సదస్సులు

సీఐఐ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన సీఐఐ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రెండోసారి మొదటి స్థానంలో ఉన్నాం. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రగతిలో నడిపించడానికి మీ సూచనలు పాటించి మీ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. పారిశ్రామికవేత్తలు కోరినప్పుడు సవరణలకు సిద్ధంగా ఉంటాం. పెట్రో కెమికల్‌ హబ్‌గా నక్కపల్లి రాబోతోంది. 1,411 కి.మీ. పొడవు, రూ.15,592 కోట్ల ఖర్చుతో భారతమాల, సాగరమాల పేర్లతో అధునాతన రోడ్డు రవాణా సౌకర్యాలు, కొత్త ఓడరేవులు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఎగుమతిదారులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. పరిశ్రమల పెట్టుబడులను ప్రోత్సహించడానికి కాకినాడ, విశాఖపట్నం తీర ప్రాంతాల మధ్య ఏపీ పెట్రోలియం, కెమికల్స్, పెట్రోకెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌) ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

‘స్వావలంబన్‌ - 2022’ సదస్సు

భారత ప్రయోజనాలను దెబ్బతీసే దేశ, విదేశీ శక్తులను సమర్థంగా తిప్పికొట్టాలని ప్రధాని మోదీ అన్నారు. నావల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇండీజినైజేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఐఐవో), సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ ఏర్పాటు చేసిన ‘స్వావలంబన్‌ - 2022’ సదస్సులో ప్రధాని మాట్లాడారు. నౌకాదళంలో స్వదేశీ సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ‘స్ప్రింట్‌ ఛాలెంజెస్‌’ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. 75 స్వదేశీ సాంకేతికతలు, ఉత్పత్తులను నౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు ఎన్‌ఐఐవో ఈ కార్యక్రమాన్ని చేట్టింది.

భారత్‌లో రూ.16 వేల కోట్ల యూఏఈ పెట్టుబడులు

భారత దేశమంతటా ఫుడ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చింది. ఇందుకు సుమారు రూ.16 వేల కోట్ల (2 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ కూటమి ‘ఐ2యూ2’ తొలి భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. వీడియో ద్వారా నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్‌ ప్రధాని యాయిర్‌ లాపిడ్, యూఏఈ పాలకుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ పాల్గొన్నారు. నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో సంయుక్త పెట్టుబడులపై చర్చించారు. సభ్య దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాల్లో నెలకొన్న భారీ సవాళ్లను అధిగమించేందుకు దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని యోచించారు. ముఖ్యంగా ఆహార సంక్షోభాన్ని అధిగమించడంపై, శుద్ధ ఇంధన ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై లోతుగా చర్చించారు. గుజరాత్‌లో బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ విధానంలో 300 మెగావాట్ల హైబ్రిడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నెలకొల్పాలని నిర్ణయించారు.

ఇండోనేసియాలోని బాలిలో ముగిసిన జీ20 సదస్సు

జీ20 కూటమి దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఇండోనేసియాలోని బాలిలో ముగిసింది. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరుతూ ఈ సందర్భంగా సంయుక్త ప్రకటనేదీ విడుదల కాలేదు. యుద్ధం కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న ఆహార, ఇంధన సంక్షోభాల నివారణకు ప్రణాళికను రూపొందించకుండానే సమావేశం ముగియడం గమనార్హం. అమెరికా, చైనాల నడుమ ఇప్పటికే అనేక అంశాల్లో విభేదాలు ఏర్పడగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి డ్రాగన్‌ దేశం మద్దతు ఇవ్వడం పరిస్థితిని మరింత జటిలం చేస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పేర్కొన్నారు. జీ20 సదస్సు నిమిత్తం బాలీ వచ్చిన వీరిద్దరూ సుదీర్ఘ చర్చలు జరిపారు.

భారతీయ ఔషధ కూటమి సమావేశం

అంతర్జాతీయ విపణిని ఆకర్షించడానికి భారతీయ ఔషధ పరిశ్రమ ‘పరిమాణం’ నుంచి ‘విలువ’ వైపునకు మారాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. భారతీయ ఔషధ కూటమితో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ ‘దేశీయ ఔషధ సంస్థలు అంతర్జాతీయంగా ఆయా ఫార్మా కంపెనీలు పాటిస్తున్న ఉత్తమ విధానాలను బాగా గమనించి, దేశీయ గిరాకీకి తగ్గట్లు సొంత నమూనాల్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.