క్రీడలు

కామన్వెల్త్‌ క్రీడలు: ఇంగ్లండ్‌ ఖాతాలో తొలి స్వర్ణం

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని ఆతిథ్య ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. పురుషుల ట్రయథ్లాన్‌లో ఆ దేశ అథ్లెట్‌ అలెక్స్‌ యీ విజేతగా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన అతడు.. ఈ రేసులో ఒక దశలో 16 సెకన్లు వెనకబడ్డాడు. హేడెన్‌ విల్డ్‌ (న్యూజిలాండ్‌) ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ విల్డ్‌కు పెనాల్టీ పడడంతో దూసుకొచ్చిన అలెక్స్‌.. అందరి కంటే ముందు ఫినిషింగ్‌ లైన్‌ను దాటాడు. హేడెన్‌ రజతంతో సరిపెట్టుకోగా. న్యూజిలాండ్‌కే చెందిన మాథ్యూ హసెర్‌ కాంస్యం దక్కించుకున్నాడు.

యూఏఈలో ఆసియాకప్‌

ఆసియాకప్‌ను శ్రీలంక నుంచి యూఏఈకి తరలించారు. లంకలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభమే ఈ నిర్ణయానికి కారణం. అయితే యూఏఈలో ఆతిథ్యమిచ్చేది కూడా శ్రీలంకనే. ఈ టోర్నీ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు జరుగుతుంది.

డొమెనికో వికిని అరుదైన రికార్డు

సాన్‌ మారినో టెన్నిస్‌ ఆటగాడు డొమెనికో వికిని అరుదైన రికార్డు సాధించాడు. 51 ఏళ్ల వయసులో డేవిస్‌కప్‌ మ్యాచ్‌ గెలిచి ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. అల్బేనియాతో ఐరోపా డేవిస్‌కప్‌ గ్రూప్‌-4 పోరులో పురుషుల డబుల్స్‌లో డొమెనికో-మార్కో రోసి 6-3, 7-6 (7-3)తో మార్టిన్‌-మారియోపై విజయం సాధించారు. కెరీర్‌లో 24వ డేవిస్‌కప్‌ ఆడుతున్న డొమెనికోకు ఇది 99వ మ్యాచ్‌. మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో సింగిల్స్‌ మ్యాచ్‌ గెలిచిన పెద్ద వయస్కుడిగా (47 ఏళ్ల 318 రోజులు) ఈ సాన్‌మారినో ఆటగాడు ఘనత సాధించాడు. 1993లో డొమెనికో డేవిస్‌కప్‌ అరంగేట్రం చేశాడు.

మహిళల క్రికెట్లో తొలిసారి ఎఫ్‌టీపీ

క్రమంగా ఆదరణ పెంచుకుంటున్న మహిళా క్రికెట్‌పై ఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. అమ్మాయిల ఆటకు తొలిసారి భవిష్యత్‌ పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు ముఖ్య ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ (సీఈసీ) ఆమోదం తెలిపింది. త్వరలోనే మహిళల క్రికెట్లో వచ్చే అయిదేళ్లకు గాను ఎఫ్‌టీపీ వెల్లడించనున్నారు. 2023 - 27 ఎఫ్‌టీపీలో వన్డేలు ఆడేందుకు దేశాలు ఆసక్తితో ఉన్నాయని ఐసీసీ సీఈవో అల్డారిస్‌ చెప్పాడు.

మెక్‌కెయాన్‌ ప్రపంచ రికార్డు

ఫ్రాన్స్‌ ఆటగాడు క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా గుస్తావ్‌ మెక్‌కెయాన్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ ఐరోపా ఉప ప్రాంతీయ క్వాలిఫయర్‌ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన మెక్‌కెయాన్‌ (109; 61 బంతుల్లో 5×4, 9×6) వయసు 18 ఏళ్ల 280 రోజులు. అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌ హజ్రతుల్లా జజాయ్‌ (20 ఏళ్ల 337 రోజులు; 162 నాటౌట్, 2019లో ఐర్లాండ్‌పై) పేరిట ఉన్న రికార్డును అతడు తిరగరాశాడు.

ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీలో లక్ష్మణ్‌కు చోటు

ఐసీసీ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఐసీసీ ఛైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఎన్నికలు నవంబరులో జరుగుతాయి. కొత్త ఛైర్మన్‌ డిసెంబరు 1 నుంచి రెండేళ్లు పదవిలో ఉంటాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీలో చోటు దక్కింది. ఆటగాళ్ల ప్రతినిధిగా అతడు కమిటీలో ఉంటాడు. కివీస్‌ మాజీ క్రికెటర్‌ వెటోరి మరో ప్రతినిధి.

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికా 33 పతకాలతో అగ్రస్థానం

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు మొత్తం 33 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇథియోపియా (4 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు), జమైకా (2 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా చారిత్రక రజతంతో భారత్‌ 33వ స్థానాన్ని సొంతం చేసుకుంది. పోటీల చివరి రోజూ 4×400 మీటర్ల రిలేలో పురుషులు, మహిళల బంగారు పతకాలు అమెరికాకే దక్కాయి. దీంతో 36 ఏళ్ల ఫెలిక్స్‌ ఖాతాలో 20వ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకం (14వ పసిడి) చేరింది. జమైకా (3:20.74 సె), బ్రిటన్‌ (3:22.64 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల విభాగంలో కొత్త రికార్డుతో అమెరికా (2:56.17 సె) బంగారు పతకం, జమైకా (2:58.58 సె) రజతం, బెల్జియం (2:58.72 సె) కాంస్యం నెగ్గాయి. మహిళల 100మీ. హార్డిల్స్‌ సెమీస్‌లో 12.12 సె టైమింగ్‌తో ప్రపంచ రికార్డు సృష్టించిన తోబి అముసాన్‌ (నైజీరియా) ఫైనల్లోనూ జోరు కొనసాగించి పసిడి నెగ్గింది.

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ చోప్రాకు రజతం

భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 19 ఏళ్ల పతక కరవుకు తెరదించాడు. పురుషుల జావెలిన్‌ త్రోలో రజతాన్ని సాధించాడు. అర్హత రౌండ్లో ఒక్కటే త్రో విసిరి 88.39 మీటర్ల ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన ఈ 24 ఏళ్ల అథ్లెట్‌ తుది పోరులో తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా రాణించాడు. ఫైనల్లో 88.13 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానం సాధించాడు. అర్హత రౌండ్లో నీరజ్‌ కంటే మెరుగైన ప్రదర్శన (89.91మీ) చేసిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) పతక పోరులో 90.54 మీ. దూరంతో పసిడి పట్టేశాడు. చెక్‌ రిపబ్లిక్‌ అథ్లెట్‌ వాద్లెచ్‌ (88.09 మీ.) కాంస్యం సొంతం చేసుకున్నాడు. ‣ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో దేశానికి తొలి పతకం అంజు బాబి జార్జ్‌ అందించింది. 2003 పారిస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె మహిళల లాంగ్‌జంప్‌లో కాంస్యం సాధించింది. 6.70 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్‌ దేశానికి పతకం సాధించి పెట్టాడు.

మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డు

మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా తార సిడ్నీ మెక్‌లాలిన్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఫైనల్లో మెక్‌లాలిన్‌ 50.68 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న రికార్డు (51.41 సెకన్లు)ను మెరుగు పరుచుకుంది. ఈ రేసులో ఫిమ్కే (52.27 సెకన్లు, నెదర్లాండ్స్‌), దాలియా మహ్మద్‌ (53.13 సెకన్లు, అమెరికా) రజత, కాంస్య పతకాలు సాధించారు. 2019లో 52.23 సెకన్లలో 400 మీటర్ల హర్డిల్స్‌ రేసు పూర్తి చేసి తొలిసారి రికార్డు సాధించిన మెక్‌లాలిన్, తన రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టింది.

ప్రపంచ అథ్లెటిక్స్‌ మహిళల 200 మీ. రేసులో షెరికాకు స్వర్ణం

ప్రపంచ అథ్లెటిక్స్‌ మహిళల 200 మీటర్ల విభాగంలో రెండో అత్యంత వేగాన్ని నమోదు చేస్తూ షెరికా జాక్సన్‌ స్వర్ణం గెలిచింది. ఈ జమైకా స్ప్రింటర్‌ వేగం చూస్తే ఫ్లోరెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌ (21.34 సె, 1988 సియోల్‌ ఒలింపిక్స్‌) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలవుతుందేమో అనిపించింది. ఆఖరికి 0.11 సెకన్ల తేడాతో అత్యంత వేగమైన స్ప్రింటర్లలో గ్రిఫిత్‌ తర్వాతి స్థానంలో నిలిచింది షెరికా, మహిళల 200 మీటర్ల రేసును ఆమె 21.45 సెకన్లలో ముగించింది. డేన్‌ షిప్పర్స్‌ (21.63 సెకన్లు) పేరిట ఉన్న ఛాంపియన్‌షిప్‌ రికార్డును తిరగరాసింది. 100 మీటర్ల పరుగు విజేత షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ (21.81 సె) రెండో స్థానంలో రేసు ముగించి రజతం నెగ్గింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ దినా స్మిత్‌ (బ్రిటన్, 22.02 సెకన్లు) కాంస్యం సాధించింది. మరోవైపు పురుషుల 200 మీటర్ల విభాగంలో నోవా లైల్స్‌ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. 26 ఏళ్ల నోవా లైల్స్‌ 19.31 సెకన్లలో రేసు పూర్తి చేయగా కెన్నెత్‌ (19.77 సెకన్లు) రజతం, నైటన్‌ (19.80 సెకన్లు) కాంస్యం నెగ్గారు.

ట్రిపుల్‌ జంప్‌లో పాల్‌ రికార్డు

పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో 25 ఏళ్ల ఎల్దోస్‌ పాల్‌ అదరగొట్టాడు. ట్రిపుల్‌ జంప్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. 16.68 మీ. ప్రదర్శనతో గ్రూప్‌ - ఎలో ఆరు, ఓవరాల్‌గా 12వ స్థానంతో అతను టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు.

ప్రపంచ పారా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 10 పతకాలు

ప్రపంచ పారా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 10 పతకాలతో (6 స్వర్ణ, 3 రజత, 1 కాంస్యం) ఛాంపియన్‌షిప్‌ను ముగించింది. పోటీల చివరి రోజు సింగ్‌రాజ్‌ అదానా ఒక్కడే రెండు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. మొత్తం మీద ఈ టోర్నీలో అతడికి ఇది మూడో పసిడి. 50 మీటర్ల మిక్స్‌డ్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌-1 వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన సింగ్‌రాజ్, 50 మీటర్ల మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో మనీష్‌ నర్వాల్, దీపేందర్‌ సింగ్‌తో కలిసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అంతకుముందు 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో నిహాల్, రాహుల్‌ జక్కర్‌తో కలిసి సింగ్‌రాజ్‌ పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలు సహా మొత్తం 15 పతకాలతో నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లో భారత్‌ ప్రథమ స్థానం సాధించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. పోటీల చివరి రోజు అనీశ్‌ భన్వాలా, విజయ్‌వీర్‌ సిద్ధూ, సమీర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో భారత్‌ 15-17తో చెక్‌ రిపబ్లిక్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఒక దశలో 10-2తో ఆధిక్యంలో ఉన్న భారత్‌ చివరికి రజతం నెగ్గింది. 2019లో జరిగిన 5 ప్రపంచకప్‌లలో భారత్‌ అగ్రస్థానం సాధించింది. 2021లో ఒకసారి, ఈ ఏడాది కైరోలో జరిగిన ప్రపంచకప్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది.

ఐసీసీ వన్డే బౌలింగ్, బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు 2, కోహ్లికి 4వ స్థానం ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయాడు. ఐసీసీ ప్రకటించిన జాబితాలో బుమ్రా (703 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (704) నంబర్‌వన్‌ ర్యాంకును తిరిగి సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఒక స్థానం కోల్పోయాడు. 790 పాయింట్లతో నాలుగో ర్యాంకు సాధించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (786) అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం (892) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్‌ పాండ్య గణనీయమైన పురోగతి సాధించాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన హార్దిక్‌ 13 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 400 మీ. హార్డిల్స్‌ విజేతగా అలిసన్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 400 మీ. హార్డిల్స్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ వార్హోమ్‌ (నార్వే) ఏడో స్థానంలో నిలవగా అలిసన్‌ సాంటోస్‌ (బ్రెజిల్‌) పసిడి నెగ్గాడు. 46.29 సెకన్లలో రేసు ముగించిన అతను కొత్త ఛాంపియన్‌షిప్‌ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికా అథ్లెట్లు బెంజమిన్‌ (46.89 సె), ట్రేవర్‌ (47.39 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు.

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రొజాస్‌కు హ్యాట్రిక్‌ టైటిల్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల ట్రిపుల్‌ జంప్‌లో వెనిజులా స్టార్‌ యులిమర్‌ రొజాస్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. ఆమె వరుసగా మూడో ప్రపంచ టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో రొజాస్‌ 15.47 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచింది. రికెట్స్‌ (14.89 మీ., జమైకా) రజతం, టోరీ ఫ్రాంక్లిన్‌ (14.72 మీ., అమెరికా) కాంస్యం నెగ్గారు. 2017, 2019 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ రొజాస్‌ స్వర్ణం గెలిచింది. మహిళల మారథాన్‌లో ఇథియోపియా రన్నర్‌ గొటెటామ్‌ విజేతగా నిలిచింది. ఆమె 2 గంటల 18 నిమిషాల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి స్వర్ణం దక్కించుకుంది. ఈ క్రమంలో బ్రిటన్‌ మాజీ తార పౌలా రాడ్‌క్లిఫ్‌ (2 గంటల 20 నిమిషాల 57 సెకన్లు, 2009లో) పేరిట ఉన్న ఛాంపియన్‌షిప్‌ రికార్డును బద్దలు కొట్టింది. జుడిత్‌ కొరిర్‌ (2 గంటల 18 నిమిషాల 20 సెకన్లు, కెన్యా) రజతం, సాల్‌పీటర్‌ (2 గంటల 20 నిమిషాల 18 సెకన్లు, ఇజ్రాయిల్‌) కాంస్యం సొంతం చేసుకున్నారు. మహిళల 1500 మీటర్ల టైటిల్‌ను ఫెయిత్‌ కిప్‌గాన్‌ (కెన్యా) సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 3 నిమిషాల 52.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. గడాఫ్‌ (3 నిమిషాల 54.52 సె, ఇథియోపియా) రజతం, లౌరా మిర్‌ (3 నిమిషాల 55.28 సె, బ్రిటన్‌) కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల హైజంప్‌లో ముతాజ్‌ ఇసా (ఖతార్, 2.37 మీ.) స్వర్ణం నెగ్గగా సాంగ్‌యెక్‌ (కొరియా, 2.35 మీ.), ప్రోట్‌సెంకో (ఉక్రెయిన్, 2.33 మీ.) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో అనిష్, రిథమ్‌ జోడీకి కాంస్యం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ 25 మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో టీనేజ్‌ షూటర్లు అనిష్‌ భన్వాలా, రిథమ్‌ సాంగ్వాన్‌ కాంస్యం గెలుచుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఈ జంట 16-12తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అనా దెదోవా, మార్టిన్‌ పొద్రాస్కీ జోడీపై విజయం సాధించింది. మార్చిలో కైరోలో జరిగిన ప్రపంచకప్‌లో ఇదే విభాగంలో అనిష్, రిథమ్‌ జోడీ స్వర్ణం గెలుచుకుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటివరకు 5 స్వర్ణాలు సహా 14 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో హర్షదకు స్వర్ణం

ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత వర్ధమాన క్రీడాకారిణి హర్షద గరుడ్‌ మహిళల 45 కేజీల విభాగంలో ఆమె స్వర్ణ్ణం గెలిచింది. మొత్తం 157 కిలోలు (69 కేజీలు+88 కేజీలు) ఎత్తి అగ్రస్థానం సాధించింది. ఈ ఏడాది మేలో జరిగిన ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ (153 కిలోలు)లో కంటే మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 45 కేజీల యూత్‌ విభాగంలో సౌమ్య దాల్వి కాంస్య పతకం సాధించింది. సౌమ్య 145 కిలోలు (63 కేజీలు+82 కేజీలు) బరువులెత్తి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో ధనుష్‌ కాంస్యం నెగ్గాడు. స్నాచ్‌లో 85 కేజీలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా 185 కిలోల (85 కేజీలు+100 కేజీలు) బరువులెత్తి నాలుగో స్థానం సాధించాడు.

జూనియర్‌ అక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో వ్రితి జాతీయ రికార్డు

జాతీయ జూనియర్‌ అక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్‌ జాతీయ రికార్డు నమోదు చేసింది. బాలికల 800 మీటర్ల ఫ్రీస్టైల్‌ రేసును 9 నిమిషాల 10.32 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 2014 నుంచి ఆకాంక్ష వోరా పేరిట ఉన్న రికార్డు (9 ని. 14.04 సె)ను ఆమె బద్దలు కొట్టింది. సుహాస్‌ ప్రీతమ్, సాగి నిత్య స్వర్ణ పతకాలతో సత్తాచాటారు. బాలుర 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సుహాస్‌ (2 ని. 15.01 సె) అగ్రస్థానం సాధించాడు. బాలికల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో నిత్య (2 ని. 27.58 సె) స్వర్ణం కైవసం చేసుకుంది. బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో సహస్ర కాంస్యం సాధించింది. తీర్థుకు స్వర్ణం బాలుర 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో విజయవాడకు చెందిన తీర్థు సామదేవ్‌ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. నాలుగు నిమిషాల, 20.72 సెకన్ల వ్యవధిలో లక్ష్యాన్ని పూర్తిచేసి ప్రథమ స్థానంలో నిలిచాడు. తీర్థు 200 మీ. ఫ్రీ స్టైల్‌లోనూ పసిడి గెలిచాడు.

క్రికెట్‌కు లెండిల్‌ సిమన్స్‌ వీడ్కోలు

వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ లెండిల్‌ సిమన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. 2006 డిసెంబరు 7న తొలిసారి వెస్టిండీస్‌ జట్టులో అడుగుపెట్టాడు. 16 ఏళ్లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో 144 మ్యాచ్‌లు ఆడి 3,763 పరుగులు చేశాడు. సిమన్స్‌ విండీస్‌ తరఫున ఎనిమిది టెస్టులు, 68 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

షూటింగ్‌ ప్రపంచకప్‌లో మైరాజ్‌ రికార్డు

భారత వెటరన్‌ షూటర్‌ మైరాజ్‌ అహ్మద్‌ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. షూటింగ్‌ ప్రపంచకప్‌లో పురుషుల స్కీట్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత షూటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఫైనల్లో మైరాజ్‌ (37/40), మిన్సు కిమ్‌ (కొరియా, 36), బెన్‌ లెవెలిన్‌ (బ్రిటన్‌ 26)ను వెనక్కి నెట్టి విజేతగా నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో తలపడుతున్న భారత బృందంలోనే పెద్ద వయస్కుడైన 46 ఏళ్ల మైరాజ్‌ క్వాలిఫయింగ్‌లో (119/125) ఎనిమిదో స్థానంతో ముందంజ వేశాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ విభాగంలో అంజుమ్‌ మౌద్గిల్, అషి చౌక్సీ, సిప్త్‌కౌర్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత్‌ 16-6తో ఆస్ట్రియా (వీబెల్, నాడిన్, రెబెకా)పై విజయం సాధించింది.

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 100 మీ. పరుగులో ఫ్రేజర్‌కు స్వర్ణం

దిగ్గజ అథ్లెట్‌ షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 100 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గింది. ఫైనల్లో 10.67 సెకన్లలో ఫినిషింగ్‌ లైన్‌ను తాకిన షెల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ థాంప్సన్‌ హెరా ఫేవరెట్‌గా బరిలో దిగగా ఆమెకు షాకిస్తూ షెల్లీ గెలిచింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో అయిదోసారి ఆమె స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అమెరికా దిగ్గజం మరియన్‌ జోన్స్‌ (10.70 సెకన్లు, 1999లో) పేరిట ఉన్న ఛాంపియన్‌షిప్‌ రికార్డును కూడా ఫ్రేజర్‌ అధిగమించింది. షెరికా జాక్సన్‌ (10.73 సెకన్లు) రజతం గెలవగా, థాంప్సన్‌ (10.81 సెకన్లు) కాంస్యం సాధించింది. 2009లో తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణాన్ని గెలుచుకున్న షెల్లీ 2013, 2015, 2019ల్లోనూ విజేతగా నిలిచింది. 2008, 2012 ఒలింపిక్స్‌లో ఆమె ఇదే విభాగంలో పసిడి కైవసం చేసుకుంది. ‣ ఉగాండా స్టార్‌ జోషువా చెప్తెగి ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 10 వేల మీటర్ల టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 27 నిమిషాల 27.43 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన జోషువా స్వర్ణాన్ని గెలిచాడు. ఈ రేసులో స్టాన్లీ (కెన్యా, 27 నిమిషాల 27.90 సెకన్లు) రజతం సాధించగా, జాకబ్‌ కిప్లిమో (ఉగాండా, 27 నిమిషాల 27.97 సెకన్లు) కాంస్యం నెగ్గాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 10 వేల మీటర్ల పరుగులో రజతం సాధించిన ఈ ఉగాండా అథ్లెట్‌ 5 వేల మీటర్ల పరుగులో స్వర్ణం సాధించాడు.

వన్డే క్రికెట్‌కు బెన్‌ స్టోక్స్‌ వీడ్కోలు

ప్రపంచ మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదిగిన ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. తన సొంత మైదానం డర్హమ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడే వన్డేనే ఈ ఫార్మాట్లో తనకు చివరిదని వెల్లడించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు ఫార్మాట్లలో ఆడడం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోవచ్చని, అందుకే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు తెలిపాడు. ఇంగ్లాండ్‌ మొదటి సారి వన్డే విశ్వ విజేత (2019)గా నిలవడంలో అతను కీలక పాత్ర పోషించారు. 2011లో వన్డేల్లో అడుగుపెట్టిన 31 ఏళ్ల స్టోక్స్‌ ఇప్పటివరకూ 104 వన్డేల్లో 2919 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలున్నాయి. 74 వికెట్లూ పడగొట్టాడు. ఇటీవల టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అతను ఇకపై ఆ ఫార్మాట్‌తో పాటు టీ20ల్లో కొనసాగుతాడు.

తొలిసారి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ సింధు సొంతం

ప్రపంచ మాజీ ఛాంపియన్, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మొదటి సారి సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటికే సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్‌ నెగ్గిన ఈ హైదరాబాదీ షట్లర్‌ ఇప్పుడు మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో మూడో సీడ్‌ సింధు 21-9, 11-21, 21-15 తేడాతో వాంగ్‌ జి యి (చైనా)పై గెలిచింది. వరుసగా 11 పాయింట్లు సాధించి 11-2తో విరామానికి వెళ్లింది. 16-7తో దూకుడు ప్రదర్శించి అదే జోరులో తొలి గేమ్‌ దక్కించుకుంది.

ఇంగ్లాండ్‌పై సిరీస్‌ 2-1తో భారత్‌ గెలుపు

పంత్‌ (125 నాటౌట్‌; 113 బంతుల్లో 16×4, 2×6) అద్భుత శతకానికి, హార్దిక్‌ పాండ్య (71; 55 బంతుల్లో 10×4) పోరాటం తోడైన వేళ చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. 260 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 42.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట ఇంగ్లాండ్‌ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. బట్లర్‌ (60; 80 బంతుల్లో 3×4, 2×6), జేసన్‌ రాయ్‌ (41; 31 బంతుల్లో 7×4) రాణించారు. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ పాండ్య (4/24) తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. చాహల్‌ (3/60), సిరాజ్‌ (2/66) రాణించారు. పంత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కగా, హార్దిక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రెడ్‌ కెర్లీకి స్వర్ణం

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రెడ్‌ కెర్లీ పురుషుల 100 మీ. పరుగు ఫైనల్లో 9.86 సెకన్లలో రేసు ముగించి పసిడి నెగ్గాడు. మార్విన్‌ బ్రేసి (9.88 సె), బ్రోమెల్‌ (9.88 సె) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. ఈ ఇద్దరు ఒకే టైమింగ్‌ నమోదు చేసినప్పటికీ 0.002 సెకండ్‌ తేడాతో బ్రేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 1991 తర్వాత తొలి మూడు స్థానాలనూ అమెరికా అథ్లెట్లు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ విభాగంలో కెర్లీకిదే తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకం. గతంలో 4×400 మీ. రిలేలో ఓ స్వర్ణం (2019), ఓ రజతం (2017), 400 మీ. పరుగులో ఓ కాంస్యం (2019) గెలిచాడు. ‣ మరోవైపు హ్యామర్‌ త్రోలో పావెల్‌ ఫాజ్‌డెక్‌ (పోలండ్‌) వరుసగా అయిదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 81.98 మీ. ప్రదర్శనతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. ‣ పురుషుల మారథాన్‌ టైటిల్‌ను ఇథియోపియా అథ్లెట్‌ తమైరట్‌ టోలా సొంతం చేసుకున్నాడు. అతడు 2 గంటల 5 నిమిషాల 36 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఛాంపియన్‌షిప్‌ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచాడు. మరో ఇథియోపియా రన్నర్‌ మొసినెట్‌ జెర్మి రజతం గెలిచాడు. అతడు 2 గంటల 6 నిమిషాల 44 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. బషీర్‌ అబ్డి (బెల్జియం, 2 గంటల 6 నిమిషాల 48 సెకన్లు) కాంస్యం సాధించాడు.

షూటింగ్‌ ప్రపంచకప్‌లో అంజుమ్‌కు కాంస్యం

భారత స్టార్‌ షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో 50 మీటర్ల వ్యక్తిగత రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో 402.9 పాయింట్లు సాధించిన అంజుమ్‌ మూడో స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్‌ రౌండ్లో ఆరో స్థానంతో ఫైనల్‌ చేరిన ఆమె, ఫైనల్లో రాణించినా ఆఖర్లో తడబడి కాంస్యం నెగ్గింది. ఈ ఏడాది ప్రపంచకప్‌ల్లో అంజుమ్‌కిది రెండో పతకం. ప్రస్తుత టోర్నీలో పురుషుల టీమ్‌ రైఫిల్‌ 3 ప్రొజిషన్స్‌లో సంజీవ్‌ రాజ్‌పుత్, చైన్‌సింగ్, ఐశ్వరీ ప్రతాప్‌సింగ్‌ తోమర్‌లతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. ఫైనల్లో ఈ బృందం 12-16తో చెక్‌ రిపబ్లిక్‌ చేతిలో ఓడింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటిదాకా 11 పతకాలు గెలిచింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, అయిదు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.

కార్తీక్‌ జోడీకి ఐటీఎఫ్‌ టైటిల్‌

ఐటీఎఫ్‌ పురుషుల 15000 డాలర్ల టెన్నిస్‌ టోర్నీలో సాయి కార్తీక్‌ - మనీశ్‌ జోడీ ఛాంపియన్‌గా నిలిచింది. ట్యునీసియాలో జరిగిన ఫైనల్లో ఈ జంట 3-6, 6-3, 10-8 తేడాతో మన దేశానికే చెందిన నిక్కీ - రిత్విక్‌పై గెలిచింది. తెలంగాణ కుర్రాడు కార్తీక్‌కు ఇదే తొలి ఐటీఎఫ్‌ టైటిల్‌.

జాతీయ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వ్రితికి రెండు పతకాలు

జాతీయ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ యువ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ ఓ స్వర్ణంతో పాటు రజతం గెలిచింది. బాలికల 200 మీ. బటర్‌ఫ్లై గ్రూప్‌- 1లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 2 నిమిషాల 22.16 సెకన్లలో రేసు ముగించి పసిడి దక్కించుకుంది. 400 మీ. ఫ్రీస్టైల్‌ గ్రూప్‌-1లో వ్రితి వెండి పతకం నెగ్గింది. 4:29.37సె టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో తోమర్‌కు స్వర్ణం

భారత షూటర్‌ ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌ 50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో స్వర్ణం సాధించాడు. హంగేరికి చెందిన జలాన్‌ పెల్కర్‌ (హంగేరి)ను 16-12తో ఓడించి అతడు విజేతగా నిలిచాడు. తోమర్‌ అంతకుముందు క్వాలిఫికేషన్‌ రౌండ్లో అగ్రస్థానం సాధించాడు. మహిళల 25 మీ. పిస్టల్‌లో మను బాకర్‌ త్రుటిలో పతకం కోల్పోయింది. నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌ ఫైనల్స్‌కు అర్హత సాదించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. నాలుగు రజతాలు, ఓ కాంస్యం కూడా చేజిక్కించుకున్న భారత్‌ మొత్తం తొమ్మిది పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు తొలి భారత అథ్లెట్‌గా మురళీ

భారత లాంగ్‌ జంప్‌ స్టార్‌ మురళీ శ్రీ శంకర్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అర్హత రౌండ్లో 8 మీటర్లు (రెండో ప్రయత్నం) దూకిన 23 ఏళ్ల మురళీ గ్రూప్‌-బిలో రెండో స్థానం, మొత్తం మీద ఏడో స్థానంతో ముందంజ వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో లాంగ్‌జంప్‌లో పురుషుల విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారత అథ్లెట్‌గా శ్రీశంకర్‌ ఘనత సాధించాడు. ఈ గ్రూప్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ మిల్టియాడిస్‌ (8.03 మీ, గ్రీస్‌) అగ్రస్థానంలో నిలిచాడు.

మిక్స్‌డ్‌ రిలేలో ఫెలిక్స్‌కు కాంస్యం

అమెరికా దిగ్గజ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ తన కెరీర్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకంతో వీడ్కోలు పలికింది. 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో కాంస్యం గెలిచిన అమెరికా జట్టులో 36 ఏళ్ల ఫెలిక్స్‌ సభ్యురాలిగా ఉంది. ఫైనల్లో ఫెలిక్స్, గాడ్‌విన్, నార్‌వుడ్, సిమోన్‌లతో కూడిన అమెరికా బృందం 3 నిమిషాల 10.16 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్యం సొంతం చేసుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఫెలిక్స్‌కు ఇది 19వ పతకం. వీటిలో 13 స్వర్ణ పతకాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆమె ఖాతాలో రికార్డు స్థాయిలో 11 ఒలింపిక్స్‌ పతకాలు (7 స్వర్ణ, 3 రజత, 1 కాంస్యం) ఉన్నాయి.

ప్రజ్ఞానందకు పరాసిన్‌ ఓపెన్‌ టైటిల్‌

భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద పరాసిన్‌ ఓపెన్‌ ‘ఎ’ చెస్‌ టోర్నమెంట్‌ 2022 టైటిల్‌ను గెలుచుకున్నాడు. అతడు 9 రౌండ్ల నుంచి ఎనిమిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. 16 ఏళ్ల ప్రజ్ఞానంద టోర్నీలో ఒక్క పరాజయం కూడా చవిచూడలేదు. 7.5 పాయింట్లతో అలెగ్జాండర్‌ ప్రెద్కే టోర్నీలో రెండో స్థానం సాధించాడు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ

భారత యువ షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ దక్షిణ కొరియాలోని చాంగ్‌వాన్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ క్వాలిఫయర్స్‌లో (593/600) అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌ చేరాడు. సీనియర్‌ షూటర్‌ చైన్‌సింగ్‌ (586) కూడా ముందంజ వేశాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో మను బాకర్‌ (288) ఏడో స్థానానికి పరిమితమైంది.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు అగ్రస్థానం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానం సాధించింది. 3 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం సహా మొత్తం 8 పతకాలు నెగ్గింది. టోర్నీ చివరి రోజున 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ స్వర్ణం సాధించింది. అర్జున్‌ బబుతా, సాహు తుషార్‌ మానె, పార్థ్‌ మఖీజాలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 17-15తో కొరియాపై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో అర్జున్, సాహులకు ఇది రెండో స్వర్ణం. మహిళల విభాగం ఫైనల్లో ఇలవెనిల్, మెహులి ఘోష్, రమితల బృందం రజతం సాధించింది. ఫైనల్లో భారత్‌ 10-16తో కొరియా చేతిలో ఓడింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఫైనల్లో శివ, నవీన్, సాగర్‌ త్రయం 15-17తో పోరాడి ఓడి రజతం సాధించింది. మహిళల ఫైనల్లో రిథమ్, యువిక, పాలక్‌లతో కూడిన భారత జట్టు 2-10తో కొరియా చేతిలో ఓడి రజతం గెలిచింది.

ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌

టీమ్‌ ఇండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌ వన్‌ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన జాబితాలో 718 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానం సాధించాడు. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు (6/19) నమోదు చేసిన బుమ్రా, మూడు ర్యాంకులు మెరుగై నంబర్‌ వన్‌గా నిలిచాడు. 2020 ఫిబ్రవరిలో బుమ్రా తన నంబర్‌ వన్‌ స్థానాన్ని కోల్పోయాడు. బుమ్రా సుమారు రెండేళ్ల పాటు నంబర్‌ వన్‌గా కొనసాగిన తర్వాత ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌) ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత బౌలర్లలో అత్యధిక రోజులు (730) అగ్రస్థానంలో కొనసాగిన బౌలర్‌ బుమ్రానే. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి 3, రోహిత్‌శర్మ 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఐసీసీ వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియాకు మూడో స్థానం

ఐసీసీ వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియా మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన టీమ్‌ఇండియా 108 పాయింట్లతో పాకిస్థాన్‌ (106)ను వెనక్కి నెట్టి మూడో ర్యాంకు సాధించింది. తొలి వన్డేకు ముందు టీమ్‌ ఇండియా 105 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండింది. న్యూజిలాండ్‌ (127), ఇంగ్లాండ్‌ (122) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో మెహులి జోడీకి స్వర్ణం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత క్రీడాకారులు మెహులి ఘోష్‌ - సాహు తుషార్‌ మానె 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్లో మెహులి - సాహు జోడీ 17-13తో ఎస్తర్‌ - పెన్‌ (హంగేరీ) జంటపై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబుతా బంగారు పతకం గెలిచాడు. మిక్స్‌డ్‌ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పాలక్‌ - శివ నర్వాల్‌ జోడీ కాంస్యం సాధించింది. మూడో స్థానం జరిగిన పోరులో పాలక్‌-శివ జోడీ 16-0తో ఐరినా లోక్తినోవా - వలెరీ రఖిమ్‌జాన్‌ (కజకిస్తాన్‌) జంటపై నెగ్గింది.

ఐసీసీ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌

ఐసీసీ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 13వ ర్యాంకు సాధించింది. స్మృతి మంధాన ఎనిమిదో స్థానంలో ఉంది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన సిరీస్‌లో హర్మన్‌ 59.50 సగటుతో 119 పరుగులు సాధించింది. మూడు వికెట్లు కూడా పడగొట్టింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా కూడా నిలిచింది. అదే సిరీస్‌లో స్మృతి 52 సగటుతో 104 పరుగులు చేసింది. షెఫాలి వర్మ 33వ స్థానంలో, యాస్తిక భాటియా 45వ స్థానంలో ఉన్నారు.

94 ఏళ్ల వృద్ధ స్ప్రింటర్‌ భగ్వాని దేవి డాగర్‌కు స్వర్ణం

ఫిన్లాండ్‌లో ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ (2022)లో 94 ఏళ్ల వృద్ధ స్ప్రింటర్‌ భగ్వాని దేవి డాగర్‌ పసిడి గెలిచింది. 100 మీ. పరుగును ఆమె 24.74 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. షాట్‌పుట్‌లో కాంస్యం నెగ్గింది. ‣ 81 ఏళ్ల ఎంజే జాకబ్‌ కాంస్యం నెగ్గాడు. ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 200 మీ., 80 హర్డిల్స్‌లో కాంస్యాలు గెలిచాడు. ఈయన ఎమ్మెల్యేగా (2005 - 2011) కూడా పని చేశాడు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలిచాడు.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌

భారత యువ షూటర్‌ అర్జున్‌ బబుతా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో పసిడి గెలిచాడు. పురుషుల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో అతను 17-9తో టోక్యో ఒలింపిక్స్‌ రజత విజేత లుకాస్‌ కొజెనీస్కీ (అమెరికా)కి షాకిచ్చాడు. సీనియర్‌ విభాగంలో అర్జున్‌కిదే తొలి స్వర్ణం. 2016లో జూనియర్‌ ప్రపంచకప్‌లో అతను బంగారు పతకం నెగ్గాడు. ఈ 23 ఏళ్ల పంజాబ్‌ షూటర్‌ తాజా ప్రపంచకప్‌లో ర్యాంకింగ్‌ రౌండ్లో 261.1 స్కోరుతో పసిడి పోరుకు అర్హత సాధించాడు. లుకాస్‌ (260.4) రెండో స్థానంతో ముందంజ వేశాడు. సెర్గీ (259.9- ఇజ్రాయెల్‌) కాంస్యం సొంతం చేసుకున్నాడు. మరో భారత షూటర్‌ పార్థ్‌ మఖీజా (258.1) నాలుగో స్థానంలో నిలిచాడు.

పురుషుల సింగిల్స్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ జకోవిచ్‌ సొంతం

2018 నుంచి వింబుల్డన్‌లో వరుసగా టైటిళ్లు గెలుస్తున్న ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ మరోసారి ఛాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఈ టాప్‌సీడ్‌ సెర్బియా యోధుడు 4-6, 6-3, 6-4, 7-6 (7-3) తేడాతో కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ తుది పోరు చేరిన 40వ ర్యాంకర్‌ కిర్గియోస్‌కు నిరాశ తప్పలేదు. మ్యాచ్‌లో అతనే ఎక్కువ ఏస్‌లు (30), విన్నర్లు (62) కొట్టాడు. కానీ 33 అనవసర తప్పిదాలు చేయడం అతని కొంపముంచింది. జకోవిచ్‌ 15 ఏస్‌లు, 46 విన్నర్లు సాధించాడు.

రిబకినాకు వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో 23 ఏళ్ల కజకిస్థాన్‌ అందం రిబకినా ట్రోఫీని గెలిచింది. ఫైనల్లో 17వ సీడ్‌ రిబకినా 3-6, 6-2, 6-2 తేడాతో మూడో సీడ్‌ జాబెర్‌ (ట్యునీసియా)పై విజయం సాధించింది. తొలి సెట్‌ కోల్పోయి మ్యాచ్‌లో వెనకబడ్డ దశలో ఆమె పుంజుకున్న తీరు అమోఘం. శక్తిమంతమైన సర్వీస్‌లతో చెలరేగిన ఆమె తిరుగులేని విన్నర్లతో పాయింట్లు రాబట్టింది. తొలి సెట్‌ మినహా మ్యాచ్‌లో తనదే ఆధిపత్యం. ఆమె కొట్టిన బ్యాక్‌హ్యాండ్‌ షాట్లు, సర్వీస్‌లకు బదులిచ్చిన ఫోర్‌హ్యాండ్‌ షాట్లు, కోర్టులో ఒక మూల నుంచి మరో మూలకు ప్రత్యర్థికి అందకుండా కొట్టిన క్రాస్‌కోర్టు షాట్లు, ఇలా తన కళాత్మక టెన్నిస్‌ విన్యాసాలు అబ్బురపరిచాయి. మ్యాచ్‌లో 29 విన్నర్లు కొట్టిన రిబకినా 4 ఏస్‌లు సంధించింది.

జ్యోతి సురేఖ జోడీకి కాంస్యం

ఆర్చరీలో భారత స్టార్‌ జోడీ జ్యోతి సురేఖ - అభిషేక్‌ వర్మ చరిత్ర సృష్టించారు. వరల్డ్‌ గేమ్స్‌ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో కాంస్యం సొంతం చేసుకున్నారు. ఈ క్రీడల ఆర్చరీలో భారత్‌ తరఫున పతకం గెలిచిన తొలి జోడీగా రికార్డు సాధించారు. కాంస్యం కోసం జరిగిన పోరులో జ్యోతి, అభిషేక్‌ ద్యయం 157-156తో మెక్సికో బృందంపై విజయం సాధించింది.

32వ సారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు జకోవిచ్‌

ఆరుసార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) వింబుల్డన్‌ ఫైనల్లో ప్రవేశించాడు. సెమీఫైనల్లో అతడు 2-6, 6-3, 6-4, 6-4తో కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)ను ఓడించాడు. తొలి సెట్‌ కోల్పోయి షాక్‌ తిన్న టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మ్యాచ్‌లో అతడు 13 ఏస్‌లు, 38 విన్నర్లు కొట్టాడు. అయిదు సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేశాడు. 7 ఏస్‌లు, 33 విన్నర్లు కొట్టిన నోరీ.. 36 అనవసర తప్పిదాలు చేశాడు. జకోవిచ్‌ ఈ విజయంతో ఓపెన్‌ శకంలో అత్యధిక సార్లు (32) గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ చేరిన ఆటగాడిగా ఘనత సాధించాడు. అతడు ఫెదరర్‌ను (31)ను అధిగమించాడు. వింబుల్డన్‌లో జకోవిచ్‌ ఫైనల్‌ చేరడం ఇది ఎనిమిదోసారి.

వింబుల్డన్‌కు సానియా వీడ్కోలు

సానియా మీర్జా తన చివరి వింబుల్డన్‌ ఆడేసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌ ముగిసిన అనంతరం రిటైర్‌కానున్నట్లు సానియా ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ల సానియా కెరీర్‌లో అరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుచుకుంది. ఇందులో మూడు మిక్స్‌డ్‌ టైటిళ్లు ఉన్నాయి. వింబుల్డన్‌ సాధిస్తే మిక్స్‌డ్‌లో కెరీర్‌ స్లామ్‌ పూర్తయ్యేది. సానియా, భూపతితో కలిసి 2009లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్, 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్, బ్రునో సోర్స్‌ (బ్రెజిల్‌) జోడీగా 2014లో యుఎస్‌ ఓపెన్‌ గెలుచుకుంది. మహిళల డబుల్స్‌లో సానియా మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సొంతం చేసుకుంది.

ఎల్డోరా బాక్సింగ్‌ కప్‌లో అల్ఫియా, గీతికలకు స్వర్ణాలు

ఎల్డోరా బాక్సింగ్‌ కప్‌లో భారత బాక్సర్లు అల్ఫియా పఠాన్, గీతిక స్వర్ణాలతో మెరిశారు. 81 కేజీల ఫైనల్లో అల్ఫియా 5-0తో కంగిబయెవాను చిత్తు చేయగా 48 కేజీల తుది సమరంలో గీతిక 4-1తో సహచర బాక్సర్‌ కలైవాణిని ఓడించింది. ఫైనల్లో ఆమె 0-5తో ఉక్సమోవా (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో ఓడి రజతం నెగ్గింది. ఈ టోర్నీని భారత్‌ 14 పతకాలతో (2 స్వర్ణ, 2 రజత, 10 కాంస్యాలు) ముగించింది. కుల్‌దీప్‌ కుమార్‌ (48 కేజీలు), అనంత చోప్డే (54 కేజీలు), సచిన్‌ (57 కేజీలు), జుగ్నూ (92 కేజీలు), జ్యోతి (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) సోనియా లాథర్‌ (57 కేజీలు), నీమా (63 కేజీలు), లలిత (70 కేజీలు), బబిత (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.

10 సెకన్లలోపు 100 మీ. పరుగుతో మొదటి దక్షిణాసియా స్ప్రింటర్‌గా అబెకూన్‌ రికార్డు

శ్రీలంక స్ప్రింటర్‌ యుపున్‌ అబెకూన్‌ చరిత్ర సృష్టించాడు. 100 మీటర్ల పరుగును 10 సెకన్ల లోపు పూర్తి చేసిన మొదటి దక్షిణాసియా స్ప్రింటర్‌గా రికార్డు నెలకొల్పాడు. రెసిస్ప్రింట్‌ అంతర్జాతీయ టోర్నీలో 100 మీ పరుగును అబెకూన్‌ 9.96 సెకన్లలో పూర్తిచేశాడు. జర్మనీలో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో తను నమోదు చేసిన రికార్డు (10.06 సె)ను అబెకూన్‌ తిరగరాశాడు. అబెకూన్‌ రికార్డుతో 10 సెకన్ల లోపు స్ప్రింటర్‌ను కలిగిన 32వ దేశంగా శ్రీలంక ఘనత సాధించింది.

వింబుల్డన్‌ సెంట‌ర్‌ కోర్టుకు వందేళ్లు

వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన సెంట‌ర్‌ కోర్టు 1922లో ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. ఆనవాయితీ ప్రకారం వింబుల్డన్‌ మధ్యలో వచ్చే ఆదివారం మ్యాచ్‌లు జరగవు. కానీ ఆ కోర్టు శత వసంత ఉత్సవాల సందర్భంగా తొలిసారి ఆ రోజు కూడా ఈ టోర్నీలో మ్యాచ్‌లు నిర్వహించారు. చెయిర్‌ అంపైర్‌ స్టాండ్‌ పక్కన ‘సెంట‌ర్‌ కోర్టు’, ‘100’ అనే పదాలు దర్శనమిచ్చాయి. విశిష్టమైన టోర్నీ టవల్‌ను అందుబాటులో ఉంచారు. ఆరంభంలో 9,989గా ఉన్న సీట్ల సంఖ్య 14,974కు పెరిగాయి. 2009లో ముడుచుకునే పైకప్పు ఏర్పాటు చేశారు.

బ్రిటీష్‌ గ్రాండ్‌ ప్రిలో కార్లోస్‌కు పోల్‌ పొజిషన్‌

బ్రిటీష్‌ గ్రాండ్‌ ప్రిలో ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సైంజ్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో ఉత్తమంగా 1 నిమిషం 40.983 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన కార్లోస్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో మాజీ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ను అతడు 0.072 సెకన్ల స్వల్ప వ్యవధిలో వెనక్కి నెట్టాడు.

6.16 మీటర్ల ఎత్తు దూకి ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ ప్రపంచ రికార్డు

స్వీడన్‌ పోల్‌ వాల్ట్‌ అథ్లెట్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ ఇదివరకు తన పేరిటే ఉన్న ఔట్‌డోర్‌ ప్రపంచ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ మీట్‌లో అతను 6.16 మీటర్ల (20 అడుగుల 2.5 అంగుళాలు) ఎత్తు దూకి ఛాంపియన్‌గా నిలిచాడు. అతను 2020లో రోమ్‌లో తానే నెలకొల్పిన రికార్డు (6.15 మీ.)ను ఇప్పుడు బద్దలు కొట్టాడు. ఇండోర్‌ ప్రపంచ రికార్డు (ఈ ఏడాది సెర్బియాలో 6.20 మీ.) కూడా అతని ఖాతాలోనే ఉంది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ అయిన అతను స్వదేశంలో సొంత అభిమానుల మధ్య ప్రపంచ రికార్డు తిరగరాశాడు.