నియామకాలు

ఆర్‌సీఐఎల్‌ డైరెక్టర్‌గా రామమోహన్‌రావు

రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఆర్‌సీఐఎల్‌) డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఐఆర్‌ఏఎస్‌ అధికారి రామ మోహన్‌రావును నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర నియామక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదంతో రామ మోహన్‌రావును నియమించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది.

జీ-20 పౌరసమాజ నాయకురాలిగా మాతా అమృతానందమయి

జీ-20 కూటమిలో పౌరసమాజం తరఫున ప్రాతినిధ్యం వహించే సివిల్‌ 20 (సీ20) బృందం ఛైర్‌పర్సన్‌గా ఆధ్యాత్మిక వేత్త మాతా అమృతానందమయి దేవి (అమ్మ)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వేతర, వాణిజ్యేతర అంశాలపై మన వాణిని ఆమె వినిపించనున్నారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలతో ఏర్పడ్డ జీ20 కూటమిలో సివిల్‌ 20 బృందం ఓ భాగం. భారతదేశం 2022 డిసెంబరు 1 నుంచి 2023 నవంబరు 30 వరకు జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుంది. దిల్లీలో 2023 సెప్టెంబరు 9, 10 తేదీల్లో కూటమిలోని దేశాధినేతల సదస్సు జరగనుంది. అంతకు ముందు జరిగే 200 సమావేశాలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంత్రుల, వివిధ స్థాయి ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి.

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా గిరిధర్‌ అరమణె

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా 1988 ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అరమణె నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర రహదారులు, రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను రక్షణ శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఆయన ఆ శాఖ ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టి, తర్వాత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 1991 ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి సుమితా డావ్రా ‘డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌’ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న 1991 తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి జి.అశోక్‌కుమార్‌ను అదే స్థానంలో కొనసాగిస్తూ కార్యదర్శి స్థాయి హోదా ఇచ్చారు.

కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా డా. వేదాంతం

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్యకళా పీఠం ప్రధానాచార్యుడు డాక్టర్‌ వేదాంతం రామలింగ శాస్త్రి కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు దిల్లీలోని సంగీత నాటక అకాడమీ కార్యదర్శి అమ్రేష్‌ పి.రాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు.

పీఎఫ్‌ఆర్‌డీఏ సభ్యుడిగా నారాయణ రావు బట్టు

కేంద్ర న్యాయ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తోన్న నారాయణ రావు బట్టును పీఎఫ్‌ఆర్‌డీఏ సభ్యుడిగా (న్యాయ విభాగం) ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో ఆయన 62 ఏళ్ల వయసు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ కొనసాగుతారని ఆర్థిక సేవల శాఖ వెల్లడించింది. పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ)లో ఛైర్‌పర్సన్‌తో పాటు కనీసం ఆరుగురు సభ్యులుగా ఉంటారు. ఇందులో ముగ్గురిని ప్రభుత్వం నియమిస్తుంది.

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలిగా సీమా ముస్తఫా

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలిగా ‘ద సిటిజన్‌’ సంపాదకురాలు సీమా ముస్తఫా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ‘ద కారవాన్‌’ ఎడిటర్‌ అనంత్‌నాథ్, కోశాధికారిగా సకల్‌ మీడియా గ్రూప్‌ చీఫ్‌ ఎడిటర్‌ శ్రీరామ్‌ పవార్‌లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గిల్డ్‌ వార్షిక సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.