బ్రెజిల్ అధినేతగా డ సిల్వా
బ్రెజిల్ ప్రజలు వామపక్ష భావజాలం గల మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాను దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అతి మితవాద జైర్ బోల్సొనారోను 20 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. జనవరి 1న ఆరోసారి డ సిల్వా బాధ్యతలు చేపట్టనున్నారు. 1985లో బ్రెజిల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తరవాత ఇంత స్వల్ప తేడాతో అధ్యక్షుడు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఎన్నికల్లో మోసం జరిగిందంటూ బోల్సొనారో మద్దతుదారులు రోడ్డెక్కారు. ట్రక్కు డ్రైవర్లు రోడ్లను దిగ్బంధం చేశారు. గతంలో డ సిల్వా దేశాధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అవినీతికి, అక్రమ ధన చలామణికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయన 580 రోజుల పాటు కారాగార శిక్ష అనుభవించారు. 2018 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోవడంతో బోల్సొనారో అధ్యక్ష పదవిని చేపట్టగలిగారు. కానీ, డ సిల్వాకు శిక్ష విధించిన జడ్జి ప్రాసిక్యూటర్లతో మిలాఖతై అన్యాయంగా తీర్పు చెప్పారని తీర్మానిస్తూ బ్రెజిల్ సుప్రీం కోర్టు డ సిల్వాకు శిక్ష రద్దు చేసింది. దాంతో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి వీలుపడింది.
చైనా రెండో ల్యాబ్ మాడ్యూల్ ప్రయోగం విజయవంతం
భూ కక్ష్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన రెండో ల్యాబ్ మాడ్యూల్‌ను చైనా విజయవంతంగా రోదసిలోకి పంపింది. లాంగ్ మార్చ్-5బీవై4 రాకెట్ ద్వారా వెంచాంగ్ వ్యోమనౌక కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. 10 నిమిషాల్లో ఈ రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. అనంతరం అది అక్కడే ఉన్న కోర్ మాడ్యూల్‌తో అనుసంధానమవుతుంది. తాజా మాడ్యూల్‌ను మెంగ్టియాన్‌గా పిలుస్తున్నారు. ఇందులో ప్రపంచ తొలి అంతరిక్ష ఆధారిత శీతల పరమాణు గడియారాలనూ పంపారు. వాటిలో హైడ్రోజన్, రుబీడియం, ఆప్టికల్ గడియారాలు ఉన్నాయి. ఇవి విజయవంతమైతే రోదసిలో అత్యంత కచ్చితమైన సమయ, ఫ్రీక్వెన్సీ వ్యవస్థ సిద్ధమైనట్లవుతుంది.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలును నడిపిన స్విట్జర్లాండ్ కంపెనీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రయాణికుల రైలు స్విట్జర్లాండ్‌లో పరుగులు తీసింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175 ఏళ్లు అయిన సందర్భంగా రేయిషేన్ రైల్వే కంపెనీ 1.9 కిలోమీటర్ల పొడవు ఉండే ప్రయాణికుల రైలును నడిపింది. 100 బోగీలు, 4 ఇంజిన్లు గల ఈ రైలు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పట్టింది. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఆల్ప్స్ పర్వత సానువుల గుండా సాగే ఈ మార్గంలో ప్రఖ్యాత ల్యాండ్‌వాసర్ వారధి సహా 22 సొరంగాలు, 48 వంతెనలు, అనేక లోయలు, మలుపుల్లోని దృశ్యాలను ప్రయాణికులు ఆస్వాదించారు. ఈ మార్గాన్ని యునెస్కో 2008లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రేయిషేన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫాస్కియాటీ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో సాధించిన ఇంజినీరింగ్ అద్భుతాలకు గుర్తుగా, స్విస్ రైల్వే ఏర్పడి 175 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రయాణికుల రైలును నడిపినట్లు తెలిపారు.
చైనాలో నోటితో పీల్చే కొవిడ్ టీకా
చైనాలో నోటి ద్వారా పీల్చే కొవిడ్ టీకాను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను షాంఘై నగరంలో ప్రజలకు అందిస్తున్నారు. ఇలాంటి తరహా కరోనా టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది. ఇప్పటికే ఇతర కొవిడ్ టీకాలు పొందిన వారికి దీన్ని ఉచితంగా బూస్టర్ డోసుగా మాత్రమే అందిస్తున్నట్లు నగర అధికారిక సామాజిక మాధ్యమం వెల్లడించింది. కొంత మేర పారదర్శకంగా ఉన్న తెల్లటి కప్పులో పొగమంచులా ఉండే వ్యాక్సిన్‌ను ప్రజలు నోటి ద్వారా పీలుస్తున్నారు. టీకాను నెమ్మదిగా పీల్చిన తర్వాత 5 సెకెన్ల పాటు శ్వాసను బంధించి ఉంచుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ 20 సెకెన్లలో పూర్తవుతోంది. ఈ టీకాను బూస్టర్ డోసుగా అందించేందుకు చైనా సెప్టెంబరులో అనుమతించింది.
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్
బ్రిటన్‌లో భారత సంతతి నేత రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. పాలక కన్జర్వేటివ్ పార్టీ అధినాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై సగర్వంగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తద్వారా దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించారు. పాలనలో ఇటీవల చోటు చేసుకున్న పొరపాట్లను సరిదిద్ది దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడమే తన లక్ష్యమని సునాక్ ప్రకటించారు. మరోవైపు తన నేతృత్వంలోని కేబినెట్‌లో భారత సంతతి నాయకురాలు సుయెల్లా బ్రేవర్మన్‌కు హోం శాఖను కొత్త ప్రధాని కేటాయించారు. ప్రధాని పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ముందే ప్రకటించిన లిజ్ ట్రస్ లండన్‌లో తన చివరి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లి బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3కు తన రాజీనామా లేఖను లాంఛనంగా అందజేశారు. ఆ వెంటనే ప్యాలెస్‌కు విచ్చేసిన సునాక్ రాజుతో సమావేశమయ్యారు. ఆయన్ను దేశ 57వ ప్రధానమంత్రిగా కింగ్ చార్లెస్-3 నియమించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అక్కడి నుంచి ప్రధాని అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెళ్లి బాధ్యతలను స్వీకరించారు. ఆ వెంటనే 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ప్రధాని హోదాలో తొలిసారి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 5 నిమిషాల 56 సెకన్ల పాటు సాగింది.
‣ ఆర్థిక మంత్రిగా ఉన్న జెరెమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగించనున్నట్లు ప్రకటించారు. జేమ్స్ క్లెవెర్లీని విదేశాంగ మంత్రిగా కొనసాగించారు. జాన్సన్ సర్కారులో ఉప ప్రధానిగా, న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన తన సన్నిహితుడు డొమినిక్ రాబ్‌కు ఆ రెండు పదవులను తిరిగి కట్టబెట్టారు. రక్షణ మంత్రిగా బెన్ వాలెస్ కొనసాగనుండగా టోరీ పార్టీ ఛైర్మన్‌గా నదీమ్ జహావీ నియమితులయ్యారు. నదీమ్‌ను మంత్రిగా నియమించినప్పటికీ శాఖను కేటాయించలేదు. వాణిజ్య శాఖ గ్రాంట్ షాప్స్‌కు దక్కింది. అయితే భారత సంతతికి చెందిన ఎంపీ అలోక్ వర్మ మంత్రి పదవిని కోల్పోయారు. కాప్-26 అధ్యక్షుడిగా మాత్రం ఆయనే కొనసాగుతారు.
సునాక్ ఘనతలు ఇవీ..
‣ అతిపిన్న వయస్కుడైన (42 ఏళ్లు) ప్రధాని
‣ ఆ పదవిని దక్కించుకున్న తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి
‣ తొలి హిందూ ప్రధాని
‣ తొలి భారత సంతతి ప్రధానమంత్రి
చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వరుసగా మూడోసారి ఎన్నిక
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ చరిత్ర సృష్టించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత మరెవరికీ సాధ్యం కాని తరహాలో దేశాధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. 69 ఏళ్ల జిన్‌పింగ్, సీపీసీ అధినేత హోదాలో కూడా కొనసాగనున్నారు. శక్తమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్‌గానూ ఆయన నియమితులయ్యారు. దీంతో దేశంలో అత్యున్నత అధికార కేంద్రాలన్నీ జిన్‌పింగ్ చేతుల్లోనే ఉన్నట్లయింది. చైనాను ఆయన జీవితకాలం పాటు పాలించడమూ ఇక లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. బీజింగ్ వేదికగా జరిగిన సీపీసీ 20వ జాతీయ మహాసభల్లో పార్టీ కేంద్ర కమిటీని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆ కమిటీ సమావేశమై 24 మందితో కూడిన పొలిట్‌బ్యూరోకు ఆమోదముద్ర వేసింది. అనంతరం పొలిట్‌బ్యూరో ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంది. చైనా పాలనా వ్యవహారాలన్నింటినీ చూసుకునే ఈ కమిటీలో జిన్‌పింగ్‌తో పాటు కీలక నేతలు లి కియాంగ్, ఝావో లెజి, వాంగ్ హ్యూనింగ్, సై కి, డింగ్ షుయెషియాంగ్, లి షిలకు చోటు దక్కింది. వీరిలో ఝావో, వాంగ్‌లు ఇంతకుముందున్న స్టాండింగ్ కమిటీలోనూ సభ్యులుగా పనిచేశారు. చైనాలో ఉన్నత స్థాయి పదవుల్ని చేపట్టేందుకు 68 ఏళ్లను గరిష్ఠ వయోపరిమితిగా భావిస్తుండగా 69 ఏళ్ల వాంగ్ విషయంలోనూ దాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు జిన్‌పింగ్‌కు సీఎంసీ ఛైర్మన్ పదవిని తిరిగి కట్టబెట్టిన పొలిట్ బ్యూరో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) జనరల్‌లు ఝాంగ్ యూషియా, హె వీడాంగ్‌లను సీఎంసీ వైస్ ఛైర్మన్‌లుగా నియమించింది.
ఇటలీ ప్రధానిగా మెలోనీ బాధ్యతల స్వీకరణ
నయా ఫాసిస్టు మూలాలున్న ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీ నాయకురాలు జార్జియా మెలోనీ (45) ఇటలీ ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. రెండో ప్రపంచయుద్ధంలో ముస్సోలినీ నాయకత్వంలోని ఫాసిస్టు ప్రభుత్వం ఓడిపోయిన తరవాత ఇటలీలో ఒక అతివాద పార్టీ ప్రధాని పదవిని కైవసం చేసుకోవడం ఇదే ప్రథమం. ఇతర మితవాద పార్టీలైన లెగా, ఫోర్జా ఇటాలియాలతో కలిసి మెలోనీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆమెతోపాటు 24 మంది మంత్రులతో దేశాధ్యక్షుడు సెర్జియో మాటరెల్లా ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో అయిదుగురు ఏ పార్టీకీ చెందని వృత్తి నిపుణులు, మరో ఆరుగురు మహిళలు. ఐరోపా సెంట్రల్‌బ్యాంకు మాజీ అధ్యక్షుడు మేరియా డ్రాఘి నాయకత్వంలో 2021లో అన్ని పార్టీలతో జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అందులో చేరడానికి నిరాకరించిన ఏకైక పక్షం మెలోనీ పార్టీయే. అప్పట్లో ఆమె మధ్యంతర ఎన్నికలకే మొగ్గు చూపారు. గత సెప్టెంబరు 25న జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మెలోనీ నాయకత్వాన్ని సమర్థించారు.
ఇమ్రాన్‌ఖాన్ పార్లమెంటు సభ్యత్వం రద్దు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వంపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హత ఖాన్‌కు లేదని, రానున్న ఐదేళ్లలో అతను ఏ ఎన్నికలోనూ పోటీ చేయకూడదని పేర్కొంది. ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ ప్రభుత్వాధి నేతలు, ప్రతినిధులు ఇచ్చిన బహుమానాలను అమ్ముకున్నారన్నది ఇమ్రాన్‌పై అభియోగం. ఈ ఆరోపణలు నిరూపితమయ్యాయని, ఎన్నికల ప్రమాణ పత్రంలోనూ ఇందుకు సంబందించిన వివరాలు లేవని ఎన్నికల సంఘం పేర్కొంది.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాలతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని లిజ్‌ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. కేవలం 45 రోజుల్లోనే అధికారం కోల్పోయి కొత్త రికార్డు సృష్టించారు. వివిధ అంశాల్లో సొంత పార్టీలోనే తిరుగుబాటు రావడంతో ప్రధాని గద్దె దిగడం అనివార్యమయింది. తన స్థానంలో కొత్త నేతను అధికార టోరీ పార్టీ ఎన్నుకునే వరకు ఆమె ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.
‣ ఆమె ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి సెప్టెంబరు 23న మినీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పన్నుల కోత విధించారు. అది సామాన్యులకు సాయం చేయకపోగా, సంపన్నులకు మేలు చేసేదిలా మారింది. ప్రభుత్వ ఆదాయం, పౌండు విలువ దారుణంగా పడిపోయాయి. ప్రభుత్వానికి అప్పుల భారం, వడ్డీరేట్లు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. ప్రజల్లో గగ్గోలు మొదలైంది. ప్రభుత్వ సమర్థతపై అనుమానాలు మొదలయ్యాయి. ఆర్థిక మంత్రికి ట్రస్ ఉద్వాసన పలికి, మాజీ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్‌ను ఆ స్థానంలోకి తీసుకున్నారు. ప్రధానికి కూడా చెప్పకుండానే పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించడం రాజకీయంగా ట్రస్‌కు ఇబ్బందికరంగా మారింది. వరస పరిణామాలతో పార్టీపైనా, ప్రభుత్వంపైనా పట్టుకోల్పోయిన నేపథ్యంలో ఇక రాజీనామా తప్ప ఆమెకు మరో మార్గం లేకపోయింది. చట్టసభలో విపక్షాల తీర్మానంపై జరిగిన దౌర్జన్యపూరిత ఘటనలు ఆమెను మరింత ఇబ్బంది పెట్టాయి. ఆ తీర్మానాన్ని విశ్వాస పరీక్షతో సమానంగా భావించడంతో ఒక దశలో ఎంపీలపై దాడి జరిగినంత పనైంది. ఈ ఘటనలపై దిగువ సభ స్పీకర్ విచారణకు ఆదేశించారు.
పదవి కోల్పోవడంలో రికార్డు :-
బ్రిటన్‌లో కేవలం 45 రోజుల పాటు అధికారంలో ఉన్న ప్రధానిగా చరిత్రలో ట్రస్ నిలిచిపోనున్నారు. ఇంతవరకు జార్జి కానింగ్ పేరుతో ఈ రికార్డు ఉండేది. 1827లో కేవలం 121 రోజుల పాటు ప్రధానిగా ఆయన కొనసాగి, కన్నుమూశారు. ఫ్రెడరిక్ జాన్ రాబిన్సన్ 144 రోజులు, బోనార్ లా 210 రోజులు, విలియం కావెండిష్ 236 రోజులు, విలియం పెట్టీ 267 రోజులు అధికారంలో ఉన్నారు.
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ రాజీనామా
బ్రిటన్ రాజకీయాల్లో తాజాగా మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ (42) తన పదవికి రాజీనామా చేశారు. శాఖాపరమైన కమ్యూనికేషన్ కోసం ఆమె పొరపాటున తన వ్యక్తిగత ఈ-మెయిల్‌ను ఉపయోగించుకోవడమే అందుకు కారణం. బ్రేవర్మన్ భారత సంతతి నాయకురాలు. ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి 43 రోజులే అయింది. ట్రస్‌తో భేటీ అయిన తర్వాత బ్రేవర్మన్ తన రాజీనామా ప్రకటన చేశారు.
రష్యాలో విలీనమైన ప్రాంతాల్లో మార్షల్ లా
రష్యాలో విలీనం చేసుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మార్షల్ లా విధిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ చట్టం కింద చేపట్టే చర్యలేమిటనేది ఆయన వెంటనే చెప్పకపోయినా ఆ ప్రాంతాల అధిపతులకు అదనంగా అత్యవసర అధికారాలు ఇస్తున్నట్లు మాత్రం వెల్లడించారు. రష్యా భద్రత, సురక్షితమైన భవితవ్యం, ప్రజారక్షణ కోసం ప్రయత్నిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ముందున్నవారు, శిక్షణ కేంద్రాల్లో ఉన్నవారు తమ వెనుక గొప్ప దేశమంతా ఉందని భావించాలని రష్యా భద్రత మండలి సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్ చెప్పారు. ఆ వెంటనే దొనెట్స్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జపోరిజియా ప్రాంతాల్లో మార్షల్ లా అమలుకు రష్యా పార్లమెంటు ఆమోదం తెలిపింది.
స్వీడన్ ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టెర్‌సన్
స్వీడన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఉల్ఫ్ క్రిస్టెర్‌సన్ (59)ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకుంది. కేవలం మూడు ఓట్ల ఆధిక్యంతో (176-173) ఆయన డెమోక్రాట్లపై విజయం సాధించారు. మూడు పార్టీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రధాని పదవికి పోటీపడిన ఆయన సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయారు. పార్లమెంటులో ఇతర పార్టీలేవైనా పూర్తి ఆధిక్యాన్ని చూపించేవరకు స్వల్ప మెజారిటీ ఉన్నవారే ప్రధానిగా కొనసాగే అవకాశాన్ని ఆ దేశ రాజ్యాంగం కల్పిస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద పసుపు వర్ణ వజ్రం
303.10 క్యారెట్ల ప్రపంచంలోనే అతి పెద్ద పసుపు వర్ణ వజ్రాన్ని డిసెంబరు 7న న్యూయార్క్‌లో వేలం వేయనున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో దీన్ని ప్రదర్శనకు ఉంచారు.
బ్రిటన్ ఆర్థికమంత్రిగా జెరెమీ హంట్‌కు బాధ్యతలు
బ్రిటన్‌లో ప్రధానమంత్రి లిజ్ ట్రస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ దేశ రాజకీయాల్లో తీవ్ర కుదుపులకు కారణమవుతోంది. ఆ బడ్జెట్‌లోని కీలక ప్రతిపాదనలను రద్దు చేయడం ద్వారా తన పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న ట్రస్ ఏకంగా దేశ ఆర్థిక మంత్రి క్వాసీ కార్టెంగ్‌పై వేటు వేశారు. ఆయన్ను పదవి నుంచి తప్పించారు. ఆ వెంటనే జెరెమీ హంట్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ట్రస్, క్వార్టెంగ్ పదవులు చేపట్టి నాటికి 38 రోజులే కావడం గమనార్హం. మినీ బడ్జెట్‌లో 4300 కోట్ల పౌండ్ల మేరకు పన్నుల్లో కోతలు విధించాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయానికి పడే గండిని మార్కెట్‌లో బాండ్ల జారీ ద్వారా పూడ్చుకోవాలని ట్రస్ సర్కారు తలపెట్టింది. కానీ దీనివల్ల బ్రిటన్ రుణ భారం పెరిగిపోయే అవకాశాలుండటంతో దేశ కరెన్సీ అయిన పౌండ్ విలువ పడిపోసాగింది. దీంతో ట్రస్ ప్రభుత్వం మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ చేసిన కార్పొరేట్ పన్ను ప్రతిపాదనను మళ్లీ ముందుకు తీసుకురాక తప్పలేదు. కార్పొరేట్ పన్నును 25 శాతానికి పెంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చాలని సునాక్ ఇంతకుముందు ప్రతిపాదించారు. ట్రస్ సర్కారు దాన్ని మినీ బడ్జెట్‌లో పక్కనపెట్టింది. తీరా ఆ బడ్జెట్ ఆర్థిక కల్లోలానికి దారితీయడంతో కార్పొరేట్ పన్ను రేటును ప్రస్తుతమున్న 19% నుంచి 25%కు 2023 ఏప్రిల్ నుంచి పెంచుతామని ట్రస్ ప్రకటించారు. ఏడాదికి 1.5 లక్షల పౌండ్లకు మించి ఆదాయం ఆర్జించే సంపన్న వర్గాలపై విధిస్తున్న 45 శాతం ఆదాయ పన్నును రద్దు చేయాలనే మినీ బడ్జెట్ ప్రతిపాదననూ ఆమె ఉపసంహరించుకున్నారు.
ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో తీర్మానం
ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను కలిపేసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ పేరిట సెప్టెంబరులో రష్యా చేసిన తతంగాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఖండించింది. దీనికి సంబంధించి ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని సమితి 143-5 ఓట్ల భారీ తేడాతో ఆమోదించింది. ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా తక్షణం, బేషరతుగా వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది. 193 సభ్య దేశాలున్న ఐరాసలో 35 దేశాలు ఈ తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. తీర్మానాన్ని వ్యతిరేకించడంలో రష్యాకు ఉత్తర కొరియా, బెలారూస్, సిరియా, నికరాగువా తోడు నిలిచాయి. భారత్, చైనా, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల్లో సౌదీ అరేబియా, యుఏఈ, బ్రెజిల్ కూడా ఉన్నాయి.
జపాన్ రాకెట్ ప్రయోగం విఫలం
జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (జాక్సా) ప్రయోగించిన ఎప్సిలాన్-6 రాకెట్ విఫలమైంది. ఎనిమిది ఉపగ్రహాలతో నింగిలోకి పయనమైన కొద్దిసేపటికే ఇబ్బంది మొదలైంది. దీంతో రాకెట్‌కు ‘సెల్ఫ్ డిస్ట్రక్షన్ కమాండ్’ ఇచ్చి, పేల్చి వేశారు. జపాన్ రాకెట్ ఒకటి విఫలం కావడం 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఉత్తర జపాన్‌లోని యుచినోరా అంతరిక్ష కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. రాకెట్ నింగిలోకి లేచాక దాని దిశలో మార్పు వచ్చింది. ఆ స్థితిలో అది సురక్షితంగా ప్రయాణించి, నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించడం సాధ్యం కాదన్న నిర్ధారణకు జాక్సా అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలో దాని పేల్చివేతకు పూనుకున్నారు. రాకెట్ శకలాలు ఫిలిప్పీన్స్‌కు తూర్పున సముద్ర జలాల్లో పడినట్లు భావిస్తున్నారు. ఈ వైఫల్యానికి కారణాలను శోధిస్తున్నారు. రాకెట్‌లో రెండు ప్రైవేటు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాణిజ్య పేలోడ్‌లను ఎప్సిలాన్ మోసుకెళ్లడం ఇదే తొలిసారి.
డబ్ల్యూఈఎఫ్ ‘గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్’ కింద డాక్టర్ రెడ్డీస్ యూనిట్ గుర్తింపు
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన హైదరాబాద్‌లోని బాచుపల్లి యూనిట్‌ను ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్), ‘గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్’ కింద గుర్తించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతలైన కృత్రిమ మేధ, 3-డీ ప్రింటింగ్, బిగ్‌డేటా విశ్లేషణల వినియోగంలో ప్రపంచంలోనే ముందున్న 100కు పైగా ఉత్పత్తిదార్ల బృందంలో డాక్టర్ రెడ్డీస్‌కు స్థానం దక్కినట్లు అవుతోంది. ‘గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్’ కార్యక్రమాన్ని మెకిన్సే అండ్ కంపెనీ భాగస్వామ్యంతో డబ్ల్యూఈఎఫ్ చేపట్టింది. ఈ నెట్‌వర్క్‌లో తాజాగా 11 సంస్థలకు చెందిన ఫ్యాక్టరీలను చేర్చింది. ఇందులో మన దేశానికి చెందిన మూడు యూనిట్లు డాక్టర్ రెడ్డీస్ బాచుపల్లి యూనిట్‌తో పాటు, సిప్లా లిమిటెడ్‌కు చెందిన ఇండోర్ యూనిట్, ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలోని మాండెలెజ్ యూనిట్ ఉన్నాయి. ఈ యూనిట్లలో ఆయా సంస్థల యాజమాన్యాలు అమలు చేసిన నూతన విధానాలు, వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యయాలు గణనీయంగా తగ్గి, ఉత్పాదకత బాగా పెరిగినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
విమానాశ్రయ ఇబ్బందులకు ‘ప్యార్లల్ రియాల్టీ’ సాంకేతికతతో తెర
మన ఫ్లైట్ ఎక్కడుందో, అక్కడికి చేరుకోవడానికి ఏ గేట్ గుండా వెళ్లాలో తెలియక తికమక పడుతుంటాం. అక్కడి భారీ తెరలపై డజన్ల సంఖ్యలో ఫ్లైట్ సర్వీసుల రాకపోకల వివరాలు ఉంటాయి. అందులో నిర్దిష్టంగా మన విమానం వివరాలను వెతికిపట్టుకోవడం కష్టమవుతుంటుంది. ఇలాంటి సమస్యలను దూరం చేసే సరికొత్త పరిజ్ఞానం వచ్చేసింది. ఓ మాయాతెరను అమెరికాలోని డెట్రాయిట్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ‘ప్యార్లల్ రియాల్టీ’ సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీని కాలిఫోర్నియాలోని మిస్ అప్లైడ్ సైన్సెస్ సంస్థ అభివృద్ధి చేసింది.
ఏ వివరాలు అందిస్తుంది?
‣ గేట్ నంబర్
‣ అది ఏ దిశలో ఉంది
‣ అక్కడికి చేరుకోవడానికి ఎంతసేపు పడుతుంది
‣ విమానం బయల్దేరే సమయం
‘విదేశీ ఏజెంటు’ జాబితాలోకి స్టార్ ర్యాపర్ మిరాన్: రష్యా
రష్యా వ్యతిరేక గళాలను అణచి వేసే ప్రక్రియలో భాగంగా ప్రఖ్యాత ర్యాప్ గాయకుడు మిరాన్ ఫ్యూదరొవ్ పేరును మాస్కో ప్రభుత్వం ‘విదేశీ ఏజెంటు’ జాబితాలో చేర్చింది. ప్రముఖ వైజ్ఞానిక శాస్త్ర కాల్పనిక రచయిత డిమిట్రి గ్లుఖొవ్‌స్కీ, మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పొపొవా ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు. రష్యా, బ్రిటిష్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న మిరాన్ ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ దాడిని ఒక విపత్తుగా అభివర్ణించారు. యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. మాస్కో దళాలు ఉక్రెయిన్‌లోకి చొరబడగానే తన రష్యా పర్యటనను రద్దు చేసుకొన్న మిరాన్ ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకునేందుకు పశ్చిమ ఐరోపా, తుర్కియాలలో కచేరీలు నిర్వహించారు.
కాటన్ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు
ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా నిలవడంలో కీలక పాత్ర పోషించే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా దీన్ని గుర్తించారు. దేశంలోని మొత్తం నాలుగు సాగునీటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కగా అందులో కాటన్ బ్యారేజి మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి (ఐసీఐడీ) 24వ అంతర్జాతీయ సదస్సులో దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రగబ్ రగబ్ చేతుల మీదుగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అందుకున్నారు. తమిళనాడులోని లోయర్ ఆనకట్ట, ఒడిశాలోని బైతరిణి, రుషితుల్య ప్రాజెక్టులకు కూడా ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా గుర్తింపు లభించింది.
విలీనానికి రష్యా ‘డ్యూమా’ ఆమోదం
ఖర్కీవ్‌లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని, లీమన్ నగరాన్నీ హస్తగతం చేసుకున్న ఉక్రెయిన్ దళాలు ఇప్పుడు ఖేర్సన్‌పై కన్నేశాయి. అక్కడా పుతిన్ సేనలను వెనక్కి నెడుతూ ముందుకు దూసుకుపోతున్నాయి. ఉక్రెయిన్ భూభాగాలైన దొనెట్స్క్, లుహాన్స్, జపోరిజియాలతో పాటు ఈ ఖేర్సన్‌ను కూడా రష్యా సమాఖ్యలోకి చేరుస్తున్నట్లు పుతిన్ ఇటీవల సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ విలీనానికి ఆ దేశ పార్లమెంటులోని దిగువ సభ డ్యూమా కూడా ఆమోదం తెలిపింది.
తొలిసారిగా భూకక్ష్యలోకి ఆల్ఫా రాకెట్ ప్రయోగం విజయవంతం
అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ కంపెనీ తొలిసారిగా భూకక్ష్యలోకి ప్రయోగం చేపట్టింది. ఆ సంస్థకు చెందిన ఆల్ఫా రాకెట్ కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా అనేక చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఇవి పలు సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తాయి. విద్యా సంబంధ అవసరాలను నెరవేరుస్తాయి. ప్రయోగం 100 శాతం దిగ్విజయంగా సాగిందని ఫైర్‌ఫ్లై సంస్థ ప్రకటించింది. ఆల్ఫా రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు శుక్రవారం ప్రయత్నించగా చివరి నిమిషంలో అది ఆగిపోయింది. ఈ కంపెనీకి ఇది రెండో ప్రయోగం. తొలి ప్రయత్నం గత ఏడాది సెప్టెంబరు 2న జరిగింది. నాడు రాకెట్ కక్ష్యలోకి చేరలేదు.