కమిటీలు

గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కమిటీ

ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌ - యూసీసీ) అమలుకు కమిటీ నియమించాలని గుజరాత్‌ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడబోతున్న తరుణంలో చివరిదిగా భావిస్తున్న కేబినెట్‌ సమావేశాన్ని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అధ్యక్షతన నిర్వహించారు. దీనిలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రి హర్ష్‌ సంఘవి, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ఈ మేరకు వెల్లడించారు. కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉంటారు. పౌరులందరికీ ఒకే చట్టం అమలు కావాలని రాజ్యాంగంలోని 44వ అధికరణం చెబుతోంది. ఆ ప్రకారమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. హిందూ వివాహ చట్టం, ముస్లిం పర్సనల్‌ లా కూడా యూసీసీ కిందికి వస్తాయనీ, అవి రెండూ రాజ్యాంగంలో లేవని రూపాలా చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ ఇది వరకే ప్రకటించాయి.

ఆప్‌టెల్‌ ఛైర్‌పర్సన్‌ ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు

ఎలక్ట్రిసిటీ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఆప్‌టెల్‌) ఛైర్‌పర్సన్‌ ఎంపిక కోసం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలో కేంద్ర విద్యుత్తు శాఖ శోధన, ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. పునరుత్పాదక ఇంధన శాఖ, పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శులు, రాజస్థాన్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.శిందేలను అందులో సభ్యులుగా నియమించింది. విద్యుత్తు శాఖ కార్యదర్శి ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఆప్‌టెల్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి ఇద్దరు పేర్లను కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది.