అంతర్జాతీయం
ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దు
ఇజ్రాయెల్‌లో సైద్ధాంతిక విభేదాలున్నా బెంజమిన్ నెతన్యాహును దేశాధ్యక్ష పీఠం నుంచి దించేయడమే ఏకైక లక్ష్యంగా గత ఏడాది ఏర్పడిన సంకీర్ణ సర్కారు తాజాగా కూలిపోయింది. పార్లమెంటు ‘నెస్సెట్’ రద్దయింది. దీంతో నాలుగేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే దేశంలో ఐదోసారి సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు రంగం సిద్ధమైంది. నవంబరు 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కూటమిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇన్నాళ్లూ ప్రధానమంత్రిగా కొనసాగిన నఫ్తాలీ బెన్నెట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. తన పదవీ బాధ్యతలను విదేశాంగ మంత్రి యయిర్ లిపిడ్‌కు అప్పగించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేంతవరకు లిపిడ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు.
శ్రీలంకలో 50% దాటిన ద్రవ్యోల్బణం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ద్రవ్యోల్బణం అమాంతం పెరిగింది. జూన్‌లో ఇది 50% దాటిపోయినట్లు దేశ గణాంకాల విభాగం వెల్లడించింది. కొలంబో వినియోగదారుల ధరల సూచీ ప్రకారం.. మే నెలలో 39%గా ఉన్న ద్రవ్యోల్బణం జూన్‌లో 54.6%కి పెరిగింది.
భారత్, యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిర్ణయం
భారత్ - యూఏఈ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీన్ని మరిన్ని రంగాలకూ విస్తరించాలని తీర్మానించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూఏఈ కొత్త అధ్యక్షుడు, అబుధాబి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహార భద్రత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య బంధం వృద్ధి చెందుతోందన్నారు.
జీ7 కూటమి ‘పార్టనర్‌షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్’ (పీజీఐఐ) పథకం ఆవిష్కరణ
2027 నాటికి భారత్ వంటి వర్ధమాన దేశాల్లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు పారదర్శకంగా నిధులు అందించేందుకు జీ7 కూటమి ‘పార్టనర్‌షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్’ (పీజీఐఐ) అనే పథకానికి సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించింది. దీని కింద 600 బిలియన్ డాలర్లు సమకూర్చనున్నట్లు తెలిపింది. చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’కు పోటీగా దీన్ని చేపట్టినట్లు భావిస్తున్నారు. పీజీఐఐ కోసం వచ్చే ఐదేళ్లలో 200 బిలియన్ డాలర్లను గ్రాంట్ల రూపంలో అమెరికా సమకూర్చనుందని శ్వేతసౌధం ప్రకటించింది. ఇతరుల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం
జీ7 దేశాల ఉమ్మడి ప్రకటన
అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఐరాస ఛార్టర్‌లో పొందుపరిచిన సూత్రాలను గౌరవించి వాటి పరిరక్షణకు పాటుపడాలని జీ7 నేతలు సంకల్పించారు. శాంతి, మానవ హక్కులు, న్యాయబద్ధ పాలన పరిరక్షణలో నిబద్ధతతో వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకçన విడుదల చేశారు. ప్రజాస్వామ్య దేశాల స్థితిస్థాపకతను బలోపేతం చేయడం, వాతావరణ మార్పులు, కొవిడ్ మహమ్మారి లాంటి ప్రపంచ సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను కనుగొనడానికి నిబద్ధతతో కృషి చేస్తామని అందులో పేర్కొన్నారు.
బంగ్లాలో అతి పొడవైన రోడ్డు - రైలు వంతెన ప్రారంభం
బంగ్లాదేశ్‌లో నిర్మించిన అతి పొడవైన వంతెనను ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి.మీ.ల పొడవునా ఈ రోడ్ - రైలు వంతెనను నాలుగు లేన్లతో నిర్మించారు. నైరుతి బంగ్లాదేశ్‌తో రాజధాని ఢాకా, ఇతర ప్రాంతాలను కలిపే ఈ వంతెనకు ప్రభుత్వం 3.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. పూర్తిగా బంగ్లాదేశ్ సొంత నిధులతో నిర్మించిన ఈ వంతెన దేశానికి గర్వకారణమని హసీనా కొనియాడారు.
బైడెన్‌కు సైన్స్ సలహాదారుగా ఆర్తీ ప్రభాకర్
ప్రముఖ ఇండో - అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్తీ ప్రభాకర్ (63)ను తనకు సైన్స్ సలహాదారుగా కీలక స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఈ నిర్ణయం చరిత్రాత్మకం అంటూ ఇండో - అమెరికన్ వర్గం ప్రశంసించింది. దీనికి సెనేట్ ఆమోదం కూడా లభిస్తే శ్వేతభవనంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయ (ఓఎస్‌టీపీ) తొలి మహిళా (వలసదారు) డైరెక్టరుగా ఆర్తీ ప్రభాకర్ చరిత్ర సృష్టిస్తారు. ఆర్తీకి మూడేళ్ల వయసులో వీరి కుటుంబం దిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడింది. టెక్సాస్ టెక్ యూనివర్సిటీ నుంచి ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. అక్కడే ఎలక్ట్రికల్ ఇంజినీరింగులో ఎం.ఎస్. కూడా చేశారు.
అంతరిక్షంలోకి దక్షిణ కొరియా తొలి రాకెట్ ప్రయోగం విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష రాకెట్‌ను దక్షిణ కొరియా విజయవంతంగా ప్రయోగించింది. దీని సాయంతో ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. తద్వారా రోదసిశక్తిగా ఎదగాలన్న లక్ష్యం దిశగా తొలి అడుగులు వేసింది. స్వీయ సామర్థ్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన 10వ దేశంగా దక్షిణ కొరియా గుర్తింపు పొందింది. తాజాగా ప్రయోగించిన రాకెట్ పేరు నురి. ఇందులో మూడు దశలు ఉన్నాయి. దీని పొడవు 47 మీటర్లు. ఇది ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని 700 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టింది. అనంతరం ఆ శాటిలైట్ నుంచి విజయవంతంగా సంకేతాలు అందాయి. అందులో నాలుగు బుల్లి ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిని కొద్దిరోజుల్లో విడుదల చేస్తారు. అవి భూ పరిశీలన, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
శ్రీలంకలో 21వ రాజ్యాంగ సవరణకు కేబినెట్ ఆమోదం
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అపరిమిత అధికారాలను తొలగిస్తూ పార్లమెంటును బలోపేతం చేసే దిశగా తొలి అడుగు పడింది. ఆ దేశ కేబినెట్ 21వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. తద్వారా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమైంది. 2020 ఆగస్టు ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు గత ప్రధాని మహింద రాజపక్సలు పార్లమెంటు కన్నా అధ్యక్షుడికే ఎక్కువ అధికారాలు కట్టబెడుతూ 20ఏ సవరణను తీసుకొచ్చారు. దీన్ని రద్దు చేసేలా తాజా బిల్లు ఉంటుందని తెలుస్తోంది. నూతన సవరణ ప్రకారం అధ్యక్షుడు పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి.
ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా
ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేరాలనే ఉక్రెయిన్‌కు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 27 దేశాల ఈయూలో సభ్యత్వం పొందాలంటే కీవ్‌కు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్ తమ దేశంలో ప్రజాసామ్య సంస్థలను బలోపేతం చేయాలి. చట్టాలను పారదర్శకంగా రూపొందించాలి. మానవహక్కులను పాటించాలి. అభ్యర్థి దేశం హోదాలో ఉక్రెయిన్‌కు స్వాగతిస్తున్నామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ చేసిన ప్రకటనను అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ స్వాగతించారు.
‣ మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి ఉక్రెయిన్ చేరుకున్నారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక పర్యటనలో ఆయన కీవ్ నగరంలో 120 రోజుల వ్యవధిలో పది వేల మంది సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ప్రారంభించారు.
భారతీయ అమెరికన్‌కు బైడెన్ ఉన్నత పదవి
భారత సంతతికి చెందిన రాధా అయ్యంగార్ ప్లంబ్‌ను రక్షణ శాఖ ఉప సహాయ మంత్రిగా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. ఆమె ఆయుధ, వస్తు సేకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఇంతకు ముందు రక్షణ శాఖ ఉపమంత్రి కార్యాలయ సిబ్బంది అధిపతిగా ఆమె పనిచేశారు. గూగుల్, ఫేస్ బుక్ కంపెనీలలో ఉన్నత సాంకేతిక పదవులు నిర్వహించారు. రాధా ప్లంబ్ ఆర్థికవేత్త కూడా.
పోటీతత్వ సూచీలో భారత్‌కు 37వ స్థానం
ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా వృద్ధి చెందినందున, వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత స్థానం 43 నుంచి 6 స్థానాలు మెరుగై, 37కు చేరిందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. 63 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానాన్ని డెన్మార్క్ దక్కించుకుంది. 2021లో అది మూడో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ మొదటి స్థానాన్ని కోల్పోయి, రెండో స్థానంలో నిలిచింది. సింగపూర్ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి మెరుగైంది. స్వీడన్, హాంకాంగ్, నెదర్లాండ్స్, తైవాన్, ఫిన్లాండ్, నార్వే, యూఎస్‌ఏలు తొలి 10 స్థానాల్లో ఉన్నాయి. ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో సింగపూర్ (3), హాంకాంగ్ (5), తైవాన్ (7), చైనా (17) మెరుగైన స్థానాలు పొందాయి. వ్యాపార సామర్థ్య పారామితుల్లో కీలకమైన లేబర్ మార్కెట్ 15వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకుందని ఐఎండీ వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన తపాలా కార్యాలయంగా హిక్కిం గుర్తింపు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన తపాలా కార్యాలయం హిమాచల్‌ప్రదేశ్ లాహౌల్ - స్పితి జిల్లాలోని హిక్కిం గ్రామంలో, సముద్ర మట్టానికి 14,567 అడుగుల ఎత్తులో ఉంది. పర్యటకులు అయితే కచ్చితంగా అక్కడ ఓ సెల్ఫీ తీసుకుంటారు. ఈ కార్యాలయం ఆకారం లెటర్ బాక్స్‌లా ఉంటుంది. ఇంతకు ముందు ఈ పోస్టాఫీసు ఓ పూరింట్లో ఉండేది. ఇటీవల పోస్ట్ బాక్స్ ఆకారంలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీని వల్ల హిక్కిం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. స్పితి వ్యాలీలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా ఇది మారిపోయింది. ఏటా వేల మంది పర్యటకులు ఈ పోస్టాఫీసును సందర్శిస్తున్నారు. కార్యాలయం వెలుపల కొన్ని సెల్ఫీ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. హిక్కిం పోస్టాఫీసు ఫోటోలు స్పితి లోయ నుంచి అత్యధికంగా షేర్ అయిన ఫొటోలలో ఒకటిగా నిలిచాయని అధికారులు తెలిపారు.
ఐరాస సాంకేతిక రాయబారిగా అమన్‌దీప్‌సింగ్ గిల్
భారత సీనియర్ దౌత్యవేత్త అమన్‌దీప్‌సింగ్ గిల్ ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాంకేతిక రాయబారిగా నియమితులయ్యారు. డిజిటల్ టెక్నాలజీ రంగంలో దార్శనికత ఉన్న నాయకుడిగా ఆయన్ని ప్రపంచం గుర్తిస్తోందని ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ రంగంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. 2016 - 18 మధ్య జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ సదస్సు సందర్భంగా భారత రాయబారిగా, శాశ్వత ప్రతినిధిగా గిల్ వ్యవహరించారు. ప్రస్తుతం జెనీవా కేంద్రంగా ‘ఇంటర్నేషనల్ డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్’ (ఐ-డీఏఐఆర్) సంయుక్త ప్రాజెక్టు సీఈవోగా సేవలందిస్తున్నారు. ఈయన 1992లో తొలుత భారత రాయబార సేవల్లో చేరారు. నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రత, సాంకేతిక నైపుణ్యం వంటి అంశాలపై పట్టు సాధించి టెహ్రాన్, కొలంబోలలోనూ పని చేశారు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ విజిటింగ్ స్కాలర్‌గా ఉన్నారు.
అమెరికా ‘కరెన్సీ పర్యవేక్షణ జాబితా’లో భారత్
అమెరికా తన ‘కరెన్సీ పర్యవేక్షణ జాబితా’లో భారత్ సహా 12 దేశాలను చేర్చింది. దీని కింద ఆయా దేశాల్లోని కరెన్సీ, స్థూల ఆర్థిక విధానాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, వియత్నాం, మెక్సికోలు ఈ జాబితాలో ఉన్నాయి.
తుపాకుల బిల్లుకు అమెరికా దిగువ సభ ఆమోదం
న్యూయార్క్‌లోని బఫెలో, టెక్సస్‌లోని యువాల్డెలో సాయుధులు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరచింది. యువాల్డె కాల్పుల్లో 19 మంది ప్రాథమిక పాఠశాల పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించగా, బఫెలో సూపర్ మార్కెట్‌లో జాత్యహంకార ఉన్మాది కాల్పుల్లో 10 మంది నల్లజాతివారు మరణించారు. ఈ దుర్ఘటనలను పురస్కరించుకుని అమెరికా పార్లమెంటులోని ప్రజా ప్రతినిధుల సభ (కాంగ్రెస్) తుపాకుల నియంత్రణ బిల్లును 223-204 ఓట్ల తేడాతో ఆమోదించింది. డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన అయిదుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.
ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా జపాన్
ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) తాత్కాలిక సభ్యదేశాలుగా ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్ ఎన్నికయ్యాయి. ఈ దేశాలు భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే స్థానాల్లో వచ్చే ఏడాది జనవరి ఒకటిన బాధ్యతలు స్వీకరిస్తాయి. పదవీ కాలం రెండేళ్లు. ఐరాస సాధారణ సభలో జరిగిన ఎన్నికల్లో ఈ దేశాలు వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికయ్యాయి.
భారత్ - వియత్నాం మధ్య కీలక రక్షణ ఒప్పందాలు
భారత్, వియత్నాం మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు పడింది. 2030 నాటికి రక్షణ సంబంధాల పరిధి, స్థాయులను విస్తృతం చేసేలా బుధవారం ఇరు దేశాలు ఓ ఉమ్మడి దార్శనిక పత్రంపై సంతకం చేశాయి. దీంతో పాటు మరమ్మతులు, సరఫరాల భర్తీ అవసరాల కోసం ఇరు దేశాల సైన్యాలు పరస్పర సైనిక స్థావరాలను వినియోగించుకొనేలా ఒప్పందం చేసుకున్నాయి. ఓ దేశంతో వియత్నాం ఇలాంటి కీలక ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. వియత్నాంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లిన రాజ్‌నాథ్ రాజధాని హనొయ్‌లో ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్‌జియాంగ్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఈ ఒప్పందాలు జరిగాయి.
అవిశ్వాసంలో నెగ్గిన బోరిస్ జాన్సన్
‘పార్టీగేట్’ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సొంత పార్టీ కన్జర్వేటివ్ సభ్యుల నుంచే ఎదురైన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రధానిగా ఆయనే కొనసాగాలని 211 మంది ఓటు వేయగా 148 మంది వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బోరిస్‌పై కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
భారత్ - ఖతార్ చట్ట సభల సంబంధాలను బలోపేతం చేయాలి
భారత్ - ఖతార్ దేశాల చట్టసభల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రెండు దేశాల చట్ట సభల సభ్యులు పరస్పరం సంప్రదింపులు, పర్యటనలు జరిపేలా ప్రోత్సహించాలని కోరారు. భారత్ - ఖతార్‌ల మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు మొదలై 2023కు 50 ఏళ్లు పూర్తవనుంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఖతార్‌లో ఉన్న వెంకయ్యనాయుడిని ఆ దేశ కన్సల్టేటివ్ అసెంబ్లీ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్, ముగ్గురు షురా కౌన్సిల్ సభ్యులు కలిశారు.
ఖతార్‌తో స్నేహ సంబంధాలకు భారత్ ప్రాధాన్యం: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఖతార్ ప్రధానమంత్రి షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థనీతో దోహాలో భేటీ అయ్యారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక, భద్రతా సహకారం వంటి రంగాల్లో పెరుగుతున్న సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారు. ఖతార్‌తో స్నేహ సంబంధాలకు భారత్ చాలా ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు. ఖతార్ రాజు తండ్రి ఆమిర్ షేక్ హమాద్ బిన్ ఖలీఫా అల్ థనీతోనూ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సహకారం వంటి అంశాలను మరింత పెంచేందుకు గట్టి నిబద్ధతను ఉభయ దేశాలూ వ్యక్తం చేశాయి. అలాగే ఖతార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి ఫిక్కీ, సీఐఐ, అసోచామ్‌లు సంయుక్తంగా నిర్వహించిన భారత్ - ఖతార్ బిజినెస్ ఫోరమ్‌ను ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఉభయ దేశాల అంకుర పరిశ్రమలకు ఊతమిచ్చేలా రూపొందించిన ‘ఇండియా - ఖతార్ స్టార్ట్-అప్ బ్రిడ్జి’ని ఆయన ప్రారంభించారు. ఇది పరస్పర వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆయన ఖతార్‌కు చేరుకున్నారు.
40 విమానాశ్రయాల్లో ఏకకాలంలో రవాణా నియంత్రణ
పలు విమానాశ్రయాల్లోని విమానాల రాకపోకలను దూరం నుంచే ఏకకాలంలో నియంత్రించగల రిమోట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ (ఏటీసీ)ను అమెరికాలో మొదటిసారిగా ఏర్పాటు చేయనున్నారు. అడ్వాన్స్‌డ్ ఏటీసీ ఇన్ కార్పొరేటెడ్ సంస్థ అలబామా రాష్ట్రంలో దీన్ని నెలకొల్పుతోంది. ఐరోపా దేశాల్లో ఇప్పటికే ఇటువంటి రిమోట్ ఏటీసీలను ఏర్పాటు చేసిన స్పెయిన్ కంపెనీ ఇంద్రా సిస్టమ్స్ ఇందుకు సహకారం అందిస్తోంది. సెల్మా నగరానికి సమీపంలో గతంలో వైమానిక దళ స్థావరంగా ఉండి తరవాత పౌర విమానాశ్రయంగా మారిన క్రెయిగ్ ఎయిô Âఫీల్డ్‌లో 47 లక్షల డాలర్లతో రిమోట్ ఏటీసీని నెలకొల్పుతున్నారు. అమెరికాలోని 40 విమానాశ్రయాలకు ఇక్కడి నుంచే ఏటీసీ సేవలు అందించవచ్చు. క్రెయిగ్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఓ అంతర్జాతీయ శిక్షణ సంస్థనూ ఏర్పాటు చేస్తామని అడ్వాన్స్‌డ్ ఏటీసీ సంస్థ ప్రకటించింది. సెల్మాలో నిర్మించే రిమోట్ టవర్ కెమెరాలు, రియల్ టైమ్ వీడియోలు, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విమానాల రాకపోకలను నియంత్రిస్తుంది.
ఎలిజబెత్ రాణి పాలనకు 70 ఏళ్లు
బ్రిటన్ సింహాసనాన్ని క్వీన్ ఎలిజబెత్-2 అధిష్ఠించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా లండన్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రిటీష్ సైనిక సంప్రదాయం ప్రకారం గుర్రాలు, ఆయుధాలు, ఫైటర్ జెట్లతో ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. తొలి రోజు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని బాల్కనీ నుంచి రాణి గౌరవ వందనం స్వీకరించారు. 1953 జూన్ 2న ఎలిజబెత్ రాణి పట్టాభిషేకం జరిగింది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 బ్రిటన్‌లో ఎక్కువ కాలం సింహాసనాన్ని అధిష్ఠించిన రాణిగా చరిత్రలో నిలిచారు. జూబ్లీ వేడుకల గౌరవ అతిథుల జాబితాలో భారత సంతతికి చెందిన 40 మంది వృత్తి నిపుణులు, సంఘ ప్రముఖులకు చోటు లభించింది. వారిలో రచయిత సల్మాన్ రష్దీ (74) ఉన్నారు. రష్దీ రచించిన ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ బుకర్ బహుమతి గెలుచుకొన్న దగ్గరి నుంచీ ఆయన జగత్పస్రిద్ధుడయ్యారు. బ్రిటిష్ సామ్రా జ్య కమాండర్ (ఓబీఈ) అవార్డును దానశీలి, సంఘ సేవకుడు అవనీశ్ గోయల్‌కు ప్రకటించారు. కొవిడ్ సమయంలో స్వచ్ఛంద సేవ, దానధర్మాలు చేసిన హోటల్ యజమాని కిశోర్ కాంత్ భట్టెస్సాకు, లివర్ పూల్ నగర అధ్యాపకుడు రోహిత్ నాయక్‌కు కూడా ఓబీఈ అవార్డులు ప్రకటించారు. బ్రిటిష్ సామ్రాజ్య సభ్యుల (ఎంబీఈ) అవార్డులు పొందినవారిలో భారతీయ వైద్యు లు ఇంద్రనీల్ చక్రవర్తి, రాజగోపాలన్ మురళి ఉన్నారు.
టర్కీ ఇకపై తుర్కియేగా పేరు మార్పు
తమ దేశం పేరును ‘తుర్కియే’గా మార్చుకున్నామని, కొత్త పేరుతోనే పిలవాలని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావసోగ్లు ఐక్యరాజ్యసమితికి సాధికారంగా లేఖ రాశారు. ఈ లేఖ సమితికి అందిన క్షణం నుంచే టర్కీ పేరు తుర్కియేగా మారిపోయిందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అధికార ప్రతినిధి స్టెఫనీ దుహారిచ్ తెలిపారు. టర్కీ అనే పేరు కలిగిన కోడి ఒకటి ఉండటంతో దాని పేరుతో తమ దేశాన్ని పిలవడం ప్రతికూల భావనలు కలిగిస్తున్నట్లు అక్కడి పాలకులు భావిస్తున్నారు. 1923లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆ దేశం తనను తాను తుర్కియేగానే ప్రకటించుకుంది.