అవార్డులు



సింహపురి ఎక్స్‌ప్రెస్‌ వేకి నేషనల్‌ హైవేస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

చిలకలూరిపేట - నెల్లూరు మధ్య జాతీయ రహదారి - 5లో 183.620 కిలోమీటర్ల రహదారిని నిర్వహిస్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌కు ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ హైవే సేఫ్టీ’ విభాగంలో రజత పతకం దక్కింది. కేంద్ర రహదారి రవాణా శాఖ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేతుల మీదుగా ఈ పతకాన్ని ప్రదానం చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణికుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా ఏటా అందిస్తున్నట్లుగానే ఆ శాఖ నేషనల్‌ హైవేస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు-2021లను మొత్తం 13 సంస్థలకు అందజేసింది. జాతీయ రహదారులను ఉత్తమంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు 2018 నుంచి ఈ అవార్డులను ఇస్తోంది. ఈసారి మొత్తం 122 నామినేషన్లు వచ్చాయి.

ప్రముఖులకు కెంపేగౌడ పురస్కారాలు

కర్ణాటకలో పేరొందిన కెంపేగౌడ అంతర్జాతీయ పురస్కారాలను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రకాశ్‌ పదుకోన్‌లకు ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరు నగర నిర్మాత నాడప్రభు కెంపేగౌడ 513వ జయంతి సందర్భంగా జూన్‌ 27న నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం బసవరాజ బొమ్మై వీరికి పురస్కారాలను ప్రదానం చేస్తారు. స్మార్టప్‌ విజన్‌ గ్రూపునకు చెందిన ప్రకాశ్‌ నేతృత్వంలో విద్యావేత్త మోహన్‌దాస్‌ పాయ్, వివేకానంద యూత్‌ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు బాలసుబ్రహ్మణ్యం, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శంకరలింగేగౌడ సభ్యులుగా ఉన్న సమితి వీరిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పురస్కారంలో భాగంగా స్మరణిక, రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు.

మైహోంకు అంతర్జాతీయ భద్రతా అవార్డులు

మైహోం కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ భద్రతా అవార్డులను అందుకుంది. యూకేలోని బ్రిటిష్‌ సేఫ్టీ కౌన్సిల్, యూఎస్‌ఏలోని వరల్డ్‌ సేఫ్టీ ఫోరం నుంచి నిర్మాణ విభాగంలో ఇంటర్నేషనల్‌ సేఫ్టీ అవార్డులను అందుకుంది. పని ప్రదేశంలో ప్రమాదాలు జరగకుండా చేపట్టిన చర్యలు, కార్మికుల శ్రేయస్సు, కొవిడ్‌ సమయంలో తీసుకున్న జాగ్రత్తలతో పాటు పలు అంశాలను పరిశీలించి 2021 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించారు.

సజయ ‘అనువాద’ వైవిధ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

-సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయను అనువాద రచనలో ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి అనువాద రచనల విభాగంలో పురస్కారాలను అకాడమీ ప్రకటించింది. ఇంగ్లిషు సహా 22 భారతీయ భాషల్లో అనువాద రచనలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ మైథిలీ, రాజస్థానీ భాషల్లో అనువాద పురస్కారాలను త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్‌ హిందీలో రచించిన ‘అదృశ్య భారత్‌’ను (నాన్‌ఫిక్షన్‌) సజయ ‘అశుద్ధ భారత్‌’ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల దుర్భర జీవన స్థితిగతులపై ఆధారాల సహితంగా తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అనువాద రచన ఎంపికకు జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్‌ ఎస్‌.శేషారత్నం, వై.ముకుంద రామారావు, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు వ్యవహరించారు. అవార్డు కింద సజయకు రూ.50 వేల నగదు, తామ్రఫలకం అందజేయనున్నారు. సజయ స్వగ్రామం కృష్ణా జిల్లా పెద్దముత్తేవి. మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ల్లో ఆమె విద్యాభ్యాసం సాగింది. మహిళా సమస్యలపై ఆమె పోరాటాలు చేశారు.

-సజయ రచయిత్రిగా, అనువాదకురాలిగా, స్వతంత్ర పాత్రికేయురాలిగా, ప్రచురణకర్తగా, డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్‌గా, సామాజిక కార్యకర్తగా విభిన్న పాత్రలు పోషిస్తూనే మహిళలు, ట్రాన్స్‌జెండర్ల సమస్యలు, యురేనియం తవ్వకాలు, భారత వ్యవసాయ సంక్షోభం, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందులపై పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. వాటిని ‘ప్రవాహం’, ‘రైతుల ఆత్మహత్యలు-మనం’ పేరిట రెండు సంకలనాలుగా ప్రచురించారు.

- స్త్రీల ఆరోగ్య సమస్యలపై ‘సవాలక్ష సందేహాలు’ పుస్తకానికి కె.లలితతో, ‘స్త్రీవాద రాజకీయాలు-వర్తమాన చర్చలు’ పుస్తకానికి ప్రొఫెసర్‌ రమా మెల్కోటేతో కలిసి సంపాదకత్వం వహించారు.

- ప్రొఫెసర్‌ జంగం చిన్నయ్య పరిశోధనాత్మక రచన ‘దళిత్స్‌ అండ్‌ ద మేకింగ్‌ ఆఫ్‌ మాడ్రన్‌ ఇండియా’ను ‘ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు’ పేరిట తెలుగులోకి అనువదించారు.

- వ్యవసాయ విధానాలపై సజయ రాసిన 51 వ్యాసాలకుగానూ 2017లో దక్షిణాసియా దేశాల విభాగంలో ‘లాడ్లీ మీడియా అత్యుత్తమ కాలమిస్ట్‌’ అవార్డు అందుకున్నారు.

- ‘అశుద్ధ భారత్‌’ పుస్తకానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి అనువాదంలో అత్యుత్తమ పురస్కారం అందజేసింది.

- హైదరాబాద్‌లోని అన్వేషి రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్స్‌ స్టడీస్‌ సెంటర్‌లో 1989 నుంచీ సీనియర్‌ సభ్యులుగా సజయ కొనసాగుతున్నారు.


‘అపోలో’ ప్రతాప్‌ సి.రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డికి ప్రతిష్ఠాత్మక జీవన సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు) లభించింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తమిళనాడు శాఖ, జూనియర్‌ డాక్టర్స్‌ నెట్‌వర్క్, మెడికల్‌ స్టూడెంట్స్‌ నెట్‌వర్క్‌ల ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రపంచ యువ వైద్యుల దినోత్సవం (వరల్డ్‌ యంగ్‌ డాక్టర్స్‌ డే) సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందజేశారు. దేశంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకత్వం చేసిన నేపథ్యంలో ఆయనను ఆధునిక భారతీయ ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు ప్రపంచ స్థాయి వైద్య సేవలు ప్రతి భారతీయుడికీ అందుబాటులోకి తీసుకురావడంలో డా.ప్రతాప్‌ సి.రెడ్డి చేసిన కృషి ఫలితంగా అపోలో సంస్థ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులకు సీసీటీఎన్‌ఎస్‌ పురస్కారం

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందున్న తెలంగాణ పోలీసులు ఈ అంశంలో మరో ఘనత సాధించారు. క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ హ్యాకథాన్‌ అండ్‌ సైబర్‌ ఛాలెంజ్‌ 2022 పురస్కారాన్ని పొందారు. సైబర్‌ నేరాల నియంత్రణకు రాష్ట్ర పోలీసులు వినియోగిస్తున్న సైబర్‌ క్రైమ్‌ అనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టమ్‌ (సైక్యాప్స్‌) ఐటీ అప్లికేషన్‌ దేశంలోనే తొలి స్థానం సాధించింది. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ దేవేందర్‌ సింగ్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ), సైబర్‌ పీస్‌ ఫౌండేషన్‌ (సీపీఎఫ్‌) సంస్థలు సంయుక్తంగా మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 25 వరకు ఈ పోటీల్ని నిర్వహించాయి.

ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు ప్రకటించిన సారస్వత పరిషత్తు

తెలంగాణ సారస్వత పరిషత్తు తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు 2022 సంవత్సరానికి పురస్కారాలు ప్రకటించింది. రాష్ట్రస్థాయి పోటీకి అందిన పుస్తకాలపై న్యాయ నిర్ణేతల నివేదిక ఆధారంగా పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్యలు వెల్లడించారు. పద్య గేయ కవితా ప్రక్రియలో డా.ఏనుగు నరసింహారెడ్డి రచించిన ‘తెలంగాణ రుబాయిలు’ ఉత్తమ గ్రంథంగా ఎంపికైంది. వచన కవిత్వంలో వంశీకృష్ణ రచించిన ‘రెప్పవాలిన రాత్రి, నవలా ప్రక్రియలో మెట్టు మురళీధర్‌ కరోనా నేపథ్య రచన ‘కనిపించని శత్రువు’, సాహిత్య విమర్శలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్ర సాహిత్యం పురస్కారాలకు ఎంపికయ్యాయి. కథా ప్రక్రియలో పెద్దింటి అశోక్‌కుమార్‌ ‘గుండెలో వాన’ సంపుటి, ఇతరాల్లో తుమ్మూరి రామ్మోహన్‌రావు ‘మానేరు ముచ్చట్లు’ పురస్కారాలు పొందాయి.

తండ హరీష్‌ గౌడ్‌ రచించిన ‘ఇన్‌బాక్స్‌’ కవితా సంపుటి, స్ఫూర్తి కందివనం విరచిత ‘చైత్ర’ నవల ఈ ఏడాది యువ పురస్కారాలకు ఎంపికయ్యాయి.

రచనానుభవంలో, వయసులో పెద్దవారైన నలుగురు సాహితీమూర్తులకు పుస్తకాలతో నిమిత్తం లేకుండా వరిష్ఠ పురస్కారాలు అందజేయనున్నారు. 2022కు డా.గండ్ర లక్ష్మణరావు, డా.నాళేశ్వరం శంకరం, డా.భూపాల్, జ్వలితలను వీటికి ఎంపిక చేశారు. ఉత్తమ గ్రంథ, వరిష్ఠ పురస్కారాలకు ఎంపికైన వారికి ఒక్కొక్కరికీ రూ.20 వేలు, యువ పురస్కారాల కింద రూ.10 వేల నగదుతో సత్కరిస్తారు.


టీ ఫైబర్‌కు కేసీసీఐ పురస్కారం

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీ ఫైబర్‌)కు నాలెడ్జ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (కేసీసీఐ) పురస్కారం లభించింది. అహ్మదాబాద్‌లో నిర్వహించిన కేసీసీఐ అయిదో వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నుంచి టీఫైబర్‌ ఎండీ సుజయ్‌ కారంపురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణలో ఇంటింటికీ, ప్రతి కార్యాలయానికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు టీఫైబర్‌ ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్‌ భారత్‌లో వినూత్న పరివర్తన విభాగంలో టీఫైబర్‌ను కేసీసీఐ ఎంపిక చేసింది.

హైదరాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (జీహెచ్‌ఐఏఎల్‌) మరో పురస్కారం లభించింది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలను వేగంగా అందిస్తున్నందుకు ‘స్కైట్రాక్స్‌ బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాప్‌ ఇన్‌ ఇండియా అండ్‌ సెంట్రల్‌ ఆసియా’ అవార్డును జీహెచ్‌ఐఏఎల్‌ అధికారులు అందుకున్నారు. ప్రపంచంలోని ప్రముఖ 100 విమానాశ్రయాల్లో 64వ స్థానంలో ఉన్న శంషాబాద్‌ 63వ స్థానానికి చేరిందన్నారు. 100 దేశాల్లో 550కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు చెక్‌-ఇన్, రాకపోకలు, బదిలీలు, ఇమ్మిగ్రేషన్, కస్ట్‌మ్స్, షాపింగ్, భద్రత విభాగాల్లో అందిస్తున్న సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందించిందన్నారు.

ఐఐటీఎం ఆచార్యునికి ప్రతిష్ఠాత్మక పురస్కారం

సౌదీ అరేబియా ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘ప్రిన్స్‌ సుల్తాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’కు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌ (ఐఐటీఎం) ఆచార్యుడు టి.ప్రదీప్‌ ఎంపికయ్యారు. నీటికి సంబంధించిన ఆవిష్కరణల్లో పురోగతి సాధించిన వారికి ‘క్రియేటివిటీ ప్రైజ్‌’ కింద ‘ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ అవార్డు’ అందజేస్తారని ఐఐటీ వర్గాలు తెలిపాయి. బహుమతిగా 2,66,000 యూఎస్‌ డాలర్లు (రూ.రెండు కోట్ల మేరకు) అందుతుందని పేర్కొన్నాయి. ‘వాటర్‌ పాజిటివ్‌’ అనే అంశం మీద పర్యావరణ అనుకూల పరిశోధనను ఆచార్య ప్రదీప్‌ చేశారు. గతంలో ఈయన పరిశోధనలకు కేంద్రం నుంచి పద్మశ్రీ, నిక్కే ఏషియా నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నారు. న్యూయార్క్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 12న జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

మఠం లింగయ్య స్వామికి సోమనాథ సాహిత్య పురస్కారం

హైదరాబాద్‌కు చెందిన మఠం లింగయ్య స్వామి సోమనాథ సాహిత్య పురస్కారం - 2020కి ఎంపికయ్యారని జనగామ జిల్లా పాలకుర్తిలోని సోమనాథ కళాపీఠం వెల్లడించింది. ఈ మేరకు పీఠం అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి దామోదర్‌ తెలిపారు. అలాగే మరికొన్ని పురస్కారాలకు ఇతర రంగాల ప్రముఖుల ఎంపిక పూర్తయిందని వివరించారు. దండి వెంకట్‌ (నిజామాబాద్‌)కు సోమనాథ సామాజిక శోధన పురస్కారం, తడకమళ్ల రాంచందర్‌రావు (మిర్యాలగూడెం)కు సోమనాథ రంగస్థల పురస్కారం, సత్తి సునీల్‌రెడ్డి (విశాఖపట్నం)కి పందిళ్ల శేఖర్‌బాబు రాజయ్యశాస్త్రి స్వచ్ఛంద భాషా సేవా పురస్కారం, చింతకాయల ఆంజనేయులు (ఖమ్మం)కు వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారం, వేదవీర్‌ ఆర్య (దిల్లీ)కు ముశం దామోదర్‌రావు ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధన పురస్కారం, చిలుకమారి రాజేష్‌ (పాలకుర్తి)కు డాక్టర్‌ రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారం, వేముల శ్రీ (సిద్దిపేట)కి దేవగిరి రాజయ్య స్మారక పురస్కారంతో పాటు సరస్వతీ సంసేవక బిరుదును వారు ప్రకటించారు. వీరందరికి జూన్‌ 26న పాలకుర్తిలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

655 మందికి పోలీస్‌ సేవా పతకాలు

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌ సేవా పతకాల్ని ప్రకటించింది. హోం శాఖ పరిధిలో విశిష్ట సేవలందించినందుకు పోలీస్, ఏసీబీ, విజిలెన్స్, ఎస్పీఎఫ్, ఆగ్నిమాపక శాఖలకు చెందిన 655 మందిని శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, కఠిన, సేవా పతకాలకు ఎంపిక చేసింది. వీరందరికీ తర్వాత పురస్కారాల్ని అందజేస్తారు. శౌర్య పతకాల విభాగంలో పోలీస్‌ శాఖ తరఫున గ్రేహౌండ్స్‌ నుంచి మల్లేశ్‌ (ఆర్‌ఐ), వంశీధర్‌ (ఆర్‌ఎస్సై), శ్రీకాంత్, నరేందర్, మురళీ కృష్ణ, రోహిత్, హుస్సేన్‌ పాషా, రాజ్‌కుమార్, వీరాకుమార్, శేఖర్, గంగాధర్‌ (కానిస్టేబుళ్లు), అగ్నిమాపకశాఖ తరఫున సైదులు (కూకట్‌పల్లి అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌), కృష్ణారెడ్డి (కూకట్‌పల్లి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌), జయకృష్ణ, శివుడు (కూకట్‌పల్లి ఫైర్‌స్టేషన్‌ ఫైర్‌మెన్లు) ఎంపికయ్యారు.