గ్రంధాలు-రచయితలు

రాష్ట్రపతులపై సచిత్ర గ్రంథాల ఆవిష్కరణ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు పూర్వ రాష్ట్రపతుల అరుదైన చిత్రాలతో కూడిన మూడు పుస్తకాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌ ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ పుస్తకాల తొలి ప్రతులను కోవింద్, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీలకు కేంద్ర మంత్రి అందించినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు పుస్తకాల్లో మొదటిదైన ‘మూడ్స్‌ మూమెంట్స్‌ అండ్‌ మెమరీస్‌’లో 1950 - 2017 మధ్య రాష్ట్రపతుల దృశ్య చరిత్రను పొందుపరిచారు. రెండో పుస్తకం ది ఫస్ట్‌ సిటిజన్‌లో రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలంలోని ముఖ్య ఘట్టాలను ఛాయాచిత్ర రూపంలో ముద్రించారు. మూడోదైన ‘ఇంటర్‌ ప్రెటింగ్‌ జ్యామెట్రీస్‌: ఫ్లోరింగ్‌ ఆఫ్‌ రాష్ట్రపతి భవన్‌’లో రాష్ట్రపతి భవన్‌లో నేల మీద చిత్రించిన ఆకృతులు ఆకట్టుకునేలా రూపొందించారు.

‘జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు’ పుస్తకావిష్కరణ

కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్‌ ట్రస్టులో నిర్వహించిన కార్యక్రమంలో ‘జాతీయ కవి చక్రవర్తి దామరాజు పుండరీకాక్షుడు’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటున్న సమయంలో ఈ పుస్తకాన్ని రచయిత యల్లాప్రగడ మల్లికార్జునరావు రచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయోద్యమంలో సాహితీవేత్తల పాత్ర ఎనలేనిదని, రచయితల కలాలు వేలాది గళాలై బ్రిటిషు పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయని అన్నారు. అటువంటి వ్యక్తుల్లో ఒకరైన దామరాజు జీవితం, సాహిత్యంపై పరిశోధన జరిపి తీసుకువచ్చిన ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. గాంధీ లేనిదే సాగదు నా కాలం అంటూ నినదించిన దామరాజు స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు.

‘తెలంగాణలో భూమి, ప్రజలు’ పుస్తకావిష్కరణ

‘రాతియుగం నుంచి 1323 వరకు తెలంగాణలో భూమి, ప్రజలు’ శీర్షికతో రచించిన పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఏకే గోయల్‌ బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందజేశారు. ఈ పుస్తకాన్ని డి.సత్యనారాయణ, రేఖా పాండే, రావులపాటి మాధవిలతో కలిసి తాను రచించినట్లు సీఎస్‌కు ఆయన వివరించారు. తెలంగాణలో ప్రజలు, భూముల గురించి వివరంగా చెబుతూ పుస్తకాన్ని తీసుకువచ్చారంటూ సోమేశ్‌కుమార్‌ తెలిపారు.