రాష్ట్రీయం - తెలంగాణ

బాలలు, మహిళల సంరక్షణపై ‘బీబీఏ’ సంస్థతో తెలంగాణ ఒప్పందాలు

తెలంగాణలో బాలలు, మహిళల సంరక్షణ, పునరావాసం, సంస్థాగత సాయం కోసం బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ (బీబీఏ) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి స్థాపించిన ఈ సంస్థ దేశంలో అక్రమ రవాణా నిరోధానికి, బానిసత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది.

‣ మొదటి ఒప్పందం రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమశాఖ, రాష్ట్ర బాలల సంరక్షణ సంస్థ (ఎస్‌సీపీఎస్‌)తో, రెండో ఒప్పందం రాష్ట్ర పోలీసుశాఖ మహిళాభద్రత విభాగంతో జరిగాయి. మొదటి ఒప్పందంపై స్త్రీశిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యాదేవరాజన్, బీబీఏ కార్యనిర్వాహక సంచాలకుడు ధనంజయ్‌ తింగాల్‌ సంతకాలు చేశారు. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీని కింద 12,500 గ్రామాలను బాలల సన్నిహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం, లైంగిక వేధింపులు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ను పిల్లల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దుతారు.

‣ రెండో ఒప్పందంపై ధనంజయ్‌ తింగాల్, పోలీసు అదనపు డీజీ స్వాతి లక్రా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు అక్రమ రవాణా నిరోధం, లైంగిక వేధింపుల బాధితులైన మహిళలు, బాలలకు న్యాయసహాయం అందించడం, వనరుల కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతారు.

తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపింది. ఇందులో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఈ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 9కి తగ్గుతుంది. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌ (2), ఒడిశా (3), గువాహటి (2), కోల్‌కతా (9), పంజాబ్, హరియాణా (13) హైకోర్టులకు కలిపి మొత్తం 35 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. జులై 19వ తేదీన కర్ణాటక హైకోర్టు (5), అలహాబాద్‌ హైకోర్టు (9), 20న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (7)కు చేసిన సిఫార్సులను కూడా కలిపితే గత అయిదు రోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.

తెలంగాణలో మరో 13 మండలాలు

తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్థానిక ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా, కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. జిల్లా - కొత్త మండలాలు
నల్గొండ - గట్టుప్పల్‌
నారాయణపేట - గుండుమల్, కొత్తపల్లె
వికారాబాద్‌ - దుడ్యాల్‌
మహబూబ్‌నగర్‌ - కౌకుంట్ల
నిజామాబాద్‌ - ఆలూర్, డొంకేశ్వర్, సాలూర
మహబూబాబాద్‌ - సీరోల్‌
సంగారెడ్డి - నిజాంపేట్‌
కామారెడ్డి - డోంగ్లి
జగిత్యాల - ఎండపల్లి, భీమారం

హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లో ‘ఆజాదీకీ రైల్‌ గాడీ’

పలువురు స్వాతంత్య్ర సమరయోధులు హైదరాబాద్‌ రైల్వే స్టేషన్లో నాటి పోరాట సన్నివేశాలను వివరిస్తూ అందరిలో జాతీయ భావాన్ని నింపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ద.మ.రైల్వే ఏర్పాటు చేసిన ‘ఆజాదీకీ రైల్‌ గాడీ, ఔర్‌ స్టేషన్‌’ కార్యక్రమంలో సమరయోధులు కె.చంద్రప్రకాశ్‌రావు, పి.మోహన్‌రావు, జి.గాలయ్యలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంతో మమేకమై నేటికీ రైల్వేలో సేవలందిస్తున్న ఆనాటి ఏపీ ఎక్స్‌ప్రెస్, ప్రస్తుత తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైదరాబాద్‌ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఆజాదీకీ రైల్‌ గాడీగా పేరొందిన తెలంగాణ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.12723) రైలును ఈ సందర్భంగా అందంగా తీర్చిదిద్దారు.

తెలంగాణలో ఒకే రోజు 53 సంస్థలతో ఒప్పందాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొంది. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య, విజ్ఞాన సంస్థ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్స్‌ నాలెడ్జ్‌ - టాస్క్‌) పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీహబ్‌ 2.0లో ఈ ఒప్పందాలు జరిగాయి. టాస్క్‌ చరిత్రలో ఇది మైలు రాయి అని, యువతకు ఉపాధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పురోగమిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పారు. 26 కొత్త సంస్థలతో ఒప్పందాలు, 27 పాత సంస్థలతో పునరుద్ధరణపై టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు, భారత్‌ ఫోర్జ్, కల్యాణి రాఫెల్‌ 24/7, హెటిరో, హైసియా, ఇన్ఫోసిస్‌ స్ప్రింగ్‌బోర్డ్, వాహన్, విడాల్, రుబికాన్, హెడ్‌ హెల్డ్‌ హైలు ఉన్నాయి.

శంషాబాద్‌లో విడిభాగాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ శాఫ్రాన్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే విమాన నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్‌వో) ప్రపంచంలోనే అతిపెద్దదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ కేంద్రం 2025 నాటికి సిద్ధమవుతుందన్నారు. మధ్య ప్రాచ్య దేశాలు, దక్షిణ ఆసియా దేశాల నుంచి కూడా విమానాలు మరమ్మతులకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆ సంస్థ తెలంగాణలో వరసగా పెడుతున్న మూడో అతిపెద్ద పెట్టుబడి ఇదని అన్నారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి ఎంఆర్‌వో కేంద్రం ఇదేనని తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఏరోస్పేస్‌లో కొత్తగా నిర్మించిన శాఫ్రాన్‌ విమాన ఇంజిన్ల విడిభాగాల అధునాతన ఉత్పత్తి కేంద్రాన్ని, సమీపంలో ఉన్న శాఫ్రాన్‌ ఎలక్ట్రికల్, పవర్‌ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 2020 నుంచి తాను, తమ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆయన అన్నారు.