సర్వేలు

2026 తర్వాత 1% దిగువకు దేశ జనాభా వృద్ధి రేటు

దేశ జనాభా వార్షిక వృద్ధి రేటు 2026 తర్వాత 0.9%కి పడిపోనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ‘ఇండియాస్‌ విజన్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ 2030’ నివేదిక పేర్కొంది. 2011 - 16 మధ్యలో 1.6% మేర ఉన్న వృద్ధి రేటు 2016 - 21 మధ్య కాలంలో 1.4%కి, 2021 - 26 మధ్యకాలంలో 1.1%కి తగ్గిందని తెలిపింది. 2026 - 31 మధ్యకాలంలో ఇది 0.9%కి, 2031 - 36 మధ్యలో 0.7%కి పడిపోనుందని తెలిపింది. 2011 - 36 మధ్యకాలంలో 31 కోట్ల మంది జనాభా కేవలం యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌ నుంచే జత కలుస్తారని, మొత్తం వృద్ధిలో ఈ ఆరు రాష్ట్రాల వాటా 64% మేర ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సంతానసాఫల్య నిష్పత్తి తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది. ఆధునిక కుటుంబ నియంత్రణ విధానం అనుసరించే వారు 1992 - 93 నుంచి 2019 - 21 మధ్య కాలంలో 36.5% నుంచి 56.5%కి పెరిగారని, దీనివల్ల అదే సమయంలో సంతాన సాఫల్య నిష్పత్తి 3.4 నుంచి 2కి తగ్గిపోయిందని ఈ నివేదిక వెల్లడించింది.

తెలంగాణ మహిళల్లో 57.8 శాతం మందికి రక్తహీనత

తెలంగాణలో మహిళలను రక్తహీనత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో పునరుత్పత్తి (15-49 ఏళ్ల మధ్య) వయసున్న మహిళల్లో 57.8 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 2014 - 15 (56.7%)తో పోల్చితే 2018 - 19లో ఇది దాదాపు ఒక శాతం పెరిగింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 71.7 శాతం మంది బాధితులు నమోదయ్యారు. ఈ దుస్థితికి పౌష్టికాహార లోపమే ప్రధాన కారణమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదికలో వెల్లడించింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావమైనప్పుడు రక్తహీనత ప్రాణాంతకంగా కూడా మారుతోంది. బాలింత మరణాలకు దాదాపు 70% ఇదే ప్రధాన కారణం. నాడీ సంబంధిత సమస్యలతో, తక్కువ బరువుతో, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, మృత శిశువు జన్మించడం తదితర సమస్యలకూ రక్తహీనత దారితీస్తోంది. ఐరన్‌తో పాటు విటమిన్‌ బి 12, ఫోలేట్, ఎ విటమిన్‌ లోపాలు కూడా తోడై సమస్య తీవ్రమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నారుల్లో అత్యధికం జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే - 5 ప్రకారం.. రాష్ట్రంలో 6-59 నెలల మధ్య వయసు పిల్లల్లో రక్తహీనత బాధితులు అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 82.6 శాతం మంది, తక్కువగా మంచిర్యాలలో 58.7 శాతం మంది ఉన్నారు. 15-49 ఏళ్ల మధ్య వయసున్న సాధారణ మహిళల్లో రక్తహీనతతో బాధపడుతున్నవారు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69.3 శాతం మంది, తక్కువగా సంగారెడ్డిలో 47.9 శాతం మంది ఉన్నారు. మరింత పకడ్బందీగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన అవసరముందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

2021 - 22 ఆహార భద్రతలో తెలంగాణకు 15, ఏపీకి 17వ స్థానం

ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం, హైజీన్‌ రేటింగ్‌లో తెలుగు రాష్ట్రాల హోటళ్లు, వ్యాపార సంస్థలు వెనుకబడ్డాయి. హోటళ్లు, స్వీట్‌ షాపులు, బేకరీలు, చికెన్, మటన్‌ దుకాణాల్లో పరిశుభ్రతను కొలమానంగా తీసుకుని కేంద్ర ఆహార భద్రతా విభాగం రాష్ట్రాలకు రేటింగ్స్‌ ఇస్తోంది. వ్యాపారులు తాము పాటిస్తున్న పరిశుభ్రతల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే వాటిని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ మదింపు చేయించి హైజీన్‌ రేటింగ్స్‌ను ఇస్తుంది. తాజాగా దేశవ్యాప్తంగా 22,800 ఆహార, ఇతర వ్యాపార సంస్థలు హైజీన్‌ రేటింగ్స్‌ను పొందాయి. ‣ రాష్ట్రాలవారీగా ఆహార భదత్రశాఖల పని తీరును 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి పరిశీలించినప్పుడు తెలంగాణ 15, ఏపీ 17వ స్థానానికి పరిమితమయ్యాయి. మానవ వనరులు, హోటళ్లకు ఫుడ్‌ సేఫ్టీ లైసెన్సులు, నమూనాలను పరీక్షించే ల్యాబ్‌ల సామర్థ్యం, వినియోగదారుల్లో అవగాహన వంటి కొలమానాల ప్రాతిపదికన రాష్ట్రాలకు మార్కులను కేంద్రం కేటాయించింది. 82.5 మార్కులతో తమిళనాడు మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గుజరాత్‌ (77.5), మహారాష్ట్ర (70 మార్కులు) తరువాతి స్థానాల్లో నిలిచాయి. 34.5 మార్కులతో తెలంగాణ 15వ స్థానం, 30 మార్కులతో బిహార్‌ 16వ స్థానాల్లో నిలిచాయి. ఏపీ కేవలం 26 మార్కులే సాధించింది.

16 కోట్ల మంది మహిళలు గర్భనిరోధక సాధనాలకు దూరం: లాన్సెట్‌ సర్వే

ప్రపంచవ్యాప్తంగా గర్భధారణకు సిద్ధంగా లేని మహిళల్లో 16 కోట్ల మందికి గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉండటం లేదని ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ప్రచురితమైన సర్వే పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో 1970 నుంచి వీటి వినియోగం పెరిగినప్పటికీ 2019లో ఈ పరిస్థితి నెలకొందని వివరించింది. మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత, ఆరోగ్యం, గర్భనిరోధక సాధనాల లభ్యతతో ముడిపడి ఉందని తెలిపింది. అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన సూచికల్లో దీనికి కీలక పాత్ర ఉందని వివరించింది. అవాంఛిత గర్భాలను నివారించడం ద్వారా మాతృ, నవజాత శిశు మరణాలను తగ్గించొచ్చు. దీనికి గర్భనిరోధక సాధనాలు కీలకమని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన 1,162 సర్వేలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశాలను నిర్ధరించారు. మొత్తం 120 కోట్ల మందికి గర్భనిరోధక సాధనాలు అవసరం కాగా అందులో 16 కోట్ల మంది వాటిని వాడటం లేదు. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, ఓషియానా ప్రాంతంలో ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం అత్యధికంగా (65 శాతం) ఉంది.

ఇన్నోవేషన్‌ సూచీలో దేశంలోనే తెలంగాణకు రెండో ర్యాంకు

నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. నీతి ఆయోగ్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరి, సీఈఓ పరమేశ్వరన్, సభ్యుడు వీకే సారస్వత్‌ నివేదికను విడుదల చేశారు.

ర్యాంకుల్లో క్రితంసారి నాలుగో స్థానంలోఉన్న తెలంగాణ ఈసారి రెండో స్థానం చేజిక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ 7 నుంచి 9వ స్థానానికి పడిపోయింది. 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును వేర్వేరుగా మదించి నివేదికను విడుదల చేసినట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. ర్యాంకుల కోసం తీసుకున్న కొలమానాలను ‘ఎనేబులర్స్‌’, ‘పెర్ఫార్మర్స్‌’ పేరుతో గ్రూపులుగా విభజించారు. వాటిలో ‘ఎనేబులర్స్‌’ విభాగంలో తెలంగాణ నాలుగో స్థానం, ఏపీ 8వ స్థానం సాధించాయి. పెర్ఫార్మర్స్‌ విభాగంలో తెలంగాణ తొలి స్థానం పొందగా ఏపీ 14తో సరిపెట్టుకుంది.


ప్రపంచంలోనే శక్తిమంతమైనదిగా జపాన్‌ పాస్‌పోర్ట్‌

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనదిగా జపాన్‌ పాస్‌పోర్ట్‌ నిలుస్తోంది. ఆ దేశ పాస్‌పోర్ట్‌ ఉన్నవారు ముందస్తు వీసా అవసరం లేకుండానే 193 దేశాలకు ప్రయాణించవచ్చు. సింగపూర్, దక్షిణ కొరియా కూడా దాదాపు దీనికి సమానంగానే ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టుదారులు 192 దేశాలకు సులభంగా రాకపోకలు చేయవచ్చు. బ్రిటన్‌ ఆరో స్థానంలో (187 దేశాలు), అమెరికా ఏడో స్థానంలో (186 దేశాలు) ఉన్నాయి. ఈ కోవలో భారత్‌ 87వ స్థానంలో (60 దేశాలు) నిలుస్తోంది. హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన పాస్‌పోర్టు సూచీ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో నిలిచాయి. అన్నింటి కంటే చివరన అఫ్గానిస్థాన్‌ ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో కేవలం 27 దేశాలకు ఎలాంటి అనుమతుల్లేకుండా వెళ్లవచ్చు.

448 జిల్లాల్లో ప్రసూతి మరణాలు ఎక్కువే: హెచ్‌ఎంఐఎస్‌ నివేదిక

భారత్‌లోని 640 జిల్లాలకు గాను 448 చోట్ల ప్రసూతి మరణాలు ఐక్యరాజ్యసమితి (ఐరాస) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) నిర్దేశించిన కన్నా ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన వెబ్‌ ఆధారిత యంత్రాంగమైన హెల్త్‌ మేనేజిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎంఐఎస్‌) గణాంకాలను పరిశీలించారు. 2022లో భారత్‌లోని జిల్లాల సంఖ్య 773కు పెరిగినా హెచ్‌ఎంఐఎస్‌ 2011 జనగణనలో నమోదైన 640 జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ప్రతి లక్ష జననాలకు గర్భిణిగా ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయాల్లో సంభవించే మరణాలు ఎంత మేర అనేది మాతా మరణాల రేటు (ఎంఎంఆర్‌) సూచిస్తుంది.

ఐరాస ఎస్డీజీల ప్రకారం.. 2030కల్లా లక్ష జననాలకు ఎంఎంఆర్‌ 70 మరణాలకు మించకూడదు. అయితే భారత్‌లో సగటున ఇది 113గా ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా (284) ఉండగా మహారాష్ట్రలో అతి తక్కువ (40) నమోదైంది. 2017-19 మధ్యకాలంలో హెచ్‌ఎంఐఎస్‌లో 6.19 కోట్ల జననాలు, 61,169 మరణాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలను బట్టి దేశంలోని 70 శాతం జిల్లాల్లో ఎస్డీజీలు నిర్దేశించిన కన్నా ఎక్కువ ప్రసూతి మరణాలు నమోదైనట్లు అధ్యయనకర్తలు నిర్ధారణకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మాతా మరణాల్లో అత్యధికం నైజీరియాలో (19 శాతం) నమోదు కాగా 15 శాతంతో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

ముంబయిలోని అంతర్జాతీయ జనాభా విజ్ఞానశాస్త్రాల సంస్థ, బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయాలు ఈ అధ్యయనం నిర్వహించాయి. ఎంఎంఆర్‌ 140-209 మధ్య నమోదైన తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంజాబ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, జమ్మూ-కశ్మీర్‌ కూడా ఉన్నాయి. మణిపూర్, అండమాన్, నికోబార్, మేఘాలయ, సిక్కింలలో ఎంఎంఆర్‌ 210 కన్నా ఎక్కువ. భారత్‌లో ఎంఎంఆర్‌ ఏటా 4.5 శాతం చొప్పున తగ్గుతున్నా ఐరాస ఎస్డీజీల ప్రకారం అది 5.5 శాతం తగ్గాల్సి ఉంది. దేశంలో కేవలం 190 జిల్లాల్లో మాత్రమే ఎంఎంఆర్‌ నిర్దేశించిన 70 కన్నా తక్కువగా ఉంది.


వందలో మూడు నాణ్యత లేని మందులే

2020 - 21లో దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకి వచ్చినవాటిలో 3.12 శాతం ఔషధాలు నాసిరకం కాగా 0.29 శాతం పూర్తిగా నకిలీవని తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక వెల్లడించింది. అంతకుముందు అయిదేళ్ల గణాంకాలను చూసినా ఇదే పరిస్థితి. ఏటా 3 శాతానికి తగ్గకుండా నాసి ఔషధాలు ఉత్పత్తి, సరఫరా అవుతున్నాయి. 2016 - 17లో 0.15 శాతమున్న నకిలీ ఔషధాలు 2020 - 21 నాటికి 0.29 శాతానికి పెరగడం మరో అంశం. ఈ క్రమంలో ఔషధ నియంత్రణ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఈ ఏడాది రూ.1,750 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. నాసిరకం, నకిలీ ఔషధాల ఉత్పత్తిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రాలకూ ఆ అధికారాలు కల్పించినట్లు తెలిపింది.

2030 నాటికి క్యాన్సర్‌ బాధితుల సంఖ్య 2.08 లక్షలు

తెలంగాణలో క్యాన్సర్‌ మహమ్మారి అత్యంత వేగంగా విజృంభిస్తోంది. 2022లో క్యాన్సర్‌ బాధితులు 1,09,433 మంది ఉండగా 2030 నాటికి వీరి సంఖ్య 2.08 లక్షలు దాటుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. అంటే దాదాపు రెట్టింపు అవుతుంది. తల, మెడ, నోటి క్యాన్సర్‌ కేసులు అత్యధికంగా 22.56 శాతం నమోదయ్యాయి. మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్ల కేసులు 30 శాతం వరకూ ఉన్నట్లు వెల్లడైంది. అన్ని రకాల క్యాన్సర్లలో మహిళలకు మాత్రమే వచ్చేవి దాదాపు మూడోవంతు ఉండడం గమనార్హం.

‣ ఈ మేరకు భారతీయ ప్రజారోగ్య సంస్థ (ఐఐపీహెచ్‌) తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2020 - 21లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రస్తుతం క్యాన్సర్‌ నిర్ధారణ కాగానే ప్రభుత్వానికి తెలియజేసే విధానం లేదు. ఇక నుంచి నిర్ధారణ కాగానే.. అన్ని ఆసుపత్రులూ సర్కార్‌కు నివేదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు ఐఐపీహెచ్‌ (హైదరాబాద్‌) సంచాలకులు ఆచార్య జీవీఎస్‌ మూర్తి తెలిపారు. ఐసీఎంఆర్, గ్లోబల్‌ బర్డన్‌ ఆఫ్‌ డిసీజ్‌ తదితర నివేదికలను క్రోడీకరించి అధ్యయన నివేదిక తయారు చేశామని పేర్కొన్నారు.

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహమ్మారి తీరును విశ్లేషించారు. ఐసీఎంఆర్‌ - ఆరోగ్యశ్రీ గణాంకాలను ఇందుకు ప్రాతిపదికగా చేసుకున్నారు. దీని ప్రకారం.. 2021లో రాష్ట్రంలో కొత్తగా 48,320 క్యాన్సర్‌ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో సుమారు 30 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనే ఉండడం పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంది.


కరోనా కాలంలో ఐటీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌కు 13వ స్థానం

కొవిడ్‌-19 సమయంలో చికిత్స, ఇతర చోట్ల మౌలిక సదుపాయాలు కల్పించడం, ఐటీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడింది. పెద్ద రాష్ట్రాల పురోగతిని సమీక్షిస్తే ఏపీ 13వ స్థానానికి పరిమితమైంది. 2019లో ప్రతి లక్ష మంది జనాభాలో 741 సాధారణ మరణాలు సంభవించాయి. ఐదు కారణాలతో జరిగిన ఈ మరణాల్లో గుండెపోటువి అత్యధికం. తరువాత ఊపిరితిత్తులు, పక్షవాతం, విరేచనాలు, మధుమేహంతో చనిపోవడం జరిగింది. డిసెంబరు 15, 2021 నాటికి ప్రతి లక్ష మందికి 27.41 మంది కొవిడ్‌తో మరణించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్‌ కృషి ఎలా ఉందన్న దానిపై ‘కొవిడ్‌-19 భారత్‌ ప్రతిస్పందన’ పేరుతో దిల్లీకి చెందిన ‘అబ్జర్వర్‌ రీసెర్చి ఫౌండేషన్‌’ నివేదిక విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వే, నీతి ఆయోగ్, ఐసీఎంఆర్‌ నివేదికలు, లోక్‌సభలో వచ్చిన ప్రశ్నలు - సమాధానాలు, కొవిన్‌ డ్యాష్‌బోర్డు, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లు, ఇతర మార్గాల్లో వివరాల ఆధారంగా నివేదికను రూపొందించింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నా వైరస్‌ వ్యాప్తి, దుష్ఫలితాలు, మరణాలు అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేసిందని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు కరోనా టీకాను సరఫరా చేసి, వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో కేంద్రం ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొంది.

గడిచిన రెండేళ్లలో కొవిడ్‌ సమయంలో ఆయా రాష్ట్రాల్లోని వైద్య, ఆరోగ్య రంగం ఏ స్థాయిలో పనిచేసిందో ర్యాంకుల ద్వారా ‘ఓఆర్‌ఎఫ్‌’ వెల్లడించింది. కొవిడ్‌ కేసుల నమోదు దగ్గర నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ వరకు ఆయా రాష్ట్రాల్లోని వైద్య ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పుల పరిణామక్రమాలు పరిగణనలోకి తీసుకుంది. ఎంపిక చేసిన విభాగాల్లో కేటాయించిన ‘స్కోరింగ్‌’ ఆధారంగా నివేదికలో ర్యాంకులను ప్రకటించింది. ఇందులో హిమాచల్‌ప్రదేశ్, గోవా ముందంజలో ఉన్నాయి. కేంద్ర పాలిత రాష్ట్రాల్లో లక్షద్వీప్‌ ముందుంది.

‣ వైద్య రంగంలో ఐటీ వినియోగంలో తమిళనాడు, కేరళ, గోవా, దిల్లీ ముందంజలో ఉన్నాయి. సాధారణ ఆరోగ్య నియమాలు పాటించడంలో తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇన్‌స్టిట్యూషనల్‌ సపోర్టింగ్‌ విధానంలో మేఘాలయ ఉత్తమ పనితీరు కనబరిచింది. హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలు ఇదే బాటలో నడిచాయి.

‣ ‘హెల్త్‌ ప్రొఫైల్‌’లో తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గోవా, దాద్రానగర్, వైద్య వసతుల కల్పనలో కేరళ మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, మిజోరం రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

‣ సాంకేతికత వినియోగంలో తమిళనాడు, కేరళ, దిల్లీ ముందు వరుసలో నిలబడ్డాయి.

‣ పది వేల జనాభాకు ఒక వెంటిలేటరు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


020 - 21లో జాతీయ పార్టీలకు 41.49% తగ్గిన నిధుల రాక: ఏడీఆర్‌ నివేదిక

దేశంలో అనేక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిన కొవిడ్‌ మహమ్మారి, రాజకీయ పార్టీలను ఆర్థికంగా వదలలేదు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు దక్కిన విరాళాలు 2019 - 20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020 - 21లో 41.49% తగ్గాయి. ఆ తగ్గిన మొత్తం విలువ రూ.420 కోట్ల పైమాటే. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజా నివేదికలో ఈ మేరకు పలు కీలక వివరాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో అధికార భాజపా అత్యధికంగా రూ.477.54 కోట్ల విరాళాలు పొందింది. ముఖ్యాంశాలు.. ‣ 2020 - 21లో జాతీయ పార్టీలకు కార్పొరేట్, వ్యాపార రంగాల్లోని సంస్థల నుంచి 1,398 విరాళాలు అందాయి. వాటి మొత్తం విలువ రూ.480.65 కోట్లు. ఇందులో సింహభాగాన్ని భాజపా దక్కించుకుంది. ఆ పార్టీ ఖాతాలోకి ఏకంగా రూ.416.79 కోట్లు వెళ్లాయి. కాంగ్రెస్‌కు 35.89 కోట్లు దక్కాయి. వ్యక్తుల నుంచి కమలదళానికి రూ.60.37 కోట్లు రాగా, హస్తం పార్టీకి రూ.38.63 కోట్లు లభించాయి. అన్ని పార్టీలకు కలిపి చూస్తే వ్యక్తుల నుంచి రూ.111.65 కోట్లు వచ్చాయి. ‣ భాజపా దక్కించుకున్న విరాళాలు 2018 - 19తో పోలిస్తే 2019 - 20లో 5.8% పెరిగింది. ‣ దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు 8

కరోనా టీకాలతో నిలిచిన కోట్ల ప్రాణాలు

కొవిడ్‌ మహమ్మారి కరాళనృత్యం చేసినవేళ టీకాలు మానవాళికి ప్రాణ రక్షక సాధనాలుగా నిలిచాయని తాజా అధ్యయనం పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఆమోదముద్ర పొందిన ఒక్కో టీకా పంపిణీ ప్రారంభమైన తొలి ఏడాది కాలంలో లక్షల మంది ప్రాణాలను కాపాడినట్లు వెల్లడించింది. ఈ అధ్యయన అంచనాల ప్రకారం.. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా (భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో వినియోగించారు) 63.41 లక్షలు, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ 59.79 లక్షల మందిని రక్షించింది. వాటి తర్వాతి స్థానాల్లో సినోవాక్‌ (20 లక్షలు), మోడెర్నా (17 లక్షలు) ఉన్నాయి. ప్రఖ్యాత ఔషధ తయారీ కంపెనీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా 3.71 లక్షల మంది ప్రాణాలను రక్షించడం ద్వారా ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. 2020 డిసెంబరు నుంచి 2021 డిసెంబరు వరకు కరోనా టీకాలు ప్రపంచవ్యాప్తంగా 1.98 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనంలో తేల్చారు. ఆయా దేశాల్లో ఏ టీకాను ఉపయోగించారో విశ్లేషిస్తూ ‘ఎయిర్‌ఫినిటీ’ అనే బ్రిటన్‌ సంస్థ తాజా అధ్యయన అంచనాలను వెలువరించింది.

స్త్రీ, పురుష సమానత్వంలో భారత్‌ది 135వ స్థానం

స్త్రీ, పురుష సమానత్వం విషయంలో భారత్‌ అట్టడుగున 135వ స్థానంలో ఉంది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలకు సంబంధించి గతంతో పోలిస్తే 5 ర్యాంకులు ఎగబాకినా ప్రపంచంలో ఇంకా చివరి స్థానాల్లోనే భారత్‌ ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక ఫోరానికి (డబ్ల్యూఈఎఫ్‌) చెందిన జండర్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ - 2022లో పేర్కొన్నారు. మొత్తం 146 దేశాల సూచీలో భారత్‌ తరవాత స్థానాల్లో 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, కాంగో, ఇరాన్, చద్‌లు చివరి ఐదు స్థానాల్లో ఉన్నాయి. స్త్రీ, పురుష సమానత్వం ఎక్కువగా ఉండే దేశంగా ఐస్‌లాండ్‌ తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటూ ప్రపంచంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరవాత స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్‌లు ఉన్నాయి. 2021తో పోలిస్తే ఆర్థిక రంగంలో భాగస్వామ్యం, అవకాశాల విషయంలో చాలా సానుకూల మార్పులు ఉన్నాయని స్త్రీ, పురుష కార్మికుల భాగస్వామ్యం మాత్రం తగ్గిందని నివేదిక పేర్కొంది. మహిళా ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ అధికారులు, మేనేజర్ల శాతం 14.6 నుంచి 17.6 శాతానికి పెరిగిందని, మహిళా సాంకేతిక పని వారి శాతం 29.2 నుంచి 32.9కి హెచ్చిందని వివరించింది. రాజకీయ సాధికారత విషయంలో భారత్‌ 48వ స్థానంలో ఉంది. ఆరోగ్యం, మనుగడ (సర్వైవల్‌) సూచీలో భారత్‌ చివరి స్థానం (146)లో ఉండటం గమనార్హం. 146 దేశాల్లోని వివిధ ప్రామాణికాలను ప్రపంచ ఆర్థిక ఫోరం పరిశీలించి ఈ వివరాలను వెల్లడించింది.

నేర నేపథ్యం ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు 43%: ఏడీఆర్‌ నివేదిక

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,759 మంది కాగా వారిలో 2,030 మంది (43%)పై క్రిమినల్‌ కేసులున్నట్లు ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం - ఏడీఆర్‌’ వెల్లడించింది. ప్రజా ప్రతినిధులు తమ ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించింది. లోక్‌సభ సభ్యుల్లో 44%, రాజ్యసభ సభ్యుల్లో 31%, ఎమ్మెల్యేల్లో 43% మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 మంది ఎమ్మెల్యేల్లో 174 మంది చరిత్రను ఏడీఆర్‌ విశ్లేషించింది. అందులో 95 మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు తెలిపింది. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్‌ కేసులు, 47 మందిపై తీవ్రమైన నేరాభియోగాలున్నట్లు తెలిపింది. కేరళలోని ఇడుక్కి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ డీన్‌కురియాకోస్‌పై అత్యధికంగా 204 కేసులున్నాయి. అందులో 37 తీవ్రమైనవి. ఎంపీలు, ఎమ్మెల్యేల్లో తీవ్రస్థాయి క్రిమినల్‌ కేసులున్నవారు: 28% హత్యా నేర అభియోగాలున్నవారు: 61 మంది హత్యాయత్నం నేరాభియోగాలున్నవారు: 223 మంది

జనాభాలో చైనాను మించిపోనున్న భారత్‌

భూమిపై మానవుల సంఖ్య సరికొత్త రికార్డుకు చేరుకోనున్నది. ఈ ఏడాది నవంబరు 15వ తేదీ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. వచ్చే ఏడాది జన సంఖ్యలో చైనాను భారత దేశం మించిపోతుందని ప్రకటించింది. ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖకు చెందిన జనాభా వ్యవహారాల విభాగం విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. 2020 నుంచి ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1 శాతం కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ 2022లో ప్రపంచ జనాభా 800 కోట్లకూ, 2030లో 850 కోట్లకూ, 2050లో 970 కోట్లకు చేరనున్నది. 2080 కల్లా భూగోళంపై జనాభా 1040 కోట్లకు పెరిగి 2100 ఏడాదికి అదే స్థాయిలో నిలబడుతుందని సమితి అంచనావేసింది. తర్వలో ఒక మైలు రాయిని దాటబోతున్నామని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. ఈ ఏడాది నవంబరులో జరిగే ఒక జననంతో భూమిపై మానవాళి సంఖ్య 800 కోట్లకు చేరనున్నదని వివరించారు. ఆరోగ్య రక్షణలో మనం సాధించిన విజయాల వల్ల మానవుల సగటు ఆయుర్దాయం పెరిగిందనీ, మాతాశిశు మరణాలు తగ్గాయని గుటెర్రెస్‌ పేర్కొన్నారు. ఎనిమిది దేశాల్లో వృద్ధి 50 శాతం పైనే.. 2050 కల్లా ప్రపంచ జనాభా వృద్ధి రేటులో 50 శాతానికిపైగా కేవలం 8 దేశాల్లో సంభవిస్తుందని సమితి నివేదిక వెల్లడించింది. అవి భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్ట్, నైజీరియా, ఇథియోపియా, ఫిలిప్పీన్స్, టాంజానియా. 2022లో భారత్‌ జనాభా 141.2 కోట్లు కాగా, చైనా జనాభా 142.6 కోట్లు. 2023లో భారత జనాభా చైనా కన్నా ఎక్కువగా ఉంటుంది. 2050 కల్లా భారతదేశ జనాభా 166.8 కోట్లకు పెరిగితే చైనా జనాభా 131.7 కోట్లకు తగ్గుతుంది. 2010 - 21 మధ్య 10 దేశాల నుంచి సగటున 10 లక్షలకు పైగా మానవ సిబ్బంది తాత్కాలిక ఉపాధి నిమిత్తం విదేశాలకు వలస వెళ్లారని సమితి తెలిపింది. ఈ కాలంలో పాకిస్థాన్‌ నుంచి 1.65 కోట్ల మంది, భారత్‌ నుంచి 35 లక్షల మంది, బంగ్లాదేశ్‌ నుంచి 29 లక్షలు, నేపాల్‌ నుంచి 16 లక్షలు, శ్రీలంక నుంచి 10 లక్షల మంది వలస వెళ్లారు. 2019లో ప్రపంచ ప్రజల సగటు ఆయుర్దాయం 72.8 సంవత్సరాలకు పెరిగింది. 1990 కన్నా ఇది 9 సంవత్సరాలు ఎక్కువ. 2050 కల్లా సగటు ఆయుర్దాయం 77.2 సంవత్సరాలకు పెరుగుతుంది.

దేశంలో క్రమంగా అధికమవుతున్న రక్తహీనత బాధితుల సంఖ్య: ఐరాస

పోషకాహార లోపం కోరల్లోంచి భారత్‌ క్రమంగా బయటపడుతున్నట్లు కనిపిస్తోంది. గత 15 ఏళ్లలో దేశంలో పోషకాహార లోపం బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 2004 - 06 మధ్య దేశ జనాభాలో వారు 21.6% ఉండగా 2019 - 21 నాటికి 16.3 శాతానికి దిగి వచ్చిందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే భారతావనిలో ఊబకాయ వయోజనులు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య పెరిగినట్లు పేర్కొంది. ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార స్థితి - 2022’ పేరుతో ఐరాస పరిధిలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో), అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి (ఐఎఫ్‌ఏడీ), యునిసెఫ్, ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఉమ్మడిగా ఈ నివేదికను విడుదల చేశాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, ఊబకాయుల సంఖ్య, పోషకాహార లేమి సమస్య వంటి అంశాల గురించి అందులో పలు కీలక అంశాలు తెలియజేశారు.

‘భారత్‌లో యువత 2022’ నివేదిక

ఉద్యోగంలో ఎదగాలనే సంకల్పం. జీవితంలో స్థిరత్వం సాధించాలనే తపన. కెరీర్‌పై దృష్టి, తదితర కారణాలతో ఈ తరం యువతీ యువకులకు పెళ్లీడు దాటిపోతోంది. 30 ఏళ్లు మీద పడినా వారు వివాహం వైపు దృష్టి సారించడం లేదు. దేశం మొత్తమ్మీద ఇదే ధోరణి కొనసాగుతోంది. భారత్‌లో 29 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోనివారు 2011లో 20.8 శాతం మంది నమోదు కాగా 2019లో ఇది 26.1 శాతానికి పెరిగింది. తెలంగాణలో గడచిన అయిదేళ్లతో పోల్చితే పెళ్లీడు దాటిపోయే వారి సంఖ్య దాదాపు 2 శాతం పెరిగింది. 2015లో రాష్ట్రంలో 30 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోని వారు 21.5 శాతం మంది ఉండగా 2019లో ఏకంగా 23.8 శాతానికి పెరిగారు.

ఆకలి మంటల్లో 230 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా బాధితులు: ఐరాస

తగినంత ఆహారం దొరకక అల్లాడుతున్న వారి సంఖ్య మరింత పెరిగిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర క్షుద్బాధతో, అర్ధాకలితో జీవితాలను భారంగా నెట్టుకొస్తున్న వారి సంఖ్య 230 కోట్లకు పైగానే ఉందని తెలిపింది. ఇది 2021లోని పరిస్థితని, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమై ఆహార ధాన్యాల ధరలు పెరిగి పరిస్థితి మరింతగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆకలి మంటలను చల్లార్చి, పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ఆహార భద్రతను కల్పించే విషయంలో పురోగతి కనిపించడంలేదని పేర్కొంది. ఐరాస ఆహారం - వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, ఐరాస బాలల నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి అవసరమైన పోషకాహారాన్ని పొందలేకపోవడాన్ని ఆకలి సూచీకి ప్రామాణికంగా భావిస్తూ ఈ నివేదికను రూపొందించారు. 34.5 కోట్ల మంది పస్తులతో అల్లాడుతున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్లే తెలిపారు. 45 దేశాలకు చెందిన మరో 5 కోట్ల మంది తీవ్ర కరవు పరిస్థితులకు చేరువలో ఉన్నారని వెల్లడించారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌లో ఆహార కొరత తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. కరవు పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, దీనికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం జత కలవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుందని నివేదిక హెచ్చరించింది.

రాజకీయ నేతలు ఆయుర్దాయంలోనూ సంపన్నులే!

సమాజంలో సంపన్న - పేద వర్గాల మధ్య ఆదాయంలోనే కాకుండా ఆయుర్దాయంలోనూ అంతరాలు ఎక్కువగానే ఉంటున్నాయని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. ఈ మేరకు అమెరికాలో ఆదాయపరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న 1% మంది అట్టడుగున ఉన్న 1% మంది కన్నా సగటున 15 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఈ ఉన్నత శ్రేణిలోనూ రాజకీయ నాయకులది ప్రత్యేక కోవ. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల కన్నా రాజకీయ నాయకులు సగటున 3 నుంచి 7 ఏళ్లు అదనంగా జీవిస్తున్నారని ఆక్స్‌ఫర్డ్, మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకుల సంయుక్త అధ్యయనం తేల్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియాలతో సహా 11 సంపన్న దేశాల్లో 57,000 మందికిపైగా రాజకీయ నాయకులపై ఈ అధ్యయనం జరిగింది. సగటున రాజకీయ నాయకులు 45 ఏళ్ల వయసులో ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతారు కాబట్టి, అప్పటి నుంచి వారి ఆయుర్దాయాన్ని సాధారణ పౌరులతో పోల్చిచూశారు. వారు 45 ఏళ్ల వయసు తరవాత మరో 40 ఏళ్లపాటు జీవిస్తున్నారు. 45 ఏళ్ల వయసు వచ్చిన తరవాత సాధారణ అమెరికన్‌ పౌరులు 34.5 ఏళ్ల పాటు, ఆస్ట్రేలియన్లు 37.8 ఏళ్లు జీవిస్తున్నారు. ఆదాయం మాత్రమే కాకుండా, ధూమపానానికి స్వస్తిచెప్పడం, సమతుల ఆహారం వంటి మంచి అలవాట్లు కూడా నేతల ఆయుర్దాయం పెరగడానికి దోహదపడ్డాయి.

స్టార్టప్‌ సూపర్‌స్టార్‌గా తెలంగాణకు అగ్రస్థానం

దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్స్‌ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకులు విడుదల చేశారు. ఈ రంగంలో పెద్ద (కోటికిపైగా జనాభా), చిన్న (కోటిలోపు జనాభా) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపిన ప్రతిభ ఆధారంగా వాటిని స్టార్టప్‌ మెగాస్టార్స్‌ (బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌), సూపర్‌స్టార్స్‌ (టాప్‌ పెర్ఫార్మర్స్‌), స్టార్స్‌ (ది లీడర్స్‌), రైజింగ్‌ స్టార్స్‌ (యాస్పైరింగ్‌ లీడర్స్‌), సన్‌రైజర్స్‌ (ఎమర్జింగ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్స్‌) పేరుతో అయిదు విభాగాలుగా విభజించారు.

‣ సామర్థ్యం పెంపు, మార్గనిర్దేశం, నిధులు, ఇంక్యుబేషన్, సంస్థాగత విషయాల్లో మద్దతు, మార్కెట్‌ అందుబాటు, నవకల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహం ఆధారంగా రాష్ట్రాల స్థాయిని లెక్కించారు. 26 కార్యాచరణ సూత్రాల కొలమానంగా 100 మార్కులకు ఈ ర్యాంకులు ప్రకటించారు.

‣ తెలంగాణలో బలమైన స్టార్టప్‌ వాతావరణం ఉన్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇక్కడ ఏర్పాటైన స్టార్టప్‌లకు మారదర్శకత్వం, ఇంక్యుబేషన్, నిధుల మద్దతు ద్వారా సాధికారత కల్పిస్తున్నట్లు ప్రశంసించింది.

1 మెగాస్టార్స్‌
గుజరాత్, కర్ణాటక

2 సూపర్‌స్టార్స్‌
తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా. కేంద్రపాలిత ప్రాంతం నుంచి జమ్మూకశ్మీర్‌

3 స్టార్స్‌
తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, అస్సాం. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అరుణాచల్‌ప్రదేశ్, అండమాన్‌ నికోబార్‌ దీవులు, గోవా

4 రైజింగ్‌ స్టార్స్‌
రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, త్రిపుర, దాద్రానగర్‌హవేలి, మణిపుర్, నాగాలాండ్, పుదుచ్చేరి

5 సన్‌రైజర్స్‌
బిహార్, ఏపీ. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మిజోరం, లద్ధాఖ్‌


అమెరికా పౌరసత్వాల్లో భారత్‌ది రెండో స్థానం

అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందిన వారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి పౌరసత్వం ఇవ్వగా ఈ 5 దేశాలకు చెందినవారే 34% ఉన్నారు. వీరిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉండగా భారత్‌కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్‌ (11,316), క్యూబా (10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌ (7,046)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్‌లు ముందంజలో ఉండగా క్యూబా, ఫిలిప్పీన్స్, చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి.

‣ అమెరికాలో అక్టోబరు 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ మేరకు 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 15 నాటికి మొత్తం 6,61,500 మంది కొత్తగా పౌరసత్వం పొందినట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,55,000 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది


వచ్చే పదేళ్లలో కోటి మందికి బాల్య వివాహాలు

రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి బాల్య వివాహాలు జరగనున్నట్లు ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది. ఏటా 1.2 కోట్ల మంది బాల్యంలోనే వివాహ వ్యవస్థలోకి అడుగుపెడుతున్నారు. నార్త్‌వెస్ట్‌ సెంట్రల్‌ ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ అమెరికాల్లో ఈ తరహా పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. నైగర్‌లో 76% మంది, బంగ్లాదేశ్‌లో 59% మంది, బ్రెజిల్‌లో 36% మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగుతున్నాయి. 2000 - 18 మధ్య కాలంలో అమెరికాలో దాదాపు 3 లక్షల బాల్య వివాహాలు జరిగాయి. ఇలాంటి పెళ్లిళ్లను అరికట్టాలంటే చదువు, ఆర్థిక సాధికారత, నచ్చిన వ్యక్తిని ఎంచుకొనే స్వేచ్ఛ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ వారికి ఇవ్వాలని సంపాదకీయంలో ‘ది లాన్సెట్‌’ పేర్కొంది.