రాష్ట్రీయం - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఈసీగా జస్టిస్ ప్రవీణ్ కుమార్
ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు (ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ - ఈసీ)గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి ఈసీగా నామినేట్ కావడం సంప్రదాయంగా వస్తోంది. హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను సంప్రదించిన తర్వాత గవర్నర్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ పేరును న్యాయసేవాధికార సంస్థ ఈసీగా నామినేట్ చేశారు.
ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ
ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి చట్టంలో చేసిన సవరణలు జూన్ 16 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిందాల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభం
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఓబులునాయుడుపాలెం (నాయుడుపేట) వద్ద రూ.340 కోట్లతో నిర్మించిన వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే జిందాల్ పవర్ ప్రాజెక్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సంబంధిత పైలాన్‌ను ఆవిష్కరించారు. గంటకు 15 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే ఈ ప్రాజెక్టులో 28 మున్సిపాలిటీల నుంచి సేకరించే పొడి చెత్తను వినియోగిస్తారు. అనంతరం జగనన్న హరితవనాలు కార్యక్రమ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం కింద 45 పురపాలక సంఘాల్లోని రహదార్లకు ఇరువైపులా మొక్కలు నాటుతారు.