వార్తల్లో వ్యక్తులు

మాల్టాలో భారత హైకమిషనర్‌గా గ్లోరియా

హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసిన గ్లోరియా గాంగ్తే మాల్టా దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు. మణిపుర్‌ రాష్ట్రం చురచందూర్‌ జిల్లాలో 1976లో జన్మించిన గ్లోరియా బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్‌లోనే సివిల్స్‌ శిక్షణ తీసుకొని తొలి ప్రయత్నంలోనే 2000లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు.

హైడ్రోజన్‌ సాయంతో కార్లకు మైలేజీ పెంపు

పెట్రోల్‌ లేదా డీజిల్‌తో నడిచే కారుకు నీటిలోని హైడ్రోజన్‌ సాయంతో మైలేజీ పెంచేలా తాను రూపొందించిన యంత్ర పరికరానికి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ లభించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డు ఉద్యోగి కాశీనాథుని పూర్ణ మల్లికార్జున్‌రావు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆయన నివాసంలో ఈ మేరకు వివరాలు తెలిపారు. ఏడేళ్ల పాటు శ్రమించి తాను నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరు చేసి కారు ఇంజిన్‌కు అందించే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. భారత ప్రభుత్వ పేటెంట్‌ సంస్థకు దరఖాస్తు చేయగా పలు దశల్లో ఇంజినీర్లు పరిశీలించిన తరువాత అక్టోబరు 27న పేటెంట్‌ మంజూరు చేశారన్నారు.

‣ రూ.10 వేల వ్యయంతో నీటి నుంచి హైడ్రోజన్‌ వేరు చేసే ఈ పరికరాన్ని కారు ఇంజిన్‌కు అమర్చాలి. కారు ఆన్‌ చేయగానే ఆటోమెటిక్‌గా ఈ యంత్రం పని చేయటం ప్రారంభమవుతుంది. ట్యాంకులోని నీటిలో యంత్రం ద్వారా వేరు చేసిన హైడ్రోజన్‌ కారు ఇంజిన్‌లోకి వెళ్తుంది. దీనివల్ల మైలేజ్‌ అదనంగా 10 కిలో మీటర్లు పెరుగుతుందని చెప్పారు.


ఐసీఏఓలో ఏటీసీ అధిపతిగా షెఫాలీ జునేజా

ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏఓ)లో వాయు రవాణా కమిటీ (ఏటీసీ) అధిపతిగా భారత ప్రతినిధి షెఫాలీ జునేజా నియమితులయ్యారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత ప్రతినిధికి ఈ హోదా లభించనుంది. ఐసీఏఓ కౌన్సిల్‌లో 1944 నుంచి భారత్‌కు సభ్యత్వం ఉంది. ఐసీఏఓలో భారత్‌ హ్యాండిల్‌ ట్విటర్‌లో ఈ ప్రకటన చేసింది. ఇది చాలా గొప్ప వార్తని, అంతర్జాతీయ విమానయాన రంగంలో భారత స్థానాన్ని నిలబెట్టడంతో పాటు అతిపెద్ద పౌరవిమానయాన విపణిలో ఎదిగే దిశగా ప్రయాణం సాగుతుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్‌ చేశారు. ఐసీఏఓ కౌన్సిల్‌లో 36 సభ్య రాష్ట్రాలు ఉండగా ఐసీఓఏ అసెంబ్లీ కాలవ్యవధి మూడేళ్లు.

కిలిమంజారోను అధిరోహించిన ప్రవాస భారతీయుడు జనార్దన్‌

ప్రవాస భారతీయుడు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ నిమ్మలపూడి (జానీ) 5895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి తానా లోగోను ప్రదర్శించారు. మధుమేహం, భుజం ఆర్థరైటిస్‌ సమస్యలతో బాధపడుతూనే 50 ఏళ్ల వయసులో యాత్రను దిగ్విజయంగా ముగించారు. కిలిమంజారో అధిరోహించేందుకు ఆయన రెండేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో మొత్తం ఏడు రోజుల పాటు యాత్ర సాగింది. క్యాన్సర్‌ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి నిధుల సేకరణ కోసమే యాత్ర చేపట్టినట్లు జనార్దన్‌ వివరించారు. ఆయన కొన్నేళ్లుగా తారక్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవలందిస్తున్నారు. తనతో పాటు సినీ నిర్మాత రామ్‌ తాళ్లూరితో కూడిన అయిదుగురి బృందం సాహస యాత్రలో పాల్గొందని వివరించారు.

భారతీయ - అమెరికన్‌ స్వదేశ్‌ ఛటర్జీకి ఉత్తర కరోలినా అత్యున్నత పురస్కారం

ప్రముఖ భారతీయ - అమెరికన్‌ ఉద్యమకర్త, గత మూడు దశాబ్దాలుగా భారత్‌ - అమెరికా సంబంధాల బలోపేతానికి విశేష కృషి చేసిన స్వదేశ్‌ ఛటర్జీ (75)కి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ లాంగ్‌ లీఫ్‌ పైన్‌’తో సత్కరించింది. కేరీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ రే కూపర్, ఛటర్జీకి పురస్కారాన్ని అందించారు. ఉత్తర కరోలినా అభివృద్ధితో పాటు భారత్‌ - అమెరికా సంబంధాలు, అమెరికా సాంస్కృతిక వాతావరణాన్ని బలోపేతం చేయడంలోనూ ఛటర్జీ కీలక పాత్ర పోషించారని కూపర్‌ కొనియాడారు. భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడటానికి దారితీసిన ముఖ్య ఘట్టాల్లో ఛటర్జీ కేంద్ర బిందువుగా ఉన్నారని భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన రిచ్‌ వర్మ పేర్కొన్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ భారత పర్యటనతో పాటు భారత్‌ - అమెరికా మధ్య అణు ఒప్పందం కార్యరూపం దాల్చడంలోనూ ఛటర్జీ ప్రత్యేక కృషి ఉందని రిచ్‌ వర్మ చెప్పారు. అమెరికాలో భారతీయ సమాజం పోషిస్తున్న విలువైన పాత్రకు ఛటర్జీ నిదర్శనంగా నిలిచారని అగ్రరాజ్యంలో భారత రాయబారిగా ఉన్న తరన్‌జిత్‌ సింగ్‌ సంధు వీడియో సందేశంలో పేర్కొన్నారు.

హాలియా యువకుడికి అరుదైన గౌరవం

నల్గొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన యువకుడు నేడున్‌ఘాట్‌ విష్ణుకు అరుదైన గౌరవం లభించింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ చాటారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికైన ఆయనకు రాష్ట్ర నెహ్రు యువ కేంద్ర సంఘటన్‌ కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌దాస్‌ హైదరాబాద్‌లో ధ్రువపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం కల్పించనున్నారు. అక్టోబరు 31న సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో ఉపన్యాస పోటీలు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 8 మందిని ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి విష్ణు ఎంపికయ్యారు. విష్ణు ప్రస్తుతం నల్గొండలో డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నారు.

ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల్లో ఆచార్య బాలకృష్ణ

పతంజలి ఆయుర్వేద్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, ఐరోపాకు చెందిన ఎల్సవియర్‌ కంపెనీ సంయుక్తంగా అధ్యయనం చేపట్టి ప్రపంచంలోని 2% అత్యుత్తమ శాస్త్రవేత్తలతో రూపొందించిన జాబితాలో ఆయనకు చోటు దక్కింది. యోగా, ఆయుర్వేద వైద్యంపై విస్తృత స్థాయి పరిశోధనలకుగాను ఆచార్య బాలకృష్ణ ఈ ఘనత దక్కించుకున్నారు.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు భారత సంతతి వ్యక్తి

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు భారత సంతతికి చెందిన జితేశ్‌ గధియాను బ్రిటన్‌ ప్రభుత్వం నియమించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో ఆయనకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

14 ఏళ్లకే గీత్‌ పత్నికి రెండు డాక్టరేట్లు

మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గీత్‌ పత్ని అరుదైన ఘనత సాధించింది. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోని రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను సంపాదించింది. ‘ఫోన్‌ అధిక వినియోగం వల్ల పిల్లలపై పడే ప్రభావాలు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకుగాను ఈ డాక్టరేట్‌లు వరించాయి. ఏకకాలంలో రెండు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్‌ పొందిన అతి పిన్న వయస్కురాలిగా గీత్‌ పత్ని రికార్డు సాధించింది. గీత్‌ పత్ని తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ బాలిక యోగాలో మాస్టర్స్‌ పూర్తి చేయడమే కాకుండా అనేక మందికి శిక్షణ ఇస్తోంది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో పిల్లల్లో ఫోన్‌ వాడకం మితిమీరడంతో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతున్న విషయాన్ని గీత్‌ పత్ని గుర్తించింది. ఈ అంశంపై పరిశోధన పత్రాన్ని రూపొందించి ప్రపంచంలోని ఏడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు పంపించింది. ఈ పత్రాలను పరిశీలించిన కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాలు గీత్‌కు డాక్టరేట్‌ను ప్రకటించాయి.

డబ్ల్యూహెచ్‌వోలో అమెరికా ప్రతినిధిగా డా.వివేక్‌ మూర్తి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక మండలిలో అమెరికా ప్రతినిధిగా భారత సంతతికి చెందిన డాక్టర్‌ వివేక్‌ మూర్తి (45)ని అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించారు. అమెరికాలో సర్జన్‌ జనరల్‌గా ఉన్నత హోదాలో ఉంటున్న డా.మూర్తి ఆ విధులు కొనసాగిస్తూనే కొత్త బాధ్యతలు నిర్వహిస్తారని శ్వేతసౌధం ప్రకటించింది. వీరి కుటుంబం భారత్‌లోని కర్ణాటక నుంచి వలస వెళ్లింది.