సైన్స్ అండ్ టెక్నాలజీ

శరవేగంగా బ్యాటరీ ఛార్జింగ్‌

ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, విద్యుత్‌ వాహనాలను అత్యంత వేగంగా ఛార్జ్‌ చేసేందుకు మార్గం సుగమం కాబోతోంది. ఈ దిశగా గాంధీనగర్‌లోని ఐఐటీ, జపాన్‌ అడ్వాన్స్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధకులు కొత్త యానోడ్‌ పదార్థాన్ని రూపొందించారు. లిథియం బ్యాటరీలను నిమిషాల్లోనే రీఛార్జి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. టైటానియం డైబోరైడ్‌తో రూపొందిన నానో ఫలకాలతో ఈ 2డీ యానోడ్‌ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. పెద్దగా సాధన సంపత్తి అవసరం లేకుండానే ఈ పదార్థాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చు. ఈ పదార్థంతో రూపొందిన యానోడ్‌ వేగంగా బ్యాటరీని ఛార్జి చేయడమే కాకుండా దీర్ఘకాల మన్నిక కూడా కలిగి ఉంటుంది. ‣ ప్రస్తుతం వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న లిథియం-అయాన్‌ బ్యాటరీల్లో గ్రాఫైట్, లిథియం టైటానేట్‌ పదార్థాలను యానోడ్‌గా ఉపయోగిస్తున్నారు. గ్రాఫైట్‌ యానోడ్‌తో కూడిన లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ఇంధన సాంద్రత చాలా ఎక్కువ. ఒక్కసారి ఛార్జి చేస్తే వందల కిలోమీటర్ల పాటు విద్యుత్‌ వాహనాన్ని నడపొచ్చు. అయితే వాటికి అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువ. వాటితో పోలిస్తే లిథియం టైటానేట్‌ యానోడ్లు సురక్షితమైనవే. వాటితో వేగంగా ఛార్జి చేయవచ్చు. అయితే ఆ పదార్థంతో తయారైన బ్యాటరీల్లో ఇంధన సామర్థ్యం తక్కువ. అందువల్ల చాలా తరచుగా రీఛార్జి చేయాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను టైటానియం డైబోరైడ్‌ యానోడ్‌తో అధిగమించొచ్చు.

మొండి బ్యాక్టీరియాకు సహజసిద్ధ చికిత్స

ఔషధాలకు లొంగని మొండి బ్యాక్టీరియాకు సమర్థ విరుగుడును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సూడోమోనాస్‌ ఆరుగినోసా అనే ఈ సూక్ష్మజీవి ఎక్కువగా ఆసుపత్రిలోని రోగుల్లో కనిపిస్తుంటుంది. శస్త్రచికిత్సల అనంతరం రక్తం, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల్లో ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తుంటుంది. అనేక రకాల యాంటీబయాటిక్స్‌ దీనిపై పనిచేయవు. హైడ్రోక్వినైన్‌ను ఈ బ్యాక్టీరియాపై శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ సేంద్రియ పదార్థం కొన్ని రకాల చెట్ల బెరడులో ఉంటుంది. ఈకోలీ, క్లెబ్సియెల్లా నిమోనియే, స్టాఫిలోకోకస్‌ ఆరస్‌ సహా అనేక రకాల బ్యాక్టీరియాను చంపేసే సామర్థ్యం దీనికి ఉందని ఇటీవల గుర్తించారు. - తాజాగా సూడోమోనాస్‌పైనా ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ మందును ప్రయోగించినప్పుడు బ్యాక్టీరియాలోని ఎలాంటి జన్యువులు స్విచ్చాన్‌ లేదా స్విచ్చాఫ్‌ అవుతున్నాయన్నది పరిశీలించారు. హైడ్రోక్వినైన్‌ వల్ల ఈ సూక్ష్మజీవిలోని వ్యాధి వ్యాప్తి సామర్థ్యంలో గణనీయంగా మార్పు వస్తున్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా కదలికలపైనా ప్రభావం ఉంటోందని కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ మందును ఇతర ఔషధాలతో కలిపి సూడోమోనాస్‌కు సమర్థ విరుగుడును తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

పత్తిపై ప్రయోగం విజయవంతం

తెలంగాణ‌ రాష్ట్రంలో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా అధిక సాంద్రత విధానంలో చేపట్టిన పత్తి సాగు విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానంలో తొలిసారిగా 22 వేల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున ప్రోత్సాహకంగా అందజేసింది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభంలో అధిక వర్షాలతో పంటపై తీవ్ర ప్రభావం పడింది. అయినా వాతావరణ పరిస్థితులను తట్టుకుని కొత్త విధానంలో చేపట్టిన పత్తిసాగు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్పారు. వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనూ ఈ విధానంలో సాగు చేయగా ఎకరాకు 12-14 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు సహ పరిశోధన సంచాలకుడు ఉమారెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలోనూ ఈ విధానంలో సాగు చేసిన పత్తిని ఓ రైతు కోయగా ఎకరాకు 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు గుర్తించారు. ‣ సాధారణ విధానంలో ఎకరాకు 8 వేల మొక్కలు వచ్చేలా విత్తనాలు వేస్తే, అధిక సాంద్రత విధానంలో 25 వేల మొక్కలు వచ్చేలా విత్తుతారు. బ్రెజిల్‌ తదితర దేశాల్లో ఈ విధానంలోనే సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.

క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు సంబంధించిన శక్తిమంతమైన రాకెట్‌ ఎల్‌వీఎం-3లో ఉపయోగించే క్రయోజెనిక్‌ ఇంజిన్‌ (సీఈ-20) పరీక్ష విజయవంతంగా సాగింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో ఇది జరిగింది. ఫ్లైట్‌ యాక్సెప్టెన్స్‌ హాట్‌ టెస్ట్‌ పేరుతో జరిగిన ఈ పరీక్ష 25 సెకన్ల పాటు సాగింది. వన్‌వెబ్‌ ఇండియా-1కు చెందిన మరో 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ఉపయోగించే ఎల్‌వీఎం-3 రాకెట్‌లో ఈ ఇంజిన్‌ భాగంగా ఉంటుంది. సీఈ-20 ఇంజిన్‌ ద్రవ హైడ్రోజన్, ఆక్సిజన్‌లతో పనిచేస్తుంది. ఇది 186 కిలోన్యూటన్‌ శక్తిని అందిస్తుంది. తాజా పరీక్షలో ఇంజిన్‌ హార్డ్‌వేర్, ఉప వ్యవస్థల పనితీరును క్షుణ్నంగా పరిశీలించినట్లు ఇస్రో అధికారులు వివరించారు. అన్ని వ్యవస్థలూ సంతృప్తికరంగా పనిచేశాయని డేటా విశ్లేషణలో వెల్లడైనట్లు తెలిపారు.

అంగారకుడి ఉపరితలాన్ని తీర్చిదిద్దిన అగ్నిపర్వతాలు

అంగారకుడి ఉపరితలాన్ని తీర్చిదిద్దడంలో అక్కడి అగ్నిపర్వతాలు కీలక పాత్ర పోషించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ గ్రహం లోపలి నుంచి వెలువడిన స్వల్ప స్థాయి ప్రకంపనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. దీన్నిబట్టి అంగారకుడి అంతర్భాగంలో ద్రవీకృత లావా ఉండొచ్చని పేర్కొన్నారు. అక్కడి అగ్నిపర్వత చర్యలకు అదే మూలమని తెలిపారు. అరుణ గ్రహంలోని సెర్బెరస్‌ఫాసే గ్రాబెన్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న 20 ప్రకంపనలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. దీంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించి వ్యోమనౌకలు తీసిన చిత్రాలనూ పరిశీలించారు. అక్కడ గాలి వీచే దిశలోనే కాకుండా చుట్టుపక్కల అన్ని దిక్కుల్లోనూ ధూళి పోగుపడినట్లు గుర్తించారు. గడిచిన 50 వేల ఏళ్లలో నేల లోపల లావా క్రియాశీలమై ఉంటుందని, ఫలితంగా ఉపరితల తీరుతెన్నుల్లో మార్పు జరిగిందనడానికి ఇది నిదర్శనమని తెలిపారు.

మేఘాలతో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుతున్న తేడాలు

ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోజువారీ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య తేడాలు తగ్గిపోవడానికి కారణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరుధ్యాలను డైయుర్నల్‌ టెంపరేచర్‌ రేంజ్‌ (డీటీఆర్‌)గా పిలుస్తుంటారు. సీజన్లు, పంట దిగుబడులు, ఇంధన వినియోగం, మానవ ఆరోగ్యంపై ఇది పెను ప్రభావం చూపుతుంటుంది. డీటీఆర్‌ క్షీణిస్తోందని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి కారణాలు మాత్రం అంతుచిక్కకుండా ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు పెరగడం వల్లే ఇలా జరిగిందని తాజాగా అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. దీనివల్ల పగటి సమయంలో సూర్యుడి నుంచి వచ్చే షార్ట్‌వేవ్‌ రేడియోధార్మికతకు అడ్డుకట్ట పడుతోందని వివరించింది. ఫలితంగా గరిష్ఠ ఉష్ణోగ్రత చాలా తక్కువగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ముక్కులోని 4 జన్యువులపై కరోనా ప్రభావం

కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తున్న నాలుగు ముఖ్యమైన జన్యువులను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వైరస్‌ సోకినప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే అంశంపై వీరు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ వైరస్‌ ప్రధానంగా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్న సంగతి తెలిసిందే. ముక్కు లోపల 17 రకాల రోగనిరోధక జన్యువులు ఉంటాయి. ఈ డిఫెన్సిన్‌ జీన్స్‌ అన్నింటిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు మహ్మద్‌ ఎం.ఇడ్రిస్, రామకృష్ణన్‌ నాగరాజు, అర్చనా భరద్వాజ్, పరిశోధక విద్యార్థి సెరెనాభాను బృందం పరిశీలించింది. ఇందుకోసం కొవిడ్‌ రోగుల నమూనాలు, సాధారణ వ్యక్తుల నమూనాలను తీసుకుని అధ్యయనం చేసింది. ‣ రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యమైన బీటా107బి, బీటా106బి, బీటా4ఏ/బి, బీటా103ఏ జన్యువుల్లోని డిఫెన్సిన్‌ మాలిక్యుల్స్‌ కొవిడ్‌ సోకిన రోగుల్లో బాగా తగ్గినట్లు గుర్తించారు. దీంతో కొవిడ్‌ వైరస్‌ ముక్కును దాటుకుని శరీరం లోపలికి ప్రవేశించి, వ్యాధి తీవ్రతను పెంచుతోంది. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ జర్నల్‌ యాక్టా వైరొలాజికాలో ప్రచురితమయ్యాయి. ‘కరోనా సోకిన ఆరంభంలో ముక్కులోపల ప్రధానంగా ప్రభావితం అవుతున్న నాలుగు జన్యువులను గుర్తించాం. వీటిని లక్ష్యంగా చేసుకుని తగిన చికిత్సను అభివృద్ధి చేసేందుకు మా పరిశోధన దోహదం చేస్తుంది’ అని పరిశోధకులు తెలిపారు.

ఎముక విరిగితే ఏ చికిత్స మేలో చెప్పే సరికొత్త ఏఐ అభివృద్ధి

తుంటి ఎముక విరిగిన వ్యక్తుల్లో ఏ తరహా చికిత్స వ్యూహాన్ని అనుసరిస్తే వారు త్వరగా కోలుకుంటారో వైద్యులు ముందే పక్కాగా నిర్ధారించుకోవడంలో దోహదపడే సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) నమూనాను ఐఐటీ గువాహటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘ఫజీ లాజిక్‌’గా పిలుస్తున్న ఈ ఏఐని ఫినైట్‌ ఎలిమెంట్‌ అనాలసిస్‌తో కలిపి వినియోగించాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఎముక విరిగిన తీరు, శరీర ధర్మం ఆధారంగా అది ఆయా వ్యక్తులు కోలుకునేందుకు మెరుగైన చికిత్స వ్యూహాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఫలితంగా కోలుకునేందుకు పట్టే సమయం, చికిత్సకయ్యే ఖర్చుల భారం తగ్గుతుందని వివరించారు. బాధితులు సుదీర్ఘకాలం నొప్పిని భరించాల్సిన అవసరం లేకుండా చేస్తుందని తెలిపారు.

క్యాన్సర్‌ ఔషధంతో మలేరియాకు చికిత్స

క్యాన్సర్‌ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేయగల సామర్థ్యమున్న సపానిసెర్టిబ్‌ అనే ఔషధం మలేరియా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలోనూ దోహదపడుతుందని దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ విశ్వవిద్యాలయం (యూసీటీ) పరిశోధకులతో కూడిన బృందం తాజాగా గుర్తించింది. మనిషి శరీరంలో అది మలేరియా పరాన్నజీవిని చంపేయగలదని తేల్చింది. తద్వారా వ్యాధి నయం కావడానికి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయడానికి (నివారణకు) ఔషధం ఉపయోగపడుతుందని వెల్లడించింది. పరాన్నజీవి మానవుల కాలేయంలో తన సంఖ్యను పెంచుకుంటున్నప్పుడు, ఎర్ర రక్తకణాల్లో ఉన్నప్పుడు సపానిసెర్టిబ్‌ సులువుగా దాన్ని అంతమొందించగలదని పరిశోధకులు పేర్కొన్నారు.

వీడియో గేమ్స్‌ ఆడే చిన్నారుల్లో చురుకైన మెదడు

చిన్నారులు తరచూ వీడియో గేమ్‌లు ఆడుతుంటే మానసిక సమస్యలు తలెత్తుతాయని, ఇతరులతో మమేకం కావడం వారికి ఇబ్బంది అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. యూనివర్సిటీ ఆఫ్‌ వెర్మంట్‌ శాస్త్రవేత్తలు మాత్రం వీటిని కొట్టిపాడేశారు. వీడియో గేమ్స్‌ ఆడే చిన్నారుల్లోని మెదడు మరింత చురుగ్గా పనిచేస్తున్నట్టు తేల్చారు. ఈ మేరకు వారు తొమ్మిది, పదేళ్ల వయసున్న రెండు వేల మంది చిన్నారుల్లో మెదడు పనితీరును పరీక్షించారు. వారి బ్రెయిన్‌ స్కానింగ్‌లను విశ్లేషించగా ఇతర చిన్నారులతో పోలిస్తే, రోజూ మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వీడియో గేమ్స్‌ ఆడే పిల్లల్లో మెదడు మరింత చురుగ్గా పనిచేస్తున్నట్టు పరిశోధనకర్త బాదర్‌ చారణి తెలిపారు.

36 ఉపగ్రహాలతో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 ప్రయోగం విజయవంతం

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని రాకెట్‌ కేంద్రం నుంచి 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో మరోమారు తన సత్తా చాటింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో మొదటిసారిగా జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా సుమారు ఆరు టన్నుల బరువుగల విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి దశల వారీగా ప్రవేశపెట్టింది. ఒక్కో ఉపగ్రహం బరువు 142 కిలోల వరకు ఉంది. కక్ష్యలోకి వెళ్లిన ఉపగ్రహాలను యూకేకు చెందిన గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి నియంత్రించనున్నారు. ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ షార్‌లోనే ఉంటూ కౌంట్‌డౌన్‌లో పాల్గొని వాహకనౌక ఏర్పాట్లను పరిశీలించారు. అమెరికా, ఫ్రాన్సు, యూకేకు చెందిన 14 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహకనౌకలో మూడు దశలు ఉండగా వాహకనౌక ఎత్తు 43.43 మీటర్లు. బరువు 640 టన్నులు. మొదటి దశలో 200 టన్నుల ఘన ఇంధనం, రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనం, మూడో దశలో 25 టన్నుల అతి శీతల క్రయోజనిక్‌ ఇంధనం ఉంది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌-3 వాహకనౌక ప్రయోగానికి రూ.160 కోట్లు ఖర్చు చేశారు. షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-మాô్్క3 ఐదో ప్రయోగం ఇది. మొదటి ప్రయోగం జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 డీ1ను 2017 జూన్‌ 5న చేపట్టారు. ఆ తర్వాత మార్క్‌3 డీ2 ప్రయోగం, అనంతరం రెండు ప్రయోగాలు చేపట్టారు. దీని ద్వారానే చంద్రయాన్‌-2 ప్రయోగం చేశారు.

ఇంజెక్షన్‌ నొప్పికి రోబో ‘మందు’ అభివృద్ధి

ఇంజెక్షన్లు అంటే కొందరు ఆమడ దూరం పారిపోతుంటారు. ఇలాంటి వారిలో నొప్పి భావనను తగ్గించే ఒక చిన్న రోబోను జపాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి రెలియబో అని పేరు పెట్టారు. దీన్ని శరీరంపై ధరించొచ్చు. ఇందులో చిన్నపాటి గాలి సంచులు ఉంటాయి. రోగి శరీర కదలికలకు అనుగుణంగా అవి ఉబ్బెత్తుగా మారుతుంటాయి. ఈ సాధనాలను కొందరు వాలంటీర్ల చేతులకు అమర్చి, పరీక్షించారు. అనంతరం వారి చర్మంపై ఒక మోస్తరు స్థాయి వేడిని ప్రయోగించారు. ఈ రోబోలను ధరించని వారితో పోలిస్తే వీరిలో నొప్పి, భయం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వాలంటీర్ల లాలాజలంలో ఒత్తిడికి సంబంధించిన సూచికలైన ఆక్సిటోసిన్, కార్టిసాల్‌ స్థాయిని కొలిచి ఈ మేరకు తేల్చారు. మానవ స్పర్శ తరహాలో ఈ సాధనాలు సాంత్వన భావనను కలిగిస్తుండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు ప్రొటీన్‌ పరిష్కారం

కీళ్లవాతం, మల్టిపుల్‌ స్కె ్లరోసిస్‌ వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధులను నివారించే ఒక విధానాన్ని అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు. రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున క్రియాశీలమైనప్పుడు ఈ రుగ్మతలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థ శరీర కణజాలం, అవయవాలపై దాడులు చేస్తుంటుంది. ఈ వ్యాధులు రావడానికి జన్యుపరమైన కారణాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. వీటి నివారణ, చికిత్సకు పోషకాహారం, వాతావరణం వంటి అంశాలు ప్రభావం చూపుతాయా అన్న అంశంపై పరిశోధనలు సాగుతున్నాయి. కణస్థాయిలో చేపట్టే ఒక విధానంతో వీటికి పరిష్కారం లభించొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రోగ నిరోధక వ్యవస్థ నియంత్రణలో కీలక పాత్ర పోషించే టి కణాల సంఖ్యను పెంచే ఒక ప్రొటీన్‌ను వారు రూపొందించారు. ఇది ఎలుకల్లో సత్ఫలితాలిచ్చింది.

ఒకే చిప్‌తో ఇంటర్నెట్‌ డేటా బట్వాడా

ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ మొత్తాన్నీ బట్వాడా చేసే సామర్థ్యం కలిగిన ఒక కంప్యూటర్‌ చిప్‌ను డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సాధనం ద్వారా సెకనుకు 1.8 పెటాబిట్లను ట్రాన్స్‌మిట్‌ చేసి, రికార్డు సృష్టించారు. ఇది ఒక సెకనులో 23 కోట్ల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేయడానికి సరిపోయేంత బ్యాండ్‌విడ్త్‌ కావడం విశేషం. ఇదంతా ఒక ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ ద్వారా సాగింది. ఈ ప్రక్రియలో డేటాను వివిధ రంగులుగా విడగొడతారు. ఈ వర్ణాలు ఒకదానితో ఒకటి కలవవు. ఈ చిప్‌ ద్వారా 7.9 కిలోమీటర్ల దూరానికి డేటాను చేరవేశారు. ఇలాంటి సాధనాల ద్వారా ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు బ్యాండ్‌ విడ్త్‌ పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో సరాసరి ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ సెకనుకు ఒక పెటాబిట్‌గా ఉంది. తాము రూపొందించిన చిప్‌ దీనికి దాదాపు రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అగ్ని-ప్రైమ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొత్తతరం మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-ప్రైమ్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం వెంబడి ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి సంచార లాంచర్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ అస్త్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్దేశించిన రీతిలో పనిచేశాయని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వర్గాలు తెలిపాయి. ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలన్నీ నెరవేరాయని పేర్కొన్నాయి. ఇందులోని గమనాన్ని రాడార్లు, టెలిమెట్రీ సాధనాలు, బంగాళాఖాతంలో మోహరించిన యుద్ధ నౌకలు నిశితంగా పరిశీలించాయని వివరించాయి. ఈ క్షిపణి గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ అస్త్రాన్ని చివరిసారిగా గత ఏడాది డిసెంబరు 18న పరీక్షించారు. అణ్వస్త్రాన్ని మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని-ప్రైమ్‌లో రెండు అంచెలు ఉంటాయి. దీర్ఘకాలం నిల్వ చేయడానికి, సులువుగా ప్రయోగించడానికి వీలుగా ఈ క్షిపణిని గొట్టపు ఆకృతి (క్యానిస్టర్‌)లో అమర్చారు. అందువల్ల దీన్ని ఎక్కడికైనా తేలిగ్గా రవాణా చేయవచ్చు. అవసరాన్ని బట్టి రైలు లేదా రోడ్డుపై నుంచి ప్రయోగించవచ్చు. అగ్ని తరగతి అస్త్రాలన్నింటిలోకీ ఇదే అత్యంత తేలికైంది. అగ్ని-3 క్షిపణితో పోలిస్తే దీని బరువు సగమే ఉంటుంది.

నిమిషాల్లో వ్యాధి నిర్ధారణకు సరికొత్త ఏఐ సాధనం సిద్ధం

గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి రుగ్మతలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను నిమిషాల్లోనే అందించే సాధనాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేస్తుంది. ఇది ఆరోగ్య పరిరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్వాన్‌సీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. మెషీన్‌ లెర్నింగ్‌ అనే ఒక రకం ఏఐని ఉపయోగించడం వల్ల ఇది సాధ్యమైంది. శరీరంలోని సైనోవియల్‌ ఫ్లూయిడ్, బ్లడ్‌ ప్లాస్మా, లాలాజలంలో కొన్ని రకాల ప్రొటీన్లు ఉంటాయి. పలు ఆరోగ్య సమస్యలకు ఇవి సూచికలుగా పనిచేస్తాయి. ఈ ప్రొటీన్ల గాఢతను గుర్తించడానికి ప్రత్యేక ప్రోగ్రామ్‌ను సిద్ధం చేశారు. నిర్దిష్ట వ్యాధుల నిర్ధారణ, వ్యాప్తి తీరును దీని ద్వారా పర్యవేక్షించొచ్చు. పరీక్ష ఫలితాల కోసం నిరీక్షించాల్సిన సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.

అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవులపై అధ్యయనం

భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో వివిధ రకాల సూక్ష్మజీవులపై మద్రాస్‌ ఐఐటీ, అమెరికా అంతరిక్ష సంస్థ - నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. ఇందులో పలు కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. క్లెబ్సియెల్లా నిమోనియే అనే బ్యాక్టీరియా రకం మిగతా సూక్ష్మజీవులకు ప్రయోజనకారిగా ఉంటున్నట్లు తేలింది. ఒక ఫంగస్‌ వృద్ధిని అది అడ్డుకుంటున్నట్లు వెల్లడైంది. అంతరిక్ష కేంద్రాన్ని క్రిమిరహితంగా మార్చేందుకు, సూక్ష్మజీవుల వల్ల వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోదసి యాత్రల సమయంలో వ్యోమగాముల రోగనిరోధక శక్తిలో తేడాలు వస్తుంటాయి. దీనికి తోడు వైద్య సౌకర్యాలు వారికి అందుబాటులో ఉండవు. ఐఎస్‌ఎస్‌ ఉపరితలాలపై క్లెబ్సియెల్లా నిమోనియే ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ పరిశోధన చేశారు.

సన్నని మొబైల్‌ ఫోన్ల తయారీకి ఫెర్రో ఎలక్ట్రిక్‌ పదార్థం గుర్తింపు

ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఇంధన అవసరాలను గణనీయంగా తగ్గించే దిశగా అమెరికా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఆయా సాధనాల్లో విద్యుత్తును అత్యంత ప్రభావవంతంగా వాడుకునేందుకు ఉపయోగపడే జిర్కోనియం డయాక్సైడ్‌ అనే సన్నని ఫెర్రోఎలక్ట్రిక్‌ పదార్థాన్ని వారు గుర్తించారు. మానవ వెంట్రుకతో పోలిస్తే రెండు లక్షల రెట్లు తక్కువ మందంతో ఉన్నప్పుడు కూడా దానిలో ఫెర్రోఎలక్ట్రిసిటీ నిలకడగా ఉంటున్నట్లు తేల్చారు. జిర్కోనియం డయాక్సైడ్‌ను సమర్థంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో ఫోన్లు, కంప్యూటర్లు సహా అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలను మరింత సన్నగా తీర్చిదిద్దొచ్చని పరిశోధకులు వివరించారు.

అల్జీమర్స్‌ను గుర్తించేందుకు సరికొత్త సాంకేతికత అభివృద్ధి

తీవ్ర మతిమరుపునకు దారితీసే అల్జీమర్స్‌ వ్యాధిని ప్రారంభ దశల్లోనే గుర్తించగల సరికొత్త సాంకేతికతను అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ‘పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ (పీఈటీ)’ ఇమేజింగ్‌ టెక్నిక్‌గా దాన్ని పిలుస్తున్నారు. అల్జీమర్స్‌ తొలి దశల్లో ఉన్న వ్యక్తుల్లో మోనోఅమైన్‌ ఆక్సిడేజ్‌-బి (ఎంఏవో-బీ) ఎంజైమ్‌ను గుర్తించడం ద్వారా ఇది వ్యాధి నిర్ధారణ జరుపుతుంది. ఇందుకోసం 18ఎఫ్‌-ఎస్‌ఎంబీటీ-1 అనే రేడియోట్రేసర్‌ ఏజెంట్‌ను వినియోగించుకుంటుంది. తొలినాళ్లలోనే వ్యాధిని గుర్తించడం వల్ల వ్యక్తులు మెరుగైన చికిత్స తీసుకునేందుకు వీలు కలుగుతుంది.

దేశంలో తగ్గుతున్న టైఫాయిడ్‌ కేసులు

దేశంలో టైఫాయిడ్‌ కేసులు ముందు అనుకున్న దానికన్నా ఎక్కువగానే నమోదైనా, మొత్తం మీద ఈ జ్వరవ్యాప్తి తగ్గుతోందని అనేక ఏళ్ల పాటు వైద్యులు రాసిన యాంటీ బయాటిక్స్‌ చీటీల అధ్యయనంలో తేలింది. జాతీయ సామూహిక టీకా కార్యక్రమంలో భారత్‌ స్వయంగా తయారు చేసిన టైఫాయిడ్‌ టీకాను కూడా చేర్చాలని బీఎంజే ఓపెన్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం సిఫార్సు చేసింది. 2013లో 99 లక్షల టైఫాయిడ్‌ కేసులు నమోదవగా 2015లో అవి 79లక్షలకు తగ్గాయి. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ భారతాల్లో కేసుల తగ్గుదల ఉంది. పదేళ్లలోపు పిల్లల్లో 10 లక్షల మందికిపైగా టైఫాయిడ్‌ బారిన పడ్డారు. మొత్తం టైఫాయిడ్‌ కేసుల్లో 18.6 శాతం కేసులు 10-19 ఏళ్లవారిలో నమోదయ్యాయి. 20-29 ఏళ్లవారిలో అత్యధిక కేసులు కనిపించాయి. ఈ వర్గంలోని ప్రతి లక్ష మంది పురుషుల్లో 844 మందికీ, ప్రతి లక్ష మంది స్త్రీలలో 627 మందికీ టైపాయిడ్‌ సోకింది. టైఫాయిడ్‌ చికిత్సకు వాడిన యాంటీ బయాటిక్స్‌లో సెఫాలోస్పోరిన్‌లే ఎక్కువ. దక్షిణ భారతంలో సెఫిక్సీమ్‌-ఆఫ్లాక్ససిన్‌ మిశ్రమాన్ని అధికంగా వాడారు. టైపాయిడ్‌ చికిత్సకు వైద్యులు ఏటా 89.80 లక్షల యాంటీ బయాటిక్స్‌ చీటీలను రాశారు. దిల్లీలోని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్, ఖతర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

చైనా శాస్త్రజ్ఞుల మహా గామా కిరణ విస్ఫోటాల గుర్తింపు

మానవాళి ఇంతవరకు వీక్షించిన గామా కిరణ విస్ఫోటాల (జి.ఆర్‌.బి) కన్నా 10 రెట్లు పెద్దదైన విస్ఫోటాన్ని చైనా కనిపెట్టింది. భూమ్యాకాశాల నుంచి జరిపిన పరిశీలనల ద్వారా అక్టోబరు 9న తాము కనుగొన్న బృహత్తర విస్ఫోటానికి చైనా శాస్త్రజ్ఞులు జి.ఆర్‌.బి 221009ఏ అని నామకరణం చేశారు. ఇది భూమికి 200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో సంభవించింది. అంటే జి.ఆర్‌.బి 221009ఏ నుంచి వెలువడిన కాంతి భూమికి చేరడానికి అన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందన్నమాట. భూమిపైనున్న లాసో ప్రయోగశాల, రోదసిలోని గామా కిరణ శోధన సాధనం, ఒక ఎక్స్‌ రే టెలీస్కోప్‌ల సాయంతో దీని ఉనికిని కనుగొన్నారు. గామా కిరణ విస్ఫోటాలు (జి.ఆర్‌.బిలు) కొన్ని మిల్లీ సెకన్ల నుంచి కొన్ని గంటల వరకు సంభవిస్తాయి. సృష్టి పుట్టుకకు కారణమైన బిగ్‌ బ్యాంగ్‌ తరవాత అత్యంత ప్రకాశవంతమైన, శక్తిమంతమైన విద్యుదయస్కాంత ఘటనలివి. సూర్యుడు తన కోటానుకోట్ల జీవితకాలంలో వెలువరించే మొత్తం శక్తికన్నా ఎక్కువ శక్తిని జి.ఆర్‌.బి కొన్ని సెకన్లు లేదా గంటల్లోనే విరజిమ్ముతుంది. సూర్యుడి కన్నా డజన్ల రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలు పేలిపోయినప్పుడు ఎక్కువ సేపు కనిపించే జి.ఆర్‌.బిలు పుడతాయి. రెండు కృష్ణ బిలాలు (బ్లాక్‌ హోల్స్‌) కానీ, న్యూట్రాన్‌ తారలు కానీ పరస్పరం ఢీకొని విలీనమయ్యేటప్పుడు స్వల్ప వ్యవధి జి.ఆర్‌.బిలు కనిపిస్తాయి. ఇవి గురుత్వాకర్షణ అలలనూ సృష్టించవచ్చు.

5 గంటలైనా నిద్రపోనివారికి వ్యాధుల ముప్పు

దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రాత్రిపూట కనీసం అయిదు గంటలైనా కంటినిండా నిద్రపోవాలంటున్నారు లండన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే ముదిమి, నడివయసు వారికి కనీసం రెండు దీర్ఘకాలిక రుగ్మతలు తలెత్తే ముప్పు ఉన్నట్టు గుర్తించారు. 7 గంటలు నిద్రపోయేవారితో పోల్చితే, కనీసం 5 గంటలైనా నిద్రపోని 50-70 ఏళ్ల వయస్కులను రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాల రుగ్మతలు (మల్టీమార్బిడిటీ) చుట్టుముడుతున్నాయి. ఇలాంటి వారు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావడం, వైకల్యానికి గురికావడం జరుగుతోంది. త్వరగా మరణించే ముప్పు కూడా వీరికి 25% ఎక్కువగా ఉంటోందని పరిశోధనకర్త సేవరిన్‌ సబియా పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా 7 వేల మంది ఆరోగ్య వివరాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

కరోనాను పోలిన రేణువుల అభివృద్ధి

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను పోలిన రేణువు (వీఎల్‌పీ)లను దిల్లీలోని ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి కరోనాకు టీకాలుగా పనికొస్తాయని వారు పేర్కొన్నారు. వైరస్‌పై ప్రతిదాడి చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించగలవని ఎలుకల్లో జరిపిన పరిశోధనలు రుజువు చేశాయి. ప్రస్తుతమున్న వీఎల్‌పీలు సార్స్‌-కోవ్‌-2లోని స్పైక్‌ ప్రొటీన్‌ను మాత్రమే తమ ప్రధాన యాంటిజెన్‌గా ఉపయోగించుకున్నాయి. ఐఐటీ పరిశోధకులు రూపొందించిన రేణువులు మాత్రం చాలా వరకూ కరోనాలానే ఉన్నాయి. వైరస్‌లో ఉండే స్పైక్‌ (ఎస్‌), న్యూక్లియోక్యాప్సిడ్‌ (ఎన్‌), మెంబ్రేన్‌ (ఎం), ఎన్విలప్‌ (ఈ) అనే నాలుగు ప్రొటీన్లను ఇది కలిగి ఉంది. ఇన్‌యాక్టివేటెడ్‌ వైరస్‌ ఆధారంగా రూపొందిన టీకాల్లోనూ ఇవి ఉంటాయి. అయితే వాటితో పోలిస్తే ఈ వీఎల్‌పీలు సురక్షితమని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన మణిదీపా బెనర్జీ పేర్కొన్నారు. ఈ కృత్రిమ వైరస్‌లో జన్యుక్రమం ఉండదన్నారు. ఆ ప్రయోగాల్లో వీఎల్‌పీలను ఉపయోగించడం శ్రేయస్కరమని, తద్వారా కొత్త రకం టీకాలను సురక్షితంగా అభివృద్ధి చేయవచ్చని వివరించారు.

70 ఏళ్లలో సగటు ఆయుర్దాయం తగ్గుదల

కొవిడ్‌-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలం పాటు సగటు ఆయుర్దాయంలో కోతపడిందని తాజా అధ్యయనం పేర్కొంది. ఫలితంగా 70 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో మరణాల రేటులో మార్పులు వచ్చాయని వివరించింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, జర్మనీలోని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఈ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం వారు 29 దేశాలకు సంబంధించిన డేటాను విశ్లేషించారు. బల్గేరియా, చిలీ, జర్మనీ, గ్రీస్, పోలండ్‌ వంటి దేశాల్లో 2020తో పోలిస్తే 2021లో సగటు ఆయుర్దాయం తగ్గిందని గుర్తించారు. 2020లో 80 ఏళ్లు పైబడ్డ వృద్ధుల్లో మరణాలు ఎక్కువగా ఉండేవని, ఆ మరుసటి సంవత్సరం పరిస్థితి మారిందని తేల్చారు. కొవిడ్‌ టీకాలు అందించిన రక్షణతో వృద్ధుల్లో మరణాలు తగ్గాయని, యువతలో మాత్రం ఎక్కువగానే కొనసాగాయని పరిశోధకులు పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఎల్‌డీ వ్యాధిగ్రస్థుల ప్రాణాలు తీస్తున్న పారిశ్రామిక, వాహన కాలుష్యం

పారిశ్రామిక, వాహన కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్థులకు అకాల మరణం ముప్పు అధికంగా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. ఇది వారిలో వ్యాధి ఉద్ధృతిని పెంచుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికా, కెనడాల్లో ఫైబ్రాటిక్‌ ఇంటర్‌స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌ (ఎఫ్‌ఐఎల్‌డీ) అనే ఊపిరితిత్తుల రుగ్మత కలిగిన 6,683 మందికి సంబంధించిన డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు. ఉపగ్రహాలతో పాటు భూమికి సంబంధించిన పర్యవేక్షణ కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా వీరు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్థాయిని పరిశీలించారు. ముఖ్యంగా పీఎం 2.5 అనే రేణువుల స్థాయిని విశ్లేషించారు. ఇవి కంటికి కనిపించవు. ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకెళతాయి. రక్తప్రవాహంలోనూ కలుస్తాయి. గుండె జబ్బులకూ కారణమవుతాయి. అయితే ఈ రేణువుల మూలాలు కూడా కీలకమేనని తాజా పరిశోధనకు నాయకత్వం వహించిన జేమ్స్‌ ఫేబియాసిక్‌ తెలిపారు. అవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయన్నదాన్ని బట్టి వాటి రసాయన తీరుతెన్నులు ఉంటాయని వివరించారు.

నేపాలీయులకు భారత్‌ సహా టిబెట్, భూటాన్‌ వారితో జన్యు బంధం

నేపాలీయులకు భారత్‌ సహా టిబెట్, భూటాన్‌ వాసులు బంధువులేనని తాజాగా తేలింది. ఆ మూడు ప్రాంతాలకు చెందిన ప్రజల జన్యు లక్షణాలు నేపాలీయుల్లో ఉన్నట్లు హైదరాబాద్‌లోని సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడైంది. సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ) సంచాలకుడు, సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్‌ ఆధ్వర్యంలోని పరిశోధక బృందం నేపాల్‌లోని 999 మంది వ్యక్తుల మాతృత్వ వంశపారంపర్యంపై అధ్యయనం చేసింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ అధ్యయన ఫలితాలు హ్యూమన్‌ జెనిటిక్స్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 3.8 నుంచి 6 వేల ఏళ్ల కిందట వలసలు నేపాల్‌ ప్రజల వంశ చరిత్ర, జన్యు సమాచారంపై బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో వారి చరిత్రను తెలుసుకునేందుకు తంగరాజ్‌ నేతృత్వంలోని బృందం పరిశోధన చేసింది. నేవార్, మగర్, షెర్పా, బ్రాహ్మిణ్, థరూ, తమాంగ్, కాఠ్‌మండూతో పాటు తూర్పు ప్రాంతాల్లోని నేపాలీయుల జన్యువుల మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏ (సీక్వెన్స్‌)ను విశ్లేషించారు. అవి దక్షిణ, తూర్పు ఆసియా ప్రాంత వాసుల జన్యువులతో సరిపోలినట్లు గుర్తించారు. నేపాల్‌కు తూర్పున భారత్, దక్షిణాన టిబెట్, భూటాన్‌ దేశాల పౌరుల జన్యు వారసత్వం అక్కడి ప్రజల్లో ఉన్నట్లు గుర్తించామని డాక్టర్‌ తంగరాజ్‌ చెప్పారు. జన్యు వ్యాధులు పరంగానూ నేపాల్‌తో ఆయా దేశాల వారికి పోలికలు ఉన్నట్లు తేలింది. మా అధ్యయనం నేపాల్‌ వారసత్వాన్ని తెలియజేస్తోంది. టిబెట్‌ మీదుగా 3.8 నుంచి 6 వేల ఏళ్ల కిందట తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల నుంచి ప్రజలు నేపాల్‌కు వలసలు వెళ్లినట్టు స్పష్టమవుతోందని ఆ దేశ త్రిభువన్‌ విశ్వవిద్యాలయం ఆచార్యుడు రాజ్‌దీప్‌ బాస్నెట్‌ చెప్పారు. నేపాల్‌లోని నేవార్, మగర్‌ ప్రాంతాల్లో ఉన్న టిబెట్‌ - బర్మన్‌ జాతుల చరిత్ర, జన్యు సమాచారం తెలుసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడింది. నేపాల్‌తో భారత్, టిబెట్‌ సాంస్కృతిక బంధమూ వెలుగు చూసిందని లఖ్‌నవూలోని బీర్బల్‌ సహనీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోసైన్సెస్‌ ఆచార్యుడు నీరజ్‌ రాయ్, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ ఆచార్యుడు జ్ఞానేశ్వర్‌ చౌబే, సీసీఎంబీ డైరెక్టర్‌ నందికూరి వినయ్‌కుమార్‌ వివరించారు.

ఇక చేదు జ్ఞాపకాలను మర్చిపోవచ్చు!

జీవితం అన్నాక మంచి, చెడు అనుభవాలు అత్యంత సహజం. నిత్యం వెంటాడే బాధాకర, చేదు జ్ఞాపకాలను శాశ్వతంగా మర్చిపోవడం ఇప్పుడు సాధ్యమేనంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ శాస్త్రవేత్తలు. నిద్రపోయే వ్యక్తులకు ప్రత్యేక విధానంలో శబ్దాలను వినిపిస్తే, వారు చేదు జ్ఞాపకాలను మరచిపోగలరని వెల్లడించారు. 29 మంది వాలంటీర్లకు పలు జంట పదాలను నేర్పించిన పరిశోధకులు, వారు గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు వాటిలో కొన్నింటిని ప్రత్యేక విధానంలో వినిపించారు. ఉదయం లేచిన తర్వాత వారంతా ఆ పదాలను గుర్తుచేసుకోలేకపోయారు. నిద్ర - జ్ఞాపకశక్తి మధ్య దృఢమైన బంధం ఉంటుందని, తాము రూపొందించిన విధానం ద్వారా జ్ఞాపకాలను బలపరచడం, లేదా విచ్ఛిన్నం చేయడం సాధ్యమవుతుందని పరిశోధనకర్త ఐడాన్‌ హార్నర్‌ తెలిపారు. నిద్రలో ‘సౌండ్‌ క్యూస్‌’ను వినిపించడం ద్వారా జ్ఞాపకాలను బలోపేతం చేయవచ్చని మునుపటి పరిశోధనలో తేలింది.

గ్రహాంతరవాసుల అన్వేషణకు ఊపిరి!

ఈ సువిశాల విశ్వంలో మనం ఏకాకులమా? మనలాంటి జీవులు మరేదైనా గ్రహంలో ఉన్నాయా? శతాబ్దాలుగా మానవులను వేధిస్తున్న ప్రశ్న ఇది. అత్యాధునిక జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) తన పనిని మొదలుపెట్టిన నేపథ్యంలో సౌర కుటుంబం వెలుపలి గ్రహాల గురించి అధ్యయనం చేసి, అక్కడ ఎలాంటి వాయువులు ఉన్నాయన్నది తేల్చడం ఈ టెలిస్కోపునకు నిర్దేశించిన నాలుగు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మనకు తెలిసినంతవరకూ జంతువులు మనుగడ సాగించాలంటే ఆక్సిజన్‌ అవసరం. అందువల్ల ఈ వాయువు ఉనికి ఆధారంగా ఇతర గ్రహాల్లో జీవం ఆచూకీపై ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో పుడమి చరిత్రలో కాలానుగుణంగా ఆక్సిజన్‌ పరిమాణాల్లో వచ్చిన మార్పులపై బ్రిటన్‌లోని లీడ్స్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాగించిన ఒక పరిశోధన గ్రహాంతర జీవం అన్వేషణకు మార్గదర్శిగా నిలిచింది. కంప్యూటర్‌ మోడల్‌తో.. తాజాగా ఎన్‌వోఈ కాలంలో వాతావరణంలోని ఆక్సిజన్‌ స్థాయిని పునర్‌నిర్మించడానికి లీడ్స్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లో తొలితరం జంతువులు పుట్టుకొచ్చాయన్నది తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం వారు భూమికి సంబంధించిన ఒక కంప్యూటర్‌ మోడల్‌ను నిర్మించారు. వాతావరణంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేసే లేదా తొలగించే వివిధ ప్రక్రియలను అందులోకి చొప్పించారు. కార్బన్‌ ఐసోటోపులు కలిగిన శిలలను శోధించారు. తద్వారా ఆయా కాలాల్లో జరిగిన కిరణ జన్య సంయోగ క్రియ స్థాయిని లెక్కించారు. మొక్కలు శక్తిని తయారు చేసుకోవడానికి వినియోగించే ఈ విధానమే పుడమిపై ఆక్సిజన్‌కు ప్రధాన వనరు. గ్రహాంతర జీవం కోసం అన్వేషణ.. ఈ ఫలితాలు చాలా ఆసక్తికరంగా మారాయి. భూమి తన 450 కోట్ల ఏళ్ల చరిత్రలో చాలా స్థిరమైన పరిస్థితులను కలిగి ఉండటం వల్లే జీవం వికసించి ఉంటుందన్న భావన ఇప్పటివరకూ ఉండేది. అయితే ఆక్సిజన్‌ స్థాయి భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న వాతావరణంలో మొదటితరం జంతువులు వికసించి ఉంటే.. ఏవో కొన్ని అంశాలు ఇందుకు దోహదపడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాతావరణంలో ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉన్న కాలం సంక్లిష్ట జీవం వృద్ధికి బాటలుపరిచి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రాథమిక జీవులు అంతరించిపోయేలా అది ప్రేరేపించి ఉంటుందని తెలిపారు. దీన్ని తట్టుకొని మనుగడ సాగించిన జీవులు ఆ తర్వాతి కాలంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరిగినప్పుడు భారీగా విస్తరించి, వైవిధ్యాన్ని సంతరించుకొని ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఆక్సిజన్‌ స్థాయి చాలా తక్కువగా ఉన్న గ్రహాల్లో జీవులు ఉండబోవన్న భావనను వీడాలని పేర్కొంటున్నారు. అలాంటిచోట్ల కూడా నిశిత పరిశీలనల సాగించాలని సూచిస్తున్నారు.

మొదటిసారిగా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన అరిహంత్‌

రక్షణ రంగంలో భారత్‌ మరో కీలక మైలురాయిని అధిగమించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ తన ఆయుధ ప్రయోగ సామర్థ్యాన్ని చాటింది. మొదటిసారిగా ఒక బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అది అత్యంత కచ్చితత్వంతో బంగాళాఖాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని తాకింది. ఈ ప్రయోగంలో క్షిపణికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అణుశక్తితో నడిచే బాలిస్టిక్‌ క్షిపణి జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌) కార్యక్రమం కింద ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ను భారత్‌ అభివృద్ధి చేసింది. అత్యంత గోప్యంగా విశాఖపట్నంలో దీని నిర్మాణం సాగింది. అదే శ్రేణిలో రెండో జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘత్‌ కూడా సిద్ధమైంది. తాజా పరీక్షతో ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ అన్ని విధాలుగా పోరాటానికి సిద్ధమైనట్లు స్పష్టమైంది.

8 లక్షల మెదడు కణాల రూపకల్పన

ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలతో శాస్త్రవేత్తలు వీడియో గేమ్‌ ఆడించి అబ్బురపరిచారు. ఆస్ట్రేలియాలోని మొనాష్‌ విశ్వవిద్యాలయం, ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయం సహా పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల బృందం 8 లక్షల మెదడు కణాలను సృష్టించింది. వాటిని ఓ పాత్రలో కలిపి ఉంచి ఎలక్ట్రోడ్‌లను ప్రసరింపజేయడం ద్వారా 1970ల నాటి టెన్నిస్‌ తరహా వీడియో గేమ్‌ ‘పాంగ్‌’ను ఆడించింది. సజీవ వ్యక్తిలోని మెదడు తరహాలోనే సంకేతాలను అందజేస్తూ ఆ కణాలు ఆటను ఆడటం విశేషం. మతిమరుపు, మూర్ఛ వంటి వ్యాధులపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేపట్టేందుకు తాము అభివృద్ధి చేసిన మెదడు కణాలు మున్ముందు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక కణాల్లోనే ప్రాణవాయువు తయారీ!

అత్యవసర సమయాల్లో బయటి నుంచి ప్రాణవాయువు (ఆక్సిజన్‌) అందకపోయినా సజీవ కణాలు సొంతంగా దాన్ని తయారు చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఇందుకు అవసరమైన విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ విధానంలో తొలుత ప్రొటీన్లను ఉపయోగించి క్లోరైట్‌ను ఎక్కువగా తీసుకునేలా కణాలను ప్రోత్సహిస్తారు. అనంతరం ప్రత్యేక ఎంజైమ్‌ల ప్రభావంతో ఆక్సిజన్, క్లోరైడ్‌లుగా ఆ క్లోరైట్‌ విడిపోయేలా చేస్తారు. మానవ కణాల్లోకీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా విస్తృత స్థాయి ప్రయోగాలు జరగనున్నాయని పరిశోధకులు తెలిపారు.

దోమలను నిరోధించే రక్షా కంకణం రూపకల్పన

సుదీర్ఘ సమయం పాటు దోమలు, ఇతర కీటకాలను దగ్గరకు రానివ్వకుండా చేసే ఉంగరాన్ని జర్మన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సాధనాన్ని ఉంగరంగానే కాకుండా మణికట్టు కంకణంలా కూడా రూపొందించవచ్చు. జర్మనీలోని మార్టిన్‌ లూథర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీటకాలను నిరోధించే ‘ఐఆర్‌ 3535’ రసాయనాన్ని త్రీడీ ప్రింటింగ్‌ పద్ధతిలో ఉంగరం లేదా కంకణంలో నింపి ప్రయోగాలు జరిపారు. ఈ రసాయనాన్ని దోమలను దూరంగా ఉంచే క్రీములు, స్ప్రేల్లో ఉపయోగిస్తుంటారు. అది చర్మానికి హాని చేయదు. ఇప్పుడు దీన్ని త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా కొంతకాలానికి సహజంగా క్షయమయ్యే పాలిమర్‌లో నింపి ఉంగరం లేదా కంకణంగా తయారు చేశారు. వాటిలోని రసాయనం శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వద్ద వారం రోజుల్లో పూర్తిగా ఆవిరైపోతుంది. అంతకాలం దోమలు, ఇతర కీటకాలను దగ్గరకు రానివ్వదు.

ఇన్సులిన్‌కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్‌ మాత్ర అభివృద్ధి

ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్న ఇన్సులిన్‌ వంటి మందులను నోటి ద్వారా సులువుగా, సమర్థంగా శరీరంలోకి చేరవేయడానికి రోబోటిక్‌ మాత్రలను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. శరీరంలోకి ఔషధాన్ని మెరుగ్గా బట్వాడా చేయడం వైద్యశాస్త్రంలో కీలకం. జీర్ణవ్యవస్థలోని ఆమ్లాలు, ఎంజైమ్‌లు, మ్యూకస్‌ బ్యారియర్‌ను తట్టుకుంటూ నిర్దేశిత భాగానికి మందును చేరవేయాల్సి ఉంటుంది. ప్రొటీన్లు లేదా న్యూక్లిక్‌ ఆమ్లాలు కలిగిన మందులను ప్రస్తుతం ఇంజెక్షన్ల రూపంలో ఇవ్వడం కుదురుతోంది. ఈ నేపథ్యంలో ఇన్సులిన్‌ వంటి భారీ ప్రొటీన్‌ ఔషధాలను నోటి ద్వారా తీసుకోవడానికి వీలు కల్పించే రోబో క్యాప్‌ను అమెరికాలోని ఎంఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అది చిన్న పేగు వద్దకు చేరుకున్నాక మ్యూకస్‌ బ్యారియర్‌ గుండా వెళ్లి, పేగుకు పైపూతగా ఉన్న కణాల్లోకి ఔషధాన్ని నేరుగా చేరవేస్తుంది. ఈ రోబోటిక్‌ పిల్‌ను జంతువుల్లో పరీక్షించారు. సాధారణ క్యాప్సూల్‌తో పోలిస్తే ఈ మాత్ర ద్వారా 20-40 రెట్లు ఎక్కువగా మందును చేర వేయవచ్చని తేల్చారు.

గ్రహశకలం కక్ష్యను మార్చిన డార్ట్‌ ప్రయోగం విజయవంతం: నాసా

గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పును నివారించగల సామర్థ్యాలను సముపార్జించుకోవడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ‘డబుల్‌ ఆస్ట్రాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ (డార్ట్‌)’ ప్రయోగం విజయవంతమైంది. సెప్టెంబరు 26న డార్ట్‌ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్‌ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్‌ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటు చేసుకున్నట్లు నాసా ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగని తెలిపింది.

‘విన్‌కోవ్‌-19’ రెండో దశ ప్రయోగ పరీక్షలు విజయవంతం

కొవిడ్‌ చికిత్సకు గాను గుర్రాల నుంచి సేకరించిన యాంటీబాడీలతో అభివృద్ధి చేసిన ‘విన్‌కోవ్‌-19’ ఔషధం రెండోదశ ప్రయోగ పరీక్షలు (క్లినికల్‌ ట్రయల్స్‌) విజయవంతంగా పూర్తిచేసినట్లు విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు మూడో దశ ప్రయోగ పరీక్షలు మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ‘విన్‌కోవ్‌-19’ని అభివృద్ధి చేశాయి. ఈ ఏడాది సెప్టెంబరులో పూర్తిచేసిన రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో దేశంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో 200 మంది రోగులపై పరీక్షించినట్లు విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ తెలిపింది. ఈ తరహా ఔషధం భారత్‌లో ఇదే మొదటిదని సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌ అన్నారు.

జ్ఞాపకాలను పదిలపరచడంలో చిన్న మెదడుకూ పాత్ర

జ్ఞాపకాలను, భావోద్వేగ అనుభూతులను భద్రపరచడంలో పెద్ద మెదడుతో పాటు చిన్నమెదడూ ముఖ్యపాత్ర వహిస్తుందని స్విట్జర్లాండ్‌ బాసెల్‌ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇంతకాలం చిన్న మెదడు శారీరక కదలికలను నియంత్రిస్తుందనే తెలుసు. మెదడులోని అమిగ్డలా భావోద్వేగాలను పెద్దమెదడులో నిల్వ చేస్తుంది. తాజాగా చిన్న మెదడుకూ ఇందులో పాత్ర ఉందని తేలింది. పరిశోధనలో పాల్గొన్నవారికి సానుకూల, ప్రతికూల, తటస్థ భావోద్వేగాలను కలిగించే చిత్రాలను చూపుతూ వారి మెదడులను ఎంఆర్‌ఐ స్కాన్‌ చేశారు. తటస్థ చిత్రాలకన్నా సానుకూల, ప్రతికూల భావోద్వేగాలు లేదా జ్ఞాపకాలను రేపే చిత్రాలను మెదడు బాగా గుర్తుంచుకుంటుందని తేలింది. జ్ఞాపకాల నిల్వలో పెద్దమెదడుతో పాటు చిన్న మెదడూ క్రియాశీల పాత్ర పోషిస్తుందని వెల్లడైంది. తాజా పరిశోధన మానసిక ఒత్తిడి చికిత్సకు ఉపకరిస్తుంది.

ముగిసిన మంగళయాన్‌ ప్రస్థానం

అంచనాలను మించి పనిచేసిన భారత తొలి అంగారక ఉపగ్రహం మంగళయాన్‌ ప్రస్థానం ముగిసిపోయినట్లు తెలుస్తోంది. ఆ వ్యోమనౌకలో ఇంధనం, బ్యాటరీ స్థాయి సురక్షిత పరిమితి కన్నా తక్కువకు పడిపోవడంతో దీని సుదీర్ఘ పరిశోధనలకు తెరపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.450 కోట్లతో చేపట్టిన మంగళయాన్‌ను 2013 నవంబరు 5న పీఎస్‌ఎల్‌వీ-సి25 రాకెట్‌ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. 2014 సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. తద్వారా తొలి ప్రయత్నంలోనే ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. నాటి నుంచి ఆ వ్యోమనౌక అప్రతిహతంగా సేవలు అందిస్తూనే ఉంది. నిజానికి ఆరు నెలలు పాటు మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. అయితే అంచనాలను మించి దాదాపు 8 ఏళ్లపాటు సేవలు అందించింది. అంగారకుడికి సంబంధించిన 8 వేలకుపైగా ఫొటోలను పంపింది. ఆ గ్రహ అట్లాస్‌ను అందించింది. సూర్యకాంతి లభించని ‘గ్రహణం దశ’ను తప్పించుకోవడానికి ఈ వ్యోమనౌక కక్ష్యను పలుమార్లు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా అందులోని ఇంధనం ఖర్చయింది. ఇటీవల వరుసగా ఇలాంటి గ్రహణ పరిస్థితులు ఎదురయ్యాయని ఇస్రో వర్గాలు తెలిపాయి. అందులో ఒకదాని నిడివి ఏడున్నర గంటలు ఉందని పేర్కొంది. గంటన్నర గ్రహణాన్ని మాత్రమే తట్టుకునేలా ఈ ఉపగ్రహ బ్యాటరీని రూపొందించారు. అంతకన్నా ఎక్కువసేపు సూర్యకాంతి లభించకుంటే బ్యాటరీలో ఛార్జింగ్‌ సురక్షిత పరిమితి కన్నా తక్కువ స్థాయికి పడిపోతుంది. ‘‘ప్రస్తుతం ఈ వ్యోమనౌకలో ఇంధనం లేదు. బ్యాటరీ కూడా డ్రెయిన్‌ అయింది. మంగళయాన్‌తో సంబంధాలు తెగిపోయాయి’’ అని ఇస్రో వర్గాలు తెలిపాయి. అధికారికంగా ఆ సంస్థ నుంచి దీనిపై ప్రకటన వెలువడలేదు.

చంద్రుడిపై పుష్కలంగా సోడియం

చంద్రుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఉపగ్రహం కీలక ఆవిష్కారం చేసింది. జాబిల్లి ఉపరితలంపై పుష్కలంగా సోడియం ఉన్నట్లు తొలిసారిగా గుర్తించింది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్‌-1లోని ఎక్స్‌రే ఫ్లోరెసెన్స్‌ స్పెక్ట్రోమీటర్‌ (సీ1ఎక్స్‌ఎస్‌) సోడియం ఆచూకీని పసిగట్టింది. జాబిల్లిపై ఈ మూలకం ఏ మేర ఉందన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా చంద్రయాన్‌-2 ఆవివరాలను వెలుగులోకి తెచ్చింది. ఆ ఉపగ్రహంలోని ‘క్లాస్‌’ అనే సాధనం సోడియం విస్తృతిని మ్యాప్‌ చేసింది. ఈ పరికరాన్ని బెంగళూరులోని యు.ఆర్‌.రావు ఉపగ్రహ కేంద్రం రూపొందించింది. దీని సున్నితత్వం ఎక్కువ. అందువల్ల సోడియం సంకేతాలను పట్టుకోగలిగింది. చంద్రుడి ఉపరితలం నుంచి వెలువడుతున్న సోడియం అణువుల సంకేతాలనూ క్లాస్‌ పరికరం గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది. సౌర గాలులు లేదా అతినీలలోహిత రేడియోధార్మికత నేలను తాకడం వల్ల అవి విడుదలవుతున్నట్లు తెలిపింది.

ఏఐతో గుండె జబ్బు గుర్తింపు

కంట్లోని రెటీనాకు సంబంధించిన రక్తనాళాలను కృత్రిమ మేధ (ఏఐ) సాధనంతో చిత్రీకరించడం ద్వారా గుండె జబ్బు, మరణం ముప్పును అత్యంత కచ్చితత్వంతో పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం రక్త పరీక్షలు, రక్త పోటు పరిశీలన అవసరం ఉండదని పేర్కొన్నారు. శరీరానికి కోత పెట్టకుండానే హృద్రోగాలను సమర్థంగా స్క్రీన్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. గుండె జబ్బులు, గుండె వైఫల్యం, పక్షవాతం సహా రక్త ప్రసరణకు సంబంధించిన రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయి. ఈ వ్యాధి బారినపడే ముప్పు ఎవరికి ఉందన్నది పసిగట్టడం కష్టం. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ ఏఐతో కూడిన ‘క్వార్జ్‌’ అనే అల్గోరిథమ్‌ను తయారు చేశారు. దీన్ని 88,052 మందికి సంబంధించిన రెటీనా చిత్రాలపై పరీక్షించి చూశారు. రక్తనాళాల తీరుతెన్నుల ద్వారా రక్తప్రసరణ రుగ్మతలను గుర్తించొచ్చని తేల్చారు.

విద్యుత్‌ కారుకు ఐదు నిమిషాల్లోనే ఛార్జింగ్‌

భవిష్యత్‌తరం అంతరిక్ష ప్రయోగాల కోసం అమెరికా రోదసి సంస్థ నాసా ఆర్థిక తోడ్పాటుతో రూపొందించిన పరిజ్ఞానం భూమి మీద విద్యుత్‌ వాహనాలకూ ఉపయోగపడనుంది. ఐదు నిమిషాల్లోనే వీటిని ఛార్జి చేయడానికి వీలు కల్పిస్తుంది. ‘ఫ్లో బాయిలింగ్‌ అండ్‌ కండెన్సేషన్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ అనే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ప్రయోగాలకు ఇది ఉపకరిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలతో విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కు 20 నిమిషాల నుంచి కొన్ని గంటల సమయం పడుతోంది. దీన్ని ఐదు నిమిషాలకు తగ్గించాలంటే ఛార్జింగ్‌ వ్యవస్థలు 1,400 యాంపియర్ల మేర కరెంటును సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే దీని వల్ల తీవ్ర స్థాయిలో వేడి ఉత్పత్తవుతుంది. కొత్త విధానంతో ఉష్ణాన్ని నియంత్రిస్తూనే ఐదు నిమిషాల్లోపే ఛార్జింగ్‌ చేయడానికి వీలవుతుంది.

ఏఐతో గుండె జబ్బు గుర్తింపు

‣ ‘క్వార్జ్‌’ అనే అల్గోరిథమ్‌ తయారు కంట్లోని రెటీనాకు సంబంధించిన రక్తనాళాలను కృత్రిమ మేధ (ఏఐ) సాధనంతో చిత్రీకరించడం ద్వారా గుండె జబ్బు, మరణం ముప్పును అత్యంత కచ్చితత్వంతో పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం రక్త పరీక్షలు, రక్త పోటు పరిశీలన అవసరం ఉండదని పేర్కొన్నారు. శరీరానికి కోత పెట్టకుండానే హృద్రోగాలను సమర్థంగా స్క్రీన్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. గుండె జబ్బులు, గుండె వైఫల్యం, పక్షవాతం సహా రక్త ప్రసరణకు సంబంధించిన రుగ్మతలు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయి. ఈ వ్యాధి బారినపడే ముప్పు ఎవరికి ఉందన్నది పసిగట్టడం కష్టం. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ ఏఐతో కూడిన ‘క్వార్జ్‌’ అనే అల్గోరిథమ్‌ను తయారు చేశారు. దీన్ని 88,052 మందికి సంబంధించిన రెటీనా చిత్రాలపై పరీక్షించి చూశారు. రక్తనాళాల తీరుతెన్నుల ద్వారా రక్తప్రసరణ రుగ్మతలను గుర్తించొచ్చని తేల్చారు.

విద్యుత్‌ కారుకు ఐదు నిమిషాల్లోనే ఛార్జింగ్‌

భవిష్యత్‌తరం అంతరిక్ష ప్రయోగాల కోసం అమెరికా రోదసి సంస్థ నాసా ఆర్థిక తోడ్పాటుతో రూపొందించిన పరిజ్ఞానం భూమి మీద విద్యుత్‌ వాహనాలకూ ఉపయోగపడనుంది. ఐదు నిమిషాల్లోనే వీటిని ఛార్జి చేయడానికి వీలు కల్పిస్తుంది. ‘ఫ్లో బాయిలింగ్‌ అండ్‌ కండెన్సేషన్‌ ఎక్స్‌పెరిమెంట్‌’ అనే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ప్రయోగాలకు ఇది ఉపకరిస్తుంది. ప్రస్తుత వ్యవస్థలతో విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కు 20 నిమిషాల నుంచి కొన్ని గంటల సమయం పడుతోంది. దీన్ని ఐదు నిమిషాలకు తగ్గించాలంటే ఛార్జింగ్‌ వ్యవస్థలు 1,400 యాంపియర్ల మేర కరెంటును సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే దీని వల్ల తీవ్ర స్థాయిలో వేడి ఉత్పత్తవుతుంది. కొత్త విధానంతో ఉష్ణాన్ని నియంత్రిస్తూనే ఐదు నిమిషాల్లోపే ఛార్జింగ్‌ చేయడానికి వీలవుతుంది.

మాటతీరుతో పార్కిన్సన్స్‌ వ్యాధిని పసిగట్టే యాప్‌

కేవలం మాటతీరును బట్టి పార్కిన్సన్స్‌ వ్యాధి, తీవ్రస్థాయి కొవిడ్‌ను నిర్ధారించగల సరికొత్త యాప్‌ను ఆస్ట్రేలియాలోని రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్‌ఎంఐటీ) శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఈ యాప్‌లో తొలుత వ్యక్తుల మాటల్ని రికార్డు చేయాలి. అనంతరం అందులోని కృత్రిమ మేధ (ఏఐ) 10 సెకన్లలోనే వ్యాధి నిర్ధారణ ప్రక్రియను అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేస్తుంది. స్వరంలోని కాఠిన్యం, వణుకు, మందగమనం అనే మూడు లక్షణాల్లో మార్పులను గుర్తించడం ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

భారత వాయుసేనలోకి తేలికపాటి పోరాట హెలికాప్టర్‌

దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్‌) భారత వాయుసేనలో చేరాయి. సియాచిన్, తూర్పు లద్దాఖ్‌ వంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో శత్రువుపై భీకరంగా విరుచుకుపడే సత్తా కలిగిన ఈ లోహవిహంగాల వల్ల మన రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. కార్గిల్‌ యుద్ధంలో ఇలాంటి హెలికాప్టర్‌ అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ దీన్ని అభివృద్ధి చేసింది. ‣ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, త్రిదళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి ఈ హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టారు. ఈ లోహవిహంగానికి ‘ప్రచండ్‌’ అని రాజ్‌నాథ్‌ పేరు పెట్టారు. ఇందులో ఆయన గగనవిహారం కూడా చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట హెలికాప్టర్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇది శత్రువుపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదని తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భద్రతకు తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లకు జల ఫిరంగులతో వందన సమర్పణ చేశారు. ‣ ప్రచండ్, గాల్లో అద్భుత విన్యాసాలు చేయగలదు. దీని ధాటికి శత్రువు అయోమయంలో పడిపోవడం ఖాయం. 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్, టేక్‌ ఆఫ్‌ కాగలదు. ‣ శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్‌ సామర్థ్యం దీని సొంతం. రాత్రిపూట, అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు. అకస్మాత్తుగా నేలకూలినా తట్టుకోగల దృఢ ల్యాండింగ్‌ గేర్‌ దీని సొంతం. ‣ తొలిదశలో లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఈ హెలికాప్టర్లను మోహరించనున్నారు.

మూర్ఛ రకాలను గుర్తించే అల్గారిథమ్‌

మూర్ఛ రకాలను గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈఈజీ (ఎలక్ట్రో ఎన్సీపాలోగ్రామ్స్‌)ను వర్గీకరించే అల్గారిథమ్‌ను బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ), ఎయిమ్స్‌ (రుషికేశ్‌) నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మెదడు నుంచి స్వల్పకాలంలో వెల్లడయ్యే విద్యుత్తు సంకేతాల తీవ్రతను బట్టి మూర్ఛ సమస్యను గుర్తిస్తారు. ఇందుకోసం ఈఈజీ విధానాన్ని అనుసరించినా లోతుగా అధ్యయనం చేసేంత సమయంతో పాటు సంకేతాలు ఉండవు. పైగా మూర్ఛల్లోని రకాలను (ఫోకల్, జనరల్‌ ఎపిలెప్సీ) గుర్తించేందుకు పాత విధానం సహకరించదని ఐఐఎస్‌సీ ఎక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ (డీఈఎస్‌ఈ) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆచార్య హార్దిక్‌ పాండ్య తెలిపారు. తాము రూపొందించిన అల్గారిథమ్‌లతో మెదడు నుంచి వెల్లడయ్యే సంకేతాల డీకోడింగ్‌లను మూర్ఛ రకాలను గుర్తించేందుకు వీలుపడుతుందన్నారు. 88 మంది మెదడు సంకేతాలను 45 నిమిషాల పాటు వర్గీకరించి అధ్యయనం చేశామని చెప్పారు. సంకేతాల క్యుములేటివ్‌ స్పైక్‌ వేవ్‌ కౌంట్‌ ద్వారా సాధారణ, ఫోకల్, జనరలైజ్డ్, ఆబ్‌సెన్స్‌ వంటి నాలుగు రకాల సంకేతాలను రికార్డు చేసి తీవ్రతల ఆధారంగా మూర్ఛలకు చికిత్స చేసేందుకు వీలుంటుందని డీఈఎస్‌ఈ పీహెచ్‌డీ విద్యార్థి రతిన్‌ జోషి చెప్పారు.

దివ్యాంగులకు కృత్రిమ స్మార్ట్‌ లింబ్‌ను అభివృద్ధి చేసిన ఇస్రో

తాను ఉపయోగించే మైక్రో ప్రాసెసర్లతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృత్రిమ స్మార్ట్‌ లింబ్‌ను అభివృద్ధి చేసింది. దీని సాయంతో దివ్యాంగులు సులువుగా నడిచే వీలుంది. మైక్రో ప్రాసెసర్‌-కంట్రోల్డ్‌ నీస్‌గా (ఎంపీకే) పిలిచే లింబ్‌ బరువు సుమారు 1.6 కిలోలు ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఎంపీకేలను ఇస్రో పలు సంస్థలతో కలిసి సిద్ధం చేస్తోంది. లింబ్‌లో మైక్రోప్రాసెసర్, హైడ్రాలిక్‌ డంపర్, మోకాలి యాంగిల్‌ సెన్సర్లు, కాంపోజిట్‌ కేస్, లిథియం అయాన్‌ బ్యాటరీ, ఎలక్ట్రికల్‌ హార్నెస్, ఇంటర్‌ఫేస్‌ ఎలిమెంట్స్‌ వంటివి ఉన్నాయని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇది సెన్సర్‌ డేటా ఆధారంగా నడక స్థితిని గుర్తిస్తుంది. కొన్ని మార్పులతో కావాల్సిన నడక వేగాన్ని సాధించడానికి అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో ఎంపీకే తయారీకి రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా ఖర్చవుతోందని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. వాణిజ్య అవసరాల కోసం తయారు చేయనుండటంతో భవిష్యత్తులో ధర తగ్గి రూ.4-5 లక్షలు ఉంటుందని ఇస్రో అంచనా వేస్తోంది.