క్లిక్ కెమిస్ట్రీలో బెర్టోజి, షార్ప్‌లెస్, మెల్డల్‌లకు నోబెల్ పురస్కారం
క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మరింత నిర్దిష్ట చికిత్స అందించేందుకు దోహదపడగల మెరుగైన ఔషధాల రూపకల్పనకు బాటలు పరచిన పరిశోధక త్రయం కరోలిన్ ఆర్ బెర్టోజి, కె.బారీ షార్ప్‌లెస్, మార్టెన్ మెల్డల్‌లను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. రసాయన శాస్త్రం విభాగంలో వారు ఈ ఏడాది సంయుక్తంగా పురస్కారాన్ని గెల్చుకున్నారు. బెర్టోజి, షార్ప్‌లెస్ అమెరికా పౌరులు కాగా.. మెల్డల్ డెన్మార్క్ వాసి. క్లిక్ కెమిస్ట్రీతో పాటు క్యాన్సర్ ఔషధాల తయారీకి అవసరమైన బయోఆర్థోగోనల్ రియాక్షన్లు, డీఎన్‌ఏ మ్యాపింగ్, నిర్దిష్ట అవసరాలకు ఉపయోగించే పదార్థాల రూపకల్పన వంటి అంశాల్లో ఈ ముగ్గురు పరిశోధకులు అనిర్వచనీయ సేవలందించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. 81 ఏళ్ల షార్ప్‌లెస్ నోబెల్ పురస్కారాన్ని గెల్చుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. 2001లో ఆయన తొలిసారి దాన్ని దక్కించుకున్నారు. రెండుసార్లు నోబెల్ పొందిన ఐదో వ్యక్తిగా ప్రస్తుతం ఆయన చరిత్రకెక్కారు. షార్ప్‌లెస్ కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సేవలందిస్తున్నారు.
రసాయనిక కొక్కీల (బకిల్స్)ను ఉపయోగిస్తూ అణువులను అనుసంధానించొచ్చన్న ఆలోచనను షార్ప్‌లెస్ తొలుత ప్రతిపాదించారు. అనంతరం అణువులను పరస్పరం సులువుగా అనుసంధానించగల మంచి కొక్కీలను గుర్తించడంపై దృష్టిసారించి.. అందులో విజయం సాధించారు. కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మెల్డల్ (68) కూడా స్వతంత్రంగా ఆ తరహా కొక్కీలను గుర్తించారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బెర్టోజి (55) క్లిక్ కెమిస్ట్రీని కొత్త పుంతలు తొక్కించారు. సజీవ కణాల్లోనే.. ఆయా వ్యవస్థలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అణువుల పరస్పర అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యేలా బయోఆర్థోగోనల్ రియాక్షన్ విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు అత్యంత కచ్చితత్వంతో చికిత్స అందించేందుకు ఈ విధానం దోహదపడుతుంది.
ఫ్రెంచి రచయిత్రి అనీ ఎర్నోకు సాహిత్య నోబెల్
ఫ్రెంచి రచయిత్రి అనీ ఎర్నోకు ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి ప్రకటించారు. ఆత్మకథ నవలలు రాయడంతో ప్రారంభించిన 82 ఏళ్ల ఎర్నో జ్ఞాపకాలు రాసేందు‣కు ఫిక్షన్‌ను వదిలిపెట్టారు. ఆమె 20కి పైగా పుస్తకాలు రాశారు. వాటిలో చాలావరకు తన, తన చుట్టూ ఉన్నవారి జీవితాల్లోని చిన్నచిన్న ఘటనల్లోంచి తీసుకున్న కథలే. లైంగిక విషయాలు, అబార్షన్, అనారోగ్యం, తన తల్లిదండ్రుల మరణం లాంటి విషయాలు వాటిలో ఉన్నాయి. చాలా సరళమైన భాషలో, ఏమాత్రం రాజీ పడకుండా ఎర్నో రాశారని నోబెల్ శాంతి బహుమతి కమిటీ ఛైర్మన్ ఆండర్స్ ఆల్సన్ తెలిపారు. తన శైలి చాలా సరళంగా ఉంటుందని ఎర్నో చెబుతుంటారు. తాను వివరించే ఘటనల గురించి చాలా తటస్థంగా చూస్తూ, భావోద్వేగాలకు ప్రభావితం కాకుండా ఉంటారు. తండ్రితో తన సంబంధం గురించి రాసిన ‘లా ప్లేస్’ అనే పుస్తకంలో ‘సాంస్కృతిక జ్ఞాపకాలు ఏమీ లేవు, నిందాస్తుతిని ఘనంగా ప్రకటించుకోలేదు. ఈ నిష్పాక్షిక రచనా శైలి నాకు సహజంగానే అబ్బింది’ అని రాశారు. ఆమె రాసిన వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం ‘లెస్ అనీస్’ (ద ఇయర్స్) 2008లో ప్రచురితమైంది. రెండో ప్రపంచయుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు తన గురించి, ఫ్రెంచి సమాజం గురించి అందులో ఉంటుంది. ఈ పుస్తకంలో తనను వేరే వ్యక్తిలా ‘ఆమె’ అని ప్రస్తావించడం విశేషం. ఈ పుస్తకానికి అనేక అవార్డులు లభించాయి. ఎర్నో ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో యెవెటోట్ అనే చిన్న పట్టణంలో 1940లో జన్మించారు. 1901 నుంచి ఇప్పటివరకు 119 మందికి సాహిత్య నోబెల్ పురస్కారాలు ప్రదానం చేయగా ఆ జాబితాలో చోటుదక్కించుకున్న 17వ మహిళ ఎర్నో.
భౌతికశాస్త్రం క్వాంటమ్ సైన్స్‌లో అలెన్ ఆస్పెక్ట్, క్లాజర్, జైలింగర్‌కు నోబెల్
క్వాంటమ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లో కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. సురక్షిత కమ్యూనికేషన్ సాగించేలా ఎన్‌క్రిప్షన్ రంగంలో అనేక ప్రయోజనాలకు వీరి ఆవిష్కరణలు బాటలుపరిచాయి.
‣ అలెన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాజర్ (అమెరికా), ఆంటోన్ జైలింగర్ (ఆస్ట్రియా)కు ఈ గౌరవం దక్కింది. పరస్పరం చాలా దూరంలో ఉన్న ఫోటాన్లు అనే రేణువులను అనుసంధానించే పద్ధతిని వారు కనుగొన్నట్లు నోబెల్ ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. క్వాంటమ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ అనేది ఉజ్వల రంగమని, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని కమిటీ సభ్యురాలు ఎవా ఓల్సన్ పేర్కొన్నారు. భద్రంగా సమాచారాన్ని బట్వాడా చేయడం, క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్, క్వాంటమ్ నెట్‌వర్క్స్ రంగాల్లో ఇది ఉపయోగపడుతోందన్నారు. దీని మూలాలు క్వాంటమ్ మెకానిక్స్‌లో ఉన్నాయని వివరించారు. ఇది మరో ప్రపంచాన్ని ఆవిష్కరించిందని పేర్కొన్నారు. క్లాజర్ (79) క్వాంటమ్ సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. తొలిసారి దీన్ని 1960లలో ఒక ప్రయోగంలో పరీక్షించారు. ఆస్పెక్ట్ (75).. ఈ సిద్ధాంతాల్లో లోపాలను సరిచేశారు. క్వాంటమ్ టెలిపోర్టేషన్ అనే విధానాన్ని జైలింగర్ (77) ప్రదర్శించి చూపారు. ఇందులో చాలా సమర్థంగా సుదూరాలకు సమాచారాన్ని బట్వాడా చేయడానికి వీలవుతుంది. ఇందుకోసం ‘ఎన్‌టాంగిల్‌మెంట్’ను ఉపయోగిస్తారు. అయితే చిన్నపాటి రేణువుల విషయంలోనే ఇది సాధ
స్వీడన్ శాస్త్రవేత్త పాబోకు వైద్యశాస్త్రంలో నోబెల్
వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటె పాబో (67)ను నోబెల్ పురస్కారం వరించింది. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన ఆవిష్కరణలకు ఈ అవార్డును అందిస్తున్నట్లు నోబెల్ అవార్డు ప్యానెల్ సోమవారం ప్రకటించింది. వైద్య రంగంలో అవార్డు గ్రహీత పేరు ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ సందడి మొదలైనట్లైంది.
‣ పాబో చేసిన పరిశోధనలతో మానవ రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంతరించిపోయిన పూర్వ మానవ జాతీయులతో పోలిస్తే ప్రస్తుత మానవులను ప్రత్యేకంగా నిలబెడుతున్న కారణాలు వెల్లడయ్యాయి. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది. 19వ శతాబ్దం మధ్యలో డీఎన్‌ఏ పరిశోధనల ద్వారా నియాండెర్తల్స్ ఎముకలను తొలిసారి గుర్తించారు. తద్వారా శాస్త్రవేత్తలు జాతుల మధ్య సంబంధాలను అర్థం చేసుకోగలిగారు.
ఆర్థిక సంక్షోభాల పరిశోధనకర్తలకు అర్థశాస్త్ర నోబెల్
బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై సాగించిన కీలక పరిశోధనలకుగానూ అమెరికాకు చెందిన బెన్ షాలోమ్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ. డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్‌విగ్‌లను ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. బ్యాంకులు కుప్పకూలకుండా చూడటం ఎంత ముఖ్యమన్నది వీరి పరిశీలనలు తేటతెల్లం చేశాయని నోబెల్ ఎంపిక కమిటీ ‘రాయల్ స్వీడిష్ అకాడమీ’ పేర్కొంది. ఆర్థిక మార్కెట్లపై సమర్థ నియంత్రణలకు అవి పునాదులు వేశాయని వివరించింది. ‘‘ఆర్థిక సంక్షోభాలు, మాంద్యాలనేవి తీవ్ర విపరిణామాలు. ఇలాంటివి పునరావృతమయ్యే అవకాశం ఉంది. వాటి గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ విజేతలు ఆ వివరాలను మనకు అందించారు’’ అని కమిటీ తెలిపింది. పురస్కారం కింద ఈ ముగ్గురికి సంయుక్తంగా దాదాపు 9 లక్షల డాలర్లు అందుతాయి.
‣ 2008లో అమెరికాను ఆర్థిక సంక్షోభం ముంచెత్తినప్పుడు ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి బెర్నాంకే, డైమండ్, డైబ్‌విగ్‌ల పరిశోధనలు ఉపయోగపడ్డాయి. బెర్నాంకే (68) 2006 నుంచి 2014 వరకూ అమెరికా ఫెడరల్ రిజర్వు ఛైర్మన్‌గా పనిచేశారు. 1930ల నాటి ‘మహా మాంద్యం’పై ఆయన విశేష పరిశోధనలు చేశారు. ఆందోళనలతో ప్రజలు తమ సొమ్మును బ్యాంకుల నుంచి మూకుమ్మడిగా వెనక్కి తీసుకోవడం వల్లే నాడు ఆర్థిక సంక్షోభం ఉద్ధృతమైందని ఆయన గుర్తించారు. బ్యాంకులు కుప్పకూలడం వల్ల తలెత్తే ఆర్థిక విపరిణామాలనూ 1983లో ఒక పరిశోధన పత్రం ద్వారా వెలుగులోకి తెచ్చారు. మొత్తంమీద ఈ అంశంపై తనకున్న అవగాహనను 2008లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బెర్నాంకే ఉపయోగించారు. రుణ లభ్యతలో ఉన్న ఇబ్బందులను తగ్గించారు. స్వల్ప కాల వడ్డీ రేట్లను సున్నాకు తీసుకొచ్చారు. ట్రెజరీ, తనఖా ఇన్వెస్ట్‌మెంట్లను కొనుగోలు చేయాలని ఫెడరల్ రిజర్వును ఆదేశించారు. కనీవినీ ఎరుగని స్థాయిలో రుణ వితరణ కార్యక్రమాలను చేపట్టారు. దీర్ఘకాల వడ్డీ రేట్లనూ బాగా తగ్గించేశారు. దీంతో డాలర్ విలువను దెబ్బతీస్తున్నారంటూ బెర్నాంకేపై విమర్శలు వచ్చాయి. ఆయన ప్రయత్నాలు, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించాయి. మరో మహా మాంద్యం ఉత్పన్నం కాకుండా చేశాయి. ఆర్థిక ఉత్పాతాలకు వేగంగా, దృఢంగా స్పందించే ఆనవాయితీకీ బెర్నాంకే శ్రీకారం చుట్టారు.
‣ డైమండ్ (68) షికాగో విశ్వవిద్యాలయంలో, డైబ్‌విగ్ (67) వాషింగ్టన్ వర్సిటీలో పనిచేస్తున్నారు. డిపాజిట్లకు ప్రభుత్వం పూచీకత్తులు ఇవ్వడం వల్ల ఆర్థిక సంక్షోభాలను నివారించొచ్చని వారు రుజువు చేశారు. 1983లో వీరిద్దరూ ‘బ్యాంక్ రన్స్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ లిక్విడిటీ’ అనే పరిశోధన పత్రాన్ని రచించారు. డిపాజిట్‌దారులు ఉన్నపళంగా తమ సొమ్మును వెనక్కి తీసుకోవడం వల్ల తలెత్తే నష్టాన్ని ఎదుర్కోవడానికి ఇది సాయపడింది.
బెలారస్ పోరాటయోధుడు బియాలియాట్‌స్కికి నోబెల్ పురస్కారం
ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న అలుపెరుగని పోరాటానికి ప్రపంచ అత్యున్నత పురస్కారం ‘నోబెల్’ సలాం కొట్టింది. బెలారస్‌కు చెందిన హక్కుల కార్యకర్త ఏల్స్ బియాలియాట్‌స్కి, రష్యాలోని మెమోరియల్ సంస్థ, ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌లను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇరుగు పొరుగు దేశాలైన బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లలో జనజీవనం శాంతియుతంగా సాగేందుకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఆ త్రయాన్ని సంయుక్తంగా అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ఛైర్‌పర్సన్ బెరిట్ రైస్ అండర్సన్ తెలిపారు.
‣ బెలారస్‌లో 1980ల్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చురుగ్గా నడిపించిన నాయకుల్లో బియాలియాట్‌స్కి ఒకరు. మానవహక్కులు, పౌర స్వేచ్ఛపై ప్రజల్లో అవగాహన పెరిగేలా ఆయన విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తమ దేశంలో నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే గళమెత్తారు. హ్యూమన్ రైట్స్ సెంటర్ వియాస్నా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. ‘ప్రత్యామ్నాయ నోబెల్’గా పిలుచుకునే ‘రైట్ లైవ్లీహుడ్ అవార్డు’ను 2020లో గెల్చుకున్నారు. బెలారస్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ లుకషెంకో తిరిగి ఎన్నికవడాన్ని నిరసిస్తూ అదే ఏడాది ఆందోళనలు చెలరేగగా.. పోలీసులు బియాలియాట్‌స్కిని నిర్బంధించారు. ఎలాంటి విచారణ జరపకుండా ఇప్పటికీ జైల్లోనే ఉంచారు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఎదురైనా- మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న పోరాటంలో బియాలియాట్‌స్కి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదని రైస్ అండర్సన్ గుర్తుచేశారు. ఆయన్ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని నోబెల్ కమిటీ తరఫున పిలుపునిస్తున్నట్లు చెప్పారు. నిజానికి తాజా అవార్డు కారణంగా ఆయనపై బెలారస్ అధికారవర్గాల నిఘా ఇంకా అధికమయ్యే అవకాశాలుంటాయని తమకు తెలుసునని పేర్కొన్నారు. అయితే బియాలియాట్‌స్కిలో మనోబలం మరింత పెరుగుతుందన్న ఆశతో పురస్కారాన్ని ప్రకటించామని వెల్లడించారు.
రష్యా మెమోరియల్ సంస్థకు నోబెల్:-
తాజాగా ప్రకటించిన ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతి రష్యాకు చెందిన మెమోరియల్ సంస్థకు సంయుక్తంగా దక్కింది. రష్యాలోని ప్రముఖ మానవ హక్కుల సంస్థ ఇది. 1987లో స్థాపించిన ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు ఆండ్రీ సఖరోవ్. అలనాటి సోవియట్ యూనియన్ హైడ్రోజన్ బాంబు పిత. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ హైడ్రోజన్ బాంబు తయారీకి మూలకారకుడైన సఖరోవ్ తర్వాత అణ్వస్త్ర ప్రయోగాలను, పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించారు. 1975లో ఈయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
‣ సోవియట్ యూనియన్ సమయంలోనే ప్రభుత్వ బాధితులకు సఖరోవ్ తదితరులు ఆరంభించిన ఈ మెమోరియల్ మానవ హక్కుల సంస్థ అండగా ఉండేది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యాలో తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చింది. చెచన్యా యుద్ధంలో రష్యా సైనిక దళాల దురాగతాలను ఈ సంస్థే బయటపెట్టింది. 2021 డిసెంబరులో ఈ సంస్థను రష్యా అత్యున్నత న్యాయస్థానం మూసేయించింది. ‘‘రష్యా ప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీ ఏజెంట్ల చట్టాన్ని ఇది ఉల్లంఘిస్తుంది. అంతేగాకుండా సోవియట్ చరిత్రను వక్రీకరిస్తోంది. సోవియట్ యూనియన్‌ను తప్పుగా, ఉగ్రవాద దేశంగా చిత్రీకరిస్తోంది. ప్రభుత్వ సంస్థలపై విమర్శలు గుప్పిస్తోంది’’ అనేవి దీని మూసివేతకు చూపిన కారణాలు.
బెలారస్ పోరాటయోధుడు బియాలియాట్‌స్కికి నోబెల్ పురస్కారం
‣ మెమోరియల్, సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థలతో కలిపి సంయుక్తంగా..
ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న అలుపెరుగని పోరాటానికి ప్రపంచ అత్యున్నత పురస్కారం ‘నోబెల్’ సలాం కొట్టింది. బెలారస్‌కు చెందిన హక్కుల కార్యకర్త ఏల్స్ బియాలియాట్‌స్కి, రష్యాలోని మెమోరియల్ సంస్థ, ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌లను ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇరుగు పొరుగు దేశాలైన బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లలో జనజీవనం శాంతియుతంగా సాగేందుకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఆ త్రయాన్ని సంయుక్తంగా అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ఛైర్‌పర్సన్ బెరిట్ రైస్ అండర్సన్ తెలిపారు.
‣ బెలారస్‌లో 1980ల్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చురుగ్గా నడిపించిన నాయకుల్లో బియాలియాట్‌స్కి ఒకరు. మానవహక్కులు, పౌర స్వేచ్ఛపై ప్రజల్లో అవగాహన పెరిగేలా ఆయన విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తమ దేశంలో నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే గళమెత్తారు. హ్యూమన్ రైట్స్ సెంటర్ వియాస్నా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. ‘ప్రత్యామ్నాయ నోబెల్’గా పిలుచుకునే ‘రైట్ లైవ్లీహుడ్ అవార్డు’ను 2020లో గెల్చుకున్నారు. బెలారస్ అధ్యక్షుడిగా అలెగ్జాండర్ లుకషెంకో తిరిగి ఎన్నికవడాన్ని నిరసిస్తూ అదే ఏడాది ఆందోళనలు చెలరేగగా.. పోలీసులు బియాలియాట్‌స్కిని నిర్బంధించారు. ఎలాంటి విచారణ జరపకుండా ఇప్పటికీ జైల్లోనే ఉంచారు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాలు ఎదురైనా- మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న పోరాటంలో బియాలియాట్‌స్కి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదని రైస్ అండర్సన్ గుర్తుచేశారు. ఆయన్ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని నోబెల్ కమిటీ తరఫున పిలుపునిస్తున్నట్లు చెప్పారు. నిజానికి తాజా అవార్డు కారణంగా ఆయనపై బెలారస్ అధికారవర్గాల నిఘా ఇంకా అధికమయ్యే అవకాశాలుంటాయని తమకు తెలుసునని పేర్కొన్నారు. అయితే బియాలియాట్‌స్కిలో మనోబలం మరింత పెరుగుతుందన్న ఆశతో పురస్కారాన్ని ప్రకటించామని వెల్లడించారు.
రష్యా మెమోరియల్ సంస్థకు నోబెల్
తాజాగా ప్రకటించిన ఈ ఏటి నోబెల్ శాంతి బహుమతి రష్యాకు చెందిన మెమోరియల్ సంస్థకు సంయుక్తంగా దక్కింది. రష్యాలోని ప్రముఖ మానవ హక్కుల సంస్థ ఇది. 1987లో స్థాపించిన ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు ఆండ్రీ సఖరోవ్. అలనాటి సోవియట్ యూనియన్ హైడ్రోజన్ బాంబు పిత. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ హైడ్రోజన్ బాంబు తయారీకి మూలకారకుడైన సఖరోవ్ తర్వాత అణ్వస్త్ర ప్రయోగాలను, పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించారు. 1975లో ఈయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
‣ సోవియట్ యూనియన్ సమయంలోనే ప్రభుత్వ బాధితులకు సఖరోవ్ తదితరులు ఆరంభించిన ఈ మెమోరియల్ మానవ హక్కుల సంస్థ అండగా ఉండేది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యాలో తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చింది. చెచన్యా యుద్ధంలో రష్యా సైనిక దళాల దురాగతాలను ఈ సంస్థే బయటపెట్టింది. 2021 డిసెంబరులో ఈ సంస్థను రష్యా అత్యున్నత న్యాయస్థానం మూసేయించింది. ‘‘రష్యా ప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీ ఏజెంట్ల చట్టాన్ని ఇది ఉల్లంఘిస్తుంది. అంతేగాకుండా సోవియట్ చరిత్రను వక్రీకరిస్తోంది. సోవియట్ యూనియన్‌ను తప్పుగా, ఉగ్రవాద దేశంగా చిత్రీకరిస్తోంది. ప్రభుత్వ సంస్థలపై విమర్శలు గుప్పిస్తోంది’’ అనేవి దీని మూసివేతకు చూపిన కారణాలు.
శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలకకు బుకర్ ప్రైజ్
ప్రతిష్ఠాత్మిక బుకర్ ప్రైజ్ 2022ను శ్రీలంక రచయిత షెహాన్ కరుణతిలక గెలుచుకున్నారు. ఆయన రెండవ రచన ‘ద సెవన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మైదా’ పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. శ్రీలంకలో చోటు చేసుకున్న క్రూరమైన అంతర్యుద్ధం నేపథ్యం ఆధారంగా ఆ రచన సాగింది. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో కరుణతిలక ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బుకర్ ప్రైజ్‌ను అందుకున్న శ్రీలంక రచయితల్లో ఆయన రెండో వ్యక్తి. అంతకు ముందు 1992లో ‘ద ఇంగ్లిష్ పేషెంట్’ పుస్తకానికి మైఖెల్ ఆండాట్జి సాధించారు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు ప్రముఖ శాటర్న్ అవార్డు
అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకిచ్చే ప్రముఖ శాటర్న్ అవార్డు ఈ ఏడాదికి రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం ‘ఆర్‌ఆర్‌ఆర్’కు లభించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ పురస్కారం దక్కించుకుంది. ‘బాహుబలి-2’ తర్వాత భారతీయ చిత్రానికి వరించిన రెండో శాటర్న్ అవార్డు ఇది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తిగా అల్లుకున్న కల్పిత కథతో రూపొందిన చిత్రమిది. అల్లూరిగా రామ్‌చరణ్ నటించగా, భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించారు.
పద్మనాభరావు, సుబ్బయ్యకు ‘సారస్వత పరిషత్తు’ పురస్కారాలు
ప్రముఖ సాహితీవేత్త డా.రేవూరి పద్మనాభరావు, కవి వనపట్ల సుబ్బయ్యలకు తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాలు ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన గురువు పోలూరి హనుమజ్జానకీరామశర్మ స్మారకార్థం నెలకొల్పిన ‘సాహితీ పురస్కారాన్ని’ ఈ ఏడాది డా.రేవూరి పద్మనాభరావుకు బహూకరించనున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య తెలిపారు. అక్టోబరు 13న సారస్వత పరిషత్తులో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయనకు పురస్కారాన్ని అందజేస్తారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) పోలీసులు ప్రతిష్ఠాత్మక ‘స్పెషల్ ఆపరేషన్ మెడల్’కు ఎంపికయ్యారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా ప్రకటించే ఈ పురస్కారాలు ఈసారి అయిదు రాష్ట్రాల పోలీసులకు దక్కాయి. జాబితాలో తెలంగాణ నుంచి 11 మంది ఉన్నారు. వీరంతా రాష్ట్ర సీఐ సెల్‌కే చెందిన వారు. 2018లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయగా రాష్ట్ర పోలీసులకు దక్కడం ఇదే తొలిసారి. ఉగ్రవాద వ్యతిరేక పోరు, సరిహద్దుల్లో పోరాటం, ఆయుధాల నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడం, ప్రమాద సమయాల్లో చేయూత కార్యక్రమాల్లో సేవలందించిన పోలీసులకు ఈ పురస్కారాలను అందజేస్తారు.
తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్, సీఐ సెల్ ఇన్‌ఛార్జి అనిల్‌కుమార్, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్‌గౌడ్, ఎస్సైలు శ్రీనివాసులు, మహ్మద్ అక్తర్‌పాషా, జితేందర్‌ప్రసాద్, సయ్యద్ అబ్దుల్ కరీమ్; హెడ్ కానిస్టేబుల్ రాజవర్ధన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు మహ్మద్ తాజ్‌పాషా, మహ్మద్ ఫరీదుద్దీన్, లక్ష్మీనారాయణ, కిరణ్‌కుమార్, జియాఉల్‌హక్.
ఏపీకి డిజిటల్ హెల్త్ విభాగంలో రెండు గ్లోబల్ హెల్త్ అవార్డులు
లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్తోమత పునాదులుగా రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్ఠంగా నిర్మించేందుకు తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్‌లో ఆమె పాల్గొని, రాష్ట్రానికి డిజిటల్ హెల్త్ విభాగంలో వచ్చిన రెండు గ్లోబల్ అవార్డులను స్వీకరించారు. మహిళల కోసం డిజిటల్ హెల్త్ నేపథ్యంతో రూపొందించిన లోగోను రజిని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల తీరుతెన్నులపై ప్రజంటేషన్ ఇచ్చారు.
ఏపీఎస్ ఆర్టీసీకి స్కోచ్ అవార్డు
నగదు రహిత లావాదేవీల అమలు నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీకి 2022 సంవత్సర స్కోచ్ అవార్డు లభించినట్లు చీఫ్ ఇంజినీర్ (ఐటీ) సుధాకర్ తెలిపారు. వర్చువల్ సెమినార్‌లో ఈ అవార్డును ఈడీ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి అందుకున్నట్లు తెలిపారు.
ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రంగా యాదాద్రి
దిల్లీలోని భారతీయ హరిత భవనాల మండలి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్ర పురస్కారానికి ఎంపిక చేసింది. 2022 - 25 సంవత్సరాలకు గాను దీనిని ప్రకటించి మండలి ప్రతినిధులు యాదాద్రి దేవాలయ ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వీసీ కిషన్‌రావుకు అందజేశారు. పునర్నిర్మాణంలో ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడడం, సుందరీకరణ పనులను చేపట్టడం, ప్రత్యేక సూర్యవాహిక ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసారం జరిగేలా నిర్మాణం, రద్దీ విపరీతంగా ఉండే సమయాల్లోనూ స్వచ్ఛమైన గాలి నలుదిశలా ప్రసరించేలా వెంటిలేటర్లు, కిటికీల ఏర్పాటు వంటివి పరిశీలించి ఈ పురస్కారం ప్రకటించామని హరిత భవనాల మండలి తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ‘పద్మభూషణ్’ అవార్డు ప్రదానం
మనం చారిత్రక, ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పుల కాలంలో జీవిస్తున్నాం. వచ్చే దశాబ్దం పూర్తిగా డిజిటల్ సాంకేతికతదేనని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ అవార్డును శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆయన స్వీకరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఆధునిక సాంకేతికత వినియోగించడం ద్వారా భారత్ మరిన్ని విజయాలు సాధించేలా భారతీయులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది భారత ప్రభుత్వం ప్రకటించిన పదిహేడు మంది పద్మభూషణ్ అవార్డు విజేతŸల్లో 55 ఏళ్ల సత్య నాదెళ్ల ఒకరు.
ఎన్‌ఆర్‌ఐ చాపరాల బాబ్జీకి జీవిత సాఫల్య పురస్కారం
అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ చాపరాల బాబ్జీ (ఏలూరు) జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. డాలస్ మేయర్ జాన్ ఎరిక్సన్ ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అమెరికా అభివృద్ధికి వివిధ రంగాల్లో అంకితభావంతో సేవలందించే వారికి అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డును ప్రకటిస్తారు. వయోధిక అమెరికన్ సైనికులకు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడంలో, ఐవీ లీగ్ విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో సేవలందిస్తున్న బాబ్జీ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏలూరు కేపీడీటీ పాఠశాల, సీఆర్‌ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన బాబ్జీ అమెరికాలో రెండు డాక్టరేట్లు పొందారు. భారత సంతతికి చెందిన మరో వ్యక్తి అరుణ్ అగర్వాల్ (డాలస్) కూడా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు ‘రక్ష మంత్రి’ అవార్డు
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ లోటరింగ్ సిస్టమ్స్ (ఏఎల్‌ఎస్-50), అత్యంత ప్రతిష్ఠాత్మక ‘రక్షా మంత్రి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్ 2021 - 22’ను సొంతం చేసుకుంది. పెద్ద కంపెనీల విభాగంలో ఈ అవార్డు దక్కించుకున్నట్లు సంస్థ తెలిపింది. డిఫెన్స్ ఎక్స్‌పో - 2022 లో భాగంగా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఎండీ, సీఈఓ సుకరన్ సింగ్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. అత్యంత ఖచ్చితత్వంతో ఫలితాలు సాధించే ఏఎల్‌ఎస్-50 మందుగుండు సామగ్రి రూపకల్పన నుంచి ఉత్పత్తి వరకు పూర్తిగా మనదేశంలోనే నిర్వహించినట్లు సుకరన్ సింగ్ వివరించారు. ప్రస్తుతం భారత వాయుసేన కోసం ఉత్పత్తి చేస్తున్న ఈ మందుగుండు సామగ్రిని, ఇతర రక్షణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అందించే వీలున్నట్లు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ ప్రజలు, ప్రతినిధులకు ఈయూ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం
రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ధీరత్వంతో ప్రతిఘటిస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజలు, ఆ దేశ ప్రతినిధులకు ఐరోపా సమాఖ్య (ఈయూ) అత్యున్నత మానవ హక్కుల పురస్కారం ప్రకటించింది. సోవియట్ అసమ్మతివాది, నోబెల్ శాంతి బహుమతి విజేత ఆంద్రే సఖారోవ్ పేరున 1988లో ఈ పురస్కారాన్ని ఈయూ నెలకొల్పింది. మానవ హక్కుల ఉల్లంఘనను ఎదిరించే వ్యక్తులు, సమూహాలకు దీన్ని ప్రధానం చేస్తుంది. కారాగారంలో ఉన్న రష్యా విపక్షనేత అలెక్సీ నావల్నీకి గత ఏడాది సఖారోవ్ పురస్కారాన్ని ప్రకటించిన ఈయూ ఈసారి ఉక్రెయిన్ ప్రజలకు దాన్ని అందించడం ద్వారా రష్యాకు గట్టి సందేశం పంపిందని విశ్లేషకులు పేర్కొన్నారు. పురస్కారాన్ని ప్రకటిస్తున్నప్పుడు యూరోపియన్ పార్లమెంటు సభ్యులంతా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని, ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ధీరులంటూ నినాదాలు చేశారు. పురస్కారం కింద 50 వేల యూరోలు (సుమారు రూ.40 లక్షల నగదు)ను డిసెంబరులో అందజేస్తారు.
భారత సంతతి రచయిత్రికి గోర్డాన్ బర్న్ పురస్కారం
లండన్ వంతెనపై 2019లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాసిన ‘ఆఫ్టర్‌మాథ్’ నవలకు గాను భారత సంతతి రచయిత్రి ప్రీతి తనేజా గోర్డాన్ బర్న్ పురస్కారానికి ఎంపికయ్యారు. దీని కింద ఆమెకు 5 వేల పౌండ్లు లభిస్తాయి. ప్రస్తుతం ఆమె న్యూక్యాజిల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నవల కొందరి దృష్టిలో ఆఫ్టర్‌మాథ్ ఒక వివాదాస్పద పుస్తకం. మరికొందరికి అది బ్రిటన్ విద్యా వ్యవస్థలో వేళ్లూనుకున్న జాత్యహంకారానికి, న్యాయ వ్యవస్థ తదితరాల్లో ఉన్న వివక్షకు దర్పణం పడుతోంది. లండన్ వంతెన ఉగ్రదాడిలో ఐదుగురు చనిపోయారు.
ఇద్దరికి జానమద్ది పురస్కారం ప్రదానం
తెలుగు సాహిత్యానికి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఎనలేని కృషి చేశారని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బండారు శ్యాం సుందర్ అన్నారు. జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ జిల్లా కడపలోని సీపీ బ్రౌన్‌భాషా పరిశోధన కేంద్రంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి జయంతి, పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. 2022వ సంవత్సరానికి జానమద్ది పురస్కారాలను సాహితీవేత్త డాక్టర్ జి.వి.పూర్ణచందు, అక్షర పల్లకి సాహితీ సంస్థ నిర్వాహకుడు ఎం.శ్రీనివాస ఆచార్యకు అందజేశారు.
హైదరాబాద్‌కు అంతర్జాతీయ గ్రీన్ సిటీ అవార్డు
భాగ్యనగరం రెండు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అవార్డుకూ ఎంపికైంది. దక్షిణ కొరియాలోని జెజులో కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టీకల్చర్ ప్రొడ్యూసర్స్ ఈ అవార్డులను అందించింది. ‘లివింగ్ గ్రీన్‌ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ కేటగిరీలో అవుటర్ రింగ్ రోడ్డుపై పచ్చదనాన్ని ఎంట్రీగా పంపగా, పచ్చదనం విభాగంలో ఉత్తమమైనదిగా ఎంపికైంది. ఈ అవార్డులకు ఎంపికైన ఏకైక నగరంగా హైదరాబాద్ గౌరవం దక్కించుకుంది.
డాక్టర్ అందెశ్రీకి సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం
తొలితరం ప్రజా వాగ్గేయకారులు ‘సుద్దాల హనుమంతు - జానకమ్మ జాతీయ పురస్కారం - 2022’ను లోక కవి డాక్టర్ అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ కవి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ ప్రకటించారు. అక్టోబరు 15న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో అందెశ్రీకి ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లువెల్లడించారు.
పద్మనాభరావు, సుబ్బయ్యకు ‘సారస్వత పరిషత్తు’ పురస్కారాలు
ప్రముఖ సాహితీవేత్త డా.రేవూరి పద్మనాభరావు, కవి వనపట్ల సుబ్బయ్యలకు తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాలు ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన గురువు పోలూరి హనుమజ్జానకీరామశర్మ స్మారకార్థం నెలకొల్పిన ‘సాహితీ పురస్కారాన్ని’ ఈ ఏడాది డా.రేవూరి పద్మనాభరావుకు బహూకరించనున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య తెలిపారు. అక్టోబరు 13న సారస్వత పరిషత్తులో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయనకు పురస్కారాన్ని అందజేస్తారు.
-స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022లో దేశంలోనే తెలంగాణకు తొలి ర్యాంకు
-కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలోని పారిశుద్ధ్యం, తాగునీటి విభాగం నిర్వహించిన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించింది. ప్రజాభిప్రాయం (350), ప్రత్యక్ష పరిశీలన (300), సేవల పురోగతి (350) కొలమానాల ఆధారంగా మొత్తం 1,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 971.62 మార్కులు సాధించి తొలి స్థానాన్ని ఆక్రమించింది.
- రెండు, మూడు ర్యాంకులను హరియాణా (927.05), తమిళనాడు (883.48) పొందాయి. ఆంధ్రప్రదేశ్‌కు 12వ ర్యాంకు లభించింది. జిల్లాల కేటగిరీలో ప్రకటించిన ర్యాంకుల్లో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జాతీయ స్థాయిలో రెండు, మూడు, అయిదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ కేటగిరీలో తొలి స్థానాన్ని హరియాణాలోని భివానీ పొందింది. దేశవ్యాప్తంగా 709 జిల్లాలకు ర్యాంకులు ప్రకటించగా తెలంగాణలోని 31 జిల్లాలు టాప్-50లో నిలిచాయి. జోగులాంబ గద్వాల ఒక్కటి 51వ స్థానానికి పరిమితమైంది. గాంధీ జయంతి సందర్భంగా విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర జల్ శక్తి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, గిరిరాజ్ సింగ్‌ల సమక్షంలో జరిగిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించి విజేతలకు అందజేసింది.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణకు 16 అవార్డులు
-కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పట్టణాలు, నగరాలకు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 అవార్డులలో తెలంగాణ 16 పురస్కారాలను కైవసం చేసుకుంది. జోనల్ కేటగిరీ అవార్డుల్లో దక్షిణాది జోన్‌లో సత్తా చాటింది. రాష్ట్రానికి చెందిన మున్సిపాలిటీలు అత్యధిక అవార్డులు పొందాయి. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, తుర్కయాంజల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ మల్‌రెడ్డి అనూరాధ రాంరెడ్డి తదితరులు పురస్కారాలను అందుకున్నారు. ఇప్పటికే కొన్ని అవార్డులను ప్రకటించగా వాటికి మరికొన్ని అదనంగా చేరాయి.
- లక్షలోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల వారీగా తీసుకుంటే మొత్తం 15 అవార్డులు లభించాయి. పౌరుల ప్రతిస్పందనలో (సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్) దేశంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రథమ స్థానం పొందింది. దీంతో మొత్తం 16 అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో అత్యధికంగా ప్రజల భాగస్వామ్యం కలిగిన (సిటిజన్ పార్టిసిపేషన్) మున్సిపాలిటీల కేటగిరీలో సిద్దిపేట మూడోస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర తరువాత తెలంగాణ 16 అవార్డులతో రెండోస్థానంలో నిలిచిందని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశం, ప్రోత్సాహంతో ఇదిసాధ్యమైందన్నారు.
- జాతీయ స్థాయి ర్యాంకులు పరిగణనలోకి తీసుకుంటే 10లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్ 10వ ర్యాంకులో నిలిచింది. 10 లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీలు, నగరాల జాబితాలో సిద్దిపేట మున్సిపాలిటీ 20వ స్థానం పొందింది. వరంగల్ 62, కరీంనగర్ 67, నిజామాబాద్ 92, జగిత్యాల 96 ర్యాంకులు సాధించాయి. లక్ష.. ఆపై జనాభా కలిగిన 100 మున్సిపాలిటీలు, నగరపాలికలకు ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. తొలి మూడు స్థానాల్లో ఇండోర్ (మధ్యప్రదేశ్), సూరత్ (గుజరాత్), నవీ ముంబయి (మహారాష్ట్ర) నిలవగా హైదరాబాద్ 26వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత సిద్దిపేట (30), వరంగల్ (84), కరీంనగర్ (89) ఉన్నాయి. లక్షకు తక్కువగా జనాభా ఉన్న మున్సిపాలిటీలను పరిశీలిస్తే తెలంగాణ నుంచి బడంగ్‌పేట ఒక్కటే 86వ ర్యాంకులో నిలిచింది. దేశంలోని 62 కంటోన్మెంట్లలో సికింద్రాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 100కు పైగా మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ నాలుగో ర్యాంకు పొందింది.