క్రీడలు
నీరజ్ చోప్రా 89.94 మీ. జావెలిన్ త్రోతో జాతీయ రికార్డు
ఒలింపిక్ జావెలిన్ త్రో స్వర్ణ విజేత నీరజ్ చోప్రా స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజతం సాధించాడు. డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం. 24 ఏళ్ల నీరజ్ ఇటీవల పావో నుర్మి క్రీడల్లో 89.30మీ త్రోతో జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో అతడు తన తొలి ప్రయత్నంలోనే 89.94 మీటర్ల త్రో చేశాడు. స్వర్ణ విజేత పీటర్స్ అండర్సన్ (గ్రెనెడా) తన మూడో ప్రయత్నంలో 90.31 మీటర్ల త్రో చేశాడు. జర్మనీ ఆటగాడు వెబ్బర్ (89.08 మీ.) కాంస్యం గెలుచుకున్నాడు.
ఇంగ్లాండ్ టీ20, వన్డే కెప్టెన్‌గా బట్లర్
వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఇంగ్లాండ్ టీ20, వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడు 2015 నుంచి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 31 ఏళ్ల బట్లర్ 151 వన్డేల్లో 41.20 సగటుతో 4120 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. బట్లర్ 88 టీ20ల్లో 34.51 సగటుతో 2140 పరుగులు సాధించాడు.
అత్యధిక కాలం పాటు ప్రపంచ నంబర్‌వన్ టీ20 బ్యాటర్‌గా బాబర్ రికార్డు
టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లి రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో ఘనత అందుకున్నాడు. కోహ్లీని వెనక్కినెట్టి అత్యధిక కాలం పాటు ప్రపంచ నంబర్‌వన్ టీ20 బ్యాటర్‌గా అతను రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. గతంలో కోహ్లి 1,013 రోజుల పాటు పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని కాపాడుకున్న బాబర్ ఇప్పుడు కోహ్లీని అధిగమించాడు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన దీపక్ హుడా (47 నాటౌట్, 104) ఏకంగా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకుకు చేరుకున్నాడు.
మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యుడిగా నారంగ్
స్టార్ షూటర్, ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్ మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యుడిగా ఎంపికయ్యాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగమయ్యే క్రీడాకారులను గుర్తించి ఎంపిక చేయడం ఈ సెల్ ప్రధాన విధి. 2024, 2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రీడాకారులను గుర్తించడానికి, ఎంపిక చేయడానికి, వారి ప్రదర్శనలను ఎప్పటికప్పుడు గమనించడానికి ఈ సెల్ పని చేస్తుంది. ప్రస్తుతం టాప్స్ ప్రధాన బృందంలో 117 మంది, డెవలప్‌మెంట్ గ్రూప్‌లో 244 మంది క్రీడాకారులు ఉన్నారు.
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా మహిళా రిఫరీలు
ఖతార్ వేదికగా నవంబర్ 21న ఆరంభం కానున్న ఫుట్‌బాల్ పండుగ ఫిఫా ప్రపంచకప్‌కు ముగ్గురు మహిళా రిఫరీలు ఎంపికయ్యారు. యోషిమి యమాషితా (జపాన్), స్టీఫానీ ఫ్రాపార్ట్ (ఫ్రాన్స్), సలీమా మకాన్‌సంగా (రువాండా) ఈ మెగా టోర్నీలో రిఫరీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిఫాలో మొత్తం 36 మంది మహిళా రిఫరీలు ఉన్నారు. వీరితో పాటు నెజా బాక్ (బ్రెజిల్), కరెన్ దియాజ్ (మెక్సికో), కేథరిన్ నెస్‌బిట్ (అమెరికా) ఫిఫా ప్రపంచకప్‌లో సహాయ రిఫరీలుగా ఎంపికయ్యారు. ప్రపంచకప్‌కు మహిళా రిఫరీలను ఎంపిక చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019లో వన్డే ప్రపంచకప్ గెలిపించి ఇంగ్లాండ్ చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరదించాడు. మోర్గాన్ ఐర్లాండ్ దేశస్థుడు, ఆ జట్టు తరఫునే 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండేళ్లకు పైగా ఐర్లాండ్‌కే ఆడిన మోర్గాన్ 2009లో ఇంగ్లాండ్‌కు మారాడు. కొంత కాలానికే వన్డే, టీ20 జట్లలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆ జట్టు తరఫున 16 టెస్టులు కూడా ఆడాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనే అతడికి పేరొచ్చింది. 248 వన్డేల్లో 7701 పరుగులు చేసిన అతను 115 టీ20ల్లో 2458 పరుగులు రాబట్టాడు. 16 టెస్టుల్లో అతడి పరుగులు 700. వన్డేల్లో 14 సెంచరీలు చేసిన మోర్గాన్ టెస్టుల్లో రెండుసార్లు మూడంకెల స్కోరునందుకున్నాడు. 2019లో ప్రపంచకప్ కలను నెరవేర్చుకుంది. వన్డేలతో పాటు టీ20ల్లోనూ ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగింది.
రంజీ ట్రోఫీలో తొలిసారి ఛాంపియన్‌గా మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీలో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబయిని ఫైనల్లో ఓడించి ట్రోఫీని అందుకుంది. ఆదిత్య శ్రీవాత్సవ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. 108 పరుగుల స్వల్ప ఛేదనలో తడబడినా 29.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ యశ్ దూబె (1) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా మరో ఓపెనర్ హిమాంశు మంత్రి (37), శుభమ్‌శర్మ (30)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రజత్ పటీదార్ (30 నాటౌట్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి 374 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ 536 పరుగులు సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 116, 30 పరుగులు సాధించిన శుభ్‌మ్‌శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా, ఈ సీజన్లో పరుగుల వరద పారించిన ముంబయి బ్యాట్స్‌మన్ సర్ఫ్‌రాజ్‌ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది. చంద్రకాంత్ పండిట్‌కు కోచ్‌గా ఇది అయిదో టైటిల్. అతడి మార్గదర్శనంలోనే విదర్భ రెండేళ్ల పాటు రంజీ, ఇరానీ ట్రోఫీలను గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌కు ఇదే తొలి రంజీ టైటిల్. 1998 - 99 సీజన్లో చివరిగా ఫైనల్‌కు వచ్చి రన్నరప్‌గా నిలిచింది.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నీలో దీపిక బృందానికి రజతం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నీలో దీపిక కుమారి, అంకిత భకత్, సిమ్రన్‌జీత్ కౌర్‌లతో కూడిన భారత రికర్వ్ జట్టు రజత పతకం సాధించారు. ఫైనల్లో భారత్ 1-5తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. ఒక స్వర్ణం, 2 రజతాలు గెలిచిన భారత్ మొత్తం 3 పతకాలతో టోర్నీని ముగించింది. అందులో కాంపౌండ్ విభాగం నుంచే 2 పతకాలు ఉన్నాయి. ఆ రెండింట్లోనూ తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. అభిషేక్‌వర్మతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన సురేఖ, వ్యక్తిగత విభాగంలో రజతంతో మెరిసింది.
ఆర్చరీ ప్రపంచకప్ మిక్స్‌డ్‌లో జ్యోతి జోడికి స్వర్ణం
ప్రపంచకప్ మూడో అంచె పోటీల్లో జ్యోతి సురేఖ ఆర్చరీలో రెండు పతకాలు సాధించింది. అభిషేక్ వర్మతో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో పసిడి నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత జోడీగా సురేఖ - అభిషేక్ రికార్డుల్లోకెక్కారు. ఫైనల్లో ఈ మూడో సీడ్ జంట 152-149 తేడాతో సోఫీ - జీన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. 37-35తో ఆధిక్యంలో నిలిచి పసిడి పట్టేసింది. మరోవైపు కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో సురేఖ త్రుటిలో స్వర్ణాన్ని కోల్పోయింది. పసిడి కోసం గట్టిగా ప్రయత్నించిన ఆమె తుదిపోరులో షూటాఫ్‌లో ఎల్లా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో ఓడింది. దీంతో రజతం నెగ్గింది. ప్రపంచకప్ వ్యక్తిగత విభాగంలో జ్యోతికిదే తొలి పతకం.
కుమార్ సురేంద్ర సింగ్ స్మారక జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనుకు రెండు స్వర్ణాలు
భారత స్టార్ షూటర్ మను బాకర్ సత్తా చాటింది. కుమార్ సురేంద్ర సింగ్ స్మారక జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళలు, జూనియర్ విభాగాల్లో ఆమె స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో 20 ఏళ్ల మను 263.9 స్కోరుతో పసిడి ఎగరేసుకుపోయింది. అర్ష్‌దీప్ (260.5) రజతంతో గెలవగా రాధిక (హరియాణా) కాంస్యం గెలుచుకుంది. జూనియర్ విభాగంలో 249 పాయింట్లతో మను స్వర్ణం సాధించింది. యువిక (252.7) రజతం నెగ్గగా లక్షిత (246.7) కాంస్యం గెలిచింది.
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 104వ ర్యాంకు
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 104 ర్యాంకులో నిలిచింది. తాజా జాబితాలో భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. కోస్టారికా చేతిలో ఓడి ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన న్యూజిలాండ్ (103) భారత్ కన్నా ముందుంది. అయితే ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్ 19వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇరాన్ నంబర్‌వన్ ర్యాంకులో ఉంది. సునీల్ ఛెత్రి సారథ్యంలో భారత్ ఇటీవల ఆసియా కప్ క్వాలిఫికేషన్ టోర్నీలో ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్-డిలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు 24 జట్లు తలపడే ఆసియా కప్‌కు అర్హత సాధించింది. ఓవరాల్ ఫిఫా ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉండగా బెల్జియం, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.
మెకంతాష్‌కు ప్రపంచ టైటిల్
ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కెనడా టీనేజర్ సమ్మర్ మెకంతాష్ అదరగొట్టింది. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో పసిడి సాధించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి 2011 తర్వాత ఈ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో తనకిదే తొలి స్వర్ణం. 2 నిమిషాల 05.20 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ముగ్గురు స్విమ్మర్లను దాటి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లికింగర్ (అమెరికా), జాంగ్ యూఫీ (చైనా) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మరోవైపు 17 ఏళ్ల డేవిడ్ పొపోవిచ్ (రొమేనియా) రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే పురుషుల 200మీ. ఫ్రీస్టైల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన అతను తాజాగా 100 మీ. ఫ్రీస్టైల్‌లోనూ విజేతగా అవతరించాడు. 47.58సె అతను లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి రొమేనియా స్విమ్మర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికా బంగారు చేప కేటీ లెడెకీ పతక వేట కొనసాగుతోంది. మహిళల 4×200 మీ. ఫ్రీస్టైల్ రిలేలో తమ దేశం పసిడి గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. దీంతో సరికొత్త ఛాంపియన్‌షిప్ రికార్డు (7:41.15సె)ను అమెరికా దక్కించుకుంది. ఈ స్వర్ణంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తన పతకాల సంఖ్యను ఆమె 21కి పెంచుకుంది. అందులో 18 బంగారు పతకాలున్నాయి. ఈ పోటీల చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన స్విమ్మర్‌గా తన రికార్డును ఆమె మరింత మెరుగుపర్చుకుంది. రెండో స్థానంలో నటాలీ (19) ఉంది. స్వర్ణాల పరంగా ఆల్‌టైమ్ రికార్డు చూసుకుంటే మైకెల్ ఫెల్ప్స్ (26) తర్వాత ఆమె ర్యాన్ లోచె (18)తో సమానంగా రెండో స్థానంలో ఉంది.
ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రొనాల్డోకు రజతం
దేశ అగ్రశ్రేణి సైక్లిస్ట్ రొనాల్డో సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీల చివరి రోజైన రజతం గెలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత సైక్లిస్ట్‌గా రికార్డు నమోదు చేశాడు. సీనియర్ స్ప్రింట్ విభాగంలో అతను రెండో స్థానంలో నిలిచాడు. కెంటో యమసాకి (జపాన్), ఆండ్రీ (కజకిస్థాన్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. రొనాల్డో ఇప్పటికే 1 కిలోమీటర్ టైమ్ ట్రయల్, టీమ్ స్ప్రింట్‌లో కాంస్యాలు నెగ్గాడు. మరోవైపు 15 కిలోమీటర్ల పాయింట్స్ రేస్‌లో జూనియర్ సైక్లిస్ట్ బిర్జీత్ యమ్నం కంచు పతకం సొంతం చేసుకున్నాడు. 23 పాయింట్లతో అతను మూడో స్థానాన్ని పొందాడు. ఫారుఖ్ (ఉజ్బెకిస్థాన్) పసిడి, సంగ్‌యాన్ లీ (కొరియా) వెండి పతకాలు అందుకున్నారు. 10 కిలోమీటర్ల మహిళల స్క్రాచ్ రేస్‌లో 19 ఏళ్ల చాయానిక గొగోయ్ కాంస్యం కైవసం చేసుకుంది. యూరి కిమ్, కీ ఫురుయామా (జపాన్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. భారత్ రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, 15 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలతో అయిదో స్థానంలో నిలిచింది. జపాన్ (18 స్వర్ణాలు, 7 రజతాలు, 2 కాంస్యాలు), కొరియా (12 స్వర్ణాలు, 14 రజతాలు, 3 కాంస్యాలు) వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దినేశ్ కార్తీక్‌కు 87వ ర్యాంకు
ఫామ్‌లో ఉన్న వెటరన్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంకు సాధించాడు. ఐపీఎల్‌లో రాణించిన కార్తీక్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ మెరిశాడు. భారత్ నుంచి ఇషాన్ కిషన్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో 41.20 సగటుతో 206 పరుగులు చేసిన ఇషాన్ ఒక ర్యాంకు మెరుగుపర్చుకుని ఆరో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఒక్క భారత బౌలర్ కూడా టాప్-10లో లేడు. హేజిల్‌వుడ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి (10వ) స్థానంలో మార్పులేదు. రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రూట్ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో కమిన్స్, అశ్విన్, బుమ్రా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఆసియా అండర్-17 ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లకు టైటిల్ సొంతం
భారత యువ రెజ్లర్లు కిర్గిజ్‌స్థాన్‌లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అండర్-17 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మ్యాట్‌పై చెలరేగి ప్రత్యర్థుల పట్టుపట్టి విజయాలు సాధించిన మన కుర్రాళ్లు ఈ పోటీల్లో నాలుగు స్వర్ణాలు సహా ఎనిమిది పతకాలు సాధించారు. అందులో రెండేసి చొప్పున రజతాలు, కాంస్యాలున్నాయి. ఒక్క రోజే మన రెజ్లర్లు ఫ్రీస్టైల్‌లో మూడు బంగారు పతకాలు, ఓ రజతం, ఓ కాంస్యం గెలిచారు. నింగప్ప (45 కేజీలు), శుభమ్ (48 కేజీలు), వైభవ్ పాటిల్ (55 కేజీలు) తలో పసిడి సాధించారు. ప్రతీక్ దేశ్‌ముఖ్ (110 కేజీలు) వెండి పతకం అందుకున్నాడు. నర్సింగ్ పాటిల్ (51 కేజీలు), సౌరభ్ (60 కేజీలు) చెరో కాంస్యం దక్కించుకున్నారు. దీంతో మొత్తం 188 పాయింట్లతో ఛాంపియన్‌షిప్ టైటిల్ భారత్ ఖాతాలో చేరింది. కజకిస్థాన్ (150), ఉజ్బెకిస్థాన్ (145) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
క్రికెట్‌కు రుమేలి వీడ్కోలు
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రుమేలి ధార్ (బెంగాల్) ఆటకు వీడ్కోలు పలికింది. మూడు ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నట్లు 38 ఏళ్ల రుమేలి ప్రకటించింది. 23 ఏళ్ల కెరీర్‌లో కుడిచేతి వాటం బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్‌తో మంచి ఆల్ రౌండర్‌గా రుమేలి పేరు తెచ్చుకుంది. తన కెరీర్‌లో 4 టెస్టులాడిన ఆమె 236 పరుగులు, 8 వికెట్లు రాబట్టింది. 2006లో చివరి టెస్టు ఆడింది. 78 వన్డేల్లో 961 పరుగులు చేసి 63 వికెట్లు పడగొట్టింది. 2005 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించింది. 2012లో ఆఖరి వన్డేలో బరిలో దిగింది. 18 టీ20 మ్యాచ్‌ల్లో 131 పరుగులు, 13 వికెట్లు రాబట్టింది. 2018లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఊహించని విధంగా 34 ఏళ్ల వయసులో భారత జట్టులో రుమేలి పునరాగమనం చేసింది. అదే ఏడాది ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ ఆడింది.
జాతీయ బదిరుల క్రికెట్ ఛాంప్ ఆంధ్రప్రదేశ్
మొదటి జాతీయ అండర్-19 బదిరుల క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. భారత బదిరుల క్రికెట్ సంఘం (ఐడీసీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 5 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. జూన్ 16 నుంచి 19 వరకు జరిగిన టోర్నీలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల జట్లు బరిలో దిగాయి.
ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్
ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. పోటీల మూడో రోజున మరో రెండు పతకాలు ఖాతాలో చేరాయి. పురుషుల సీనియర్ 1 కిలోమీటర్ టైమ్ ట్రయల్ విభాగంలో కాంస్యం గెలిచిన రొనాల్డో సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించిన సైక్లిస్ట్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటికే ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు ఆసియా రికార్డు కలిగి ఉన్న అతను ఇప్పుడీ ఛాంపియన్‌షిప్‌లోనూ ఫామ్ కొనసాగించాడు. 1:01.798 సెకన్లలో రేసు పూర్తి చేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. యుటా ఒబారా (1:01.118 సె - జపాన్), మహమ్మద్ ఫాదిల్ (1:01.639 సె - మలేసియా) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు పురుషుల జూనియర్ 10 కిలోమీటర్ల రేసులో బిర్జీత్ యమ్నం తృతీయ స్థానంలో నిలిచి కంచు పతకం నెగ్గాడు. కిమ్ (కొరియా) పసిడి, జుల్ఫామి ఐమన్ (మలేసియా) వెండి పతకం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ ఖాతాలో 20 పతకాలున్నాయి.
అండర్-17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళలకు నాలుగు స్వర్ణాలు
అండర్-17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్యాడెట్ మహిళలు నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం గెలుచుకున్నారు. ముస్కాన్ (40 కేజీ), శ్రుతి (46 కేజీ), రీనా (53 కేజీ), సవిత (61 కేజీ) పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు. మాన్సీ బదానా (69 కేజీ) కాంస్యం సాధించింది. గ్రీకో రోమన్‌లో రోనిత్ శర్మ (48 కేజీ) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రదీప్ సింగ్ (110 కేజీ) రజతం, మోహిత్ ఖోకర్ (80 కేజీ) కాంస్యం చేజిక్కించుకున్నారు.
చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ప్రారంభం
ఒలింపిక్స్ తరహాలో చెస్ ఒలింపియాడ్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన జ్యోతి యాత్ర దిల్లీలో మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఒలింపియాడ్ జ్యోతి యాత్రను ప్రారంభించారు. ఈసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు భారతే ఆతిథ్యమివ్వనుంది. జులై 28 నుంచి తమిళనాడులోని మహాబలిపురంలో చెస్ ఒలింపియాడ్ జరగనుంది. ఒలింపిక్స్‌లో మాదిరే ఒలింపియాడ్ సందర్భంగా జ్యోతి యాత్ర చేపట్టాలని ఫిడె ఇటీవలే నిర్ణయించింది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ల సమక్షంలో ప్రధాని జ్యోతిని వెలిగించారు.
కోర్టానె గేమ్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా కోర్టానె గేమ్స్ జావెలిన్ త్రోలో అతడు స్వర్ణం గెలుచుకున్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో అతడు రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)ను ఓడించాడు. 24 ఏళ్ల నీరజ్ తన తొలి ప్రయత్నంలో 86.69 మీటర్లు విసిరాడు. అదే అత్యుత్తమ త్రో అయింది. వాల్కట్ (86.64మీ) రజతం, పీటర్స్ (84.75) కాంస్యం గెలుచుకున్నారు.
జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇషాకి పసిడి
తెలంగాణ షూటింగ్ సంచలనం ఇషా సింగ్ కుమార్ సురేంద్ర స్మారక జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా స్వర్ణం సాధించింది. మను బాకర్, రహి సర్నోబత్ లాంటి స్టార్ షూటర్లను వెనక్కినెట్టి ఆమె టైటిల్ నెగ్గింది. తుది పోరులో ఇషా 30 పాయింట్లు ఖాతాలో వేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. విభూతి (హరియాణా - 23), చింకి యాదవ్ (మధ్యప్రదేశ్ - 17) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు.
ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్స్ వాల్ట్ విభాగంలో ప్రణతి సరికొత్త రికార్డు
భారత స్టార్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్స్ వాల్ట్ విభాగంలో కాంస్యం గెలిచిన ఆమె ఈ పోటీల చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తాజాగా ఆసియా ఛాంపియన్‌షిప్స్ వాల్ట్‌లో తొలి ప్రయత్నంలో 13.400, రెండో ప్రయత్నంలో 13.367 పాయింట్లు సాధించిన ప్రణతి ఓవరాల్‌గా 13.367 స్కోరుతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సియో జియాంగ్ (కొరియా - 14.084), షోకో మియాట (జపాన్ - 13.884) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచారు.
హరికృష్ణకు ప్రేగ్ టైటిల్
గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ప్రేగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో స్పెయిన్ గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ ఆంటోన్‌పై విజయం సాధించిన హరి మొత్తం 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి లీ క్వాంగ్ లీమ్ (వియత్నాం)తో కలిసి అతను 5.5 పాయింట్లతో సమానంగా ఉన్నాడు. కానీ చివరి రౌండ్లో ఉత్తమ ప్రదర్శనతో హరి నెగ్గడంతో ట్రోఫీ సొంతమైంది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ (4) ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆశీర్వాద్‌కు కాంస్యం
ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ జూనియర్ విభాగంలో తెలంగాణ కుర్రాడు ఆశీర్వాద్ సక్సేనా 4 కిలోమీటర్ల టీమ్ పర్స్యూట్‌లో అతను కాంస్యం దక్కించుకున్నాడు. అతనితో పాటు నీరజ్ కుమార్, బిర్జీత్, గుర్నూర్ పూనియాలతో కూడిన భారత జట్టు 4:22.737సె టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. కజకిస్థాన్ స్వర్ణం, కొరియా రజతం గెలుచుకున్నాయి. జూనియర్ విభాగంలో రాష్ట్రం నుంచి పతకం సాధించిన తొలి సైక్లింగ్ క్రీడాకారుడిగా ఆశీర్వాద్ ఘనత సాధించాడు. మరోవైపు పోటీల తొలిరోజు భారత్‌కు ఓ స్వర్ణం సహా మొత్తం 10 పతకాలు దక్కాయి. సాధారణ సీనియర్, జూనియర్ విభాగాల్లో ఓ రజతం, ఆరు కాంస్యాలు. పారా పోటీల్లో ఒక్కో పసిడి, రజతం, కాంస్యం ఖాతాలో చేరాయి. 17 ఏళ్ల తర్వాత ఈ ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్ మహిళల విభాగంలో భారత్ తొలిసారి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ మహిళల 4 కిలోమీటర్ల టీమ్ పర్స్యూట్‌లో భారత్ కాంస్యం దక్కించుకుంది.
వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు
టాప్-4 బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు ఆటగాళ్లు బట్లర్, ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్ శతకాలు సాధించారు. అందులో బట్లర్ 70 బంతుల్లోనే 162 పరుగులు చేసేశాడు. జట్టు స్కోరేమో రికార్డు స్థాయిలో 498/4కు చేరుకుంది. నెదర్లాండ్స్‌తో మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విధ్వంసం సాగిన తీరిది. వన్డేల్లో తన పేరిటే ఉన్న అత్యధిక వన్డే స్కోరు (ఆస్ట్రేలియాపై 2018లో 481/6)ను అధిగమిస్తూ కొత్త రికార్డు నమోదు చేసింది ఇంగ్లిష్ జట్టు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 232 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే జేసన్ రాయ్ (1) వికెట్ కోల్పోయినా ఫిల్ సాల్ట్ (122; 93 బంతుల్లో 14×4, 3×6), డేవిడ్ మలన్ (125; 109 బంతుల్లో 9×4, 3×6) సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది.
‣ ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సిక్సర్లు 26. ఒక వన్డేలో ఓ జట్టు సాధించిన అత్యధిక సిక్సర్ల రికార్డు ఇదే. గత రికార్డు కూడా ఇంగ్లాండ్ (25, అఫ్గానిస్థాన్‌పై 2019లో) పేరిటే ఉంది.
‣ సెంచరీకి బట్లర్ ఆడిన బంతులు 47. ఇంగ్లాండ్ తరఫున మూడు అత్యంత వేగవంతమైన వన్డే శతకాల రికార్డులు అతడి పేరిటే ఉన్నాయి. పాకిస్థాన్‌పై 2015లో 46 బంతుల్లో, 2019లో 50 బంతుల్లో అతను వంద అందుకున్నాడు.
జాతీయ వెటరన్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో రమాబాయ్‌కి స్వర్ణం
106 ఏళ్ల బామ్మ రమాబాయ్ జాతీయ వెటరన్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచింది. ఎలాంటి వయసు నిబంధన లేని ఈ రేసులో ఏమాత్రం తడబడకుండా పరుగెత్తిన ఈ హరియాణా అథ్లెట్ అందరికంటే ముందు పరుగు పూర్తి చేసింది. ఇదే పోటీల్లో 82 ఏళ్ల జగదీష్ శర్మ 100 మీటర్ల పరుగులో రెండో స్థానంలో నిలిచాడు. 3 వేల మీటర్ల రేసులో రమాబాయ్ మనమరాలు షర్మిలా సాంగ్వాన్ కాంస్యం గెలిచింది. గత పన్నెండు నెలలుగా రమాబాయ్ పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటోంది.
తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ (స్ప్రింట్స్)లో 14 పతకాలు
తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ (స్ప్రింట్స్)లో మూడు స్వర్ణాలు సహా మొత్తం 14 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. అందులో నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలున్నాయి. అండర్-12 బాలుర 300 మీ. పరుగులో పి.శుభమ్ పసిడి సాధించాడు. 44.7 సెకన్లలో అతను గమ్యాన్ని చేరుకుని ఛాంపియన్‌గా నిలిచాడు. అండర్-14 బాలికల 400 మీ. పరుగులో మూడు పతకాలు నెగ్గారు. సహస్ర శెట్టి (1:07.9 సె) స్వర్ణం, సాహిత్య (1:11 సె) రజతం, పౌర్ణమి రెడ్డి (1:13.6 సె) కాంస్యం గెలిచారు. అండర్-18 బాలుర 200 మీ. పరుగులో కార్తీక్ బంగారు పతకం సాధించాడు. 22.4 సెకన్ల టైమింగ్‌తో అతను అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
‣ అండర్-20 అమ్మాయిల 100 మీ. పరుగులో లోకేశ్వరి (13.9 సె), నిఖిత (14.3 సె) వరుసగా వెండి, కంచు పతకాలు గెలుచుకున్నారు. అండర్-16 బాలికల 100 మీ. పరుగులో దీపిక (14 సె) రజతం, అఖిల (14.4 సె) కాంస్యం అందుకున్నారు. అండర్-20 మహిళల 400 మీ.పరుగులో హనీ (1:06.5 సె) కాంస్యం; అండర్-16 బాలుర 100 మీ.పరుగులో అభినయ్ నాయక్ (11.9 సె) కాంస్యం; పురుషుల అండర్-20 400 మీ.పరుగులో ఎస్కే షారుక్ (52.4 సె) కాంస్యం; అండర్-14 బాలుర 100 మీ.పరుగులో వికాస్ (11.7 సె) రజతం; పురుషుల 400 మీ.పరుగులో సంజీవ్ (53.3 సె) కాంస్యం.
ఖేలో ఇండియా మహిళల వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను ఖేలో ఇండియా మహిళల వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో స్వర్ణంతో గెలిచింది. అయితే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (స్నాచ్‌లో 88 కేజీలు)ను మాత్రం ఆమె అధిగమించలేకపోయింది. 49 కేజీల విభాగం పోటీలో స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కేజీలు లిఫ్ట్ చేసిన మీరా మొత్తం మీద 191 కేజీలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్ (170 కేజీలు) రజతం గెలవగా, జిల్లి దలాబెహరా (166 కేజీలు) కాంస్యం సొంతం చేసుకుంది.
ఐసీసీ టీ20 బౌలింగ్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్
టీమ్ ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో అడుగుపెట్టాడు. ఐసీసీ ప్రకటించిన జాబితాలో ఇషాన్ 68 స్థానాలు మెరుగై ఏడో ర్యాంకు సాధించాడు. టీమ్‌ఇండియా తరఫున 23 ఏళ్ల ఇషాన్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 14, కెప్టెన్ రోహిత్ శర్మ 16, శ్రేయస్ అయ్యర్ 17, విరాట్ కోహ్లి 21వ స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భువనేశ్వర్ 11, చాహల్ 26వ స్థానాల్లో ఉన్నారు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ రూట్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ 7, కోహ్లి 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 2, బుమ్రా 3వ ర్యాంకులు సాధించారు. ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
89.30 మీ. త్రోతో నీరజ్ చోప్రా జాతీయ రికార్డు
టోక్యో ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్‌లో రజతం గెలుచుకున్నాడు. 89.30 మీటర్లు త్రో చేసిన నీరజ్, తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (87.58)ను బద్దలు కొట్టాడు. 87.58 మీటర్లు విసిరి అతడు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.
ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్‌లో గురుకు స్వర్ణం
యూత్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు సనపతి గురునాయుడు మెక్సికోలోని లెయాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బాలుర 55 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 104 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు ఎత్తిన ఈ 16 ఏళ్ల భారత లిఫ్టర్ మొత్తం మీద 230 కేజీలతో పసిడి సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో స్వర్ణం గెలిచిన తొలి భారత లిఫ్టర్‌గా నిలిచాడు. బాలికల్లో సౌమ్య కాంస్యం దక్కించుకుంది. 45 కేజీల కేటగిరిలో స్నాచ్‌లో 65 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 83 కేజీలు లిఫ్ట్ చేసిన సౌమ్య మొత్తం 148 కేజీలతో మూడో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో భవాని (132 కేజీలు) ఎనిమిదో స్థానం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ నాలుగు పతకాలు గెలుచుకుంది.
ఐశ్వర్య జాతీయ రికార్డు
అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో కర్ణాటక అమ్మాయి ఐశ్వర్య బాబు ట్రిపుల్ జంప్‌లో ఆమె జాతీయ రికార్డు సృష్టించింది. పోటీల్లో ఐశ్వర్య 14.14 మీటర్ల దూరం దూకి మయూఖ జానీ (14.11 మీ, 2011లో) సృష్టించిన రికార్డును తిరగరాసింది. ఈ పోటీల్లో రేణు (13.43 మీ) రజతం, కార్తీక (13.25 మీ) కాంస్యం నెగ్గారు. పురుషుల డిస్కస్‌త్రోలో కృపాల్‌సింగ్ (60.31 మీ) స్వర్ణం గెలుచుకోగా, మహిళల విభాగంలో నవ్‌జీత్ కౌర్ (55.67 మీ) పసిడి పతకం నెగ్గింది.
ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 5వ స్థానం
ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా అయిదో స్థానానికి పడింది. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్ (106), భారత్ (105)ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరింది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 125 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ (124) రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (107) మూడో స్థానంలో కొనసాగుతోంది.
కెనడా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మాన్సి, మనీషాలకు స్వర్ణాలు
కెనడా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మాన్సి జోషి, మనీషా రాందాస్ స్వర్ణాలతో మెరిశారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో మాన్సి 21-18, 15-21, 22-20తో ఒక్సానా కొజీనా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఎస్‌యూ5 సింగిల్స్ ఫైనల్లో మనీషా 27-25, 21-9తో అకియో సుగినో (జపాన్)పై విజయం సాధించింది. ఈ సీజన్లో మాన్సి, మనీషా సింగిల్స్ టైటిల్స్ గెలవడం ఇది నాలుగోసారి. టోక్యో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ రజతం నెగ్గాడు.
ఖేలో ఇండియా క్రీడల్లో అంజనీకుమార్‌కు రజతం
పంచకులలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజనీకుమార్ 63.5-67 కేజీల కేటగిరీ బాలుర విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు పసిడి, నాలుగు రజత, అయిదు కాంస్య పతకాలు లభించాయి.
వెర్‌స్టాపన్‌దే అజర్‌బైజాన్ జీపీ టైటిల్
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెదర్లాండ్స్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ చేజిక్కించుకున్నాడు. తుది రేసులో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఈ రెడ్‌బుల్ డ్రైవర్ సమీప ప్రత్యర్థి, రెడ్‌బుల్ సహచరుడు సెర్గియో పెరెజ్‌ను వెనక్కి నెట్టి టైటిల్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఫార్ములావన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానాన్ని వెర్‌స్టాపెన్ (150 పాయింట్లు) మరింత పదిలం చేసుకున్నాడు. సెర్గియో పెరెజ్ (129) అతడి తర్వాత స్థానంలో ఉన్నాడు.
భారత్ లిఫ్టర్లకు రెండు రజతాలు
ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు సత్తా చాటారు. మెక్సికోలోని లెయాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆకాంష కిశోర్ (40 కేజీలు), విజయ్ ప్రజాపతి (49 కేజీలు) రజతాలతో మెరిశారు. 40 కేజీల విభాగంలో స్నాచ్‌లో 59 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 68 కేజీలు ఎత్తిన ఆకాంష.. మొత్తం మీద 127 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. 49 కేజీల కేటగిరిలో స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 97 కేజీలు లిఫ్ట్ చేసిన విజయ్ ఓవరాల్‌గా 175 కేజీలు ఎత్తి రెండో స్థానం సాధించాడు.
వ్రితి అగర్వాల్‌కు పసిడి
ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ మరోసారి సత్తా చాటింది. హరియాణాలో జరుగుతున్న ఈ క్రీడల్లో స్విమ్మింగ్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఆమె స్వర్ణం గెలుచుకుంది. 18 నిమిషాల 1.45 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఖేలో ఇండియా రికార్డు (18 నిమిషాల 31 సెకన్లు)ను వ్రితి అధిగమించింది. ఈ క్రీడల్లో ఆమెకు ఇది రెండో స్వర్ణం మొత్తం మీద మూడో పతకం. 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పసిడి గెలిచిన వ్రితి 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో కాంస్యం సొంతం చేసుకుంది.
ఐశ్వర్యకు లాంగ్ జంప్ స్వర్ణం
జాతీయ అంతర్ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో కర్ణాటక అమ్మాయి మెరిసింది. 6.73 మీటర్లు దూకి స్వర్ణం గెలుచుకుంది. లాంగ్ జంప్‌లో ఓ భారత మహిళ చేసిన రెండో అత్యుత్తమ ప్రదర్శన ఇది. జాతీయ రికార్డు అంజు బాబి జార్జ్ (6.83 మీటర్లు) పేరిట ఉంది. ఐశ్వర్య.. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నిర్ణయించిన కామన్వెల్త్ క్రీడల అర్హత ప్రమాణాల (6.50మీ) కన్నా మెరుగ్గా రాణించింది. మరోవైపు మహిళల 100 మీ పరుగులో జాతీయ రికార్డు స్థాపకురాలు, తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి విఫలమైంది. చివరి హర్డిల్ తగిలి కింద పడిపోయింది. తమిళనాడుకు చెందిన కనిమొళి స్వర్ణం (13.62 సెకన్లు) సాధించింది. మహిళల జావెలిన్ త్రోలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ను రాణి (60.97మీ) విజేతగా నిలిచింది.
భారత 74వ జీఎంగా రాహుల్ ఘనత
తెలంగాణ కుర్రాడు రాహుల్ శ్రీవాత్సవ్ చదరంగంలో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. మూడేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ జీఎం హోదా సాధించాడు. 2019లోనే అతను మూడు జీఎం నార్మ్‌లు గెలిచినప్పటికీ ఎలో రేటింగ్ 2500 కంటే తక్కువ ఉండడంతో గ్రాండ్‌మాస్టర్ కాలేకపోయాడు. ఇప్పుడు ఇటలీలో జరిగిన కతోలిక చెస్ ఫెస్టివల్‌లో భాగంగా ఎనిమిది రౌండ్లో జార్జియా గ్రాండ్‌మాస్టర్ లెవాన్‌తో గేమ్‌ను డ్రా చేసుకోవడంతో తన రేటింగ్ 2500కు చేరింది. దీంతో జీఎం ఘనత సొంతమైంది. అతని ఖాతాలో మొత్తం అయిదు జీఎం నార్మ్‌లున్నాయి. చెస్‌లో అత్యున్నత ఘనత అయిన గ్రాండ్‌మాస్టర్ కావాలంటే మూడు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్ ఉండాలి. ఆరు పాయింట్లు సాధించాడు. భారత 74వ జీఎంగా అతను నిలిచాడు. తెలంగాణ నుంచి అర్జున్ ఇరిగేశి, హర్ష భరత్‌కోటి, రాజా రిత్విక్ తర్వాత నాలుగో జీఎంగా రికార్డు సృష్టించాడు.
ఖేలో ఇండియా క్రీడల్లో నిత్యకు కాంస్యం
ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ శ్రీనిత్య సరికొత్త రికార్డు సృష్టించింది. 13 ఏళ్ల వయసులోనే కాంస్యం గెలిచిన ఆమె ఈ క్రీడల్లో రాష్ట్రం తరపున పతకం గెలిచిన అతిపిన్న వయస్సు స్విమ్మర్‌గా నిలిచింది. అండర్-18 అమ్మాయిల 200మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది. 2:28.37 సెకన్లలో ఆమె రేసు ముగించింది. రిధిమ (కర్టాటక), పలక్ (మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలిచారు.
అవనికి మరో పసిడి
ప్రపంచ షూటింగ్ పారా స్పోర్ట్ ప్రపంచ కప్‌లో భారత సంచలన పారా షూటర్ అవని లెఖరా జోరు కొనసాగుతోంది. ఆమె మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల ఆర్8 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్1 విభాగంలో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో 458.3 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వెరోనికా (456.6 - స్లోవేకియా), నార్మన్ (441.9 - స్వీడన్) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. ఇప్పటికే అవని మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1లో పసిడి నెగ్గి 2024 పారాలింపిక్స్ కోటా సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు పీ2 మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం గెలిచింది. ఫైనల్లో ఆమె 213.1 పాయింట్లు రాబట్టిన ఆమె వరుసగా రెండో రోజూ పతకం నెగ్గింది. టర్కీ షూటర్లు ఐసెల్ (240), పెలివాన్లర్ (236.7) వరుసగా స్వర్ణ, రజత పతకాలు అందుకున్నారు.
హిమదే 100 మీటర్ల పసిడి
జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ అథ్లెట్ హిమదాస్ సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగులో ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది. ఫైనల్లో హిమ 11:43 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో జాతీయ రికార్డు కలిగి ఉన్న మరో స్టార్ ద్యుతిచంద్ (11.44 సె) రెండో స్థానంలో నిలిచింది. శ్రాబనీ నందా (11.53 సె) కాంస్యం సొంతం చేసుకుంది. అయితే కామన్వెల్త్ క్రీడల అర్హత మార్కు (11.31 సె) అందుకోవడంలో ఈ ముగ్గురు విఫలమయ్యారు. పురుషుల 100 మీటర్ల పరుగులో అమ్లాన్ బోర్గోహెయిన్ స్వర్ణం గెలిచాడు. అతడు 10.47 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. ఇలక్కియదాసన్ (10.48సె) రజతం గెలవగా, హర్జిత్‌సింగ్ (10.55 సె) కాంస్యం నెగ్గాడు. 31 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ కూడా మెరిసింది. షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ 18.06 మీటర్ల దూరం గుండును విసిరి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (17.76 మీ)ను తిరగరాసింది. అంతేకాదు కామన్వెల్త్ క్రీడల మార్కు (17.76 మీ) కూడా అందుకుంది. పురుషుల లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్ (8.23 మీ) స్వర్ణం గెలవడమే కాక కామన్వెల్త్ మార్కు కూడా అందుకున్నాడు.
పారా షూటింగ్ ప్రపంచకప్‌లో రాహుల్‌కు రెండు స్వర్ణాలు
పారా షూటింగ్ ప్రపంచకప్‌లో రాహుల్ జాకడ్ మెరిశాడు. 10మీ. మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పసిడి సాధించిన అతడు టీమ్ కేటగిరిలోనూ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల పిస్టల్ ఫైనల్లో రాహుల్ (367) మన దేశానికే చెందిన రుబీనా ఫ్రాన్సిస్ (355)పై గెలిచి పసిడి దక్కించున్నాడు. ఎయిర్‌పిస్టల్ టీమ్ విభాగంలో దీపేందర్ సింగ్, ఆకాశ్‌తో కలిసి రాహుల్ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. 2019లో క్రొయేషియాలో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌లో స్వర్ణం గెలిచిన 35 ఏళ్ల రాహుల్ టోక్యో పారాలింపిక్స్‌లో 25 మీటర్ల పిస్టల్‌లో అయిదో స్థానంలో నిలిచాడు.
పారా ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు రజతం
ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారా ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్ ఖాతాలో రజతం చేరింది. మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో మనీష్ నర్వాల్, సింగరాజ్, ఆకాశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 1581 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా (1628) స్వర్ణం గెలవగా, టర్కీ (1565) కాంస్యం సాధించింది.
అతివల క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు
మహిళల క్రికెట్‌కు భారత టెస్టు, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ఆటకు టాటా చెప్పింది. 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతూ అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడిన 39 ఏళ్ల మిథాలీ 232 వన్డేల్లో 7805 పరుగులు చేసింది. ఆమె 89 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడింది. కేవలం 12 టెస్టులే ఆడినా ఓ డబుల్ సెంచరీ చేసింది. ఆ ఘనత సాధించిన ఏకైక భారత మహిళ మిథాలీనే. ఆమె 2019లో టీ20 క్రికెట్ నుంచి రిటైరైంది.
‣ మిథాలీ సారథ్యంలోని భారత జట్టు వరుసగా నాలుగు ఆసియా కప్ టైటిళ్లు సాధించింది. 2005 - 06, 2006 - 07, 2008, 2012లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. ఇక టెస్టుల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. 2014లో ఇంగ్లాండ్‌లో భారత్‌కు ప్రత్యర్థిపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని అందించింది.
‣ మిథాలీ రాజ్ ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడింది. ఈ టోర్నీలో వరుసగా ఏడు అర్ధ శతకాలు సాధించిన రికార్డు ఆమె సొంతం. రెండు ప్రపంచకప్పుల్లో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ఏకైక (పురుషులు లేదా మహిళలు) భారత క్రికెటర్ ఆమెనే. ఆమె నాయకత్వంలో భారత్ 2005, 2017 ప్రపంచకప్పుల్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 2017 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన దేశంలో మహిళల క్రికెట్‌కు గొప్ప ఊతాన్నిచ్చింది.
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ బ్యాటర్ మిథాలీరాజ్ ఏడో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆమె 686 పాయింట్లతో ఏడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 669 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకు సాధించింది. ఈ విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలీసా హీలీ (785) అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాట్ సీవర్ (750, ఇంగ్లాండ్), బెత్ మూనీ (748, ఆస్ట్రేలియా), లారా వోల్వార్ట్ (722, దక్షిణాఫ్రికా), మెగ్ లానింగ్ (710, ఆస్ట్రేలియా) తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. బౌలర్లలో వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (663 పాయింట్లు) అయిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ విభాగంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎకీల్‌స్టోన్ (771) అగ్రస్థానంలో ఉండగా షబ్నమ్ ఇస్మాయిల్ (732, దక్షిణాఫ్రికా), జెస్ జాన్సన్ (725, ఆస్ట్రేలియా), మెగాన్ షట్ (722, ఆస్ట్రేలియా) తర్వాత ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్లలో దీప్తిశర్మ (249) ఏడు, జులన్ గోస్వామి (217) పది స్థానాలు సాధించారు. నటాలి సీవర్ (393) టాప్ ర్యాంకులో ఉంది.
ఖేలో ఇండియా క్రీడల్లో అభిషేక్‌కు కాంస్యం
ఖేలో ఇండియా క్రీడల్లో హరియాణాలోని పంచకులలో జరుగుతున్న పోటీల్లో అభిషేక్ 400 మీ. పరుగులో కాంస్యం సాధించాడు. అతను 49.08 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచాడు. సాయ్ - గోపీచంద్ మైత్రాకు చెందిన రజిత, శిరీష 400 మీ. పరుగులో వరుసగా స్వర్ణం, కాంస్య నెగ్గారు. రజిత 56.02 సెకన్లలో, శిరీష 58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఖేలో ఇండియా 2022లో నిష్కాకు రజతం, నిఖిల్‌కు కాంస్యం
ఖేలో ఇండియా 2021 యూత్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో నిష్కా అగర్వాల్ రజతం గెలవగా, రెజ్లింగ్‌లో నిఖిల్ యాదవ్ కాంస్యం సొంతం చేసుకున్నాడు. అండర్-18 బాలికల ఆర్టిస్టిక్ అన్‌ఈవెన్ బార్స్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో నిష్కా రెండో స్థానంలో నిలిచింది. ఆయుషి (ఉత్తరప్రదేశ్), సానిక (మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గారు. అండర్-18 బాలుర ఫ్రీస్టైల్ 60 కేజీల విభాగంలో నిఖిల్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. రవిందర్, అజయ్ (మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు.
14వ ఫ్రెంచ్ టైటిల్ విజేత రఫెల్ నాదల్
రఫెల్ నాదల్‌దే ఫ్రెంచ్ ఓపెన్. ఫైనల్లో 6-3, 6-3, 6-0తో నార్వే కుర్రాడు కాస్పర్ రూడ్‌పై అలవోకగా విజయం సాధించాడు. మ్యాచ్‌లో నాదల్ 37 విన్నర్లు కొట్టగా రూడ్ 16 విన్నర్లే కొట్టాడు. నాదల్ తొలిసారి 19 ఏళ్ల వయసులో, 2005లో ఇక్కడ విజేతగా నిలిచాడు. ఎవరూ కూడా నాదల్ (14 ఫ్రెంచ్ టైటిళ్లు) కన్నా ఎక్కువసార్లు ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విజేతగా నిలవలేదు. ఇతర దిగ్గజాలు ఫెదరర్, జకోవిచ్ కన్నా అతడిప్పుడు రెండు టైటిళ్లు ముందున్నాడు. రఫా తన తొలి టైటిల్‌ను కూడా జూన్ 5 (2005)నే సాధించడం విశేషం.
అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్‌లో జ్యోతికకు స్వర్ణం
అంతర్జాతీయ స్ప్రింట్, రిలే కప్ అథ్లెటిక్స్ పోటీల్లో తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ టర్కీలో జరుగుతున్న ఈ టోర్నీలో జ్యోతిక శ్రీ స్వర్ణ పతకం సాధించింది. మహిళల 400 మీటర్ల పరుగును జ్యోతిక శ్రీ 53.47 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది.
భారత్‌దే హాకీ ఫైవ్స్ టైటిల్
ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 6-4 గోల్స్‌తో పోలెండ్‌ను ఓడించింది. తొలి అయిదు నిమిషాల్లోనే పోలెండ్ 3 గోల్స్ చేసి ఆధిక్యంలోకి వెళ్లగా 8, 9 నిమిషాల్లో సంజయ్, గురీందర్ గోల్స్ చేసి జట్టును ప్రత్యర్థి స్కోరుకు సమీపంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత బాబి సింగ్ (11, 17 ని), రహీల్ (13, 19వ ని) రెండేసి గోల్స్ కొట్టి భారత్‌ను గెలిపించారు. టోర్నీలో స్విట్జర్లాండ్‌ను 4-3తో ఓడించిన భారత్, పాకిస్థాన్‌తో 2-2తో డ్రా చేసుకుని ఆపై మలేసియాను 7-3తో ఓడించింది.
ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వైటెక్
పోలెండ్ అమ్మాయి ఇగా స్వైటెక్‌దే ఫ్రెంచ్ ఓపెన్. ఫైనల్లో 6-1, 6-3తో కొకో గాఫ్‌పై అలవోకగా విజయం సాధించింది. ఫిబ్రవరి నుంచి ఓటమనేదే తెలియని స్వైటెక్‌కు ఇది వరుసగా 35వ విజయం. ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన స్వైటెక్ మ్యాచ్‌లో 18 విన్నర్లు కొట్టింది. స్వైటెక్ ఇక్కడ 2020లో కూడా టైటిల్ సాధించింది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వప్నిల్ జోడీకి స్వర్ణం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వప్నిల్ కుశాలె - అషి చౌక్సి జంట అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న టోర్నీలో 50 మీటర్ల రైఫిల్ త్రిపొజిషన్స్ విభాగంలో పసిడి సాధించారు. దీంతో మొత్తం మీద రెండు స్వర్ణాలు, మూడు రజతాలతో భారత్ రెండో స్థానంతో ఈ టోర్నీని ముగించింది.
యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీ
రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత రెజ్లర్ సాక్షి మలిక్ దాదాపు అయిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో సాక్షి 62 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. సాక్షి ఫైనల్లో 7-4తో స్థానిక అమ్మాయి కుజెనొత్సోవాను ఓడించింది. 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత ఒక అంతర్జాతీయ టోర్నీలో పసిడి గెలవడం సాక్షికి ఇదే తొలిసారి. మరోవైపు ఇదే టోర్నీలో మాన్సి (57 కేజీలు), దివ్య కక్రాన్ (68 కేజీలు) కూడా పసిడి నెగ్గారు. తుది పోరులో మాన్సి 3-0తో తిస్సినా (కజకిస్థాన్)పై గెలిచింది. 76 కేజీల విభాగంలో పూజ కాంస్యం నెగ్గింది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్‌లో అంజుంకు రజతం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో అంజుం మౌద్గిల్ అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల వ్యక్తిగత 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్స్‌లో రజతం సొంతం చేసుకుంది. స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్ ఇబ్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. క్వాలిఫయింగ్ స్టేజ్-1లో 587 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి స్టేజ్-2కు అర్హత సాధించిన అంజుం స్టేజ్-2లో 406.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. పురుషుల టీమ్ త్రిపొజిషన్స్‌లో స్వప్నిల్, దీపక్ కుమార్, గోల్డీ గుర్జార్‌తో కూడిన భారత జట్టు రజతం సాధించింది. పసిడి పోరులో భారత్ 7-17తో క్రొయేషియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక స్వర్ణం, మూడు రజతాలతో భారత్ మూడో స్థానంలో ఉంది.
శ్రీలంక బౌలింగ్ వ్యూహ కోచ్‌గా మలింగ
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు దిగ్గజ పేసర్ లసిత్ మలింగ శ్రీలంక బౌలింగ్ వ్యూహ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో లంక బౌలర్లకు మైదానంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై మలింగ అవగాహన కల్పిస్తాడని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఆస్ట్రేలియాతో లంక మూడు టీ20లు, అయిదు వన్డేల్లో తలపడనుంది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్‌లో స్వప్నిల్‌కు రజతం
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్‌లో భారత ఆటగాడు స్వప్నిల్ కుశాలె పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 ప్రొజిషన్‌లో రజత పతకం నెగ్గాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో స్వప్నిల్ 10-16తో సెర్హీ కులిష్ (ఉక్రెయిన్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచకప్‌లో వ్యక్తిగత విభాగంలో స్వప్నిల్‌కు ఇదే మొదటి పతకం.
ఆసియా కప్ పురుషుల హాకీ 2022
ఆసియా కప్ టోర్నీ కంచు పతక పోరులో భారత పురుషుల హాకీ జట్టు 1-0 తేడాతో జపాన్‌పై గెలిచింది. 20వ నిమిషంలో ప్రత్యర్థికి లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను భారత డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. మరో గోల్ చేసే అవకాశం భారత్‌కు తృటిలో తప్పిపోయింది. చాలా దగ్గర నుంచి రాజ్‌కుమార్ కొట్టిన బంతి గోల్‌పోస్టుపై నుంచి వెళ్లింది. ఆఖర్లో జపాన్ వేగం పెంచి ఒత్తిడి చేసినప్పటికీ భారత్ పట్టు వదలకుండా విజయాన్ని అందుకుంది. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియా 2-1తో మలేసియాను ఓడించి రికార్డు స్థాయిలో అయిదో సారి టైటిల్ సొంతం చేసుకుంది.