ఆర్ధిక రంగం

శాంసంగ్‌ ఛైర్మన్‌గా లీ నియామకం

శాంసంగ్‌ ఎలక్రానిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా, తమ మూడో తరం వారసుడైన లీ జే-యాంగ్‌ (54)ను ప్రకటించింది. 2017లో అప్పటి అధ్యక్షుడు పార్క్‌ గ్వాన్‌ హేకు లంచం ఇచ్చిన కేసులో లీ కు ఇప్పటి అధ్యక్షుడు క్షమాభిక్ష ఇచ్చిన రెండు నెలల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏడాది కాలంగా పెరోల్‌పై ఉన్నప్పటికీ, రెండు నెలల కిందటే ఈయనకు విముక్తి లభించింది. ఈ కుంభకోణం కారణంగా గత ప్రభుత్వం కూలిపోయింది. అయితే కొరియాపై శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంసంగ్‌ వారసుడికి క్షమాభిక్షను ప్రసాదించారు. 2015 విలీనానికి సంబంధించి ఆడిటింగ్‌ ఉల్లంఘనలు, షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల కేసు కూడా లీపై నడుస్తోంది. ‣ 2014లో అప్పటి ఛైర్మన్, లీ తండ్రి లీ కున్‌-హీకి గుండె పోటు రాగా, వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న లీ గ్రూప్‌ వ్యవహారాలను అప్పటి నుంచే చూశారు. 2020లో తండ్రి మరణించిన వెంటనే ఛైర్మన్‌ కావడానికి పలు చట్టపరమైన చిక్కులు వచ్చాయి. ఇప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్‌ మెమొరీ చిప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ తయారీదార్లలో ఒకటైన శాంసంగ్‌కు ఛైర్మన్‌గా మారారు.

గ్రే లిస్ట్‌ నుంచి పాకిస్థాన్‌ తొలగింపు!

అంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే విషయంలో పాకిస్థాన్‌కు భారీ ఊరట లభించింది. ‘గ్రే లిస్ట్‌’ నుంచి ఆ దేశాన్ని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తొలగించింది. సింగపూర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థాన్‌కు ఏర్పడింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసే లక్ష్యాలను పాకిస్థాన్‌ అందుకోకపోవడం వల్ల ఎఫ్‌ఏటీఎఫ్‌ నాలుగేళ్ల పాటు ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచింది. ‣ ‘అత్యంత ప్రమాదకర, తక్షణ చర్యలు అవసరమైన’ దేశాల జాబితాలో ఎఫ్‌ఏటీఎఫ్‌ తొలిసారిగా మయన్మార్‌ పేరును చేర్చింది. వాచ్‌డాగ్‌ బ్లాక్‌లిస్ట్‌గా పిలిచే ఈ జాబితాలో ఇప్పటికే ఇరాన్, ఉత్తర కొరియాలు కొనసాగుతున్నాయి. ‣ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ చేపట్టే భవిష్యత్‌ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కాకుండా రష్యాపై ఆ సంస్థ నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సాగిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్‌ఏటీఎఫ్‌ ఛైర్‌పర్సన్‌ టి.రాజా కుమార్‌ పారిస్‌లో వెల్లడించారు.

శివ నాడార్‌ విరాళం రోజుకు రూ.3 కోట్లు

హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌ (77), వితరణ విషయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచారు. ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా - 2022 ప్రకారం.. ఆయన ఏడాది వ్యవధిలో రూ.1161 కోట్ల మేర సమాజానికి తిరిగి ఇచ్చేశారు. అంటే రోజుకు రూ.3 కోట్ల చొప్పున దానం చేశారన్నమాట. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ (77) రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానంలో నిలిచారు. గతంలో వరుసగా రెండేళ్లు ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉన్నారు. ముకేశ్‌ అంబానీ కుటుంబం (రూ.411 కోట్లు) మూడో స్థానం; బిర్లా కుటుంబం (రూ.242 కోట్లు) నాలుగో స్థానంలో ఉండగా దేశీయ కుబేరుల్లో తొలి స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ(60) రూ.190 కోట్ల దాతృత్వంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. జాబితాలోని మరిన్ని విశేషాలు.. ‣ ఏడాది కాలంలో రూ.100 కోట్లకు పైగా వితరణ చేసిన వారు దేశంలో 15 మంది ఉన్నారు. 20 మంది రూ.50 కోట్ల పైన; 43 మంది రూ.20 కోట్లపైగా దానం చేశారు. ‣ ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎ.ఎం.నాయక్‌ (80) రూ.142 కోట్ల విరాళం ద్వారా, దేశంలోనే అత్యంత దానశీలి అయిన ప్రొఫెషనల్‌ మేనేజర్‌గా నిలిచారు. బెయిన్‌ క్యాపిటల్‌కు చెందిన అమిత్‌ చంద్ర, అర్చన చంద్ర ఇతర ప్రొఫెషనల్‌ మేనేజర్లు. వీరిద్దరూ రూ.24 కోట్ల చొప్పున ఇచ్చారు. ‣ జెరోధాకు చెందిన నితిన్‌ కామత్, నిఖిల్‌ కామత్‌ తమ విరాళాలను 300 శాతం పెంచి రూ.100 కోట్లకు చేర్చడం విశేషం. నిఖిల్‌ కామత్‌ (36) ఈ జాబితాలోనే అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. నీ మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకులు సుబ్రోతో బాగ్చి, ఎన్‌.ఎస్‌. పార్థసారధి రూ.213 కోట్లు చొప్పున దానం చేయడం ద్వారా టాప్‌-10లో నిలిచారు. ‣ ఇన్ఫీకి చెందిన నందన్‌ నీలేకని, క్రిస్‌ గోపాలకృష్ణన్, ఎస్‌.డి.శిబూలాల్‌లు వరుసగా రూ.159 కోట్లు; రూ.90 కోట్లు; రూ.35 కోట్ల విరాళాలు ఇవ్వడం ద్వారా జాబితాలో 9వ, 16వ, 28వ స్థానాల్లో నిలిచారు. తొలిసారిగా జాబితాలోకి.. తొలిసారిగా ఈ జాబితాలో చేరిన క్వెస్‌ కార్ప్‌ ఛైర్మన్‌ అజిత్‌ ఐజాక్‌ రూ.105 కోట్లను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) బెంగళూరుకు ఇచ్చారు. తొలిసారిగా ఈ జాబితాలో చేరిన 19 మంది కలిసి రూ.832 కోట్లు సమాజానికి ఇచ్చారు.

దేశీయంగా చిన్న ఆయుధాల ఉత్పత్తికి యూఏఈ సంస్థతో ఐకామ్‌ ఒప్పందం

ఎంఈఐఎల్‌ గ్రూపు సంస్థ అయిన ఐకామ్, యూఏఈలోని ఎడ్జ్‌ గ్రూపునకు చెందిన క్యారకల్‌ అనే రక్షణ ఉత్పత్తుల సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు ఈడబ్ల్యూ సిస్టమ్స్, ఎలక్ట్రో-ఆప్టిక్స్, షెల్టర్స్, కాంపోజిట్స్, డ్రోన్‌ టెక్నాలజీ సిస్టమ్స్‌ను ఐకామ్‌ గ్రూపు అభివృద్ధి చేస్తోంది. చిన్న ఆయుధాల (స్మాల్‌ ఆర్మ్‌) ఉత్పత్తిలో క్యారకల్‌ నిమగ్నమై ఉంది. గుజరాత్‌లో జరుగుతున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో- 2022లో ఇరుపక్షాలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత రక్షణ సంస్థలకు, అంతర్జాతీయ మార్కెట్‌కు అనువైన చిన్న ఆయుధాలను పూర్తిగా మన దేశంలో ఉత్పత్తి చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలతో, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశం ముందుకు సాగుతోందని, ఇందులో తాము భాగస్వామి అవుతున్నట్లు ఐకామ్‌ చీఫ్‌ పి.సుమంత్‌ పేర్కొన్నారు.

మిధాని, బోయింగ్‌ ఇండియా ఒప్పందం

వైమానిక, అంతరిక్ష, రక్షణ సంబంధిత పరికరాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ రంగ సంస్థ మిధాని, బోయింగ్‌ ఇండియా చేతులు కలిపాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రారంభమైన డిఫెన్స్‌ ఎక్స్‌పో సందర్భంగా ఇరు సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత్‌లో రక్షణ, ఏరోస్పేస్‌ రంగం స్వావలంబన సాధించాలంటే ఏరోస్పేస్‌లో ఉపయోగించే ప్రత్యేక మెటీరియల్స్, మిశ్ర ధాతువులను గుర్తించడం కీలకమని ఇరు సంస్థలు అభిప్రాయపడ్డాయి. భారత్‌లో పెరుగుతున్న ఏరోస్పేస్‌ రంగం బలోపేతం చేయడంలో మిధానితో ఒప్పందం మా నిబద్ధతను మరింత పెంచుతుందని వారు తెలిపారు. ‣ భారత్‌లో మొదటి రిజర్వ్‌ స్టోర్‌ను టాటా స్టార్‌బక్స్‌ ప్రారంభించింది.

గ్రామీణ ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామాల్లో సెప్టెంబర్‌ నెలలో అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదైనట్లు ఆర్‌బీఐ నెలవారీ నివేదిక వెల్లడించింది. గత నెలలో పట్టణ ప్రాంతాల్లో 7.3%, గ్రామీణ ప్రాంతాల్లో 7.6% మేర ద్రవ్యోల్బణం నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్‌లలో మాత్రం 8% నమోదైనట్లు పేర్కొంది. ఆర్‌బీఐ నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ సదుపాయాన్ని, చేబదుళ్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాలను ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు పోటీపడ్డాయి. ఆగస్టులో స్పెషల్‌ డ్రాయింగ్‌ సదుపాయాన్ని తెలంగాణ 30 రోజుల పాటు ఉపయోగించుకొని సగటున రూ.921.26 కోట్లు వాడుకుంది. చేబదుళ్ల కింద 26 రోజుల పాటు తెలంగాణ సగటున రూ.1,154.03 కోట్లు ఉపయోగించుకుంది.

కంపెనీల బోర్డుల్లో మహిళల పెరుగుదల: ఈవై

దేశంలోని కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం గత దశాబ్ద కాలం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని, 2022లో వారి సంఖ్య 18 శాతానికి చేరిందని ఈవై నివేదిక వెల్లడించింది. 2013లో కేవలం 8 శాతం మంది మహిళలు బోర్డుల్లో ఉండే వారని తెలిపింది. మహిళా ప్రాతినిధ్యం ఇటీవల పెరుగుతున్నా, ఇంకా ఫ్రాన్స్, స్వీడెన్, యూఎస్, యూకేలతో పోలిస్తే చాలా దూరంలో ఉన్నట్లు పేర్కొంది.

75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు ప్రారంభం

దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల (డీబీయూ)ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా దృశ్యమాధ్యమ పద్ధతిలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి బ్యాంక్‌ శాఖ తమ పరిధిలోని 100 మంది వ్యాపారులు పూర్తిగా డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేలా చూడాలని సూచించారు. ఇందువల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్‌ చుక్కానిలా మారుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఖమ్మం, సిరిసిల్ల, జనగామలలో, ఆంధ్రప్రదేశ్‌లో 2 డీబీయూలను ప్రధాని జాతికి అంకితం చేశారు.

భారత వృద్ధి రేటు 6.8 శాతమే

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని జులైలో, 8.2 శాతం కావచ్చని జనవరిలో ఐఎంఎఫ్‌ అంచనా వేయడం గమనార్హం. 2021 - 22లో మన వృద్ధిరేటు 8.7 శాతంగా నమోదైంది. ఐఎంఎఫ్‌ విడుదల చేసిన వార్షిక ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’లో పలు అంశాలను వెల్లడించింది. అంచనా కంటే ఎక్కువగా బలహీనతలు రెండో త్రైమాసికంలో కనిపించడం; అంతర్జాతీయ గిరాకీ మరింత స్తబ్దుగా ఉండటమే భారత వృద్ధి రేటు అంచనాలు తగ్గించేందుకు కారణమని ఐఎంఎఫ్‌ పేర్కొంది.

యాంఫీ ఛైర్మన్‌గా బాలసుబ్రమణియన్‌

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల సంఘం యాంఫీ ఛైర్మన్‌గా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టరు ఎ.బాలసుబ్రమణియన్‌ తిరిగి ఎన్నికయ్యారు. ఎడెల్‌వైజ్‌ ఏఎంసీ ఎండీ రాధికా గుప్తా యాంఫీ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబరులో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాంఫీ ప్రకటించింది. వచ్చే వార్షిక సాధారణ సమావేశం జరిగే వరకు వీరిద్దరూ బాధ్యతల్లో ఉంటారని సంస్థ పేర్కొంది. యాంఫీ ఫైనాన్షియల్‌ లిటరసీ కమిటీ ఎక్స్‌ అఫిషియో ఛైర్మన్‌గా కూడా బాలసుబ్రమణియన్‌ వ్యవహరిస్తారు. కార్యకలాపాల కమిటీ చీఫ్‌గా గుప్తా ఉంటారు. నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ సందీప్‌ సిక్కాను ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.