జాతీయం



డోపింగ్‌ నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జాతీయ యాంటీ డోపింగ్‌ సంస్థ (నాడా), జాతీయ డోప్‌ పరీక్షల ప్రయోగశాల (ఎన్‌డీటీఎల్‌) ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించే డోపింగ్‌ నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని సవరణలకు సభ్యులు మూజువాణి ఓటుతో అంగీకరించారు. క్రీడల్ని ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇది దోహదపడుతుందని క్రీడలు - యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ చెప్పారు. ఉత్ప్రేరక మందుల్ని తీసుకున్నారా లేదా అనేది పరీక్షించే సదుపాయాలను పెంచడం ఈ బిల్లు ఉద్దేశాల్లో ఒకటని వివరించారు. క్రీడల్లో ఇలాంటి మందుల వాడుకను నియంత్రించే చర్యల్ని బలోపేతం చేసేందుకు జాతీయ స్థాయిలో ఒక మండలి కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. దర్యాప్తు చేయడానికి, డోపింగ్‌ నిరోధక నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై ఆంక్షలు విధించడానికి, తనిఖీలకు, నమూనాల సేకరణకు నాడాకు తగిన అధికారాలు కల్పించాలని బిల్లులో ప్రతిపాదించినట్లు వివరించారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి మండలి ఆమోదం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) సేవల మెరుగు కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. సేవలను మెరుగు పరచేందుకు తాజా మూలధనం, 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు, బ్యాలెన్స్‌ షీట్‌పై ఒత్తిడి తగ్గించడం, ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీబీఎన్‌ఎల్‌)ను బీఎస్‌ఎన్‌ఎల్‌తో విలీనం చేసే చర్యలు ఈ ప్యాకేజీలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.43,694 కోట్లు నగదు రూపేణ, రూ.1.2 లక్షల కోట్లు నగదేతర రూపంలో నాలుగేళ్ల కాల వ్యవధిలో అందించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని వెల్లడించారు.

బీపీసీఎల్‌ బ్రెజిల్‌లోని భారత్‌ పెట్రో రిసోర్సెస్‌ లిమిటెడ్‌ (బీఆర్‌పీఎల్‌) చమురు క్షేత్రంలో అదనంగా 1.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,800 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.

పాడి పశువుల్లో తొలిసారి ‘సరోగసీ’ విధానం

అద్దెగర్భం (సరోగసీ) విధానం రాష్ట్రంలో పాడి పశువులకు అమలు చేయగా తొలిసారి మూడు దూడలు పుట్టాయి. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఎల్‌డీఏ), కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమై ఒక ఆవుకు పెయ్య, మరో ఆవుకు కోడె కవల దూడలు జన్మించాయి.

ఈ ప్రయోగం విజయవంతం కావడం రాష్ట్రంలో పాడి పశువుల అభివృద్ధికి కీలక మలుపు అని ఎల్‌డీఏ కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డాక్టర్‌ మంజువాణి తెలిపారు. రాష్ట్రంలో పశుగణాభివృద్ధికి ఆ సంస్థ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా సరోగసీ విధానం చేపట్టి, సాహివాల్‌ దేశీజాతి గిత్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టగా ఈ దూడలు పుట్టాయి. కేంద్రం ఈ ప్రాజెక్టు అమలుకు రూ.5.83 కోట్లను రాష్ట్రానికి మంజూరు చేసి ఎల్‌డీఏను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఈ ప్రయోగాన్ని జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలలో చేపట్టి మొత్తం 19 ఎంబ్రియోలను ప్రయోగశాలలో అభివృద్ధి చేసి ఆవుల గర్భంలో ప్రవేశ పెట్టినట్లు ఆమె వివరించారు. వీటిలో 3 దూడలు పుట్టాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కుచునూరుపల్లిలో అరవిందరెడ్డికి చెందిన జర్సీ ఆవుకు పెయ్య(ఆడ) దూడ, ఇదే జిల్లా రాయికల్‌ మండలం సింగారావుపేట రైతు రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఆవుకు కవల మగదూడలు పుట్టాయి. సరోగసీ విధానంలో ఎంబ్రియోలను ఆవుల గర్భంలో ప్రవేశపెట్టిన తరవాత ఇలా దూడలు పుట్టడం రాష్ట్రంలో ఇదే ప్రథమం అని ఆమె వివరించారు.


15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముర్ము

నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన తాను దేశ అత్యున్నత రాజ్యాంగ పీఠాన్ని అధిష్ఠించడం భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమని నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పార్లమెంటు సెంట్రల్‌ హాలులో ఆమెతో ప్రమాణం చేయించారు. అతిపిన్న వయసులో రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకున్న వ్యక్తిగా ద్రౌపది (64) ఘనత సాధించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆమె 18 నిమిషాలకు పైగా ప్రసంగించారు. సంప్రదాయ ఆదివాసీ అభివాదమైన ‘జోహార్‌’తో ప్రసంగాన్ని ప్రారంభించి, గతాన్ని గుర్తు చేస్తూనే భారత భవిష్యత్‌ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు.

గెయిల్‌తో ఓఎన్‌జీసీ గ్యాస్‌ విక్రయ ఒప్పందాలు

గెయిల్‌ ఇండియా, అస్సాం గ్యాస్‌ కంపెనీ (ఏజీసీఎల్‌)తో ఓఎన్‌జీసీ గ్యాస్‌ విక్రయ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఉత్తర త్రిపుర జిల్లాలో రానున్న ఖుబల్‌ క్షేత్రంలోని ఖుబల్‌ గ్యాస్‌ గ్యాదరింగ్‌ స్టేషన్‌ (జీజీఎస్‌) నుంచి గెయిల్, ఏజీసీఎల్‌లు 50,000 ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ అందుకుంటాయని ఒక అధికారి తెలిపారు. ఉత్పత్తి మొదలైతే త్రిపురలో ఓఎన్‌జీసీకి ఇది పదో ఉత్పత్తి క్షేత్రమవుతుంది. 4,40,000 ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ప్రాసెస్‌ చేసే సామర్థ్యం ఖుబల్‌ జీజీఎస్‌కు ఉంటుందని ఆయన తెలిపారు.

ఇండియన్‌ అంటార్కిటిక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

విపక్ష సభ్యుల నిరసన మధ్యే కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ‘ఇండియన్‌ అంటార్కిటిక్‌ బిల్లు - 2022’ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇదే. తొలుత సభ వరుసగా రెండు సార్లు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ భేటీ అయినప్పుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ బిల్లును సభ ముందుంచారు. స్వల్ప సమయం పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ.. అంటార్కిటికాలో ఉన్న మన దేశానికి చెందిన రెండు కేంద్రాలు మైత్రి, భారతిలలో ఉండే శాస్త్రవేత్తలకు, వారి పరిశోధనలకు మన చట్టాలు వర్తింపజేసేందుకు బిల్లును తీసుకువచ్చామ’ని తెలిపారు. నిధి ఏర్పాటును బిల్లులో ప్రతిపాదించినట్లు వివరించారు.

దేశ ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలకు ఉద్దేశించిన ‘ఆరోగ్య హక్కు’ ప్రైవేటు బిల్లును ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది.


15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము

భారత 15వ రాష్ట్రపతిగా అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. పార్లమెంటు ప్రాంగణంలో చేపట్టిన ఓట్ల లెక్కింపులో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాపై 2,96,626 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ చేసిన ప్రకటన ప్రకారం ఆమెకు 6,76,803 విలువైన ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 విలువైన ఓట్లు దక్కాయి. పోలైన 4,754 ఓట్లలో 4,701 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 3వ రౌండ్‌ లెక్కింపు పూర్తయ్యేప్పటికే ద్రౌపదికి 51% ఓట్లు వచ్చినట్లు తేలడంతో గెలుపు ఖాయమైపోయింది. దాంతో యశ్వంత్‌సిన్హా తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది ఘనత సాధించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే. జీవిత విశేషాలు:-
పుట్టిన తేదీ: 20.06.1958
జన్మస్థలం: ఉపరబెడ గ్రామం, ఒడిశా
విద్య: రాజనీతి శాస్త్రంలో డిగ్రీ
రాజకీయ ప్రస్థానం
1997: రాయ్‌రంగపుర్‌ కౌన్సిలర్‌గా ఎన్నిక
2000 - 2009: రాయ్‌రంగపుర్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు భాజపా ఎమ్మెల్యేగా విజయం
2000 - 2004: నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వంలో మంత్రి
2006 - 2009: ఒడిశాలో భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు
2007: ఒడిశా అసెంబ్లీలో ఉత్తమ ఎమ్మెల్యే (నీలకంఠ సన్మాన్‌) పురస్కారం
2015 - 2021: ఝార్ఖండ్‌ గవర్నర్‌
2022 జూన్‌ 21: భారత రాష్ట్రపతిగా ఎన్నిక

గోవాలో ఎఫ్‌/ఎ-18 సూపర్‌ హార్నెట్‌ సామర్థ్యాల ప్రదర్శన

అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ బోయింగ్, తమ ఎఫ్‌/ఎ-18 సూపర్‌ హార్నెట్‌ యుద్ధ విమానాల సామర్థ్యాలను గోవాలోని ఓ నౌకాదళ కేంద్రంలో తాజాగా ప్రదర్శించి చూపింది. భారత నౌకాదళ అవసరాలను తీర్చే సత్తా వాటికి ఉందని నిరూపించేలా రెండు ఎఫ్‌/ఎ-18 సూపర్‌ హార్నెట్‌లతో వివిధ రకాల విన్యాసాలు చేయించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన విమానవాహక నౌక ‘విక్రాంత్‌’ను భారత్‌ ఆగస్టులో ప్రారంభించనుంది. సంబంధిత కాంట్రాక్టును దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా బోయింగ్‌ తాజా ప్రదర్శనను నిర్వహించింది.

దేశంలో 17.3 శాతం కౌలు రైతులు

దేశంలో 2018 - 19 గణాంకాల ప్రకారం.. 17.3 శాతం కౌలు రైతులు ఉన్నట్లు జాతీయ గణాంక శాఖ కార్యాలయం వెల్లడించిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ ఛౌదరి తెలిపారు. కౌలు రైతుల సమస్యలపై లోక్‌సభలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశమైనందున రైతులకు ఎలాంటి సహాయం అందించాలనేది అవే నిర్ణయించుకుంటాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 15,590 మంది నవజాత శిశువుల మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లల్లో గత మూడేళ్లలో 15,590 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. రాష్ట్రంలోని స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్స్‌ నుంచి అందించిన సమాచారం ప్రకారం 2019 - 20లో 5,324, 2020 - 21లో 4,972, 2021 - 22లో 5,294 మంది నవజాత శిశువులు మరణించినట్లు ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణలో వరుసగా 1,911, 1,941, 1,904 మంది కన్నుమూసినట్లు చెప్పారు. నెలలు నిండకపోవడం, తక్కువ బరువు కారణంగా 46.1%, ఊపిరి ఆడకపోవడం, జనన సమయంలో అయిన గాయాలతో 13.5%, న్యుమోనియాతో 11.3%, అంటు వ్యాధులతో 8.4%, విషపూరితం కావడంతో (సెప్సిస్‌) 5.7%, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల 4.3%, అతిసారం వల్ల 2.3%, అంతుచిక్కని జ్వరం వల్ల 1.4%, గాయాల వల్ల 1.2%, తెలియని కారణాల వల్ల 5.3%, మిగిలిన అన్ని కారణాల వల్ల 0.6% చనిపోతున్నట్లు చెప్పారు.

మూడేళ్లలో పౌరసౌత్వం వదులుకున్న భారతీయులు 3,92,643 మంది

గత మూడేళ్లలో 3,92,643 మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లోక్‌సభలో వెల్లడించారు. 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో 1,70,795 (43.49%) మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో కెనడా పౌరసత్వాన్ని 64,071 (16.31%) మంది, ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని 58,391 (14.87%), యూకే పౌరసత్వం 35,435 (9.02%) మంది తీసుకున్నట్లు చెప్పారు. ఈ నాలుగు దేశాల పౌరసత్వం తీసుకున్న మొత్తం భారతీయుల సంఖ్య 3,28,692 (83.71%) మేర ఉన్నట్లు వెల్లడించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదాలతో మొదలయ్యాయి. కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లును న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్తగా ఎన్నికైన బాలీవుడ్‌ ప్రముఖుడు శతృఘ్న సిన్హా (అసన్సోల్‌ - తృణమూల్‌ కాంగ్రెస్‌), దినేశ్‌లాల్‌ యాదవ్‌ (ఆజంగఢ్‌ - భాజపా), ఘన్‌శ్యామ్‌ సింగ్‌ లోధీ (రాంపుర్‌ - భాజపా) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం పార్లమెంటులోని ఎగువ సభకు ఇటీవల ఎన్నికైన 28 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, కపిల్‌ సిబల్, ప్రఫుల్‌ పటేల్, రాజకీయాల్లోకి ప్రవేశించిన క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, బాహుబలి కథా రచయిత వి.విజయేంద్రప్రసాద్, శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్, కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మీసా భారతి, విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వైకాపా నుంచి విజయసాయిరెడ్డి రెండోసారి, బీద మస్తాన్‌రావు తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

మణిపుర్‌ గవర్నర్‌ గణేశన్‌కు బెంగాల్‌ బాధ్యతలు

ఎన్డీయే కూటమి తనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేసిన రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి, మణిపుర్‌ గవర్నర్‌ లా గణేశన్‌కు బెంగాల్‌ బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేదాకా గణేశన్‌ ఈ బాధ్యతలు నిర్వహిస్తారని అందులో పేర్కొన్నారు.

ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ నగరాల పేర్లు మార్పు

మహారాష్ట్రలో 2 నగరాల పేర్లను మార్చేందుకు ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి సంభాజీనగర్‌గాను, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గాను మార్చేందుకు సమ్మతించింది. ఈ నగరాల పేర్లను మార్చాలని ఇంతకుముందున్న మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఎస్‌) ప్రభుత్వమే చివరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి ముందు జూన్‌ 29న ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ఆ భేటీ జరిగింది. అయితే అప్పట్లో ఔరంగాబాద్‌ను సంభాజీనగర్‌గా మార్చాలని నిర్ణయించగా శిందే ప్రభుత్వం దీనికి ముందు ‘ఛత్రపతి’ని చేర్చింది. ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ప్రస్తుతం మహారాష్ట్ర కేబినెట్‌లో శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లు మాత్రమే ఉన్నారు. తాజాగా కేబినెట్‌ ఆమోదాన్ని కేంద్రానికి పంపుతున్నారు. అలాగే ప్రతిపాదిత నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి డీబీ పాటిల్‌ పేరును పెట్టడానికి కూడా మంత్రివర్గం ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం

సుమారు రూ.14,850 కోట్ల వ్యయంతో నిర్మించిన 296 కి.మీ. పొడవైన బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీలోని జలౌన్‌ జిల్లా కైతేరి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణంతో చిత్రకూట్‌ నుంచి దిల్లీకి ప్రయాణ సమయం 3-4 గంటలు తగ్గుతుందని తెలిపారు. బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఏడు జిల్లాల గుండా వెళుతుంది. చిత్రకూట్, బందా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరయా, ఇటావా జిల్లాలను అనుసంధానం చేస్తుంది. ఈ రహదారిని అంచనా వ్యయం కంటే తక్కువ ఖర్చుతో రికార్డు సమయంలోగా పూర్తి చేశారు. ఈ రహదారిలో నాలుగు రైల్వేఓవర్‌ బ్రిడ్జిలు, 14 పొడవైన వంతెనలు, ఆరు టోల్‌ ప్లాజాలు, 266 మైనర్‌ బ్రిడ్జిలు, 18 ఫ్లైఓవర్లు ఉన్నాయి. మొత్తం 296 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ఈ రహదారిలో 90 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి.

‘దునగిరి’ స్టెల్త్‌ యుద్ధ నౌక ప్రారంభం

హుగ్లీ నదిలో భారత నౌకాదళానికి చెందిన ‘దునగిరి’ అనే స్టెల్త్‌ యుద్ధ నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ శ్రేణి కింద రూపొందే మూడు యుద్ధ నౌకల్లో ఇది రెండోది. మొదటిదైన హిమగిరి, 2020 డిసెంబరులో సిద్ధమైంది.

‘సరిహద్దు’ వివాద పరిష్కారానికి అరుణాచల్, అస్సాంల ఒప్పందం

దశాబ్దాల తరబడి ఉభయ రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ముగించే దిశగా అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు పేమాఖండూ, హిమంత బిశ్వశర్మ ముందడుగు వేశారు. ఈ మేరకు వివాదాస్పద సరిహద్దు గ్రామాల సంఖ్యను 123 నుంచి 86కి తగ్గిస్తూ ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రస్తుత సరిహద్దులకు అనుగుణంగా 37 గ్రామాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరిందని, మిగిలిన ప్రాంతాలపై కూడా సెప్టెంబరు 15న సయోధ్యకు ప్రయత్నిస్తామని బిశ్వశర్మ తెలిపారు. ‘నామ్‌సాయి డిక్లరేషన్‌’కు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 37 గ్రామాలకు గాను 28 అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉంటాయి. మూడింటిపై అరుణాచల్‌ ఫిర్యాదులను ఉపసంహరించుకోవడంతో అవి అస్సాం పరిధిలోకి వెళతాయి. అస్సాం వైపు లేని మిగిలిన 6 గ్రామాలు అరుణాచల్‌కే చెందినవే అయితే ఆ రాష్ట్రంలోనే ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోని 12 జిల్లాలకు సంబంధించి 12 ప్రాంతీయ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇవి వివాదాస్పద గ్రామాలను ఉమ్మడిగా పరిశీలించి సెప్టెంబరు 15 లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు చేస్తాయి. అనంతరం కుదిరిన ఒప్పందం ముసాయిదాను ఆమోదానికి గాను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు.

తొలి దేశీ 9 ఎంఎం మెషీన్‌ పిస్టల్‌ రూపకల్పన

ఇంతకాలం పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడిన 9 ఎంఎం మెషీన్‌ పిస్టల్‌ను భారత రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) వినూత్న 9 ఎంఎం పిస్టల్‌ను అభివృద్ధి చేయగా, దీన్ని హైదరాబాద్‌కు చెందిన లోకేష్‌ మెషీన్స్‌ తయారు చేసింది. ఈ 9 ఎంఎం పిస్టల్‌ను దిల్లీలో జరిగిన 7వ అంతర్జాతీయ పోలీసు ప్రదర్శనలో సందర్శకులకు చూపగా, ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత సైన్యానికి చెందిన ఇన్‌ఫాంట్రీ స్కూల్, పుణెలోని డీఆర్‌డీఓ - ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) దీన్ని రికార్డు సమయంలో రూపొందించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 9 ఎంఎం బుల్లెట్లను ఈ పిస్టల్‌తో పేల్చవచ్చు. దీనికి ముందు భాగంలో ఎయిర్‌ క్రాఫ్ట్‌ గ్రేడ్‌ అల్యూమినియమ్‌తో తయారు చేసిన అప్పర్‌ రిసీవర్, వెనుక భాగంలో కార్బన్‌ ఫైబర్‌తో చేసిన లోయర్‌ రిసీవర్‌ ఉన్నాయి. ట్రిగ్గర్‌ సహా అన్ని విడిభాగాలను 3డీ ప్రింటింగ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. వ్యక్తిగత ఆయుధంగా సైన్యం, పోలీసు బలగాల్లోని అధికారులు, సెక్యూరిటీ ఆఫీసర్లు, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే సిబ్బందికి ఈ ఆయుధం ఉపయుక్తంగా ఉంటుందని లోకేష్‌ మెషీన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సాధారణంగా 9 ఎంఎం మెషీన్‌ పిస్టల్‌ బరువు 3.5 కిలోలు ఉంటుంది కానీ, ఈ నూతన పిస్టల్‌ బరువు 2 కిలోలేనని, వినియోగించడం కూడా తేలికని, మిస్‌ఫైర్‌ అయ్యే ప్రమాదం లేదని వివరించారు.

యుటిలిటీ లాంజ్‌ ప్రారంభం

సుప్రీంకోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల కోసం కొత్తగా నిర్మించిన ‘యుటిలిటీ లాంజ్‌’ను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రారంభించారు. కక్షిదారులతో న్యాయవాదులు కూర్చొని మాట్లాడుకునేందుకు వీలుగా ఈ లాంజ్‌ను నిర్మించారు.

రూ.16,800 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం

ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 653 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో పాటు రూ.16,800 కోట్ల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బిహార్‌ అసెంబ్లీ శత జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. బిహార్‌ అసెంబ్లీని సందర్శించిన తొలి ప్రధాని మోదీయే.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ టీకా ఉత్పత్తికి డీసీజీఐ అనుమతి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన ‘క్వాడ్రివాలెంట్‌ హ్యూమన్‌ పాపిలోమావైరస్‌ వ్యాక్సిన్‌ (క్యూహెచ్‌పీవీ)’ను ఉత్పత్తి చేసి విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)కు ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)’ అనుమతి మంజూరు చేసింది. ‘సెర్వావాక్‌’గా ఈ టీకాను పిలవనున్నారు. ఈ వ్యాక్సిన్‌కు అనుమతులపై విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) జూన్‌ 15న సిఫార్సు చేసింది.

పార్లమెంటు నూతన భవనంపై అతిపెద్ద జాతీయ చిహ్నం

పార్లమెంటు నూతన భవనంపై ఏర్పాటు చేసిన అశోక చక్రం, నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. వచ్చే శీతాకాల సమావేశాలను నూతన భవనంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో 9,500 కేజీల బరువు, 6.5 మీటర్ల ఎత్తు ఉన్న జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించడం ప్రాధాన్యం. వందకుపైగా మంది కళాకారులు 9 నెలలు కష్టపడి ఈ జాతీయ చిహ్నాన్ని చేతులతో రూపొందించారు. జాతీయ చిహ్నం ప్రాథమిక నమూనాను అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ డిజైన్‌ చేసింది. దీన్ని ఆధారం చేసుకుని టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ద్వారా ఔరంగాబాద్‌కు చెందిన డియోర్‌ అండ్‌ అసోసియేట్స్‌ మట్టి, థర్మోకోల్‌ నమూనాలను సిద్ధం చేసింది. కళాకారులు అత్యంత శుద్ధమైన కాంస్యాన్ని వినియోగించి జైపుర్‌లో తుది రూపమిచ్చారు. ఆ తర్వాత దీన్ని పార్లమెంటు భవనం వద్దకు తీసుకొచ్చి, మెరుగులు దిద్దారు. ఈ ఆకృతి గోడలు 5-7 మిల్లీమీటర్ల మందంలో ఉన్నాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

పంజాబ్‌ ప్రభుత్వ సలహా కమిటీ ఛైర్మన్‌గా రాఘవ్‌ చద్దా

పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక సలహా కమిటీ ఛైర్మన్‌గా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దా నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. ఆర్థిక పరమైన అంశాల్లో సర్కారుకు సలహాలు, సూచనలు అందిస్తారు. ఇందుకోసం చద్దా ప్రత్యేకంగా జీతభత్యాలేవీ తీసుకోరని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారత్‌కు తొలిసారిగా నేపాల్‌ సిమెంటు

నేపాల్‌ నుంచి తొలిసారిగా మన దేశానికి సిమెంటు ఎగుమతి కాబోతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్ట్‌ నుంచి 3,000 సంచుల సిమెంటు మన దేశంలోకి రాబోతోంది. నవాల్‌ పరాసి జిల్లాలోని పాల్పా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ సునౌలీ సరిహద్దు ద్వారా మొదటి సరకు పంపిణీని ప్రారంభించింది. నేపాల్‌ నుంచి భారత్‌కు సిమెంటును ఎగుమతి చేసే సంస్థలకు 8 శాతం రాయితీ ఇస్తామని అక్కడి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.

27 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

దేశంలోని పది రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మంది సభ్యుల్లో 27 మంది ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛాంబర్‌లో ఛైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయల్, కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేశ్, వివేక్‌ టంఖా, ముకుల్‌ వాస్నిక్, భాజపా సభ్యులు కె.లక్ష్మణ్, సురేంద్ర సింగ్‌ నాగర్, లక్ష్మీకాంత్‌ వాజ్‌పేయీ, ఆర్‌ఎల్డీ అధ్యక్షుడు జయంత్‌ చౌధరీ, కల్పనా సైనీ తదితరులున్నారు. 27 మందిలో 12 మంది హిందీలో, నలుగురు ఆంగ్లంలో, సంస్కృతం, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లో ఇద్దరేసి చొప్పున, పంజాబీ, తమిళం, తెలుగులో ఒకొక్కరు చొప్పున ప్రమాణం చేశారు.

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పి.టి.ఉష, వీరేంద్ర హెగ్గడేలు

దక్షిణాది నుంచి నలుగురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రాజ్యసభ అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా తన సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (తమిళనాడు)తో పాటు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా భారతీయ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడంలో కీలక పాత్ర పోషించిన కథా రచయిత/దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)లను రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు నామినేట్‌ చేసింది. పరుగుల రాణిగా పేరొందిన పి.టి.ఉష (కేరళ), ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్గడే (కర్ణాటక)లకూ అదే కోటాలో ఎగువ సభకు అవకాశం కల్పించింది. ఈ నలుగురూ దక్షిణాది వారే కావడంతో.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో దక్షిణ భారతీయులను అధికార పక్షం విస్మరించిందంటూ వస్తున్న విమర్శలకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశముంది. ఈ నలుగురు తమ రంగాలకు దశాబ్దాలుగా విశేష సేవ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. అందుకు గుర్తింపుగానే వారిని రాజ్యసభకు నామినేట్‌ చేసినట్లు పేర్కొంది.

మహారాష్ట్ర శాసనసభ విశ్వాసం పొందిన కొత్త సీఎం ఏక్‌నాథ్‌ శిందే

శివసేన చీలిక వర్గం నేత, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కీలకమైన బల పరీక్షలో విజయం సాధించారు. శాసనసభ ప్రారంభం కాగానే సభాపతి రాహుల్‌ నర్వేకర్‌ విశ్వాస పరీక్ష ప్రక్రియను చేపట్టారు. శిందేకు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. వ్యతిరేకంగా 99 మంది ఓటేశారు. దీంతో ముఖ్యమంత్రి శిందే ప్రభుత్వం సభ విశ్వాసం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. మహారాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 288 కాగా ప్రస్తుతం 287 మంది ఉన్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి స్పీకర్‌తో సహా 267 మంది హాజరు కాగా ఓటింగ్‌లో 263 మంది పాల్గొన్నారు.

నేవీ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ జాతికి అంకితం

భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా జాతికి అంకితం చేశారు. విశాఖలోని ఈ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో రూపొందించారు. తూర్పు తీరంలో నిఘాకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. ఏఎల్‌హెచ్‌ తొలి స్క్వాడ్రన్‌కు ‘క్రెస్ట్రల్స్‌’ అని నామకరణం చేశారు. ‘చిట్టి డేగ’ అని దీని అర్థం. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్‌ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్‌ దాస్‌ సేవలు అందించనున్నారు.

‘డిజిట్‌ భారత్‌ వారోత్సవాలు - 2022’ ప్రారంభం

డిజిటల్‌ సాంకేతికత మన దేశంలో ప్రజల జీవితాలను గణనీయంగా మార్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘డిజిట్‌ భారత్‌ వారోత్సవాలు - 2022’ను గాంధీనగర్‌లో ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గత ఎనిమిదేళ్లలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23 లక్షల కోట్ల నగదు బదిలీ చేయడం ద్వారా రూ.2.23 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. ఆధార్‌తో బయోమెట్రిక్‌ సమాచారం అనుసంధానం వల్ల 500 మంది తప్పిపోయిన పిల్లల్ని వారి కుటుంబాలకు చేర్చగలిగామని చెప్పారు. డిజిటల్‌ ఇండియా భాషిణి, డిజిటల్‌ ఇండియా జెనిసిస్‌లను ఆయన ప్రారంభించారు.

మహారాష్ట్ర నూతన స్పీకర్‌గా నర్వేకర్‌

శివసేన అసమ్మతి వర్గం మహారాష్ట్ర శాసనసభాపతి ఎన్నికల్లో విజయం సాధించింది. రెండ్రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశాలు మొదలైన తొలి రోజు స్పీకర్‌ ఎన్నికను చేపట్టగా భాజపా అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్‌ 164 ఓట్లు సాధించి నెగ్గారు. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రాజన్‌ సాల్వీ 107 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. నూతన సభాపతి నర్వేకర్‌ (45) దేశంలోనే అతిపిన్న వయస్కుడైన స్పీకర్‌గా నిలుస్తారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ చెప్పారు. నూతన సభాపతి మామ రామ్‌రాజే నాయక్‌ (ఎన్సీపీ) మహారాష్ట్ర శాసనమండలికి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం మరికొన్ని గంటల్లో చర్చకు రానుండగా నూతన సభాపతి నర్వేకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఉన్న అజయ్‌ చౌధరిని తొలగించి, ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను తిరిగి నియమించారు. చీఫ్‌ విప్‌ పదవిలోనూ శిందే వర్గ ఎమ్మెల్యేను నియమించారు.

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లో వార్‌హెడ్‌ ప్రారంభం

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లో వార్‌హెడ్‌ ఫెసిలిటీ సహా పలు నూతన సదుపాయాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. అదే విధంగా కంచన్‌బాగ్‌ యూనిట్‌లోని ఆర్‌ (రేడియో ఫ్రీక్వెన్సీ) సీకర్‌ ఫెసిలిటీ, బీడీఎల్‌ విశాఖపట్నం యూనిట్‌లోని సెంట్రల్‌ స్టోరేజీ ఫెసిలిటీలను వర్చువల్‌ విధానంలో ఆరంభించారు. ఈ సందర్భంగా సింగ్‌ మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఆత్మ నిర్భర భారత్‌కు బీడీఎల్‌ ఎంతో సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.