సర్వేలు
వ్యాపార సంస్కరణల్లో 7 రాష్ట్రాలకు అగ్రస్థానం
కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్దేశించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలులో ఏడు రాష్ట్రాలు 90%కి పైగా మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. ఇదివరకు వరల్డ్ బ్యాంక్ చేయూతతో సులభతర వాణిజ్యం పేరుతో ర్యాంకులు ప్రకటిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలు పేరుతో రాష్ట్రాల పని తీరును మదింపు చేసి ‘బిజినెస్ రీఫామ్స్ యాక్షన్ ప్లాన్ 2020’ పేరుతో నివేదిక రూపొందించింది. దాని ప్రతిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లు విడుదల చేశారు. ఐదు మినహా మిగిలిన 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పని తీరును వెల్లడించారు.వివిధ గ్రూపుల్లో నిలిచిన రాష్ట్రాలు :-
టాప్ అచీవర్స్ (7): ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ
అచీవర్స్ (6): హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్
యాస్పైరర్స్ (7): అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, ఝార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్
ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టం (11): అండమాన్ నికోబార్, బిహార్, చండీగఢ్, దమణ్ దీవ్, దాద్రానగర్ హవేలీ, దిల్లీ, జమ్మూ కశ్మీర్, మణిపుర్, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర.
శరవేగంగా పట్టణ జనాభా వృద్ధి: ఐరాస
ప్రపంచ జనాభాలో ప్రస్తుతం 56 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా 2050 నాటికి ఆ సంఖ్య 68 శాతానికి (220 కోట్లకు) చేరనుంది. భారత్‌లో ప్రస్తుతం 48 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పరచుకోగా 2035 నాటికి ఆ సంఖ్య 67 కోట్ల 50 లక్షలకు చేరనుందని ఐక్యరాజ్య సమితి హాబిటాట్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ - 2022 వెల్లడించింది. అదే సమయానికి చైనాలో పట్టణ ప్రాంతాల్లో 100 కోట్లకుపైగా జనాభా ఉండనుంది. ఆ తర్వాతి స్థానం భారత్‌దే కావడం గమనార్హం.భారత్ అప్పు రూ.1,33,22,727 కోట్లు
దేశంపై ఉన్న అప్పు 2022 మార్చి 31 నాటికి రూ.1,33,22,727 కోట్లకు చేరింది. 2021 డిసెంబర్ నాటికి రూ.1,28,41,996 కోట్ల మేర ఉన్న రుణ భారం మూడు నెలల్లో రూ.4,80,731కోట్ల మేర పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన పబ్లిక్ డెట్ మేనేజ్‌మెంట్ నివేదిక వెల్లడించింది. భారత్‌కున్న అప్పులో అంతర్గత రుణం రూ.1,14,62,343 కోట్ల (86.03%) మేర ఉండగా, విదేశీ రుణం రూ.8,32,409 కోట్ల మేర ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ రూ.10,27,976 కోట్లకు చేరాయి. అంతర్గత రుణ భారంలో 70.02% (రూ.80.26 లక్షల కోట్లు) వాటా మార్కెట్ రుణాలదే ఉంది. చిన్న పొదుపు మొత్తాలను చూపి తీసుకున్న రుణాలు రూ.18,83,921 కోట్ల మేర ఉన్నాయి. ఈ రుణం గత మూడు నెలల కాలంలో 15.42% మేర పెరిగింది.యూనికార్న్ హబ్‌గా భారత్
దేశంలోని అంకుర సంస్థల్లో వందకు పైగా త్వరలోనే యూనికార్న్ స్థాయికి చేరనున్నట్లు ‘హ్యూరన్ పరిశోధన సంస్థ’ సమీక్షలో వెల్లడైంది. ఆస్క్ వెల్త్, హ్యూరన్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్- 2022ను బెంగళూరులో విడుదల చేశారు.అమెరికా, చైనాల తర్వాత అత్యధిక యూనికార్న్ లున్న దేశంగా భారత్ ఆవిర్భవించనున్నట్లు ఆస్క్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో రాజేశ్ సలూజా, హ్యూరన్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ ఈ సందర్భంగా చెప్పారు. 1 బిలియన్ డాలర్లు (రూ.7,892 కోట్ల) విలువకు చేరుకున్న సంస్థను యూనికార్న్‌గా పరిగణిస్తారు. దేశంలో 2000 తర్వాత ప్రారంభించి 200 మిలియన్ డాలర్లు - 1 బిలియన్ డాలర్ల మధ్య వ్యాపార సామర్థ్యం కలిగి, పబ్లిక్ ఎక్స్ఛేంజ్ జాబితాలో లేని స్టార్టప్‌లను సమీక్షించారు. వీటిని రెండేళ్లలో యూనికార్న్ స్థాయికి చేరే గజెల్స్ (జింక), నాలుగేళ్లలో చేరే చీతా (చిరుత)లుగా వర్గీకరించారు. ఈ అంకురాల వ్యాపార, ఉత్పాదన ప్రగతి స్థిరంగా కొనసాగితే రానున్న మూడు నాలుగేళ్లలో 122 అంకురాలు యూనికార్న్ స్థాయికి చేరతాయని నివేదిక స్పష్టం చేసింది. వీటి ప్రస్తుత విలువ 49 బిలియన్ డాలర్లని, గతేడాదితో పోలిస్తే ఇది 36 శాతం పెరిగిందని పేర్కొంది.
బెంగళూరుకు చెందిన 46 అంకురాలు యూనికార్న్ అంచనా జాబితాలో ఉన్నాయి. దిల్లీ నుంచి 25, ముంబయి నుంచి 16 స్టార్టప్‌లకూ దీనిలో చోటు దక్కింది. ఈ అంకురాల్లో అత్యధికం (27) ఫిన్‌టెక్‌వి కాగా తర్వాత ఈ-కామర్స్ (14), సాఫ్ట్‌వేర్ సేవలు (11), ఎడ్యుటెక్ (7) ఉన్నాయి. భవిష్యత్తు యూనికార్న్ వ్యవస్థాపకుల్లో అత్యధికులు (22) ఐఐటీ దిల్లీ పట్టభద్రులు కాగా తర్వాత స్థానాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ (18), ఐఐటీ ముంబయి (18), ముంబయి వర్సిటీ (17), బిట్స్ పిలానీ(14) ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
సామాజిక మాధ్యమాల్లో వచ్చిందే వాస్తవమని 87% భారతీయుల నమ్మకం
సాధారణంగా ఏ విషయంపైనైనా వాస్తవ సమాచారం తెలుసుకోవాలంటే పుస్తకాలు, పత్రికలు లేదా ఇతర సంప్రదాయ మార్గాలపై ఆధారపడతాం. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, సామాజిక మాధ్యమాల్లోనే సమాచారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని తాజా అంతర్జాతీయ సర్వే పేర్కొంది. ముఖ్యంగా భారత్‌లో ఈ సంఖ్య అధికంగా ఉందని వెల్లడించింది. భారత్‌లో కచ్చితమైన సమాచారం తెలుసుకొనేందుకు, తమకు తెలిసిన విషయాన్ని రూఢీ చేసుకొనేందుకు 54% మంది ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లనే ఆశ్రయిస్తున్నారు. ఈ శాతం మెక్సికో, దక్షిణాఫ్రికాలో 43%గా ఉంది. బ్రిటన్‌లో మాత్రం ఇది కేవలం 16 శాతమే ఉండటం గమనార్హం. ఈ సర్వేను భారత్, మెక్సికో, దక్షిణాఫ్రికా, అమెరికా, యూకేల్లో ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్’ నిర్వహించింది. మిగతా దేశాలతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో తాము చదివిన, పంచుకున్న సమాచారం నిజమేనని 87% భారతీయుల నమ్మకం.31% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్ నివేదిక
రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత సభ్యుల్లో 31 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు జాతీయ ఎన్నికల నిఘా సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్’ (ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. ఈ 71 మందిలో 37 మందిపై (16%) నేరారోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇద్దరిపై హత్యానేరం అభియోగాలు కూడా ఉన్నాయి. మరో నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన అభియోగాలు నలుగురు ఎంపీలపైన ఉన్నాయి.భారత్‌లో విస్తరిస్తున్న నల్లమందు అమ్మకాలు: ఐరాస నివేదిక
మాదకద్రవ్యాల్లో ఒకటైన నల్లమందు వాడకందారుల సంఖ్య, అమ్మకాల పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటిగా భారత్ మారుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అఫ్గానిస్థాన్ నుంచి పెద్దఎత్తున సరకు మన దేశానికి వస్తున్నందువల్ల మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందని పేర్కొంది. మాదక ద్రవ్యాలు - నేరాలపై ‘ప్రపంచ మాదకద్రవ్య నివేదిక 2022’ను ఐరాస విడుదల చేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 15-64 ఏళ్ల మధ్య వయసు వారిలో 28.4 కోట్ల మంది ప్రజలు మాదకద్రవ్యాలను వినియోగించారని ఈ నివేదిక తెలిపింది. అంతకు ముందు దశాబ్దం కంటే ఇది 26% ఎక్కువ.సామాజిక భద్రతా చర్యలు మరిన్ని అవసరం: నీతి ఆయోగ్
దేశంలో తాత్కాలిక కార్మికుల (గిగ్ వర్కర్ల) సంఖ్య 2029 - 30 కల్లా 2.35 కోట్లకు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. 2020 - 21లో ఈ సంఖ్య 77 లక్షలుగా ఉందని పేర్కొంది. ఈ తరహా కార్మికులు, వారి కుటుంబాలకు భాగస్వామ్య పద్ధతిలో సామాజిక భద్రతా చర్యల (వైద్య సేవలు, బీమా, పెన్షన్)ను అందించాలని సిఫారసు చేసింది. తాత్కాలిక కార్మికులను ప్లాట్‌ఫామ్ (ఆన్‌లైన్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై పని చేసే వాళ్లు), నాన్ ప్లాట్‌ఫామ్ (శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన సంప్రదాయ రంగాల్లో పనిచేసే కార్మికులు) అని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ‘ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ ఎకానమీ’ పేరుతో రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. 2020 - 21లో రిటైల్ ట్రేడ్, విక్రయాల విభాగంలో 26.6 లక్షల మంది, రవాణా రంగంలో 13 లక్షల మంది, తయారీ రంగంలో 6.2 లక్షల మంది, ఆర్థిక సేవలు - బీమా రంగాల్లో 6.3 లక్షల మంది గిగా వర్కర్లున్నారు. మధ్య తరహా నైపుణ్య ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు 47% మంది కాగా అధిక నైపుణ్య ఉద్యోగులు 22%, తక్కువ నైపుణ్య కార్మికులు 31 శాతంగా ఉన్నారని నివేదిక వివరించింది.మలేరియా కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల
భారత్‌లో మలేరియా కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు ‘మలేరియా నో మోర్’ సంస్థ నివేదిక వెల్లడించింది. 2015 నుంచి 2021 మధ్య ఈ సంస్థ చేసిన అధ్యయనం మేరకు కేసుల్లో 86 శాతం తగ్గుదల నమోదు కాగా, మరణాలు 79 శాతం తగ్గాయి. ‘మలేరియా నివారణ దిశగా భారత ప్రస్థానం’ పేరిట విడుదలైన ఈ నివేదికలో 2017 - 2019 మధ్య మలేరియా నివారణకు బడ్జెట్ కేటాయింపులను భారత్ రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వ్యాధిని గుర్తించదగినదిగా ప్రకటించి, తొమ్మిది కోట్లకు పైగా దోమ తెరలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.బియ్యం ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 10వ స్థానం
విదేశాలకు సాధారణ బియ్యం ఎగుమతుల్లో తెలంగాణ 10, ఏపీ మొదటిస్థానంలో నిలిచాయి. ఏపీలో నౌకాశ్రయాలు అందుబాటులో ఉండటంతో పాటు పక్కనే ఉన్న తెలంగాణలో వరి ధాన్యం దిగుబడులు పెరగడంతో ఏపీ అగ్రస్థానానికి చేరింది. తెలంగాణ నుంచి ఏపీ వ్యాపారులు బియ్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి చేశారు. 2021 - 22లో దేశవ్యాప్తంగా వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల వివరాలను భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి (అపెడా) తాజాగా వెల్లడించింది. నౌకాశ్రయాలున్న ఏపీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు వరసగా తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. వాటి తరవాత బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు 6 నుంచి 10వ స్థానంలో ఉన్నాయి. హరియాణా, ఒడిశా రాష్ట్రాల్లో వరి ధాన్యం దిగుబడులు తెలంగాణ కన్నా తక్కువగా ఉన్నా ఎగుమతుల్లో మాత్రం ముందున్నాయి.తెలంగాణలో సగం పట్టణాలే!
రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పట్టణీకరణలో రెండున్నర దశాబ్దాలు ముందుంది. 2025 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకొనే అవకాశం ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రస్తుతం పట్టణ జనాభా జాతీయ సగటు 31.16 శాతం కాగా, తెలంగాణలో 46.8 శాతంగా నమోదైందని నీతి ఆయోగ్ తాజా నివేదికలో తెలిపింది. నివేదిక ప్రకారం.. పట్టణీకరణలో తొలి రెండు స్థానాల్లో తమిళనాడు (48.4 శాతం), కేరళ (47.2) ఉండగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర (45.23 శాతం) నాలుగో స్థానంలో ఉంది.విద్యుత్తు వాహనాలతోనే తెలంగాణలో కాలుష్య నివారణ
వాహనాల రద్దీతో కాలుష్యానికి గురవుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో స్వచ్ఛ వాతావరణం ఏర్పడాలంటే ‘విద్యుత్ వాహనాల’ వినియోగమే మార్గమని అధ్యయనంలో తేలింది. మహానగరంలో కాలుష్యం, రవాణా, వ్యక్తిగత వాహనాల వాడకం, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యలపై బ్రిటన్ ప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలసి ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’ (టీఎస్ రెడ్కో) ఈ అధ్యయనం చేసింది. రాష్ట్రంలో ఈవీల వినియోగం పెరగాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌కు ఇవి ఎంత ముఖ్యమో నివేదికలో వెల్లడించింది.భారత్‌లో 50 లక్షల నిర్వాసితులు
వాతావరణ మార్పులు, విపత్తుల కారణంగా 2021లో భారత్‌లో సుమారు 50 లక్షల మంది ప్రజలు నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. హింస, మానవ హక్కుల అణచివేత, ఆహార భద్రత లోపం, వాతావరణ సంక్షోభం, ఉక్రెయిన్‌లో యుద్ధం, ఆఫ్రికా నుంచి అఫ్గానిస్థాన్ వరకూ ఏర్పడిన ఇతర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది తమ స్వగృహాలను, సొంత ప్రాంతాలను వదిలిపెట్టి వలసబాట పట్టారని వివరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి శరణార్థ సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) విడుదల చేసిన అంతర్జాతీయ పోకడల వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతర్గత నిర్వాసిత పర్యవేక్షణ కేంద్రం అంచనాల మేరకు 2021లో విపత్తుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.37 కోట్ల మంది నిర్వాసితులయ్యారు. అయితే ఇది గత సంవత్సరంతో పోలిస్తే 70 లక్షలు (23 శాతం) తక్కువ. పలు రకాల విపత్తుల కారణంగా అత్యధికంగా చైనాలో 60 లక్షలు, ఫిలిప్పీన్స్‌లో 57 లక్షలు, భారత్‌లో 49 లక్షల మంది తాత్కాలికంగా నిర్వాసితులుగా మిగిలారు. ఇలాంటి వారిలో అధికశాతం మంది తిరిగి తమ సొంత ప్రాంతాలకు చేరుకోగా 59 లక్షల మంది మాత్రం వలస జీవితాలు గడుపుతున్నారని నివేదిక వివరించింది.దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న టాప్-10 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అప్పుల భారం హద్దులు దాటినట్లు విడుదలైన రిజర్వు బ్యాంకు బులిటెన్ పేర్కొంది. దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్న టాప్-10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు తెలిపింది. 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్ధారించిన రుణ, ఆర్థికలోటు పరిమితులను రాష్ట్రం దాటేసిందని వెల్లడించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంత అధికంగా జీఎస్‌డీపీలో 9% బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే 25 రోజుల పాటు స్పెషల్‌డ్రాయింగ్ ఫెసిలిటీ, 21 రోజుల పాటు చేబదుళ్లకు వెళ్లినట్లు పేర్కొంది. ఇంత స్థాయిలో ఈ అవకాశాలను వాడుకున్న రాష్ట్రాల్లో ఏపీ సరసన తెలంగాణ, మణిపుర్, నాగాలాండ్ ఉన్నట్లు తెలిపింది.ముఖ్యాంశాలు:-
‣ గత మేలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌లలో 8%కి మించింది.
‣ 2021 - 22 బడ్జెట్ (సవరించిన అంచనాలు) ప్రకారం ఏపీ ఆదాయంలో 14% వడ్డీలకు వెళ్తోంది.
‣ 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలకు ఖర్చు చేసే మొత్తం రూ.27,541 కోట్లు జీఎస్‌డీపీలో 2.1%కి సమానం. రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో 14.1%, రాష్ట్ర సొంత ఆదాయంలో 30.3% ఇందుకోసం వెళ్తుంది. ఉచిత పథకాలకు పంజాబ్ (2.7%) తర్వాత అత్యధిక మొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ.
సంపద వృద్ధిలో అదానీ గ్రూప్ నం.1
సంపద వృద్ధిలో అదానీ గ్రూప్ అగ్రస్థానంలో నిలిచింది. 2022 ఏప్రిల్‌కు ముందు ఆరు నెలల్లో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 88.1 శాతం వృద్ధి చెంది రూ.17.6 లక్షల కోట్లకు చేరిందని బుర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా నివేదిక వెల్లడించింది. 500 దిగ్గజ కంపెనీల సంపద విలువతో ఈ సంస్థ జాబితా రూపొందించింది. ఈ ప్రకారం.. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 13.4 శాతం పెరిగి రూ.18.87 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్ విలువ 0.9 శాతం తగ్గినప్పటికీ రూ.12.97 లక్షల కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండో స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ముంబయి 159 కంపెనీలతో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు (59), గురుగ్రామ్ (38) తర్వాత నిలిచాయి.భారతీయుల ఆయుష్షు సగటున ఐదేళ్ల క్షీణత
భారత్‌లో వాయు కాలుష్యం అత్యంత ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ పౌరులు సగటున అయిదేళ్ల ఆయుర్దాయం కోల్పోయే ముప్పు ఉందని అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఎపిక్) అధ్యయనం పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత మహానగరమైన దిల్లీలో నివసించేవారి ఆయుష్షు పదేళ్లు తగ్గొచ్చని హెచ్చరించింది. గంగా, సింధు నదుల పరీవాహక ప్రాంతాల్లో నివసించే 51 కోట్లకు పైగా ప్రజల ఆయుర్దాయం సగటున 7.6 ఏళ్లు క్షీణించే పరిస్థితి రావొచ్చని వివరించింది. లఖ్‌నవూ వాసులు 9.5 ఏళ్ల ఆయుష్షు కోల్పోతారని పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సగటున 2.2 ఏళ్ల ఆయుష్షు తగ్గుతున్నట్లు తెలిపింది. పొగతాగడం వల్ల జరిగే హాని (1.5 ఏళ్ల ఆయు క్షీణత) కన్నా ఇది మరింత ఎక్కువ అని పేర్కొంది. ఈ సంస్థ విడుదల చేసిన ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ నివేదికలో వెల్లడించింది.ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాసియా దేశాలే తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. ఈ విషయంలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లు ముందు వరుసలో ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్, భారత్ ఉన్నాయి.
డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను పాటిస్తే యూపీలో 8.2 ఏళ్లు, బిహార్‌లో 7.9 ఏళ్లు, బెంగాల్‌లో 5.9 ఏళ్లు, రాజస్థాన్‌లో 4.8 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుంది.
అణ్వాయుధాగారాన్ని విస్తరిస్తున్న భారత్
2022 జనవరి నాటికి 160 అణు వార్‌హెడ్‌లను భారత్ కలిగి ఉందని, క్రమంగా అణ్వాయుధాగారాన్ని విస్తరించుకుంటోందని అంతర్జాతీయ మేధోమథన సంస్థ ‘స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (సిప్రీ) తెలిపింది. చైనా కూడా భారీగా ఈ అస్త్రాలను పెంచే ప్రయత్నాల్లో ఉందని వివరించింది. అణ్వస్త్రాలతో కూడిన క్షిపణులను భద్రపరిచేందుకు, ప్రయోగించేందుకు నేలమాళిగలో కొత్తగా 300కుపైగా స్థావరాలు (సైలోస్)ను డ్రాగన్ నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోందని తెలిపింది. 2022 జనవరి నాటికి చైనా వద్ద 350 అణ్వస్త్రాలు ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు సంవత్సరం కూడా వీటి సంఖ్య అదే స్థాయిలో ఉన్నాయని, అయితే వినియోగానికి అందుబాటులో ఉన్న వార్‌హెడ్‌లు పెరిగాయని తెలిపింది. 2021లో కొత్తగా లాంచర్లు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని పేర్కొంది. భారత్‌తో పాటు పాకిస్థాన్ కూడా తమ అణ్వాయుధాగారాన్ని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలూ 2021లో కొత్తరకం అణ్వస్త్ర ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి.ఈ-గవర్నెన్స్‌లో తెలంగాణకు ఐదో ర్యాంకు
నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్ (ఎన్‌ఈఎస్‌డీఏ) - 2021 ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ 5, ఏపీ 8వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆన్‌లైన్ పద్ధతిలో అందిస్తున్న సేవలపై నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ఖరారు చేసింది. రాష్ట్రాలను హిమాలయ - ఈశాన్య, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రూప్-ఎ, గ్రూప్-బిలుగా విభజించి ఆయా కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించింది. గ్రూప్-ఎ కేటగిరీలోని మొత్తం 10 రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్‌లు తొలి మూడు స్థానాలను దక్కించుకోగా తెలంగాణ 5, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచాయి. ఈ-గవర్నెన్స్ ద్వారా ఆర్థిక వ్యవహారాలు, స్థానిక సంస్థలు, విద్యుత్తు, తాగు నీరు, ఇతర గృహావసర సేవలను వినియోగదారులు అత్యధిక సంఖ్యలో ఉపయోగించుకుంటున్నట్లు కేంద్రం చెప్పింది. ప్రజలు ఒకే సేవ అందించే పోర్టల్‌కు పరిమితం కాకుండా అన్నిసేవలూ ఒకేచోట అందించే ఇంటిగ్రేటెడ్, సెంట్రలైజ్డ్ పోర్టల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం 2019లో ఎన్‌ఈఎస్‌డీఏ విధానాన్ని ప్రవేశపెట్టింది. రెండేళ్లకోసారి ర్యాంకులు ఇస్తోంది. దేశవ్యాప్తంగా అందుతున్న డిజిటల్ సేవలను అంచనావేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021 జూన్‌లో ఒక పోర్టల్‌ను ప్రారంభించి 2022 మే వరకు డేటాను సేకరించి విశ్లేషించింది. అందుబాటు, విషయలభ్యత, సులభ వినియోగం, సమాచార భద్రత, గోప్యతల ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది.ఈ-గవర్నెన్స్ - 2021 ర్యాంకులు (గ్రూప్-ఎ రాష్ట్రాలు)
1. కేరళ 2. తమిళనాడు 3. పంజాబ్ 4. కర్ణాటక 5. తెలంగాణ 6. గోవా 7. హరియాణా 8. ఆంధ్రప్రదేశ్ 9. మహారాష్ట్ర 10. గుజరాత్.
ఆహార భద్రతలో తెలంగాణకు 15వ స్థానం
తాజాగా విడుదలైన నాలుగో ఆహార భద్రత సూచిక (2021 - 22)లో తెలుగు రాష్ట్రాలు బిహార్‌కు అటూ ఇటుగా చివరి స్థానాల్లో నిలిచాయి. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ 20 పెద్ద రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో తెలంగాణ 15, బిహార్ 16, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానాల్లో నిలిచాయి. మొత్తం 5 కొలమానాల్లో 100 మార్కులకుగాను తమిళనాడు 82, గుజరాత్ 77.5, మహారాష్ట్ర 70 మార్కులతో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. తెలంగాణ 34.5, బిహార్ 30, ఆంధ్రప్రదేశ్ 26 మార్కులతో చివరి స్థానాలకు పరిమితయ్యాయి. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ - 5, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ - 8, హరియాణా, ఛత్తీస్‌గఢ్ - 13వ ర్యాంకుల్లో నిలవడంతో 20 రాష్ట్రాలకు కలిపి 17 ర్యాంకులే వచ్చాయి. 2020 - 21లో తెలంగాణ 49, ఏపీ 36 మార్కులు సాధించాయి. ఇదివరకు చివరన ఉన్న బిహార్ ఒక మెట్టుపైకి ఎక్కగా, అక్కడున్న ఏపీ ఇప్పుడు చిట్టచివరికి చేరింది.పర్యావరణ సూచీల్లో అట్టడుగున భారత్
పర్యావరణ అంశాల నిర్వహణ, పనితీరును విశ్లేషించి రూపొందించిన 180 దేశాల జాబితాలో భారత్ చివరి స్థానంలో నిలిచింది. అమెరికాలోని పలు సంస్థలు సిద్ధం చేసిన ఈ జాబితాలో డెన్మార్క్ ప్రథమ స్థానంలో నిలిచింది. యూకే, ఫిన్లాండ్ రెండు, మూడో స్థానాలను సొంతం చేసుకున్నాయి. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు విషయంలో గత కొన్నేళ్లుగా ఈ దేశాలు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. యేల్ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్, కొలంబియా యూనివర్సిటీలు పర్యావరణ పనితీరు సూచిక - 2022 జాబితాను ప్రచురించాయి. 11 విభాగాల్లో 40 రకాల పనితీరు సూచికల ఆధారంగా పరిశోధకులు దీన్ని సిద్ధం చేశారు. అత్యల్పంగా భారత్ (18.9), మయన్మార్ (19.4), వియత్నాం (20.01), బంగ్లాదేశ్ (23.01), పాకిస్థాన్ (24.6) మార్కులు సాధించాయి. వాయు నాణ్యతలో ప్రమాదకర స్థాయిలు పెరుగుదల, విపరీతంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కారణంగా భారత్ మొదటిసారి ఈ ర్యాంకింగుల్లో అట్టడుగు స్థానానికి పడిపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది.ఆందోళనకరంగా పెరుగుతున్న జలాశయాల విస్తీర్ణం
భారత్, చైనా, నేపాల్‌లోని ఇరవై అయిదు హిమానీనద సరస్సులు, జలాశయాల విస్తీర్ణం గత 13 ఏళ్లలో 40 శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోందని శాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) పేర్కొంది. ఈ పోకడ వల్ల అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌లకు ముప్పు ఏర్పడనుందని పేర్కొంది. 1990 - 2018 మధ్య దేశ తీర ప్రాంతంలో మూడింట ఒక వంతు కోతకు గురైందని వెల్లడించింది. ఈ మేరకు ‘భారత పర్యావరణ స్థితి 2022: గణాంకాలలో’ అనే నివేదికలో పేర్కొంది. నదీ జలాల పర్యవేక్షణకు ఉద్దేశించిన ప్రతీ నాలుగు కేంద్రాల్లో మూడింట సీసం, ఇనుము, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్, క్రోమియం వంటి అత్యంత విషపూరిత లోహాల పరిమాణం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోందని ప్రభుత్వ గణాంకాలను ఉదహరించింది. 117 నదులు, ఉప నదుల్లో కనీసం రెండు విషపూరిత లోహాలు అధిక స్థాయిలో నమోదయ్యాయంది. 2030 నాటికి దేశంలోని 45 నుంచి 64 శాతం అటవీ విస్తీర్ణం పర్యావరణ పరంగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 19-20లో మన దేశం 35 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసి, దానిలో 12 శాతాన్నే పునర్వినియోగానికి పంపిందని, 20 శాతాన్ని కాల్చివేసిందని వెల్లడించింది. మిగిలింది చెత్తకుండీల పాలై ఉంటుందని తెలిపింది.ప్రతి 36 మంది శిశువుల్లో ఒకరు తొలి పుట్టినరోజు చూడట్లేదు: ఆర్‌జీఐ నివేదిక
దేశంలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి 36 మందిలో ఒకరు కనీసం తొలి పుట్టినరోజునైనా చూడకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2020లో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 28 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 1971లోనైతే ఈ సంఖ్య 129గా ఉండేది. గత పదేళ్లలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్) 36% మేర తగ్గింది. దేశంలో, లేదా ఒక ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఐఎంఆర్‌ను ఒక కీలక ప్రాతిపదికగా చూస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు వెయ్యి మంది శిశువుల్లో 48 మంది తొలి ఏడాదిలోపే చనిపోయేవారు. అది 31కి తగ్గింది. పట్టణ ప్రాంతాల విషయంలో ఈ సంఖ్య 29 నుంచి 19కి తగ్గింది. 2020లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో ఐఎంఆర్ 43 ఉంది. మిజోరంలో అత్యల్పంగా మూడు ఉంది. ఒక ఏడాదిలో ప్రతి 1,000 మంది జనాభాకు ఎంతమంది పిల్లలు పుడుతున్నారో తెలిపే జననాల రేటు అఖిల భారత స్థాయిలో 1971లో 36.9 ఉంటే 2020 నాటికి 19.5కి తగ్గింది. పట్టణ - గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం చాలావరకు తగ్గినా గత ఐదు దశాబ్దాలుగా గ్రామాల్లో జననాల రేటు కొంత ఎక్కువే ఉంది.71% మంది భారతీయులకు పోషకాహారం దూరం
దేశంలో ఏకంగా 71% మంది ప్రజలకు సమతుల ఆహారం అందని ద్రాక్షలా మారింది. పోషకాహార లేమితో వస్తున్న వ్యాధుల కారణంగా ఏటా 17 లక్షల మంది మృత్యువాత పడుతున్నారనే ఆందోళనకర అంశాన్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ), డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్‌ల నివేదిక వెల్లడించింది. వాటి నివేదికలో.. శ్వాసకోశ, గుండె కవాటాల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, స్ట్రోక్‌లు వంటివన్నీ పోషకాహార లోపంతోనే వస్తున్నాయి. మన దేశంలో ప్రజలు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తక్కువగా తింటున్నారు. అదే సమయంలో మాంసం, మాంస ఉత్పత్తులు, చక్కెరతో తయారైన పానీయాలను అధికంగా వినియోగిస్తున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. ఆహారంపై చేస్తున్న ఖర్చు ఒక వ్యక్తి ఆదాయంలో 63% కంటే అధికంగా ఉంటే అది అతనికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని స్థితిగా చెప్పవచ్చు. దీని ప్రపంచ సరాసరి 42% కాగా భారత్‌లో 71% అని తెలిపింది.ఇరవై ఏళ్లపైబడిన వ్యక్తి రోజుకు 200 గ్రాముల పండ్లు తినాల్సి ఉండగా భారత్‌లో 35.8 గ్రాములే తింటున్నారు. కూరగాయలను 300 గ్రాములు తీసుకోవాల్సి ఉండగా 168.7 గ్రామాలే వినియోగిస్తున్నారు. బీన్స్, రాజ్‌మా, చిక్కుడు వంటి గింజ ధాన్యాలను 100 గ్రాములు తినాల్సి ఉండగా 24.9 గ్రాములే తింటున్నారు. బాదం, జీడి పప్పు వంటి గింజలను 25 గ్రాములు తినాల్సి ఉండగా 3.2 గ్రాములే తింటున్నారని నివేదిక తెలిపింది.