వార్తల్లో వ్యక్తులు



‘ఇంగ్లిష్‌ ఛానెల్‌’ను ఈదిన తెలుగు స్విమ్మర్‌

‘ఇంగ్లిష్‌ ఛానెల్‌’ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా విజయవాడకు చెందిన 34 ఏళ్ల పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.తులసీ చైతన్య రికార్డు నెలకొల్పారు. ఇంగ్లండ్‌లోని డోవెర్‌ నుంచి ఫ్రాన్స్‌లోని కలైస్‌ వరకు గల 21 మైళ్ల ఇంగ్లీష్‌ ఛానెల్‌ను 15 గంటల 18 నిమిషాల వ్యవధిలో ఈదారు.

పాక్‌లో తొలి హిందూ మహిళా డీఎస్పీ మనీషా

పాకిస్థాన్‌లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన మనీషా రుపేతా అనే యువతి (26) పాక్‌ పోలీస్‌ శాఖలో డీఎస్పీగా ఎంపికైన తొలి హిందూ మహిళగా నిలిచింది. సింధ్‌ ప్రావిన్సు జాకోబాబాద్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనీషా ఈ ఘనత సాధించింది.

500 మీటర్ల కాగితంపై ఖురాన్‌

జమ్మూ - కశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు 500 మీటర్ల పొడవైన కాగితపు రోల్‌పై ఖురాన్‌ను చేతితో రాశాడు. బందిపొరా జిల్లా తులైల్‌ ప్రాంతానికి చెందిన ముస్తఫా-ఇబన్‌-జమీల్‌ (26) ఈ ఘనతను సాధించాడు. నస్ఖ్‌ (ఇస్లామిక్‌) లిపిలో రాసిన అతను ఇందుకు 3 నెలలకు పైగా సమయం పట్టినట్లు తెలిపాడు. ఖురాన్‌ కాపీ పేపర్‌ అంచులను (బోర్డర్‌ను) 13 లక్షల చుక్కలతో తీర్చిదిద్దాడు. అనంతరం మొత్తం రోల్‌ను లామినేట్‌ చేయించాడు. ఇందుకు గాను రోజుకు 18 గంటలు శ్రమించాడు. దీనికి చెన్నైకి చెందిన ‘లింకన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ గుర్తింపు లభించింది.

యూకేహెచ్‌సీడీఓ ఛైర్‌పర్సన్‌గా డా.ప్రతిమా చౌదరి

బ్రిటన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్‌లలోని హీమోఫీలియా సెంటర్‌ వైద్యులకు సంబంధించిన ‘ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హీమోఫీలియా సెంటర్‌ డాక్టర్స్‌ ఆర్గనైజేషన్‌ (యూకేహెచ్‌సీడీఓ)’ ఛైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్‌ డా.ప్రతిమా చౌదరి మావిళ్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ప్రతిమా చౌదరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసించే మావిళ్లపల్లి వెంకటరమణయ్య చౌదరి, సరోజని. ఆమె ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు, బ్రిటన్‌లో ఎంఆర్‌సీపీ, ఫెలోషిప్‌ ఎగ్జామినేషన్‌ ఆఫ్‌ ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ పెథాలజిస్ట్స్‌ (ఎఫ్‌ఆర్‌సీపాత్‌) పూర్తిచేసి 1998 నుంచి లండన్‌లో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో ప్రొఫెసర్‌గా, కేథరిన్‌ డార్మండీ హీమోఫీలియా అండ్‌ థ్రాంబోసిస్‌ సెంటర్‌ డైరెక్టర్‌గాను విధులు నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్‌ డా.ప్రతిమా చౌదరి హీమోఫీలియా, థ్రాంబోసిస్, జీన్‌థెరపీలపై అంతర్జాతీయ జర్నల్స్‌లో వందకుపైగా పరిశోధన పత్రాలు రాశారు. పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులకు గైడ్‌గా, వివిధ అంతర్జాతీయ మెడికల్‌ కంపెనీలకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

సయ్యద్‌ హఫీజ్‌కు ‘ఫోర్బ్స్‌ ఇండియా’ గుర్తింపు

ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడికి చోటు లభించింది. 32వ స్థానంలో నిలిచారు. యైటింక్లైన్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్‌టట్స్‌’కు ఈ గుర్తింపు లభించింది. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న సయ్యద్‌ 2011లో ‘తెలుగు టెక్‌టట్స్‌’ పేరిట ఛానల్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ వినియోగంతో పాటు వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు, వివిధ కంపెనీలకు చెందిన కొత్త ఫోన్ల అన్‌ బాక్సింగ్, కొత్తగా వస్తున్న ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ప్రస్తుతం 16 లక్షల సబ్‌స్క్రైబర్లను చేరుకున్న హఫీజ్‌ యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ.2 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఆయన వీడియోలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఫోర్బ్స్‌ తన మ్యాగజైన్‌లో పేర్కొంది. సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన హఫీజ్‌ ఉన్నత విద్య చదవకపోయినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్‌ ద్వారా ఆకట్టుకుంటున్నారు.

సురినామ్‌ ‘ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఎల్లో స్టార్‌’గా శ్రీశ్రీ రవిశంకర్‌

దక్షిణ అమెరికా తీరప్రాంత దేశమైన సురినామ్‌ తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఎల్లో స్టార్‌’తో భారత ఆధ్యాత్మిక గురువు, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ను సత్కరించింది. సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్‌ సంతోఖి ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఇప్పటి వరకు దేశాధిపతులకు మాత్రమే ఇచ్చిన ఈ అవార్డు మొదటిసారి ఓ ఆధ్యాత్మిక వేత్త, ఆసియావాసి అందుకొన్నారు.

ఐఎమ్‌ఎఫ్‌ ‘వాల్‌ ఆఫ్‌ ఫార్మర్‌ చీఫ్‌ ఎకనమిస్ట్స్‌’లో తొలి మహిళగా గీతా గోపీనాథ్‌కు చోటు

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌)కి చెందిన ‘వాల్‌ ఆఫ్‌ ఫార్మర్‌ చీఫ్‌ ఎకనమిస్ట్స్‌’లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా, భారత్‌కు చెందిన రెండో వ్యక్తిగా గీతా గోపీనాథ్‌ ఘనత సాధించారు. 2003 - 06లో ఐఎమ్‌ఎఫ్‌కు ముఖ్య ఆర్థికవేత్తగా బాధ్యతలు నిర్వర్తించిన రఘురామ్‌ రాజన్‌ ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయుడు. 2018 అక్టోబరులో ఐఎమ్‌ఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్తగా గోపీనాథ్‌ నియమితులయ్యారు. గతేడాది డిసెంబరులో ఐఎమ్‌ఎఫ్‌ తొలి డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ‘ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ ఐఎమ్‌ఎఫ్‌కు చెందిన వాల్‌ ఆఫ్‌ ఫార్మర్‌ చీఫ్‌ ఎకనమిస్ట్స్‌లో చేరాన’ంటూ ట్వీట్‌ చేస్తూ వాల్‌పై తన చిత్రంతో ఉన్న ఫొటోను సైతం గోపీనాథ్‌ పంచుకున్నారు.

రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌లో డాక్టర్‌ రఘురాంకు గౌరవ సభ్యత్వం

ప్రతిష్ఠాత్మక ‘ది రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’లో కిమ్స్‌ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ పి.రఘురాం (55)కు గౌరవ సభ్యత్వô(ఆనరరీ ఫెలోషిప్‌) లభించింది. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అధ్యక్షుడు ఆచార్య నీల్‌ మోర్టెన్‌సెన్‌ చేతులమీదుగా డాక్టర్‌ రఘురాం ఈ గౌరవాన్ని స్వీకరించారు. శస్త్రచికిత్సల విభాగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా దీన్ని అందజేసినట్లు డాక్టర్‌ నీల్‌ మోర్టెన్‌సెన్‌ తెలిపారు. భారత్‌ తరఫున ఈ ఫెలోషిప్‌ పొందిన అత్యంత పిన్న వయస్కుడైన సర్జన్‌ డాక్టర్‌ రఘురామే కావడం విశేషం.

దక్షిణాది ఉత్తమ వైద్యులలో డా.నరేంద్రకుమార్‌కు చోటు

తెలంగాణ ప్రభుత్వ వైద్యుడు మరో ఘనత సాధించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘టాప్‌ డాక్టర్స్‌ ఇన్‌ సౌత్‌-2022’ అనే అంశంపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో దక్షిణాదిన ఉత్తమ వైద్యుల్లో ఒకరుగా డాక్టర్‌ ఎ.నరేంద్రకుమార్‌ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం తెలంగాణలో వైద్యవిద్య అదనపు సంచాలకులు, వనపర్తి బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సర్వేకు సంబంధించి మొత్తం 52 విభాగాల్లో 379 మంది వైద్యులు ఎంపిక కాగా హైదరాబాద్‌ నుంచి 70 మందికి ఆ జాబితాలో చోటు దక్కింది. వీరిలో 69 మంది ప్రైవేటు డాక్టర్లే కాగా నరేంద్రకుమార్‌ ఒక్కరే ప్రభుత్వ వైద్యుడు కావడం విశేషం. దక్షిణ భారత్‌లో అత్యుత్తమ వైద్యుల జాబితాలో పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంలో ఏడుగురిని ఎంపిక చేయగా అందులో ఒకరుగా నరేంద్రకుమార్‌ ఎంపికయ్యారు.

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా సినీశెట్టి

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ (2022) టైటిల్‌ను కర్ణాటకకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫైనల్‌ జరిగింది. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన రూబల్‌ శెఖావత్‌ మొదటి రన్నరప్‌గా నిలువగా, ఉత్తర్‌ప్రదేశ్‌ యువతి షినాటా చౌహాన్‌ ద్వితీయ రన్నరప్‌గా ఎంపికయ్యారు. బాలీవుడ్‌ నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్‌ గాంధీ, రాహుల ్ఖన్నా, కొరియోగ్రాఫర్‌ శియామక్‌ దావర్, మాజీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జ్యూరీ ప్యానెల్‌గా వ్యవహరించారు.

ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కురాలైన ఫ్టైట్‌ అటెండెంట్‌గా బెట్టె నాష్‌

అమెరికాకు చెందిన బెట్టె నాష్‌ బామ్మ వయసు 86 ఏళ్లు. 1957లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌ హోస్టెస్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఎనిమిది పదుల వయసు దాటిపోతున్నా ఇప్పటికీ అదే సంస్థలో కొనసాగుతున్నారు. అందుకే, ప్రపంచంలో అత్యంత పెద్ద వయస్కురాలైన ఫ్టైట్‌ అటెండెంట్‌గా ఆమె గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కారు.

ఐపీఆర్‌సీ సంచాలకులుగా ఎంబీఎన్‌ మూర్తి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో తెలుగువారికి సుదీర్ఘకాలం తర్వాత అరుదైన అవకాశం దక్కింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బద్రీ నారాయణమూర్తిని తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపెల్షన్‌ రీసెర్చ్‌ కాంప్లెక్సు (ఐపీఆర్‌సీ) సంచాలకులుగా నియమిస్తూ ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‣ అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన ఆయన 1987 నుంచి ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేస్తూ సంచాలకుని స్థాయికి ఎదిగారు. ఇప్పటివరకూ షార్‌ నుంచి సంచాలకులుగా పదోన్నతిపై ఇతర ఇస్రో కేంద్రాలకు వెళ్లినవారు ఎవరూ లేరు. తొలిసారి వెళ్తున్నది ఎంబీఎన్‌ మూర్తి మాత్రమే. ఆయన కోయంబత్తూరులోని పీఎస్‌జీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. ఈయన క్రయోజనిక్‌ సిస్టమ్‌పై రాసిన జర్నల్స్‌ జాతీయ, అంతర్జాతీయంగా ప్రచురితమయ్యాయి. అనుభవం, అందుకున్న పురస్కారాలు ‣ పనితీరులో ప్రతిభ కనబరిచినందుకు 2017లో ఇస్రో అవార్డు ‣ 2011లో ప్రతిభా పురస్కారం ‣ ప్రయోగవేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహకనౌక నింగికి ఎగసినపుడు మంటలను నియంత్రించేందుకు గురుత్వాకర్షణ ద్వారా నీరు వచ్చేలా అకౌస్టిక్‌ సప్రెషన్‌ సిస్టమ్‌పై అధ్యయనం చేశారు. ఇందుకు 2014లో ఇస్రో ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్నారు. ‣ 2006లో రెండో ప్రయోగ వేదికలో క్రయో సిస్టమ్స్‌కు ప్రాజెక్టు మేనేజర్‌గా వ్యవహరించారు. ఇందుకు టీమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. ‣ ఏఎస్‌ఐ (ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా), ఇండియన్‌ సొసైటీ ఫర్‌ నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్, హైఎనర్జీ మెటీరియల్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రొఫెషనల్‌ బాడీలకు జీవితకాల సభ్యునిగా కొనసాగుతున్నారు.