వార్తల్లో ప్రాంతాలు

ఎమ్మెస్పీ చట్టబద్ధతకు కమిటీ ఏర్పాటు

కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించడం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామంటూ 8 నెలల క్రితం రైతులకు ఇచ్చిన హామీని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యరూపంలోకి తీసుకొచ్చింది. ప్రకృతి వ్యవసాయం (జీరో బడ్జెట్‌), మారుతున్న దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పంట సరళిలో మార్పులు, కనీస మద్దతు ధర విధానాన్ని మరింత సమర్థంగా, పారదర్శకంగా మార్చడం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా 28 మందిని నియమించింది.

వీరిలో నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌చంద్, వ్యవసాయ ఆర్థికవేత్తలు సీఎస్‌సీ శేఖర్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌), సుఖ్‌పాల్‌ సింగ్‌ (ఐఐఎం, అహ్మదాబాద్‌), జాతీయ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత భరత్‌ భూషణ్‌ త్యాగి, సంయుక్త కిసాన్‌ మోర్చాకు చెందిన ముగ్గురు రైతులు, ఇతర రైతు సంఘాలకు చెందిన గున్వంత్‌ పాటిల్, కృష్ణవీర్‌ చౌధరి, ప్రమోద్‌ కుమార్‌ చౌధరి, గుని ప్రకాశ్, సయ్యద్‌ పాషా పటేల్‌ ఉన్నారు. రైతు సహకార సంఘాల నుంచి ఇఫ్కో ఛైర్మన్‌ దిలీప్‌ సంఘాని, సీఎన్‌ఆర్‌ఐ ప్రధాన కార్యదర్శి బినోద్‌ ఆనంద్, వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సీనియర్‌ సభ్యుడు నవీన్‌ పి.సింగ్‌లకూ అవకాశం కల్పించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ డైరెక్టర్‌ జనరల్‌ పి.చంద్రశేఖర్, కశ్మీర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జేపీ శర్మ, జబల్‌పుర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రదీప్‌కుమార్‌ బిసెన్‌లను నియమించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, విద్య, ఆహారం ప్రజా పంపిణీ, సహకారం, జౌళి శాఖల కార్యదర్శులను, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/కమిషనర్లలో ఒకరికి అవకాశం కల్పించింది