నియామకాలు



ఎన్‌ఎస్‌ఈ ఎండీగా ఆశిష్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మేనేజింగ్‌ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన బీఎస్‌ఈ ఎండీ, సీఈఓగా రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈఓ నియామకం వరకు ఎక్స్ఛేంజీ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చూసుకుంటుందని బీఎస్‌ఈ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ గత సీఈఓ విక్రమ్‌ లిమాయే స్థానాన్ని చౌహాన్‌ భర్తీ చేశారు. జులై 15న ఆయన అయిదేళ్ల కాలవ్యవధి ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ ఉన్నారు. 2000లో ఆయన ఎన్‌ఎస్‌ఈని విడిచిపెట్టి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లో పలు పదవులు నిర్వహించారు. 2009లో బీఎస్‌ఈ డిప్యూటీ సీఈఓగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లోకి అడుగుపెట్టారు. 2012 నుంచి బీఎస్‌ఈ సీఈఓగా పనిచేస్తున్నారు.

ప్రపంచ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్తగా ఇందర్మిత్‌ గిల్‌

ప్రపంచ బ్యాంక్‌ తన ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇందర్మిత్‌ గిల్‌ను నియమించింది. కౌశిక్‌ బసు తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన రెండో భారత జాతీయుడు ఈయనే. 2012 - 16 మధ్య బసు ఈ బాధ్యతలను నిర్వహించారు. 2022 సెప్టెంబరు 1 నుంచి గిల్‌ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రపంచ బ్యాంకుకే చెందిన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్‌)కి ముఖ్య ఆర్థికవేత్తలుగా రఘురామ్‌ రాజన్, గీతా గోపీనాథ్‌ సేవలందించారు.

ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓగా ఆశిష్‌ కుమార్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) తదుపరి మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన నియామకానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించిందని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. వాటాదార్ల ఆమోదంతో పాటు ఎన్‌ఎస్‌ఈ ఆఫర్‌కు ఆయన సమ్మతించాక, నియామకం ఖరారవుతుంది. ఎన్‌ఎస్‌ఈ ఎండీగా అయిదేళ్ల పదవీ కాలాన్ని జులై 16తో పూర్తి చేసుకున్న విక్రమ్‌ లిమాయే, రెండో దఫా కొనసాగేందుకు అవకాశం ఉన్నా ఆయన సుముఖత చూపలేదు. దీంతో తదుపరి 5 ఏళ్ల కాలానికి చౌహాన్‌ను ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓగా ఎంచుకున్నారు. చౌహాన్‌ బాధ్యతలు చేపట్టేవరకు ఎన్‌ఎస్‌ఈ నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా ఎన్‌ఎస్‌బీ బోర్డు నియమించిన అంతర్గత ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చూసుకుంటుంది. ఇందులో యాత్రిక్‌ విన్‌ (గ్రూప్‌ సీఎఫ్‌ఓ, కార్పొరేట్‌ వ్యవహారాల హెడ్‌), ప్రియా సుబ్బరామన్‌ (ముఖ్య నియంత్రణాధికారి), సోమసుందరమ్‌ కేఎస్‌ (చీఫ్‌ ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), శివ్‌ కుమార్‌ భాసిన్‌ (చీఫ్‌ టెక్నాలజీ, ఆపరేషన్స్‌ అధికారి) ఉన్నారు.

రెరా కేంద్ర సలహా మండలిలో తెలంగాణకు చోటు

రియల్‌ ఎస్టేట్‌ (రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) యాక్ట్‌ 2016 అమలు కోసం కేంద్ర పట్టణాభివృద్ది Äశాఖ ఏర్పాటు చేసిన కేంద్ర సలహా మండలిలో తెలంగాణకు స్థానం దక్కింది. ఈ మండలిలో పది రాష్ట్రాల సభ్యులను ప్రతి మూడేళ్లకోసారి రొటేషన్‌ ప్రాతిపదికన మారుస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు తెలంగాణకు అవకాశం వచ్చింది. రాష్ట్రం నుంచి రెరా చట్టం అమలును పర్యవేక్షించే అదనపు చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారిని ఇప్పుడు ఈ మండలి ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నియమిస్తున్నట్లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాలకూ అవకాశం వచ్చింది. వీరు మూడేళ్ల పాటు కొనసాగుతారు.

ఎన్‌జీటీ జ్యుడిషియల్‌ మెంబర్‌గా జస్టిస్‌ పుష్పా సత్యనారాయణ

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) జ్యుడిషియల్‌ మెంబర్‌గా మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పుష్పా సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నాలుగేళ్లు కానీ, 67 ఏళ్ల వరకు కానీ (ఇందులో ఏది తక్కువైతే అది) ఈ పదవిలో కొనసాగుతారని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఐఐ ఉపాధ్యక్షుడిగా సంజీవ్‌ పురి

2022 - 23 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉపాధ్యక్షుడిగా ఐటీసీ ఛైర్మన్, ఎండీ సంజీవ్‌ పురి ఎంపికయ్యారు. టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆర్‌.దినేశ్‌ తదుపరి అధ్యక్షుడి (డెసిగ్నేట్‌)గా ఎన్నికయ్యారు. సంజీవ్‌ పురి విషయానికొస్తే సీఐఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా సీఐఐలో పలు ముఖ్య పదవులు నిర్వర్తించారు.

ఎఫ్‌ఎస్‌ఐబీగా బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో డైరెక్టర్‌ పోస్టులకు అర్హులను ఎంపిక చేసే బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరోను (బీబీబీ) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ)గా ప్రభుత్వం మార్పు చేసింది. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్ల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఎఫ్‌ఎస్‌ఐబీలో భాగం చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

‣ బీబీబీ మాజీ ఛైర్మన్‌ భాను ప్రతాప్‌ శర్మను ఎఫ్‌ఎస్‌ఐబీకి తొలి ఛైర్‌పర్సన్‌గా నియమించేందుకు ‘నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గ కమిటీ’ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అనిమేశ్‌ చౌహాన్‌ (గతంలోని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌కు మాజీ ఛైర్మన్, ఎండీ), ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు దీపక్‌ సింఘాల్, శైలేంద్ర భండారి (గతంలోని ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌కు మాజీ ఎండీ) ఎఫ్‌ఎస్‌ఐబీలో సభ్యులుగా ఉండనున్నారు.