ఇంధన సంరక్షణపై ఆస్కీతో రెడ్కో ఒప్పందం
ఇంధన సంరక్షణ కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’ (ఆస్కీ)తో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) అవగాహనా ఒప్పందం చేసుకుంది. రాబోయే అయిదేళ్ల పాటు రెండు సంస్థలూ ఇంధన సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆస్కీ తెలిపింది. ఇంధన సంరక్షణ చట్టం - 2001ని తెలంగాణలో పటిష్ఠంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలను ఆస్కీ ఇవ్వనుంది.
24 గంటల్లో 10 మందికి మోకీలు మార్పిడి
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరో మైలురాయికి చేరుకుంది. 24 గంటల్లో అత్యధిక మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. 2 నెలల కిందట హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 9 చేయగా దాన్ని అధిగమించింది. 24 గంటల వ్యవధిలో పది మందికి మోకీలు మార్చామని డా.ప్రతిమారాజ్ వివరించారు. జీజీహెచ్ నిజామాబాద్‌లో మూడు నెలల్లో ఉచితంగా మొత్తం 60 శస్త్రచికిత్సలు చేసినట్లు తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ కీలకం: మంత్రి కేటీఆర్
జీవశాస్త్రాల రంగంలో 8.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని తెలంగాణ 2030 కంటే ముందుగానే చేరుకుంటుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఆయన జీనోమ్ వ్యాలీలో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్‌ఎక్స్ ప్రొఫెల్లంట్ రూ.900 కోట్ల పెట్టుబడితో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధనశాలను, విమ్టాల్యాబ్ రూ.70 కోట్లతో నిర్మించిన ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ టీఎస్‌ఐఐసీ, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ నిర్మిస్తున్న బయోహబ్, జీవీ1 ల్యాబ్‌లకు ఆయన శంకుస్థాపన చేశారు. జీవీపీఆర్ సంస్థ రూ.40 కోట్లతో 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన యాపాన్ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జీనోమ్ వ్యాలీ తెలంగాణతో పాటు దేశానికి ఎంతో కీలకంగా ఎదిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో రోష్
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ ఔషధ, రోగ నిర్ధారణ యంత్రాల తయారీ సంస్థ రోష్ తెలంగాణలో ప్రపంచ స్థాయి అత్యాధునిక విశ్లేషణ, సాంకేతిక ప్రతిభా కేంద్రాన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని ద్వారా వంద మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రోష్ ఎండీ, సీఈవో సింప్సన్ ఇమ్మాన్యుయేల్ తమ ప్రతినిధి బృందంతో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. ఈ కొత్త కేంద్రం మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధల సాయంతో డేటా విశ్లేషణలు చేస్తుందని, రోగులకు ఆధునిక సేవలందించడంతో పాటు మెరుగైన ఫలితాలను అందించేందుకు ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2020 మేలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రోష్ చైర్మన్ క్రిస్టోఫ్ ఫ్రాంజ్‌తో సమావేశమై హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రపంచ ప్రసిద్ధ సంస్థల నిలయంగా గుర్తింపు పొందుతోందని తెలిపారు.