అంతర్జాతీయం



పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ ఒక్క రూపాయి డాక్టర్‌ సుషోవన్‌ మరణం

ప్రజలకు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యుడు సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ (84) కోల్‌కతాలో మరణించారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఒక్క రూపాయికే వైద్య సేవలందించిన సుషోవన్‌ బందోపాధ్యాయ్‌ను అక్కడి ప్రజలు ప్రేమగా ‘ఒక్క రూపాయి డాక్టర్‌’ అని పిలుస్తుంటారు. 1984లో కాంగ్రెస్‌ టికెట్‌పై బోల్పోర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన ఆయన, ఆ పార్టీకీ వీడ్కోలు పలికారు. ఈ ప్రజా వైద్యుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా ఆయన పేరు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కింది.

పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీస్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు సుభాష్‌ పత్రీజీ మరణం

పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీస్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు సుభాష్‌ పత్రీజీ (74) బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో మరణించారు. 1947 నవంబరు 11న నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సుభాష్‌ పత్రీజీ జన్మించారు. ధ్యానంపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 1990లో ది కర్నూల్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీని అక్కడే ప్రారంభించారు. 1991లో తొలి ధ్యాన పిరమిడ్‌ ఏర్పాటు చేశారు. 1992లో ప్రైవేట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ధ్యాన శిక్షణలో నిమగ్నమయ్యారు. పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీస్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించారు. శ్వాస మీద ధ్యాసే ధ్యానమని, దాంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఉద్బోధించారు. 1996లో అనంతపురం జిల్లా ఉరవకొండలో మరో పిరమిడ్‌ను ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పిరమిడ్‌ ధ్యాన కేంద్రాలను విస్తరింపజేశారు. 2012లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలో ఎత్తయిన పిరమిడ్‌ నిర్మించి, ముందు భాగంలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి కైలాస్‌పురి అని నామకరణం చేసి, మహేశ్వర మహాపిరమిడ్‌ను ప్రారంభించారు. అక్కడే 2012 డిసెంబరులో ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించారు. ఇవే రోజుల్లో ఏటా ధ్యాన మహాచక్రం సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు 2006లో వార్ధాలోని మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ తరఫున జీవన సాఫల్య పురస్కారం అందించారు.

ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించిన మగ పాండా అన్‌ అన్‌ మృతి

సంరక్షణలో ఉన్న మగ పాండాల్లో ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించిన ‘అన్‌ అన్‌’ మృతి చెందింది. కొన్నేళ్లుగా హాంకాంగ్‌ ఓషన్‌ పార్క్‌లో ప్రత్యేకాకర్షణగా నిలిచి సందర్శకులను అలరించిన 35 ఏళ్ల అన్‌ అన్‌ ఆరోగ్యం క్షీణించి తుది శ్వాస విడిచింది. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండడంతో అది మరింత బాధపడకుండా ఉండేందుకు ఓషన్‌ పార్క్‌ పశు వైద్యులు వైద్య ప్రక్రియలో కారుణ్య మరణాన్ని ప్రసాదించారు. 1999లో చైనా అన్‌ అన్‌తో పాటు జియా జియా అనే ఆడ పాండాను హాంకాంగ్‌కు బహుమతిగా ఇచ్చింది. జియా జియా 2016లో 38 ఏళ్ల వయసులో మృతి చెందింది.

మెక్సికో మాజీ అధ్యక్షుడు ఎచెవెరియా మరణం రాజకీయ ప్రత్యర్థులను దారుణంగా హతమార్చారనే ఆరోపణలున్న మెక్సికో మాజీ అధ్యక్షుడు లూయిస్‌ ఎచెవెరియా తన నూరో ఏట మరణించారు. మృతి విషయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ఆంద్రెజ్‌ లొపెజ్‌ ఒబ్రాదర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఎచెవెరియా 1970 నుంచి 1976 వరకు అధ్యక్ష పదవిలో ఉన్నారు. 1968 - 1971 మధ్యకాలంలో జరిగిన పలు రాజకీయ హత్యలకు సంబంధించి ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే, విచారణ చేపట్టేందుకు న్యాయస్థానాలు తిరస్కరించాయి. తన పాలనాకాలంలో వామపక్ష వాదులను దారుణంగా అణచి వేశారనే విమర్శలూ ఎచెవెరియాపై ఉన్నాయి. ఆయన మెక్సికో నగరంలో 1922 జనవరి 17న జన్మించారు. 2018 నుంచి శ్వాస సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నారు. అధ్యక్ష పదవీ కాలంలో జరిగిన విద్యార్థుల హత్యల ఇతివృత్తంతో నిర్మించిన సినిమా ‘రోమా’ విదేశీ భాషా చిత్రాల కేటగిరీలో ఆస్కార్‌ అవార్డును గెలుచుకుంది.

జపాన్‌ మాజీ ప్రధాని షింజో దారుణ హత్య

ప్రపంచంలోకెల్లా అత్యంత సురక్షిత దేశాల్లో ఒకటిగా పేరొందిన జపాన్‌లో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. దేశ మాజీ ప్రధానమంత్రి, దిగ్గజ నేత షింజో అబె దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ జపాన్‌లోని నరా నగరంలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. 67 ఏళ్ల అబె ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. జపాన్‌ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తూటాల గాయాలకు తాళలేక తుదిశ్వాస విడిచారు.

ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ బర్కిండో మరణం

పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) సెక్రటరీ జనరల్‌ మహమ్మద్‌ బర్కిండో (63) నైజీరియా రాజధాని అబూజాలో మరణించారు. వాతావరణ మార్పుల పరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో చమురు పరిశ్రమ వర్గాలకు మద్దతుగా నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీతో మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ నెలాఖరు వరకు ఆయన పదవీకాలం ఉంది. మరణానికి కారణాలు తెలియరాలేదు. కొవిడ్‌-19 సంక్షోభానంతరం ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమకు ఆయన కీలక సేవలు అందించారని ఒపెక్‌ దేశాలు పేర్కొన్నాయి. బర్కిండో తమకు మిత్రునిగా ఉండేవారని భారత్‌ పేర్కొంది.

తెలంగాణ పోరాట యోధుడు అలుగుబెల్లి మరణం

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు అలుగుబెల్లి వెంకటనర్సింహారెడ్డి (97) సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం తుమ్మలపెన్‌పహాడ్‌లోని తన ఇంట్లో మరణించారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సభ్యుడిగా రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. విద్యా సంస్థలను బహిష్కరించి సాయుధ పోరాటాల్లో పాలుపంచుకున్నారు. సూర్యాపేట ప్రాంత దళానికి నాయకత్వం వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంటిపై రజాకార్లు పలు దఫాలు దాడులు జరిపి కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనానికి వచ్చిన ఇండియన్‌ యూనియన్‌ బలగాలు కమ్యూనిస్టులపై దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి వెంకటనర్సింహారెడ్డి నాయకత్వం వహించారు. 1951లో పోరాట విరమణపై న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 1967లో నక్సల్బరీ పంథాలోకి ప్రవేశించారు. చండ్ర పుల్లారెడ్డి, అలుగుబెల్లి యలమారెడ్డి, గోపాల్‌రెడ్డి, కాకి లక్ష్మారెడ్డిలను ప్రజా ఉద్యమాల దిశగా ప్రోత్సహించారు. నాలుగుసార్లు తుమ్మలపెన్‌పహాడ్‌ సర్పంచిగా పనిచేశారు.

మధుర కవి కేవీఎస్‌ ఆచార్యులు మరణం

మధుర వ్యాఖ్యానంతో అల్లూరు నుంచి అమెరికా దాకా 5 దశాబ్దాలకుపైగా కళాభిమానులను విశేషంగా అలరించిన ప్రముఖ కవి కేవీఎస్‌ ఆచార్యులు (80) అనారోగ్య సమస్యలతో బాపట్లలోని తన స్వగృహంలో మరణించారు. పిట్టలవానిపాలెం మండలం అల్లూరులో జన్మించిన కాండూరి వెంకట సత్యనారాయణాచార్యులు బాపట్లలో స్థిరపడ్డారు. ‘సభా నిర్వహణ’ అనే వినూత్న ప్రక్రియ ప్రవేశపెట్టి తెలుగు రాష్ట్రాల్లో కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా పురస్కారాలు పొందారు. 18 ఏళ్ల పాటు భద్రాచలం సీతారాముల కల్యాణానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి కల్యాణోత్సవాన్ని వేల మంది భక్తుల కళ్లకు కట్టినట్లుగా వివరించారు. తిరుపతి బ్రహ్మోత్సవాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 1983లో అమెరికాలో పర్యటించి పలు సభల్లో తెలుగుభాష మాధుర్యాన్ని ప్రవాసాంధ్రులకు రుచి చూపించారు.