50వ సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్
సుప్రీంకోర్టు 50వ (తదుపరి) ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ (డి.వై.చంద్రచూడ్) పేరును సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ సిఫార్సు చేశారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును ప్రతిపాదించాలని కోరుతూ అక్టోబరు 7వ తేదీన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాసిన లేఖకు స్పందనగా జస్టిస్ చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ సీజేఐ లేఖ రాశారు. దాని ప్రతిని సహచర న్యాయమూర్తుల సమక్షంలో జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు అందజేశారు. జస్టిస్ యు.యు.లలిత్ నవంబరు 8న పదవీ విరమణ చేయనున్నారు. 9న జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 2024 నవంబరు 10 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. 44 ఏళ్ల క్రితం ఈయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 7 ఏళ్ల 5 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. సుదీర్ఘకాలం కొనసాగిన సీజేఐగా రికార్డు సృష్టించారు.
కీలక తీర్పుల్లో భాగస్వామి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆరేళ్ల కాలంలో పలు కీలక తీర్పుల్లో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ భాగస్వామిగా ఉన్నారు. ఆధార్ బిల్లును మనీ బిల్లుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించినట్లు జస్టిస్ కె.ఎస్.పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ప్రత్యేక తీర్పు రాశారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అలాగే నవ్‌తేజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఐపీసీ సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమని, సేమ్ సెక్స్ ఇంటర్‌కోర్స్ చట్టబద్ధమేనని పేర్కొన్నారు. సెక్షన్ 377 వలసవాదుల పాలనలో వచ్చిందని, అది ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మేజర్ అయిన వారికి వివాహం, మతం విషయంలో తమకు నచ్చినట్లు నడుచుకొనే స్వేచ్ఛ ఉంటుందని సాఫిన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో తీర్పు చెప్పారు.
‣ 10-50 ఏళ్ల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని, అలా చేయడం వారి స్వతంత్రత, స్వేచ్ఛ, మర్యాదలను దెబ్బ తీయడమేనని ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని జస్టిస్ కె.ఎస్.పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017 ఆగస్టులో ఏకగీవ్రంగా తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. వ్యభిచారం నేరం కాదని జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించారు. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు అందరూ సమానం), 15 (మతం, వర్ణం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షచూపడం నిషేధం), 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కు విరుద్ధమని చెప్పారు. శతాబ్దాలుగా మహిళల అణచివేతకు దీన్ని ఉపయోగిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
దేశంలో తొలి సంపూర్ణ సోలార్ గ్రామంగా మొఢేరా
దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్తు వినియోగ గ్రామంగా గుజరాత్‌లోని మొఢేరా గ్రామం రికార్డుల్లోకెక్కింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం స్వరాష్ట్రానికి విచ్చేసిన ప్రధానమంత్రి మోదీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పలు అంశాలపై ప్రసంగించారు. మెహసాణా జిల్లాలోని మొఢేరా గ్రామం పేరు చెప్తే ఇన్నాళ్లూ అక్కడి ప్రఖ్యాత సూర్య దేవాలయమే గుర్తుకొచ్చేదని, ఇకపై సోలార్ ఊరుగానూ అది ఖ్యాతికెక్కుతుందని ప్రధాని పేర్కొన్నారు. మొఢేరాలో ప్రభుత్వ, నివాస భవనాలన్నింటిపై సౌర పలకలను అమర్చారు. వీటి ద్వారా పగలు విద్యుత్తు అందుతుంది. తొలిరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రంలో రూ.3,900 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
వేరుసెనగ కొత్త వంగడం విడుదల
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాగుకు అనువైన వేరుసెనగ కొత్త వంగడాన్ని విడుదల చేసినట్లు ఇక్రిశాట్ తెలిపింది. గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ వర్శిటీకి చెందిన నూనె గింజల పరిశోధనా కేంద్రంతో కలసి దీనిపై పరిశోధనలు చేసి విడుదల చేసింది. కొత్త వంగడానికి ‘ఐసీజీవీ 16668’ అనే పేరు పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేసిన ప్రయోగాత్మక సాగులో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. కొత్త వంగడంలో ఓలియాక్ ఆమ్లం, లినోలియిక్ ఆమ్లం, ప్రొటీన్లతో పాటు నూనె శాతం ఎక్కువగా ఉన్నందున పలు రకాల ఆహారోత్పత్తులు తయారు చేయవచ్చు. ఓలియాక్ ఆమ్లం ఎక్కువగా ఉన్నందున ఆరు నెలల పాటు నిల్వ ఉండే నాణ్యమైన నూనె తయారు చేయవచ్చని ఇక్రిశాట్ తెలిపింది. వేరుసెనగల్లో పోషకాలు, ఆమ్లాల శాతం ఎక్కువగా ఉన్నందున వీటితో తయారయ్యే ఆహారోత్పత్తులు హృదయ సంబంధ, ఊబకాయ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. వానాకాలం (ఖరీఫ్) పంటగా వేరుసెనగను సాగు చేస్తే 113 రోజుల్లో దిగుబడి వస్తుంది. ప్రపంచ మార్కెట్‌లో వేరుసెనగలు, వాటి నూనె, ఇతర ఉత్పత్తులకు ఆహార, ఔషధ, సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమల్లో అధిక డిమాండు ఉందని, 2029 నాటికి దీని వ్యాపార మార్కెట్ విలువ 3.28 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఇక్రిశాట్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జనిల పసుపులేటి తెలిపారు.
గుజరాత్‌లో మేజ్ గార్డెన్, మియావకీ అడవి, హౌజ్‌బోట్‌ల ప్రారంభం
గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తానగర్ (గతంలో కేవడియాగా పిలిచేవారు)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేజ్ గార్డెన్, మియావకీ అడవి, హౌజ్‌బోట్‌లను ప్రారంభించారు. చిక్కుదారులతో ఉండే మేజ్ గార్డెన్ మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 2,100 మీటర్ల మేర పొడవైన దారులుంటాయి. దేశంలో అతిపెద్ద చిక్కుదారుల తోట ఇదే కావడం గమనార్హం. దాదాపు 1.80 లక్షల మొక్కలను ఒకదానికొకటి అత్యంత సమీపంగా నాటడం ద్వారా దట్టమైన మియావకీ అడవిని సృష్టించారు. ‘ఓయో ఏక్తా హౌజ్‌బోట్’ పేరుతో పిలిచే హౌజ్‌బోట్ ఇంటిని తలపిస్తుంది. ఈ మూడు ప్రాజెక్టులూ ఐక్యతా విగ్రహానికి సమీపంలోనే ఉన్నాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌కు వచ్చిన మోదీ వాటికి ప్రారంభోత్సవం చేశారు.
విశాఖలో ‘ఇండో- సింగపూర్’ నౌకా విన్యాసాలు
విశాఖ తీరం బంగాళాఖాతంలో భారత్ - సింగపూర్ ద్వైపాక్షిక ‘మారిటైం సింబెక్స్ - 2022’ విన్యాసాలు అక్టోబరు 26, 27వ తేదీల్లో నిర్వహించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు తెలిపాయి. 28 నుంచి నిర్వహిస్తున్న సీఫేజ్ విన్యాసాలు 30 వరకు కొనసాగుతాయని పేర్కొన్నాయి. విన్యాసాల్లో రిపబ్లిక్ సింగపూర్ నేవీ నుంచి ఫార్మడిబుల్ శ్రేణికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ స్టల్‌వార్ట్, విక్టరీ శ్రేణికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ విజిలెన్స్ నౌకలు పాల్గొన్నాయి. సింగపూర్ నేవీ అధికారులు రియర్ అడ్మిరల్ సీన్‌వాట్ జైన్వెన్ బృందానికి తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా, కమాండ్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా స్వాగతం పలికి, వివిధ అంశాలపై చర్చించినట్లు వివరించాయి.
భారత్‌లో తయారీకి ముందుకు రండి: ప్రధాని మోదీ
రవాణా విమానాల ప్రధాన తయారీదారుల్లో ఒకటిగా మన దేశం త్వరలోనే అవతరిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలోని తమ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్థిరమైన విధానాలను అనుసరిస్తోందని ఫలితంగా దేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రధాన ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా భారత్ గుర్తింపు దక్కించుకుందని అన్నారు. గుజరాత్‌లోని వడోదరాలో సి-295 మధ్యశ్రేణి రవాణా విమానాల తయారీ కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం ఐరోపా ఏరోస్పేస్ రంగ దిగ్గజం ఏరోబస్ సంస్థ, టాటా గ్రూప్ సంయుక్తంగా ‘సి-295’లను తయారు చేయనున్నాయి. ఐరోపా వెలుపల ఈ విమానాలను ఉత్పత్తి చేయనుండటం ఇదే మొదటిసారి.
స్వదేశంలో 40 విమానాల తయారీ
ఐఏఎఫ్‌లో 1960ల నుంచి సేవలందిస్తున్న అవ్రో-748 విమానాల స్థానంలో ‘సి-295’లను వినియోగంలోకి తీసుకురావాలన్నది భారత్ ప్రణాళిక. ఇందులో భాగంగా 56 విమానాల కోసం ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో గత ఏడాది సెప్టెంబరులో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. ఎయిర్‌బస్ 16 ‘సి-295’లను స్పెయిన్‌లో పూర్తిస్థాయిలో తయారు చేసి 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య మనకు అప్పగించాలి. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్)తో కలిసి భారత్‌లో తయారు చేయాల్సి ఉంటుంది. మన దేశంలోని కేంద్రం నుంచి తొలి సి-295 విమానం 2026 సెప్టెంబరులో బయటకు రావాలి. 2031 ఆగస్టులోగా మిగిలిన 39 ఉత్పత్తవ్వాలి.
369 అడుగుల ముక్కంటి విగ్రహావిష్కరణ
రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నాథ్‌ద్వారాలో ఏర్పాటు చేసిన ప్రపంచంలో ఎత్తయిన శివుడి విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆవిష్కరించారు. 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా మొరారి బాపు రామ కథను వినిపించారు. ఈ మేరకు మంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ.. ప్రేమ, సామరస్యం, సోదర భావం గురించి రామ కథ సందేశమిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని దేశం నలుమూలలా వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో 75 ప్రాజెక్టుల ఆరంభం
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన సరిహద్దు వెంట కొత్తగా నిర్మించిన సుమారు రూ.2180 కోట్ల విలువైన 75 మౌలిక ప్రాజెక్టులను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితమిచ్చారు. ఇందులో వంతెనలు, రహదారులు, హెలీపాడ్స్ వంటివి ఉన్నాయి. తూర్పు లద్ధాఖ్‌లోని వ్యూహాత్మక దర్బక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీఎస్-డీబీఓ) రహదారిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన శ్యోక్ సేతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సముద్రమట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో డీఎస్-డీబీవో మార్గంలో దీనిని నిర్మించారు. ఈ వంతెన సైనిక దళాలకు అవసరమైన సామగ్రి రవాణాకు ఎంతగానో ఉపకరించనుంది. జమ్మూ-కశ్మీర్‌లో దశాబ్దాలుగా మౌలిక వసతులు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాల్లో ఉగ్రవాదం పెరిగిపోవడం ఒకటని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
‘మెరుగైన సాంబమసూరి’ రకం వంగడాన్ని అభివృద్ధి చేసిన ఐఐఆర్‌ఆర్, సీసీఎంబీ
తెల్లగా, అతి సన్నగా కనిపించే బియ్యంతో వండిన అన్నం తినడానికే ఈ రోజుల్లో చాలా మంది ఇష్టపడుతున్నారు. కానీ వాటన్నింటిలో పోషకాలు తక్కువగా, ‘గ్లైసిమిక్స్ సూచిక’ (జీఐ) ఎక్కువగా ఉన్నందున మధుమేహం వ్యాధి విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లలో విరివిగా అమ్ముతున్న అన్ని రకాల బియ్యం కన్నా జీఐ అతి తక్కువగా 50.9 శాతమే ఉన్న ‘మెరుగుపరిచిన (ఇంప్రూవ్డ్) సాంబమసూరి’ (ఐఎస్‌ఎం) వరి వంగడాన్ని రాజేంద్రనగర్‌లోని ‘భారత వరి పరిశోధన సంస్థ’ (ఐఐఆర్‌ఆర్), ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయోలజీ సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. దేశమంతా సాగు చేస్తే రైతులకు పంట దిగుబడి, ఆదాయం అధికంగా రావడమే కాకుండా అందరూ భేషుగ్గా తినడానికి నాణ్యమైన బియ్యం లభిస్తాయని ఈ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. మధుమేహుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జీఐ తక్కువగా ఉండే వరి వంగడాలపై ఐఐఆర్‌ఆర్ పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా 50.9 జీఐతో ఐఎస్‌ఎం రకం వంగడాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చింది. అక్టోబరు 28న రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్ ఆవరణలో ఈ విత్తనాలను రైతులకు అమ్మేందుకు మేళా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దీని ప్రత్యేకతల గురించి ఐఐఆర్‌ఆర్‌లోని ప్లాంటు బ్రీడింగ్ పరిశోధనల విభాగం అధిపతి, వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.వి.సుబ్బారావు వివరించారు.
తొలిసారిగా అల్యూమినియం గూడ్స్ రైలు రేక్
అల్యూమినియంతో తయారైన గూడ్స్ రైలును రైల్వే శాఖ తొలిసారి భువనేశ్వర్ నుంచి నడిపింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఉక్కుతో తయారైన రేక్ కన్నా ఇది అతి తేలికగా ఉండటంతో పాటు ఎక్కువ సామగ్రిని తరలించేదిగా రూపొందింది. బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్, హిండాల్కో సంయుక్త భాగస్వామ్యంతో తయారైంది. ప్రస్తుతమున్న రేక్ కన్నా ఇది 180 టన్నుల తక్కువ బరువు ఉంది. అంతే బరువు ఉన్న సామగ్రిని అదనంగా మోసుకెళుతుంది. రేక్ బరువు తక్కువ ఉన్నందున రైలు వేగం పెరగడంతో పాటు నడిపేందుకు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. రైల్వే శాఖ పర్యావరణ రక్షణ లక్ష్యాలకు అనుగుణంగా కాలుష్య ఉద్గారమూ తగ్గుతుంది. తేలికైన అల్యూమినియం వ్యాగన్లు అందుబాటులోకి రావడం దేశం గర్వించదగ్గ సందర్భమని రైల్వే మంత్రి పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత కూడా పునర్వినియోగానికి ఈ రేక్ అనుకూలమని, అప్పుడూ అంతే కొత్తగా కనిపిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాదిలోగా ఇలాంటి లక్ష వ్యాగన్లను సమకూర్చుకోవాలన్న రైల్వే శాఖ ప్రణాళిక మేరకు కార్యాచరణ చేపట్టామని తయారీ సంస్థ హిండాల్కో వివరించింది. ప్రయాణికుల రైళ్లకూ ఇలాంటి కంపార్టుమెంట్ల తయారీపై దృష్టి పెట్టామని పేర్కొంది.
కాంగ్రెస్ కొత్త సారథి ఖర్గే
గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు, కర్ణాటక సీనియర్ నేత, దళిత కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపులో 80 ఏళ్ల ఖర్గే.. దాదాపు 84 శాతం పైగా ఓట్లు సాధించి, ప్రత్యర్థి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ను ఓడించారు. పోలైన 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897, థరూర్‌కు 1,072 లభించాయి. 416 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు. అధ్యక్షుడిగా అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించనున్న ఖర్గే 24 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిరోహించనున్న గాంధీ కుటుంబేతర వ్యక్తి కానున్నారు.
జూన్‌లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో
జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ వెల్లడించారు. మునుపటితో పోలిస్తే మరింత బలమైన రోవర్‌ను దాని ద్వారా చంద్రుడిపైకి పంపనున్నట్లు తెలిపారు. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ను 2024 చివర్లో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు ఆరు ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. యాత్ర మధ్యలో వ్యోమగాములకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి చేర్చే సామర్థ్యాలను సముపార్జించుకోనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి ‘అబార్ట్ మిషన్’ను 2023 తొలినాళ్లలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దిల్లీలో సోమ్‌నాథ్ ఈ మేరకు కీలక వివరాలు వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లో రోప్‌వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
దేశంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు ఆధ్యాత్మిక కేంద్రాలను పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక వాటికి మళ్లీ గత వైభవం తీసుకువస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్, హేమకుండ్ సాహిబ్ గురుద్వారాల్లో రోప్‌వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 9.7 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా భారత్ - చైనా సరిహద్దులోని చివరి గ్రామం మాణాలో ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనుల పరిశీలనతో పాటు రూ.3,400 కోట్ల విలువైన మరికొన్ని కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
జేడీ(ఎస్) జాతీయాధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన దేవెగౌడ
జనతాదళ్ (ఎస్) జాతీయాధ్యక్షునిగా మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ మరోసారి ఎన్నికయ్యారు. బెంగళూరులో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు. 1999 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ
‘భయం వద్దు’ (డరో మత్) అంటూ తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదం స్ఫూర్తితో ముందడుగు వేస్తానని కాంగ్రెస్ నూతనాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఏఐసీసీ కార్యాలయంలో ప్రమాణం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో గెలిచినట్లు ధ్రువపత్రాన్ని ఖర్గేకు పార్టీ ఎన్నికల కమిటీ ఇన్‌ఛార్జి మధుసూధన్ మిస్త్రీ అందజేశారు. ఇంతవరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రముఖ నేతలంతా దీనికి హాజరయ్యారు.
సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్థానంలో ప్రస్తుతానికి 47 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త అధ్యక్షుని ఎన్నికను పార్టీ ప్లీనరీలో ధ్రువీకరించి, కొత్తగా వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసే వరకు ఇది కొనసాగుతుంది. సీడబ్ల్యూసీలో ఉన్నవారిలో దాదాపు అందరికీ స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బరామిరెడ్డికి ఇందులో స్థానం లభించింది.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌కు కర్ణాటక గవర్నర్ ఆమోదం
కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పెంపు ఆర్డినెన్స్‌కు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోద ముద్రవేశారు. జస్టిస్ నాగమోహన్‌దాస్ సమితి నివేదిక ఆధారంగా ఎస్సీలకు 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 3 నుంచి 7 శాతానికి రిజర్వేషన్లను పెంచాలని ఇటీవలి శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రూపొందించిన ఆర్డినెన్స్‌ను గత వారం గవర్నర్ పరిశీలనకు పంపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమ్మతించిన గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది.. విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని అమలు చేస్తారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ 56 శాతానికి పెరగనుంది.
బీడీఎల్ అధునాతన ఉత్పత్తుల ఆవిష్కరణ
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ‘సంగ్రామిక’, యాంటీ ట్యాంక్ వెపన్ సిస్టమ్ ‘సంహారిక’, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్ సిస్టం నమూనాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పో - 2022లో బీడీఎల్ ఛైర్మన్, ఎండీ సిద్ధార్థ్ మిశ్రా అందించారు. సంగ్రామిక క్షిపణిని ఎంబీటీ అర్జున్‌కు అనుసంధిస్తారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ (ప్రొడక్షన్) పి.రాధాకృష్ణ, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్) మాధవరావు పాల్గొన్నారు. రఫేల్ యుద్ధ విమానాన్ని అందిస్తున్న డసాల్ట్ ఏవియేషన్‌తో బీడీఎల్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బీడీఎల్ ఆయుధాలు అస్త్ర, స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్లను రఫేల్‌లో అమర్చుతారు. అశోక్ లేల్యాండ్ డిఫెన్స్ సిస్టమ్స్, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్, న్యూస్పేస్ టెక్నాలజీస్, ఐఐటీ రోపార్‌తోనూ బీడీఎల్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
వాతావరణ మార్పులపై ప్రతి ఇంటా చర్చ జరగాలి: ప్రధాని మోదీ
వాతావరణ మార్పుపై ప్రతి ఇంటిలోనూ చర్చ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో కలిసి కేవడియాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా ప్రతిమ దగ్గర వాతావరణ మార్పులతో కలుగుతోన్న వినాశకర ఫలితాల నుంచి భూమిని రక్షించే లక్ష్యంతో తయారు చేసిన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక ‘మిషన్ లైఫ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ఫ్రాన్స్, బ్రిటన్, మాల్దీవులు సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనీశ్, సిమ్రన్ జోడీకి రజతం
అనీశ్, సిమ్రన్ ప్రీత్ కౌర్ బ్రార్ జోడీ ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో రజతం గెలిచింది. ఫైనల్లో భారత ద్వయం 14-16తో ఉక్రెయిన్‌కు చెందిన యులియా కొరొస్టిలోవా, మక్సిమ్ హొరోదినెట్స్ జంట చేతిలో ఓడిపోయింది. జూనియర్ మహిళల ఎయిర్ పిస్టల్‌లో వర్ష సింగ్ 0.2 పాయింట్లతో కాంస్య పతకం కోల్పోయింది. ఇందులో మూడు పతకాలనూ చైనానే గెలుచుకుంది. క్వాలిఫికేషన్‌లో అగ్రస్థానం సాధించిన ఇషా సింగ్ అయిదో స్థానంతో సరిపెట్టుకుంది.
సౌర పలకలతో రెండు వైపులా విద్యుదుత్పత్తి
సౌర విద్యుత్తులో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన సాంకేతికతతో విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. కొత్త సౌర పలకలతో రెండు వైపులా, అంటే పై నుంచి, కింది నుంచి కూడా విద్యుదుత్పత్తి చేయవచ్చు. భవిష్యత్తు వినియోగం ఈ బైఫేషియల్ (ద్విముఖ) సోలార్ మాడ్యుల్స్‌దే.
ఎలా పనిచేస్తుందంటే?
ఈ ద్విముఖ సౌర పలకల్లో పైభాగంపై ఎండ నేరుగా పడి విద్యుదుత్పత్తి జరిగితే భవనం శ్లాబుపై పడే వేడిని సౌర పలకల కింది భాగం గ్రహించి విద్యుదుత్పత్తి చేస్తుంది. సాధారణ పలకలతో పోలిస్తే వీటి సామర్థ్యం 10-12 శాతం ఎక్కువ. సోలార్ ట్రాకర్ ద్వారా గరిష్ఠంగా 27 శాతం వరకు పెరుగుతుంది. పలకలకు రెండు వైపులా యూవీ నిరోధకత కల్గి ఉన్నందున ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
ఐజీబీసీ భవనంపై ఏర్పాటు..
దేశంలోని తొలి హరిత భవనమైన మాదాపూర్‌లోని సీఐఐ గోద్రెజ్ సొరాబ్జీ గ్రీన్ బిజినెస్ సెంటర్ భవనాలపై 130 కిలోవాట్ల సామర్థ్యం కల్గిన బైఫేషియల్ సొలార్ పీవీ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేశారు. సాధారణ పలకల కంటే 20-30 శాతం ఎత్తు (దాదాపు 1.5 మీటర్లు) పెంచారు. వార్షికంగా 1.89 లక్షల యూనిట్లు విద్యుదుత్పత్తి చేస్తుండగా ప్రస్తుతం 2.20 లక్షల యూనిట్లకు చేరుకుంది. అంటే ద్విముఖ సౌర పలకలతో ఏకంగా 30 వేల యూనిట్లు అదనంగా ఉత్పత్తి అయ్యాయి. ఇందులో ఈ కేంద్రం వార్షికంగా వినియోగిస్తున్నది 2.03 లక్షల యూనిట్లు. అంటే మిగిలిన 17 వేల యూనిట్లను నెట్‌మీటర్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. అలా నెట్‌జీరో భవనంగా గుర్తింపు పొందింది.
దిగుమతుల భారం తగ్గించేద్దాం: ప్రధాని మోదీ
దేశ ప్రజల అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున వంట నూనెలు, ఎరువులు, ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి రావడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటి కోసం భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సి వస్తోందని, ఇది ఖజానాపై పెను భారం మోపుతోందని తెలిపారు. ఆయన దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రాంగణంలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ - 2022’ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 12వ విడత ‘కిసాన్ సమ్మాన్ నిధి’ కింద రూ.16 వేల కోట్లను రైతులకు బ్యాంకు ఖాతాల ద్వారా పంపిణీ చేశారు. ఒకే దేశం, ఒకే ఎరువు (ఓఎన్‌ఓఎఫ్) పథకానికి శ్రీకారం చుట్టి ‘భారత్ యూరియా సంచుల’ను విడుదల చేశారు. ఆరు వందల ‘పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల’ను ప్రారంభించారు.
సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నవంబరు 9న జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారని ట్విటర్ ద్వారా తెలిపారు. ఆయన 2024 నవంబరు 10వ తేదీ వరకు సీజేఐగా కొనసాగుతారు.
‣ ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ నియామకం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఎంపిక సంఘాన్ని కేంద్ర విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది.
41,541 ఉన్ని టోపీలతో గిన్నిస్ రికార్డు
భారత వైమానిక దళ సిబ్బంది సతీమణులు 41,541 ఉన్ని టోపీలను ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ రికార్డును స్థాపించారు. ఇవన్నీ చేతితో అల్లినవే కావడం విశేషం. వాయుసేన సిబ్బంది సతీమణుల సంఘానికి చెందిన దాదాపు 3 వేల మంది మహిళలు వీటిని తయారు చేశారు. సంఘం చేపట్టిన ‘నిట్టాథాన్’ అనే కార్యక్రమంలో భాగంగా జులై 15 నుంచి అక్టోబరు 15 మధ్య కాలంలో వీటిని సిద్ధం చేశారు. దిల్లీలోని వాయుసేన ఆడిటోరియం ప్రాంగణంలో ఈ టోపీలను ప్రదర్శించారు. ఏఎఫ్‌డబ్ల్యూడబ్ల్యూఏ 52వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఘనతను సాధించారు.
లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్.భగత్ జ్ఞాపకార్థం యూఎస్‌ఐలో ఛైర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
దివంగత లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్.భగత్ జ్ఞాపకార్థం యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యూఎస్‌ఐ)లో ‘ఛైర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ పాండే ప్రకటించారు. స్థానిక యూఎస్‌ఐ ప్రాంగణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. పి.ఎస్.భగత్ 1918 అక్టోబరులో జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రతిష్ఠాత్మక విక్టోరియా క్రాస్‌ను గెల్చుకున్న తొలి భారతీయ అధికారి ఆయనే.
ఊనాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) జాతికి అంకితం
21వ శతాబ్దపు సౌకర్యాలను ప్రజలకు సమకూరుస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. హిమాచల్‌లోని అంబ్ అందౌరా నుంచి దిల్లీ మధ్య తిరిగే ఈ రైలు బుధవారాలు మినహా వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. 385 కిలోమీటర్ల దూర ప్రయాణంలో అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పుర్ సాహిబ్ స్టేషన్లలో ఆగుతుంది. దేశంలో ఇది నాలుగో ‘వందేభారత్’ రైలు. హరోలీ వద్ద రూ.1,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన భారీ ఔషధ పరిశ్రమకు సైతం ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే ఊనాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ని జాతికి అంకితం చేశారు. అనంతరం చంబాలోనూ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 3,125 కి.మీ.ల మేర గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ఉద్దేశించిన పీఎం గ్రామ్ సడక్ యోజన-3ను మోదీ ప్రారంభించారు. చంబాలో రెండు హైడ్రోపవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
మహాకాల్ లోక్ జాతికి అంకితం: ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ‘శ్రీ మహాకాల్ లోక్’ పేరిట రూ.856 కోట్లతో చేపట్టిన ఆవరణ అభివృద్ధి పనుల్లో మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. 900 మీటర్ల మేర ఆలయ ఆవరణను విస్తరించి సుందరంగా తీర్చిదిద్దారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా జామకండోరణా పట్టణ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. సోషలిస్టు దిగ్గజం జయప్రకాశ్ నారాయణ్ (జేపీ), జనసంఘ్ నేత నానాజీ దేశ్‌ముఖ్‌ల జయంతి సందర్భంగా ఆ నేతలను గుర్తు చేసుకొన్నారు. అహ్మదాబాద్‌లోని పౌర ఆసుపత్రిలో రూ.1,275 కోట్ల నిధులతో సమకూర్చిన వైద్య సదుపాయాలను మోదీ ప్రారంభించారు.
విశ్వాస పరీక్షలో నెగ్గిన పంజాబ్ సర్కారు
విశ్వాస పరీక్షలో భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ సర్కారు నెగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు 91 మందితో పాటు మరో ఇద్దరు కూడా ప్రభుత్వంపై విశ్వాసాన్ని ప్రకటించడంతో 93 ఓట్లతో తీర్మానం నెగ్గింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ విశ్వాస తీర్మానాన్ని ముఖ్యమంత్రి సెప్టెంబరు 27న శాసనసభలో ప్రవేశపెట్టారు.
జల్ జీవన్ మిషన్‌లో తెలంగాణకు 5వ ర్యాంకు
జాతీయ జల్ జీవన్ మిషన్ పథకం అమలులో తెలంగాణకు 5వ ర్యాంకు దక్కింది. మొత్తం పనితీరులో గత ఏడాది కంటే 4 పాయింట్లు మెరుగుపరుచుకున్నా ర్యాంకులో కిందటేడాది మాదిరిగా 5వ స్థానంలోనే ఉంది. తొలి నాలుగు స్థానాలను పుదుచ్చేరి, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, గోవాలు కైవసం చేసుకున్నాయి. క్రమం తప్పకుండా నీటి సరఫరా విభాగంలో తెలంగాణకు 1వ ర్యాంకు దక్కింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ల ఆధ్వర్యంలో ఈ ర్యాంకులు ప్రకటించారు. తెలంగాణలోని 95% గ్రామాలకు ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోనో, సంపుల్లోనో నీటిని నిల్వచేసి ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. తెలంగాణతో పాటు మరో 12 రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా రోజూ నీటి సరఫరా జరుగుతోంది. దీని వల్ల తమకు సమయం, శ్రమ తగ్గిందని తెలంగాణలోని 93% కుటుంబాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఫలితంగా ప్రాథమికోన్నత పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య 9% మేర పెరిగింది. రాష్ట్రంలో వార్షిక ఉపాధి రోజులు సగటున 56 పెరిగాయి. ఇంట్లో కొళాయి ఉండటంవల్ల ఆదాయానికి ప్రత్యక్షంగా మేలు చేసినట్లు 93% మంది చెప్పారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 409 గ్రామాల్లో 12,393 ఇళ్ల నుంచి నమూనాలు సేకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 92% కుటుంబాలకు రోజూ సగటున తలసరి 55 లీటర్ల నీళ్లు అందుతున్నాయి. 4% కుటుంబాలకు 40 లీటర్లపైన, మరో 4%కుటుంబాలకు 40 లీటర్లలోపు అందుతున్నట్లు ఇందులో తేలింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 10వరకు మొత్తం 48 రోజులపాటు నమూనాలు సేకరించారు.