజధానిగా జానక్‌పుర్ కొనసాగుతుంది. ఈ రెండు నిర్ణయాలను ప్రొవిన్షియల్ శాసనసభ మూడింట రెండొంతుల ఓట్ల ఆధిక్యంతో ఆమోదించింది. 2015లో ఈ ప్రావిన్సు ఏర్పడింది.
→దీని గురించి అధికారికంగా ప్రస్తావించాలంటూ అప్పటి నుంచి డిమాండ్లు ఉన్నాయి. ప్రావిన్సు ప్రజల్లో ఎక్కువ మంది భారత సంతతివారే.
ఇండోనేసియా రాజధాని మార్పు
→ద్వీపసమూహ దేశం ఇండోనేసియా తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని తూర్పు కాలిమంటన్ ప్రావిన్స్‌కు తరలిస్తోంది. అక్కడి బాలిక్‌పాపన్ ఓడరేవు సమీపంలో కొత్త రాజధాని కొలువుదీరనుంది.
→ప్రపంచ స్థాయి రాజధానులతో పోటీపడేలా, అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించాలన్నది అధ్యక్షుడు జోకో విడొడొ లక్ష్యం.
→దీన్ని సాకారం చేసేందుకు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి ఉద్ధండులు రంగంలోకి దిగారు.
→ఇండోనేసియాలో 17 వేలకు పైగా ద్వీపాలున్నాయి. మొత్తం జనాభా 27 కోట్లు. ఇందులో 54% మంది ఒక్క జావా ద్వీపంలోనే నివసిస్తున్నారు.
→ జకార్తా కూడా ఇక్కడే ఉంది. నానాటికీ జనంతో కిక్కిరిసిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా సముద్రంలో మునిగిపోతున్న ప్రాంతం కూడా ఇదే.
→ 2050 నాటికి ఇక్కడి మూడింట ఒక వంతు భూభాగం జావా సముద్రంలో కలిసిపోతుందని అంచనా. భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. జల, వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది.
→ వాతావరణ మార్పుల ప్రభావంతో తరచూ భూకంపాలు, సునామీలు, వరదలు సంభవిస్తున్నాయి. ముప్పేట సవాళ్లు ముసురుకోవడంతో 1949 నుంచి జకార్తాలో కొనసాగుతున్న ఫెడరల్ క్యాపిటల్‌ను బోర్నియోకు తరలించాలని విడొడొ యోచించారు.
→ ఇందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
కొత్త రాజధాని ‘నూసంటారా’
→జకార్తా నుంచి తూర్పు కాలిమంటన్‌కు 2 వేల కిలోమీటర్ల దూరం. ప్రస్తుతం అక్కడ 7 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్త రాజధానిని విడొడొ ‘నూసంటారా’గా పేర్కొన్నారు.
→‘ద్వీప సముదాయం’ అని దీనర్థం. రాజధాని తరలింపునకు వీలుగా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, పార్లమెంటు భవనం, ప్రభుత్వ కార్యాలయాలను, రహదారులను నిర్మించాలని నిర్ణయించారు.
→ఇందుకు మొత్తం 1,38,800 ఎకరాలను గుర్తించి, ప్రాథమిక ప్రణాళికనూ రూపొందించారు. 2024 నాటికి అధ్యక్ష భవనం, సచివాలయంతో పాటు హోం, విదేశీ, రక్షణ శాఖల కార్యాలయాలను తరలించాలని యోచిస్తున్నారు.
→ అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన హరిత ఇండోనేసియాను ఆవిష్కరించేలా నూతన రాజధాని ఉండాలని విడొడొ లక్ష్యం నిర్దేశించారు.
→రాజధాని నిర్మాణ కమిటీకి అబుదాబీ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ పర్యవేక్షకునిగా వ్యవహరిస్తున్నారు.
→బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, జపాన్‌కు చెందిన హోర్డింగ్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోషి సన్ ఈ నిర్మాణ క్రతువులో పాలుపంచుకోనున్నారు.
→కొత్త రాజధాని నిర్మాణ ప్రాజెక్టుకు సుమారు రూ.2,55,750 కోట్లు (34 బిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా.
గ్వామ్ దీవిని కూడా తాకగల మధ్యశ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం
→అమెరికా ఏలుబడిలోని గ్వామ్ దీవిని కూడా తాకగల మధ్యశ్రేణి క్షిపణిని తాము విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.
→ఈ క్షిపణికి అణ్వస్త్రాన్ని మోసుకుపోగల శక్తి ఉంది. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కొరియా జరిపిన ఏడవ క్షిపణి పరీక్ష ఇది.
→తమపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించడమో లేదా అణ్వస్త్ర సహిత దేశంగా గుర్తించడమో చేసేట్లు ఒత్తిడి పెంచడమే ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షల లక్ష్యం.
→తాజా పరీక్ష వల్ల కొత్తగా ఆంక్షలు విధిస్తే ఉత్తర కొరియా ఈసారి ఏకంగా అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల దూరశ్రేణి క్షిపణినీ పరీక్షించవచ్చని విశ్లేషకుల అంచనా.
→అమెరికాకు గ్వామ్ దీవి 11,500 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఉత్తర కొరియా నుంచి 3,430 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శక్తిమంతమైన క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
→అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ఉత్తర కొరియా మరోసారి అస్త్ర పరీక్షకు దిగింది. 2017 తర్వాత అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ఈ దఫా ప్రయోగించింది.
→దీంతో అమెరికా, పొరుగు దేశాల నుంచి ప్రయోజనాలు రాబట్టేందుకు అస్త్ర ప్రయోగాలకు దిగే పాత వ్యూహానికి మళ్లీ తెరతీసినట్లయింది.
→అమెరికాతో సాగిస్తున్న దౌత్యంలో దీర్ఘకాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ చర్యకు ఉత్తర కొరియా పూనుకుంది.
→ పొరుగు దేశాల గగనతలం నుంచి ప్రయాణించే పరిస్థితిని నివారించడానికి తాజా క్షిపణిని బాగా ఎత్తులోకి వెళ్లేలా ఉత్తర కొరియా ప్రయోగించిందని జపాన్, దక్షిణ కొరియా సైనికాధికారులు తెలిపారు.
→ఆ అస్త్రం గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరి, ఆ తర్వాత సముద్రంలో పడిందన్నారు. ప్రయోగించిన ప్రదేశం నుంచి అది 800 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు.
→ఇది మధ్యంతర శ్రేణి క్షిపణి అని వివరించారు. 2017లో చివరిసారిగా ఇలాంటి శక్తిమంతమైన అస్త్రాన్ని ఉత్తర కొరియా పరీక్షించింది.
ఎగిరే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేసిన స్లొవేకియా ప్రభుత్వం
→స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో కీలక ముందడుగు పడింది.
→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేస్తూ స్లొవేకియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
→ 70 గంటల పాటు టెస్టు ఫ్లైట్, 200 సార్లకుపైగా ల్యాండింగ్, టేకాఫ్‌ల తర్వాత ఈ కారుకు సర్టిఫికెట్ జారీ చేశారు.
→ 160 హార్స్ పవర్ బీఎండబ్ల్యూ ఇంజిన్ బిగించిన ఈ ఎగిరే కారు సాధారణ పెట్రోల్‌తోనే నడుస్తుంది. యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఈఏఎస్‌ఏ ప్రమాణాలను ఈ కారు అందుకున్నట్లు తయారీదారులు తెలిపారు.
→ ఈ ఎయిర్ కారు 8,200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్లు ప్రయాణించగలదని వివరించారు. కారు నుంచి విమానంగా రూపాంతరం చెందడానికి ఈ కారుకు 2.15 నిమిషాలు పడుతుంది.
→ ఈ ఎగిరే కారు 500 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 28 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని, కారు ధర రూ.4.5కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు ఉంటుందని దీన్ని తయారు చేసిన క్లెయిన్ విజన్ సంస్థ తెలిపింది.
→ కారుకు ఇరువైపులా అమర్చిన చిన్న చిన్న రెక్కలు ఎగిరే ముందు విచ్చుకుని పక్షిలా మారిపోతుంది. ఇద్దరు ప్రయాణించే వీలున్న ఈ కారు గరిష్ఠంగా 200 కిలోల బరువు మోయగలదని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అంటోన్ జాజాక్ తెలిపారు.
→ విమానంలానే టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి రన్‌వే అవసరం అవుతుందని తయారీదారులు వెల్లడించారు. ఈ ఎగిరే కారుతో త్వరలోనే లండన్ నుంచి పారిస్‌కు ప్రయాణించే అవకాశం ఉందని తయారీదారులు తెలిపారు.
→ క్లెయిన్ విజన్ కంపెనీ 2017 నుంచి ఎగిరే కారును అభివృద్ధి చేస్తుండగా దీనికి స్లోవాక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నుంచి తాజాగా ధ్రువీకరణ లభించింది.
ఈ చేప వయసు 90 ఏళ్లు!
→శాన్ ఫ్రాన్సిస్కోలోని అక్వేరియంలో మెతుసెలా పేరుతో ఉన్న చేప తొమ్మిది దశాబ్దాల నుంచి జీవిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అధిక వయసు ఉన్న అక్వేరియం చేప ఇదేనని సంరక్షకులు చెబుతున్నారు.
→మెతుసెలా పొడవు 4 అడుగులు, బరువు 40 పౌండ్లు. లంగ్ ఫిష్ జాతికి చెందిన దీన్ని 1938లో ఆస్ట్రేలియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు తీసుకొచ్చారు. అప్పటికి దీని వయసు ఆరేళ్లని ఓ అంచనా.
→దీనికి ముందు మరో ఆస్ట్రేలియన్ లంగ్‌ఫిష్ చికాగోలోని షెడ్ అక్వేరియంలో జీవించి ఉండేది. అది 95ఏళ్ల వయసులో 2017లో చనిపోయింది.
→ మెతుసెలాయే ప్రస్తుతం జీవించి ఉన్న అక్వేరియం చేపల్లో వయసు పరంగా అతి పెద్దది. ఇది ఆడ చేప అని సంరక్షకులు భావిస్తున్నారు.
→అయితే ఇలాంటి చేపలకు లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా ఓ అంచనాకు రావడం కష్టం. అందుకే దీని మొప్పలను పరీక్షకు పంపి, లింగం, వయసుపై కచ్చితమైన అంచనాకు రావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
→ఆస్ట్రేలియాలో అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో ఈ లంగ్ ఫిష్ జాతి చేపలు ఉన్నాయి.
→మెతుసెలా చనిపోతే మరోటి తీసుకురావడం కష్టమని అందుకే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామని కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎలన్ మస్క్ ‘న్యూరాలింక్’ ప్రాజెక్టులో ముందడుగు
→మెదడులోని జ్ఞాపకాలను కంప్యూటర్ డేటా తరహాలో డౌన్‌లోడ్ చేసుకొని, భద్రపరచుకుని అవసరమైనప్పుడు వాటిని ‘రీప్లే’ చేసుకోవడం, వాటిని మరో వ్యక్తిలోకి పంపడం లాంటి మహాద్భుతాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారువ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్.
→దీనికి సంబంధించిన అధునాతన ‘బ్రెయిన్ - కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ (బీసీఐ) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు ఆయన సంస్థ చేరుకుంది.
→ నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు.
→అంతిమంగా దీనివల్ల ‘మానవాతీత శక్తి’ లభిస్తుందంటున్నారు. మస్క్ మానవ మెదడులో కంప్యూటర్ చిప్‌ను చొప్పించేందుకు 2017లో ‘న్యూరాలింక్’ అనే అంకుర సంస్థను ఏర్పాటు చేశారు.
→ ఈ సంస్థ ఇప్పుడు ‘క్లినికల్ డైరెక్టర్’ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. దీన్ని బట్టి బీసీఐ పరిజ్ఞానం మానవులపై ప్రయోగించే దశకు చేరువైనట్లు స్పష్టమవుతోంది. 2022 ముగిసే లోపల దాన్ని సాధిస్తామని మస్క్ ప్రకటించారు.
35 పాక్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
→పాక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్‌పై విషం చిమ్ముతున్న 35 యూట్యూబ్ ఛానళ్లతో పాటు పలు ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కేంద్రం నిషేధించింది.
→ఈ ఖాతాలను భారత నిఘావర్గాలు చాలా కాలం నుంచి నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇవి భారత్‌పై విద్వేష ప్రచారం చేయడమే కాకుండా, నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి.
→ నిఘావర్గాల ఆదేశంతోనే వీటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర తెలిపారు.
→ గత డిసెంబర్‌లోనూ పాక్ కేంద్రంగా పనిచేస్తున్న 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లపై భారత్ ఆంక్షలు విధించింది.
యెమన్ జైలుపై సౌదీ వైమానిక దాడి
→యెమన్‌లో హౌతీ తిరుగుబాటు దళాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ జైలును లక్ష్యంగా చేసుకొని సౌదీ అరేబియా వైమానిక దాడికి దిగింది.
→ఈ దాడిలో దాదాపు 100 మంది ఖైదీలు మృతిచెందినట్లు యెమన్‌లోని రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బషీర్ ఒమర్ తెలిపారు. మరో 200 మంది గాయపడినట్లు వైద్యులు చెబుతున్నారు.
→మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 2014 నుంచి హౌతీ దళాల ఆక్రమణలో ఉన్న యెమన్ రాజధాని సనాపైన కూడా వైమానిక దాడి జరిగింది.
→యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుధాబిపై హౌతి దళాలు ఇటీవల డ్రోన్, క్షిపణి దాడికి పాల్పడ్డాయి.
భారత్ సహాయంతో మారిషస్‌లో నిర్మించిన ప్రాజెక్టుల ప్రారంభం
→భారత్ సహకారంతో మారిషస్‌లో నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టు, 8 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, సివిల్ సర్వీసెస్ కళాశాలను ఆ దేశ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
→రెండు దేశాల మధ్య సముద్రాల భద్రత సహా వివిధ రంగాల్లో సహకారం ‘సాగర్’(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) విజన్‌ను అమలులోకి తీసుకొచ్చిందని మోదీ గుర్తు చేశారు.
→ఈ సందర్భంగా మారిషస్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణానికి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద 19 కోట్ల డాలర్లు అందించేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
→భారత్ సహకారానికి కృతజ్ఞతగా ప్రధానమైన మెట్రో స్టేషన్లలో ఒకదానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ తెలిపారు.
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ అరెస్టు
→తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశాలో సంపన్నులు, యువకులకు కొకైన్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
→ముంబయి కేంద్రంగా నాలుగేళ్లుగా డ్రగ్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
→ నైజీరియాకు చెందిన టోనీ అబియా మార్షా (37) తొమ్మిదేళ్ల క్రితం వ్యాపార వీసాతో ముంబయికి వచ్చాడు. మొదట్లో లోదుస్తులు కొని నైజీరియాకు ఎగుమతి చేసేవాడు.
→అనంతరం మీరా భాండియార్, వాసైవిరార్ ప్రాంతాల్లోని నైజీరియన్ల వద్దకు వెళ్లాడు. వారిలో కొంతమంది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండటంతో తానూ అదేబాట పట్టాడు.
→2017 నుంచి సొంతంగా డ్రగ్స్ తెప్పించుకోవడం, నలుగురు ఏజెంట్లను నియమించుకోవడం, వారి ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్ ప్రాంతాలకు కొకైన్ సరఫరా చేయడం మొదలు పెట్టాడు.
→దక్షిణాఫ్రికాలో ఉంటున్న స్టార్‌బాయ్ అనే వ్యక్తి నుంచి నౌకల ద్వారా డ్రగ్స్ టోనీకి చేరుతున్నాయి. గ్రాము కొకైన్ రూ.3 వేలకు తెప్పించి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముతున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా రష్యా నౌకాదళ విన్యాసాలు
→ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీగా నౌకాదళ విన్యాసాలు నిర్వహించనున్నట్లు రష్యా ప్రకటించింది. ‘‘140 యుద్ధనౌకలు, 60 విమానాలతో జనవరిలో యుద్ధక్రీడలు మొదలుపెడతాం. ఫిబ్రవరి మొత్తం అవి కొనసాగుతాయి.
→మధ్యధరా సముద్రం, ఈశాన్య అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో అవి జరుగుతాయి’’ అని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా స్పష్టం చేసింది.
→ ప్రపంచ సాగరాల్లో తమ ప్రయోజనాలను పరిరక్షించుకునే చర్యలకు సన్నాహకంగా వీటిని చేపడుతున్నట్లు వివరించింది. మరోవైపు బెలారస్‌తో సంయుక్త యుద్ధ విన్యాసాలను రష్యా నిర్వహిస్తోంది.
555 క్యారెట్ల అరుదైన నల్ల వజ్రం
→ప్రపంచంలోనే అరుదైన నల్ల వజ్రం వేలానికి సిద్ధమైందని దుబాయ్‌లోని వజ్రాల వేలం సంస్థ సోథ్‌బే తెలిపింది. ఈ బ్లాక్ డైమండ్ 555 క్యారెట్ల బరువు ఉన్నట్లు, దీని ధర రూ.50 కోట్లు ఉంటుందని పేర్కొంది.
→ఈ బ్లాక్ డైమండ్ పేరు ‘ది ఎనిగ్మా’. కాలక్రమేణా విశ్వంలోని సుదూరం ప్రాంతం నుంచి భూమిపైకి వచ్చినట్లు సోథ్‌బే సంస్థలో పని చేసే జ్యువెలరీ నిపుణురాలు సోఫీ స్టీవెన్స్ పేర్కొన్నారు.
→ఈ వజ్రం 55 ముఖాలు కలిగి ఉందని వివరించారు. కేవలం బ్రెజిల్, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లోనే ఇవి లభిస్తుంటాయి.
నవకల్పన పోటీలో విజేతగా రవుర్కెలా
→ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ నవకల్పన పోటీలో విజేతలుగా నిలిచిన 15 నగరాల్లో ఒడిశాలోని రవుర్కెలా కూడా ఉంది.
→ కొవిడ్-19 మహమ్మారి సమయంలో అత్యంత సాహసోపేత, ప్రతిష్ఠాత్మకమైన పట్టణ నవకల్పన ప్రణాళికలను రూపొందించినందుకు వాటికి ఈ ఘనత దక్కింది.
→ ‘గ్లోబల్ మేయర్స్ ఛాలెంజ్’ అనే ఈ పోటీ విజేతలను బ్లూమ్‌బర్గ్ ఫిలాంత్రొపీస్ సంస్థ ప్రకటించింది. ఏడాది పాటు సాగిన ఈ పోటీని 2021లో ప్రారంభించారు. ఇందులో 99 దేశాలకు చెందిన 631 నగరాలు పాల్గొన్నాయి.
→ మహిళా సహకార సంఘాలకు కోల్డ్ స్టోరేజీ యూనిట్లను అందజేసేందుకు ఉద్దేశించిన ప్రణాళిక ద్వారా రవుర్కెలా విజేతగా నిలిచింది.
→ ఆహార విక్రేతలుగా ఉన్న మహిళలకు సాధికారత కల్పించడానికి ఈ యూనిట్లు సాయపడతాయని ఆ ప్రణాళిక పేర్కొంది.
→ దీనివల్ల ఆహార వృథా తగ్గి, తాజా ఆహార లభ్యత పెరుగుతుందని తెలిపింది. విజేతలుగా నిలిచిన 15 నగరాలు ఇప్పుడు అమలు దశలోకి చేరుకుంటాయి. వీటికి 10 లక్షల డాలర్ల చొప్పున సాయం లభిస్తుంది.
→ కొన్నేళ్ల పాటు సాంకేతిక తోడ్పాటు కూడా అందుతుంది. వీటిని సద్వినియోగం చేసుకొని, తమ నూతన ఆలోచనను అమల్లోకి తెచ్చి, పౌరుల జీవితాలను మెరుగుపరచాలని బ్లూమ్‌బర్గ్ ఫిలాంత్రొపీస్ సంస్థ వ్యవస్థాపకుడు, న్యూయార్క్ మాజీ మేయర్ మైఖేల్ ఆర్ బ్లూమ్‌బర్గ్ తెలిపారు. ఈ 15 నగరాల్లో కలిపి 3 కోట్ల మంది నివసిస్తున్నారు.
సూపర్ ఫుడ్‌గా మైక్రోగ్రీన్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు
→రోజురోజుకు ఆహారం కలుషితం అవుతున్న వేళ ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి పచ్చని, తాజా కూరగాయలు, ఆకుకూరలు తినడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో పండించిన, పురుగు మందులు వాడని పంటలకు ప్రాముఖ్యత పెరుగుతోంది.
→ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మైక్రోగ్రీన్స్ వాడకం వెలుగులోకి వచ్చింది. మైక్రోగ్రీన్స్ అనేవి 10 - 15 రోజుల వయసు కలిగిన వివిధ రకాలైన ఆకుకూరలు. వీటిని బేబీ ప్లాంట్లుగా పరిగణిస్తారు.
→ఇవి పోషకాహారాన్ని మెరుగుపరచడానికే కాకుండా తినే పదార్థాల ఆకృతిని మెరుగుపరచడంలోనూ, రుచిని పెంచడంలోనూ సహాయపడతాయి. అత్యధిక పోషకాల లభ్యత వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని సూపర్ ఫుడ్‌గా ప్రకటించింది.
చైనాలో వరుసగా ఐదో ఏడాదీ తగ్గిన జననాల వృద్ధి
→ఏ దేశాన్నైనా జనాభా విస్ఫోటం భయపెడుతుంది. చైనాను మాత్రం గత కొన్నాళ్లుగా జనాభా తగ్గుదల కలవరపెడుతోంది.
→ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం (ఎన్‌బీఎస్) విడుదల చేసిన తాజా డేటా.. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న డ్రాగన్ ఆశలకు గండికొట్టేలా ఉంది.
→గత ఏడాది కాలంలో ఆ దేశ జనాభాలో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. 2020లో చైనా జనాభా 141 కోట్ల 20 లక్షలు. తాజా 2021 గణాంకాల ప్రకారం 141 కోట్ల 26 లక్షలు.
→అంటే జాతీయ వృద్ధి రేటు 1000 మందికి 0.34 మాత్రమే. గత ఏడాది చైనాలో కోటి 62 లక్షల కొత్త శిశువులు మాత్రమే జన్మించారు. ఇంత తక్కువ సంఖ్య నమోదు కావడం 1950 తర్వాత ఇదే తొలిసారి.
→శిశు జననాల రేటు ప్రతి 1000 మందికి 7.52 మాత్రమే. 1978 తర్వాత ఇదే కనిష్ఠస్థాయి. గత ఐదేళ్లుగా శిశు జననాల రేటులో తగ్గుదలే కనిపిస్తోంది. మరోవైపు దేశంలో వృద్ధుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది.
→60 ఏళ్లు దాటిన వారు 26.4 కోట్లకు చేరుకున్నారు. 2020తో పోలిస్తే 18.7% అధికం. దీని వల్ల పింఛన్లు...ఇతర ప్రయోజనాల భారం ఆర్థికవ్యవస్థపై తీవ్రంగా పడనుంది. జనాభా పెరుగుదల కోసం 2016లో ఏక సంతాన నిబంధనకు చైనా వీడ్కోలు పలికింది.
→ 2020లో ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుందని అప్పటివరకు జన సంఖ్యలో పెద్దగా ఎదుగుదల ఉండదని చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ ఉపాధ్యక్షుడు నింగ్ జిజె తెలిపారు.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
→క్షిపణి ప్రయోగాల్లో ఉత్తర కొరియా నెల రోజుల వ్యవధిలోనే మూడో పరీక్ష నిర్వహించింది. ఈసారి రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
→అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అమెరికా ఇటీవలే కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. తాము ఎవరికీ బెదరబోమనే సంకేతాన్ని ఇచ్చేందుకే ఉత్తర కొరియా ఈ పరీక్ష చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు.
→ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాన్ని దక్షిణ కొరియా కూడా ధ్రువీకరించింది. ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందిస్తున్న ఐదు సంస్థలపై అమెరికా జనవరి 12న ఆంక్షలు విధించింది.
→ఆ దేశంపై కొత్త ఆంక్షలు అమలు చేయాలని ఐక్యరాజ్య సమితిని కూడా కోరతామని చెప్పింది.
పేద దేశాలకు 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ: డబ్ల్యూహెచ్‌ఓ
→కరోనాకి అడ్డుకట్టవేసే చర్యల్లో భాగంగా ఐక్యరాజ్య సమితి సహకారంతో ప్రపంచంలోని చిన్న దేశాలకు 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది.
→ఇప్పటి వరకు దాదాపు 144 దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీ పూర్తయ్యిందని తెలిపింది. అయితే.. నేటికీ చాలా దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలు కొనసాగుతున్నాయని.. డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
→సభ్య దేశాల్లో 194కు గానూ 36 దేశాల్లో తమ జనాభాలో 10 శాతం మాత్రమే టీకాలు అందించాయని చెప్పింది.
→ ఈ అసమానతలు తొలగిపోవాలంటే.. తయారీదారులు అధికంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడంతో పాటు అన్ని దేశాలకు టీకా పంపిణీలో ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
అఫ్గాన్‌లో 87 లక్షల మంది ప్రాణాలకు ముప్పు: డబ్ల్యూఎఫ్‌పీ
→అఫ్గాన్‌లో ఆకలి సునామీ రాబోతోందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ఆందోళన వ్యక్తం చేసింది.
→ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి తక్షణమే మానవతా సాయం అందించాలని అఫ్గాన్‌లోని డబ్ల్యూఎఫ్‌పీ ప్రతినిధి మేరీ ఎల్లెన్ మెక్‌గ్రోర్టీ విజ్ఞప్తి చేశారు.
→దేశంలో ప్రస్తుతం 2.28 కోట్ల మందికి తీవ్రమైన ఆహార కొరత ఉందని, ఇందులో 87 లక్షల మంది ఆకలిచావులకు చేరువయ్యారని ఆమె తెలిపారు. అఫ్గాన్ల ఆకలి తీర్చేందుకు తమకు నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు.
→వచ్చే 12 నెలల పాటు పూర్తిస్థాయిలో మానవతా సాయం కొనసాగించేందుకు కనీసం 4.4 బిలియన్ డాలర్లు కావాలన్నారు. ఆహార పంపిణీ కనీస స్థాయిలో చేపట్టాలన్నా 2.6 బిలియన్ డాలర్లు అవసరమని చెప్పారు.
దేవాస్ కేసులో.. భారత్‌పై ఫ్రాన్స్ కోర్టు జరిమానా
→పారిస్‌లో భారత ప్రభుత్వానికి చెందిన ఓ భవనానికి సంబంధించి ఇకపై ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఫ్రాన్స్ కోర్టు ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది.
→తమతో ఉపగ్రహ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకుగాను దాదాపు రూ.9,604 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరుతూ దేవాస్ సంస్థ వాటాదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
→ఆ భవనం విలువ సుమారు రూ.32 కోట్లు. గతంలో దాన్ని ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నివాసంగా ఉపయోగించారు.
→ భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులు చాలా ఉన్నాయని.. వాటన్నింటినీ స్తంభింపజేసే దిశగా తాము ప్రణాళికలు రచిస్తున్నామని దేవాస్ తరఫు సీనియర్ న్యాయవాది జే న్యూమాన్ తెలిపారు. మొబైల్ వినియోగదారులకు మల్టీమీడియా సేవలు అందించడంపై ఇస్రో వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్‌తో దేవాస్ 2005లో ఒప్పందం కుదుర్చుకుంది. 2011లో ఆ ఒప్పందం రద్దయింది.
అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్ దాడి
→ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ముష్కరులు మూడు రాకెట్లు ప్రయోగించారు.
→కార్యాలయ ప్రాంగణంలో రెండు రాకెట్లు పడ్డాయని, మూడోది.. సమీపంలోని నివాస ప్రాంగణంలో ఉన్న ఒక పాఠశాలను తాకిందని ఇరాక్ భద్రతాధికారులు తెలిపారు.
అమెరికా పౌరులు కాని వారూ ఓటు వేయొచ్చు
→అమెరికాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో ఓ చరిత్రాత్మక చట్టం రూపొందింది. దీని ప్రకారం.. అమెరికా పౌరులు కాని వారు కూడా న్యూయార్క్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయొచ్చు.
→నగర మేయర్, సిటీ కౌన్సిల్‌ను ఎన్నుకోవచ్చు. పౌరసత్వం లేకపోయినా చట్టబద్ధంగా నివసిస్తూ ఉంటే చాలు.
→ దాదాపు 8 లక్షల మంది పౌరసత్వం లేని పౌరులకు ఈ చట్టంతో లబ్ధి చేకూరనుంది. నెల రోజుల క్రితం ఇందుకు సంబంధించిన బిల్లును న్యూయార్క్ సిటీ కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. అదిప్పుడు చట్టంగా మారింది.
→అయితే ఈ ఓటు హక్కు స్థానిక మున్సిపల్ ఎన్నికలకు మాత్రమే పరిమితం. అధ్యక్ష, రాష్ట్ర ఎన్నికలకు వర్తించదు.
→ఈ కొత్త చట్టంతో న్యూయార్క్ నగరంలో చట్టబద్ధంగా కనీసం 30 రోజులు నివసించే పౌరసత్వం లేని ఏ పౌరుడికైనా ఓటు హక్కు లభిస్తుంది.
విపత్కర ప్రాంతంగా పాక్ హిల్‌స్టేషన్ ముర్రే
→పాకిస్థాన్‌లోని ప్రముఖ హిల్‌స్టేషను ముర్రేలో భారీగా మంచు కురిసి 22 మంది మృతిచెందారు. దీంతో ముర్రేని విపత్కర ప్రాంతంగా పేర్కొంటూ అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.
→ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రావిన్సులోని మనోహర పర్యటక ప్రాంతం ముర్రే. ఇస్లామాబాద్‌కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయాయి.
76 ఏళ్ల తర్వాత ఉత్తరం బట్వాడా!
→76 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జాన్ గోన్‌సాల్వ్స్ ఓ సైనికుడు తన యోగక్షేమాలు తెలియజేస్తూ తల్లికి రాసిన ఉత్తరం.. ఇన్నేళ్ల తర్వాత బట్వాడా అయ్యింది.
→కానీ దాన్ని పంపిన తనయుడు, అందుకోవాల్సిన తల్లి ఇద్దరూ ఇప్పుడు లేరు. అయితే అతడి భార్యకు ఆ ఉత్తరం అందింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం వోబర్న్‌లో చోటు చేసుకుంది.
గూగుల్, ఫేస్‌బుక్‌పై భారీ జరిమానా
→ఫ్రాన్స్ నియంత్రణ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలకు కలిపి 238 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1785 కోట్ల) అపరాధ రుసుమును విధించాయి.
→ వినియోగదారులు సులువుగా ఆన్‌లైన్ ట్రాకింగ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఈ సంస్థలు వీలు కల్పించలేదన్నది ప్రధాన ఆరోపణ. కుకీలకు ఆమోదం తెలపడానికి ఫ్రాన్స్ వినియోగదార్లకు కేవలం ఒకే బటన్ ఇచ్చిన ఈ అమెరికా దిగ్గజ సంస్థలు, అన్ని కుకీలను తిరస్కరించడానికి మాత్రం పలు క్లిక్‌లు చేయాల్సి వస్తున్నట్లు డేటా గోప్యత నియంత్రణ సంస్థ సీఎన్‌ఐఎల్ తన దర్యాప్తులో గుర్తించింది.
→ ఇంటర్నెట్ వినియోగరులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ వ్యాపార ప్రకటనలు, ఇతర అవసరాల కోసం కుకీలను సంస్థలు వినియోగిస్తాయి.
→వినియోగదారుల కార్యకలాపాలను ట్రాకింగ్ చేయడానికి ముందుగా అనుమతి కోరే విషయంలో వెబ్‌సైట్లకు అమెరికాతో పోలిస్తే ఐరోపా ప్రభుత్వాలు కఠిన నిబంధనలను అమలు చేస్తుంటాయి.
→ఈ నేపథ్యంలోనే గూగుల్‌పై 150 మిలియన్ యూరోలు (170 మిలియన్ డాలర్లు); ఫేస్‌బుక్‌పై 60 మిలియన్ యూరోలు(68 మిలియన్ డాలర్లు) చొప్పున అపరాధ రుసుమును ఫ్రాన్స్ విధించింది.
చైనాలో జననాల రేటు క్షీణత
→ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా గుర్తింపు ఉన్న చైనా ఇప్పుడు జననాల వృద్ధి రేటు బాగా క్షీణించడంతో సందిగ్ధంలో పడింది.
→ ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కనేందుకు సైతం అనుమతిస్తూ కొత్త విధానం తీసుకువచ్చినా ఫలితాలు ఆశించినంతగా లేవు. దేశంలోని పది ప్రావిన్సు స్థాయి ప్రాంతాల్లో 2020 గణాంకాల ప్రకారం జననాల రేటు ఒక శాతానికి లోపునకు పడిపోయింది.
→ దేశంలో జననాల వృద్ధి రేటు గణనీయంగా తగ్గి, జనాభాపరంగా ఏర్పడిన సంక్షోభానికి విధానాల రూపకర్తలే కారకులని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో ముగ్గురు పిల్లల విధానానికి చైనా పచ్చజెండా ఊపింది.
→ దశాబ్దాల తరబడి ఏక సంతాన నిబంధన కొనసాగిన చైనా విధానాల్లో ఇది భారీ మార్పునకు సంకేతం. ఇద్దరు పిల్లలు కనేందుకు అనుమతిస్తూ 2016లో చైనా చట్టం తీసుకువచ్చింది.
→ పదేళ్లకోమారు జరిగే జనాభా గణనలో వృద్ధి రేటు పరంగా ప్రమాద సంకేతాలు కనిపించడంతో ఇప్పుడు ఆ నిర్ణయం కూడా మార్చుకొని, ప్రతి జంటా ముగ్గుర్ని కనాలని అంటోంది చైనా.
→ డ్రాగన్ దేశ జనాభా ప్రస్తుతం 141.2 కోట్లు ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. జనాభాలో 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు 26.40 కోట్లు (18.7%) ఉన్నారు.
చైనా దేశ సాయుధ దళాల శిక్షణకు కొత్త ఆదేశాలు
→పదేళ్లుగా అధికారిక చైనా కమ్యూనిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్న షీ జిన్‌పింగ్ (68) దేశ సాయుధ దళాల శిక్షణకు కొత్త ఆదేశాలు జారీ చేశారు.
→యుద్ధ పోరాటంలో అజేయ శక్తిసామర్థ్యాలు పెంపొందించుకొని, ఉత్తమసేనగా నిలవటమే ఈ శిక్షణ లక్ష్యం.
→దేశాధ్యక్షుడిగా ఉంటూ సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్‌గా 20 లక్షల సేనలపై తిరుగులేని పట్టు సాధించిన షీ జిన్‌పింగ్ దేశ సైన్యం సాంకేతికంగా, సామర్థ్యాలపరంగా ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండేలా పలు సంస్కరణలు తీసుకువచ్చారు.
→గతంలో చైనాకు సారథ్యం వహించిన అధ్యక్షులకు భిన్నంగా సుదీర్ఘకాలం దేశ పాలనాపగ్గాలు తన చేతిలో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్న షీ ఈ ఏడాదితో రెండు పర్యాయాల పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారు.
→మూడోసారి మరో అయిదేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగే వ్యూహం కూడా సిద్ధమైంది. 2018 నుంచి ఏటా కొత్త కొత్త కార్యక్రమాలతో సైన్యంపై ప్రత్యేకదృష్టి పెట్టి, ఇపుడు ఏకంగా 200 బిలియన్ డాలర్ల (రూ.14.9 లక్షల కోట్లు) వార్షిక రక్షణ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు.
→సాంకేతిక మార్పులు, యుద్ధరీతులు, శత్రుసేనల గురించి అధ్యయనం చేయడం ద్వారా మరిన్ని రెట్లు మెరుగైన సామర్థ్యం చూపేలా సుశిక్షితులు కావాలంటూ షీ తాజా ఆదేశాల్లో సేనలకు సూచనలు చేసినట్లు అధికారిక పత్రిక షిన్‌హువా వెల్లడించింది.
→ఆర్మీ అధికారులు, సేనలు ఎవరూ ఇటు మృత్యువుకు అటు కఠోరశ్రమకు వెరవకుండా ఈ శిక్షణ ఉండాలని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వంతో పాటు సీఎంసీ ప్రణాళికలు ఆచరణలో పెడుతూ జాతీయ భద్రత, మారుతున్న పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని తన ఆదేశాల్లో షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు.
పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన
→భారత్‌తో సరిహద్దుల్లో తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై ఓ కీలక వంతెనను చైనా ప్రస్తుతం నిర్మిస్తోంది. తాజాగా బయటికొచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
→ అత్యవసర సమయాల్లో సైనిక బలగాలు, ఆయుధ సామగ్రిని సరిహద్దులకు వేగంగా తరలించేందుకు వంతెన దోహదపడనుంది. దాని నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది.
→ త్వరితగతిన పూర్తిచేసేందుకుగాను దాని నిర్మాణంలో ఫాబ్రికేటెడ్ పద్ధతిని అనుసరిస్తున్నారు.
→ 2020 జూన్ నాటి గల్వాన్ ఘర్షణల తర్వాత భారత సైన్యం పాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కీలక కైలాశ్ రేంజ్ పర్వత శిఖరాలను ఆక్రమించింది.
→అక్కడికి భారీగా బలగాలను తరలించింది. తద్వారా ఆ ప్రాంతంలో చైనా బలగాలపై పైచేయి సాధించింది. అప్పటి నుంచి అక్కడ పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
→ఆ ప్రణాళికల్లో భాగంగానే తాజాగా వంతెన నిర్మాణాన్ని తలపెట్టింది. డ్రాగన్ భూభాగంలోనే కుర్నాక్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుసై దాన్ని నిర్మిస్తున్నారు.
→ ఈ వంతెన అందుబాటులోకి వస్తే భారత సరిహద్దుల్లోని రుడోక్ వరకూ బలగాల తరలింపు సులువవుతుంది.
→ సమీపంలోని సైనిక శిబిరాల నుంచి డ్రాగన్ బలగాలను తరలించడానికి ఇప్పుడు 180 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది.
→ కొత్త వంతెన నిర్మాణంతో ఆ దూరం 50 కిలోమీటర్లకే పరిమితమవుతుంది. సరిహద్దుల్లో అత్యాధునిక గ్రామాలు నిర్మిస్తోంది.
→ భారత సరిహద్దుకు చేరువలో ఇటీవల అనేక ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్‌ల నిర్మాణం చేపట్టింది. వీటిలో క్షిపణి ప్రయోగ వేదికలు, హెలిపాడ్లు కూడా ఉంటాయి.
→ కొత్త ఏడాది తొలి రోజునే గల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తద్వారా ఆ లోయ తమదేనని వారు ప్రకటించినట్లయింది.
అణు జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్
→భారత్, పాకిస్థాన్‌లు తమ అణు కేంద్రాల జాబితాలను ఇచ్చి పుచ్చుకున్నాయి. రెండు దేశాల మధ్య 31 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
→దిల్లీ, ఇస్లామాబాద్‌లో దౌత్య మార్గాల ద్వారా ఏకకాలంలో ఈ లాంఛనం పూర్తయింది. అణు కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకోరాదన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్, పాక్‌లు 1988లో కుదుర్చుకున్నాయి.
→అది 1991లో అమల్లోకి వచ్చింది. దీనికింద ఏటా జనవరి 1న రెండు దేశాలూ తమ అణు స్థావరాల జాబితాను ఇచ్చి పుచ్చుకుంటున్నాయి.
→మరోవైపు చైనా సాయంతో నిర్మించిన కరాచీ అణు విద్యుత్ కర్మాగారంలోని మూడో యూనిట్‌లో ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని పాక్ పూర్తి చేసింది.
→మార్చి నెలాఖరులోగా ఇది ఉత్పత్తి ప్రారంభించనుంది. అణు రంగంలో మూడు దశాబ్దాలుగా పాక్, చైనాల మధ్య మైత్రి ఉన్న సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
→పాక్ నిర్బంధంలో ఉన్న 356 మంది భారత మత్స్యకారులు, ఇద్దరు పౌరులను విడుదల చేయాలని భారత్ కోరింది. వారి జాతీయతను ఇప్పటికే నిర్ధారించామని పాకిస్థాన్‌కు తెలిపింది.
→వీరికితోడు పాక్ కస్టడీలో ఉన్నట్లు భావిస్తున్న 182 మంది భారత మత్స్యకారులు, 17 మంది పౌర ఖైదీలకు దౌత్య సిబ్బందితో భేటీ అయ్యే అవకాశం కల్పించాలని కోరింది.
→ఆనవాయితీ ప్రకారం రెండు దేశాలూ తమ జైళ్లలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్నాయి.
→తమ వద్ద పాక్‌కు చెందిన 282 మంది పౌర ఖైదీలు, 73 మంది మత్స్యకారులు ఉన్నట్లు మన దేశం తెలిపింది.