ముఖ్యమైన దినోత్సవాలు

దేశ విచ్ఛిన్నానికి శత్రువుల కుట్ర

భారత దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యతను, సుహృద్భావాన్ని దెబ్బతీయడానికి శత్రువులు ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ విచ్ఛినాన్ని కోరుకుంటున్న అటువంటి శక్తులకు గట్టిగా జవాబివ్వడానికి ప్రజలంతా దృఢసంకల్పంతో ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. దేశ తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి అలాగే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా ప్రతిమ వద్ద మోదీ నివాళులు అర్పించారు.

దేశీయ ఉత్పత్తులకు ఊతమిస్తే కళలు, సంస్కృతి పదిలం: ప్రధాని మోదీ

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించి, స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తే మన దేశ కళలు, సంస్కృతి, నాగరికతలను పదిలపరచుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జైన సాధువు విజయ్‌వల్లభ్‌ సూరీశ్వర్‌ 150వ జయంతిని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. స్వదేశీ, స్వావలంబన అనేవి ‘ఆజాదీ కా అమృత్‌ కాల్‌’కు సరిపోలుతాయని చెప్పారు. సూరీశ్వర్‌పై రూపొందించిన తపాలా బిళ్లను, నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. యుద్ధ సంక్షోభం, ఉగ్రవాదం, హింస వంటి వాటిని చవిచూస్తున్న ప్రస్తుత ప్రపంచంలో పురాతన సంప్రదాయాలు, సిద్ధాంతాలు పెద్ద ఆశాకిరణంలా నిలుస్తాయని చెప్పారు. అనేక సంక్షోభాలకు పరిష్కారాలు జైన గురువుల బోధనల్లో కనిపిస్తాయన్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం - 2022

దేశంలోని పలు కల్లోలిత ప్రాంతాలు అభద్రత నుంచి బయటపడి ప్రశాంతంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దిల్లీలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల సమర్థ పాలనలో ఈశాన్య రాష్ట్రాల్లో 70% హింసాత్మక సంఘటనలు తగ్గిపోయాయి. జమ్మూ-కశ్మీర్, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం సంతోషకరమైన అంశం. ఏకంగా 35 వేల మంది పోలీసు వీరుల ప్రాణ త్యాగాల కారణంగానే దేశం ఇలా ప్రశాంతంగా ఉంది. ప్రకృతి విపత్తులు, కొవిడ్‌లాంటి అత్యవసర సమయాల్లో పోలీసులు, పారా మిలటరీ బలగాలు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

వైమానిక దళం కోసం ప్రత్యేక ఆయుధ వ్యవస్థ: ఐఏఎఫ్‌ 90వ వార్షికోత్సవం

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) 90వ వార్షికోత్సవాలు చండీగఢ్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, హరియాణా గవర్నరు బండారు దత్తాత్రేయ, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి పాల్గొని మాట్లాడారు. ఐఏఎఫ్‌ కోసం ఆయుధ వ్యవస్థ శాఖ (వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌)ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు ఇదే తొలిసారి అని, దీని ద్వారా గగనతల శిక్షణలో రూ.3,400 కోట్ల మేర ఆదా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా రూపొందించిన యుద్ధ యూనిఫాంను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సుఖ్నా సరస్సుపై సుమారు 80 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తొలిసారి దేశ రాజధాని దిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరుగుతుండటం గమనార్హం. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ సామగ్రిని ప్రదర్శిస్తున్నారు. అందులో వాయుసేన అమ్ముల పొదిలో చేరిన ప్రచండ్‌ కూడా ఒకటి. ఇది అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌. ఇటీవల దీనిని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.

సికింద్రాబాద్‌లో 16 అడుగుల గాంధీ విగ్రహావిష్కరణ

‘తెలంగాణ ఏర్పాటు కోసం బయలుదేరిన నాడు ఎంతో మంది నన్ను అవహేళన చేశారు. దూషణలు, అవహేళనలు వచ్చిన సమయంలో కళ్లు మూసుకుని మహాత్మా గాంధీని స్మరించుకునేవాడిని. ఆయన స్ఫూర్తితో పయనించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఎదుట నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు.