సైన్స్ అండ్ టెక్నాలజీ

తొలి దేశీయ విమానవాహక నౌక ‘విక్రాంత్‌’

దేశీయంగా తయారుచేసిన తొలి విమానవాహక నౌక ‘విక్రాంత్‌’ను దాని తయారీ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ భారత నౌకాదళానికి అప్పగించింది. విక్రాంత్‌’ రాకతో దేశీయంగా విమానవాహక నౌకలను డిజైన్‌ చేసుకొని, వాటిని నిర్మించుకోగల సత్తా ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో ‘భారత్‌ చేరినట్లయింది. విక్రాంత్‌పై మిగ్‌-29కె యుద్ధ విమానాలు, కమోవ్‌-31 హెలికాప్టర్లు, ఎంహెచ్‌-60ఆర్‌ మల్టీరోల్‌ హెలికాప్టర్లు, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌), తేలికపాటి యుద్ధవిమానాలను (ఎల్‌సీఏ) మోహరించనున్నారు. దీని పొడవు - 262 మీటర్లు, వెడల్పు - 62 మీటర్లు, ఎత్తు - 59 మీటర్లు, గరిష్ఠ వేగం 28 నాట్‌లు, కంపార్ట్‌మెంట్లు 2,300. దీని నిర్మాణ పనులను 2009లో ప్రారంభించారు. నిర్మాణ వ్యయం దాదాపు రూ.20 వేల కోట్లు. 88 మెగావాట్ల సామర్థ్యమున్న నాలుగు గ్యాస్‌ టర్బైన్లతో ఇది నడుస్తుంది.

కొవిడ్‌ అన్ని రకాల వైరస్‌లకు ఒకే టీకా

కొవిడ్‌ వైరస్‌ రకం (వేరియంట్‌) ఏదైనా, దానిపై సమర్థంగా పనిచేసే టీకాను అభివృద్ధి చేసే దిశగా తొలి అడుగులు పడుతున్నాయి. ఇటువంటి టీకా కోసం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్, స్విస్‌ సంస్థ అయిన ఎక్సెల్‌జీన్‌ ఎస్‌ఏ, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, సెపి (కోయిలేషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌) జట్టు కట్టాయి. ఈ ప్రాజెక్టుకు సెపీ తనవంతుగా 19.3 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.154 కోట్లు) సమకూర్చుతోంది. కొవిడ్‌ వైరస్‌ అన్ని వేరియంట్లపై పనిచేసే టీకా అందించడానికి అవసరమైన ‘కైమెరిక్‌ స్పైక్‌ యాంటీజెన్స్‌’ ను ఆవిష్కరించినట్లు ఎక్సెల్‌జీన్‌ ఎస్‌ఏ తాజాగా వెల్లడించింది. సీహెచ్‌ఓ ఎక్స్‌ప్రెస్‌ సెల్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో స్పైక్‌ యాంటీజెన్స్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. అత్యంత సంక్లిష్ట ప్రొటీన్లను ఆవిష్కరించడంలో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది. కైమరిక్‌ స్పైక్‌ యాంటీజెన్స్‌ను ఎక్సెల్‌కేర్, భారత్‌ బయోటెక్, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ - ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరిశీలించి, కరోనా టీకా రూపొందించడానికి అనువైన ప్రొటీన్లను గుర్తిస్తారని తెలిపారు.

మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న ప్రొటీన్‌ను గుర్తించిన హెచ్‌సీయూ పరిశోధకులు

మలేరియా వ్యాధిని నియంత్రించే దిశలో మరో ముందడుగు పడింది. దీన్ని వ్యాప్తి చేసే పరాన్నజీవిలో ఉండే ప్రొటీన్‌ నిర్మాణంలో మార్పులు చేస్తే ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిశోధకులు గుర్తించారు. మలేరియా వ్యాధికి ఆడ అనాఫిలిస్‌ దోమ కారణం. ఇది మనిషిని కుట్టినప్పుడు ప్లాస్మోడియం ఫాల్సిపరం (ప్రోటోజోవ) అనే పరాన్నజీవి స్పొరోజొయిట్‌ రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుంది.

‣ ఇది కాలేయానికి చేరుకుని సంఖ్యను పెంచుకుంటూ వివిధ రూపాల్లోకి మారి ఎర్ర రక్త కణాలపై దాడిచేసి మలేరియా వ్యాధికి కారణమవుతుంది. దీని నివారణకు ప్లాస్మోడియం జీవిత చక్రంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. మలేరియా నివారణకు ఇప్పటికే వ్యాక్సిన్‌ ఉన్నప్పటికీ.. దాని సామర్థ్యం తక్కువ. ఈ క్రమంలో హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ జంతుశాస్త్రం ఆచార్యుడు కోట అరుణ్‌ కుమార్‌ నేతృత్వంలో స్మితపత్రి, సందీప్, వేద నరహరి, దీప్తిసింగ్‌ బృందం స్పొరోజొయిట్‌పై చేసిన పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వీరి పరిశోధనలు మాలిక్యులర్‌ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

‣ స్పొరోజొయిట్‌ నిర్మాణం సక్రమంగా ఉంటేనే పరాన్నజీవి మనిషి శరీరంలోకి చేరగలుగుతుంది. దీని నిర్మాణ క్రమాన్ని సక్రమంగా ఉంచేందుకు ఎస్‌ఐఎం అనే ప్రొటీన్‌ (ఎస్‌ఐఎంపీ) సహకరిస్తున్నట్లు ఈ పరిశోధకులు గుర్తించారు. ఇందులోని జన్యువును వేరు చేస్తే ప్రొటీన్‌లో సామర్థ్యం తగ్గిపోయి నిర్మాణ క్రమంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతిమంగా మనిషి శరీరంలో ప్రవేశించే సామర్థ్యం తగ్గిపోతుందని తేల్చారు. ఈ ప్రొటీన్‌ ఆధారంగా వ్యాక్సిన్‌ లేదా ఇతర ఔషధాల తయారీ సాధ్యమని చెబుతున్నారు. దీనిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ప్రపంచ మలేరియా నివేదిక ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా 24.1 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 6.27 లక్షల మంది చనిపోయారు.


మెదడు క్యాన్సర్‌ను ముందే పసిగట్టే రక్తపరీక్ష

మెదడు క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టి, కణితులను వర్గీకరించి, చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు దోహదపడే సరికొత్త రక్తపరీక్షను మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు రూపొందించారు. మెదడు కణితుల్లో జన్యు మార్పులను తెలుసుకునేందుకు ఈ ఆసుపత్రి నిపుణులు గతంలోనే ఒక ప్రత్యేక రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. అయితే మెదడు క్యాన్సర్‌కు సంబంధించిన ఎపీడెర్మల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ రిసెప్టర్‌ (ఈజీఎఫ్‌ఆర్‌) అనే జన్యువు నుంచి విడుదలయ్యే ఎంఆర్‌ఎన్‌ఏలను గుర్తించేలా ఈ పరీక్షను తాజాగా మరింత అభివృద్ధి చేశారు. తద్వారా 37 రకాల కణితి కణజాలాలను వారు గుర్తించారు. ఈ పరీక్ష ఈజీఎఫ్‌ఆర్‌ ఉనికిని 72.8% కచ్చితత్వంతో గుర్తిస్తుందని, ఈ జన్యువు లేదని 97.7% సామర్థ్యంతో నిర్ధారిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. క్లినికల్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ పత్రిక ఈ వివరాలను అందించింది.

తొలి ‘ల్యాండ్‌శాట్‌’ శాటిలైట్‌కు 50 ఏళ్లు

సరిగ్గా 50 ఏళ్ల కిందట అమెరికా శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఒక ఉపగ్రహం ప్రపంచంపై మన దృక్కోణాన్ని పూర్తిగా మార్చేసింది. అది భూ ఉపరితలంపైనున్న సూక్ష్మ వివరాలనూ సవివరంగా అందించింది. కార్చిచ్చు.. అడవులను నిలువునా దహించేసిన తీరును ఆవిష్కరించింది. వ్యవసాయం, పట్టణీకరణ కోసం అడవులను మాయం చేసిన వైనాన్ని కళ్లకు కట్టింది. మొత్తం మీద పుడమి ముఖచిత్రాన్ని మానవులు ఎన్నిరకాలుగా మార్చేస్తున్నారన్నది వెలుగులోకి తెచ్చింది.

‣ ఆ ఉపగ్రహం పేరు ల్యాండ్‌శాట్‌. దాన్ని 1972 జులై 23న అమెరికా ప్రయోగించింది. అది అద్భుత ఫలితాలను ఇవ్వడంతో ఆ శ్రేణిలో మరో 8 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. అవి భూ కక్ష్యలో తిరుగుతూ పుడమిపై నిర్దిష్ట ప్రాంతాలను తరచూ చిత్రీకరించేవి. తద్వారా ఆయా చోట్ల జరిగిన స్వల్ప మార్పులనూ గుర్తించేందుకు వీలైంది. తదుపరి ఉపగ్రహాల్లో శక్తిమంతమైన పరికరాల వల్ల మరింత స్పష్టమైన చిత్రాలు లభ్యమయ్యాయి. నేడు ల్యాండ్‌శాట్‌-8, 9 ఉపగ్రహాలు పుడమిని చుట్టేస్తున్నాయి. ఇవన్నీ కలిసి భూమండలానికి సంబంధించిన సుదీర్ఘ రికార్డులను అందించాయి.

‣ ల్యాండ్‌శాట్‌ ఉపగ్రహాలు అందించిన చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత, మారుతున్న భూ ఉపరితల తీరుతెన్నులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా నిర్మించిన డ్యామ్‌ల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వీలైంది. సాధారణంగా ప్రభుత్వాలు పట్టించుకోని అనేక ముప్పుల గురించి ఇవి సమాజానికి అవగాహన కల్పించాయి.

‣ ల్యాండ్‌శాట్‌ ఉపగ్రహాలు కోటికిపైగా చిత్రాలను అందించాయి. ఇవి మునుపటి, ప్రస్తుత పరిస్థితులను పోల్చి చూడటానికి వీలు కల్పించాయి. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లో గోధుమ పంటపై పడిన ప్రభావాన్ని సచిత్రంగా చూపాయి.

‣ తొలితరం ల్యాండ్‌శాట్‌ ఉపగ్రహాల్లో అయస్కాంత టేపులు ఉండేవి. మన టేప్‌రికార్డర్లలోని క్యాసెట్లలోని పరిజ్ఞానాన్ని ఇవి పోలి ఉంటాయి. వాటిలోని టేపు పొడవు 1800 అడుగులు. వీటిలోని డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు ఫొటోగ్రఫీ చిత్రాలను సిద్ధం చేసేవారు. కంప్యూటర్‌ అల్గోరిథమ్‌లు వచ్చాక ఆ చిత్రాల్లోని వివిధ అంశాలను మరింత స్పష్టంగా తెలుసుకునే వెసులుబాటు కలిగింది.

‣ మొదటి రెండు ల్యాండ్‌శాట్‌లు నాలుగురకాల తరంగదైర్ఘ్యాల్లో పరిశీలనలు సాగించేవి. అందులోని నియర్‌ - ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రమ్‌.. పుడమిపై ఇతర అంశాలకు, పచ్చదనానికి మధ్య వైరుధ్యాన్ని గుర్తించగలదు. మొక్క ఆరోగ్యాన్ని కూడా అంచనా వేయగలదు. విజిబుల్‌ తరంగదైర్ఘ్యం మంచు, ఎడారి, మేఘాలు వంటి ప్రకాశవంతమైన ప్రాంతాలను నీరు వంటి అంశాలతో కూడిన చీకటి ప్రదేశాలకు మధ్య వైరుధ్యాన్ని గుర్తించగలదు.


నేత్ర వ్యాధి గుట్టును విప్పే నానో పొర వ్యవస్థ అభివృద్ధి

మన కన్నీళ్లు మన బాధలను చెబుతాయి. ఒక్కోసారి ఆనంద బాష్పాల రూపంలో మన సంతోషాన్నీ తెలియజేస్తుంటాయి. చైనా పరిశోధకులు మరో అడుగు ముందుకేసి ఈ అశ్రువులతో నేత్ర వ్యాధుల గుట్టును విప్పే విధానాన్ని కనుగొన్నారు. కన్నీటి నుంచి ఎక్సోజోమ్స్‌ను సేకరించే నానో పొర వ్యవస్థను వీరు అభివృద్ధి చేశారు. దీనికి ‘ఐ టియర్స్‌’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం వైద్యులు లక్షణాల ఆధారంగా నేత్ర వ్యాధులను గుర్తిస్తున్నారు. రుగ్మత ప్రారంభ దశలో ఈ నిర్ధారణకు ఇబ్బందులుంటాయి. ప్రొటీన్లు, జన్యువుల నమూనాలను పరీక్షించడం ద్వారా వ్యాధి గుర్తింపులో కచ్చితత్వాన్ని పెంచొచ్చు. ఇలాంటి వాటికి ఎక్కువ సమయం పడుతుంది. కన్నీటితో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఐ టియర్స్‌ సాధనం, అశ్రువుల నమూనాలను వడకట్టడం ద్వారా ఐదు నిమిషాల్లోనే ఎక్సోజోమ్‌లను అందించింది. వీటిలోని ప్రొటీన్లకు ఫ్లోరసెంట్‌ మార్కర్లతో శాస్త్రవేత్తలు ట్యాగ్‌ చేశారు. ఆ తర్వాత వీటిపై వేరే పరికరాలతో విశ్లేషణ సాగించారు. అందులో నుంచి న్యూక్లిక్‌ ఆమ్లాలను సేకరించి, పరిశీలించారు. ఈ విధానం ద్వారా ఆరోగ్యవంతులు, రోగుల మధ్య వైరుధ్యాలను గుర్తించగలిగారు. వివిధ రకాల నేత్ర రుగ్మతలను పసిగట్టగలిగారు.

డ్రైవర్‌ లేని విద్యుత్‌ కారు

డ్రైవర్‌ అక్కర్లేని విద్యుత్‌ వాహనం ‘అపోలో ఆర్‌టీ6’ను చైనాకు చెందిన కృత్రిమ మేధ, సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ బైదూ ఆవిష్కరించింది. బైదూకు చెందిన రోబో టాక్సీలో ఇదీ భాగం కానుంది. పూర్తి స్థాయి విద్యుత్‌ వాహనమైన ఈ కారులో స్టీరింగ్‌ ఉంటుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. దీని ధర 250,000 యువాన్లు (37,000 డాలర్లు లేదా సుమారు రూ.29 లక్షలు). స్టీరింగ్‌ లేకపోవడం వల్ల కలిసొచ్చే స్థలంలో అదనపు సీటు లేదా గేమింగ్‌ కన్సోల్, వెండింగ్‌ మెషీన్‌ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

‣ సాంకేతికత విషయంలో ఆర్‌టీ6కు అయిదింట నాలుగో స్థాయి (లెవల్‌ 4) దక్కింది. అంటే డ్రైవర్‌ లేకుండా దీనిని నిర్వహించవచ్చు. అయితే ప్రీలోడెడ్‌ మ్యాప్‌తో మాత్రమే ఇది పనిచేస్తుంది. అంటే పరిమిత ప్రాంతాల్లోనే నిర్వహించవచ్చు. ప్రస్తుతానికి నగర రహదారులపై అనుమతిస్తారు. లెవల్‌ 3లో అయితే జాతీయ రహదారులపై హ్యాండ్స్‌ ఫ్రీ డ్రైవింగ్‌కు అనుమతి ఉంటుంది. బీజింగ్, షాంఘై, షెంజెన్, గ్వాంఝు వంటి నగరాల్లో ఈ సేవలను ఆవిష్కరించారు.

బెంగళూరులో హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ ఎక్స్‌పో ప్రారంభం స్వాతంత్య్రం సాధించిన రోజుల్లో అంతరిక్షంలోకి మనిషిని పంపుతామని భారతదేశం ప్రకటించిన నాడు ప్రపంచమంతా నవ్వుకుందని, ఈ 75 ఏళ్లలో అంతరిక్ష రంగంలో ప్రపంచం ఊహించని స్థాయిలో దేశం నిలిచిందని ఇస్రో అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ వివరించారు. బెంగళూరులో ఇస్రో హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ సెంటర్‌ (హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ) నేతృత్వంలో బెంగళూరులో నిర్వహించిన హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌ ఎక్స్‌పోను ప్రారంభించి మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని ప్రపంచం విశ్లేషిస్తుంది. అంతరిక్ష రంగంలో పూర్తిస్థాయి సాంకేతికతతో మంగళయాన్, చంద్రయాన్‌ వంటి ప్రాజెక్టులు, తాజాగా గగన్‌యాన్‌తో వ్యోమగాములను పంపే స్థాయికి చేరుకుంది. అత్యంత తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను విజయవంతం చేసే సాంకేతికత భారత్‌కే సొంతమని వివరించారు.

మృత్తికా క్రమక్షయం ముప్పును గుర్తించే పటం

దేశంలో వర్షాల కారణంగా మృత్తికా క్రమక్షయం చోటు చేసుకునే ముప్పు ఏ ప్రాంతంలో ఎంతగా ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు ఐఐటీ దిల్లీ పరిశోధకులు సరికొత్త పటాన్ని అభివృద్ధి చేశారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండల్లో ఉండే లైట్కిన్సే, చిరపుంజి ప్రాంతాల్లో ఈ ప్రభావం అత్యంత ఎక్కువగా ఉన్నట్లు దాని ద్వారా గుర్తించారు. లద్దాఖ్‌లోని షాహీ కాంగ్రీ పర్వత ప్రాంతంలో ముప్పు అత్యల్పంగా ఉందని తేల్చారు. మృత్తికా క్రమక్షయం అధికంగా చోటు చేసుకునే అవకాశాలున్న చోట్ల ముందస్తు ప్రణాళికలతో నివారణ చర్యలు చేపట్టేందుకు తమ ఆవిష్కరణ దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు దోహదపడే వోల్టేజ్‌ నియంత్రణ సాంకేతికత

రవాణా రంగంలో ఉత్పత్తి అవుతున్న ఉద్గారాలను కట్టడి చేసే ఉత్తమ మార్గం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచడం. కానీ, వీటిలోని బ్యాటరీలను సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో ఛార్జింగ్‌ చేసుకోవడం మాత్రం ఇప్పుడు అంతగా సాధ్యం కావట్లేదు. సౌరశక్తిని వినియోగిస్తే వీటి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థల్లో వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడి, బ్యాటరీలు దెబ్బతింటున్నాయి. దీనిపై దృష్టి సారించిన పరిశోధకులు వోల్టేజ్‌ నియంత్రణకు ‘ఆప్టిమైజ్డ్‌ కంట్రోల్‌ స్కీమ్‌’ను అభివృద్ధి చేశారు. ఫొటోవోల్టాయిక్‌ (పీవీ) పవర్‌ జనరేషన్, ఎలక్ట్రిక్‌ వెహికల్, (ఈవీ) ఛార్జింగ్‌ స్టేషన్ల సమన్వయంతో పనిచేసే క్రియాశీల విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇది విజయవంతమైతే, ఎలక్ట్రానిక్‌ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఫొటోవోల్టాయిక్‌ వ్యవస్థల ద్వారా ఉత్పన్నమయ్యే వోల్టీజ్‌ను నియంత్రించడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పీవీ, ఈవీ ఇన్వర్టుర్లు, ఇతర వోల్టేజ్‌ రెగ్యులేటింగ్‌ పరికరాలను సమన్వయపరిచి మూడు దశల్లో పనిచేసేలా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సంజీబ్‌ గంగూలీ వివరించారు.

ఆందోళన, కుంగుబాటుకు బి6 విటమిన్‌తో చికిత్స

బి6 విటమిన్‌ సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం ద్వారా ఆందోళన, కుంగుబాటు వంటి ఇబ్బందులను తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌లోని రీడింగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. భావోద్వేగ సంబంధ రుగ్మతల నివారణ లేదా చికిత్సకు ఉపయోగపడేలా మెదడును కట్టడి చేసేందుకు విటమిన్‌ సప్లిమెంట్లను ఉపయోగించొచ్చనడానికి ఇది గట్టి నిదర్శనమని వారు తెలిపారు. మెదడులో సమాచారాన్ని మోసుకెళ్లే ‘ఎక్సైటేటరీ న్యూరాన్లు’, చర్యలు అదుపు తప్పకుండా చూసే ‘ఇన్‌హిబిటరీ న్యూరాన్లు’ ఉంటాయి. వీటి మధ్య నెలకొనే సున్నితమైన సమతౌల్యం మీదే మెదడు పనితీరు ఆధారపడి ఉంటుంది. ఈ సమతూకంలో తేడాల వల్లే కొన్ని రకాల నాడీ రుగ్మతలు, భావోద్వేగ సమస్యలు వస్తున్నట్లు ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. మెదడులో తలెత్తే ఆకస్మిక ప్రేరణలను అడ్డుకునే జీఏబీఏ పదార్థాన్ని విడుదల చేయడంలో బి6 విటమిన్‌ సాయపడుతుందని తాజాగా పరిశోధకులు తేల్చారు. దీనివల్ల ఆందోళన తగ్గుతున్నట్లు వెల్లడైందన్నారు. దాదాపు 300 మందిపై పరిశోధన నిర్వహించి, ఈ అంశాన్ని ప్రాథమికంగా ధ్రువీకరించారు.

సరికొత్త పరికరంతో కంటి త్రీడీ చిత్రాలు

అత్యంత స్పష్టంగా, సులభంగా కంటి త్రీడీ చిత్రాలను తీసే సరికొత్త పరికరాన్ని స్ట్రాత్‌క్లెడ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా నేత్రవ్యాధి నిర్ధారణ, చికిత్సల్లో ఇది కీలకం కానుందని భావిస్తున్నారు. ఈ పరికరం రెటీనా, కంటి వెనుక భాగం, కార్నియాల దృశ్యాలను గ్రహించి కంటిని పరీక్షించేందుకు ఉపయోగించే స్లిట్‌ ల్యాంప్‌ యంత్రానికి వాటిని పంపుతుందని పరిశోధకులు వివరించారు. కంటి త్రీడీ చిత్రాలను తీసే ఆప్టికల్‌ కోహెరెన్స్‌ టోమోగ్రఫీ వంటి యంత్రాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. నిపుణుల అవసరం లేకుండానే వీటిని ఉపయోగించి చాలా సౌకర్యవంతంగా, ఒక్క క్షణంలోనే త్రీడీ చిత్రాలు తీసుకోవచ్చు. డా.మారియో గియార్డిని, డా.ఇయాన్‌ కోగిల్, కిర్సీ జోర్డాన్‌ల బృందం వీటిని రూపొందించిందని స్ట్రాత్‌క్లెడ్‌ వర్సిటీ తెలిపింది.

ఇక వేగంగా ఔషధ అణువుల గుర్తింపు

విశ్వంలో అణువుల సంఖ్య అనంతం. ప్రాణాలను నిలబెట్టే ఔషధాల తయారీకి మాత్రం వాటిలో కొన్నే ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో అవసరమైన అణువుల గుర్తింపు ప్రక్రియల్లో తరచూ తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దానికి పరిష్కార మార్గంగా అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు తాజాగా సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) నమూనాను అభివృద్ధి చేశారు. ‘ఈక్విబైండ్‌’గా దానికి నామకరణం చేశారు. ఇది ఔషధ తరహా అణువుల గుర్తింపు కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన ‘క్విక్‌ వినా2-డబ్ల్యూ’ అనే గణాంక నమూనా కంటే 1,200 రెట్లు వేగంగా పనిచేస్తుందని ఎంఐటీ పరిశోధకులు తెలిపారు. లక్షిత ప్రొటీన్లకు ఆయా అణువులు పూర్తిస్థాయిలో అతుక్కుంటాయా లేదా, వాటివల్ల ఏమైనా దుష్పరిణామాలు ఎదురవుతాయా అనే అంశాలను ఈక్విబైండ్‌ సులువుగా నిర్ధరిస్తుందని వెల్లడించారు.

గాయాలను మాన్పే ఈ-బ్యాండేజ్‌ల అభివృద్ధి

గాయాల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా యాంటీ బయోటిక్స్‌ కంటే మెరుగ్గా పనిచేసే సరికొత్త ఈ-బ్యాండేజ్‌లను వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, మాయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిని ఎలక్ట్రో-కెమికల్‌ బ్యాండేజ్‌లుగా పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను విడుదల చేయడం వీటి ప్రత్యేకత. గాయాల నుంచి వచ్చే ఎంఆర్‌ఎస్‌ఏ బ్యాక్టీరియాను ఇవి రెండు రోజుల్లోనే 99% మేర అడ్డుకోగలవని పరిశోధకులు తేల్చారు. ఏ కారణంతోనైనా గాయాలపాలైనప్పుడు వాటిని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణంతో శుభ్రం చేసి, యాంటీసెప్టిక్‌ క్రీములు రాసి, యాంటీ బయోటిక్స్‌ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మధుమేహ రోగులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ మందులు పనిచేయవు. దీంతో పుండ్లు పెద్దవవుతాయి. వాటిలో రకరకాల బ్యాక్టీరియా సమూహాలు ఏర్పడి, చుట్టూ ఉండే ఆరోగ్యకర కణజాలాన్ని తినేస్తూ ఉంటాయి. వీటిని బయోఫిల్మ్‌లుగా పిలుస్తారు. ఇలాంటి వారికి దీర్ఘకాలం పాటు యాంటీ బయోటిక్స్‌తో చికిత్స అందించడం కష్టమే. ఈ ఇబ్బందులను అధిగమించేలా సీనియర్‌ పరిశోధకుడు యాష్‌ రావల్‌ బృందం ఈ-బ్యాండేజ్‌లను రూపొందించింది.

మొదటి చిత్రాలను అందించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు: నాసా

విశ్వం గుట్టుమట్లను విప్పడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) తొలిసారి తన ‘నేత్రాల’ను తెరిచింది. విశ్వాసానికి అద్భుత చిత్రాలను అందించింది. కనీవినీ ఎరుగని సుదూర ప్రాంతాల్లోని నక్షత్ర మండలాల (గెలాక్సీ)ను అత్యంత స్పష్టంగా ఆవిష్కరించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ టెలిస్కోపు అనేక కీలక విషయాలను వెలుగులోకి తీసుకురానుందన్న భరోసా ఏర్పడింది.

1380 కోట్ల సంవత్సరాల కిందట ఒక మహా విస్ఫోటం (బిగ్‌ బ్యాంగ్‌) ద్వారా విశ్వం ఏర్పడింది. ఆ వెంటనే జరిగిన పరిణామాలపై ఖగోళ శాస్త్రవేత్తల్లో అమితాసక్తి నెలకొంది. సరిగ్గా ఈ అవసరం కోసం జేడబ్ల్యూఎస్‌టీని నాసా రూపొందించింది. ఇది క్లిక్‌మనిపించిన తొలి చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విడుదల చేశారు.

భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలోని ‘సదరన్‌ రింగ్‌ నెబ్యులా’ చిత్రాన్ని అందించింది. ఇందులో అంతమవుతున్న ఒక నక్షత్రం చుట్టూ మేఘంలా విస్తరిస్తున్న వాయువులను చూడొచ్చు.

మనకు 7,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కారినా నెబ్యులా ఫొటోనూ పంపింది. ఇది విశ్వంలో అత్యంత దేదీప్యమానంగా ఉన్న తారా జనన ప్రదేశం. అనంతరం నాసా జేడబ్ల్యూఎస్‌టీ తీసిన మరో నాలుగు చిత్రాలను విడుదల చేసింది. వాటి వివరాలివీ..

2.9 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఐదు గెలాక్సీల ఫొటో కనువిందు చేస్తోంది. ఈ నక్షత్ర మండలాలు పరస్పరం చాలా దగ్గరగా ఉన్నాయి. అల్లిబిల్లిలా సాగే వీటి కదలికలు, నృత్య ప్రదర్శనను తలపిస్తున్నాయి. వీటిని ‘స్టీఫెన్స్‌ క్వింటెట్‌’గా పేర్కొంటున్నారు. 225 ఏళ్ల కిందట మానవులకు ఇవి తొలిసారి కనిపించాయి.

నీలం రంగులో ఉన్న వాస్ప్‌-96బి అనే ఒక భారీ గ్రహాన్ని జేడబ్ల్యూఎస్‌టీ క్లిక్‌మనిపించింది. ఇది శని గ్రహం పరిమాణంలో ఉంటుంది. భూమికి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాని వాతావరణాన్ని కూడా జేడబ్ల్యూఎస్‌టీ క్షుణ్నంగా విశ్లేషించింది. ఇందులో నీటి జాడ ఉన్నట్లు వెల్లడైంది. అయితే అక్కడ జీవం మనుగడకు ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితులు కలిగిన మరిన్ని గ్రహాలను ఈ టెలిస్కోపు పసిగడుతుందన్న భరోసా తాజా చిత్రంతో ఏర్పడింది.

వెయ్యి కోట్ల డాలర్ల వ్యయంతో జేడబ్ల్యూఎస్‌టీ ప్రాజెక్టును చేపట్టారు. 2021 డిసెంబరులో ఈ టెలిస్కోపును ప్రయోగించారు. భూమికి 16 లక్షల కిలోమీటర్ల దూరంలోని ప్రదేశానికి ఇది చేరుకుంది. సూర్యకాంతి నుంచి రక్షణకు ఈ టెలిస్కోపులో టెన్నిస్‌ కోర్టు పరిమాణంలో ఒక తెరను ఏర్పాటు చేశారు. పాతబడిపోతున్న హబుల్‌ స్పేస్‌ టెలిస్కోపునకు ప్రత్యామ్నాయంగా జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్టులో ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలకూ భాగస్వామ్యం ఉంది.


వ్యర్థ జలాల్లో కొవిడ్‌ వేరియంట్లను గుర్తించొచ్చు

వ్యర్థ జలాల్లో కరోనా వైరస్‌కు సంబంధించిన ఆందోళనకర వేరియంట్లను గుర్తించే కొత్త సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సంప్రదాయ వైద్య పరీక్షల్లో బయటపడటానికి 14 రోజుల ముందే ఇవి వైరస్‌ జాడను పట్టించేస్తాయి. ఒక ప్రాంతంలో పెరుగుతున్న కేసులను వేగంగా గుర్తించే చౌకైన విధానం వ్యర్థ జలాల విశ్లేషణేనని పరిశోధకులు తెలిపారు. తాజాగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, స్క్రిప్స్‌ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో రెండు స్పూన్ల మేర మురుగు నీటిని విశ్లేషించడం ద్వారా సమీప ప్రాంతాల్లోని ప్రజల్లో ఉన్న కరోనా వేరియంట్లను నిర్దిష్టంగా గుర్తించొచ్చు. ఈ విధానంలో ‘ఫ్రెయ్‌జా’ అనే అల్గోరిథమ్‌ను వాడారు. ఏడాది పాటు పరిశోధకులు ఈ విధానాన్ని అనేక చోట్ల పరీక్షించారు. దాదాపు 20 వేల నమూనాలను విశ్లేషించారు. తద్వారా వ్యర్థ జలాల్లోని వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను ఒక్క చోట కేంద్రీకరించే ప్రక్రియలను మెరుగుపరిచారు. ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్‌ సహా ఆందోళనకర వేరియంట్లను వైద్య పరీక్షల్లో గుర్తించడానికి 14 రోజుల ముందే ఈ విధానం పసిగట్టగలిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఏకకాలంలో దంతధావనం, ఫ్లాసింగ్, పుక్కిలింతకు సూక్ష్మ రోబోల రూపకల్పన ఉదయాన్నే నిద్రలేవగానే పళ్లు తోముకోవడంతో మన దినచర్య ప్రారంభమవుతుంది. పళ్లను శుభ్రం చేయడమే కాకుండా, దంతాల మధ్య ఇరుక్కున్న మలినాల తొలగింపు (ఫ్లాసింగ్‌), పుక్కిలింతను చేపట్టే అద్భుత పరిజ్ఞానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం వారు ఆకృతిని మార్చుకునే సూక్ష్మ రోబోలను రూపొందించారు. శతాబ్దాలుగా టూత్‌బ్రష్‌ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. ఇటీవల వాటికి విద్యుత్‌ మోటార్లను అమర్చినప్పటికీ పనివిధానం మాత్రం చాలావరకూ యథాతథమే. దీన్ని మార్చే అంశంపై పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఇందుకోసం సూక్ష్మరోబోలను ఉపయోగించొచ్చా అన్నదానిపై పరిశోధన చేపట్టారు. పనిచేసేది ఇలా.. అయస్కాంత క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు ఐరన్‌ నానోరేణువులు సొంతంగా ఒకచోట గుమికూడతాయి. ఈ నానోరేణువులు ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తాయి. అవి హానికారక బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఈ బ్రిసిల్స్‌ పళ్లను తోముతాయి. అలాగే పొడవుగా మారి డెంటల్‌ ఫ్లాస్‌ రూపాన్నీ సంతరించుకుంటాయి. తద్వారా దంతాల మధ్య ఇరుక్కున్న మలినాలను తొలగిస్తాయి.

ప్రత్యేక పదార్థంతో సౌకర్యవంతమైన కృత్రిమ కండరాలు

కృత్రిమ కండరాల తయారీకి వీలుగా అమెరికా శాస్త్రవేత్తలు మన్నికైన సరికొత్త పదార్థాన్ని సృష్టించారు. నిజమైన కండరాల కంటే ఇవే శక్తిమంతంగా, పది రెట్లు సౌకర్యవంతంగా ఉంటాయని, మనిషిని అనుకరించే రోబోలు, కదలాడే వస్తువుల్లో దీన్ని ఉపయోగించవచ్చని వారు వెల్లడించారు. ‘యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెలెస్‌’ శాస్త్రవేత్తలు - కృత్రిమ కండరాల తయారీకి పలు అనువైన పదార్థాలను వినియోగించి చూశారు. వీటన్నింటిలోనూ డైఎలక్ట్రిక్‌ ఎలాస్టమర్‌ (డీఈ) మిన్నగా ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఇందులో కొన్ని లోపాలు ఉండటంతో ఆర్సిలిక్‌ యాసిడ్‌ తదితర రసాయనాలను, అతి నీలలోహిత కిరణాలను ఉపయోగించి దీన్ని అత్యంత మృదువుగా, సులభంగా కదలాడేలా, శక్తిమంతంగా, సౌకర్యవంతంగా తయారుచేశారు. ప్రాసెసబుల్, హైపెర్ఫార్మెన్స్‌ డైఎలక్ట్రిక్‌ ఎలాస్టమర్‌ (పీహెచ్‌డీఈ)గా దీన్ని పిలుస్తున్నారు. ఎలక్ట్రోయాక్టివ్‌ పాలిమర్లతో కూడిన ఈ పదార్థంలో సింథటిక్‌ అణువులు ఉంటాయి. విద్యుత్‌ కేంద్రం ప్రేరేపించినప్పుడు ఇవి తమ పరిమాణం, రూపంలో మార్పులు సంతరించుకుంటాయని పరిశోధకులు వివరించారు.

క్యాన్సర్‌ పరీక్షకు కృత్రిమ మేధ పరికరం

క్యాన్సర్‌ను సొంతంగా పరీక్షించుకునేందుకు కృత్రిమ మేధ పరికరాన్ని ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనికి ‘పివోట్‌’ అని పేరు పెట్టారు. ఇది క్యాన్సర్‌ కారక జీన్స్‌ని గుర్తించడానికి తోడ్పడటంతో పాటు సరైన చికిత్సద్వారా రోగులు త్వరగా కోలుకునేందుకు, దుష్ప్రభావాల్ని నివారించేందుకు మార్గం చూపుతుందని పరిశోధకులు ప్రకటించారు. ఐఐటీ మద్రాస్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ రఘునాథన్‌ రంగస్వామి, రాబర్ట్‌ బుచ్‌ సెంటర్‌ ఫర్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్‌ సభ్యులు కార్తిక్‌ రామన్, పరిశోధకులు మాల్వికా సుధాకర్‌ కలిసి దీనిని రూపొందించారు. పివోట్‌ పరికరం ద్వారా క్యాన్సర్‌కు గురిచేసే కణాల ఉత్పరివర్తన, జీన్స్‌ తీరు, వాటిలో ఎన్ని రకాలనేది తెలుసుకోవచ్చని వారు తెలిపారు.

డ్రైవర్‌ లేకుండా వాహనాలను నడిపే సాంకేతికతలపై ఐఐటీహెచ్‌ ప్రయోగాలు

ఐఐటీ హైదరాబాద్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటింది. దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌ లేకుండా వాహనాలను నడిపే సాంకేతికతలపై ప్రయోగాలకు వేదికను (టెస్ట్‌బెడ్‌) అందుబాటులోకి తెచ్చింది. జాతీయ మిషన్‌లో భాగంగా ఇక్కడ సైబర్‌ ఫిజికల్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం టీహాన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భవిష్యత్తు నావిగేషన్‌ వ్యవస్థలతో పాటు మనుషులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే వెళ్లే సైకిళ్లు రూపొందిస్తున్నారు. డ్రైవర్‌ లేకుండా వాహనాలు నడిపే సాంకేతికతకు రూపునిచ్చే క్రతువులో ఆచార్యులు రాజలక్ష్మి నేతృత్వంలో 40 మందికి పైగా యువ పరిశోధకులు భాగస్వాములవుతున్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో గొప్ప మార్పులు వస్తాయని పరిశోధకులు తెలిపారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన టెస్ట్‌బెడ్‌లో 2 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను రూపొందించారు. సాధారణ రహదారుల మీద ఉండే అన్ని రకాల పరిస్థితులను ఇక్కడ ఏర్పాటు చేసి ఆరు నెలలుగా పరిశోధనలు చేస్తున్నారు. డ్రైవర్‌ లేకుండా కారును నడిపించి పరీక్షించారు. మనుషులను మోసుకెళ్లే డ్రోన్‌కు ఒక రూపమిచ్చారు. మనుషులు కూర్చునే క్యాబిన్‌ను దానికి అనుసంధానించాల్సి ఉంది. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ డ్రోన్‌ బరువును రానున్న రోజుల్లో మరింత తగ్గిస్తామని పరిశోధక విద్యార్థులు తెలిపారు. వ్యవసాయంలో వినియోగించే రకరకాల డ్రోన్ల తయారీకి కృషి చేస్తున్నారు.

దేశంలోనే తొలిసారి డ్రైవర్‌ రహిత వాహనాల సాంకేతికత అభివృద్ధికి ఐఐటీ హైదరాబాద్‌లోని టీహాన్‌లో ప్రయోగ వేదికను (టెస్ట్‌బెడ్‌) సిద్ధం చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ దీనిని ప్రారంభించారు. అనంతరం డ్రైవర్‌ లేకుండా నడిచే వాహనంలో 50 మీటర్ల దూరం ప్రయాణించారు. ఈ పరిశోధనలకు కేంద్రం రూ.135 కోట్లు కేటాయించినట్లు ఐఐటీ డైరెక్టర్‌ బీఎస్‌మూర్తి తెలిపారు.


విద్యుత్తు అవసరం లేని ఏసీ!

వేడి నుంచి ఉపశమనం పొందడానికి నేడు ఏసీలు అనివార్యమయ్యాయి. అయితే వీటి వాడకం వల్ల కరెంటు బిల్లు తడిసిమోపెడవుతోంది. పైగా విద్యుత్తు కోతల సమయంలో ఈ శీతల యంత్రాలు పనిచేయవు. గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపారు. చౌకైన ‘రేడియేటివ్‌ కూలర్‌ పూత’ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఇంటిపైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండానే చల్లదనం అందిస్తుంది.

‣ ఇలాంటి విధానాలను ‘పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌’గా పేర్కొంటారు. ఇవి సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి, దాన్ని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఆ రేడియోధార్మికత భూ వాతావరణం గుండా ప్రయాణించి, చల్లగా ఉండే అంతరిక్షంలోకి చేరుతుంది. అయితే పాసివ్‌ రేడియేటివ్‌ కూలర్లు రాత్రివేళ మాత్రమే పనిచేస్తాయి. పగటి సమయంలోనూ ఉపయోగపడాలంటే ఈ కూలర్లు సౌర రేడియోధార్మికత మొత్తాన్నీ పరావర్తనం చెందించాలి. అయితే ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన ఇలాంటి శీతల వ్యవస్థలు పగటి సమయంలో సరిపడా చల్లదనం అందించలేకపోతున్నాయని గువాహటి ఐఐటీ పరిశోధకుడు ఆశీష్‌ కుమార్‌ చౌధరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము సిలికాన్‌ డైఆక్సైడ్, అల్యుమినియం నైట్రైడ్‌లతో పలుచటి పొరలను అభివృద్ధి చేశామన్నారు. ఇవి సౌర, వాతావరణ రేడియోధార్మికతను 97 శాతం పరావర్తనం చెందించాయని తెలిపారు. దీన్ని పూతగా వాడటం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రతలు.. వెలుపలి కన్నా 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతాయని పేర్కొన్నారు.


మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతం

మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి మరెంతో కాలం వేచి చూడాల్సిన పనిలేదు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నాయకనహట్టి దగ్గర ఉన్న డీఆర్‌డీవో ఏరోనాటికల్‌ టెస్టు రేంజ్‌లో నిర్వహించిన రిమోట్‌ కంట్రోల్డ్‌ మానవ రహిత యుద్ధ విమాన ప్రయోగం విజయవంతమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ విమానాన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. పరీక్షల్లో భాగంగా రన్‌వేపై విజయవంతంగా ఎగిరిన విమానం 15 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. నిర్దేశించిన రీతిలో తిరిగి రన్‌వేపై దిగింది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీకి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు దశాబ్దం కిందట శ్రీకారం చుట్టారు. మొదట్లో నిర్వహించిన రెండు ప్రయోగాలు విఫలమైనా అనుకున్న రీతిలో యుద్ధ విమానాన్ని సిద్ధం చేశారు.

డీఆర్‌డీవో రూపొందించిన స్వయంచోదక విమాన పరీక్ష విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన స్వయంచోదక విమానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తొలిసారి కర్ణాటకలోని చిత్రదుర్గలో పరీక్షించింది. పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ, గాల్లోకి ఎగరడం, ప్రయాణం, సురక్షితంగా కిందకు దిగడం వంటి అన్ని పనులను అది విజయవంతంగా పూర్తి చేసుకుందని అధికారులు వెల్లడించారు. విమాన తయారీకి అవసరమైన చిన్న టర్బోఫ్యాన్‌ ఇంజిన్, ఎయిర్‌ఫ్రేమ్, ఏవియోనిక్స్‌ వ్యవస్థలు సహా అన్నింటినీ దేశీయంగానే రూపొందించినట్లు తెలిపారు.

సముద్ర జలాల శుద్ధిపై మూడు పేటెంట్‌లు

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండల కేంద్రానికి చెందిన డా.సూరపరాజు సుబ్బరామ కౌశిక్‌ అనే యువకుడు సముద్రపు జలాలను శుద్ధి చేయడంపై మూడు పేటెంట్‌లను పొందారు. పుదుచ్చేరి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన సుబ్బరామ కౌశిక్‌ తయారు చేసిన సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే పరికరానికి భారత ప్రభుత్వం పేటెంట్‌ హక్కులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని కౌశిక్‌ తెలిపారు. సముద్రపు జలాలను తాగునీటిగా మార్చే ప్రక్రియలో వృక్ష సంబంధ పీచు పదార్థాలను ఉపయోగించినట్లు వివరించారు. దీంతో పాటు మైనం, సముద్రపు ఇసుక ఉపయోగించి నీటిని శుద్ధి చేసే మరో రెండు ప్రక్రియలకు కూడా పేటెంట్‌ లభించిందన్నారు.