రెస్ట్‌దే ఇరానీ ట్రోఫీ
రెస్టాఫ్ ఇండియా జట్టు 29వ సారి ఇరానీ ట్రోఫీని గెలుచుకుంది. చివరి రోజు మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. మూడో రోజుకే విజయాన్ని ఖాయం చేసుకున్న రెస్ట్ చివరి రోజు లాంఛనాన్ని ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 368/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌటైంది. చివరి రెండు వికెట్లను కుల్‌దీప్ సేన్ (5/94) చేజిక్కించుకున్నాడు. 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెస్ట్ 31.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిమన్యు ఈశ్వరన్ 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీకర్ భరత్ (27 నాటౌట్)తో అభేద్యమైన మూడో వికెట్‌కు అతడు 81 పరుగులు జోడించాడు. మొదట ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలగా రెస్ట్ 374 పరుగులు సాధించింది. రెస్ట్‌కు 276 పరుగుల ఆధిక్యం లభించింది.
సాత్విక్ జోడీదే ఫ్రెంచ్ టైటిల్
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్ జంట 21-13, 21-19తో లూ చింగ్ యో-యంగ్ పొ హన్ (తైవాన్)ని ఓడించింది. తొలి గేమ్ ఆరంభం నుంచే సాత్విక్ జోడీ దూకుడుగా ఆడింది. 7-1తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జంట ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా తగ్గలేదు. అదే జోరుతో గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి జోడీ నుంచి భారత జంటకు గట్టిపోటీనే ఎదురైంది. ఒక దశలో సాత్విక్ జంట 7-4తో నిలిచినా లూ చింగ్ ద్వయం పుంజుకుంది. 19-17తో ఆధిక్యంలోకి కూడా వెళ్లింది. కానీ ఒత్తిడిని తట్టుకుంటూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన సాత్విక్ జోడీ 21-19తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
వెర్‌స్టాపెన్ సరికొత్త రికార్డు
ఫార్ములా వన్ స్టార్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ రికార్డు విజయంతో అదరగొట్టాడు. ఒక సీజన్‌లో అత్యధిక విజయాలతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రిలో టైటిల్ సాధించిన వెర్‌స్టాపెన్ ఈ సీజన్‌లో 14వ విజయంతో సత్తాచాటాడు. 2004లో మైకెల్ షుమాకర్ 13 విజయాలు సాధించగా 2013లో సెబాస్టియన్ వెటెల్ ఆ రికార్డును సమం చేశాడు. ఆదివారం వెర్‌స్టాపెన్ దిగ్గజాల రికార్డును తిరగరాశాడు.
ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఛాంపియన్ స్పెయిన్
భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ 1-0తో కొలంబియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్ కూడా పడలేదు. మ్యాచ్ అదనపు సమయానికి మళ్లుతుందేమో అనిపించిన సమయంలో కొలంబియా అమ్మాయి గుజ్‌మన్ (82వ నిమిషం) సెల్ఫ్ గోల్ చేయడంతో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆధిక్యాన్ని ఆఖరిదాకా కాపాడుకున్న ఆ జట్టు విజేతగా నిలిచింది.
భారత హాకీ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో స్పెయిన్, న్యూజిలాండ్‌లతో తలపడే 22 మంది సభ్యుల భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. మన్‌ప్రీత్ సింగ్ ఉపసారథి. భారత జట్టు లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లో అక్టోబరు 28న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. 30న స్పెయిన్‌ను ఢీకొంటుంది. న్యూజిలాండ్‌తో రెండో మ్యాచ్ నవంబరు 4న, స్పెయిన్‌తో రెండో మ్యాచ్‌ను నవంబరు 6న ఆడుతుంది. మ్యాచ్‌లన్నీ భువనేశ్వర్‌లోని కళింగ హాకీ స్టేడియంలో జరుగుతాయి.
మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం
క్రికెట్లో లింగ అసమానతను తొలగించడంలో భాగంగా బీసీసీఐ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పురుషులతో సమానంగా అమ్మాయిలకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని ఎపెక్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో బీసీసీఐ నిర్ణయించింది. కేంద్ర కాంట్రాక్టులు పొందిన పురుషులు, మహిళలకు సమాన మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. ఇకమీదట మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు మ్యాచ్ ఫీజుగా ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు వన్డే, టీ20కి రూ.1 లక్ష చొప్పున, టెస్టుకు రూ.4 లక్షలు చెల్లించారు.
‣ పురుషులతో సమానంగా మహిళల సంపాదన ఉండేలా ఈ ఏడాది ఆరంభంలో క్రికెటర్ల సంఘంతో న్యూజిలాండ్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అంతర్జాతీయ, దేశవాళీలో అన్ని ఫార్మాట్లు, టోర్నీల్లో ఆడే అమ్మాయిలకు, పురుషులతో పాటు సమానమైన మ్యాచ్ ఫీజు చెల్లిస్తున్నారు. లింగ అసమానతల్ని తొలగించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఆ దిశగా పని చేస్తోంది. అయితే కేంద్ర కాంట్రాక్టుల విషయంలో బీసీసీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం అమ్మాయిలకు ఏడాదికి ఎ-గ్రేడ్‌కు రూ.50 లక్షలు, బి-గ్రేడ్‌కు రూ.30 లక్షలు, సి-గ్రేడ్‌కు రూ.10 లక్షలు చొప్పున బీసీసీఐ చెల్లిస్తుంది. పురుషుల్లో ఎ ప్లస్‌కు రూ.7 కోట్లు, ఎ-గ్రేడ్‌కు రూ.5 కోట్లు, బి-గ్రేడ్‌కు రూ.3 కోట్లు, సి-గ్రేడ్‌కు రూ.1 కోటి ఇస్తుంది. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ పురుషులు, మహిళలకు సమాన వేతనం ఇస్తున్నారు.
రెతి ఫర్కాస్ బ్లిట్జ్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌గా సాహితి
ఏపీ యువ చెస్ క్రీడాకారిణి సాహితి వర్షిణి మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ విశాఖపట్నం అమ్మాయి రెతి ఫర్కాస్ బ్లిట్జ్ ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. తొమ్మిది రౌండ్ల నుంచి ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టోర్నీలో ఏడు గేమ్‌ల్లో గెలిచిన ఈ మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్.. రెండు ఓటములు చవి చూసింది. ఈ క్రమంలో అత్యుత్తమ ప్రదర్శనతో ముగ్గురు గ్రాండ్ మాస్టర్లను ఓడించడం విశేషం. అంతే కాకుండా బ్లిట్జ్ రేటింగ్‌ను 58 పాయింట్లు మెరుగుపర్చుకుంది. ఇటీవల 15 ఏళ్ల సాహితి మాగ్నస్ చెస్ ఛాలెంజర్ ఛాంపియన్‌షిప్ అమ్మాయిల విభాగంలో విజేతగా నిలిచింది.
అండర్-23 జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో నందినికి స్వర్ణం
జాతీయ అండర్-23 ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ స్ప్రింటర్ అగసర నందిని అదరగొట్టింది. మహిళల 100 మీ. హార్డిల్స్ పరుగులో పసిడి సొంతం చేసుకుంది. 13.73 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానంలో నిలవడంతో పాటు కొత్త మీట్ రికార్డు సృష్టించింది. గతేడాది అపర్ణ (13.80 సె) నెలకొల్పిన టైమింగ్‌ను ఇప్పుడు నందిని అధిగమించింది. ఆన్ టామీ (కేరళ - 14.23 సె), సతి పత్రా (పశ్చిమ బెంగాల్ - 14.24 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో శంకర్‌కు రజతం
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్ శంకర్ ముత్తుస్వామి రజతం నెగ్గాడు. ఫైనల్లో అతడు 14-21, 20-22తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. లిన్ ఎటాకింగ్ గేమ్‌తో పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ను అలవోకగా గెలుచుకున్న అతన్ని రెండో గేమ్‌లో శంకర్ ప్రతిఘటించాడు.
ఐసీఏ ప్రతినిధులుగా వెంగ్ సర్కార్, శుభంగి
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధులుగా మాజీ కెప్టెన్లు దిలీప్ వెంగ్ సర్కార్, శుభంగి కులకర్ణి ఎన్నికయ్యారు. మహిళా ప్రతినిధిగా శుభంగి ఏకగ్రీవంగా ఎన్నికైంది. మూడు రోజులుగా జరిగిన ఈ ఓటింగ్‌లో వెంగ్ సర్కార్, ఇప్పుడు ఐసీఏ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోనున్న అశోక్ మల్హోత్రాపై విజయం సాధించాడు. వెంగ్ సర్కార్‌కు 402 ఓట్లు రాగా, అశోక్‌కు 230 ఓట్లు వచ్చాయి.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ సత్తాచాటింది. 38 పతకాలు ఖాతాలో వేసుకుని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. పతకాల పట్టికలో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మన షూటర్లు ఈజిప్టులో జరిగిన రైఫిల్, పిస్టల్ పోటీలు, క్రొయేషియాలో నిర్వహించిన షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో కలిపి గతంలో కంటే (2018లో 27 పతకాలు) ఎక్కువ పతకాలు గెలిచారు. అంతే కాకుండా మూడు 2024 పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాలూ దక్కించుకున్నారు. రుద్రాంక్ష్ (10 మీ. ఎయిర్ రైఫిల్), స్వప్నిల్ (50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్), భౌనీష్ (ట్రాప్) ఒలింపిక్స్ కోటా స్థానాలు సాధించారు. కైరోలో జరిగిన పోటీల్లో తెలంగాణ యువ సంచలనం ఇషా సింగ్ మూడు స్వర్ణాలు, ఓ కాంస్యంతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో ఆమెనే భారత అత్యుత్తమ షూటర్‌గా నిలిచింది. సమీర్ గులియా రెండేసి చొప్పున రజతాలు, కాంస్యాలు నెగ్గాడు.
యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి విజేతగా వెర్‌స్టాపెన్
ఫార్ములావన్ టైటిల్‌ను ఇప్పటికే గెలుచుకున్న మాక్స్ వెర్‌స్టాపెన్ తన జట్టుకు టైటిల్‌ను అందించాడు. యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది 13వ విజయం. ఉత్కంఠభరితంగా సాగిన రేసులో రెడ్‌బుల్ రేసర్ వెర్‌స్టాపెన్ గంట 42 నిమిషాల 11.687 సెకన్లలో రేసు ముగించాడు. అతడి కంటే 5.023 సెకన్ల వెనుక వచ్చిన మెర్సిడెజ్ రేసర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. చార్లెస్ లీక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానం దక్కించుకున్నాడు. వెర్‌స్టాపెన్ విజయంతో ఫార్ములావన్ కన్‌స్ట్రక్టర్ల ఛాంపియన్‌షిప్ రెడ్‌బుల్ సొంతమయ్యింది.
భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మరో రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల టీమ్ పిస్టల్‌లో రజతం, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో కాంస్యం మన సొంతమయ్యాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో రిథమ్ సాంగ్వాన్, మను బాకర్, అబింద్య అశోక్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో చైనా చేతిలో 0-16తో ఓడి రజతం నెగ్గింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ కాంస్య పతక పోరులో భారత్ (ఐశ్వరీ తోమర్, స్వప్నిల్, నీరజ్) 17-15తో అమెరికాపై గెలిచింది.
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమన్‌కు పసిడి
భారత యువ రెజ్లర్ అమన్ చరిత్ర సృష్టించాడు. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో దేశానికి తొలి స్వర్ణం అందించాడు. 57 కేజీల విభాగంలో ఛాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో అతను 12-4 తేడాతో అహ్మత్ (టర్కీ)ను చిత్తుచేశాడు. మ్యాట్‌పై అమన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థిని ఎత్తిపడేస్తూ పాయింట్లు సాధించాడు. ఈ టోర్నీని భారత్ ఆరు పతకాలతో ముగించింది.
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇషాకు మరో స్వర్ణం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఇషా సింగ్ మొత్తం అయిదు విభాగాల్లో మూడు బంగారు పతకాలు, ఓ కాంస్యం గెలిచింది. ఇప్పటికే వేర్వేరు విభాగాల్లో వ్యక్తిగత, టీమ్ కలిపి రెండు స్వర్ణాలు, ఓ కాంస్యం గెలిచిన ఆమె మరో పసిడి దక్కించుకుంది. 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ జూనియర్ విభాగంలో సామ్రాట్ రాణాతో కలిసి ఛాంపియన్‌గా నిలిచింది. స్వర్ణ పోరులో ఇషా - రాణా జోడీ 17-15 తేడాతో భారత్‌కే చెందిన శిఖా నర్వాల్ - సాగర్‌పై విజయం సాధించింది. అంతకుముందు అర్హత రౌండ్లో శిఖా - సాగర్ (580), ఇషా - సామ్రాట్ (579) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో సంహితకు మూడు స్వర్ణాలు
ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలిక సంహిత సత్తాచాటింది. అండర్-8 విభాగంలో పోటీ పడ్డ ఆమె స్టాండర్డ్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో బాలికల టీమ్ విభాగాల్లో మూడు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. చార్వి, పూజశ్రీ, సంహితతో కూడిన భారత త్రయం టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసింది. మూడు విభాగాల్లోనూ ప్రత్యర్థి జట్లను చిత్తుచేసి ఛాంపియన్లుగా నిలిచింది. మరోవైపు అండర్-8 బాలికల వ్యక్తిగత విభాగంలో సంహిత కాంస్యం సొంతం చేసుకుంది.
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాగర్‌కు రెండు పతకాలు
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాగర్ డాంగీ సత్తా చాటాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రజతం గెలిచిన సాగర్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణ పతక మ్యాచ్‌లో సాగర్ 12-16తో గావో జింకాంగ్ (చైనా) చేతిలో ఓడాడు. మరో భారత షూటర్ వరుణ్ తోమర్ కాంస్యం గెలుచుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో సాగర్, వరుణ్, సామ్రాట్‌లతో కూడిన భారత జట్టు పసిడి నెగ్గింది. ఫైనల్లో మన జట్టు 16-8తో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించింది. జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో నాన్సీ, కార్తీక్, రవిశంకర్ కాంస్యం నెగ్గారు.
అంధుల ప్రపంచకప్ జట్టు సారథి అజయ్
అంధుల టీ20 ప్రపంచకప్‌లో బరిలో దిగే భారత జట్టుకు తెలుగు కుర్రాడు అజయ్ కుమార్ రెడ్డి సారథ్యం వహిస్తాడు. మరో తెలుగబ్బాయి వెంకటేశ్వరరావు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అజయ్, వెంకటేశ్వర రావుతో పాటు రవి, దుర్గారావులు భారత జట్టులో చోటు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం నలుగురు కుర్రాళ్లు భారత జట్టుకు ఎంపికవడం విశేషం. ఈ ఏడాది డిసెంబరు 6 నుంచి 17 వరకు భారత్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. నేపాల్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, భారత్ బరిలో దిగుతాయి.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనీశ్, సిమ్రన్ జోడీకి రజతం
అనీశ్, సిమ్రన్ ప్రీత్ కౌర్ బ్రార్ జోడీ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచింది. ఫైనల్లో భారత ద్వయం 14-16తో ఉక్రెయిన్‌కు చెందిన యులియా కొరొస్టిలోవా, మక్సిమ్ హొరోదినెట్స్ జంట చేతిలో ఓడిపోయింది. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్‌లో వర్ష సింగ్ 0.2 పాయింట్లతో కాంస్య పతకం కోల్పోయింది. ఇందులో మూడు పతకాలనూ చైనానే గెలుచుకుంది. క్వాలిఫికేషన్‌లో అగ్రస్థానం సాధించిన ఇషా సింగ్ అయిదో స్థానంతో సరిపెట్టుకుంది.
ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వికాస్, నితీష్‌లకు కాంస్యాలు
ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరో రెండు పతకాలు భారత్ సొంతమయ్యాయి. గ్రీకో రోమన్‌లో వికాస్ (72 కేజీలు), నితీష్ (97 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. కాంస్య పతక పోరులో వికాస్ 6-0తో డిగో కొబాయాషి (జపాన్)ని ఓడించగా ఐగర్ ఫెర్నాండో (బ్రెజిల్)పై నితీష్ సాంకేతిక ఆధిపత్యంతో విజయం సాధించాడు.
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో రమితకు స్వర్ణం
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. జూనియర్ మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో రమిత పసిడి నెగ్గింది. స్వర్ణ పోరులో ఆమె 16-12తో యింగ్ షెన్ (చైనా)పై గెలిచింది. అర్హత రౌండ్లో నాలుగో స్థానం (629.6)లో నిలిచిన ఆమె ర్యాంకింగ్ రౌండ్లో అగ్రస్థానం (262.8) దక్కించుకుంది. అర్హత రౌండ్లో 633.4 స్కోరుతో ప్రపంచ రికార్డు సమం చేసిన మరో భారత షూటర్ తిలోత్తమ ర్యాంకింగ్ రౌండ్లో 261 పాయింట్ల ప్రదర్శనతో కాంస్యం నెగ్గింది. జూనియర్ మహిళల 50 మీ. పిస్టల్ విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు భారత్ ఖాతాలోనే చేరాయి. దివాన్షి (547), వర్ష (539), టియానా (523) వరుసగా తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. మహిళల 25 మీ. స్టాండర్డ్ పిస్టల్‌లో రిథమ్ సంగ్వాన్ (573) రజతం సొంతం చేసుకుంది. జూనియర్ పురుషుల 50 మీ. పిస్టల్‌లో అభినవ్ (546) వెండి పతకం అందుకున్నాడు. పురుషుల 25 మీ. పిస్టల్‌లో విజయ్‌వీర్ (574) కాంస్యం గెలిచాడు. 10 స్వర్ణాలు, 5 రజతాలు, 10 కాంస్యాలు కలిపి 25 పతకాలతో భారత్ పట్టికలో చైనా తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది.
అండర్-23 ప్రపంచ రెజ్లింగ్‌లో సాజన్‌కు కాంస్యం
యువ రెజ్లర్ సాజన్ భన్వాలా చరిత్ర సృష్టించాడు. అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన భారత తొలి గ్రీకో రోమన్ రెజ్లర్‌గా రికార్డు నమోదు చేశాడు. కాంస్య పతక పోరులో దిమిత్రో వెసెస్కీ (ఉక్రెయిన్)పై అతను గెలిచాడు. రెజ్లర్లిద్దరూ పదేసి పాయింట్ల చొప్పున గెలిచినప్పటికీ చివరి పాయింట్‌ను నెగ్గిన సాజన్ విజేతగా నిలిచాడు. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో అతను మాల్దోవా రెజ్లర్ అలెగ్జాండ్రిన్ చేతిలో ఓడాడు. కానీ అలెగ్జాండ్రిన్ ఫైనల్ చేరడంతో రెపిఛేజ్ ఆడే అవకాశం దక్కించుకున్న సాజన్ కాంస్య పతకం గెలిచాడు.
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌లో ఉత్తమ మహిళా అథ్లెట్‌గా జ్యోతి
100 మీటర్ల హార్డిల్స్‌ను 13 సెకన్లలోపు పూర్తి చేసిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో ఉత్తమ మహిళా అథ్లెట్‌గా నిలిచింది. రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆమె 12.82 సెకన్లలోనే రేసు ముగించి పసిడితో పాటు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును మెరుగుపర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో 1174 పాయింట్లు ఖాతాలో వేసుకుని ఉత్తమ అథ్లెట్‌గా నిలిచింది. పురుషుల్లో షాట్‌పుట్ అథ్లెట్ తజిందర్ సింగ్ (1162 పాయింట్లు) ఉత్తమ అథ్లెట్ అవార్డు దక్కించుకున్నాడు. ఓవరాల్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ను రైల్వేస్ కైవసం చేసుకుంది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సంచలనం ఇషా సింగ్ మరో టీమ్ పసిడిని ఖాతాలో వేసుకుంది. ఇషా, శిఖా నర్వాల్, వర్ష సింగ్‌తో కూడిన భారత త్రయం జూనియర్ మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. పసిడి పోరులో భారత్ 16-6 తేడాతో చైనాపై గెలిచింది. అంతకుముందు రెండు దశల అర్హత రౌండ్లో ఉత్తమ ప్రదర్శనతో ఇషా బృందం స్వర్ణ సమరానికి అర్హత సాధించింది. మరోవైపు జూనియర్ అమ్మాయిల రైఫిల్‌లో రమిత, నాన్సీ, తిలోత్తమ జట్టు 16-2తో చైనాపై నెగ్గి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. జూనియర్ పురుషుల ఎయిర్ రైఫిల్ జట్టు (ప్రతాప్ సింగ్, కార్తీక్, రవిశంకర్, విదిత్) 17-11తో చైనాపై పైచేయి సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ జూనియర్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో పాయల్ - ఆదర్శ్ జోడీ 17-9తో ఫెంగ్- యంగ్‌పాన్‌ను ఓడించి పసిడి దక్కించుకుంది. సమీర్ - తేజస్విని ద్వయం కాంస్య పతక పోరులో 16-2తో జిజావో- వాంగ్ (చైనా)పై గెలిచింది. భారత్ తొమ్మిది స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 20 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చైనా అగ్రస్థానంలో ఉంది.
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
బీసీసీఐలో సౌరభ్ గంగూలీ ప్రస్థానానికి తెరపడింది. మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీని కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎనుకున్నారు. గంగూలీ అధ్యక్షుడిగా ఉండగా కార్యదర్శిగా అతడితో కలిసి బీసీసీఐని నడిపించిన జై షాకు మరో అవకాశం దక్కింది. అతడి ఎన్నిక కూడా ఏకగ్రీవం అయింది. అశిష్ షేలార్ కొత్త కోశాధికారిగా, రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా, దేవ్‌జీత్ సైకియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోశాధికారి పదవి నుంచి దిగిపోయిన అరుణ్ ధూమల్ ఐపీఎల్ ఛైర్మన్ కానున్నాడు. బ్రిజేష్ పటేల్ స్థానాన్ని ధూమల్ భర్తీ చేయనున్నాడు. అతడితో పాటు అవిషేక్ దాల్మియా ఐపీఎల్ పాలక మండలిలో చోటు దక్కించుకున్నాడు.
‣ 1983 ప్రపంచకప్ విజయంతో చరిత్ర సృష్టించిన కపిల్ డెవిల్స్‌లో బిన్నీ కూడా సభ్యుడు. ఆ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల (18) వీరుడు బిన్నీనే కావడం విశేషం. సెమీస్, ఫైనల్ రెండింట్లోనూ బిన్నీ చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 2012లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న రోజర్ ప్రస్తుతం కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో బీసీసీఐ అధ్యక్ష పదవికి బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా టీమ్‌ఇండియా మాజీ ఆటగాడన్న సంగతి తెలిసిందే.
మహిళల ఐపీఎల్‌కు ఆమోదం: బీసీసీఐ ఏజీఎంలో మహిళల క్రికెట్‌కు సంబంధించి కీలక నిర్ణయం జరిగింది. మహిళల ఐపీఎల్‌కు ఏజీఎం ఆమోద ముద్ర వేసింది. అయిదు జట్లతో తొలి సీజన్ 2023 మార్చిలో జరగనుంది. త్వరలో ఐపీఎల్ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి జట్ల ఎంపిక, టోర్నీ విధి విధానాలపై నిర్ణయించనుంది.
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో స్మృతికి రెండో స్థానం
భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకును సాధించింది. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆమె ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా అమ్మాయి బేత్ మూనీ అగ్రస్థానంలో ఉంది. షెఫాలి వర్మ ఏడో స్థానంలో నిలిచింది. దీప్తి శర్మ కూడా కెరీర్ అత్యుత్తమ ర్యాంకు సాధించింది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆమె ఒక స్థానం ఎగబాకి రెండో స్థానంలో నిలిచింది.
100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి జాతీయ రికార్డు
100 మీటర్ల హర్డిల్స్‌లో 13 సెక్లన్ల లోపు ప్రదర్శన చేసిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజి రికార్డు సృష్టించింది. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ ఆమె జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల జ్యోతి 12.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో మేలో ఆమె 13.04 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు బద్దలైంది. ఇదే పోటీలో తెలంగాణ అమ్మాయి నందిని 13.51 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్యం దక్కించుకుంది. స్వప్న (ఝార్ఖండ్) 13.26 సెకన్ల టైమింగ్‌తో రజతం నెగ్గింది. ఇటీవల జాతీయ క్రీడల్లో జ్యోతి 12.79 సెకన్లతో కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఆసియా స్థాయిలో రెండో వేగవంతమైన హర్డిల్స్ అథ్లెట్ జ్యోతినే కావడం విశేషం. విశాఖకు చెందిన ఆమె భువనేశ్వర్‌లో శిక్షణ పొందుతోంది.
ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సన్‌పై గుకేశ్ విజయం
ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ సంచలనం సృష్టించాడు. ఎయిమ్ చెస్ ర్యాపిడ్ ఆన్‌లైన్ చెస్ టోర్నీలో కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌పై నెగ్గిన అత్యంత పిన్న వయస్కుడి (16 ఏళ్ల 4 నెలల 20 రోజులు)గా రికార్డు నెలకొల్పాడు. ప్రజ్ఞానంద (16 ఏళ్ల 6 నెలల 10 రోజులు) పేరిట ఉన్న రికార్డును తిరిగరాశాడు. గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన గుకేశ్ 29 ఎత్తుల్లో కార్ల్‌సన్‌పై గెలిచాడు. 12 రౌండ్లు ముగిసేసరికి అతను 21 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్టాఫ్ (25 పాయింట్లు - పోలెండ్) మెమెద్యరోవ్ (23 - అజర్‌బైజాన్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అర్జున్ (21) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సమీర్‌కు రజతం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ జూనియర్ పురుషుల విభాగం 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో భారత కుర్రాడు సమీర్ రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు 23 హిట్లతో రెండో స్థానంలో నిలిచాడు. చైనాకు షూటర్ వాంగ్ షివెన్ 25 హిట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. చైనాకే చెందిన షూటర్ లియు యాంగ్‌పాన్ కాంస్యం సాధించాడు.
షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత త్రయానికి స్వర్ణం
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు అయిదో స్వర్ణం లభించింది. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో రుద్రాంక్ష్, అర్జున్, కిరణ్‌లతో కూడిన జట్టు పసిడి పతకం సొంతం చేసుకుంది. టైటిల్ పోరులో భారత బృందం 16-10తో చైనా త్రయంపై విజయం సాధించింది. ఈ టోర్నీలో రుద్రాంక్ష్కు ఇది రెండో పసిడి. 10 మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో అతడు ఇంతకుముందు విజేతగా నిలిచాడు. మరో రజతం, కాంస్యం కూడా భారత్ ఖాతాలో చేరాయి. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ జూనియర్ ఈవెంట్లో మాన్వి జైన్, సమీర్ జోడీ రజతం సాధించింది. స్వర్ణ పతక పోరులో ఈ ద్వయం 3-17తో చైనా టీమ్ చేతిలో ఓడిపోయింది. ఇదే ఈ ఈవెంట్లో పాయల్ ఖత్రి, సాహిల్ దుధానె ద్వయం కాంస్యం గెలుచుకుంది. భారత్ మొత్తంగా అయిదు స్వర్ణాలు, రజతం, అయిదు కాంస్యాలతో పతకాల పట్టికలో చైన తర్వాత రెండో స్థానంలో ఉంది.
ఎయిమ్ చెస్ ర్యాపిడ్ ఆన్‌లైన్ టోర్నీలో తొలిసారి కార్ల్‌సన్‌పై అర్జున్ విజయం
భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను అతడు ఓడించాడు. గత నెలలో జులియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్‌లైన్ టోర్నీ ఫైనల్లో కార్ల్‌సన్ చేతిలో ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఛాంపియన్స్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఎయిమ్ చెస్ ర్యాపిడ్ ఆన్‌లైన్ టోర్నీ ప్రిలిమినరీ దశ ఏడో రౌండ్లో ఈ నార్వే దిగ్గజానికి అర్జున్ షాకిచ్చాడు. దూకుడుగా పావులు కదిపిన ఈ 19 ఏళ్ల తెలంగాణ కుర్రాడు 54 ఎత్తుల్లో ప్రత్యర్థిని ఓడించాడు. తొలి రౌండ్లో సహచర ఆటగాడు విదిత్ గుజరాతి చేతిలో ఓటమితో టోర్నీ మొదలెట్టిన అర్జున్ ఇప్పుడు ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. అయిదు, ఆరు, ఏడు గేమ్‌ల్లో వరుసగా గ్రాండెలియస్ (స్వీడన్), నరోడిస్కీ (అమెరికా), కార్ల్‌సన్‌పై గెలిచిన అతను ఎనిమిదో రౌండ్లో క్రిస్టాఫ్ (పోలండ్)తో డ్రా చేసుకున్నాడు. 15 రౌండ్ల ప్రిలిమినరీ దశలో అతని ఖాతాలో ప్రస్తుతం 15 పాయింట్లున్నాయి. ఉజ్బెకిస్థాన్ ఆటగాడు నొదిర్బెక్ (17), మెమెద్యారోవ్ (అజర్బైజాన్), కార్ల్‌సన్ (16), క్రిస్టాఫ్ (15) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ (12) ఆరో స్థానంలో ఉన్నాడు. విదిత్, ఆదిత్య, హరికృష్ణ వరుసగా 10వ, 11వ, 15వ స్థానాల్లో కొనసాగుతున్నారు. కార్ల్‌సన్‌ను ఓడించిన అయిదో భారత గ్రాండ్‌మాస్టర్‌గా అర్జున్ నిలిచాడు. ఇప్పటికే ఆనంద్, హరికృష్ణ, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద ఈ ప్రపంచ ఛాంపియన్‌పై గెలిచారు.
ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా శివాని
ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివాని రన్నరప్‌గా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో శివాని 19-21, 21-17, 17-21తో తాన్యా హేమంత్ చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో రోహన్ - సిక్కిరెడ్డి జోడీ 16-21, 21-11, 18-21తో సాయి ప్రతీక్- అశ్విని పొన్నప్ప జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
ఏడోసారి మహిళల ఆసియా కప్ భారత్ సొంతం
సూపర్ ఫామ్‌ను కొనసాగించిన భారత్ మహిళల ఆసియా కప్ టోర్నీలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. ఎనిమిదోసారి జరిగిన టోర్నీలో ఏడో టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సేన 8 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. స్మృతి మంధాన (51 నాటౌట్; 25 బంతుల్లో 6×4, 3×6) చెలరేగడంతో 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. షెఫాలి వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్ (2) విఫలమైనప్పటికీ, హర్మన్‌ప్రీత్ (11 నాటౌట్)తో కలిసి స్మృతి పని పూర్తి చేసింది. రేణుకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా, దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికైంది.
ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇషాకు స్వర్ణం
భారత షూటింగ్ సంచలనం ఇషా సింగ్ మరోసారి అదరగొట్టింది. ఈ తెలంగాణ టీనేజీ షూటర్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి పసిడి సొంతం చేసుకుంది. జూనియర్ మహిళల 25 మీ. పిస్టల్ విభాగంలో ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పతక పోరులో 29 పాయింట్లు సాధించిన ఆమె, చైనా షూటర్ ఫెంగ్ సిజుయాన్ (25)ను వెనక్కినెట్టింది. అర్హత రౌండ్లో 581 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచిన 17 ఏళ్ల ఇషా, ర్యాంకింగ్ మ్యాచ్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తుది పోరులో నిలకడగా లక్ష్యానికి గురి పెట్టి స్వర్ణం కైవసం చేసుకుంది. మరోవైపు ఉదయ్ వీర్ జూనియర్ పురుషుల 25మీ, స్టాండర్డ్ పిస్టల్ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. సమీర్ కాంస్యం నెగ్గాడు.
ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సబిత, అర్జున్‌లకు రజతాలు
ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యం లభించాయి. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో టీనేజర్ సబిత తొప్పో 14.17 సెకన్లలో రేసు ముగించి రెండో స్థానంలో నిలిచింది. బాలుర జావెలిన్ త్రో విభాగంలో అర్జున్ ఈటెను 70.98 మీటర్లు విసిరి రెండో స్థానం దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన హిమాంషు మిశ్రా (67.67 మీటర్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గాడు.
మహిళల పోల్‌వాల్ట్‌లో రెండోసారి రోసి జాతీయ రికార్డు
మహిళల పోల్‌వాల్ట్‌లో రోసి మీనా పాల్‌రాజ్ జోరు కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన ఈ అథ్లెట్ పదిహేను రోజుల వ్యవధిలో రెండోసారి జాతీయ రికార్డును తిరగరాసింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 4.21 మీటర్ల ఎత్తును అధిగమించింది. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (4.20 మీ)ను బద్దలుకొట్టింది. 2014లో వీఎస్ సురేఖ (4.15 మీటర్లు) నమోదు చేసిన రికార్డును 25 ఏళ్ల రోసి ఇటీవలే ముగిసిన జాతీయ క్రీడల్లో తిరగరాసింది.
ప్రపంచ షూటింగ్‌లో రుద్రాంక్ష్ పాటిల్‌కు స్వర్ణం
భారత యువ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణంతో సత్తా చాటాడు. తొలిసారి ఈ టోర్నీ బరిలో దిగిన 18 ఏళ్ల ఈ మహారాష్ట్ర షూటర్ స్వర్ణ పతక పోరులో 17-13తో డానిలో డెన్నిస్ (ఇటలీ)పై విజయం సాధించాడు. తుది సమరంలో రుద్రాంక్ష్ ఒక దశలో 4-8తో వెనుకబడ్డాడు. కానీ గొప్పగా పుంజుకున్న అతడు 9-13తో ప్రత్యర్థిని సమీపించాడు. ఆపై 13-13తో స్కోర్లు సమం చేశాడు. ఆ తర్వాత రెండు షాట్లలో డెన్నిస్ 10.4, 10.2 మాత్రమే షూట్ చేయగా రుద్రాంక్ష్ 10.7, 10.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. అంతకుముందు క్వాలిఫికేషన్‌లో 633.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన అతడు ర్యాంకింగ్ రౌండ్లో 261.9 పాయింట్లు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హ సాధించాడు. అభినవ్ బింద్రా తర్వాత ప్రపంచ షూటింగ్ టోర్నమెంట్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్వర్ణం గెలిచిన ఘనత రుద్రాంక్ష్దే. మొత్తం మీద ప్రపంచ షూటింగ్‌లో పసిడి గెలిచిన ఏడో భారత షూటర్ అతడు. ఈ విజయంతో రుద్రాంక్ష్ 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్తు కూడా సాధించాడు.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇషా బృందానికి కాంస్యం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న భారత మహిళల జట్టు కాంస్య పతకంతో మెరిసింది. 25 మీటర్ల పిస్టల్ మహిళల జూనియర్ టీమ్ కాంస్య పతక పోరులో ఇషా సింగ్, నామ్యా కపూర్, విభూతి భాటియాలతో కూడిన భారత బృందం 17-1తో జర్మనీపై విజయం సాధించింది. క్వాలిఫికేషన్ తొలి రౌండ్లో 856 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన భారత్ తర్వాత రౌండ్లో 437 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి జర్మనీతో కాంస్య పతక పోరులో తలపడింది. ఈ ఈవెంట్లో చైనా స్వర్ణం గెలవగా, కొరియా రజతం సాధించింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ బాలిక విభాగంలో నిశ్చల్ (616.9) ఎనిమిదో స్థానం, నుపుర్ (606.6) 34వ స్థానం సాధించగా 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ జూనియర్ బాలుర విభాగంలో సూర్య ప్రతాప్ (608.7) 13వ స్థానం, పంకజ్ (608.5) 14వ స్థానం, హర్ష (606) 20వ స్థానం, అడ్రియన్ (603.7) 27వ స్థానంలో నిలిచారు.
బాక్సింగ్‌లో హుసాముద్దీన్‌కు స్వర్ణం
జాతీయ క్రీడల్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నిజామాబాద్ కుర్రాడు పురుషుల 57 కేజీల విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 3-1 తేడాతో సచిన్ (హరియాణా)పై విజయం సాధించాడు. రింగ్‌లో పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. గుజరాత్‌లో 36వ జాతీయ క్రీడలు ముగిశాయి. 2023లో 37వ జాతీయ క్రీడలను నిర్వహించే గోవాకు క్రీడల పతాకాన్ని అందించారు.
‣ స్విమ్మర్లు సాజన్ ప్రకాశ్ (5 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం), హషిక (6 స్వర్ణాలు, 1 కాంస్యం) వరుసగా ఉత్తమ పురుష, మహిళా అథ్లెట్లుగా నిలిచారు. 61 స్వర్ణాలు, 35 రజతాలు, 32 కాంస్యాలతో సహా మొత్తం 128 పతకాలతో సర్వీసెస్ వరుసగా నాలుగో సారి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (39 స్వర్ణాలు, 38 రజతాలు, 63 కాంస్యాలు), హరియాణా (38 స్వర్ణాలు, 38 రజతాలు, 40 కాంస్యాలు) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
‣ దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు బరిలో దిగిన ఈ క్రీడల్లో తెలంగాణ (8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలు) 15వ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ (2 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు) 21వ స్థానానికి పరిమితం అయింది. 2015 క్రీడల్లో కంటే ఈ సారి ప్రదర్శన మరింతగా దిగజారింది. అప్పుడు తెలంగాణ 12వ స్థానం (8 స్వర్ణాలు, 14 రజతాలు, 11 కాంస్యాలు), ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం (6 స్వర్ణాలు, 3 రజతాలు, 7 కాంస్యాలు) దక్కించుకున్నాయి.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలోనే సూర్య
టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన జాబితాలో 838 పాయింట్లతో సూర్య రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కేఎల్ రాహుల్ 13, విరాట్ కోహ్లి 14, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 16వ ర్యాంకుల్లో నిలిచారు. పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (853) ప్రథమ, ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం (808) తృతీయ స్థానాల్లో ఉన్నారు. వన్డే బ్యాటింగ్ ర్యాంకిగ్స్‌లో విరాట్ కోహ్లి 7, రోహిత్ శర్మ 8 ర్యాంకుల్లో నిలిచారు.
లక్ష్యసేన్‌కు కెరీర్ అత్యుత్తమ ర్యాంకు
కామన్వెల్త్ క్రీడల ఛాంపియన్ లక్ష్యసేన్ కెరీర్ అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో పురుషుల సింగిల్స్‌లో ఒక ర్యాంకు మెరుగైన లక్ష్యసేన్ 8వ స్థానంలో నిలిచాడు. కిదాంబి శ్రీకాంత్ 11, హెచ్.ఎస్.ప్రణయ్ 13వ ర్యాంకులు సాధించారు. మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు ఆరో స్థానంలో కొనసాగుతోంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు - చిరాగ్‌శెట్టి జోడీ 8వ ర్యాంకు సాధించింది.
బధిరుల క్రికెట్ ఛాంపియన్‌గా భారత్
బధిరుల టీ20 ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. కెప్టెన్ వీరేంద్ర సింగ్ (50 నాటౌట్), ఇంద్రజిత్ యాదవ్ (40) రాణించారు. ఛేదనలో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా జట్టు 101 పరుగులకే ఆలౌట్ అయింది. డుప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశ్వంత్ (2/15), జితేందర్ త్యాగి (2/15), కుల్‌దీప్ సింగ్ (2/21) ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించారు. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలవడం విశేషం.
హర్మన్‌కు ఐసీసీ అవార్డు
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు సెప్టెంబరు నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డులు గెలుచుకున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సత్తాచాటిన హర్మన్ జట్టును ముందుండి నడిపించింది. హర్మన్ 3 మ్యాచ్‌ల్లో 221 సగటు, 103.27 స్ట్రైక్ రేటుతో 221 పరుగులు రాబట్టింది. 1999 తర్వాత ఇంగ్లాండ్‌పై భారత్‌కు సిరీస్ విజయాన్ని (3-0) అందించింది. ఇక గత నెలలో 10 టీ20 మ్యాచ్‌లాడిన రిజ్వాన్ ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు.
జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో కాంస్యం
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో కాంస్యం చేరింది. కనోయింగ్ పురుషుల కే4 500 మీటర్ల విభాగంలో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. హర్ష్ కుమార్, మహేంద్ర సింగ్, కునాల్, నివాస్ సింగ్‌తో కూడిన తెలంగాణ జట్టు ఒక్క నిమిషం 39.168 సెకన్లలో రేసు ముగించింది. సర్వీసెస్ (1:34.495 సె), మధ్యప్రదేశ్ (1:36.422 సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నాయి. ఇప్పటివరకూ కనోయింగ్‌లో రాష్ట్రానికి ఇది మూడో కంచు పతకం. మొత్తం మీద 8 స్వర్ణాలు, 7 రజతాలు, 8 కాంస్యాలు కలిపి 23 పతకాలతో తెలంగాణ పట్టికలో 14వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 2 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్యాలతో సహా 15 పతకాలతో 20వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పోల్ మల్లఖంబ్‌లో కాంస్యం గెలిచిన 10 ఏళ్ల గుజరాత్ బాలుడు శౌర్యజిత్, జాతీయ క్రీడల్లో పతకం నెగ్గిన అత్యంత పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు.
వెర్‌స్టాపెన్‌దే ప్రపంచ టైటిల్
రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ సాధించాడు. ఈ సీజన్‌లో ట్రాక్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ 25 ఏళ్ల నెదర్లాండ్స్ డ్రైవర్ ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. జపనీస్ గ్రాండ్ ప్రిలో జయకేతనం ఎగుర వేసి వరుసగా రెండో ఏడాదీ ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. రెండు గంటల తర్వాత తిరిగి 53కు గాను 28 ల్యాప్స్‌కు కుదించి రేసును మొదలెట్టారు. పోల్ పొజిషన్ నుంచి రేసు ప్రారంభించిన వెర్‌స్టాపెన్ 3 గంటల ఒక్క నిమిషం 44.004 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పెరెజ్ (రెడ్‌బుల్), లెక్లెర్క్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్ (మెర్సిడెజ్) అయిదో స్థానానికి పరిమితమయ్యాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ జాబితాలో 366 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న పెరెజ్ (253), లెక్లెర్క్ (252) మిగిలిన నాలుగు రేసుల్లో నెగ్గినా వెర్‌స్టాపెన్‌ను అధిగమించలేరు. అందుకే టైటిల్ వెర్‌స్టాపెన్‌కే దక్కింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 18 రేసుల్లో పోటీపడిన అతను 12 విజయాలు సాధించాడు.
జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్‌లో తెలంగాణకు స్వర్ణం
జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లు మెరిశాయి. పురుషుల విభాగంలో తెలంగాణ స్వర్ణం, ఆంధ్రప్రదేశ్ రజత పతకాలు సాధించాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 22-24, 23-21, 15-11తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందింది. తెలంగాణ జట్టులో కృష్ణ చైతన్య, మహేశ్, ఆంధ్రప్రదేశ్ తరఫున నరేశ్, కృష్ణంరాజు ప్రతిభ కనబరిచారు. కనోయింగ్‌లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు లభించాయి. సి1 1000 మీ. స్ప్రింట్‌లో ఫిరంబం అమిత్ కుమార్ సింగ్, సి2 1000 మీ. స్ప్రింట్‌లో ప్రదీప్ కుమార్ మూడో స్థానాల్లో నిలిచి కాంస్యాలు గెలుచుకున్నారు. బాక్సింగ్‌లో సెమీఫైనల్ చేరిన తెలంగాణ కుర్రాడు మహ్మద్ హుసాముద్దీన్ పతకం ఖాయం చేశాడు. 57 కేజీల క్వార్టర్స్‌లో అతడు రోహిత్ మోర్‌ను ఓడించి ముందంజ వేశాడు. పురుషుల టెన్నిస్ డబుల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొసరాజు శివదీప్/అనంతమణి ముని జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏపీ సెమీ ఫైనల్స్‌లో ప్రవేశించింది.
ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్) ఛాంపియన్‌షిప్స్‌లో పంకజ్‌కు 25వ టైటిల్
వరుసగా ప్రపంచ టైటిళ్లు సాధిస్తున్న భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ పంకజ్ అడ్వాణీ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్) ఛాంపియన్‌షిప్స్‌లో అతను జయకేతనం ఎగురవేశాడు. ఫైనల్లో 4-0 తేడాతో భారత్‌కే చెందిన సౌరభ్ కొఠారిపై విజయం సాధించాడు. ఇది పంకజ్‌కు 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. ఈ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా అయిదో టైటిల్. ఏడు ఫ్రేమ్‌ల ఫైనల్లో ఆరంభం నుంచే పంకజ్ దూకుడు ప్రదర్శించాడు. తొలి ఫ్రేమ్‌లో ఆటతీరుతోనే టైటిల్ అతనిదేనని స్పష్టమైంది. రికార్డు స్థాయిలో అయిదోసారి ఒకే క్యాలెండర్ ఏడాదిలో జాతీయ, ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు.
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో హర్షదకు కాంస్యం
ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి హర్షద గరుడ్ సత్తా చాటింది. మహిళల 45 కేజీల విభాగంలో ఆమె కాంస్యంతో మెరిసింది. స్నాచ్‌లో 68 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 84 కేజీలు ఎత్తిన ఈ భారత టీనేజర్ మొత్తం మీద 152 కేజీలు లిఫ్ట్ చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో కాంగ్ ఫెంగ్ (వియత్నాం, 166 కేజీలు) స్వర్ణం నెగ్గగా, హరిరో (ఇండోనేసియా, 162 కేజీలు) రజతం సాధించింది. ఈ మేలో జరిగిన జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో హర్షద స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పురుషుల స్కీట్ జట్టుకు కాంస్యం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. భవ్‌తేగ్ గిల్, రితురాజ్ బుండేలా, అభయ్ సింగ్ సెఖాన్‌లతో కూడిన పురుషుల స్కీట్ జట్టు కాంస్యం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో ఈ బృందం 6-2తో చెక్ రిపబ్లిక్‌పై విజయం సాధించింది. టోర్నీలో భారత్‌కిది నాలుగో పతకం. ఇప్పటికే పురుషుల ట్రాప్‌లో స్వర్ణం, జూనియర్ మహిళల స్కీట్‌లో రజతం, మిక్స్‌డ్ స్కీట్‌లో కాంస్యం దక్కాయి.
జాతీయ క్రీడల్లో వ్రితికి మరో పతకం
జాతీయ క్రీడల్లో తెలంగాణ సంచలన స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే మూడు పతకాలు సొంతం చేసుకున్న ఆమె మరో కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల 400 మీ. ఫ్రీస్టైల్ విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచింది. 4 నిమిషాల 34.98 సెకన్లలో ఆమె రేసు ముగించింది. రామచంద్రన్ హషిక (4:32.17 సె - కర్ణాటక) స్వర్ణం, భవ్య (4:32.80 సె - దిల్లీ) కాంస్యం సొంతం చేసుకున్నారు.
హర్మన్‌ప్రీత్ సింగ్‌కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అత్యున్నత పురస్కారం
భారత అగ్రశ్రేణి హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్ సింగ్ మరోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అత్యున్నత పురస్కారం దక్కించుకున్నాడు. ఈ డిఫెండర్ పురుషుల విభాగంలో ‘ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు. 26 ఏళ్ల హర్మన్‌ప్రీత్, టియున్ డి నూజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వైయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్‌డొరెన్ (బెల్జియం)ల తర్వాత వరుసగా రెండుసార్లు ఈ అవార్డును దక్కించుకున్న క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. హర్మన్‌ప్రీత్‌కు ఓటింగ్‌లో అత్యధికంగా 29.4 పాయింట్లు రాగా, థియెరీ బ్రింక్‌మన్ (నెదర్లాండ్స్), టామ్ బూన్ (బెల్జియం) వరుసగా 23.6, 23.4 పాయింట్లు సాధించారు. 2021 - 22 హాకీ ప్రొ లీగ్ సీజన్లో హర్మన్‌ప్రీత్ 16 మ్యాచ్‌లాడి 18 గోల్స్ చేశాడు. మహిళల్లో నెదర్లాండ్స్ క్రీడాకారిణి ఫెలిస్ ఆల్బర్స్ ఈ అవార్డును గెలుచుకుంది.
ప్రపంచ మహిళల 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో మెరిసిన విద్య, వర్ష
ప్రపంచ మహిళల 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల విద్య పిళ్లై, వర్ష సంజీవ్ పతకాలతో మెరిశారు. విద్య రజతం, వర్ష కాంస్యం గెలిచారు. ప్రపంచ టీమ్ స్నూకర్ మాజీ ఛాంపియన్ విద్య ఫైనల్లో 0-4 తేడాతో వరాతనన్ సుక్రితేన్స్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. గ్రూప్- బిలో అగ్రస్థానంలో నిలిచి, నాకౌట్‌లోనూ సత్తాచాటి తుదిపోరు చేరిన ఆమె చివరకు వరాతనన్ చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్-సిలో అగ్రస్థానంతో ముందంజ వేసిన వర్ష సెమీస్‌లో 0-3తో వరాతనన్ చేతిలోనే ఓడి కాంస్యంతో సంతృప్తి చెందింది. మరోవైపు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్) ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న ఏడుగురు భారత ఆటగాళ్లూ నాకౌట్‌కు అర్హత సాధించారు. పంకజ్ అడ్వాణీ, శ్రీకృష్ణ, రోహన్, ధ్వజ్ హరియా, సౌరభ్, లౌకిక్, ధ్రువ్ ముందంజ వేశారు.
జాతీయ క్రీడల్లో సాయిప్రణీత్‌కు స్వర్ణం
జాతీయ క్రీడల్లో తెలంగాణ జోరు కొనసాగుతోంది. మూడు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. బ్యాడ్మింటన్‌లో భమిడిపాటి సాయిప్రణీత్, సిక్కిరెడ్డి- పుల్లెల గాయత్రి గోపీచంద్ జోడీ బంగారు పతకాలతో మెరిశారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సాయిప్రణీత్ 21-11, 12-21, 21-16తో మిథున్ మంజునాథ్ (కర్ణాటక)పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- గాయత్రి జోడీ 21-14, 21-11తో శిఖ గౌతమ్ - అశ్విని భట్ (కర్ణాటక) జంటపై గెలుపొందింది. బాస్కెట్‌బాల్ 3×3లో స్వర్ణం నెగ్గిన తెలంగాణ బాస్కెట్‌బాల్ జట్టు 5×5 విభాగంలోనూ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో తెలంగాణ 67-62తో తమిళనాడుపై విజయం సాధించింది. పుష్ప (23 పాయింట్లు), ప్రియాంక (14), అంబరాశి (13) తెలంగాణ విజయంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ స్విమ్మర్ వ్రితి మరో రెండు పతకాలు సాధించింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజతం, 200 మీటర్ల బటర్‌ఫ్లై పోటీలో కాంస్యం నెగ్గింది. ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు రజతం లభించింది.
ఉత్తమ గోల్‌కీపర్లుగా శ్రీజేశ్, సవిత
భారత స్టార్ పీఆర్ శ్రీజేశ్ ఎఫ్‌ఐహెచ్ ‘గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో సవితా పునియా ‘గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచింది. ఉత్తమ గోల్‌కీపర్లుగా నిలవడం వీరికిది వరుసగా రెండో ఏడాది. నిపుణులు, జట్లు, అభిమానులు, మీడియా పాల్గొన్న ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా వీళ్లను అవార్డులకు ఎంపిక చేశారు. శ్రీజేశ్ 39.3 పాయింట్లతో అగ్రస్థానంలో సాధించగా సవిత 37.6 పాయింట్లతో ముందు నిలిచింది.
భారత కోచ్‌లకూ అవార్డులు: భారత పురుషులు, మహిళల జట్ల కోచ్‌లు గ్రాహం రీడ్, జెనెకె చాప్‌మాన్‌లనూ అవార్డులు వరించాయి. తమ తమ విభాగాల్లో రీడ్, చాప్‌మాన్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. ఓటింగ్‌లో వారికి ఎక్కువ ఓట్లు లభించాయి.
జాతీయ క్రీడల్లో జ్యోతికి స్వర్ణం
జాతీయ క్రీడల్లో తెలుగమ్మాయిలు జ్యోతి యర్రాజి (ఆంధ్రప్రదేశ్), అగసర నందిని (తెలంగాణ) సత్తాచాటారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ, రజత పతకాలతో మెరిశారు. ఈ పరుగును జ్యోతి 12.79 సెకన్లలో ముగించి అగ్రస్థానం సాధించింది. 13.38 సెకన్లలో రేసును పూర్తిచేసిన నందిని ద్వితీయ స్థానంలో నిలిచింది. ద్రోణాచార్య నాగపురి రమేశ్ దగ్గర వీళ్లిద్దరూ శిక్షణ తీసుకున్నారు. 13.04 సెకన్లతో జ్యోతి పేరిట జాతీయ రికార్డు ఉంది. ఇప్పటికే జ్యోతి 100 మీ. పరుగులో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. మరో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ రష్మి కె.షెట్టి జావెలిన్ త్రో పోటీలో ఈటెను 53.95 మీ. దూరం విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
ముంతాజ్‌కు ఎఫ్‌ఐహెచ్ పురస్కారం
భారత హాకీ ఫార్వర్డ్ ముంతాజ్ ఖాన్‌కు ఎఫ్‌ఐహెచ్ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను ‘ఎఫ్‌ఐహెచ్ మహిళల రైజింగ్ స్టార్’ అవార్డు ముంతాజ్‌ను వరించింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో 19 ఏళ్ల ముంతాజ్ ప్రదర్శనకు ఈ గుర్తింపు దక్కింది. ఈ టోర్నీలో ముంతాజ్ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్ సాధించింది. అందులో ఒక హ్యాట్రిక్ ఉండటం విశేషం. టోర్నీలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి జెమీమా
భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించింది. ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన 22 ఏళ్ల జెమీమా ఈ టోర్నీలో ఇప్పటిదాకా రెండు అర్ధసెంచరీలు చేసి నాలుగు స్థానాలు మెరుగై ఎనిమిదో ర్యాంకులో నిలిచింది. జెమీమా, టాప్-10లో ఉన్న మూడో భారత బ్యాటర్. స్మృతి మంధాన మూడో ర్యాంకులో ఉండగా షెఫాలివర్మ ఏడో స్థానంలో కొనసాగుతోంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13వ ర్యాంకులో ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ బెత్ మూనీ అగ్రస్థానం సాధించింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ ఏడో ర్యాంకులో ఉండగా ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎకీల్‌స్టోన్ నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది.
శ్రీకృష్ణకు ప్రపంచ 6-రెడ్ స్నూకర్ టైటిల్
భారత క్రీడాకారుడు శ్రీకృష్ణ సూర్యనారాయణన్ ప్రపంచ 6-రెడ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 5-1 ఫ్రేమ్‌ల తేడాతో బహ్రెయిన్‌కు చెందిన హబీబ్ సబాను ఓడించి టైటిల్ అందుకున్నాడు. గత ఏడాది ఈ టోర్నీలో భారత్‌కే చెందిన లక్ష్మణ్ రావత్ విజేతగా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్ అంపైర్‌గా నితిన్
ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత అంపైర్ నితిన్ మేనన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మొత్తం 16 మంది అంపైర్లు విధులు నిర్వహిస్తుండగా భారత్ నుంచి నితిన్ ఒక్కడికే అవకాశం దక్కింది. భారత్ తరఫున ఏకైక ఐసీసీ ఎలీట్ అంపైర్ కూడా అతనే. ప్రపంచకప్ కోసం నితిన్ ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ అంపైర్లు: నితిన్ మేనన్, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్, అలీం దార్, ఎహసాన్ రాజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫానీ, జోయెల్ విల్సన్, కుమార ధర్మసేన, లాంగ్టన్ రుసెర్, మరియస్ ఎరాస్మస్, మైకెల్ గాఫ్, పాల్ రైఫిల్, పాల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటెల్‌బొరో, రోడ్నీ టక్కర్
రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మదుగలె
జాతీయ క్రీడల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జోరు
జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారుల చక్కటి ప్రదర్శన కొనసాగుతోంది. తెలంగాణ మూడు స్వర్ణాలు, ఒక రజతం, మరో కాంస్యం సొంతం చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రెండు రజతాలు, మూడు కాంస్యాలు దక్కాయి. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో తెలంగాణ 3-0తో కేరళపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి- సిక్కిరెడ్డి జోడీ 21-15, 14-21, 21-14తో అర్జున్ - ట్రీసా జాలీ జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 18-21, 21-16, 22-20తో హెచ్.ఎస్.ప్రణయ్‌పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో సామియా ఇమాద్ ఫారూఖీ 21-5, 21-12తో గౌరీకృష్ణపై గెలిచి తెలంగాణ జట్టుకు విజయాన్ని అందించింది. మహిళల ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్‌లో తెలంగాణ అమ్మాయి రియా సాబూ స్వర్ణంతో మెరిసింది. 112.4 పాయింట్లతో రియా ప్రథమ స్థానం సాధించింది. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు కుల సాయి సంహిత (107) రజతం, భూపతిరాజు అన్మిష (97.8) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. స్విమ్మింగ్‌లో వ్రితి అగర్వాల్ రజతం సాధించింది. 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో వ్రితి (9 నిమిషాల 23.91 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో తెలంగాణ పురుషుల జట్టు కాంస్యం సాధించింది. 8 ప్లస్ కాక్స్‌విన్‌లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజు, చరణ్‌సింగ్, మహేశ్వర్‌రెడ్డి, గజేంద్రయాదవ్, నవదీప్, హర్‌ప్రీత్‌సింగ్, శ్రీకాంత్ (కాక్స్)లతో కూడిన తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మహిళల 3×3 బాస్కెట్‌బాల్‌లో తెలంగాణ జట్టు బంగారు పతకం దక్కించుకుంది. ఫైనల్లో తెలంగాణ 17-13తో కేరళపై విజయం సాధించింది. పుష్ప, అశ్వతి థంపి, అంబరాశి సత్తాచాటారు. జిమ్నాస్టిక్స్ మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షేక్ యాసిన్ ద్వితీయ స్థానంలో నిలిచి రజతం సాధించింది. మహిళల హెప్టాథ్లాన్‌లో ఎం.సౌమియా, వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగం 87 కేజీల విభాగంలో టి.సత్యజ్యోతి కాంస్యాలు అందుకున్నారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ సెమీస్‌లో చరణ్య, సూర్య హంసిని, షణ్ముఖి నాగసాయి, రూప చంద్రహాసినిలతో కూడిన రాష్ట్ర బృందం 228-225తో దిల్లీ జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించడం ద్వారా పతకం ఖాయం చేసుకుంది.
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. మరో రెండు రజతాలు ఆ రాష్ట్రం ఖాతాలో చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో పల్లవి, ట్రిపుల్ జంప్‌లో కార్తీక వెండి పతకాలు గెలుచుకున్నారు. 64 కేజీల విభాగంలో స్నాచ్‌లో 88, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కలిపి మొత్తం 199 కేజీల ప్రదర్శనతో పల్లవి రెండో స్థానంలో నిలిచింది. జస్విర్ కౌర్ (200 కేజీలు - పంజాబ్) స్వర్ణం, రోషిలత (197 కేజీలు - మణిపూర్) కాంస్యం గెలిచారు. ట్రిపుల్ జంప్‌లో 12.85 మీటర్ల దూరం దూకిన కార్తీక ద్వితీయ స్థానం దక్కించుకుంది. షీనా (13.37 మీ. - కేరళ), పూర్వ సావంత్ (12.76 మీ. - మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గారు. మరో ఏపీ అథ్లెట్ అనూష (12.72 మీ.) నాలుగో స్థానంలో నిలిచింది..
రష్మీకి రజతం: మహిళల స్కీట్ విభాగంలో తెలంగాణ షూటర్ రష్మీ రాథోడ్ రజతం గెలిచింది. ఫైనల్లో ఆమె 25 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గణేమత్ (28 - పంజాబ్), శివాని (17 - మధ్యప్రదేశ్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల 3×3 బాస్కెట్‌బాల్‌లో తెలంగాణ ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఆ జట్టు 21-14తో మహారాష్ట్రపై గెలిచింది. తుది పోరులో కేరళతో తెలంగాణ తలపడుతుంది. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ తెలంగాణ టైటిల్ పోరుకు చేరింది. సెమీస్‌లో జట్టు 3-2తో మహారాష్ట్రపై నెగ్గింది. సాయి ప్రణీత్ 21-10, 21-14తో వరుణ్‌పై, సుమీత్ - విష్ణువర్ధన్ 18-21, 21-19, 23-21తో విప్లవ్ - చిరాగ్‌పై, సిక్కిరెడ్డి - గాయత్రి 21-9, 21-16తో సిమ్రాన్ - రితికపై గెలిచి జట్టుకు విజయాన్ని అందించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో విష్ణువర్ధన్ - గాయత్రి, మహిళల సింగిల్స్‌లో ఫరూఖీ ఓడిపోయారు. ఈ క్రీడల్లో మహారాష్ట్ర అమ్మాయి యశ్వితో జతకట్టిన హైదరాబాద్ స్కేటర్ రాహుల్ అదే రాష్ట్రం తరపున పసిడి దక్కించుకున్నాడు. జోడీ నృత్య విభాగంలో ఈ జంట అగ్రస్థానంలో నిలిచింది..
జాతీయ క్రీడల్లో ఇషా, జ్యోతిలకు స్వర్ణాలు
జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. తెలంగాణ షూటర్ ఇషా సింగ్, ఆంధ్రప్రదేశ్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజి బంగారు పతకాలు గెలిచారు. మహిళల 25మీ. పిస్టల్ విభాగంలో స్టార్ షూటర్ ఇషా అంచనాలకు తగ్గట్లు ఛాంపియన్‌గా నిలిచింది. మను బాకర్ (583)ను వెనక్కినెట్టి అర్హత రౌండ్లో 584 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన ఆమె.. తుదిపోరులోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఫైనల్లో 26 పాయింట్లతో పసిడి పట్టేసింది. రిథమ్ సింగ్ (25- హరియాణా), అభిద్న (19- మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. రోలర్ స్కేటింగ్ ఆర్టిస్టిక్ జోడీ నృత్య విభాగంలో కాంతి- జుహిత్ (తెలంగాణ) జోడీ కంచు పతకం సొంతం చేసుకుంది. 71 పాయింట్లతో ఈ జంట మూడో స్థానాన్ని దక్కించుకుంది. యశస్వి- రాహుల్ (90.8- మహారాష్ట్ర), నటాలియా- ఆదిత్య (79- తమిళనాడు) జోడీలు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పతక పరుగులు: 110మీ. హార్డిల్స్‌లో జాతీయ రికార్డు కలిగి ఉన్న జ్యోతి.. ఈ క్రీడల్లో మహిళల 100మీ. పరుగులో ఛాంపియన్‌గా నిలిచింది. 11.51 సెకన్లలో రేసు ముగించి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. జాతీయ క్రీడల్లో ఇదే అత్యుత్తమ టైమింగ్. అర్చన (11.55సె- తమిళనాడు) రజతం, దియాండ్ర (11.62సె- మహారాష్ట్ర) కాంస్యం నెగ్గారు. ద్యుతి చంద్ (11.69సె), హిమదాస్ (11.74సె) లాంటి స్టార్ స్ప్రింటర్లు వరుసగా 6, 7 స్థానాల్లో నిలవడం గమనార్హం. మహిళల 400మీ. పరుగులో మరో ఏపీ అథ్లెట్ జ్యోతిక శ్రీ రజతం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 53.30 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఐశ్వర్య (52.62సె- మహారాష్ట్ర), రూపల్ (53.41సె- ఉత్తరప్రదేశ్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలం రాజు (ఏపీ) వెండి పతకం సాధించాడు. మొత్తం 270 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సుభాష్ (275 కేజీలు- సర్వీసెస్) పసిడి నెగ్గాడు.