వార్తల్లో ప్రాంతాలు

బోర్లాంలో రెండు వేల ఏళ్ల నాటి రాతి పాత్ర గుర్తింపు

చరిత్ర పరిశోధకులకు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి రాతి పాత్ర లభించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు పక్కన ఉన్న బోర్లాం గ్రామంలోని ఓ మట్టిదిబ్బపై ఈ చారిత్రక అవశేషం లభించిందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్‌ సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.శ్రీనివాసన్‌ తెలిపారు. రాతి పాత్రపై లఘు శాసనం ఉందని, అది క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో ఉందన్నారు. మంజీరా నది పరీవాహక ప్రాంతంలో దొరికిన బ్రాహ్మీ లఘు శాసనాల్లో ఇది ఆరవదని, ఈ రాతి పాత్ర మంజీరా నదికి 5 కిలోమీటర్ల దూరంలోనే లభించిందని పేర్కొన్నారు. ఇది శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషమని ఆయన వివరించారు. పాత్రపై ఉన్న శాసనంలో ‘హిమాబుధియ’ అయిదక్షరాల బ్రాహ్మీ లిపి ఉందని, హిమా పదం అర్థం స్త్రీ బౌద్ధభిక్షువు కావచ్చని ఈ శాసనాన్ని పరిశీలించిన ఎపిగ్రఫిస్ట్‌ మునిరత్నం రెడ్డి తెలిపారు.

బార్‌ - టెయిల్డ్‌ గాడ్‌విట్‌ ప్రపంచ రికార్డు

అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వరకు 13,560 కిలోమీటర్లు (8,435 మైళ్లు) ఏకబిగిన ఎగిరిన ఆ పక్షి.. బార్‌ - టెయిల్డ్‌ గాడ్‌విట్‌. తెలుగులో దీన్ని నేల నెమలిగా పిలుస్తారు. వలస పక్షుల జీవనయానంలో ఇది ప్రపంచ రికార్డుగా పక్షి నిపుణులు వెల్లడించారు. కేవలం అయిదు నెలల వయసున్న ఈ పక్షి అక్టోబర్‌ 13న అలాస్కా నుంచి బయలుదేరింది. పసిఫిక్‌ మహా సముద్రం మీదుగా 11 రోజుల నిర్విరామ పయనం తర్వాత అక్టోబర్‌ 24న టాస్మేనియాలోని ఆన్‌సాన్స్‌ తీరానికి చేరింది. జర్మనీకి చెందిన పక్షిశాస్త్ర సంబంధిత మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ వివరాలు వెల్లడించింది. ఉపగ్రహ జాడల ఆధారంగా ఆ పక్షి మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా 13,560 కి.మీ. పయనించినట్లు గుర్తించారు. ‣ అలాస్కా నుంచి కొన్ని పక్షులు వేసవి వలసకు బయలుదేరడానికి ముందు అంతర్జాతీయ పరిశోధన బృందం వాటి గమనాన్ని గుర్తించేందుకు వీలుగా జీపీఎస్‌ చిప్‌లు అమర్చినట్లు బర్డ్‌లైఫ్‌ టాస్మేనియా కన్వీనర్‌ ఎరిక్‌ వూలర్‌ తెలిపారు. రికార్డు సమయంలో పయనించిన గాడ్‌విట్‌ పక్షికి శాస్త్రవేత్తలు 234684 పేరిట శాటిలైట్‌ ట్యాగ్‌ నంబరు కూడా కేటాయించారు. అవిశ్రాంత ప్రయాణం కారణంగా పక్షి సగం బరువు కోల్పోయి ఉంటుందని, టాస్మేనియా విడిదిలో తిరిగి బలం పుంజుకొంటుందని వూలర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పక్షి నీటి పురుగులు తింటుంది. 2020లో ఇదే జాతి పక్షి అలాస్కా నుంచి న్యూజిలాండ్‌ వరకు ఆగకుండా 12,200 కి.మీ. ప్రయాణించగా ఇప్పటివరకు అదే అత్యధిక దూరంగా గిన్నిస్‌ రికార్డులకు ఎక్కింది.

‘స్కాల్‌’ హైదరాబాద్‌ ఛాప్టర్‌కి మూడో స్థానం

‘స్కాల్‌’ ఇంటర్నేషనల్‌ క్లబ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో హైదరాబాద్‌ ఛాప్టర్‌ మూడో స్థానంలో నిలిచింది. ఆతిథ్య, పర్యాటకంలో ‘స్కాల్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ వ్యాప్తంగా 96 దేశాలు, 332 నగరాల్లో స్కాల్‌ ఇంటర్నేషనల్‌కు విభాగాలు ఉన్నాయి. క్రొయేషియాలో జరిగిన ‘స్కాల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌’లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ‘స్కాల్‌ హైదరాబాద్‌’ ఛాప్టర్‌ మూడో స్థానంలో నిలిచిందని ఈ ఛాప్టర్‌ ప్రతినిధి మోహన్‌ తెలిపారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ ఛాప్టర్‌ ప్రథమ, టర్కీలోని అన్‌టాలియా ఛాప్టర్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నందిపేటలో పురాతన రాతి చిత్రాల గుర్తింపు

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట్‌ మండలం నందిపేట సమీపంలోని గజ్జెలగుట్టపై తామ్రయుగం (క్రీ.పూ. 4 వేల సంవత్సరాలు) నాటి రెండు రాతి చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. సొరంగం తరహా మార్గం నుంచి గుహలోకి చేతుల మీద పాకుతూ వెళ్లాలి. చివరి గుహలో 10-12 మంది నివసించేంత ఖాళీ స్థలం ఉంది. ఆ గుహ ఆదిమ మానవుని ఆవాసమై ఉంటుంది. అందులో రాతి చిత్రాలతో చిరుత పులి, ఎదురుగా వేటగాడి బొమ్మ కనిపిస్తున్నాయని బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ తెలిపారు. గజ్జెలగుట్టపై పదుల సంఖ్యలో సమాధులు కూలిపోయి కనిపిస్తున్నాయి. అవి ఇనుపయుగం (క్రీ.పూ. 2 వేల నుంచి క్రీ.శ. 500 సం. వరకు) కాలం నాటివని ఆయన వివరించారు.