నియామకాలు



గెయిల్‌ సీఎండీగా సందీప్‌ కుమార్‌ గుప్తా

→ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తదుపరి ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సందీప్‌ కుమార్‌ గుప్తాను (56) ఎంపిక చేశారు.
→ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
→ ప్రస్తుత సీఎండీ మనోజ్‌ జైన్‌ స్థానాన్ని సందీప్‌ భర్తీ చేయనున్నారు.
→ సందీప్‌ వాణిజ్య శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ చేసి తర్వాత ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ చేశారు.
→ ఐఓసీలో 31 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు.

సీబీడీటీ ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా

→కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
→గుప్తా 1986 బ్యాచ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కేడర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో (దర్యాప్తు) సభ్యుడిగా ఉన్నారు. 2023 సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
→1986 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి, బోర్డులో సభ్యురాలిగా ఉన్న సంగీతా సింగ్‌ ప్రస్తుతం సీబీడీటీ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
→జేబీ మహాపాత్ర ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయడంతో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. సీబీడీటీకి ఛైర్మన్, ప్రత్యేక కార్యదర్శి హోదాతో ఆరుగురు సభ్యులు ఉంటారు.

నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఏఎస్‌ రాజన్‌

→హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) డైరెక్టర్‌గా 1987 బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ఏఎస్‌ రాజన్‌ నియమితులయ్యారు.
→ప్రస్తుతం ఈయన కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌బ్యూరోలో స్పెషల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
→రాజన్‌ను నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమించాలని నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
→2023 ఫిబ్రవరి 28న ఆయన పదవీ విరమణ చేసే వరకూ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
→ప్రస్తుతం ఈ స్థానంలో 1988 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి అతుల్‌ కర్వాల్‌ సేవలందిస్తున్నారు.

నీతి ఆయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌

→నీతి ఆయోగ్‌ సీఈఓగా 1981 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు.
→ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న అమితాబ్‌కాంత్‌ పదవీ కాలం జూన్‌ 30వ తేదీన ముగియనున్న నేపథ్యంలో ఈయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
→రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. పరమేశ్వరన్‌ అయ్యర్‌ ఇది వరకు కేంద్ర పారిశుద్ధ్య, గ్రామీణ తాగునీటి శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
→మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ మిషన్‌ నిర్వహణ బాధ్యతలను ఈయనకు అప్పగించింది.
→ దేశవ్యాప్తంగా మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు.
→ 2009లో స్వచ్ఛంద పదవీ రమణ చేసి ప్రపంచబ్యాంకు చేపట్టిన తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
→ ఇప్పుడు నీతి ఆయోగ్‌ సీఈఓగా కీలక బాధ్యతల్లో నియమితులయ్యారు.

ఐబీ డైరెక్టర్‌గా తపన్‌కుమార్‌ డేకా

→కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌ డేకా నియమితులయ్యారు.
→ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌ పదవీ కాలం పూర్తికావడంతో డేకాను నియమిస్తూ నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది.
→కొత్త డైరెక్టర్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. డేకా ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఆపరేషన్స్‌ డెస్క్‌ బాధ్యతలు చూస్తున్నారు.

ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్త

→జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా పంజాబ్‌ మాజీ డీజీపీ, ఆ రాష్ట్రంలోని 1987 కేడర్‌ ఐపీఎస్‌ అధికారి దినకర్‌ గుప్త నియమితులయ్యారు.
→ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
→కేంద్ర హోం శాఖ ప్రతిపాదనకు నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేయడంతో ఈయన్ను నియమించినట్లు పేర్కొంది.
→గత ఏడాది మే నెలలో సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌ సింగ్‌కు ఎన్‌ఐఏ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు దినకర్‌ను నియమించారు.
→ఈయన 2024 మార్చి 31 వరకూ ఆ హోదాలో కొనసాగుతారు.

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్‌

→ఐరాసలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా సీనియర్‌ దౌత్యవేత్త రుచిరా కంబోజ్‌ నియమితులయ్యారు.
→ఇంతవరకు ఆ స్థానంలో ఉన్న టి.ఎస్‌.తిరుమూర్తి స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు.
→1987 బ్యాచ్‌ ‘ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌’ (ఐఎఫ్‌ఎస్‌) అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా ఉన్నారు.
→1987 బ్యాచ్‌ సివిల్స్‌లో జాతీయ స్థాయి మహిళా అభ్యర్థుల్లో ఆమె ప్రథమురాలుగా నిలిచారు.
→ఆ ఏడాది ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌లోనూ అగ్రశ్రేణిలో ఆమే నిలిచారు. దిల్లీతో పాటు ఫ్రాన్స్, మారిషస్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఆమె సేవలందించారు.

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

→తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నియమితులయ్యారు.
→ప్రస్తుతం తెలంగాణలో సీజేగా సేవలందిస్తున్న జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ దిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
→సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17వ తేదీన పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తాజాగా ఆమోదముద్ర వేశారు.
→మొత్తం అయిదు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం, ఒక ప్రధాన న్యాయమూర్తి బదిలీకి కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి యథాతథంగా ఆమోదించారు.
→ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
→ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సీజేగా పదోన్నతి పొందారు.
→ఈయన 1964 ఆగస్టు 2న అస్సాం రాజధాని గువాహటిలో జన్మించారు. తండ్రి సుచేంద్ర నాథ్‌ భూయాన్‌ ఆ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలందించారు.
→ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రాథమిక స్థాయి నుంచి ఎల్‌ఎల్‌ఎం వరకు గువాహటిలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు.
→1991 మార్చి 20న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని అక్కడి హైకోర్టులో వృత్తి జీవితం ప్రారంభించారు.
→హైకోర్టు పరిధిలోని అగర్తల, షిల్లాంగ్, కొహిమా, ఈటా నగర్‌ బెంచిల ముందు వాదనలు వినిపించారు. ఆదాయపన్ను శాఖ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.
→2002 ఏప్రిల్‌ నుంచి 2006 అక్టోబరు వరకు మేఘాలయలో ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌గా, 2005 నుంచి 2009 వరకు అరుణాచల్‌ప్రదేశ్‌ అటవీశాఖ ప్రత్యేక న్యాయవాదిగా సేవలందించారు.
→ 2010 మార్చి 3న గువాహటి హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2010 సెప్టెంబరు 6న సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా పొందారు.
→2011 జులై 21న అస్సాం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. అదే ఏడాది అక్టోబరు 17న గువాహటి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
→ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
→తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2021 అక్టోబరు 11 నుంచి పనిచేస్తున్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ఇకపై దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.

ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ రంజనా దేశాయ్‌

→ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ నియమితులయ్యారు.
→ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ ఈమె.
→రంజనా దేశాయ్‌ (72) నియామకంపై గెజెట్‌ నోటిఫికేషన్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఎం.కె.సిన్హా

→గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌గా ముకేశ్‌ కుమార్‌ సిన్హా నియమితులయ్యారు.
→ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
→కొన్ని నెలల క్రితం వరకు గోదావరి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న చంద్రశేఖర్‌ అయ్యర్‌కు కేంద్ర జల్‌ సంఘం సభ్యునిగా పదోన్నతి రావడంతో ఆయన స్థానంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ ఎం.పి.సింగ్‌కు జీఆర్‌ఎంబీ అదనపు బాధ్యతలు అప్పగించారు.
→కొత్త ఛైర్మన్‌గా సిన్హాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శిగా వీఎస్‌కే కౌముది

→కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శిగా (భద్రత) 1986 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి వీఎస్‌కే కౌముది నియమితులయ్యారు.
→ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన హోం శాఖలో అంతర్గత భద్రతా వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఐఐసీటీ కొత్త డైరెక్టర్‌గా శ్రీనివాస్‌రెడ్డి

→ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కొత్త డైరెక్టర్‌గా డాక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు.
→ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.ఎం.తివారీ హైదరాబాద్‌ తార్నాకలో బాధ్యతలు స్వీకరించారు.
→2020 నుంచి డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి జమ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (ఐఐఐఎం) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
→లఖ్‌నవూలోని సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీడీఆర్‌ఐ)కు ఫిబ్రవరి 2022 నుంచి అదనపు ఛార్జ్‌ హోదాలో డైరెక్టర్‌గా ఉన్నారు.
→పరిశోధన రంగంలో ఆయనకు 20 ఏళ్ల అనుభవం ఉంది. యాదాద్రి భువనగరి జిల్లా రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
→చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ల్యాబొరేటరీస్‌ ఆఫ్‌ సెర్గే, కాన్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫ్రీ ఆబే ల్యాబొరేటరీస్‌ నుంచి 2001 - 03లో పోస్టు డాక్టొరల్‌ వర్క్‌ చేశారు.
→2010లో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీలో సీనియర్‌ శాస్త్రవేత్తగా చేరారు.
→తన పరిశోధనలకు 35 పేటెంట్లు వచ్చాయి. ప్రముఖ జర్నల్స్‌లో 120 పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి.
→రసాయన శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు అందుకున్నారు.

సమీర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పి.హనుమంతరావు

→సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (సమీర్‌) డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ పి.హనుమంతరావు (సైంటిస్ట్‌-ఎఫ్‌) నియమితులయ్యారు.
→కేంద్ర నియామకాల కేబినెట్‌ కమిటీ అనుమతితో ఆయనను ఈ పదవిలో నియమించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
→ఈ సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో స్వతంత్రంగా పనిచేస్తుంది.
→మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్, ఎలెక్ట్రోమాగ్నెటిక్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ రంగాల్లో ఇది పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది.
→ముంబయి, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, గువాహటీల్లో దీని శాఖలు ఉన్నాయి.

ఎస్‌బీఐ ఎండీగా అలోక్‌ ఛౌధ్రి

→స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైర్టెర్‌ (రిటైల్‌ బిజినెస్, కార్యకలాపాలు)గా అలోక్‌ కుమార్‌ ఛౌధ్రి బాధ్యతలు స్వీకరించారు.
→ఇప్పటివరకు ఆయన బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఉన్నారు. ఎస్‌బీఐకి ఛైర్మన్‌ దినేశ్‌ ఖారాతో పాటు నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లున్నారు.
→ఛౌధ్రితో పాటు సీఎస్‌ శెట్టి, స్వామినాథన్‌ జె, అశ్విని కుమార్‌ తివారీ ఎండీలుగా ఉన్నారు.

టీడీశాట్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌

→టెలికాం వివాద పరిష్కార అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీ శాట్‌) ఛైర్‌పర్సన్‌గా దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌ నియమితులయ్యారు.
→ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా మణిమేఖలై

→యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) కొత్త ఎండీ, సీఈఓగా ఎ మణిమేఖలై పదవీ బాధ్యతలు చేపట్టారు.
→ఆమెకు బ్యాంకింగ్‌ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1988లో విజయా బ్యాంకులో ఆఫీసర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.
→అక్కడ వివిధ విభాగాల్లో పనిచేశారు. తదుపరి కెనరా బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు.
→ప్లానింగ్, క్రెడిట్, ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్, ఎస్‌ఎల్‌బీసీ తదితర విభాగాల్లో బాధ్యతలను నిర్వహించారు. తాజాగా యూబీఐ ఎండీ, సీఈఓగా నియమితులయ్యారు.
→బెంగుళూరు యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్‌) పట్టా అందుకున్న ఆమె తదుపరి నార్సీ మోంజీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ నుంచి హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ లో డిప్లొమో చేశారు.

పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా స్వరూప్‌ కుమార్‌ సాహా

→పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌కు కొత్త ఎండీ, సీఈఓగా స్వరూప్‌ కుమార్‌ సాహా నియమితులయ్యారు.
→ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
→ఇప్పటి వరకూ ఆయన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.
→కోల్‌కతా యూనివర్సిటీ నుంచి సైన్స్‌ డిగ్రీ పుచ్చుకున్న స్వరూప్‌ 1990లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు.
→ఆ తర్వాత బ్యాంకింగ్‌ రంగంలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు.