మరణాలు



ప్రముఖ రచయిత శీలా వీర్రాజు మరణం

→ప్రముఖ అభ్యుదయ రచయిత, కవి, చిత్రకారుడు శీలా వీర్రాజు (83) అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో మరణించారు.
→వీర్రాజు రాజమహేంద్రవరంలో 1939 ఏప్రిల్‌ 22న జన్మించారు. విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. కళాశాలలో చదివే రోజుల్లోనే కథలు రాయడం మొదలుపెట్టారు.
→1957 నుంచి 1976 వరకు ఎనిమిది కథా సంపుటాలు తీసుకొచ్చారు. 1961లో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రెండేళ్ల పాటు కృష్ణా పత్రికలో పనిచేశారు.
→తర్వాత 1963 జులై నుంచి 1990 జనవరి 31 వరకు సమాచార, పౌర సంబంధాల శాఖలో అనువాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
→చిత్రకారుడు కూడా అయిన వీర్రాజు ఎందరో ప్రముఖ రచయితల గ్రంథాలకు ముఖ చిత్రాలు గీశారు. 1967లో ‘కొడిగట్టిన సూర్యుడు’ కథా సంపుటికి ‘ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌’ మొదటి పురస్కారాన్ని అందుకున్నారు.
→1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం, 1991లో ‘శీలా వీర్రాజు కథలు’ సంపుటానికి తెలుగు వర్సిటీ బహుమతి, 1994లో కొండేపూడి శ్రీనివాస్‌రావు సాహితీ సత్కారం, డా.బోయి భీమన్న వచన కవితా పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా అందుకున్నారు.

ప్రముఖ వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ మరణం

→వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ (93) దక్షిణ ముంబయిలోని స్వగృహంలో మరణించారు.
→100 బిలియన్‌ డాలర్లకు పైగా నికర సంపద కలిగిన టాటా గ్రూప్‌లో 18.37 శాతం వాటాతో పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్నారు.
→ 1865లో స్థాపితమైన షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ వారసుడైన పల్లోంజీ మిస్త్రీ 1929లో జన్మించారు.
→ తండ్రి షాపూర్జీ మిస్త్రీ మరణంతో 18 ఏళ్ల వయసులోనే, 1947లో ఈయన కుటుంబ వ్యాపార బాధ్యతల్ని తీసుకున్నారు.
→ ఎస్‌పీ గ్రూప్‌ను 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.40,000 కోట్ల) స్థాయికి పల్లోంజీ మిస్త్రీ తీసుకెళ్లారు.
→నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎస్‌పీ గ్రూప్‌ను తీర్చిదిద్ది, కార్యకలాపాలను పలు దేశాలకు విస్తరించారు.
→ మస్కట్‌లో ఒమన్స్‌ రాయల్టీ ప్యాలెస్‌ వంటి చారిత్రక కట్టడాలను ఈ గ్రూపే నిర్మించింది.
→ దేశీయంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), హెచ్‌ఎస్‌బీసీ, తాజ్, ఒబెరాయ్‌ హోటల్‌ వంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను ఈ సంస్థే చేపట్టింది.
→ స్థిరాస్తి, టెక్స్‌టైల్స్, షిప్పింగ్, గృహోపకరణాల వ్యాపారాలనూ ఎస్‌పీ గ్రూప్‌ నిర్వహిస్తోంది.
→ వ్యాపార రంగానికి పల్లోంజీ మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో పద్మభూషణ్‌ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది.
→ 1930లో టాటా గ్రూప్‌లో షాపూర్జీ మిస్త్రీ తీసుకున్న వాటా, ఆయన మరణం తరవాత పల్లోంజీ మిస్త్రీకి బదిలీ అయ్యింది. రతన్‌ టాటాతో పల్లోంజీకి మంచి సంబంధాలున్నాయి.

హాకీ దిగ్గజం వరీందర్‌ మరణం

→ఒలింపిక్స్, ప్రపంచకప్‌ పతక విజేత, హాకీ దిగ్గజం వరీందర్‌ సింగ్‌ (75) మరణించారు.
→1970ల్లో భారత చిరస్మరణీయ విజయాల్లో భాగమైన వరీందర్‌ జలంధర్‌లో మృతిచెందారు.
→1975 కౌలాలంపూర్‌ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. ఫైనల్లో 2-1తో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌కు ప్రతిష్టాత్మక టోర్నీలో ఇదే ఏకైక స్వర్ణ పతకం.
→1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 1973 ఆమ్‌స్టర్‌డామ్‌ ప్రపంచకప్‌లో రజతం సాధించిన భారత జట్టుకు వరీందర్‌ ప్రాతినిధ్యం వహించాడు.
→1974, 1978 ఆసియా క్రీడల్లో రజతాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడు కూడా. 1975 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు.
→2007లో వరీందర్‌కు ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.

సరబ్‌జీత్‌ సోదరి దల్బీర్‌ మరణం

→గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్‌ జైలులో శిక్ష అనుభవిస్తూ, తోటి ఖైదీల దాడిలో మరణించిన సరబ్‌జీత్‌ సింగ్‌ సోదరి దల్బీర్‌కౌర్‌ (67) పంజాబ్‌ అమృత్‌సర్‌లో మరణించారు.
→తన సోదరుడిని నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె 22 ఏళ్ల పాటు పోరాటం చేశారు. సరబ్‌జీత్‌ను చూసేందుకు పాకిస్థాన్‌ సైతం వెళ్లివచ్చారు.
→సరబ్‌జీత్‌ సింగ్, దల్బీర్‌కౌర్‌ జీవితాల ఆధారంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ సైతం రూపొందింది. ఈ మేరకు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ దల్బీర్‌ పాత్రలో నటించిన ‘సరబ్‌జీత్‌’ చిత్రం 2016లో విడుదలైంది.
→సరబ్‌జీత్‌ సింగ్‌ భారత్, పాకిస్థాన్‌ సరిహద్దులోని భిఖివిండ్‌ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాక్‌లోకి ప్రవేశించారు.
→దీంతో గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన పాకిస్థాన్‌ ఆయనకు మరణశిక్ష విధించింది. అనంతరం లాహోర్‌లోని కోట్‌ లఖ్‌పత్‌ జైలులో శిక్ష అనుభవిస్తుండగా 2013లో తోటి ఖైదీలు దాడి చేశారు.
→తీవ్ర గాయాలపాలైన సరబ్‌జీత్‌ మరణించారు. అప్పటికి ఆయన వయసు 49 సంవత్సరాలు.

మాజీ ఒలింపియన్‌ హరిచంద్‌ మరణం

→మాజీ ఒలింపియన్‌ హరిచంద్‌ మరణించారు. ఆయన వయసు 69 ఏళ్లు. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కు చెందిన హరి లాంగ్‌డిస్టెన్స్‌ పరుగులో పలు రికార్డులు నెలకొల్పారు.
→1976 మాంట్రియల్, 1980 మాస్కో ఒలింపిక్స్‌లో మెరిసిన ఆయన 1978 ఆసియా క్రీడల్లో 5 వేల మీటర్లు, 10 వేల మీటర్ల పరుగులో స్వర్ణ పతకాలు సాధించారు.
→మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో 28 నిమిషాల 48.72 సెకన్లలో 10 వేల మీటర్ల పరుగును పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డు 32 ఏళ్ల పాటు నిలిచింది.
→మాంట్రియల్‌ క్రీడల్లో హీట్స్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచిన హరి ఆ తర్వాత మాస్కో ఒలింపిక్స్‌లో (29 నిమిషాల 45.8 సె) హీట్స్‌లో పదో స్థానం సాధించారు.


క్యాన్సర్‌తో సంతూర్‌ విద్వాంసుడు పండిట్‌ భజన్‌ సొపొరి మరణం

→ప్రసిద్ధ సంతూర్‌ విద్వాంసుడు, స్వరకర్త, ‘తీగల రారాజు’గా గుర్తింపు పొందిన పండిట్‌ భజన్‌ సొపొరి (73) మరణించారు.
→పెద్దపేగు క్యాన్సర్‌తో ఆయన గురుగ్రామ్‌లో మరణించారు.
→కశ్మీర్‌కు చెందిన ఆయన సంతూర్‌పై వీనులవిందుగా సరాగాలు పలికిస్తూ శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు.
→పదేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చారు. భజన్‌ సొపొరి భారతీయ శాస్త్రీయ సంగీతంలో డబుల్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేశారు.
→సంతూర్, సితార్‌లపై ప్రావీణ్యం సంపాదించారు. ఆయనకు ఆంగ్ల సాహిత్యంలోనూ మాస్టర్స్‌ డిగ్రీ ఉంది. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో పాశ్చాత్య సంగీతాన్ని అభ్యసించారు.
→హిందీ, కశ్మీరీ, డోగ్రీ, సింధీ, ఉర్దూ, భోజ్‌పురి సహా దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ, పర్షియన్, అరబిక్‌లలోనూ 6 వేలకు పైగా పాటలకు స్వరాలందించారు.
→గాలిబ్‌ సహా పలువురు ప్రముఖ కవులు రచించిన గజల్స్‌కు స్వరకల్పన చేశారు. కబీర్, మీరాబాయ్‌ రచనలకూ సంగీతం అందించారు.
→దేశంతో పాటు అంతర్జాతీయ వేదికలపై సంతూర్‌కు గుర్తింపును తెచ్చిన వ్యక్తిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు.
→భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో ఆయన్ను గౌరవించింది. సంగీత నాటక అకాడమీ అవార్డు, జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వం నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.
→పోస్టల్‌ శాఖ ఆయన పేరు మీద ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.

సెయిల్‌ మాజీ ఛైర్మన్‌ వి.కృష్ణమూర్తి మరణం

→ప్రభుత్వరంగ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, గ్యాస్‌ సంస్థ గెయిల్‌తో పాటు పాటు మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ (ప్రస్తుతం మారుతీ సుజుకీ ఇండియా) ఛైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ వెంకటరామన్‌ కృష్ణమూర్తి (97) చెన్నైలో మరణించారు.
→పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్‌ పురస్కార గ్రహీత అయిన వి.కృష్ణమూర్తి దిగ్గజ ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ, అత్యధిక లాభాలు ఆర్జించే సంస్థలుగా తీర్చిదిద్దారు.
→ఆయనను పబ్లిక్‌ సెక్టార్‌రంగ పితామహునిగా అభివర్ణిస్తారు. మారుతీ 800 కారుని భారత్‌లో ఆయనే ప్రవేశపెట్టారు.
→మాజీ సివిల్‌ సర్వెంట్‌ అయిన కృష్ణమూర్తి ఐఐఎం బెంగళూరు - అహ్మదాబాద్, ఐఐటీ దిల్లీ, భవనేశ్వర్‌లోని గ్జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలకు ఛైర్మన్‌గా వ్యవహరించారు.