జాతీయం
మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ శిందే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.ఫడణవీస్ నివాసంలో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి శిందే రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిశారు.
మొత్తంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకి ఉందని చెప్పారు. ఆ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేత రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు.
బాష్ స్మార్ట్ క్యాంపస్ ఆవిష్కరణ
రెండేళ్ల కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో నవ్యాలోచనల ఆవశ్యకత పెరిగింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సమీకృత సాంకేతిక వ్యవస్థల అవసరం అధికమైంది.ఈ అవసరాలకు అనుగుణంగా కేంద్రం హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ఓ మైలురాయి.
దీనిని ప్రతి గ్రామానికీ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన బెంగళూరులో బాష్ స్మార్ట్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
75 ఏళ్ల అమృత మహోత్సవం సందర్భంగా 25 ఏళ్ల ప్రణాళికలను సిద్ధం చేసుకొని వాటిని సాకారం చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
బాష్ స్మార్ట్ క్యాంపస్‌లో 85 శాతం సౌర, హరిత ఇంధనాన్ని వినియోగిస్తారు. మూడింట రెండొంతుల భాగం వాన నీటిని వాడతారు.
రూ.2,516 కోట్లతో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
దేశవ్యాప్తంగా ఉన్న 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (ప్యాక్స్) రూ.2,516 కోట్లతో కంప్యూటరీకరించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసింది.
ఈ సంస్థల సామర్థ్యం పెంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.
దీనివల్ల ప్యాక్స్ తమ వ్యాపార కార్యకలాపాలను విభిన్న రంగాలకు విస్తరించడంతో పాటు, ఏకకాలంలో బహుళ సేవలు అందించడానికి వీలవుతుందని తెలిపింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ భూయాన్‌తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ భూయాన్ తొలి రోజు మొదటి కోర్టు హాలులో కేసుల విచారణను చేపట్టారు.జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముంబయి హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చి ఇక్కడే ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1964 ఆగస్టు 2న అస్సాంలోని గువాహటిలో జస్టిస్ భూయాన్ జన్మించారు. 1991 మార్చిలో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. 2010లో సీనియర్ న్యాయవాది హోదా పొందగా, అస్సాం అదనపు అడ్వొకేట్ జనరల్‌గా విధులు నిర్వహించారు. ఆయన తండ్రి కూడా అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. 2011 అక్టోబరు 17న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భూయాన్ నియమితులయ్యారు. 2019లో అక్టోబరులో ముంబయి హైకోర్టుకు బదిలీపై వచ్చి, అక్కడి నుంచి 2021 అక్టోబరు 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించిన ఆయన ఇక ముందు ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించనున్నారు.
దిల్లీ సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ
దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన ఆయన ఇటీవలే దిల్లీకి బదిలీ అయ్యారు. జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మతో దిల్లీ లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు.దిల్లీ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా ఫుల్ బాడీస్కానర్ ఏర్పాటు
దేశ రాజధాని దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో ప్రయోగాత్మకంగా ‘ఫుల్ బాడీస్కానర్’ను ఏర్పాటు చేశారు. దీని పనితీరును పరిశీలించడం ప్రారంభించారు. ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ నిర్దేశించిన మేరకు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఈ స్కానర్‌ను ఏర్పాటు చేసింది. భద్రతా సిబ్బంది ప్రయాణికులను వ్యక్తిగతంగా తడిమి తనిఖీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ స్కానర్ వారివద్ద ఉన్న అన్ని రకాల వస్తువులను గుర్తిస్తుంది. ప్రస్తుతం సంప్రదాయంగా ఉపయోగిస్తున్న డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ గుర్తించలేని లోహేతర వస్తువులను (నాన్ మెటల్ ఆబ్జెక్టివ్స్) ఈ స్కానర్ కనిపెడుతుంది. దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని జీఎంఆర్ సంస్థ స్పష్టం చేసింది.ధ్రువ స్పేస్‌కు ‘ఇన్-స్పేస్’ గుర్తింపు
అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తూ నూతన అంతరిక్ష విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం, అందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే ఉద్దేశంతో ఇన్-స్పేస్ (ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) అనే సంస్థను ఏర్పాటు చేసింది. రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు చేపట్టే ప్రైవేటు రంగ సంస్థలను గుర్తించే పనిని ఈ సంస్థ చేపట్టింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇన్-స్పేస్ గుర్తింపు ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన శాటిలైట్ ఆర్బిటల్ డిప్లాయర్ (డీఎస్‌ఓడీ) కు గుర్తించి ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో పాటు బెంగళూరుకు చెందిన దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రోబస్ట్ ఇంటిగ్రేటింగ్ ప్రోటాన్ ఫ్ల్యూయన్స్ మీటర్ (రోబి)కు కూడా గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొంది. జూన్ 30న శ్రీహరి కోట నుంచి ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పోయమ్) పేలోడ్‌లో ఈ రెండు సంస్థల ఉపకరణాలు భాగంగా ఉంటాయి. ఈ రెండు సంస్థల ఉత్పత్తులకు గుర్తింపు ఇవ్వడం ద్వారా, మనదేశం చేపట్టే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగ సంస్థల అధ్యాయం మొదలవుతోందని ఇన్-స్పేస్ ఛైర్మన్ పవన్ కుమార్ గోయంకా పేర్కొన్నారు.కేరళలో టాటా పవర్ అతి పెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం
టాటా పవర్‌కు చెందిన అనుబంధ సంస్థ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపింది. 101.6 మెగావాట్ల గరిష్ఠ (ఎండబ్ల్యూపీ) సామర్థ్యంతో కేరళ బ్యాక్‌వాటర్స్‌లో దీన్ని నెలకొల్పినట్లు పేర్కొంది. కాయమ్‌కులమ్‌లోని వాటర్‌బాడీలో 350 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును స్థాపించినట్లు కంపెనీ వెల్లడించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పంద విభాగంలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్ (ఎఫ్‌ఎస్‌పీవీ) ప్రాజెక్టు ఇదేనని టాటా పవర్ సీఈఓ, ఎండీ ప్రవీర్ సిన్హా వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (కేఎస్‌ఈబీ) తీసుకుంటుందని పేర్కొన్నారు.ప్రగతి మైదాన్‌లో ప్రధాన సొరంగం, 5 అండర్‌పాస్‌లను ప్రారంభం
దేశ రాజధాని దిల్లీలో ప్రగతి మైదాన్ సమీకృత రవాణా కారిడార్‌లో ప్రధాన సొరంగం, 5 అండర్‌పాస్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో రానున్న రోజుల్లో దిల్లీ ముఖ చిత్రమే మారిపోతోందని చెప్పారు. సొరంగం, అండర్‌పాస్‌లపై వేసిన చిత్రాలను ఆయన ప్రశంసించారు. రాబోయే 25 ఏళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, నగరాలు మరింత హరితంగా, స్వచ్ఛంగా, స్నేహపూర్వకంగా ఉండాలని మోదీ సూచించారు.వడోదరాలో ప్రధాని మోదీ రూ.21 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భారత్ అభివృద్ధి చెందాలంటే మహిళలకు సాధికారత కల్పించడం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని వడోదరాలో రూ.21 వేల కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గిరిజన మహిళలకు పోషకాహారం అందించే కార్యక్రమాన్ని సైతం ప్రారంభించారు. రూ.16,000 కోట్ల విలువ చేసే 18 రైల్వే ప్రాజెక్టులను వీడియో లింకు ద్వారా ఆవిష్కరించారు. గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత ప్రహరీ ఏర్పాటుకు, భారతీయ గతిశక్తి విశ్వవిద్యాలయ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.2020 - 21లో 8 జాతీయ పార్టీలకు రూ.1,374 కోట్ల ఆదాయం
దేశంలోని ఎనిమిది జాతీయ పార్టీలు 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,373.783 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించాయి. వాటిలో ఒక్క భాజపాదే 55% వాటా కావడం గమనార్హం. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తెలిపింది. భాజపా, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)లను ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీలుగా గుర్తించింది. వీటిలో భాజపా ఒక్కటే 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో రూ.752.337 కోట్లు సంపాదించింది. ఇది అన్ని పార్టీల ఆదాయంలో 54.764%. దాని తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రూ.285.765 కోట్లు (20.801%) వచ్చింది. వ్యయం విషయానికొస్తే, భాజపా రూ.421.014 కోట్లను ఎన్నికలు, సాధారణ ప్రచారానికి, పాలనాపరమైన ఖర్చులకు రూ.145.688 కోట్లు వెచ్చించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి రూ.91.358 కోట్లు, పాలనాపరమైన ఖర్చులకు రూ. 88.439 కోట్లు వెచ్చించింది. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి రూ.90.419 కోట్లు, ఇతర వ్యయాలకు రూ.3.96 కోట్లు ఖర్చు చేసింది.ఆరేళ్లలో 81.48% పెరిగిన రుణభారం
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక అప్పులను తగ్గించి దీర్ఘకాలిక రుణాల వైపు వెళ్తున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కంపెనీకి చెందిన ఐసీఆర్‌ఏ సంస్థ పేర్కొంది. ఆర్థిక లోటును భర్తీ చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా ‘స్టేట్ డెవెలప్‌మెంట్ లోన్స్’ పేరుతో బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు సేకరిస్తుంటాయి. ఇలాంటివి 2018 మార్చి 31 నాటికి రూ.24.3 లక్షల కోట్లు ఉండగా, 2022 మార్చి 31 నాటికి రూ.44.1 లక్షల కోట్లకు చేరాయి. ఆరేళ్లలో ఈ రుణభారం 81.48% పెరిగింది. 2017 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు పదేళ్ల కాలపరిమితితో బాండ్లు జారీ చేసి రుణాలను సేకరించేవి. 2018 - 19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానంలో మార్పు వచ్చింది. ఆ ఏడాది మొత్తం రుణాల్లో 10% మొత్తాన్ని 10 ఏళ్లకు మించిన దీర్ఘకాలానికి తీసుకున్నాయి. 2022 - 23 ఆర్థిక సంవత్సరం నాటికి పదేళ్లకు మించిన కాలపరిమితితో తీసుకున్న రుణాలు 45%కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పుల్లో అయిదో వంతు (రూ.8.3 లక్షల కోట్లు) రుణ కాలపరిమితి 2033 - 60 మధ్యకాలంలో తీరుతుంది. ఇందులో తెలంగాణ (17%), పశ్చిమ బెంగాల్ (16%),ఆంధ్రప్రదేశ్ (14%), తమిళనాడు (10%), కర్ణాటక (8%), మహారాష్ట్ర, హరియాణా (6% చొప్పున), పంజాబ్, మధ్యప్రదేశ్ (5% చొప్పున), మిగిలిన రాష్ట్రాలు (13%) చెల్లించాల్సి ఉంటుంది.తొలి ప్రైవేటు ‘దేఖో అప్నా దేశ్’ రైలు పార్రంభం
కోయంబత్తూరు నార్త్ నుంచి సాయినగర్ శిర్డీకి తొలి ప్రైవేటు రైలు బయలుదేరింది. కేంద్రం ‘భారత్ గౌరవ్’ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే. అయిదు రోజుల పాటు ప్యాకేజీ టూర్ కింద ఇందులో ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 1100 మంది ప్రయాణికులతో ‘దేఖో అప్నా దేశ్’ పేరిట కోయంబత్తూరు నార్త్‌లో బయలుదేరిన రైలు సాయినగర్ శిర్డీకి 16వ తేదీన చేరుతుంది.ధొలేరా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
గుజరాత్‌లోని ధొలేరాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి 1,501 ఎకరాల భూమిని కేటాయించారు. ధొలేరా ఇంçర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ దీని నిర్మాణ పనులు చేపడుతుంది. 48 నెలల్లో పనులు పూర్తి చేస్తారు. ఇందులో ప్రయాణికులు, కార్గో రవాణాకు అవకాశం ఉంటుంది.కొలంబోలో సాంకేతికత బదిలీ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం
శ్రీలంక రాజధాని కొలంబోలో ‘బిమ్స్‌టెక్’ ఆధ్వర్యంలో సాంకేతికత బదిలీ కేంద్రం ఏర్పాటుకు ఉద్దేశించిన సహకార ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ - సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్స్‌టెక్)’ సభ్య దేశాలు 2021 మార్చి 30న జరిగిన సదస్సులో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. బిమ్స్‌టెక్ సభ్య దేశాల మధ్య సాంకేతికత బదిలీలో సహకారాన్ని బలోపేతం చేయడం టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ సెంటర్ ప్రధాన లక్ష్యం. ఈ దిశగా భారత్ తోడ్పాటును అందిస్తుందని పేర్కొంది.వర్సిటీల కులపతుల నియామక బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం
ఇక పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రే ఆ రాష్ట్రం నడిపే విశ్వవిద్యాలయాలకు కులపతిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర శాసనసభ పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ లాస్ (సవరణ) బిల్లు - 2022ను ఆమోదించింది. దీంతో ఇప్పటివరకు కులపతి బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కఢ్ స్థానంలో సీఎం మమతా బెనర్జీ ఆ పదవిలో కొలువదీరనున్నారు. 294 మంది సభ్యులు గల రాష్ట్ర శాసనసభలో బిల్లుకు అనుకూలంగా 182 మంది, వ్యతిరేకంగా 40 మంది ఓటేశారు.కాలేయ చికిత్సల కోసం తొలిసారి ప్రత్యేక విభాగం ప్రారంభించిన ఏఐజీ
మద్యపానం అలవాటు లేని వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. జీవనశైలిలో మార్పులు, ఆహారపుటలవాట్లే ఇందుకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వుల వల్ల కొన్నాళ్లకు కాలేయం గట్టిపడి పనితీరు మందగిస్తుంది. చివరకు కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ సమస్యలకు సంబంధించి నిపుణులతో కూడిన ప్రత్యేక విభాగాన్ని దేశంలోనే తొలిసారిగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)లో అందుబాటులోకి తెచ్చారు. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఈ క్లినిక్ ప్రారంభమైంది.మహారాష్ట్రలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రపంచ రికార్డు
ఓ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత వేగవంతంగా పూర్తిచేసి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. మహారాష్ట్రలో అమరావతి - అకోలా జిల్లాల మధ్య 75 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై తారు రోడ్డు (సింగిల్ లేన్) నిర్మాణాన్ని నిరంతరాయంగా 105 గంటల 33 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఈ మేరకు ప్రపంచ రికార్డు సాధించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 720 మంది పగలూ రాత్రీ శ్రమించి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. అత్యంత వేగవంతంగా తారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు గిన్నిస్ ప్రపంచ రికార్డు దోహా (ఖతార్)లో 2019 ఫిబ్రవరిలో చేపట్టిన ఓ రహదారి పేరిట ఉండేది. అక్కడ 25.275 కిలోమీటర్ల రోడ్డును 10 రోజుల్లో పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. తాజాగా మహారాష్ట్రలో నిర్మించిన రోడ్డు 53వ జాతీయ రహదారిలో భాగంగా ఉంది. కోల్‌కతా, రాయ్‌పుర్, నాగ్‌పుర్, సూరత్ వంటి ప్రధాన నగరాలను కలిపే ఈ రహదారి ‘తూర్పు-తూర్పు నడవా’ (ఈస్ట్-ఈస్ట్ కారిడార్)లో కీలకమైన మార్గం.భాగ్యనగరంలో మింట్ మ్యూజియం!
ప్రపంచం క్రిప్టో కరెన్సీ వైపు పరుగులు పెడుతున్న వేళ భావితరాలకు అప్పటి, ఇప్పటి నాణేల ముద్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సైఫాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ‘మింట్ మ్యూజియం’ ప్రారంభమైంది. జూన్ 13 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.‣ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సైఫాబాద్ టంకశాలలో మ్యూజియం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్) సంకల్పించింది. ఈ మేరకు ఏడు నెలల క్రితం పనులు మొదలుపెట్టారు. 1901 నాటి ఈ భవనం శిథిలావస్థకు చేరుకోగా పునరుద్ధరించడంతో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎస్‌పీఎంసీఐఎల్ సంస్థ ఛైర్మన్, ఎండీ త్రిప్తిఘోష్ దీన్ని ప్రారంభించారు.
నిజాం కాలం నుంచి ఇప్పటివరకు అచ్చు వేసిన నాణేలు, అందుకోసం ఉపయోగించిన పనిముట్లు, యంత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. షేర్‌షా సూరి కాలం నాటి తొలి నాణెం మొదలుకుని ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. వాటిని అచ్చువేసిన తీరును వివరించే ఏర్పాట్లు చేశారు. మ్యూజియంలోకి ప్రవేశించగానే ఇందుకు సంబంధించి సుమారు వందేళ్ల చరిత్రకు సంబంధించిన వీడియో ప్రదర్శన ఉంటుంది.
1803లో హైదరాబాద్ రాజ్యంలో అసఫ్‌జా-3 మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్‌జా కాలంలో పనిముట్లతో నాణేల ముద్రణ ప్రారంభమైంది. సుల్తాన్‌షాహీలో ఉన్న రాయల్ ప్యాలెస్‌లో ఏర్పాటైన మింట్‌లో నిజాం సంస్థానం నాణేలు తయారయ్యేవి. 1895లో లండన్ నుంచి ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. పూర్తిస్థాయిలో ఆధునికీకరించే ఉద్దేశంతో సైఫాబాద్‌లో ప్రత్యేక భవనాన్ని నిర్మించి 1903లో యూరప్ మింట్‌ల తరహాలో ఏర్పాటుచేశారు. 1918లో హైదరాబాద్ కరెన్సీ చట్టాన్ని తెచ్చి, నోట్ల ముద్రణనూ ప్రారంభించారు. 1997 వరకు సైఫాబాద్‌లోని టంకశాలలోనే కరెన్సీని ముద్రించారు. తర్వాత చర్లపల్లిలో కొత్త మింట్‌ను ఏర్పాటు చేశారు.
మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైన జహంగీర్ కాలంలో 1613లో రూపొందించిన 11.938 కిలోల బంగారు నాణేనికి సంబంధించిన నమూనాను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నిజాం ఉల్‌ముల్క్ అసఫ్‌జా తండ్రి షా-అబు-ది-దిన్‌ఖాన్ బహదూర్ ఫిరూజ్ జంగ్‌కు దీనిని బహూకరించారు. దీనిని స్విట్జర్లాండ్‌లో వేలం వేయగా, నాణేలు సేకరించే వ్యక్తి ఒకరు దాని నమూనాని రూపొందించి మింట్‌కు అందించారు.
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ వారోత్సవాల ప్రారంభం
అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా గొలుసులో భారతీయ బ్యాంకులు, కరెన్సీ (రూపాయి) ప్రముఖ పాత్ర పోషించేలా చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల ఆధ్వర్యంలో దిగ్గజ వారోత్సవాలను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత, వ్యాపారులు, రైతులు సులభంగా రుణాలు పొందేలా 13 ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తూ రూపొందించిన ‘జన్ సమర్థ్ పోర్టల్’ను మోదీ ప్రారంభించారు.స్వాతంత్య్ర అమృతోత్సవ నాణేల విడుదల
ప్రధాని స్వాతంత్య్ర అమృతోత్సవాల లోగోతో కొత్త సిరీస్ నాణేలను విడుదల చేశారు. ఇందులో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 కాయిన్లు ఉన్నాయి. ఇవి సాధారణ నాణేల తరహాలోనే చలామణిలోకి రానున్నాయి. దృష్టి లోపంతో బాధపడుతున్నవారు కూడా గుర్తించేందుకు వీలుగా వాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దేశాభివృద్ధి కోసం కృషి చేసేలా అమృతోత్సవ వేడుకల ఉద్దేశాన్ని ఈ నాణేలు ఎప్పుడూ గుర్తు చేస్తాయని మోదీ వ్యాఖ్యానించారు.దేశంలో తొలి మిర్రర్ టెలిస్కోపు ఏర్పాటు
దేశంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఉత్తరాఖండ్‌లో ఏర్పాటైంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ సంస్థ నైనితాల్ కొండ ప్రాంతంలోని దేవస్థల్ అబ్జర్వేటరీ వద్ద ఈ టెలిస్కోపును ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపుగా (ఐఎల్‌ఎంటీ) పిలుస్తున్న ఈ పరికరం, ఆస్టరాయిడ్లు, సూపర్‌నోవాలతో పాటు అంతరిక్ష వ్యర్థాలపై పరిశీలన చేస్తుంది. ఆసియాలో అతిపెద్ద మిర్రర్ టెలిస్కోపుగా ఇది నిలవనుంది. ప్రపంచంలో ఇలాంటి టెలిస్కోపులు కొన్ని మాత్రమే ఉన్నాయి. అవన్నీ సైనిక అవసరాలు, లేదా ఉపగ్రహాలపై కన్నేసి ఉంచేందుకు ఏర్పాటు చేశారు. ఖగోళ పరిశోధనల కోసం ప్రపంచంలోనే తొలిసారి ఏర్పాటు చేసిన లిక్విడ్ మిర్రర్ టెలిస్కోపు ఇదే కావడం విశేషం. హిమాలయాల్లో 2,450 మీటర్ల ఎత్తైన ప్రాంతంలో లిక్విడ్ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. ఈ టెలిస్కోపును ఉపయోగించి అక్టోబర్ నుంచి శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అడ్వాన్స్‌డ్ మెకానికల్ అండ్ ఆప్టికల్ సిస్టమ్స్ కార్పొరేషన్, బెల్జియంకు చెందిన సెంటర్ స్పేషియల్ డి లీజ్ సంస్థలు కలిసి ఈ టెలిస్కోపును డిజైన్ చేశాయి. కెనడా, బెల్జియం దేశాలు దీని ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చాయి. టెలిస్కోపు నిర్వహణ బాధ్యతలను భారత్ చూసుకుంటుంది.గుర్రపుడెక్కతో ఒడిశాలో అలంకరణ వస్తువుల తయారీ
గుర్రపుడెక్క ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా మారింది. అయితే, దీన్నే ఉపాధి మార్గంగా మలచుకోవచ్చంటోంది అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్). ఒడిశా రాష్ట్రంతో పాటు ఆఫ్రికా మహిళలు ఈ బాటలో పయనించి విజయవంతమయ్యారని వెల్లడించింది. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఏకంగా 2 వేల నీటి వనరుల్లో గుర్రపుడెక్క బాగా పెరిగిపోయింది. ఈ సమస్యకు పరిష్కారంగా గుర్రపుడెక్క ఆకులను వినియోగించి వారు అలంకరణ వస్తువులను తయారీ చేస్తున్నారని ఇక్రిశాట్ తెలిపింది. ఈ ఆకులకు వరి ధాన్యం పొట్టు, ఆవుపేడ కలిపి జీవ ఇంధనం తయారు చేయవచ్చనీ పేర్కొంది.ఐఎన్‌ఎస్ అక్షయ్, ఐఎన్‌ఎస్ నిషాంక్ యుద్ధనౌకలకు వీడ్కోలు
దేశ రక్షణలో 32 ఏళ్ల పాటు భాగంగా ఉన్న రెండు యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ అక్షయ్, ఐఎన్‌ఎస్ నిషాంక్‌లకు భారత నౌకాదళం తుది వీడ్కోలు పలికింది. ముంబయిలోని నౌకాదళ డాక్‌యార్డ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా వీటిపై జాతీయ జెండాను దించేసింది. అలాగే ఆ నౌకల చిహ్నాలను తొలగించడం ద్వారా వాటిని సర్వీసు నుంచి ఉపసంహరించింది. ఐఎన్‌ఎస్ నిశాంక్ వేగంగా దూసుకెళ్లే క్షిపణి ప్రయోగ నౌక. ఇది 1989 సెప్టెంబరు 12న నౌకాదళంలో చేరింది. అలాగే కార్వెట్ తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ అక్షయ్ 1990 డిసెంబరు 10న నేవీలో ప్రవేశించింది. ఈ రెండూ కార్గిల్ యుద్ధ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ తల్వార్, 2001లో నిర్వహించిన ఆపరేషన్ పరాక్రమ్‌లో పాలుపంచుకున్నాయి.ఆర్య సమాజ్ వివాహ ధ్రువపత్రాలు చట్టబద్ధం కాదు: సుప్రీం
ఆర్య సమాజ్ జారీ చేసే వివాహ ధ్రువపత్రాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది.జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అలాంటి అధికారం ఆర్యసమాజ్‌కు లేదన్న ధర్మాసనం సంబంధిత అధికారులు జారీ చేసిన వివాహ ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రేమ వివాహానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ ధ్రువపత్రం అతడు సమర్పించగా సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరిస్తూ బెయిలు పిటిషన్‌ను కొట్టివేసింది.
వరంగల్, కరీంనగర్ పీఎఫ్ కార్యాలయాలకు జాతీయ స్థాయి గుర్తింపు
కరోనా సమయంలో అత్యధిక మంది ఖాతాదారులకు పరిహారం చెల్లించినందుకు గాను దేశంలోని పది అత్యున్నత ప్రాంతీయ కార్యాలయాల్లో వరంగల్, కరీంనగర్‌లలోని ప్రాంతీయ భవిష్య నిధి (పీఎఫ్) కార్యాలయాలు చోటు దక్కించుకున్నాయి.కేంద్ర లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మంత్రిత్వ శాఖ, దిల్లీ ఈపీఎఫ్ ముఖ్య కార్యాలయ అధికారులు ప్రాంతీయ కమిషనర్లు రవితేజ కుమార్‌రెడ్డి (వరంగల్), తానయ్య (కరీంనగర్)లకు ప్రశంసాపత్రం అందించారు.