సదస్సులు



చైనా ప్రమాదకారి: నాటో

రానున్న దశాబ్దంలో రష్యా వల్లే తమకు ప్రధాన ముప్పు ఎదురవుతుందని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) తమ వ్యూహపత్రంలో పేర్కొంది. మొదటిసారిగా చైనాను కూడా ప్రమాదకారిగా వర్ణించింది. భూమి మీద, అంతరిక్షంలో, సైబర్‌ సీమలో, సముద్రాలలో సర్వామోదనీయ అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘించడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉందనీ, రష్యాతో ఆ దేశానికున్న సన్నిహిత సంబంధాలు ఉపేక్షించలేనివని పేర్కొంది. స్పెయిన్‌ రాజధాని మాద్రీద్‌లో మూడు రోజుల సమావేశంలో ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలలోని అస్థిర పరిస్థితుల గురించి కూడా నాటో నాయకులు చర్చించారు. రష్యా దండయాత్రను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు తోడ్పాటు అందిస్తూనే ఉంటామని ప్రకటించారు. రష్యాను నిలువరించడానికి తూర్పు ఐరోపా దేశాలలో ఇప్పుడున్న నాటో సైనికుల సంఖ్యను 40 వేల నుంచి మూడు లక్షలకు పెంచాలని నిశ్చయించారు. టర్కీ అపోహలను తొలగించి స్వీడన్, ఫిన్లాండ్‌లు నాటోలో చేరడానికి అంగీకరించారు.

ఐటీలో అగ్రస్థానం దిశగా తెలంగాణ: నాస్కామ్‌ సదస్సు ప్రపంచ ఐటీ రంగంలో అగ్రస్థానం దిశగా తెలంగాణ పురోగమిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో నాస్కామ్‌ 12వ ఎడిషన్‌ జీసీసీ సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న సదస్సులో వివిధ నగరాలకు చెందిన ఐటీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలో హైదరాబాద్‌ అద్భుత నగరం. ఐటీ పరంగానే గాక నివాసయోగ్యంగా అగ్రస్థానంలో ఉంది అని తెలిపారు.

మాద్రీద్‌లో 30 దేశాల నాటో కూటమి (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) సదస్సు

రష్యాను తమ ప్రథమ శత్రువుగా నాటో (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) ప్రకటించింది. ఆ దేశంతోనే తమ భాగస్వామ్య దేశాలకు నేరుగా ముప్పు ఉందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ సహా 30 మంది దేశాధినేతలు మాద్రీద్‌లో జరిగిన నాటో సదస్సులో రానున్న పదేళ్ల కోసం వ్యూహాత్మక విధాన ప్రకటన విడుదల చేశారు. ఇందులో రష్యాతో ముప్పునే ప్రధానంగా ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయమేంటంటే 2010లో విడుదల చేసిన డిక్లరేషన్‌లో రష్యాను భాగస్వామి దేశంగా నాటో పేర్కొంది. ఈ సదస్సుకు ఆతిథ్య దేశాలుగా జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ హాజరయ్యాయి.

ఫిన్లాండ్, స్వీడన్‌లకు నాటో కూటమిలోకి చేరడానికి ఇప్పటివరకు అభ్యంతరం చెబుతూ వచ్చిన తుర్కియే (టర్కీ) తన అంగీకారాన్ని తెలిపింది. ఈ మేరకు మూడు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మరోవైపు ఫిన్లాండ్, స్వీడన్‌ను నాటో లాంఛనంగా కూటమిలోకి ఆహ్వానించింది.

అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి

అంతర్జాతీయ అంశాల్లో నియమాల ఆధారంగా నడుచుకోవాలని జీ7 కూటమి, భారత్‌ సహా ఐదు భాగస్వామ్య దేశాలు పిలుపునిచ్చాయి. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరాయి. ఐరాస మూల సూత్రాలను పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. జర్మనీలోని ఎల్‌మావ్‌లో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో అనేక అంశాలపై చర్చ జరిగింది. ఇందులో కూటమికి చెందిన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, కెనడా, జపాన్‌తో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా భారత్, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా దేశాల అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా పోరు, ఇండో - పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దురుసు చర్యలను ఇందులో పరోక్షంగా ప్రస్తావించారు. మూడు రోజుల పాటు సాగిన జీ7 సదస్సు ముగిసింది.

ఉమ్మడి ప్రకటనలోని ప్రధానాంశాలివీ:-
‣ ప్రజాస్వామ్య సూత్రాలు, విలువలను పెంపొందించడానికి వివిధ దేశాల్లోని జాతీయ చట్టాల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థల సమర్థతను పెంచేందుకు అంతర్జాతీయ సహకారాన్ని పెంచుతాం. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్న చర్యలను వ్యతిరేకిస్తాం.

‣ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛాయుత ఎన్నికలకు మద్దతిస్తాం. వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత, జీవ వైవిధ్యానికి నష్టం, ఇంధన భద్రత వంటి అంశాలకు మద్దతిస్తాం.

‣ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ఏర్పడిన ముప్పును ఎదుర్కోవడానికి 450 కోట్ల డాలర్లను వెచ్చించాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం అమెరికా 276 కోట్ల డాలర్లను సమకూర్చనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది.


ప్రకృతితో సహజీవనమే మానవాళికి రక్ష

వాతావరణ మార్పుల కట్టడి కోసం ఇచ్చిన హామీలకు భారత్‌ గట్టిగా కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడాలతో కూడిన జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశం దక్షిణ జర్మనీలో ప్రకృతి సోయగాల మధ్య కొలువుదీరిన ఎల్‌మావ్‌లో జరుగుతోంది. ఈ భేటీకి భారత్, అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్, దక్షిణాఫ్రికా నేతలను జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ప్రత్యేకంగా ఆహ్వానించారు. సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న మోదీ ‘వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. పర్యావరణ అనుకూల విధానాల్లో భారత్‌ సాధించిన విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచ తొలి విమానాశ్రయం భారత్‌లోనే ఉంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఈ దశాబ్దంలో ‘నెట్‌ జీరో’ స్థాయిని సాధిస్తుందని తెలిపారు.

‣ జీ7 సదస్సు వేదిక వద్ద ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో, జర్మన్‌ ఛాన్సలర్‌ షోల్జ్, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వోన్‌ డెర్‌ లెయెన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసాలతో ప్రత్యేకంగా మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఉన్న మార్గాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడుల అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చ జరిగింది. వాతావరణ సంబంధ అంశాలపై ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే అంశంపై షోల్జ్‌తో చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత, రక్షణ, ఔషధాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని రమఫోసాతో జరిగిన భేటీలో మోదీ నిర్ణయించారు.


జర్మనీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాపై మరిన్ని చర్యలకు పశ్చిమ దేశాలు సంసిద్ధమయ్యాయి. ఆ దేశం నుంచి బంగారం దిగుమతులను నిషేధించేందుకు ‘జీ7 కూటమి’ రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బవేరియన్‌ ఆల్ప్స్‌ ప్రాంతంలోని షోల్స్‌ ఎల్‌మావ్‌లో మూడు రోజుల పాటు జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ఇంధన సరఫరాలను రక్షించుకోవడానికి ఉన్న మార్గాలపై బైడెన్, జీ7 కూటమి దేశాలు చర్చిస్తాయి. వర్ధమాన దేశాల్లో రష్యా, చైనా పెట్టుబడులకు ప్రత్యామ్నాయాలను అందించేందుకు కొత్తగా ‘ప్రపంచ మౌలిక వసతుల భాగస్వామ్యాన్ని’ ఏర్పాటు చేయనున్నట్లు బైడెన్‌ ప్రకటించారు. ఈ దిశగా ఏడు దేశాలూ కలిసి 600 బిలియన్‌ డాలర్లను సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన సమావేశంలో జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌తో షోల్జ్‌తో బైడెన్‌ భేటీ అయ్యారు. జీ7లో అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి.

‘బ్రిక్స్‌ సహకారం’తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం: ప్రధాని మోదీ

కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉందని, బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం ఆ వ్యవస్థ పునరుజ్జీవానికి ఇతోధికంగా దోహదపడగలదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆధ్వర్యాన వీడియో ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా కూడా పాల్గొన్నారు.

2022లో 7.5 శాతం ఆర్థిక వృద్ధి!

భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 7.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ‘బ్రిక్స్‌ వాణిజ్య వేదిక’ సమావేశంలో వీడియో సమావేశం విధానంలో ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు సైతం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా పాల్గొన్నారు. భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విలువ 2025 కల్లా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ కింద లక్షన్నర కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని మోదీ తెలిపారు.

ఇండో - జర్మన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సదస్సు

భారతీయ న్యాయవ్యవస్థ చట్టబద్ధ పాలన (రూల్‌ ఆఫ్‌ లా)కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు. ఇండో - జర్మన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సమావేశం సందర్భంగా జర్మనీలోని దోర్త్‌మండ్‌లో ‘ఆర్బిట్రేషన్‌ ఇన్‌ ఏ గ్లోబలైజ్డ్‌ వరల్డ్‌ - ది ఇండియన్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

8 ఏళ్లలో 1,380% పెరిగిన సైబర్‌ నేరాలు

దేశంలో గత 8 ఏళ్లలో సైబర్‌ నేరాలు 1,380% పెరిగినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. భారత్‌ భద్రంగా ఉండకూడదని భావించే కొన్ని దేశాలు సైబర్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దాడులకు పాల్పడుతున్నాయని ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. జాతీయ భద్రతకు సైబర్‌ భద్రత అత్యంత కీలకమన్నారు. ఆయన దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ‘సైబర్‌ భద్రత - జాతీయ భద్రత’ అన్న అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో 2012లో 3,377 సైబర్‌ నేరాలు నమోదైతే 2020 నాటికి ఆ సంఖ్య 50 వేలకు చేరింది. 2020లో ప్రతిరోజు 136 సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. ఇందులో నాలుగేళ్లలో 270% పెరుగుదల నమోదైంది. ఏదైనా కొత్త తరహా సైబర్‌ మోసం, దాడి జరిగితే నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ దానిపై పరిశోధన జరిపి అలాంటి వాటి నుంచి భద్రత కల్పించేందుకు కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని అమిత్‌ షా తెలిపారు.

ఆసియాన్, భారత్‌ భాగస్వామ్యానికి ఇరుపక్షాల విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం

ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల వాణిజ్యం, ప్రాంతీయ భద్రతకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నా భారత్, ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) సమగ్ర వ్యూహపరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిశ్చయించాయి. పది దేశాల ఆసియాన్‌తో భారత్‌ 1992లో సంబంధాలు ప్రారంభించి 30 సంవత్సరాలైన సందర్భంగా దిల్లీలో రెండు రోజుల పాటు ఉభయ పక్షాల విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్, సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌ సహాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశంలో సింగపూర్‌తో పాటు బ్రూనై, కాంబోడియా, ఇండోనేసియా, మలేసియా, వియత్నాం విదేశాంగ మంత్రులు పాల్గొనగా లావోస్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్‌ విదేశాంగ మంత్రుల తరఫున వారి ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశ ప్రారంభోపన్యాసంలో జైశంకర్‌ ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఆహారం, ఇంధనం, ఎరువులు, ఇతర వ్యాపార సరకుల సరఫరా విచ్ఛిన్నమై ధరలు పెరిగిపోతున్నాయన్నారు. సంయుక్త సమావేశంలో భారత్, ఆసియాన్‌లు తమ మధ్య వ్యాపారం, డిజిటల్, కమ్యూనికేషన్‌ అనుసంధానం, రక్షణ, టీకాల ఉత్పత్తి, హరిత ఇంధన రంగాలలో సహకారం వృద్ధి చేసుకోవాలని నిర్ణయించాయి. నవంబరులో భారత్, ఆసియాన్‌ దేశాల రక్షణ మంత్రుల అనధికార సమావేశం జరపాలనీ, సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు జరపాలని దిల్లీ సమావేశం నిర్ణయించింది. ఇండో పసిఫిక్‌ జలాల్లో భారత్, ఆసియాన్‌లు పరస్పరం సమన్వయీకృత విధానాలను అనుసరించాలని అంగీకారం కుదిరింది. ఆగ్నేయాసియాలో ఆసియాన్‌ శక్తిమంతమైన సంఘం. భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు అనేక ఇతర దేశాలు ఈ సంఘంతో సంబంధాలు నెరపుతున్నాయి. భారతదేశం తన తూర్పు దిశగా కార్యాచరణ (యాక్ట్‌ ఈస్ట్‌) విధానంలో ఆసియాన్‌కు కీలక పాత్రనిచ్చింది.

బ్రిక్స్‌ దేశాల ఉన్నత భద్రతాధికారుల సమావేశం

బ్రిక్స్‌ దేశాల ఉన్నత భద్రతాధికారులు వీడియో ద్వారా సమావేశమై బహుళ పక్ష సహకారాన్నీ, అంతర్జాతీయ నిర్వహణ తీరును బలోపేతం చేయాలనీ, తమ దేశాల భద్రతకు ఎదురవుతున్న కొత్త ముప్పులు, సవాళ్లను కలసికట్టుగా అధిగమించాలని నిర్ణయించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో పాటు మిగతా బ్రిక్స్‌ దేశాల భద్రతాధికారులూ పాల్గొన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన ఈ సంఘాన్ని బ్రిక్స్‌గా వ్యవహరిస్తున్నారు. సమాచార, కమ్యూనికేషన్‌ (ఐసీటీ) సాంకేతికతలు, అంతరిక్షం, సముద్ర భద్రత రంగాల్లో బ్రిక్స్‌ దేశాలు సహకారం పెంపొందించుకోవాలన్నారు.

‘సేవ్‌ సాయిల్‌ మూవ్‌మెంట్‌’ సదస్సు

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ‘వాతావరణ మార్పు’లో భారత్‌ ప్రమేయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అభివృధ్ధి చెందిన దేశాలే అత్యధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని, అయినా పర్యావరణ పరిరక్షణలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ నిర్వహించిన ‘సేవ్‌ సాయిల్‌ మూవ్‌మెంట్‌’ సదస్సులో మోదీ ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో పర్యావరణ పరిరక్షణకు భారత్‌ తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు. ప్రపంచంలో ఓ వ్యక్తి సగటు కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ నాలుగు టన్నులైతే భారత్‌లో అది కేవలం 0.5 టన్నులే అని ప్రధాని తెలిపారు. అనంతరం పర్యావరణ హిత జీవనశైలి (లైఫ్‌) పేరుతో జరిగిన అంతర్జాతీయ సదస్సును వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు.