సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తంతి మరణం
పవన విద్యుత్ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తంతి (64) మరణించారు. భారత ‘విండ్ మ్యాన్’గా ప్రాచుర్యం పొందారు. భారత్‌లో పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన తంతి, శుద్ధ ఇంధనంలో కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
1958లో రాజ్‌కోట్‌లో తులసీ తంతి జన్మించారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.8,535.9 కోట్లుగా ఉంది. బెల్జియంకు చెందిన టర్బైన్ విడి భాగాల సంస్థ జడ్‌ఎఫ్ పవర్ యాంట్‌వెర్పెన్‌కు 2006 నుంచి ఛైర్మన్‌గా తంతి ఉన్నారు. ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
పవన విద్యుత్‌లోకి రాకముందు తంతికి జౌళి వ్యాపారం ఉండేది. 2001లో దాన్ని విక్రయించారు. 2003లో అమెరికా మిన్నెసోటాలో 24 టర్బైన్‌ల సరఫరా నిమిత్తం దనమార్ అండ్ అసోసియేట్స్ నుంచి సుజ్లాన్‌కు మొదటి ఆర్డరు లభించింది.
పవన విద్యుత్ మార్కెట్‌లో అంతర్జాతీయ సంస్థలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో 1995లోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అవకాశాలను తంతి గుర్తించారు. ఆయన నాయకత్వంలో సుజ్లాన్ ఎనర్జీ దేశంలో అతిపెద్ద పవన విద్యుత్ సంస్థగా ఎదిగింది. కంపెనీకి మొత్తంగా 19.4 గిగావాట్ల సామర్థ్యం ఉంది. భారత్‌లో 33 శాతం మార్కెట్ వాటా ఉండగా, 17 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పవన విద్యుత్ విపణి అయిన అమెరికాలో కంపెనీకి 2 గిగావాట్‌ల సామర్థ్యం ఉంది.
రాజకీయ దిగ్గజం, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం మరణం
ఐదు దశాబ్దాల పాటు ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి ‘నేతాజీ’గా ప్రజల నీరాజనాలు అందుకున్న రాజకీయ కురు వృద్ధుడు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు.
1939 నవంబర్ 22న ఇటావాలోని సైఫయి గ్రామంలో జన్మించిన ములాయం సింగ్ సోషలిస్టు నేత రామ్‌మనోహర్ లోహియా భావాలకు ఆకర్షితులై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1967లో తొలిసారి ఆయన యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైల్లో ఉన్నారు. 1989లో తొలిసారి యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. మూడు పర్యాయాలు యూపీ ముఖ్యమంత్రి (1989 - 91, 1993 - 95, 2003 - 07)గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రి (1996 - 98)గానూ ఉన్నారు.
1996 సార్వత్రిక ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి ఎంపీగా ఎన్నికైన ములాయం కేంద్రంలోనూ చక్రం తిప్పారు. ప్రతిపక్షాలు భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ప్రధాని పదవి రేసులో ములాయం పేరు కూడా వినిపించింది. కానీ రక్షణ మంత్రిగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ములాయం హయాంలోనే రష్యాతో సుఖోయ్ యుద్ధవిమానాల ఒప్పందం కుదిరింది. 2003లో ములాయం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2012లో నాలుగోసారి సీఎం అవకాశం వచ్చినా కుమారుడు అఖిలేశ్ యాదవ్ కోసం పదవిని వదులుకున్నారు.
ప్రపంచ అత్యంత మురికి మనిషి అమౌ హజీ మరణం
అమౌ హజీ వయసు 94. ఈయనకు స్నానం చేయడమంటే మహా చిరాకు. ఎంతలా అంటే ‘ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి’ అని పిలిపించుకునేంతగా. ఇరాన్‌లో డెగాహ్ గ్రామ శివారులో ఎలాంటి సౌకర్యాలు లేని చిన్నపాటి నివాసంలో ఉండే అమౌ ఈ ఏడాది ప్రారంభంలో కొందరు గ్రామస్థుల ప్రోద్బలంతో సుమారు 60 సంవత్సరాల తర్వాత ఒకే ఒక్కసారి స్నానం చేశారు. ఇటీవల స్వల్పంగా జబ్బుపడిన ఆయన మరణించారు. సబ్బు, నీరు అంటే అసహ్యించుకునే హజీ అత్యంత ఆరోగ్యవంతుడు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ముళ్ల పందులను వండుకోకుండానే తినేవారు. మురికి గుంటల్లోని నీటిని తుప్పుపట్టిన డబ్బాల్లో పట్టుకుని తాగేవారు. ఎండిన పశువుల పేడను తనదగ్గరున్న పాత పైపులో పెట్టుకుని పొగ తాగడం, నాలుగు సిగరెట్లు ఒకేసారి కాల్చడం అంటే మహా సరదా. అదే సమయంలో స్నానం అంటే మాత్రం ఆమడ దూరం జరిగేవారు. గతంలో ఓసారి స్నానం చేయించడానికి వాహనంలో తీసుకెళుతుండగా మధ్యలోనే హజీ దూకేశారు. కొన్ని దశాబ్దాల పాటు స్నానం చేయకుండా ఉన్న ఆయన్ను శాస్త్రవేత్తలు పరీక్షించగా ఎలాంటి బ్యాక్టీరియా, పరాన్నజీవుల కారణంగా ఇబ్బంది పడిన దాఖలాలు కనిపించలేదు. పచ్చి మాంసం తినడం వల్ల పేరుకునే ట్రైకినోసిస్ అనే బ్యాక్టీరియా కనిపించింది. దీనివల్ల సాధారణ ఇన్‌ఫెక్షన్ కలుగుతుంది. హెచ్‌ఐవీ, హెపటైటిస్ వంటి పరీక్షలు నిర్వహించగా అన్నింట్లో ‘నెగెటివ్’ అనే ఫలితమే వచ్చింది.
అపోలో-9 వ్యోమగామి మెక్ డివిట్ మరణం
చంద్రుడిపైకి మానవులను పంపడానికి ముందు అమెరికా ప్రయోగాత్మకంగా చేపట్టిన అపోలో-9 యాత్రకు నేతృత్వం వహించిన వ్యోమగామి జేమ్స్ ఎ మెక్‌డివిట్ (93) మరణించారు.
1969లో జరిగిన ఆ యాత్రలో భాగంగా జాబిలిపైకి పంపాల్సిన పరికరాలను భూకక్ష్యలోకి తరలించి, వాటి సామర్థ్యాన్ని పరీక్షించారు.
1965లో జెమినీ-4 మిషన్‌కు ఆయన నేతృత్వం వహించారు. ఆ యాత్రలో ఆయన స్నేహితుడు ఎడ్ వైట్ అమెరికా తరఫున తొలిసారి స్పేస్‌వాక్ నిర్వహించారు.
ఆ కార్యక్రమాన్ని జేమ్స్ తన కెమెరాలో బంధించారు. ఆ చిత్రాలు విశేష ప్రాచుర్యం పొందాయి. జేమ్స్ ఆరిజోనాలోని టుసాన్‌లో మరణించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తాజాగా పేర్కొంది.
ప్రముఖ పాత్రికేయులు ప్రొ.వేపరావు మరణం
ప్రముఖ పాత్రికేయులు, మాస్ కమ్యునికేషన్ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ వేపరావు (76) మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 1946లో జన్మించిన వేపరావు కోల్‌కతాలోని ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టారు. హిందూస్థాన్ టైమ్స్ సండే ఎడిటర్‌గా, ది స్టేట్స్‌మన్ పత్రికకు శిమ్లా కరెస్పాండెంట్‌గా, ఎడిటోరియల్ సలహాదారుగా, ది ట్రిబ్యూన్ పత్రిక సహాయ సంపాదకులుగా పనిచేశారు. హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీలోని జర్నలిజం శాఖ విభాగాధిపతిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 1996 - 97 మధ్య ఐఐఎంసీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యునికేషన్)లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. శిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ (ఐఐఏఎస్)లో ‘కమ్యునికేషన్ అండ్ డెవలప్‌మెంట్’ అంశంపై పరిశోధన చేశారు. ‘ఏ కర్వ్ ఇన్ ద హిల్స్’ అనే పుస్తకం రాశారు.