సైన్స్ అండ్ టెక్నాలజీ
పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మొదటిసారిగా పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) నాలుగో దశ భూమి చుట్టూ తిరుగుతూ ఉండేలా నూతన సాంకేతికతను రూపొందించి శాస్త్రవేత్తలు తమ సత్తా చాటారు. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి53 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఇది సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. అనంతరం మొదటిసారిగా పీఎస్4 (నాలుగోదశ) భూమి చుట్టూ తిరగనుంది. ఇందుకుగాను ఎన్‌జీసీ వ్యవస్థను ఉపయోగించి వైఖరి స్థిరీకరణ చేయనున్నారు. అది కక్ష్యలోనే తిరుగుతూ అక్కడే శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనుంది. శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించిన నూతన సాంకేతికతను పొందుపరిచారు. మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని సమకూర్చుకుని వివిధ పరిశోధనలు చేపడుతుంది.లక్షిత విమానం అభ్యాస్ పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హెచ్‌ఈఏటీ) విమానం ‘అభ్యాస్’ గగనతల పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరం చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో దీన్ని పరీక్షించారు. క్షిపణుల గగనతల పరీక్షల్లో లక్ష్యంగా వినియోగించడానికి వీలుగా డీఆర్డీవోలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ విభాగం అభ్యాస్‌ను రూపొందించింది. ఐటీఆర్‌లో భూ ఆధారిత కంట్రోలర్ నుంచి ముందుగా నిర్దేశించిన, తక్కువ ఎత్తు ఉన్న మార్గంలో ఈ విమానం దూసుకెళ్లింది. రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు సహా, వివిధ సెన్సర్ల ద్వారా దీని పనితీరును పరిశీలించారు. ఈ విమానం స్వయం నిర్దేశితంగా పనిచేసేలా రూపొందించారు.ట్యాంక్ విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని కేకే రేంజ్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు, సైనికాధికారులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అర్జున్ యుద్ధ ట్యాంకు నుంచి ఈ పరీక్షను చేపట్టారు. తక్కువ దూరంలోని లక్ష్యాలను ఇది కచ్చితత్వంతో ఛేదిస్తుందని అధికారులు తెలిపారు.బొగ్గు గని వ్యర్థ జలాలకు ఐఐటీ గువాహటి పరిష్కారం
బొగ్గు గనుల నుంచి వెలువడే ఆమ్ల మిళిత వ్యర్థ జలాల్లోని ఇనుము, సల్ఫేట్, విషపూరిత భార లోహాలు పర్యావరణానికి తీరని హాని కలిగిస్తున్నాయి. ఈ వ్యర్థ జలాలను యాసిడ్ మైన్ డ్రైనేజ్ (ఏఎండి) అంటారు. ఈ సమస్యను జీవ రసాయనాలతో పరిష్కరించే పద్ధతిని గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు కనిపెట్టారు. ఏఎండితో కూడిన వ్యర్థ జలాలను నేరుగా గని నుంచే తొలగించి శుద్ధి చేసే పద్ధతిని ప్రయోగాత్మకంగా రూపొందించింది.మెదడు పనితీరును వేగంగా సమీక్షించే ఐఐఎస్ నవ సాంకేతికత
మానవ మెదడులోని నరాల వ్యవస్థను క్షుణ్ణంగా సమీక్షించే జీపీయూ ఆధారిత మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్) రూపొందించింది. రెగ్యులరైజ్డ్, యాక్సిలరేటెడ్, లీనియర్ ఫేసికల్ ఎవాల్యుయేషన్ (రియల్ లైఫ్)గా పిలిచే ఈ అల్గారిథమ్ మానవ మెదడులో నిత్యం ఉత్పన్నమయ్యే విద్యుదీకరణ కదలికల డేటాను ప్రస్తుత విధానంతో పోలిస్తే 150 రెట్ల వేగంగా నమోదు చేయగలదు. జీపీయూ ఆధారిత అల్గారిథమ్‌తో నిమిషాల్లోనే సమీక్షించవచ్చని ఐఐఎస్‌సీ సెంటర్ ఫర్ న్యూరోసైన్స్ (సీఎన్‌ఎస్) అసోసియేట్ ఆచార్య దేవరాజ్ శ్రీధరన్ తెలిపారు.
‣ మానవ మెదడు నరాల వ్యవస్థలోని ఆక్సాన్లు ఒకచోట నుంచి మరోచోటకు వడివడిగా సంచరించే వేగాన్ని బట్టి మెదడు పనితీరును నిర్ణయిస్తారు. వీటిని ప్రస్తుతం డిఫ్యూజన్ మ్యాగ్నటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (డీఎంఆర్‌ఐ) స్కాన్ ద్వారా కంప్యూటరైజ్ చేసి వైద్య నివేదికలు రూపొందిస్తారు. స్కానర్ల నుంచి సీపీయూలోకి మార్చే సమయాన్ని ఈ అల్గారిథమ్ ద్వారా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ అల్గారిథమ్‌ల తయారీ కోసం 200 మంది మెదళ్లను సమీక్షించామన్నారు.
పర్వత ప్రాంతాల్లో మొక్కల కోసం హీటింగ్ వ్యవస్థ
పర్వత ప్రాంతాల్లో మొక్కలకు ప్రయోజనం కల్పించే వినూత్న వ్యవస్థను కాన్పుర్ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొక్కల వేర్లను వేడి చేయడానికి సౌరశక్తి సాయంతో పనిచేసే హీటింగ్ వ్యవస్థను రూపొందించారు. లద్దాఖ్ వంటి చోట్ల తాజా కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల కొరతను తీర్చడానికి ఇది దోహదపడుతుంది. ఈ టెక్నాలజీకి పేటెంట్ కూడా మంజూరైంది. సేంద్రియ వ్యర్థాల సమర్థ నిర్వహణకు మరో వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
‣ ఎత్తయిన ప్రాంతాల్లో తాజా కూరగాయల లభ్యత, సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీన్ని అధిగమించడానికి కాన్పుర్ ఐఐటీ పరిశోధకులు పాలీహౌస్‌లో కూరగాయల మొక్కలను నాటారు. నేల లోపల.. మొక్కల వేర్ల వద్ద జీఐ గొట్టాలను ఏర్పాటు చేశారు. సౌరశక్తి సాయంతో వేడిచేసిన నీటిని ఈ పైపుల గుండా పంపారు. ఫలితంగా నేల వేడెక్కింది. ఈ వ్యవస్థ వల్ల పుడమి ఉష్ణోగ్రత 7-18 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా పెరిగాయని వివరించారు. ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే ప్రాంతాలనూ దృష్టిలో పెట్టుకొని దీన్ని అభివృద్ధి చేశామన్నారు.
తారు రోడ్డుపైనా నీరు ఇంకిపోతుంది!
వర్షాలు బాగా కురిస్తే మట్టి రోడ్లపై నిలిచిన నీరు భూమిలోకి ఇంకినట్టు తారు, సిమెంటు రోడ్లపై ఇంకదు. ఈ సమస్యకు వరంగల్ ఎన్‌ఐటీ సివిల్ ఇంజినీరింగ్ పరిశోధక విద్యార్థి గుమ్మడి చిరంజీవి, ప్రొఫెసర్ ఎస్.శంకర్ మార్గదర్శనంలో ప్రత్యామ్నాయం చూపారు. పోరస్ తారు రహదారిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ఆ రోడ్డుపై భారీ వర్షాలు కురిసినా వెంటవెంటనే నీరు ఇంకిపోతుంది. లోపలున్న మరికొన్ని పొరల్లో చేరి నిదానంగా పక్కనున్న డ్రెయిన్లలోకి వెళ్తుంది. వర్షం ద్వారా వచ్చే చెత్తా చెదారాన్ని వడకట్టి నీటిని మాత్రమే లోనికి పంపేంత సూక్ష్మ రంధ్రాలతో తారు, సిమెంటును రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. త్వరలో ఎన్‌ఐటీ క్యాంపస్‌లో 50 మీటర్ల మేర ఈ విధానంలో రహదారిని నిర్మిస్తామని ఈ పరిశోధనకు గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ శంకర్ తెలిపారు.
తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్‌వేర్‌కు పేటెంట్
తెలుగును సంస్కృతంలోకి అనువదించే సాఫ్ట్‌వేర్‌కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది. దీన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రొఫెసర్ తియ్యబిండి కామేశ్వరరావు అభివృద్ధి చేశారు. ఆయన గుంటూరులోని వీవీఐటీ కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్నారు. తాను రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై కేంద్రానికి 2016లో దరఖాస్తు చేయగా ఇటీవల పేటెంట్ అనుమతి వచ్చింది. ఇదే సాంకేతికతను ఆధారంగా చేసుకుని సంస్కృతాన్ని మరిన్ని భాషల్లోకి అనువదించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రెండో పరిశోధనగా సంస్కృతాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసే సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నామన్నారు.
వీఎల్-ఎస్‌ఆర్‌శామ్ పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి క్షిపణి ‘వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్’ (వీఎల్-ఎస్‌ఆర్‌శామ్)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అస్త్రాన్ని ఒడిశాలోని సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్)కు చేరువలోని ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించారు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు లక్ష్యాలను పేల్చివేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల గగనతలంలో పొంచి ఉన్న ముప్పుల నుంచి భారత యుద్ధనౌకలను మరింత మెరుగ్గా రక్షించేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. తాజా ప్రయోగంలో వేగంగా కదిలే ఒక మానవరహిత విమానాన్ని వీఎల్-ఎస్‌ఆర్‌శామ్ నేలకూల్చింది. ప్రయోగానంతరం క్షిపణి ప్రయాణమార్గాన్ని టెలిమెట్రీ పర్యవేక్షణ సాధనాలతో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. పరీక్ష లక్ష్యాలన్నీ నెరవేరాయని వారు తెలిపారు. మన నౌకాదళానికి ఈ క్షిపణి కొత్త బలమవుతుందని డీఆర్‌డీవో అధిపతి సతీశ్ రెడ్డి తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు.
వ్యక్తిగత ఏరియల్ వాహనాల డిజైన్లపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధన
రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. వేగంగా దూసుకెళ్దామంటే కుదరని పరిస్థితి. దీంతో ప్రధాన నగరాల్లో వ్యక్తిగత ఏరియల్ వాహనాలను వినియోగంలోకి తెచ్చే అంశమై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌లోని డిజైన్ డిపార్ట్‌మెంట్ ఈ వాహనాల ఆకృతులు ఎలా ఉంటే సమర్థంగా వినియోగించుకోవచ్చనే విషయమై కసరత్తు చేస్తోంది. పరిశోధక విద్యార్థి ప్రియబత్ర రౌత్రే ఇందులో కీలకంగా ఉన్నారు. ప్రయాణించడానికి సాంకేతికంగా అనువుగా ఉండటంతో పాటు చక్కని రూపు, ఆకట్టుకునే ఆకృతి ఉండేలా ఆయన మొత్తం 28 డిజైన్లను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఈ అంశమై చేపట్టిన సర్వేల ఫలితాలను వాడుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఆకృతులను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రియబత్ర రౌత్రే ఐఐటీ హైదరాబాద్, ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్ విశ్వవిద్యాలయాల్లో సంయుక్త పీహెచ్‌డీ కొనసాగిస్తున్నారు.
నిర్ణీత కక్ష్యలోకి జీశాట్-24 ఉపగ్రహం
మన దేశానికి చెందిన జీశాట్-24 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. పలు సాంకేతిక కారణాలతో నిర్దేశిత సమయం కన్నా 47 నిమిషాలు ఆలస్యంగా ఈ ప్రయోగం జరిగింది. ఉపగ్రహాన్ని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపకల్పన చేశారు. ఇది కేయూ-బ్యాండ్ కలిగిన 4,180 కిలోల బరువుగల కమ్యూనికేషన్స్ ఉపగ్రహం. అధిక నాణ్యత గల టెలివిజన్, టెలీకమ్యూనికేషన్స్ ప్రసార సేవలను అందిస్తుంది. డైరెక్ట్-టు-హోమ్ సేవలు అందిస్తున్న టాటా ప్లే ప్రసారాలకు కావలసిన పూర్తి సేవలను ఈ ఉపగ్రహం అందించనుంది.
ఒక్క ఎమ్మారై స్కాన్‌తో అల్జీమర్స్ గుర్తింపు
ఒక్క ఎమ్మారై స్కాన్‌తో అల్జీమర్స్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించొచ్చని ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి అల్జీమర్స్‌తో సంబంధం లేని ప్రాంతాలు సహా మెదడు నిర్మాణ లక్షణాలను కూడా వీరు పరిశీలించగలిగారు. ఈ వ్యాధి నిర్ధారణే సవాలుగా ఉన్న దశలో ఈ నూతన ప్రక్రియ వైద్యులకు ఎంతో మేలు చేయనుంది. ఆరంభ దశలో వ్యాధి గుర్తింపునకు ఉపకరించనుంది. అల్జీమర్స్ రోగుల్లో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఆలోచనా శక్తి కూడా దెబ్బతింటుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ప్రారంభ రోగనిర్ధారణే కీలకం. దాన్ని అనుసరించి వ్యాధి లక్షణాలు పెరగకుండా చికిత్స చేయాలి. తాజా అధ్యయనంలో.. ఎమ్మారై మెషిన్ లెర్నింగ్ వ్యవస్థ రోగికి అల్జీమర్స్ వ్యాధి ఉందో లేదో అన్న విషయాన్ని 98% కేసుల్లో కచ్చితంగా అంచనా వేయగలదని తేలింది. 79% రోగుల్లో ఇది అల్జీమర్స్ ప్రారంభ, చివరి దశల మధ్య తేడాను కూడా గుర్తించడం విశేషమని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎరిక్ తెలిపారు. ఈ అధ్యయనాన్ని ‘నేచర్ పోర్ట్‌ఫోలియో’ జర్నల్ ప్రచురించింది.
స్వదేశీ పరిజ్ఞానంతో మెటల్ 3డీ ప్రింటర్
విమానాలు, అంతరిక్ష నౌకల తయారీ, సైనిక, ఇతర ఇంజినీరింగ్ అవసరాలకు దోహదపడే మెటల్ 3డీ ప్రింటర్‌ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు జోధ్‌పుర్ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. ఇందులో లేజర్, రోబో వ్యవస్థలు మినహా మిగిలిన అన్ని భాగాలకు భారత్‌లోనే రూపకల్పన చేసి ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు. తాము అభివృద్ధి చేసిన ప్రింటర్‌లో భారత్‌లో తయారైన లోహ పౌడర్లను ఉపయోగించి 3డీ భాగాలను ప్రింట్ చేసే అవకాశం ఉందని ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. వాడుకలో ఉన్న సామగ్రికి మరమ్మతులతో పాటు అదనపు భాగాల జోడింపునకు అనుకూలంగా ఈ ప్రింటర్‌ను తయారు చేశామని, తద్వారా వివిధ రంగాలకు అవసరమైన ఉపకరణాలను పూర్తి స్థాయిలో ముద్రించడానికి ఇది దోహదపడుతుందని తెలిపాయి.
ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా గుర్తింపు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఒక ఆసుపత్రి నుంచి సేకరించిన వ్యర్థాల నమూనాల్లో పలు యాంటీ బయాటిక్స్‌ను తట్టుకోగల బ్యాక్టీరియా జన్యువును కనుగొన్నట్లు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఆ జన్యువు పేరు ఎంసిఆర్ 5.1. ఇది బ్యాక్టీరియాపై పోరాడే కోలిస్టిన్ ఔషధాన్ని తట్టుకోగలదని తాజాగా కనిపెట్టారు. అనేక రకాల యాంటీ బ్యాక్టీరియా ఔషధాలను తట్టుకునే అంటు వ్యాధుల చికిత్సకు ఇంతవరకు కోలిస్టిన్ అమోఘంగా ఉపయోగపడుతోంది. ముర్షీదాబాద్‌లోని డోమ్కల్ సూపర్ స్పెషాలిటీ, సబ్ డివిజనల్ ఆసుపత్రి మురుగు నీటి నుంచి నిరుడు ఆరు నమూనాలు సేకరించగా, వాటిలో ఒక దానిలో ఎంసిఆర్ 5.1 జన్యువు బయటపడింది. యాంటీబ్యాక్టీరియల్ ఔషధాలను తట్టుకోగల అంటువ్యాధుల (ఏఎంఆర్) కారణంగా 2050కల్లా ఏడాదికి కోటి మంది మరణిస్తారని అంచనా. ఏఎంఆర్ కేసులు తరచూ నమోదయ్యే భారత్ వంటి దేశానికి ఈ ముప్పు మరీ ఎక్కువ.
మిడ్‌కోర్స్‌లో అస్త్రాన్ని నేలకూల్చే ఏబీఎం సాంకేతిక పరీక్ష విజయవంతం: చైనా
శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ పొందే దిశగా చైనా ముందడుగు వేసింది. మధ్యంతర దశ (మిడ్‌కోర్స్)లో ఆ అస్త్రాన్ని నేలకూల్చే యాంటీబాలిస్టిక్ క్షిపణి (ఏబీఎం)కి సంబంధించిన సాంకేతిక పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇలాంటి ప్రయోగాన్ని డ్రాగన్ చేపట్టడం ఇది ఆరోసారి. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య అని, ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది కాదని చైనా రక్షణ శాఖ తెలిపింది. ప్రయోగ లక్ష్యాలన్నీ నెరవేరాయని పేర్కొంది. ఇది దేశ రక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. ‣ సాధారణంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయాణంలో మూడు దశలు ఉంటాయి.
‣ మొదటిది.. బూస్ట్ దశ. అందులో రాకెట్ బూస్టర్ సాయంతో ఆకాశంలోకి క్షిపణి దూసుకెళుతుంది.
‣ రెండోది.. మధ్యంతర దశ. ఇందులో బూస్టర్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ దశలో క్షిపణి భూ వాతావరణం దాటి వెళుతుంది.
ప్రమాదకర ఖనిజంపై అంతర్జాతీయ పరిశోధన
ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్య వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. పేదలు, ధనికులనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ కిడ్నీ దెబ్బకు కుదేలవుతున్నారు. బీపీ, షుగర్ తదితరాలు ఇప్పటివరకు దీనికి ప్రధాన కారకాలుగా గుర్తించగా, ఇప్పుడు ఆ జాబితాలో ప్రమాదకర ఖనిజం సిలికా చేరింది. ‘సిలికా’తో కలుషితమైన నీరు మూత్రపిండాలపై విషం చిమ్ముతోందని తాజా పరిశోధనలో నిర్ధారణకు వచ్చారు. లోతైన బోరు నీటిని తాగడం, దాంతో పండించిన వరి, చెరకులను తినడం, గ్రానైట్ ధూళి కణాలను పీల్చడం వంటి పరిస్థితుల వల్ల శరీరంలోకి సిలికా చేరి మూత్రపిండాల ముప్పు అధికమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా, మెక్సికో, స్వీడన్, బ్రిటన్, థాయిలాండ్, భారత్ తదితర దేశాల్లో సాగిన పరిశోధనలో మన దేశం నుంచి శ్రీరామచంద్ర మెడికల్ అండ్ రీసెర్చి సెంటర్ (తమిళనాడు), నిమ్స్ (హైదరాబాద్) భాగస్వాములయ్యాయి. నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ తాడూరి గంగాధర్ ఇందులో పాలుపంచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిలాబాద్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, చీమకుర్తి, ఉద్దానం ప్రాంతాలు, ఒడిశా, గోవా, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశోధన సాగింది. మూడేళ్లుగా ఎలుకలపై చేసిన ప్రయోగాలతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలుకలకు సిలికాతో కూడిన నీటిని, సిలికా దుమ్ముతో నిండిన గాలిని అందించారు. దీంతో వాటి మూత్రపిండాలు చెడిపోయినట్లు గుర్తించారు. మనుషుల్లోనూ ఇదే దుష్ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన పత్రం జూన్ 14న ప్రఖ్యాత వైద్యపత్రిక ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ’లో ప్రచురితమైంది.చైనా నిర్మించిన ‘కాటాపుల్ట్’ మూడో విమానవాహక నౌక ప్రారంభం
అధునాతనమైన మూడో విమానవాహక నౌకను చైనా ప్రారంభించింది. తద్వారా వ్యూహాత్మకమైన ఇండో - పసిఫిక్ ప్రాంతంలోకి తన నౌకాదళ పరిధిని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త విమానవాహక నౌకకు ఫుజియాన్ అని పేరు పెట్టారు. షాంఘైలోని జియాంగ్‌నాన్ నౌకాశ్రయంలో జరిగిన ఒక వేడుకలో దీన్ని అధికారులు ప్రారంభించారు. ఇది చైనా దేశీయంగా నిర్మించిన ‘కాటాపుల్ట్’ విమానవాహక నౌక. ఈ యుద్ధనౌక బరువు 80 వేల టన్నులు. దీని డెక్‌పై యుద్ధ విమానాల టేకాఫ్ కోసం విద్యుదయస్కాంత ‘కాటాపుల్ట్ వ్యవస్థ’ ఉంటుంది. ల్యాండింగ్‌కు వచ్చే జెట్‌లను నిలువరించే ‘అరెస్టింగ్ సాధనాలు’ ఉంటాయి. సోవియట్ కాలం నుంచి ఒక విమానవాహక నౌకను కొనుగోలు చేసిన చైనా దానికి మరమ్మతులు నిర్వహించి, లియావోనింగ్ పేరుతో నేవీలో ప్రవేశపెట్టింది. 2019లో షాండాంగ్ పేరిట స్వదేశీ పరిజ్ఞానంతో తొలి విమానవాహక నౌకను సమకూర్చుకుంది. ఫుజియాన్‌తో కలిపి ఈ యుద్ధ నౌకల సంఖ్య మూడుకు పెరిగింది. వీటిలో అణుశక్తితో నడిచేవి కూడా ఉంటాయి.హెచ్‌ఐవీకి సరికొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు
ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్‌ఐవీ వైరస్‌ను సమూలంగా అంతమొందించే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ఒక్క డోసు ఇవ్వడం ద్వారా హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకుని, ఎయిడ్స్ నుంచి బాధితులకు విముక్తి లభిస్తుందని స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఎయిడ్స్ పరిశోధనల్లో భారీ ముందడుగుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ఎముక మజ్జలో బి-టైప్‌గా పిలిచే తెల్ల రక్తకణాలు తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే కణాలు కూడా ఇవే. బి-కణాలు ఎదురుపడినప్పుడు హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు వాటిపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి.
‣ అయితే, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బి-కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన కణాలు వైరస్ ఎదురుపడినా, దాని ప్రభావానికి గురికావు. సరికదా, వైరస్ ప్రవర్తనను పసిగట్టి, తదనుగుణంగా తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. హెచ్‌ఐవీని అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తాయని పరిశోధనకర్త డా.బార్జెల్ వివరించారు.
ఈ టీకాతో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు అత్యంత సురక్షితమైనవి, సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇవి కేవలం హెచ్‌ఐవీ - ఎయిడ్స్ నివారణకే కాకుండా క్యాన్సర్, రోగనిరోధక వ్యవస్థ స్వీయ దాడి చేసుకునే ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సకూ దోహదపడతాయన్నారు. ‘నేచర్’ పత్రిక ఈ వివరాలు అందించింది.
మేక చెవి మృదులాస్థితో మానవ వైకల్యాలకు చికిత్స
మేకచెవి మృదులాస్థి (కార్టిలేజి)తో మానవ శరీరంలో వివిధ వైకల్యాలకు విజయవంతంగా చికిత్స అందించినట్లు పశ్చిమ బెంగాల్ పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన కోల్‌కతా వైద్య పరిశోధకులు తెలిపారు. దాదాపు 25 మందికి బాహ్య చెవి సమస్య, గ్రహణం మొర్రి, ప్రమాదాల కారణంగా ఏర్పడిన వైకల్యాలను సరిచేసినట్లు తాజాగా వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి వైకల్యాలకు ప్లాస్టిక్ సర్జరీలు చేస్తుంటారు. దీనికి అధిక ఖర్చుతో పాటు ప్రయాస కూడా ఎక్కువే. ఆయా శస్త్ర చికిత్సల్లో భాగంగా అమర్చే ప్లాస్టిక్, సిలికాన్ పదార్థాలను మానవ శరీరం దీర్ఘకాలం స్వీకరించే పరిస్థితి ఉండదు. ఈ క్రమంలో ఆర్‌జీ కార్ వైద్య కళాశాల, పశ్చిమ బెంగాల్ పశువైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ చికిత్సలపై కేంద్ర బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో 2013లో పరిశోధనలు ప్రారంభించారు. మేకచెవి నుంచి మృదులాస్థిని వేరు చేశాక వివిధ రసాయన ప్రక్రియలతో దానిలో కణసంబంధమైన లక్షణాలను తొలగించాం. ఆ తర్వాత కూడా మృదులాస్థి నిర్మాణం, నాణ్యత అలాగే ఉన్నాయి. ఆ మృదులాస్థితో చెవి, ముక్కు, నోటి వైకల్యాలున్న 25 మందికి మేకచెవి మృదులాస్థితో శస్త్ర చికిత్సలు చేశాం. వీరిలో ఎక్కువ మందిలో చాలా మంచి ఫలితాలు కనిపించాయని పరిశోధకుల్లో ఒకరైన డా. రూప్ నారాయణ్ భట్టాచార్య తెలిపారు.పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
అణ్వాయుధాన్ని మోసుకెళ్లే సామర్థ్యం గల పృథ్వి-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఒడిశాలోని చాందీపుర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. సాంకేతిక, నిర్వహణపరమైన అన్ని పారామితులను సాధించినట్లు చెప్పారు. రెండు ఇంజిన్లతో కూడిన పృథ్వి-2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలోని 350 కి.మీ. దూరం గల లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల నుంచి 1000 కిలోల వరకు బరువైన అస్త్రాలను మోసుకెళ్లగలదు.చౌకలో కృత్రిమ కాలు
ప్రమాదాల్లో కాలు కోల్పోయిన వారికి తక్కువ ఖర్చుతో కృత్రిమ కాలును గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది నిర్దిష్టంగా భారత్ వంటి దేశాలకు బాగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. ఇక్కడి ఎగుడుదిగుడు ప్రాంతాల్లో సాగే సంక్లిష్ట నడక, నేలపై ఆసీనులయ్యే అలవాటు, సంప్రదాయ మరుగుదొడ్లలో మలవిసర్జనకు కూర్చోవడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్లు తెలిపారు. వయసుకు తగ్గట్టు ఈ కృత్రిమ కాలు బరువును కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్.కనగరాజ్ తెలిపారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు తాము కృత్రిమ మోకాలు భాగాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. సంప్రదాయ మరుగుదొడ్లను మరింత సులువుగా వినియోగించడానికి ఇది వీలు కలిగిస్తుందన్నారు. అలాగే ఎగుడుదిగుడుగా ఉన్న నేలలపై నడిచేటప్పుడు కిందపడిపోయే ప్రమాదాన్ని కూడా ఇది తప్పిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వంద కిలోల శరీర బరువును ఇది తట్టుకోగలదని పేర్కొన్నారు.మధుమేహ బాధితుల పాదాలకు సాంకేతిక రక్ష
మధుమేహ బాధితుల పాదాలను రక్షించేందుకు బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) మెకానికల్ ఇంజినీరింగ్, కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎండ్రోక్రానాలజీ రీసెర్చ్ (కేఐఈఆర్) విభాగాలు సంయుక్తంగా ప్రత్యేక పాద రక్షలను రూపొందించాయి. 3-డీ ప్రింటెడ్ స్నాపింగ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ పాదరక్షలు బాధితుల పాదాల్లో మానని గాయాలు మరింత ఇబ్బంది పెట్టకుండా ఉపశమనం కలిగిస్తాయని కేఐఈఆర్ పోడియాట్రి విభాగాధిపతి పవన్ బెలెహళ్లి వెల్లడించారు. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి వ్యాధిగ్రస్తులకు ఈ పాదరక్షలు బాగా ఉపయోగపడతాయన్నారు. 3-డీ స్నాపింగ్ పాదరక్షలు గాయాలున్న వారు కూడా సాధారణ వ్యక్తుల మాదిరిగానే నడిచేందుకు సహకరిస్తాయని ఐఐఎస్‌సీ మెకానికల్ ఇంజినీరింగ్ పీహెచ్‌డీ విద్యార్థి ప్రియభ్రత మహారాణ తెలిపారు. సమస్యలున్నవారే కాకుండా సాధారణ వ్యక్తులకూ ఇవి ఉపయోగపడతాయని ఐఐఎస్‌సీ ప్రకటించింది.చిరుధాన్యాలతో కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చిన ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు
అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు మరో కొత్త ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చారు. పోషక విలువలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాల రెడీమేడ్ దోశ పిండిని తయారు చేశారు. చిరుధాన్యాలను కొన్ని గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత పిండిగా చేసుకోని దోశలు వేసుకోవడం కొద్దిగా శ్రమే. అందుకే చాలా మందికి తినాలనే ఆసక్తి ఉన్నా అంతశ్రమ పడలేక వాటి జోలికి పోవడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేసి చోడి, కొర్ర, సామ పంటల మిశ్రమానికి కొద్దిగా మెంతులు, మినప్పప్పు, బియ్యం కలిపి ఈ దోశ పిండిని ఆవిష్కరించారు. ఒక గ్లాసు పిండికి రెండు గ్లాసుల నీరు కలిపి నేరుగా పెనంలో దోశ వేసుకోవచ్చు. అదనపు రుచి కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కలుపుకోవచ్చు. చోడిలో కాల్షియం, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా, తక్కువ కొలెస్ట్రాల్ కలిగిన పోషకాలు ఉంటాయి. కొర్రలో మాంసకృత్తులు 10 నుంచి 12 శాతం, కొవ్వు పదార్థం 4.7 శాతం, పిండి పదార్థం 60.6 శాతం ఉంటుంది. సామలో అధిక పీచు పదార్థం, ప్రొటీన్, పిండి పదార్థం, కొవ్వు, ఖనిజ లవణాలు, ఐరన్ ఉంటాయని పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.వి.కె.జగన్నాథరావు చెప్పారు. ఈ పిండి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందనే అంశంపై అలాగే చిరుధాన్యాలతో కారప్పూస తయారీపై కూడా పరిశోధనలు చేస్తున్నామని వివరించారు.శాకాహారంతో అధిక బరువు నుంచి విముక్తి!
అధిక బరువు, స్థూలకాయ బాధితులకు భారీ ఊరట! నోరు కట్టుకోవాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గే ఉపాయమిది. చిక్కుళ్లతో కూడిన శాకాహారాన్ని ఎక్కువగా, చేపలు, మాంసం, పౌల్ట్రీ సంబంధిత ఉత్పత్తులను బాగా తక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఫిజీషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్’ నిపుణులు దీన్ని చేపట్టారు. అధ్యయనంలో భాగంగా మొత్తం 244 మంది స్థూలకాయులకు 16 వారాల పాటు ఆహారం అందించారు. అయితే, వీరిలో కొందరికి ఇష్టమొచ్చిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చని, మరికొందరికి కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలని సూచించారు. శాకాహారంలో ఎక్కువగా చిక్కుళ్లు అందించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లను కూడా అందించారు. 4 నెలల తర్వాత, అధ్యయనంలో పాల్గొన్నవారి శరీర బరువు, కొవ్వు ద్రవ్యరాశి, ఇన్సులిన్ స్థాయులను లెక్కగట్టారు. ఇష్టం వచ్చిన ఆహారం తీసుకున్నవారిలో ఎలాంటి మార్పూలూ చోటుచేసుకోలేదు. శాకాహారం తీసుకున్నవారు మాత్రం సగటున 7.25 కిలోల బరువు తగ్గారు. వీరి కొవ్వు ద్రవ్యరాశి సగటున 4.12 కిలోలు తగ్గినట్టు గుర్తించామని పరిశోధనకర్త హానా కహ్లియోవా పేర్కొన్నారు.దానంతట అదే బాగయ్యే కృత్రిమ వేలు
కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యుటేషన్‌ల వినియోగంతో రోబోటిక్ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అచ్చం మనిషిలా కనిపించి, వ్యవహరించే మర మనుషుల తయారీకి మార్గం సుగమమవుతోంది. ఈ క్రతువులో నిమగ్నమైన టోక్యో పరిశోధకులు బయోహైబ్రీడ్ విధానంలో ‘కంట్రోలబుల్ రోబోటిక్ ఫింగర్’ను సృష్టించారు. దీనికి సజీవ చర్మకణాలతో రూపొందించిన తొడుగును అద్దారు. స్పర్శకు అనుగుణంగా స్పందించడం, తాకడం ద్వారా సున్నితమైన అప్లికేషన్లను పూర్తిచేయడం మాత్రమే కాదు ఏ చిన్న గాయమైనా దానంతç అదే స్వస్థత పొందడం దీని ప్రత్యేకత. హైడ్రోజెల్‌గా పిలిచే తేలికపాటి కొలాజెన్ మ్యాట్రిక్స్‌ను ఉపయోగించి సింథెటిక్ చర్మాన్ని రూపొందించాం. ఫైబ్రోబ్లాస్ట్స్, కెరాటినోసైట్‌లుగా పేర్కొనే సజీవ చర్మ కణాలను కూడా ఇందులో చొప్పించాం. పరికరానికి జతచేసేందుకు అనువుగా దీన్ని తయారు చేశాం. ఏ కారణం చేతయినా ఈ వేలుకు గాయమైతే, దానంతట అదే బాగవుతుందని పరిశోధనకర్త షోజీ టేకుచి వివరించారు. ఈ కృత్రిమ చర్మం మరింత సహజంగా వ్యవహరించేలా ఇంద్రియ కణాలు, వెంట్రుకల కుదుళ్లు, చెమట గ్రంథులను జతచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు.సొరియాసిస్ వ్యాధికి కారణమైన జన్యువు గుర్తింపు
సొరియాసిస్ వ్యాధి నిరోధానికి సరికొత్త పద్ధతిని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా నేరుగా వ్యాధికి కారణమైన జన్యువుపై పనిచేసే విధానాన్ని కనిపెట్టారు. సొరియాసిస్‌ను నియంత్రించేందుకు ఇప్పటికే పలు రకాల ఔషధాలు అందుబాటులో ఉండగా అవి మనిషి రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాధికి కారణమైన నిర్దేశిత కణాలపై నేరుగా ప్రభావం చూపే ఔషధాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు విజయం సాధించారు. వర్సిటీకి చెందిన లైఫ్ సైన్సెస్ విభాగం ఆచార్యుడు ప్రొ.పి.రెడ్డన్న నేతృత్వం వహించగా మరో ఆచార్యుడు నూరుద్దీన్‌ఖాన్, కుమార్‌రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు హర్షవర్ధన్ భక్తర్, శారదా శుక్లా, మనోజిత్‌పాల్ సహకారం అందించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిధులు అందించింది.దక్కిన పేటెంట్
డాక్టర్ రెడ్డీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్‌సైన్సెస్ భాగస్వామ్యంతో 12ఆర్-లైపోక్సిజినేజ్ చర్యను నిరోధించే ప్రత్యేక కణాన్ని (డ్రిల్-1825 అనే మాలిక్యుల్) తయారు చేశారు. ఇది కణ విభజనను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించింది. దీన్ని తొలుత ఎలుకలపై ప్రయోగించినప్పుడు సొరియాసిస్ లక్షణాలు క్రమంగా తగ్గిపోవడం గుర్తించారు. వ్యాధి ప్రబలిన చోట వెంట్రుకలు సైతం తిరిగి రావడం గుర్తించారు. హెచ్‌సీయూ ఆచార్యుల పరిశోధనకు ఇటీవల పేటెంట్ సైతం దక్కింది.సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే రోబోల ఆవిష్కరణ
సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడంలో మానవ ప్రమేయాన్ని తొలగించే దిశగా కీలక ముందడుగు పడింది. ఆ పనిని సొంతంగా పూర్తిచేసే సరికొత్త రోబోలను ఐఐటీ మద్రాసు పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ రోబోలకు ‘హోమోసెప్’లుగా నామకరణం చేశారు. సెప్టిక్ ట్యాంకుల్లో మూడింట రెండొంతులు మానవ విసర్జితాలు ఉంటాయని ఫలితంగా అందులో విషపూరిత వాతావరణం నెలకొంటుందని ఐఐటీ మద్రాసు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ ప్రభు రాజగోపాల్ తెలిపారు. ఆ ట్యాంకులను మానవులు చేతులతో శుభ్రం చేయడంపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ దానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడట్లేదని చెప్పారు. వాటిని శుభ్రం చేసే ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఏటా వందల మంది కార్మికులు దుర్మరణం పాలవుతున్నారని పేర్కొన్నారు. దానికి పరిష్కార మార్గంగా దివాన్షు కుమార్ అనే తమ విద్యార్థి 2019లోనే ‘హోమోసెప్’ను రూపొందించారని.. కొన్ని కంపెనీల సాయంతో దానికి మరిన్ని మెరుగులు దిద్ది ప్రస్తుతం పూర్తిస్థాయిలో వినియోగం కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ఈ రోబో ప్రత్యేక చూషణ వ్యవస్థ ద్వారా ట్యాంకులోని వ్యర్థాలను మానవ ప్రమేయం లేకుండా తోడేస్తుందని వెల్లడించారు. తొలుత తమిళనాడులో వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు.వాయు కాలుష్యం దుష్ప్రభావాలకు కాయగూరలతో చికిత్స
వాయు కాలుష్యం మానవుల ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలను క్యారట్ వంటి కాయగూరలు తగ్గించగలవని పరిశోధకులు తాజాగా గుర్తించారు. సాధారణంగా సిగరెట్లు, వాహనాల నుంచి వచ్చే పొగలో ఆక్రోలీన్ అనే అలెర్జీ కారకం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, చర్మంపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. క్యారట్, సెలెరీ అనే ఓ ఆకుకూర, క్యారట్ తరహాలో ఉండే పార్‌స్నిప్ వంటి కూరగాయల్లో ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కాయగూరలను తరచుగా ఆరగిస్తే శరీరంలో ఆక్రోలీన్ అధికంగా పోగుపడకుండా రక్షణ దక్కుతోందని అమెరికాలోని డెలవేర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో నిర్ధారించారు. నీటిలో కరిగే ఆమ్లంలా ఆక్రోలీన్‌ను కాలేయం మార్చడంలో అవి దోహదపడుతున్నట్లు తేల్చారు.వైరస్‌ల చికిత్సకు కొత్త విధానం అభివృద్ధి
కరోనా వంటి వైరస్‌లను నిర్వీర్యం చేయడానికి భారత శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం కృత్రిమ పెప్టైడ్ల (మినీ ప్రొటీన్ల)ను రూపొందించారు. అవి మానవ కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకోవడమే కాకుండా వైరస్ రేణువులను ఒక ముద్దలా మార్చేస్తాయి. తద్వారా వాటి ఇన్‌ఫెక్షన్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. రెండు భిన్న ప్రొటీన్ల మధ్య జరిగే చర్యలను కృత్రిమ ప్రొటీన్లతో అడ్డుకునే వీలుంది. వైరస్‌ల కట్టడికి ఈ వెసులుబాటును ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. కరోనాపై ఉండే స్పైక్ ప్రొటీన్లకు అతుక్కొనే ఎస్‌ఐహెచ్-5 అనే మినీ ప్రొటీన్‌ను తయారు చేశారు. ఇది హెయిర్‌పిన్ ఆకృతిలో ఉంటుంది. రెండు మినీ ప్రొటీన్లు జతకట్టి.. డైమర్‌గా రూపొందాయి. ఒక్కో డైమర్‌లో రెండు ముఖాలు ఉంటాయి. రెండు భిన్న లక్ష్యాలతో బంధం ఏర్పరిచే సామర్థ్యం వీటికి ఉంది. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ (ఎస్)కు మానవ కణంలోని ఏసీఈ2 ప్రొటీన్‌కు మధ్య జరిగే చర్యపైకి ఈ డైమర్లను శాస్త్రవేత్తలు ప్రయోగించారు.చందమామపై సరికొత్త మ్యాప్ రూపొందించిన చైనా
అంతరిక్షంలోనూ అమెరికా తదితర దేశాలతో పోటీపడుతున్న చైనా, చంద్రుడిపై కొత్త మ్యాప్ రూపొందించింది. ఇప్పటివరకు జాబిల్లిపై తయారైన మ్యాపుల్లో ఇదే అత్యంత వివరణాత్మకమైనది కావడం గమనార్హం. 1:2,500,000 స్కేల్‌లో తీర్చిదిద్దిన ఈ మ్యాప్‌లో 12,341 ఇంపాక్ట్ క్రేటర్స్, 17 ఇంపాక్ట్ బేసిన్స్, 17 రాక్ టైప్స్, 14 రకాల నిర్మాణాలు, ఇంకా చంద్రుని భూగర్భశాస్త్రం, దాని పరిణామక్రమం గురించి అంతులేని సమాచారం ఉంది. చందమామపై శాస్త్రీయ పరిశోధనలకు, ల్యాండింగ్ ప్రదేశం ఎంపికకు ఈ పటం దోహదపడనుంది. ఈ హైరిజల్యూషన్ టోపోగ్రాఫిక్ మ్యాప్ తయారీకి చైనీస్ అకాడమీ సైన్సెస్‌కు చెందిన జియోకెమిస్ట్రీ విభాగం నేతృత్వం వహించింది. మే 30న ఈ మ్యాప్‌ను సైన్స్ బుల్లెటిన్ ప్రచురించింది.18 మంది క్యాన్సర్ రోగులకు సంపూర్ణ స్వస్థత
క్యాన్సర్ పరిశోధనల్లో మరో సంచలనం. ఒక్క ఔషధంతో 18 మంది పురీషనాళ క్యాన్సర్ బాధితులు సంపూర్ణ స్వస్థత పొందారు. ఇక వారికి తదుపరి చికిత్స కూడా అవసరం లేదని, ఈ ఫలితాన్ని తాము కూడా ఊహించలేదని పరిశోధకులు ప్రకటించారు. ఒక్క ఔషధ చికిత్సతో బాధితులు సంపూర్ణ స్వస్థత పొందడం బహుశా క్యాన్సర్ చరిత్రలో ఇదే తొలిసారి అని వారు పేర్కొన్నారు.పురీషనాళ (రెక్టల్) క్యాన్సర్ మలద్వారం వద్ద పెద్దపేగు కలిసే చోటు నుంచి ఏర్పడుతుంది. ఇలాంటి బాధితుల్లో కీమో, రేడియేషన్ థెరపీతో పాటు పేగు, మూత్ర సంబంధ శస్త్ర చికిత్సలు చేయించుకున్న 18 మందిలో కొందరికి జీర్ణ వ్యవస్థ నుంచి మలాన్ని సేకరించే కొలోస్టమీ బ్యాగులు కూడా ఉన్నాయి. అయితే ‘మెమోరియల్ స్లోన్ కెటెరింగ్ క్యాన్సర్ సెంటర్’ పరిశోధకులు వీరిపై ప్రత్యేక దృష్టి సారించారు. డా.ఆండ్రియా సెర్సెక్ బృందం వీరందరికీ ప్రయోగాత్మకంగా ప్రత్యేక చికిత్స ఆరంభించింది. మూడు వారాలకు ఒకసారి చొప్పున వరుసగా 6 నెలల పాటు ‘డోస్టార్లిమాబ్’ అనే ఔషధాన్ని ఇచ్చింది. తర్వాత పరీక్షలు నిర్వహించగా వీరంతా క్యాన్సర్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు గుర్తించారు. క్యాన్సర్ చరిత్రలోనే తొలిసారిగా 18 మంది పురీషనాళ క్యాన్సర్ పీడితులు ఆ రుగ్మత నుంచి సంపూర్ణంగా స్వస్థత పొందారని పరిశోధకులు పేర్కొన్నారు.
‘డోస్టార్లిమాబ్’లో మనిషి శరీరంలోని యాంటీబాడీల మాదిరి పనిచేసే ప్రతినిరోధకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసినవే. మొదట ఇవి క్యానర్ కణాలను బద్ధలు కొడతాయి. తర్వాత వీటిని గుర్తించి, అంతంచేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయని డా.వెనూక్ తెలిపారు.
వేసుకున్న దుస్తులే విద్యుదుత్పత్తి కేంద్రాలు!
మీ ఇంట్లో ఎల్‌ఈడీ బల్బును వెలిగించేందుకు కావాల్సిన కరెంటును మీ దుస్తులే సమకూరిస్తే ఎంత బాగుంటుంది? అందుకు అవసరమైన ప్రత్యేక వస్త్రాన్ని (ఫ్యాబ్రిక్) శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.శరీర కదలికల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగల స్మార్ట్ దుస్తుల తయారీ కోసం పరిశోధకులు పోగులను తయారు చేశారు. అయితే ఉతికిన తర్వాత సామర్థ్యం తగ్గుతుండటం వాటిలో అతిపెద్ద ప్రతికూలతగా మారింది. దాన్ని అధిగమిస్తూ సింగపూర్‌లోని నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఎన్‌టీయూ) పరిశోధకులు సమర్థ విద్యుదుత్పత్తి వస్త్రాన్ని రూపొందించారు.
వెండితో పాటు స్టైరీన్-ఇథిలీన్-బ్యుటిలీన్-సైరీన్ (ఎస్‌ఈబీఎస్)ను ఉపయోగించి స్క్రీన్ ప్రింటింగ్ విధానంలో సాగడానికి అనుగుణంగా ఉన్న ఎలక్ట్రోడ్‌ను తొలుత తయారుచేశారు. దాన్ని పాలీవినైల్‌ఐడీన్ ఫ్లోరైడ్-కో-హెక్సాఫ్లోరోప్రొపైలీన్ (పీవీడీఎఫ్-హెచ్‌పీఎఫ్), సీసం రహిత పెరోవ్‌స్కైట్‌లతో జత చేసి ఫ్యాబ్రిక్‌ను రూపొందించారు. పీవీడీఎఫ్-హెచ్‌పీఎఫ్‌తో విద్యుదుత్పత్తి సామర్థ్యం బాగా మెరుగుపడింది.
శరీర కదలికలతో ఉత్పన్నమయ్యే కంపనాల నుంచి ఈ ఫ్యాబ్రిక్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. వస్త్రాన్ని ఒత్తినప్పుడు (పీజోఎలక్ట్రిసిటీ), చర్మం/రబ్బరు తొడుగుల వంటి ఇతర పదార్థాలతో పోగులు రాపిడికి గురైనప్పుడు (ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్) విద్యుత్తు తయారవుతుంది. ప్రస్తుతానికి ఒక్కో చదరపు మీటరు ఫ్యాబ్రిక్‌తో సగటున 2.34 వాట్ల విద్యుత్తును పరిశోధకులు ఉత్పత్తి చేయగలిగారు. ఎల్‌ఈడీ బల్బులు, వాణిజ్య కెపాసిటర్లు పనిచేసేందుకు అది సరిపోతుంది. శరీర కదలికలపై ఈ ఫ్యాబ్రిక్‌తో ఏమాత్రం ప్రతికూల ప్రభావం పడదు.