సర్వేలు

ప్రభావవంతమైన ముస్లింలలో ఉమర్‌ ఫరూక్‌

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 500 మంది ముస్లింల జాబితాలో హురియత్‌ కాన్ఫరెన్సు ఛైర్మన్‌ మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌కు చోటు లభించింది. ఈ జాబితాలో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ ఉన్నారు. జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ సహకారంతో జోర్డాన్‌కు చెందిన రాయల్‌ ఇస్లామిక్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ సెంటర్‌ ఈ జాబితా ప్రకటించిందని హురియత్‌ కాన్ఫరెన్సు తెలిపింది.

ప్రపంచంలో అతిపెద్ద సంస్థ భారత రక్షణ శాఖే!

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యవస్థగా భారత రక్షణ శాఖ నిలిచింది. ఇక్కడ క్రియాశీలంగా పనిచేసే సైనికులు, రిజర్వు బలగాలు, సైనికేతరులు కలిపి 29.20 లక్షల మంది పనిచేస్తున్నారని జర్మనీకి చెందిన స్టాటిస్టా వెల్లడించింది. 29.10 లక్షల మందితో రెండో స్థానంలో అమెరికా రక్షణ శాఖ నిలిచినట్లు తెలిపింది. సైనికేతర పౌర సిబ్బందిని సైన్యంలో భాగంగా చూపకపోవడం వల్ల చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో ఉద్యోగుల సంఖ్య 25 లక్షలుగా ఉందని పేర్కొంది. ఆ దేశ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ కింద 68 లక్షల మంది పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ విశ్వసనీయ వివరాలు లేవని తెలిపింది. కంపెనీలపరంగా చూసినప్పుడు వాల్‌మార్ట్‌ మొదటి స్థానంలో ఉందని, ఆ సంస్థ పరిధిలో 23 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని వివరించింది. అమెజాన్‌లో పనిచేసేవారి సంఖ్య 16 లక్షలుగా ఉందని తెలిపింది. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రీ) ప్రకారం.. 2021లో అత్యధిక సైనిక వ్యయం చేసిన తొలి 5 దేశాల్లో అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, రష్యా ఉన్నాయి. ప్రపంచ మిలటరీ బడ్జెట్‌లో వీటి వాటా 62 శాతం.

భారత్‌లో 18% పెరిగిన క్షయ కేసులు

భారత్‌లో క్షయ బాధితులు పెరుగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. 2020తో పోలిస్తే 2021లో 21.4 లక్షల కేసులు కొత్తగా నమోదయ్యాయని తెలిపింది. ఇది 18 శాతం పెరుగుదలని వివరించింది. వ్యాధి నిర్ధారణ కోసం దేశంలో 22 కోట్ల మందిని స్క్రీన్‌ చేసినట్లు తెలిపింది. ‘గ్లోబల్‌ టీబీ రిపోర్ట్‌’ పేరిట ఓ నివేదికను డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్షయ నిర్ధారణ, చికిత్సపై కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం పడిందని పేర్కొంది. ఈ నివేదికపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందిస్తూ.. మిగతా దేశాలతో పోలిస్తే ఈ వ్యాధి కట్టడిలో భారత్‌ మెరుగ్గా వ్యవహరించిందని పేర్కొంది. 2021లో దేశంలో ప్రతి లక్ష మందిలో 210 మందికి టీబీ సోకిందని తెలిపింది. 2015లో అది 256గా ఉందని పేర్కొంది. నాటితో పోలిస్తే కేసులు 18 శాతం తగ్గాయని వివరించింది. ప్రపంచ సరాసరితో పోలిస్తే ఇది 7 పర్సంటేజ్‌ పాయింట్ల మేర మెరుగని పేర్కొంది. బాధితులు 1.06 కోట్ల మంది 2021లో ప్రపంచవ్యాప్తంగా 1.06 కోట్ల మందిలో క్షయను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 4.5 శాతం అధికమని తెలిపింది. 2021లో 16 లక్షల మంది ఈ వ్యాధితో మరణించారని పేర్కొంది.

దిల్లీ విమానాశ్రయానికి పదో ర్యాంకు

ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 10వ స్థానాన్ని దిల్లీలోని ద ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్కించుకుంది. కరోనాకు ముందు అంటే 2019 అక్టోబరులో 14వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 4 స్థానాలు మెరుగుపరచుకుందని విమానయాన విశ్లేషక సంస్థ ఓఏజీ తన నివేదికలో పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల షెడ్యూల్‌ సామర్థ్యం ఆధారంగా 2022 అక్టోబరుకు రూపొందించారు. ఈ టాప్‌-10 జాబితా ప్రకారం.. ‣ హార్ట్స్‌ఫీల్డ్‌-జాక్సన్‌ అట్లాంటా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అగ్రస్థానంలో నిలిచింది. ‣ దుబాయ్, టోక్యో హానెడా విమానాశ్రయాలు రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. ‣ డల్లాస్‌/ఫోర్ట్‌ (12వ స్థానం నుంచి 4కు); డెన్వర్‌ (20 నుంచి 5కు), ఇస్తాంబుల్‌(13 నుంచి 8కి), దిల్లీ (14 నుంచి 10కి) విమానాశ్రయాలు ర్యాంకులు మెరుగుపరచుకుని అగ్రగామి-10 జాబితాలోకి చేరాయి. ‣ ఆరో స్థానంలో లండన్‌ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ నిలవగా, చికాగో ఓహేర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 7వ స్థానంలో; లాస్‌ ఏంజెలెస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 9వ స్థానంలో నిలిచాయి ‣ దిల్లీ విమానాశ్రయం (ఐజీఏఐ) నుంచి నడిచిన విమానాల్లో మొత్తం 34,13,855 సీట్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ‣ ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దుబాయ్, లండన్, ఆమ్‌స్టర్‌డామ్‌ విమానాశ్రయాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మన విమానాశ్రయం ఏదీ ఈ జాబితాలోని టాప్‌-10లో నిలవలేదు. ‣ 2021 అక్టోబరు నుంచి 2022 సెప్టెంబరు మధ్య ముంబయి నుంచి దుబాయ్‌; దిల్లీ నుంచి దుబాయ్‌ మార్గాలు టాప్‌-10 అంతర్జాతీయ రద్దీ మార్గాల్లో నిలిచాయి.

శిలాజ ఇంధనాల అతి వినియోగంతో ముప్పు

నానాటికీ తీవ్రమవుతున్న భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా పెను విపత్తు ముంచుకొస్తోంది. కాలుష్యం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు అకాల వరదలతో పాటు కరవు కాటకాలు తాండవిస్తున్నాయి. దీనికి తోడు శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడటంతో పరిస్థితులు దుర్భరంగా మారుతున్నట్లు ప్రతిష్ఠాత్మక లాన్సెట్‌ సంస్థ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ‘ది లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ ఆన్‌ హెల్త్‌ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌: హెల్త్‌ అట్‌ ది మెర్సీ ఆఫ్‌ ఫాజిల్‌ ఫ్యూయెల్స్‌’ పేరుతో వెలువరించిన ఈ నివేదికలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలివీ.. ‣ శిలాజ ఇంధనాల వినియోగంతో ఏర్పడిన కాలుష్యం కారణంగా భారత్‌లో 2020లో సుమారు 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2000 - 2004 నుంచి 2017 - 2021 మధ్య మన దేశంలో భూతాప సంబంధ మరణాలు 55 శాతం పెరిగాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అవి 68 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. ‣ పలు దేశాల్లో ముంచెత్తిన వరదలు వేల మందిని బలిగొన్నాయి. పలు చోట్ల కార్చిచ్చులు విధ్వంసం సృష్టించాయి. చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ వైపరీత్యాల వల్ల 2021లో ప్రపంచ దేశాలకు 25,300 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించింది. ‣ చమురు, గ్యాస్‌ లాంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడటం వల్ల వాతావరణ మార్పుల దుష్ప్రభావం పెరిగి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మానవాభివృద్ధి సూచీలో దిగువన ఉన్న దేశాల్లో 2020లో వినియోగించిన విద్యుత్తులో 1.4 శాతం మాత్రమే పునరుత్పాదక వనరుల నుంచి వచ్చినది. ‣ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థలు పర్యావరణానికి హాని కలిగించే విధానాలను అవలంబిస్తూ అనూహ్య లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచంలోని అతిపెద్ద చమురు, గ్యాస్‌ సంస్థలు విడుదల చేసే ఉద్గారాలు 2030కల్లా 37 శాతం, 2040కల్లా 103 శాతం పెరుగుతాయి.

193 దేశాల వాతావరణ కార్యాచరణపై ఐరాస తాజా నివేదిక వెల్లడి

భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాల కట్టడికి సంబంధించి ప్రపంచ దేశాలు ఇస్తున్న హామీలకు, ఆచరణకు మధ్య ఏ మాత్రం పొంతన కుదరడంలేదని ఐక్యరాజ్యసమితి (ఐరాస) వాతావరణ కార్యాలయం పేర్కొంది. 2015 పారిస్‌ ఒప్పంద ప్రమాణాలను, తాజా పరిస్థితులతో పోల్చి ఆందోళనను వ్యక్తం చేసింది. 193 దేశాల కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలను పరిశీలిస్తే పారిశ్రామికయుగం ప్రారంభ స్థాయి కన్నా ఈ శతాబ్దం చివరికి భూ ఉష్ణోగ్రత 2.5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. పారిస్‌ ఒప్పంద లక్ష్యమైన 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల పరిమితి కన్నా ఇది ఎంతో అధికమని తాజా నివేదికలో పేర్కొంది. ఇదే తీరుగా దేశాల ఆచరణ ఉంటే 2030 చివరికి కర్బన ఉద్గారాల విడుదల 2010 నాటి స్థాయికన్నా 10.6 శాతం అధికంగా ఉంటుందని విశ్లేషించింది. ఈ దశాబ్దం చివరికి అంటే వచ్చే ఎనిమిదేళ్లలో కర్బన ఉద్గారాలను ప్రస్తుతమున్న స్థాయికన్నా 45 శాతం మేర తగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనికనుగుణంగా ప్రభుత్వాలు తమ వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను బలోపేతం చేసుకోవాలని సంబంధిత ఐరాస విభాగం కోరింది. నవంబరులో ఈజిప్టులో వాతావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఐరాస తాజా నివేదికను విడుదల చేసింది. అత్యధిక స్థాయిలో 3 ఉద్గారాలు భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడే మూడు గ్రీన్‌హౌస్‌ వాయువులు కార్బన్‌ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌. గత ఏడాది రికార్డు స్థాయిలో వాతావరణంలోకి విడుదలయ్యాయని నివేదిక తెలిపింది. ఈ మూడు వాయువుల నుంచి భూమికి అధిక ముప్పు ఉందని, వీటి నియంత్రణపై దృష్టిని కేంద్రీకరించాలని పేర్కొంది.

పేదరికం, పర్యావరణ సంక్షోభాలతో భారతీయ చిన్నారులకు ముప్పు: ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ నివేదిక

భారత్‌లో 51 శాతం మంది చిన్నారుల (22.2 కోట్లు) జీవితాలపై పేదరికం, పర్యావరణ సంక్షోభాలు ప్రభావం చూపిస్తున్నట్లు ‘జెనరేషన్‌ హోప్‌: 2.4 బిలియన్‌ రీజన్స్‌ టు ఎండ్‌ ది గ్లోబల్‌ క్లైమేట్‌ అండ్‌ ఇన్‌ఈక్వాలిటీ క్రైసిస్‌’ నివేదిక పేర్కొంది. ఆసియా వ్యాప్తంగా ఈ సంఖ్య 35 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. బాలల హక్కుల సంస్థ ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’, బ్రస్సెల్‌లోని వ్రిజ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి ఈ నివేదికను వెలువరించారు. దీని ప్రకారం.. కంబోడియాలో అత్యధికంగా 72 శాతం పిల్లలు పేదరికం, పర్యావరణ సంక్షోభాల జంట ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్‌ (64 శాతం), అఫ్గానిస్థాన్‌ (57 శాతం) చిన్నారులు ఉన్నారు. అయితే సంఖ్యపరంగా భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యాంశాలు.. ‣ భారత్‌లో 35.19 కోట్ల మంది పిల్లలపై ఏటా ఒక్క వాతావరణ వైపరీత్యమైనా ప్రభావం చూపుతోంది. పేదరికం కారణంగా వారిలో కొందరికి దీన్నుంచి రక్షించుకోవడానికి తగిన వనరులు లేవు. ‣ ప్రపంచవ్యాప్తంగా 77.4 కోట్ల మంది చిన్నారులు అతి ప్రమాదకర (హై రిస్క్‌) పరిస్థితుల్లో ఉన్నారు. సంపన్న దేశాల్లో 12.1 కోట్ల మంది చిన్నారులు పేదరికం, పర్యావరణ సంక్షోభాల ప్రభావంతో జీవితాలు గడుపుతున్నారు. వీరిలో ప్రతి పదుగురిలో కనీసం నలుగురు అమెరికా లేదా బ్రిటన్‌లో నివసిస్తున్నారు. ‣ పరస్పర అనుసంధానమైన పర్యావరణ సంక్షోభం, అసమానతల సమస్యల పరిష్కారానికి అత్యవసరంగా చర్యలు చేపట్టకపోతే మానవాళికి ముప్పు తప్పదని, భారత్‌లో ఈ చొరవ మరింత కీలకమని ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ భారత్‌ విభాగం సీఈవో సుదర్శన్‌ సుచి పేర్కొన్నారు.

ఆసియా టాప్‌-10 కాలుష్య నగరాల్లో 8 భారత్‌లోనే!

ఆసియాలోని పది కాలుష్య నగరాల జాబితాలను వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ప్రకటించింది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)ల ఆధారంగా ఈ జాబితాను వెలువరించింది. ఇందులో ఎనిమిది నగరాలు భారత్‌కు చెందినవే ఉన్నాయి. ఇందులో దేశ రాజధాని దిల్లీ లేకపోవడం గమనార్హం. వాయు కాలుష్యం లేని నగరాల జాబితానూ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజమహేంద్రవరానికి ఇందులో చోటు దక్కింది. అత్యంత కాలుష్య నగరాల్లో గురుగ్రామ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో ఏక్యూఐ 679 గా నమోదైంది. తర్వాత స్థానాల్లో హరియాణాలోని థారుహేరా (ఏక్యూఐ 543), బిహార్‌లోని ముజఫర్‌నగర్‌ (ఏక్యూఐ 316), లఖ్‌నవూలోని తాలక్‌టోరా (ఏక్యూఐ 298), బేగుసరాయ్‌లోని డీఆర్‌సీసీ ఆనంద్‌పుర్‌ (ఏక్యూఐ 266), కల్యాణ్‌లోని ఖఢక్‌పాడా (ఏక్యూఐ 256), దర్శన్‌ నగర్, ఛాప్రా (ఏక్యూఐ 239) ఉన్నాయి. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 150 దాటితే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

హెచ్‌ఐవీ ఉన్నవారికి హెపటైటిస్‌ బీ టీకాతో రక్షణ

హెచ్‌ఐవీ ఉన్న వయోజనులకు హెపటైటిస్‌ బీ 3 డోసుల టీకా ‘హెప్లిసావ్‌-బీ’ పూర్తి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. వాషింగ్టన్‌లో అక్టోబరు 19 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న ‘ఐడీవీక్‌’ వార్షిక సదస్సులో అధ్యయన వివరాలను వెల్లడించారు. సిన్సినాటీ, కార్నెల్‌ వర్సిటీలకు చెందిన పరిశోధకులు అమెరికా, దక్షిణాఫ్రికా, థాయిలాండ్‌కు చెందిన 38 ప్రాంతాల్లో హెచ్‌ఐవీతో జీవిస్తున్న 68 మంది వయోజనులకు ‘హెప్లిసావ్‌-బీ’ని 3 డోసులుగా అందించారు. వీరిలో హెపటైటిస్‌ బీ వైరస్‌కు వ్యాక్సినేషన్‌ పొందడం లేదా ఈ ఇన్ఫెక్షన్‌ బారినపడటం ద్వారా రోగనిరోధక శక్తిని పొందిన వారు ఎవరూ లేరు. వారంతా యాంటీ రిట్రోవైరల్‌ చికిత్స పొందినవారే. వీరికి తొలి డోసు అందించిన 4 వారాలకు, 24 వారాలకు మిగతా రెండు డోసులు వేశారు. మూడో డోసు పొందడానికి ముందే 24వ వారం నాటికి వీరిలో 98.5% మంది రక్షణ పొందినట్లు పరిశోధకులు వెల్లడించారు.

భూతాపం పెరుగుదలతో భారత్‌కు భారీ నష్టం

అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా గతేడాది రూ.వేల కోట్లలో దేశం ఆదాయ నష్టాన్ని చవిచూసింది. ఓ అంచనా ప్రకారం.. ఇది దేశ జీడీపీలో 5.4 శాతానికి సమానం. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా, నిర్మాణ రంగాల్లో ఈ ఆదాయ నష్టం తలెత్తినట్లు పలు అంతర్జాతీయ సంస్థలు 2022లో సంయుక్తంగా వెలువరించిన వాతావరణ మార్పుల పారదర్శక నివేదిక వెల్లడించింది. తీవ్ర వేడి వల్ల జనం ఎక్కువసేపు పని చేయలేకపోవడంతో 2021లో 16,700 కోట్ల పని గంటలు నష్టమయ్యాయి. 1990 - 99తో పోలిస్తే ఇది 39 శాతం ఎక్కువ. భూతాపం 1850 - 1900 నాటి కాలంతో పోలిస్తే ఇప్పుడు 1.1 సెల్సియస్‌ డిగ్రీలు పెరిగింది. దీనికే ఇంత నష్టం జరిగితే రానురాను ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల మేరకు పెరిగినప్పుడు మరెంత నష్టం ఉంటుందో ఊహించవచ్చు. 2016 - 2021 మధ్యకాలం భారత్‌లో తుపానులు, మెరుపు వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల 3.6 కోట్ల హెక్టార్లలో పంట నష్టం జరిగి, రైతులు రూ.31,023 కోట్లు (375 కోట్ల డాలర్లు) ఆదాయం కోల్పోయారు. భూతాపం 1.5 సెల్సియస్‌ డిగ్రీల మేర పెరిగితే నదుల వరద ఉద్ధృతి వల్ల నష్టాలు ఏటా 49% హెచ్చుతాయి. తుపాను నష్టాలు 5.7 శాతం పెరుగుతాయి. గడచిన 30 ఏళ్లలో భారత్‌లో వర్షపాతం తీరుతెన్నులు మారిపోయి వ్యవసాయం, అడవులు, మత్స్య పరిశ్రమలు నష్టపోతున్నాయి. దేశంలో హిమపాతమూ బాగా తగ్గుతోంది. వాతావరణ మార్పుల నిరోధానికి కుదుర్చుకున్న పారిస్‌ ఒప్పందాన్ని వేగంగా అమలు చేయవలసిన అవసరం తోసుకొస్తోంది.

శారీరక శ్రమ లోపిస్తే రూ.25 లక్షల కోట్ల నష్టం

శారీరక శ్రమ లోపించడం వల్ల 2020 - 30 మధ్య ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది గుండెజబ్బులు, ఊబకాయం వంటి అసాంక్రమిక వ్యాధుల బారిన పడే ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తమ తాజా నివేదికలో వెల్లడించింది. ఫలితంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా రూ.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ప్రజల్లో శారీరక శ్రమ పెంచేందుకు డబ్ల్యూహెచ్‌వో 2019లో అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. అందులో చేసిన సిఫార్సులు ఏ మేరకు అమలవుతున్నాయో పరిశీలించేందుకు 194 దేశాల్లో ఇటీవల సర్వే నిర్వహించి నివేదికను వెలువరించింది. ప్రజల్లో శారీరక శ్రమ లోపించి, వ్యాధులు పెరిగితే వాటిపై ప్రభుత్వాలు ఏటా దాదాపు రూ.2.22 లక్షల కోట్ల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా వేసింది. 2030 నాటికి ఈ వ్యయం రూ.25 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. ప్రజల్లో శారీరక శ్రమ కలిగించే నడక, సైక్లింగ్, ఆటల వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలి. అప్పుడే వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు.

భాజపాకు రూ.336.5 కోట్ల విరాళం

ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో రూ.464.81 కోట్లను వివిధ పార్టీలకు విరాళంగా అందించింది. అందులో సింహభాగం రూ.336.5 కోట్లను భాజపా దక్కించుకోగా రూ.128.31 కోట్లను మిగిలిన పార్టీలు పొందాయి. కార్పొరేట్‌ సంస్థలు సహా వివిధ మార్గాల ద్వారా తమకు 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో రూ.464.83 కోట్ల విరాళాలు అందాయని, వాటిలో రూ.464.81 కోట్లను రాజకీయ పార్టీలకు వితరణ చేసినట్లు ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు వెల్లడించింది. ఇందులో భాజపాకు 26 విడతల్లో రూ.336.5 కోట్లను అందించినట్లు వివరించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు సమర్పించిన 2021 - 22 సంవత్సరం ఆర్థిక నివేదిక వెల్లడించింది. ‣ అందులోని వివరాల ప్రకారం.. కాంగ్రెస్‌ (రూ.16.5 కోట్లు), ఆమ్‌ ఆద్మీ పార్టీ (రూ.16.31 కోట్లు), శిరోమణి అకాలీ దళ్‌ (రూ.7 కోట్లు), తెరాస (రూ.40 కోట్లు), సమాజ్‌వాదీ పార్టీ (రూ.27 కోట్లు), వైకాపా (రూ.20 కోట్లు), ప్రస్తుతం భాజపాలో విలీనమైన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (రూ.కోటి), గోవా ఫార్వార్డ్‌ పార్టీ (రూ.50 లక్షలు)లకు విరాళాలిచ్చినట్లు ట్రస్టు తెలిపింది. ‘అర్సెలర్‌’ నుంచి ట్రస్టుకు రూ.130 కోట్లు సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి రూ.45 కోట్లు, హెటిరో డ్రగ్స్‌ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌లు తలో రూ. 5 కోట్లు చొప్పున, టొరెంట్‌ ఫార్మా రూ.2 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ దాని అనుబంధ సంస్థలు రూ.52.5 కోట్లు, అర్సెలర్‌ మిట్టల్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా రూ.130 కోట్లను ట్రస్టుకు అందించాయి.

భారత్‌లో పేదరికం నుంచి 41.5 కోట్ల మందికి విముక్తి

భారతదేశంలో 15 ఏళ్లలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తెలిపింది. దీన్నో చరిత్రాత్మక మార్పుగా అభివర్ణించింది. సుమారు 27.5 కోట్ల మంది 2005 - 06, 2015 - 16 మధ్య పేదరికం నుంచి విముక్తి పొందగా, 14 కోట్ల మంది 2015 - 16 నుంచి 2019 - 21 మధ్య బయటపడ్డారని యూఎన్‌డీపీ తన నివేదికలో పేర్కొంది. భారత్‌ సాధించిన విజయంతో 2030 కల్లా ప్రపంచ పేదల్లో సగం మందిని పేదరికంనుంచి తప్పించాలన్న ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యం కూడా సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.

వెట్‌ల్యాండ్‌ విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణకు మూడో స్థానం

తెలంగాణలో నీటి నిల్వ ఉన్న ప్రాంతాల (వెట్‌ల్యాండ్‌) విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2006 - 07లో దేశవ్యాప్తంగా 1.53 కోట్ల హెక్టార్ల వెట్‌ల్యాండ్‌ ఉండగా, 2017 - 18కల్లా 1.59 కోట్ల హెక్టార్లకు పెరిగింది. అంటే 2006 - 18 మధ్య కాలంలో అదనంగా 6,41,682 హెక్టార్లకు నీటి నిల్వలు పెరిగాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల విస్తీర్ణమే 1,33,624 హెక్టార్లు (20.82 శాతం) ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్‌ రెండో, తెలంగాణ మూడో, ఏపీ నాలుగో స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 2006 - 07లో 4,99,563 హెక్టార్లలో నీటి నిల్వలు ఉండగా, 2017 - 18 నాటికి 5,66,680 హెక్టార్లకు.. అంటే 67,117 హెక్టార్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 10,75,099 హెక్టార్ల నుంచి 11,41,606 హెక్టార్లకు పెరిగింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌లోని ‘స్పేస్‌ అప్లికేషన్స్‌ కేంద్రం’ సహకారంతో ‘జాతీయ వెట్‌ల్యాండ్‌ అధ్యయనం’ నిర్వహించింది. ఉపగ్రహాలతో చిత్రీకరించి జాతీయ అట్లాస్‌ను రూపొందించింది. ఈ నివేదికను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గుర్తించేదిలా.. వెట్‌ల్యాండ్‌లో అనేక రకాలుంటాయి. కుంటలు, చెరువులు, నదులు, నీటి ముంపు ప్రాంతాలు, రేవులు, మడ అడవులు, తీర ప్రాంతాలు, చేపల, రొయ్యల చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, ఇలా నీరు నిల్వఉండే లేక ముంపునకు గురయ్యే భూములను వెట్‌ల్యాండ్‌ అని ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఉపగ్రహాలతో చిత్రీకరించినప్పుడు వీటిని వివిధ రంగుల్లో గుర్తించి, వాటి విస్తీర్ణాన్ని గణిస్తారు.

ఆడపిల్లల జనన రేటు ఇంకా తక్కువే: ఎస్‌ఆర్‌బీ

రాష్ట్రంలో ఆడపిల్లల జనన రేటు (ప్రతి వెయ్యి మంది మగపిల్లల జననాలకు) తక్కువగా నమోదవుతోంది. 2020 - 21 నాటికి జాతీయ ఆరోగ్య సమాచారం కింద నమోదైన గణాంకాలు పరిశీలిస్తే.. కొన్ని జిల్లాల్లో ఏడేళ్ల క్రితం నాటి జాతీయ సగటును అధిగమించలేదని వెల్లడైంది. బేటీ బచావో - బేటీ పఢావో పథక ప్రారంభ సమయంలో ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జాతీయ సగటు 918 కంటే 12 జిల్లాలో తక్కువగా జనన రేటు ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు.. సగటు 952 ఉంటే, రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అంతకన్నా తక్కువగా ఉంది. 2020 - 21 గణాంకాల ప్రకారం సూర్యాపేటలో 808గా ఉంటే, అత్యధికంగా నిర్మల్‌లో 1,008గా నమోదైంది. జాతీయ స్థాయిలో ఇదే పరిస్థితి నమోదు కావడంతో ఆడపిల్లల రక్షణ, సాధికారతతో పాటు జనన రేటు (ఎస్‌ఆర్‌బీ) పెంచేందుకు బేటీ బచావో - బేటీ పఢావో పథకంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మిషన్‌ శక్తి కింద పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు వివిధ విభాగాలను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపింది. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంతో పాటు స్వీయరక్షణలో శిక్షణ ఇవ్వనుంది. అలాగే ఆడపిల్లలు డ్రాపవుట్‌ కాకుండా వారికి కౌన్సెలింగ్‌తో పాటు స్టెమ్‌ కోర్సులు, నైపుణ్య శిక్షణ కల్పించనుంది. పోలీసులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మహిళా పోలీసులు అందుబాటులో ఉండేలా మహిళా పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

డిజిటల్‌ లావాదేవీల్లో చిరు వ్యాపారులు దేశంలోనే అగ్రగామి

నిరక్షరాస్యులైనా, అంతంతమాత్రంగానే చదువుకున్నా సాంకేతికత వినియోగంలో తెలంగాణలోని వీధి వ్యాపారులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో లక్షల మంది చిరు వ్యాపారులు డిజిటల్‌ లావాదేవీలకు అలవాటుపడ్డారు. హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ వీరు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా నగదురహిత లావాదేవీలను అనుమతిస్తున్నారు. దేశవ్యాప్తంగా నగదు ప్రోత్సాహకంగా రూ.17.65 కోట్లు అందజేయగా ఇందులో రాష్ట్ర వీధి వ్యాపారులు రూ.3.63 కోట్లు పొందారు. దేశంలో అయిదో వంతు ఇక్కడే దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులు నిర్వహించే డిజిటల్‌ లావాదేవీల్లో 21 శాతం తెలంగాణలోనే జరుగుతుండటం విశేషం. రాష్ట్ర పురపాలక శాఖ వీధి వ్యాపారుల డిజిటల్‌ క్రయవిక్రయాలు, రుణాలు, మౌలిక వసతులపై సమగ్ర నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. ఈ శాఖ వద్ద నమోదైన వీధి వ్యాపారులు 6,16,563 మంది. పట్టణాల జనాభాలో 4.17 శాతం వీరే. రుణ వితరణలో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు దేశంలోనే ముందున్నాయి. తొలి విడత రూ. 10 వేల చొప్పున ఇచ్చిన రుణాల్లో మెగా సిటీల్లో జీహెచ్‌ఎంసీ రెండో స్థానంలో నిలిచింది. లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉండే నగరాల జాబితాలో దేశంలోనే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదటి స్థానంలో ఉండగా, నిజామాబాద్‌ ఏడో స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు 29 ఎయిర్‌పోర్టులకు ప్రముఖుల పేర్లు

దేశంలోని 29 విమానాశ్రయాలు, టెర్మినళ్లకు ఉన్నత వ్యక్తులు, ప్రముఖుల పేర్లు పెట్టారు. చండీగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఇటీవల ‘షహీద్‌ భగత్‌సింగ్‌’గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశంలోని 24 విమానాశ్రయాలు, 5 టెర్మినళ్లకు ఉన్నత వ్యక్తులు, ప్రముఖుల పేర్లను పెట్టినట్లు సమాచార హక్కు (స.హ.) చట్టం ద్వారా వెల్లడైంది. సెప్టెంబరు 28న పేరు మార్చిన చండీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన వివరాలను మాత్రం ఆ జాబితాలో పేర్కొనలేదు. ‣ జాబితాలో తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు విమానాశ్రయాలకు మాజీ ప్రధానమంత్రుల పేర్లు పెట్టారు. దిల్లీలోని విమానాశ్రయానికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా, హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ, వారణాసిలోని విమానాశ్రయానికి లాల్‌ బహదూర్‌ శాస్త్రి, లఖ్‌నవూలోని విమానాశ్రయానికి చౌధరి చరణ్‌సింగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా నామకరణం చేశారు. భువనేశ్వర్‌ (బిజూ పట్నాయక్‌ ఎయిర్‌పోర్టు)తోపాటు మరికొన్ని టెర్మినళ్లకు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టారు. అలాగే, హైదరాబాద్‌ విమానాశ్రయంలోని రెండు టెర్మినళ్లకు ఎన్టీఆర్‌ పేరు, చెన్నైలోని ఓ టెర్మినల్‌కు అన్నా ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌గా, మరో టెర్మినల్‌కు కామ్‌రాజ్‌ డొమెస్టిక్‌ టెర్మినల్‌గా నామకరణం చేశారు. దేశంలో ప్రస్తుతం 29 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 92 డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టులు, 10 కస్టమ్స్‌ ఎయిర్‌పోర్టులు, 8 హెలీపోర్టులు, 2 వాటర్‌డ్రోమ్స్‌ ఉన్నాయి.

ప్రపంచ క్షుద్బాధ సూచీలో భారత్‌కు 107వ స్థానం

ప్రపంచ క్షుద్బాధ సూచీ (జీహెచ్‌ఐ)లో భారత్‌ పరిస్థితి మరింత దిగజారిందని రెండు స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి. మొత్తం 121 దేశాల్లో భారత్‌ 107 స్థానంలో ఉందని తెలిపాయి. పొరుగునున్న పాకిస్థాన్‌ (99), బంగ్లాదేశ్‌ (84), నేపాల్‌ (81), శ్రీలంక (64) కన్నా మన దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని వివరించాయి. ఐర్లాండ్‌కు చెందిన కన్సర్న్‌ వరల్డ్‌ వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు జీహెచ్‌ఐ - 2022ను రూపొందించాయి. 2021లో 116 దేశాలను జీహెచ్‌ఐ సూచి కోసం పరిగణనలోకి తీసుకోగా, వాటిలో భారత్‌ 101వ స్థానంలో ఉంది. 2022కు వచ్చేసరికి 121 దేశాలను పరిగణించగా, వాటిలో భారత్‌ 107వ స్థానానికి దిగజారింది. తాజా నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ‣ 29.1 స్కోరుతో భారత్‌లో క్షుద్బాధ స్థాయి చాలా తీవ్రంగా ఉంది. ఆసియాలో ఇండియా తర్వాత అఫ్గానిస్థాన్‌ (109) మాత్రమే ఉంది. మొత్తం మీద ఈ సమస్య దక్షిణాసియాలో ఎక్కువగా ఉంది. ‣ 2019 - 21లో 16.3% మందిలో పోషకాహార లోపం ఉంది. దీన్నిబట్టి దేశంలో 22.4 కోట్ల మందికి సరిపడా పోషక విలువలు లభించడంలేదని స్పష్టమవుతోంది. 2018 - 20లో అది 14.6 శాతంగా ఉండేది. ‣ ఆకలిపై విజయం సాధించిన 5 అగ్రశ్రేణి దేశాల్లో చైనా, తుర్కియే, కువైట్‌ ఉన్నాయి.

కాలుష్య కారక మరణాలు భారత్‌లో తక్కువే ఉండొచ్చు

గాలిలోని సూక్ష్మస్థాయి కాలుష్య కణాలైన ‘పీఎం 2.5’ కారణంగా భారత్‌లో ఇంతకుముందు అంచనావేసిన స్థాయిలో మరణాలు ఉండకపోవచ్చని తాజా అధ్యయనం విశ్లేషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇతర దేశాల్లో కంటే భారత్‌లోనే పీఎం 2.5 స్థాయులు ఎక్కువ. జనం పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ సూక్ష్మ కణాలు స్థాయికి మించి ఉంటున్నాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఈ అంశంపై పరిశోధకులు ‘మిలియన్‌ డెత్‌ స్టడీ’ చేపట్టారు. కాలుష్య కారకాలకూ, ప్రజలు శ్వాసకోశ, గుండె వ్యాధులతో మరణించడానికీ మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. ఇందులో భాగంగా 68 లక్షల మంది నివసించే 7,400 ప్రాంతాల్లో పీఎం 2.5 సాంద్రతను లెక్కగట్టారు. ఆయా చోట్ల 2001 - 2014 మధ్య 15-69 ఏళ్ల వయసు వారిలో సంభవించిన 2 లక్షలకుపైగా మరణాలను విశ్లేషించారు. క్యూబిక్‌ మీటరుకు 10 మైక్రోగ్రాముల మేర పీఎం 2.5 కణాలు పెరిగితే గుండె పోటు, దాని కారణంగా మృతి చెందే ముప్పు 9% పెరుగుతుందని గుర్తించాం. ఈ కణాల వల్ల పెద్దల్లో హృద్రోగాలు, శ్వాసకోశ వ్యాధులు, మరణముప్పు పెరగడం లేదు. అయితే, పీఎం 2.5 వల్ల చిన్నారుల జీవన నాణ్యత గణనీయంగా తగ్గుతోందని టొరంటోకు చెందిన డల్లా లానా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా పేర్కొన్నారు. ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పెర్‌స్పెక్టివ్‌ పత్రిక ఈ వివరాలు అందించింది.

48 ఏళ్లలో 69% తగ్గిన వన్యప్రాణులు

విశ్వవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 1970తో పోలిస్తే 2018లో 69 శాతం తగ్గిందని ప్రపంచ వన్యప్రాణులు, జీవరాశుల నివేదిక - 2022 పేర్కొంది. ఉష్ణమండల ప్రాంతాల్లో వెన్నెముక కలిగిన జీవుల క్షీణత దిగ్భ్రాంతికరంగా ఉందని నివేదిక వెల్లడించింది. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ప్రాంతాల్లో వీటి తగ్గుదల మరింత ఎక్కువగా ఉందని వివరించింది. అక్కడ కొన్ని చోట్ల ఈ క్షీణత సరాసరిన 94 శాతం వరకు ఉందని పేర్కొంది. ఆఫ్రికాలో 66 శాతం, ఆసియాలో 55 శాతం తగ్గుదల ఉందని తెలిపింది.

దేశంలోనే అత్యంత నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు మునీరాబాద్‌ - ముహబూబ్‌నగర్‌ రైల్వే మార్గం

తెలంగాణలోని మునీరాబాద్‌ - మహబూబ్‌నగర్‌ రైల్వే మార్గం దేశంలోనే అత్యంత ఆలస్యంగా కొనసాగుతున్న ప్రాజెక్టుగా నిలిచింది. ఇది 276 నెలలు ఆలస్యంగా ‘నడుస్తోంది’. బెలాపుర్‌ - సీవుడ్‌ - ఉరణ్‌ విద్యుదీకరణ, డబుల్‌ లైన్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ గత 228 నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. మూడో స్థానంలో నిలిచిన ఏపీలోని కోటిపల్లి - నర్సాపూర్‌ రైల్వే ప్రాజెక్టు 216 నెలలుగా పెండింగ్‌లో ఉంది. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన కొనసాగుతుండగా వీటిలో అత్యంత ఆలస్యంగా కొనసాగుతున్నవి రోడ్డు రవాణా, హైవే రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. రూ.150 కోట్లకు పైగా ఖర్చయ్యే ప్రాజెక్టులను కేంద్ర గణాంకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ విభాగం (ఐపీఎండీ) పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను అమలు చేస్తోన్న ఏజెన్సీలు ఆన్‌లైన్‌ కంప్యూటరైజ్డ్‌ మానీటరింగ్‌ సిస్టమ్‌లో పొందుపరిచే సమాచారాన్ని బట్టి వాటి పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే అత్యంత ఆలస్యంగా కొనసాగుతోన్న ప్రాజెక్టులకు సంబంధించి వివరాలను తాజా నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం.. రోడ్డు రవాణా రంగంలో మొత్తం 831 ప్రాజెక్టుల్లో 248 ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చినప్పుడు అంచనా వ్యయం రూ.4,92,741 కోట్లు. పనుల్లో ఆలస్యం కారణంగా ఇవి పూర్తయ్యేందుకు అయ్యే వ్యయం రూ.5,40,815 కోట్లకు (9.8 శాతం) పెరిగినట్లు అంచనా. రైల్వేలో 173 ప్రాజెక్టులకు గాను 116 నత్తనడకన కొనసాగుతున్నాయి. 173 ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.3,72,761 కోట్లు కాగా పూర్తయ్యేందుకు రూ.6,19,569 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. పెట్రోలియం రంగంలో 139 ప్రాజెక్టులకు గాను 88 ఆలస్యంగా కొనసాగుతున్నాయి.

స్వాతంత్య్రానికి ముందు, తర్వాత సాగు పురోగతి: ఐకార్‌(ఖిదితిళి) నివేదిక

స్వాతంత్య్రానికి పూర్వం 12 భయంకర క్షామాలను ఎదుర్కొన్న మన దేశం, స్వాతంత్య్రానంతరం ఆహార మిగులును సాధించినట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి పేర్కొంది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘ఇండియన్‌ అగ్రికల్చర్‌ ఆఫ్టర్‌ ఇండిపెండెన్స్‌’ నివేదికలో భారతీయ రైతుల పురోగతిని వివరించింది. నాటి 12 భయంకర క్షామాల కారణంగా 5.7 కోట్ల నుంచి 8.2 కోట్ల దాకా ప్రజలు చనిపోయినప్పటికీ కుంగిపోకుండా శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగి వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచంలో తొలి 5 దేశాల్లో ఒకటిగా ఎదిగినట్లు తెలిపింది. ‘‘భౌగోళికంగా దేశంలో ఉన్న 328 మిలియన్‌ హెక్టార్ల భూమిలో 160 మి.హెక్టార్లు మాత్రమే వ్యవసాయయోగ్యంగా ఉంది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో వ్యవసాయయోగ్యమైన భూమి ఉన్నది ఇక్కడే. ఈ భూగోళం మీదున్న 60 రకాల నేలల్లో 46 భారత్‌లోనే ఉన్నాయి. 1947 తర్వాత రైతుల శ్రమ ఫలించి.. స్వాతంత్య్రానంతరం సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు 1947లో ‘ఎక్కువ ఆహారాన్ని పండించు’ (గ్రో మోర్‌ ఫుడ్‌) అన్న నినాదాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రీయ దృక్పథం, పటిష్ఠమైన ప్రణాళికలతో ముందడుగు వేయడంతో కోట్లమంది రైతుల శ్రమ ఫలించింది. వాతావరణ అనిశ్చితి, తరిగిపోతున్న భూసారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తెగుళ్ల బెడదలను తట్టుకొని నిలబడటంతో భారత వ్యవసాయరంగం మిగులు స్థాయికి చేరింది. ‣ ఆహార ధాన్యాల ఉత్పత్తి మొత్తంగా 1950 - 51 నుంచి 2021 - 22 మధ్యకాలంలో 51 మి.టన్నుల నుంచి 314 మి.టన్నులకు చేరింది. ఈ 70 ఏళ్ల కాలంలో ఆహార ధాన్యాలు ఆరు రెట్లు, ఉద్యాన పంటలు 11 రెట్లు, చేపలు 18 రెట్లు, పాలు 10 రెట్లు, గుడ్లు 53 రెట్ల మేర పెరిగాయి. ఇది దేశ ఆహారంతో పాటు పౌష్టికాహార భద్రతపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ‣ ప్రస్తుతం భారత్‌ పాలు, పప్పు దినుసులు, జూట్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది. బియ్యం, గోధుమ, పత్తి, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరింది. సుగంధ ద్రవ్యాలు, చేపలు, కోళ్లు, పాడి ఉత్పత్తుల్లోనూ అగ్రభాగాన ఉంది. ‣ ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, రూ.4.14 లక్షల కోట్ల (50 బిలియన్‌ డాలర్లు) వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి మన దేశం క్రమంగా చేరిందని నివేదిక వివరించింది.

మూడొంతుల మురుగు నదుల్లోకే: నీతి ఆయోగ్‌

దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగు నీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72% నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్‌ ‘ఇటీవల విడుదల చేసిన అర్బన్‌ వేస్ట్‌ వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా’ అన్న నివేదికలో పేర్కొంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నీటి శుద్ధీకరణ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రస్తుత దేశ జనాభా 138 కోట్లు. అందులో 65% (90 కోట్ల మంది) గ్రామీణప్రాంతాల్లో ఉంటే 35% మంది (48 కోట్ల మంది) పట్టణప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 39,604 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతుంటే, పట్టణ ప్రాంతాల నుంచి 72,368 మిలియన్‌ లీటర్లు వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరగడంతో నీటి వినియోగం పెరిగింది.