వార్తల్లో వ్యక్తులు
ఇండో - బ్రిటన్ సాంస్కృతిక వేదిక రాయబారిగా ఎ.ఆర్.రెహమాన్
→ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ బ్రిటిష్ కౌన్సిల్ కార్యక్రమం ‘ఇండియా - యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్’కు రాయబారిగా ఎంపికయ్యారు.→రెండు దేశాలకు చెందిన వర్ధమాన కళాకారుల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
→భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన ద ‘సీజన్ ఆఫ్ కల్చర్’ను దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ జాన్ థామ్సన్, బిట్రిష్ కౌన్సిల్ డైరెక్టర్ (భారత్) బార్బరా విక్‌హమ్‌లు లాంఛనంగా ప్రారంభించారు.
అంతరిక్ష కేంద్రాన్ని చేరిన చైనా వ్యోమగాములు
→ముగ్గురు వ్యోమగాములతో చైనా పంపిన వ్యోమనౌక షెంఝౌ-14 విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. వీరు ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు.→తియాంగాంగ్ అనే ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని వారు పూర్తి చేస్తారు. తియాంగాంగ్‌లో తియాన్హే అనే కోర్ మాడ్యూల్, వెంటియాన్, మెంగ్టియాన్ అనే ల్యాబ్ మాడ్యూళ్లు ఉంటాయి.
→ఇది పూర్తిస్థాయిలో సిద్ధమైతే సొంతంగా అలాంటి కేంద్రం కలిగిన ఏకైక దేశంగా చైనా గుర్తింపు పొందుతుంది.
→ప్రస్తుతం రోదసిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) ఉన్నప్పటికీ అది అమెరికా, రష్యా, పలు ఇతర దేశాల ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మితమైంది.
ఆసియా సంపన్నుడిగా ముకేశ్ అంబానీ
→ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ నిలిచారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని ఆయన వెనక్కి నెట్టారు.→గత వారం రోజుల్లో రిలయన్స్ షేరు 6.79 శాతం దూసుకెళ్లడం ఇందుకు కలిసొచ్చింది.
→బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. అంబానీ నికర సంపద 99.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.67 లక్షల కోట్లు). ప్రపంచంలో ఆయన 8వ సంపన్న వ్యక్తిగా ఉన్నారు.
→2022లో ఇప్పటివరకు ఆయన సంపద 9.69 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక 98.7 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ 9వ స్థానంలో నిలిచారు.
→ ప్రపంచ కుబేరుడిగా టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ కొనసాగారు. ఆయన సంపద 227 బిలియన్ డాలర్లు.
→ ఆ తర్వాతి స్థానాల్లో అమెజాన్ జెఫ్ బెజోస్, ఎల్‌వీఎంహెచ్ బెర్నార్డ్ అర్నాల్ట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఉన్నారు.
→ ప్రముఖ దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ అయిదో స్థానంలో ఉన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ 11వ స్థానం, జాంగ్ షాన్‌సన్ 15వ స్థానాలు పొందారు.
→ భారత సంపన్నులు చూస్తే.. అజీమ్ ప్రేమ్‌జీ (28.7 బి.డాలర్లు) మూడో స్థానంలో ఉన్నారు.
→తర్వాతి స్థానాల్లో శివ్ నాడార్ (25.9 బి.డాలర్లు), లక్ష్మీ మిత్తల్ (20.1 బి.డాలర్లు), రాధాకిషన్ దమానీ (19.6 బి.డాలర్లు), ఉదయ్ కోటక్ (14.8 బి.డాలర్లు), దిలీప్ సంఘ్వీ (14.5 బి.డాలర్లు), సైరస్ పూనావాలా (14 బి.డాలర్లు) నిలిచారు.
‘మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ - 2022’ విజేతగా ఖుషీ పటేల్
→బ్రిటన్‌కు చెందిన బయో మెడికల్ విద్యార్థి ఖుషీ పటేల్ ‘మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ - 2022’ విజేతగా నిలిచారు.→భారత్ బయట సుదీర్ఘకాలంగా (29 ఏళ్లుగా) ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు విజేతల వివరాలను నిర్వహణ సంస్థ ‘ఇండియా ఫెస్టివల్ కమిటీ (ఐఎఫ్‌సీ)’ ప్రకటించింది.
→అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్‌గాను, శ్రుతికా మనే రెండో రన్నరప్‌గాను ఎంపికయ్యారు.
→పోటీల్లో ముందు వరుసలో నిలిచిన 12 మంది ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర పోటీల్లో విజేతలైనవారు కావడం విశేషం.
→ ఖుషీ పటేల్, ఓవైపు బయోమెడికల్ సైన్సెస్, సైకాలజీ కోర్సులు చేస్తూనే మరోవైపు మోడల్‌గానూ రాణిస్తున్నారు.
→ఆమె సొంతంగా వస్త్రాల దుకాణాన్ని సైతం నిర్వహిస్తున్నారు. కాగా గయానాకు చెందిన రోషని రజాక్ ‘మిస్ టీన్ ఇండియా వరల్డ్‌వైడ్ - 2022’ విజేతగా ఎంపికయ్యారు.
→నవ్య పైంగొల్ (అమెరికా) మొదటి రన్నరప్‌గా, చికితా మలహా (సురినామ్) రెండో రన్నరప్‌గా నిలిచారు. ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్న ఐఎఫ్‌సీ కొవిడ్ కారణంగా రెండేళ్లు నిర్వహించలేదు.
→చివరిసారిగా 2019లో మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీలు జరిగాయి.
అగ్రరాజ్య ట్రెజరర్‌గా నేటివ్ అమెరికన్
→అమెరికాలో చరిత్రలోనే తొలిసారిగా ఓ నేటివ్ అమెరికన్ మహిళ ఆ దేశ ట్రెజరర్‌గా నామినేట్ అయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్ లిన్ మలెర్బాను ట్రెజరర్‌గా నియమించారు.→అమెరికా ట్రెజరీ విభాగంలో గిరిజన, నేటివ్ వ్యవహారాల కార్యాలయం ఏర్పాటు చేసిన క్రమంలో మలెర్బా నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
→ట్రెజరర్ విధుల్లో టంకశాల పర్యవేక్షణ, ఫెడరల్ రిజర్వ్‌తో సమన్వయం, ట్రెజరీ కార్యాలయ వినియోగదారుల విధానం పర్యవేక్షణ వంటివి ఉంటాయి.
→దీంతో పాటు అమెరికా నగదు నోట్లపై ట్రెజరర్ సంతకం ఉంటుంది.
→మొహీగన్ ఇండియన్ తెగ జీవితకాల అధ్యక్షురాలైన మలెర్బా గతంలో రిజిస్టర్డ్ నర్సుగా, వివిధ గిరిజన ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు.
ఐదేళ్ల వయసులో బెల్లా గిన్నిస్ రికార్డ్
→యూకేలోని వేముల్‌లో 2016, జూలై 14న జన్మించిన బ్రిటీష్ చిన్నారి బెల్లా జె డార్క్ ఐదేళ్ల వయసులో ఓ పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించింది.→ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అంతేనా అందులోని బొమ్మలు సైతం తానే గీసింది.
→తను రాసిన పుస్తకం ‘ద లాస్ట్ క్యాట్’ 32 పేజీలు కలదు.
కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖకు 5 ప్రపంచ రికార్డులు
→కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ 2022లో 5 ప్రపంచ రికార్డులను నెలకొల్పినట్లు ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.→అమరావతి - అకోలా మార్గంలోని 53వ జాతీయ రహదారిలో భాగంగా 75 కిలోమీటర్ల హైవేను 105 గంటల 33 నిమిషాల్లో నిర్మించటం అందులో ఒకటన్నారు.
→ఈ సందర్భంగా ‘పాండురంగ్ అబాజీ రౌత్ అమృత్ మహోత్సవి సత్కార్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
→దేశాన్ని ఇంధన ఎగుమతిదారుగా మార్చేందుకు చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గంటలో 3,331 పుషప్స్‌తో భారతీయుడి ప్రపంచ రికార్డు
→మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన కార్తిక్ జయస్‌వాల్ (21) గంటలో 3,331 పుషప్స్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.→ఇప్పటివరకు గిన్నిస్ బుక్‌లో ఆస్ట్రేలియా వ్యక్తి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. ఇందుకోసం రెండేళ్లుగా నిత్యం ఆరు గంటలు సాధన చేసినట్లు చెప్పాడు.
→గతంలో 44 సెకన్లలో 770 టైల్స్ పగలగొట్టి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ కార్తిక్ చోటు సంపాదించాడు.
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్
→హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు.→ప్రస్తుతం కాన్సుల్ జనరల్‌గా ఉన్న జోయెల్ రీఫ్మాన్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జెన్నిఫర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
→2022 సెప్టెంబరులో ఆమె హైదరాబాద్‌కు రానున్నారు. ఆమె గతంలో భారతదేశంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
→భారత్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా, ముంబయిలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
→ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో పనిచేస్తున్నారు.
117 సార్లు రక్తదానంతో గిన్నిస్ రికార్డు
→ఏకంగా 117 సార్లు రక్తదానం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు ఓ మహిళ. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన మధుర అశోక్ కుమార్ ఈ ఘనత సాధించారు.→18 ఏళ్ల వయసు నుంచి ఆమె రక్తం దానం చేయడం ప్రారంభించారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
→ఆమె చేసిన సేవలకుగానూ ఇప్పటివరకు 180కి పైగా అవార్డులు వరించాయి. తుమకూరులోని సిద్ధగంగ మఠాధిపతి సమక్షంలో గిన్నిస్ బుక్ ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
థాయ్‌లాండ్ రాజును మించిన బ్రిటన్ రాణి
→బ్రిటన్ రాణిగా 70 వసంతాలు పూర్తిచేసుకొని, ఇటీవల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్న ఎలిజబెత్-2 మరో అరుదైన మైలురాయిని అధిగమించారు.→ఆమె థాయ్‌లాండ్ రాజును అధిగమించి ప్రపంచంలోనే ఓ రాజ్యాన్ని అత్యధిక కాలం ఏలిన రెండో వ్యక్తిగా ఘనత సాధించారు.
→థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అదుల్యదేజ్ 1927 నుంచి 2016 మధ్యలో 70 ఏళ్ల 126 రోజులు ఆ దేశ చక్రవర్తిగా పాలన చేశారు. ఇప్పుడు రాణి ఆ రికార్డును బద్దలకొట్టారు.
→ఇంకో రెండేళ్లు బ్రిటన్ రాణిగా ఎలిజబెత్-2 పరిపాలన కొనసాగిస్తే ప్రపంచంలో అత్యధిక కాలం పరిపాలించిన చక్రవర్తిగా లూయిస్ రికార్డు పేరిటున్న రికార్డు కూడా ఆమె పాదాక్రాంతం కానుంది.
→లూయిస్.. 1643 నుంచి 1715 వరకు అంటే 72 ఏళ్ల 114 రోజులు ఫ్రాన్స్ చక్రవర్తిగా కొనసాగారు.
9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంపుకు చేరుకొని ఏడేళ్ల బాలిక రికార్డు
→పంజాబ్‌లోని రోపర్‌కు చెందిన సాన్వీ సూద్ అనే ఏడేళ్ల బాలిక చరిత్ర సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంపునకు చేరుకుంది.→మొహలీలోని యాదవీంద్ర స్కూల్‌లో సాన్వీ రెండో తరగతి చదువుతోంది. ఎవరెస్టుపై 5,364 మీటర్ల ఎత్తులోని బేస్ క్యాంప్‌లో ఒక రోజు నివసించాలని బలంగా సంకల్పించుకొని ప్రయాణాన్ని సాగించింది.
→తొమ్మిది రోజుల్లోనే అక్కడికి చేరుకుని ఔరా అనిపించింది. 65 కిలోమీటర్ల ట్రాక్‌లో ఎన్ని అవాంతరాలు ఎదురైన.. బెదరక బేస్ క్యాంప్‌కు చేరుకుని అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది.
→విపరీతమైన చలి, బలమైన గాలులను సైతం తట్టుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించింది.
ఏడు ఖండాల్లోని పర్వతాలు అధిరోహించిన మలావత్ పూర్ణ
→ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిజామాబాద్‌కు చెందిన మలావత్ పూర్ణ మరో ఘనత సాధించారు.→అమెరికా దేశం అలస్కాలోని 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలీ శిఖరాన్ని అధిరోహించారు.
→తాజా ఘనత ద్వారా ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించారు.
→పూర్ణ జూన్ 5న డెనాలీ శిఖరంపైకి చేరుకొన్నారు. ఉత్తరాదికి చెందిన తండ్రి కూతుళ్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, దియా బజాజ్, విశాఖకు చెందిన అన్మీశ్ వర్మతో కలిసి మే 23న ఆమె యాత్ర ప్రారంభించారు.
→ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ ఆర్థిక సాయం, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థ సహకారంతో యాత్ర పూర్తి చేశారు.
పసిఫిక్‌ను ఒంటరిగా దాటి చరిత్ర సృష్టించిన జపాన్ వృద్ధుడు
→83 ఏళ్ల వయసులో జపాన్‌కు చెందిన కెనెచీ హోరి ప్రపంచంలోని సాగరాల్లోనే అత్యంత పెద్దదైన పసిఫిక్‌ను ఓ చిన్న పడవలో ఎవరి తోడు లేకుండా ఒంటరిగా దాటారు.→ఈ ఘనత సాధించిన అతి పెద్ద వయస్కుడిగా చరిత్ర కూడా సృష్టించారు.
→మార్చి నెలలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కేవలం ఆరు మీటర్లు పొడవుండే పడవలో బయల్దేరిన హోరి 69 రోజుల పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని 8,500 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌లో పశ్చిమ తీరంలోని కీ జల సంధికి చేరుకున్నారు.
→ఇదే పసిఫిక్ మహా సముద్రాన్ని హోరి 1962లో 23 ఏళ్ల వయసులో దాటారు. అయితే అప్పుడు జపాన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ఒంటరి సముద్రయానం చేశారు.
→అ సమయంలో ఆయన దగ్గర అమెరికా పాస్‌పోర్టు కూడా లేదు. అక్రమంగా అడుగుపెట్టినా హోరి సాహసాన్ని తెలుసుకొని శాన్‌ఫ్రాన్సిస్కో ప్రజలు ఘనంగా సన్మానించారు.
→1974లోనైతే సముద్ర మార్గంలో ఏకంగా ప్రపంచాన్నే చుట్టేశారు.
అమెరికా తీర గస్తీ దళం కమాండెంట్‌గా మహిళ
→అమెరికా తీర గస్తీ దళం నూతన కమాండెంట్‌గా తొలిసారి ఓ మహిళ నియమితురాలై రికార్డు సృష్టించారు.→ఇంతవరకు వైస్ కమాండెంట్‌గా ఉన్న లిండా ఫాగన్ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆమెను కొనియాడారు.