దినోత్సవాలు



‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ 2022

మన సాయుధ దళాలు ప్రదర్శించిన అసాధారణ పరాక్రమానికి నిదర్శనమే కార్గిల్‌ యుద్ధమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ సందర్భంగా.. 1999లో లద్దాఖ్‌లోని కార్గిల్‌ మంచు పర్వతాలపై మూణ్నెల్ల పాటు పాకిస్థాన్‌ సేనలతో పోరాడిన భారత సైనికులు ‘ఆపరేషన్‌ విజయ్‌’ విజయవంతమైనట్లు ప్రకటించారు. ఈ యుద్ధంలో 500 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారని తెలిపారు.

కార్గిల్‌ యుద్ధంలో అమరుడైన కెప్టెన్‌ విక్రమ్‌ బత్రాకు అరుదైన గౌరవం దక్కింది. డావిన్చీ సురేశ్‌ అనే కళాకారుడు ఎనిమిది గంటలు శ్రమించి, టైల్స్‌ సహాయంతో 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కెప్టెన్‌ బత్రా చిత్రాన్ని స్విమ్మింగ్‌పూల్‌లో రూపొందించారు. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాఖండానికి నీటి అడుగున వేసిన అతిపెద్ద చిత్రంగా యూఆర్‌ఎఫ్‌ ప్రపంచ రికార్డు లభించింది. కార్యక్రమాన్ని ఆర్మీ సహకారంతో స్కూబా బాండ్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ సంస్థ నిర్వహించింది.

జమ్మూలోని స్థానిక ప్రముఖులు కార్గిల్‌ వీరులకు నివాళిగా 10 కిలోమీటర్ల మారథాన్‌ పరుగు నిర్వహించారు. జాతీయ పతాకను చేతబూని నినాదాలు చేస్తూ బలిదాన్‌ స్తంభ్‌ వరకు వీరు పరుగు తీశారు.


బీడీఎల్‌ 53వ ఆవిర్భావ దినోత్సవం

సులభతర వ్యాపార నిర్వహణ, ఆత్మ నిర్భర్‌ భారత్‌తో రక్షణ ఉత్పత్తులను స్నేహపూర్వక విదేశాలకు ఎగుమతి చేయడానికి బీడీఎల్‌కు అవకాశాలు లభించాయని సంస్థ సీఎండీ కమోడోర్‌ సిద్ధార్థ్‌ మిశ్రా తెలిపారు. బీడీఎల్‌ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో కంపెనీ సాధించిన విజయాలను క్లుప్తంగా వివరించారు. సాయుధ దళాల నుంచి బీడీఎల్‌ ఎక్కువగా ఆర్డర్‌ కలిగి ఉందన్నారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఉత్పత్తులను అందజేయడానికి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేయాలని కోరారు.

‣ రక్షణ ఉత్పత్తుల సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) భారత సాయుధ దళాలు విదేశీ ఆయుధాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్‌ను వేగవంతం చేసింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్, భానూరు యూనిట్లలో క్లిష్టమైన కొత్త సౌకర్యాలను దాదాపు రూ.100 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసింది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు తీర్చేలా క్షిపణుల్లో ఉపయోగించే మందుగుండు తయారీ ప్లాంట్, పరీక్షించేందుకు, ఉత్పత్తి చేసేందుకు వీలుగా రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్స్‌ సెంటర్‌ను బీడీఎల్‌ సమకూర్చుకుంది. పూర్తిస్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బీడీఎల్‌ పెంపొందించుకుంది.

‣ దేశం బయట వ్యాపార విస్తరణకు యూఏఈకు చెందిన తవాజున్‌ ఎకానమిక్‌ కౌన్సిల్‌ వంటి సంస్థలతో బీడీఎల్‌ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

‣ సర్కారు ఆమోదం తెలపడంతో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఆకాశ్‌ వంటి క్షిపణులను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది.

‣ అస్త్ర ఎంకే-1 క్షిపణిని ఎగుమతి చేసేందుకు బీడీఎల్‌ సిద్ధంగా ఉంది.

‣ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణులైన నాగ్, కొంకుర్స్‌-ఎం, మిలాన్‌-2టీలను ఎగుమతి చేస్తోంది.

‣ గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే హెలినా, స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ఫీల్డ్‌ వెపన్, తక్కువ బరువుండే టోర్పెడో, సముద్రంలో ప్రయోగించే అధిక బరువు కల్గిన టోర్పెడోలు, యాంటీ వార్‌ఫేర్‌ సూట్‌ వంటి ఆయుధ వ్యవస్థలను ఎగుమతి చేస్తోంది.

‣ పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అస్త్ర ఎంకే-1 క్షిపణుల రూ.2971 కోట్ల ఆర్డర్‌ రక్షణ శాఖ నుంచి వచ్చింది.

‣ కొంకుర్స్‌-ఎం యాంటీ ట్యాంక్‌ మిసైల్స్‌ను మూడేళ్లలో సరఫరా చేసేలా రూ.3131కోట్ల ఆర్డర్లు వచ్చాయి.

‣ బీడీఎల్‌ వద్ద రూ.13 వేల కోట్ల ఆర్డర్లున్నాయి. వీటిలో దేశీయంగా రక్షణ రంగానికి చెందినవే ఎక్కువగా ఉన్నాయి.


భారతదేశ జనాభా 140,81,81,502

జులై 11వ తేదీ నాటికి భారతదేశ జనాభా 140,81,81,502కు చేరుతుందని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా పరిశోధన కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు పరిశోధన కేంద్రం ప్రవేశ మార్గంలోని బోర్డులో నమోదు చేసింది. జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వివరాలను వెల్లడించింది.