ఒకే దేశం.. ఒకే పోలీస్ యూనిఫామ్
దేశ ఐక్యతకు, సమగ్రతకు భంగం కలిగించే శక్తులను కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ అమలు చేసే విధానం గురించి ఆలోచించాలన్నారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రాల హోం మంత్రుల చింతన శిబిరాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఒకే దేశం ఒకే యూనిఫాం.. అనేది ఒక ఆలోచన. నేను దీనిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేయట్లేదు. ఇది 5 నుంచి 100 ఏళ్లలో ఎప్పుడైనా అమలులోకి రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులకు ఒకే యూనిఫామ్ ఉండాలని భావిస్తున్నా. దీనివల్ల పోలీసు సిబ్బందికి ఉమ్మడి గుర్తింపు వస్తుంది. రాష్ట్రాలు కావాలంటే తమకు ఇష్టమైన సంఖ్య, గుర్తులను ఉంచుకోవచ్చు. ఈ ప్రతిపాదనపై రాష్ట్రాలు ఆలోచించి స్పందించాలని ప్రధాని కోరారు.
2024 నాటికల్లా అన్ని రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ శాఖలు
భారత శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ)లకు సవరణలు చేపట్టి పార్లమెంటు ముందుకు బిల్లులు తీసుకురానున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. సవరణలకు సంబంధించి రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున సూచనలు వచ్చాయనీ, వీటిపై నిశితంగా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన రాష్ట్రాల హోం మంత్రుల ‘మేధోమథన సదస్సు’ (చింతన్ శిబిర్)లో మాట్లాడారు. 2024 నాటికల్లా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) శాఖలు ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన వ్యవస్థ తయారు చేస్తాం. నేర న్యాయ విచారణలో మార్పుల కోసం ‘నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేశామని అమిత్‌షా తెలిపారు. అనంతరం హరియాణాలో రూ.6,629 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు.
జాతీయ హరిత భవనాల మండలితో టీఎస్‌ఐఐసీ ఒప్పందం
తెలంగాణలో కొత్తగా చేపట్టిన 40 కొత్త పార్కుల్లో హరిత నిబంధనల అమలు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ), జాతీయ హరిత భవనాల మండలి (ఐజీబీసీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ‘జాతీయ హరిత భవనాల కాంగ్రెస్ - 2022’లో ఈ మేరకు ఒప్పంద పత్రాలపై టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ శేఖర్‌రెడ్డిలు సంతకాలు చేశారు.
90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు
సరిహద్దుల ఆవల ఉగ్రవాద చర్యలను రెచ్చగొట్టడాన్ని రాజకీయ సమస్యగా అభివర్ణించలేమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. దిల్లీలో నిర్వహించిన 90వ ఇంటర్‌పోల్ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం, ఉగ్రవాదులకు అంతర్జాతీయంగా ఒక నిర్దిష్ట నిర్వచనం ఇవ్వాల్సి ఉంది. ఉగ్రవాదంపై అన్ని దేశాల్లోనూ ఒకే రకమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీన్ని రాజకీయ సమస్యగా ఏమాత్రం చూడలేం. దీనిపై పోరాడటానికి ఇంటర్‌పోల్ చక్కటి వేదిక. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించి, సమాచారాన్ని పంచుకుంటూ ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టవచ్చు. ఈ కోణంలో మోదీ ప్రభుత్వం ఇప్పటికే అడుగులు వేస్తోందని తెలిపారు.
2025 నాటికి రూ.40 వేల కోట్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు: రాజ్‌నాథ్
రక్షణ రంగంలో ఎగుమతుల పెంపు, దేశీయ భద్రతా పరిశ్రమల దీర్ఘకాలిక సుస్థిర వృద్ధికి దోహదపడుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో 2025 నాటికి రూ.1.76 లక్షల కోట్ల లావాదేవీలు అంచనా వేస్తుండగా, అందులో రూ.40 వేల కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న 12వ రక్షణ రంగ ప్రదర్శన (డిఫెన్స్ ఎక్స్‌పో)లో భాగంగా అమెరికా - భారత్ వ్యాపార మండలి, భారత భద్రతా పరికరాల తయారీదారుల సంఘం నిర్వహించిన సెమినార్‌లో రాజ్‌నాథ్ ప్రసంగించారు. రక్షణ సహకారంలో అమెరికా, భారత్‌లకు గల ఉమ్మడి అవకాశాలు, అత్యున్నత సాంకేతికత బదిలీ, మేకిన్ ఇండియా తదితర అంశాలపై మాట్లాడారు. కేవలం స్వదేశీ అవసరాలు తీర్చడం ద్వారా రక్షణ రంగంలో పెట్టుబడులు లాభదాయకం కాదని, విదేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ‘రక్షణ రంగంలో పెట్టుబడులు’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలోనూ రాజ్‌నాథ్ మాట్లాడారు. డిఫెన్స్ ఎక్స్‌పో - 2022లో రూ.1.53 లక్షల కోట్ల విలువైన 451 ఒప్పందాలు కుదిరాయని రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ వెల్లడించారు.
నేరగాళ్లకు సురక్షిత ప్రాంతాలు ఉండొద్దు
అవినీతిపరులు, ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల ముఠాలు, వన్యప్రాణుల వేటగాళ్లు, వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏ దేశంలోనూ సురక్షిత ప్రాంతాలు లేకుండా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ప్రపంచం యావత్తు ఒకటిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రారంభమైన ఇంటర్‌పోల్ 90వ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. 195 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంపును, రూ.వంద నాణేన్ని ప్రధాని విడుదల చేశారు. పాతికేళ్ల తర్వాత మన దేశం ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. సదస్సులో పాల్గొన్న పాక్ ప్రతినిధి బృందానికి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహిసిన్ భట్ నేతృత్వం వహించారు.
ఆహార భద్రతకు బ్రిటన్, భారత్ కలిసి పనిచేయాలి
ప్రపంచ ఆహార భద్రతకు బ్రిటన్, భారత్ కలిసి పనిచేయాలని బ్రిటన్ ఉప హైకమిషనర్ గారత్ విన్ ఒవెన్ అన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం (క్రిడా)లో ‘‘పంటలకు పోషకాల నిర్వహణ’’ అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఆంగ్లో అమెరికన్ క్రాప్ న్యూట్రియెంట్స్ (ఏఏసీఎన్) సంస్థ, క్రిడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు గారత్ విన్ ఒవెన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటల ఉత్పాదకత పెరగడానికి భూమి యాజమాన్యం, ఆధునిక పరిజ్ఞాన వినియోగం ముఖ్యమని తెలిపారు.
ఒడిశాలో ఉత్తమ వనరులు, సౌకర్యాలు: సీఎం నవీన్ పట్నాయక్
ఒడిశాలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు. ఒడిశాలో కొనసాగుతున్న సుస్థిర ప్రభుత్వం పారిశ్రామీకరణకు పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి సహకారం ఉంటుందని, తమ సర్కారు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఒడిశా ప్రభుత్వం, ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో నవీన్ పాల్గొని ప్రసంగించారు. ‘‘భారత్‌లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఒడిశా. గత 15 ఏళ్ల కాలంలో జాతీయ సగటు కంటే స్థిరమైన వృద్ధి సాధించింది’’ అని తెలిపారు.
పారిశ్రామికవేత్తలతో చర్చలు
అంతకుముందు ఆయన తెలంగాణలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఒరాకిల్ సంస్థ ఎండీ శైలేంద్ర కుమార్, మైక్రోసాఫ్ట్ అధినేత రాజీవ్ కుమార్, భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఆ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్ల, దివ్యశక్తి గ్రూపు అధినేత రవీంద్ర అగర్వాల్ తదితర ప్రముఖులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ, ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఆహారశుద్ధి, విద్యుత్, జౌళి, ఉక్కు, అల్యూమినియం, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని తెలిపారు. పెట్టుబడిదారులకు ఏకగవాక్ష అనుమతులు ఇస్తామన్నారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు భువనేశ్వర్‌లో నిర్వహించే ఒడిశాలో తయారీ (మేకిన్ ఒడిశా కాంక్లేవ్ - 22) సదస్సులో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.
ద్రవ్యోల్బణం భారత్‌లోనే తక్కువ: ఆర్థికమంతి సీతారామన్
రూపాయి బలహీనపడటం లేదని, డాలర్ విలువే బలపడుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఏడాది డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 8% క్షీణించడంపై ఆమె ఇలా పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్లే వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు వివరించారు. రూపాయి విలువను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించడం లేదని, ఒడుదొడుకులను తగ్గించేందుకు మాత్రమే ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు.
చట్టాలు సామాన్యులకు అర్థమవ్వాలి: ప్రధాని మోదీ
చట్టాల్లోని క్లిష్టమైన భాషా ప్రయోగం వల్ల సామాన్యులు అనవసరంగా డబ్బు ఖర్చుచేసి న్యాయం కోసం అటూఇటూ తిరగాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సామాన్యులకు అర్థమయ్యేలా చట్టాలు ఉంటే వాటి ప్రభావం బాగుంటుందన్నారు. ఆయన గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరిగిన రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘ప్రభుత్వం లేదన్న భావన కానీ, ప్రభుత్వ ప్రభావం పెరిగిందన్న ఆలోచన కానీ ప్రజల్లో రాకూడదు. గత 8 ఏళ్లలో 1500కి పైగా అప్రస్తుత చట్టాలను రద్దు చేశాం. బానిసత్వంనాటి ఎన్నో చట్టాలు ఇప్పటికీ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. అలాంటివన్నీ రద్దు చేసి ప్రస్తుత అవసరాలకు తగ్గ చట్టాలు చేయడం చాలా అవసరం. ప్రజలకు సులభ జీవనం, సులభ న్యాయం అందించే కోణంలో రాష్ట్రాల్లోని చట్టాలపై సమీక్ష జరగాలి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ముగిసిన ప్రపంచ జియోస్పేషియల్ సదస్సు
సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా అట్టడుగు ప్రజలకు, సామాన్యులకు ఉపయోగపడేలా ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రామీణులు, గిరిజనుల అభ్యున్నతికి తోడ్పడేలా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అన్వయించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంలో భారత్ ఇప్పటికే ముందుందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, గ్రామీణ - పట్టణాభివృద్ధి, విపత్తుల నిర్వహణ, వాతావరణ మార్పులను గుర్తించడం, అడవులను కాపాడటం, జలవనరుల నిర్వహణ తదితర అంశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. జీ-20 దేశాలకు సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సులకు 2023లో భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి తెలిపారు. జీ-20 దేశాలకు సంబంధించి 45 రోజుల పాటు సుమారు 250కి పైగా సమావేశాలు మన దేశంలో జరగనున్నాయని వెల్లడించారు.
దార్శనికత, పటిష్ఠ ప్రణాళికలే సింగపూర్ విజయ రహస్యం
పటిష్ఠమైన ప్రణాళికలతో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరాలు, పట్టణాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సింగపూర్ ల్యాండ్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోలిన్‌లో అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభాతో పట్టణాలు, నగరాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియో స్పేషియల్ టెక్నాలజీ సదస్సులో ‘సమీకృత అభివృద్ధి, మెరుగైన సమాజం, డిజిటల్ సాంకేతికతతో పెనుమార్పులు, వాతావరణ సవాళ్లు’ అనే అంశంపై చర్చించారు. పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ అంశంపై మాట్లాడారు. సింగపూర్ విజయాలను కోలిన్‌లో వివరించారు. తమ దేశం అతి తక్కువ భూభాగం కలిగిన చిన్న నగరమైనా, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి గత పాలకుల దార్శనికతే కారణమని పేర్కొన్నారు.
జియోస్పేషియల్ సాంకేతికతను అందిపుచ్చుకున్నాం: ప్రధాని మోదీ
సాంకేతికత, నైపుణ్యం అనే కీలకమైన మూలస్తంభాల ప్రాతిపదికగా భారతదేశ అభివృద్ధి పయనం సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆవిష్కరణల స్ఫూర్తి యువ భారతం ప్రత్యేకత అని అన్నారు. ప్రపంచంలోనే స్టార్టప్ హబ్‌లలో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా 2021 నుంచి అంకురాలు రెట్టింపు అయ్యాయన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో ప్రసంగాన్ని చేశారు. జియోస్పేషియల్ టెక్నాలజీ అనంతమైన అవకాశాలకు కల్పిస్తుందన్నారు. సమీకృత పట్టణాభివృద్ధి, విపత్తుల నిర్వహణ, వాతావరణ మార్పులను గుర్తించడం, అడవుల సంరక్షణ, జల వనరుల నిర్వహణ, ఎడారీకరణను ఆపడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టి, ఆహార భద్రత వంటి వాటికి ఈ సాంకేతికత కీలకమని తెలియజేశారు.
‣ రియల్ టైం డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. స్వామిత్వ పథకం ద్వారా డ్రోన్లను ఉపయోగించి గ్రామాల్లో ఆస్తుల మ్యాపింగ్ చేయడంతో పాటు ఆస్తికి సంబంధించి సాధికార కార్డులను అందిస్తున్నామని ప్రధాని మోదీ వివరించారు.
జీవశాస్త్రాల రాజధానిగా హైదరాబాద్
ప్రపంచ జీవశాస్త్రాల రాజధానిగా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. హైదరాబాద్ ఔషధనగరి నిర్మాణం, మరిన్ని మౌలిక వసతుల వృద్ధితో భారీగా కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో ఆయన ప్రపంచ ఆర్థిక వేదిక, తెలంగాణ ఔషధ రంగ పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. వేదిక ఆరోగ్య సంరక్షణ విభాగాధిపతి శ్యామ్‌బిషెన్, భారత్, దక్షిణాసియా విభాగాల అధిపతి గుత్తా శ్రీరాం, నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం అధిపతి పురుషోత్తం కౌశిక్, భారత వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి ఎస్.దివాద్కర్, తెలంగాణ ఔషధ రంగ ప్రముఖులు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఛైర్మన్ సతీష్ రెడ్డి, బయోలాజికల్-ఇ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్‌చంద్రారెడ్డి, నోవార్టిస్ బిజినెస్ సర్వీసెస్ గ్లోబల్ విభాగాధిపతి నవీన్ గుళ్లపల్లి, మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ సెంటర్ సీనియర్ డైరెక్టర్ దివ్య జోషి, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహ రెడ్డి, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జీవశాస్త్రాల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రపంచ ఆరోగ్యరంగంలో హైదరాబాద్ పాత్రను విస్తరించడం వంటి అంశాలపై చర్చించారు.
జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై సమర్థ విధానం తీసుకురానున్న భారత్
భారతదేశం జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకుని నిత్యం ఎదురయ్యే సమస్యలు, ఆధునిక సవాళ్లకు పరిష్కారం చూపుతూ కొత్త ఆవిష్కరణలతో ముందుకు వెళ్లడానికి విధాన రూపకల్పన చేస్తోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుడు పి.ఎస్.ఆచార్య అన్నారు. జాతీయ జియోస్పేషియల్ విధానం ముసాయిదాను గత ఏడాది రూపొందించిందని, విస్తృత స్థాయిలో చర్చ అనంతరం పూర్తి స్థాయి విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ముసాయిదా రూపకల్పనలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు, నిపుణుల తోడ్పాటు తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో సోమవారం ‘ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్’ ప్రారంభమైంది. ఐక్యరాజ్యసమితి, కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సాంకేతికత వినియోగం, విస్తృతి, అవకాశాలు, వివిధ రంగాలకు అందే తోడ్పాటు సహా వివిధ అంశాలపై పలువురు మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలకు ఇది కీలకంగా మారుతోందన్నారు. భారత్ రూపొందిస్తున్న జాతీయ విధానం పౌరుల కేంద్రంగా ఉంటుందని ఆచార్య అన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని సైన్స్, టెక్నాలజీ శాఖ (డీఎస్‌టీ) మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉపాధి కల్పనకు ఈ సాంకేతికత గొప్ప అవకాశాలను కల్పిస్తుందన్నారు. సమీకృత అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి ఇది కీలకమని, ఆర్థిక వ్యవహారాలు సహా అనేక అంశాల్లో పెనుమార్పులు తీసుకువస్తుందని తెలిపారు.