ఆర్ధిక రంగం
జియో ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో 217 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్ల) విలువైన గ్రూప్‌లో, నాయకత్వ వారసత్వ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే దిశగా ముకేశ్ అంబానీ కీలక అడుగేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ బాధ్యతలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ‘రిలయన్స్ జియో డైరెక్టర్ల బోర్డుకు ఛైర్మన్‌గా ఆకాశ్ ఎం అంబానీని నియమించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింద’ని ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. జూన్ 27 పని వేళల ముగింపు నుంచి వర్తించేలా, జియో బోర్డు డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా సమర్పించాక, ఈ పరిణామం చోటు చేసుకుంది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మేనేజింగ్ డైరెక్టరుగా పంకజ్ మోహన్ పవార్ నియమితులయ్యారు. జూన్ 27 నుంచి అయిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రమిందర్ సింగ్ గుజ్రాల్, మాజీ సీవీసీ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) కేవీ చౌదరీని స్వత్రంత్ర డైరెక్టర్లుగా నియమించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు వివరించింది. వీళ్లిద్దరూ ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ఉన్నారు.
ఫైల్ స్టోరేజ్, షేరింగ్ ప్లాట్‌ఫామ్ సంస్థ డిజిబాక్స్‌తో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. జియో వినియోగదారులకు అత్యుత్తమ స్టోరేజ్ సొల్యూషన్లు సృష్టించే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని ఇరు సంస్థలు కుదుర్చుకున్నాయి. జియోఫొటోస్ యాప్‌ను ఉపయోగించేటప్పుడు ప్రస్తుతం ఇస్తున్న 20 జీబీ స్టోరేజ్ స్పేస్‌కు అదనంగా మరో 10జీబీ స్పేస్‌ను డిజిబాక్స్‌కు లాగిన్ అవ్వడం ద్వారా వినియోగదారులు పొందే అవకాశం ఉంటుంది. పలు రకాల ఫార్మాట్‌లలో ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసుకుని, వెంటనే స్మార్ట్‌ఫోన్ ద్వారా షేరు చేసుకోవచ్చు.
రూ.1000 లోపు హోటల్ గదులపైనా 12% జీఎస్‌టీకి మండలి ఆమోదం
కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులకు జీఎస్‌టీ మండలి ఆమోదం తెలిపింది. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార వస్తువులపైనా జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) విధించనున్నారు. చెక్‌ల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపైనా పన్ను వసూలు చేస్తారు. అంతరాష్ట్ర పరిధిలో పసిడి, విలువైన రాళ్లను రవాణా చేసేందుకు రాష్ట్రాలు ఇ-వే బిల్లు జారీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పన్ను ఆదాయాల్లో మరింత వాటాను రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రుల కూడిన జీఎస్‌టీ మండలి సమావేశమైంది. జీఎస్‌టీ నమోదిత వ్యాపారాలకు నిబంధనలు, అధిక పన్ను చెల్లింపుదార్ల ఎగవేతల తనిఖీకి సంబంధించి మంత్రుల బృందం (జీఓఎం) నివేదికకు మండలి ఆమోద్రముద్ర వేసింది.
నిర్యాట్ (నేషనల్ ఇంపోర్ట్ - ఎక్స్‌పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్) పోర్టల్ ప్రారంభం
ఎగుమతులకు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఎగుమతిదార్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆ లక్ష్యాలను అందుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు. కొత్త వాణిజ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని ప్రసంగించారు.
నిర్యాట్ పోర్టల్ ఆవిష్కరణ: నిర్యాట్ (నేషనల్ ఇంపోర్ట్ - ఎక్స్‌పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్) పోర్టల్‌ను ప్రధాని ప్రారంభించారు. భారత విదేశీ వాణిజ్యానికి సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.
బ్యాంకింగ్ రంగంలో రూ.34,615 కోట్ల అతిపెద్ద కుంభకోణం
రూ.34,615 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారంటూ దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్), ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. సీబీఐ దర్యాప్తు చేపట్టిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని అధికారులు పేర్కొన్నారు.
9 బ్యాంకుల రేటింగ్ సవరింపు: ఫిచ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా 9 భారత బ్యాంకుల రేటింగ్ అంచనాలను ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరం’గా మెరుగుపరచినట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. రేటింగ్ మెరుగైన ఇతర బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (న్యూజిలాండ్), బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా సుబ్రమణ్యకుమార్
ప్రైవేటు రంగ ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా ఆర్.సుబ్రమణ్యకుమార్ జూన్ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. తాత్కాలిక ఎండీ, సీఈఓగా కొనసాగుతున్న రాజీవ్ అహూజా నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2021 డిసెంబరులో అప్పటి ఎండీ, సీఈఓగా ఉన్న విశ్వవీర్ అహూజా ఉన్నట్టుండి సెలవుపై వెళ్లిపోగా, ఆ స్థానంలో తాత్కాలికంగా రాజీవ్‌ను నియమించారు. సుబ్రమణ్యకుమార్‌కు బ్యాంకింగ్ రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ఈడీ) వ్యవహరించారు. ఇండియన్ బ్యాంక్ ఈడీగా పని చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భూటాన్ సంయుక్త సంస్థ డ్రక్ పీఎన్‌బీ డైరెక్టర్ల బోర్డులోనూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
వృద్ధి రేటు 7.5 శాతమే: ప్రపంచ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. 8.7 శాతం వృద్ధి రేటు లభిస్తుందని 2022 జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. వృద్ధి రేటు అంచనాలను 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే జనవరి నాటి తొలి అంచనాలతో పోలిస్తే వృద్ధి రేటు అంచనాలను 1.2 శాతం మేర ప్రపంచ బ్యాంక్ తగ్గించినట్లయ్యింది. 2021 - 22లో జీడీపీ వృద్ధి 8.7 శాతంగా నమోదైంది.
భారత్ 101వ యూనికార్న్‌గా ఫిజిక్స్‌వాలా
ఎడ్‌టెక్ సంస్థ ఫిజిక్స్‌వాలా దేశీయ 101వ యూనికార్న్ (బిలియన్ డాలర్ల/రూ.7700 కోట్ల విలువైన సంస్థ)గా అవతరించింది. తాజాగా జరిగిన సిరీస్ ఏ నిధుల సమీకరణలో భాగంగా వెస్ట్‌బ్రిడ్జ్, జీఎస్‌వీ వెంచర్స్ నుంచి 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.777 కోట్ల)ను కంపెనీ రాబట్టింది. ఈ నిధుల సమీకరణలో కంపెనీ విలువను 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8500 కోట్లు)గా లెక్కించారు. సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఎడ్‌టెక్ సంస్థగా ఫిజిక్స్‌వాలా రికార్డు సృష్టించింది. ఫిజిక్స్‌వాలా యాప్‌కు ప్లేస్టోర్‌లో 4.7 రేటింగ్ ఉండగా, 52 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యూట్యూబ్‌లో 69 లక్షల మంది చందాదారులు ఉన్నారు.
ఏపీలో 47%, తెలంగాణలో 33% జీఎస్‌టీ వసూళ్ల వృద్ధి
2022 మేలో జీఎస్‌టీ వసూళ్లలో ఏపీలో 47%, తెలంగాణలో 33% మేర వృద్ధి నమోదైంది. 2021 మేలో ఏపీకి రూ.2074 కోట్ల మేర ఆదాయం రాగా ఈసారి అది రూ.3,047 కోట్లకు చేరింది. తెలంగాణ ఆదాయం రూ.2,984 కోట్ల నుంచి రూ.3,982 కోట్లకు పెరిగింది. అన్ని రాష్ట్రాలూ ఈ మేలో సగటున 44% ఆదాయ వృద్ధి సాధించగా ఏపీ అంతకంటే ఎక్కువ, తెలంగాణ తక్కువ వృద్ధి నమోదు చేశాయి. దక్షిణాదిలో వసూళ్ల పరంగా కర్ణాటక (రూ.9,232 కోట్లు), తమిళనాడు (రూ.7,910 కోట్లు), తెలంగాణ (రూ.3,982 కోట్లు), ఏపీ (రూ.3,047 కోట్లు), కేరళ (రూ.2,064 కోట్లు), పుదుచ్చేరి (రూ.181 కోట్లు) వరుస స్థానాల్లో నిలిచాయి.