రాష్ట్రీయం - తెలంగాణ



ప్రపంచ అంకుర రాజధానిగా హైదరాబాద్‌

అద్భుత నగరమైన హైదరాబాద్‌ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ టీహబ్‌ దేశానికి తలమానికంగా, ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాంకేతిక కేంద్రాన్ని స్థాపించి, దేశంలో తెలంగాణ తొలి అంకుర రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ప్రపంచంతో పోటీపడుతూ గొప్ప ప్రగతిని సాధించిందని ఆయన వివరించారు. హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌-2ను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ యూనికార్న్‌ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, తెలంగాణలోని ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను, టీహబ్‌ నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం టీహబ్‌ జ్ఞాపికలను అందజేశారు.

ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ సెర్ప్‌ రూ.500 కోట్ల ఒప్పందం

మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ విదేశాల్లో మార్కెటింగ్‌ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కుదుర్చుకొన్న ఒప్పందం చరిత్రాత్మకమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సంస్థతో కలిసి స్వయం సహాయక బృందాలు ఈ ఏడాదికి రూ.500 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సమక్షంలో సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఫ్లిప్‌కార్ట్‌ గ్రోసరీ వైస్‌ ప్రెసిడెంట్‌ స్మృతి రవిచంద్రన్‌లు మార్కెటింగ్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

కాలుష్య సమస్యలతో హైదరాబాద్‌లో పరిశ్రమలకు అత్యల్ప సంఖ్యలో అనుమతులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాలుష్య సమస్య కారణంగా కొత్త పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తోంది. గత ఎనిమిదేళ్ల కాలంలో మొత్తంగా కేవలం 32 పరిశ్రమలు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చాయి. ఇవి కాలుష్య సమస్య లేని ఐటీ పరిశ్రమలు. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక అనుమతులిచ్చారు. అక్కడ ఎనిమిదేళ్లలో 3,805 ( 22.2 శాతం) ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో సంగారెడ్డి 1,410 (8.25 శాతం), కరీంనగర్‌ 1,223 (7.4 శాతం) నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.

‣ రాజధానికి కాలుష్య సమస్య ఉండగా, దానికి సమీపంలోని మేడ్చల్‌ జిల్లా అనుమతుల్లో అగ్రస్థానం పొందించి. మరోవైపు సరిహద్దు జిల్లాలైన నారాయణపేటలో 49, ములుగులో 57, వనపర్తిలో 77, జోగులాంబ గద్వాలలో 91 పరిశ్రమలకు మాత్రమే అనుమతి లభించింది.


దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)ల ఏర్పాటు

ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి టీఎస్‌ఆర్టీసీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. టికెట్ల జారీని మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే టిమ్‌ (టికెట్‌ ఇష్యూ మిషన్‌) సేవలను అందిస్తోంది. ఇపుడు మరింత ఆధునికంగా దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)లను అందుబాటులోకి తెచ్చింది.

ప్రయాణానికి 20 నిమిషాల ముందు సీట్ల అందుబాటును బట్టి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకోచ్చు. బస్సు ఎక్కడ ఉంది, ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, మన స్టేజీకి రావడానికి ఎంత సమయం పడుతుంది వంటి వివరాలన్నీ ఐ-టిమ్‌ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.

‣ ఇప్పటికే వీటిని హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్‌ బస్సుల్లో అందుబాటులోకి తెచ్చారు. అనంతరం దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో అమలు చేసి, దశలవారీగా అన్ని సర్వీసుల్లో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది.


తెలంగాణలో తొలిసారిగా వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో జనపనార పరిశ్రమల ఏర్పాటు

పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఇప్పటివరకూ జనపనార (జూట్‌) పరిశ్రమలు లేవు. మరోవైపు ధాన్యం సేకరణ, నిల్వ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 30 కోట్లకు పైగా జనపనార గోనె సంచులను ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఒక్కోసారి సంచుల కొరతతో ధాన్యం సేకరణకు సమస్యలూ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే గోనె సంచుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు సంస్థలు జూట్‌ మిల్లుల ఏర్పాటుకు ముందుకురాగా, వాటితో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా గ్లోస్టర్‌ లిమిటెడ్‌ సంస్థ వరంగల్‌లో, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఎంబీజీ కమాడిటీస్‌ లిమిటెడ్‌ కామారెడ్డిలో ఈ మిల్లులను ఏర్పాటు చేయనున్నాయని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు.

జాన్సన్‌ కంట్రోల్స్‌ కంపెనీ ‘ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ ప్రారంభం

భారతదేశంలో పెట్టుబడులకు ముఖద్వారం తెలంగాణ రాష్ట్రమని ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అభివర్ణించారు. మాదాపూర్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ కంపెనీకి చెందిన ‘ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ను ఆయన ప్రారంభించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోంది. జాన్సన్‌ కంట్రోల్స్‌ వంటి కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయి. టీ హబ్, టీ వర్క్స్, ఐమేజ్‌ టవర్స్, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం, సచివాలయం వంటి భవనాలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ గ్లోబల్‌ కేపెబిలిటీ సెంటర్‌ ప్రారంభం

వాహన రంగంలో తెలంగాణకు అద్భుత భవిష్యత్తు ఉందని, హైదరాబాద్‌ నగరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తొలి ‘ఫార్ములా ఈ’ (విద్యుత్‌ వాహనాల) రేసుకు ఆతిథ్యమివ్వనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విద్యుత్‌ వాహన తయారీ రంగంపై చర్చించేందుకు శిఖరాగ్ర సదస్సు (ఈవీ సమ్మిట్‌)నూ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రముఖ వాహన రంగ సంస్థ అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రం (గ్లోబల్‌ కేపెబిలిటీ సెంటర్‌)ను కేటీఆర్‌ హైదరాబాద్‌లోని కోకాపేట జీఏఆర్‌ ఇన్‌ఫోబాన్‌ ఐటీ భవనంలో ప్రారంభించారు.

కాలుష్యరహిత స్టవ్‌లు, స్టీమ్‌ యంత్రాల తయారీకి ఒప్పందం

తెలంగాణలో కాలుష్యరహిత వంట స్టవ్‌లు, మొబైల్‌ స్టీమ్‌ యంత్రాల తయారీకి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీ వర్క్స్, సామాజిక సేవా సంస్థ కేర్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. టీవర్క్స్‌ సీఈవో సుజయ్‌ కారంపురి, కేర్‌ ఇండియా సీఈవో మనోజ్‌ గోపాలకృష్ణలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

వినూత్న వాహనాల తయారీకి ఐక్యాట్‌తో ఐఐటీహెచ్‌ ఒప్పందం

డ్రైవర్‌ లేకుండానే దూసుకుపోయే వాహనాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్‌ వడివడిగా అడుగులేస్తోంది. ఆ దిశగా పరిశోధనలను ముమ్మరం చేసే ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐక్యాట్‌) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్వతంత్రంగా నడిచే వాహనాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా ఐఐటీలో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ (టీహాన్‌)ను నెలకొల్పారు. ఈ హబ్‌ ద్వారా టెస్టింగ్‌ ట్రాక్‌తో పాటు పరిశోధనలకు అవసరమైన అన్ని వ్యవస్థలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో డ్రైవర్‌ లేకుండానే నేలపై, ఆకాశంలో నడిచే వాహనాలను సిద్ధం చేయాలనేది దీని ఏర్పాటు లక్ష్యం. ‘ఐక్యాట్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు. ఇకపై రెండు సంస్థలు పరిశోధనా, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణ అంశాల్లో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతాయని’ ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021 - 22 వార్షిక నివేదిక విడుదల

తెలంగాణలో పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) ద్వారా ఇప్పటివరకు రూ.2,32,311 కోట్ల పెట్టుబడులతో 19,454 భారీ పరిశ్రమలకు అనుమతులిచ్చామని, వీటి ద్వారా 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని 2021 - 22 రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే రూ.17,867 కోట్ల పెట్టుబడులు, 96,863 మందికి ఉపాధి కల్పన కోసం 3,938 పరిశ్రమలు అనుమతి పొందాయని వెల్లడించింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. దేశంలో తెలంగాణ అత్యుత్తమ వాణిజ్య వాతావరణ నగరంగా వంద మార్కులను సాధించిందని, ఎగుమతుల్లో దేశంలో అయిదో ర్యాంకు, గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో వాణిజ్య, పారిశ్రామిక ర్యాంకుల్లో మొదటి స్థానంలో, సృజనాత్మకత, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కుల్లో అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. ఈ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. నివేదికలోని ముఖ్యాంశాలు.. ‣ తెలంగాణ జీఎస్‌డీపీ 2021 - 22లో 19.1% వృద్ధి రేటుతో రూ.11.54 లక్షల కోట్లు. 2014 - 15 నుంచి 2021 - 22 వరకు జీఎస్‌డీపీ 128.3 శాతం వృద్ధి చెందింది. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం. ‣ 2021 - 22లో రాష్ట్రంలో 13 కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధి.

పల్లెలు, పట్టణాల్లో సమ్మిళిత అభివృద్ధి

పల్లెలు, పట్టణాల సమ్మిళిత అభివృద్ధితో రాష్ట్రం వేగవంతమైన పురోగతితో ముందుకెళ్తోందని పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. 2025 నాటికి రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది పట్టణాల్లోనే ఉంటారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా వ్యూహాత్మక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో పురపాలక శాఖ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో 2014 నుంచి ఒక్క సంవత్సరం కూడా స్థిరాస్తి ధరలు తగ్గని ఏకైక నగరం హైదరాబాద్‌. వాణిజ్య స్థలాల లభ్యత, గిరాకీలో నగరం బెంగళూరును దాటి ముందుకెళ్లింది.

655 మందికి పోలీస్‌ సేవా పతకాలు

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ సేవా పతకాల్ని ప్రకటించింది. హోం శాఖ పరిధిలో విశిష్ట సేవలందించినందుకు పోలీస్, ఏసీబీ, విజిలెన్స్, ఎస్పీఎఫ్, ఆగ్నిమాపక శాఖలకు చెందిన 655 మందిని శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన, సేవా పతకాలకు ఎంపిక చేసింది. వీరందరికీ తర్వాత పురస్కారాల్ని అందజేస్తారు. శౌర్య పతకాల విభాగంలో పోలీస్‌ శాఖ తరఫున గ్రేహౌండ్స్‌ నుంచి మల్లేశ్‌ (ఆర్‌ఐ), వంశీధర్‌ (ఆర్‌ఎస్సై), శ్రీకాంత్, నరేందర్, మురళీ కృష్ణ, రోహిత్, హుస్సేన్‌ పాషా, రాజ్‌కుమార్, వీరాకుమార్, శేఖర్, గంగాధర్‌ (కానిస్టేబుళ్లు), అగ్నిమాపకశాఖ తరఫున సైదులు (కూకట్‌పల్లి అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌), కృష్ణారెడ్డి (కూకట్‌పల్లి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌), జయకృష్ణ, శివుడు (కూకట్‌పల్లి ఫైర్‌స్టేషన్‌ ఫైర్‌మెన్లు) ఎంపికయ్యారు.

2021 - 22లో రూ.1.83 లక్షల కోట్ల ఎగుమతులు

ఐటీ రంగంలో తెలంగాణ గత ఎనిమిదేళ్లలో అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ రంగంలో భారతదేశ వృద్ధి తగ్గుతుంటే తెలంగాణ మాత్రం గణనీయమైన ప్రగతి సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ ఎగుమతులు 2020 - 21లో రూ.1,45,522 కోట్లు ఉండగా 2021 - 22లో అవి రూ.1,83,569 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. అంటే 2021 కంటే 26.14% ఎక్కువని అన్నారు. ఐటీ తెలంగాణ అయిదో వార్షిక నివేదికను ఆయన హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఐటీ పురోగతిని వివరించారు. టీఎస్‌ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్‌ వంటి సంస్థల ద్వారా ఆవిష్కరణలను, అంకురాలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో 1,423 ఓపెన్‌ డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లభించిందని మంత్రి తెలిపారు.