అవార్డులు

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

జాతీయ చలన చిత్ర వేదికపై తెలుగు చిత్రం మెరిసింది. 2020కిగానూ 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. వీటిలో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. జీవిత కథా చిత్రాలు, చారిత్రక గాథలు జాతీయ వేదికపై మెరిశాయి. సామాజిక అంశాలను కళ్లకు కట్టేలా తెరకెక్కిన చిన్న చిత్రాలకూ జాతీయ పురస్కార గౌరవం దక్కింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జి.ఆర్‌.గోపినాథ్‌ జీవితకథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇదే తొలి జాతీయ అవార్డు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా నిలిచింది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్‌ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన ‘కలర్‌ ఫొటో’ తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ రూపొందించిన తెలుగు చిత్రం ‘నాట్యం’ ఉత్తమ నృత్యాలు, మేకప్‌ విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. వీనుల విందైన పాటలతో అలరించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పురస్కార విజేతగా నిలిచింది.

విజేతలు:-
ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు - తమిళం), అజయ్‌ దేవగణ్‌ (తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌ - హిందీ) సంయుక్తంగా
ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి (సూరరై పోట్రు)
ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు
ఉత్తమ చిత్రం (తెలుగు): కలర్‌ ఫొటో
ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రం: తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌
ఉత్తమ దర్శకుడు: దివంగత కె.ఆర్‌.సచ్చిదానందన్‌ అలియాస్‌ సచి (అయప్పనుమ్‌ కోషియుమ్‌ - మలయాళం)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (ఇందిరా గాంధీ అవార్డు): మడోన్నె అశ్విన్, మండేలా (తమిళం)
ఉత్తమ సంగీతం (పాటలు): అల వైకుంఠపురములో (తమన్‌)
ఉత్తమ నేపథ్య సంగీతం: సూరరై పోట్రు (జి.వి.ప్రకాశ్‌ కుమార్‌)
ఉత్తమ గీత రచన: మనోజ్‌ ముంతశిర్‌ (సైనా - హిందీ)
ఉత్తమ పోరాటాలు: రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీం సుందర్‌ (అయప్పనుమ్‌ కోషియుమ్‌)
ఉత్తమ సహాయ నటుడు: బిజూ మేనన్‌ (అయప్పనుమ్‌ కోషియుమ్‌)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీప్రియ చంద్రమౌళి (శివరంజనీయుం ఇన్నుమ్‌ సిల పెన్గలుమ్‌ - తమిళం)
ఉత్తమ నృత్యాలు: సంధ్యారాజు (నాట్యం - తెలుగు)
ఉత్తమ మేకప్‌ కళాకారుడు: టి.రాంబాబు (నాట్యం - తెలుగు)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నచికేత్‌ బర్వే, మహేష్‌ షెర్లా (తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: అనీశ్‌ నడోడి (కప్పేలా - మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ (శివరంజనీయుం ఇన్నుమ్‌ సిల పెన్గలుమ్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: షాలిని ఉషా నాయర్, సుధా కొంగర (సూరరై పోట్రు)
ఉత్తమ సంభాషణల రచయిత: మడోన్నె అశ్విన్‌ (మండేలా - తమిళం)
ఉత్తమ ఛాయాగ్రహణం: సుప్రతిమ్‌ భోల్‌ (అవిజత్రిక్‌ - బెంగాలీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్‌ దేశ్‌పాండే (మి వసంత్రవో - మరాఠీ)
ఉత్తమ నేపథ్య గాయని: నంచమ్మ (అయప్పనుమ్‌ కోషియుమ్‌)
సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం: ఫ్యునెరల్‌ (మరాఠీ)
పర్యావరణ పరిరక్షణపై ఉత్తమ చిత్రం: తలెదంద (కన్నడ)
ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠీ)

టెస్సీ థామస్‌కు లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు

డీఆర్‌డీఓ ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్‌కు లోకమాన్య తిలక్‌ జాతీయ అవార్డు(2022)ను అందజేయనున్నారు. ఆగస్టు 8న పుణెలో జరిగే కార్యక్రమంలో దీనిని ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్‌ స్మారక ట్రస్టు ఏటా ఈ అవార్డును ఇస్తోంది. స్వదేశీ సిద్ధాంతాన్ని వ్యాప్తిచేయడంలో కృషిచేసినందుకుగాను టెస్సీ థామస్‌ను ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు ట్రస్టు అధ్యక్ష, ఉపాధ్యక్షులు దీపక్‌ తిలక్, రోహిత్‌ తిలక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనుంది. ఆగస్టు 5న వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరిసారిగా 2001లో ప్రముఖ భారత-అమెరికన్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ అరుణ్‌నేత్రావలికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వలేదు. ఉస్మానియా యూనివర్సిటీ 105 ఏళ్ల చరిత్రలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించింది. ఇప్పటివరకు 47 మందికి మాత్రమే గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది. తొలిసారిగా 1917లో నవాబ్‌ జమాదుల్‌ ముల్క్‌ బహదూర్‌కు ఇచ్చింది. తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్, సి.రాజగోపాలాచారి, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బీఆర్‌ అంబేడ్కర్, డాక్టర్‌ వై.నాయుడమ్మ, డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వంటి ప్రముఖులెందరో ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. వారి సరసన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేరనున్నారు. తెలుగు వ్యక్తి అయిన ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్‌ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేస్తూ ఓయూ నిర్ణయం తీసుకుంది.

ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌కు జియో సైన్స్‌ అవార్డు

జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) సంచాలకులు డాక్టర్‌ వి.ఎం.తివారీ ప్రతిష్ఠాత్మక జియో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జాతీయ అవార్డు అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

అమ్మంగి వేణు గోపాల్‌కు డా. సినారె పురస్కారం ప్రదానం

తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ప్రముఖ కవి, విమర్శకుడు డా.అమ్మంగి వేణుగోపాల్‌కు డా.సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని పరిషత్తు పక్షాన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రదానం చేశారు. రూ.25 వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అలాగే సినారె కుటుంబం ఆధ్వర్యంలోని శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు వారు సొంత ఖర్చుతో ముద్రించిన మైదాకు వసంతం (కోట్ల వనజాత), ఉషోదయం (గంటి ఉషాబాల), పథ గమనం (షేక్‌ సలీమా) కథా సంపుటాలు, అక్షరనేత్రాలు (లహరి), స్నేహగానం (డా.కొమర్రాజు రామలక్ష్మి), మౌనమేఘాలు (స్వాతికృష్ణ సన్నిధి), చైతన్య బాలు (దరిపల్లి స్వరూప) కవితా సంపుటాలను, ఆకురాయి (ఉప్పల పద్మ) విమర్శ వ్యాసాల సంపుటిని మంత్రి ఆవిష్కరించారు.

కౌశిక్‌ రాజశేఖరకు గ్లోబల్‌ ఎనర్జీ అవార్డు

అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కౌశిక్‌ రాజశేఖర ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. విద్యుత్తు ఉత్పాదక ఉద్గారాలను తగ్గించేటపుడు విద్యుత్తు రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకుగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల నుంచి 119 నామినేషన్లు రాగా, ముగ్గురిని మాత్రమే గ్లోబల్‌ ఎనర్జీ అసోసియేషన్‌ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అక్టోబరు 12 - 14 తేదీల మధ్య మాస్కోలో జరిగే రష్యన్‌ ఎనర్జీ వారోత్సవాల్లో ఈ అవార్డులను అందజేస్తారు. దక్షిణ భారతదేశంలోని ఓ కుగ్రామం నుంచి వచ్చి రాజశేఖర ఈ స్థాయికి ఎదిగారు.

సంకోజు వేణుకు దాశరథి పురస్కారం

సాహితీవేత్త సంకోజు వేణును తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పురస్కారం కింద రూ.1,01,116 నగదు పారితోషికంతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. జులై 22న కృష్ణమాచార్య జయంత్యుత్సవాల్లో దీన్ని ప్రదానం చేస్తారు. దాశరథి పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏటా సాహితీవేత్తలు, కవులు, రచయితలకు అందజేస్తోంది. నల్గొండకు చెందిన సంకోజు వేణు 1972 నుంచి పలు కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథాలు రచించారు. 1995లో ‘మనిషిగా పూచే మట్టి’, 2001లో ‘మనం’, 2008లో నేల కల, ప్రాణ ప్రదమైన కవితా సంపుటిలను ప్రచురించారు. 2008లో ‘స్పర్శ’ కథల సంపుటి ప్రచురించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించారు. 2007 వరకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2005 సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ పౌరశాస్త్ర పాఠ్యప్రణాళిక సభ్యునిగా, రచయితగా వ్యవహరించారు.

ప్రతిభారాయ్‌కి ‘సినారె’ పురస్కారం

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మహాకవి డా.సి.నారాయణ రెడ్డి పేరిట సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక జాతీయ సాహిత్య పురస్కారాన్ని 2022లో ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.ప్రతిభారాయ్‌కు అందజేయనున్నారు. జులై 29న హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగే డా.సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవంలో ఆమెకు పురస్కారం ప్రదానం చేస్తారని ట్రస్టు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య వెల్లడించారు.

నార్మ్‌కు సర్దార్‌ పటేల్‌ జాతీయ పురస్కారం

రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ (నార్మ్‌)కు ప్రతిష్ఠాత్మక సర్దార్‌ పటేల్‌ జాతీయ ఉత్తమ పురస్కారం దక్కింది. దిల్లీలో జరిగిన ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నుంచి ఈ పురస్కారాన్ని నార్మ్‌ సంచాలకుడు సీహెచ్‌ శ్రీనివాసరావు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఐసీఏఆర్‌కు చెందిన వ్యవసాయ పరిశోధన సంస్థల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు నార్మ్‌కు ఈ పురస్కారం దక్కిందని శ్రీనివాసరావు తెలిపారు.

విశాఖ ‘దిశా కౌన్సెలింగ్‌’ కేంద్రానికి జాతీయ స్థాయిలో రెండో స్థానం

విశాఖ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న ‘దిశా కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ నీడ్‌’ (డీసీసీ ఫర్‌ విన్‌) కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘గవర్నెన్స్‌ నౌ’ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసు వ్యవస్థలతో నిర్వహించిన రెండో ‘ఇండియా పోలీస్‌ వర్చువల్‌ సమ్మిట్‌’లో విశాఖ కమిషనరేట్‌ సేవలకుగాను రెండో స్థానాన్ని ప్రకటించి అవార్డుకు ఎంపిక చేసింది. నగరంలో పలు రకాలుగా మోసపోతున్న మహిళలకు భరోసా కల్పించేందుకు ఈ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. పూర్వ సీపీ మనీశ్‌కుమార్‌ సిన్హా నగరంలోని స్వర్ణ భారతి స్టేడియంలోని ఓగదిలో కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ నుంచి ఒక మహిళా ఏసీపీ, శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రాజెక్టు అధికారిణి, జీవీఎంసీ నుంచి ఒక ఉప ప్రాజెక్టు అధికారిణి, న్యాయ నిపుణురాలు, ఒక మనస్తత్వ శాస్త్ర నిపుణురాలితో బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని చెబితే చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఎక్కడా లేని విధంగా మహిళలకు అత్యంత సౌకర్యంగా ఉండేలా పక్కా ప్రణాళికతో ‘డీసీసీ ఫర్‌ విన్‌’ ప్రారంభించారు. ప్రారంభం నుంచి ప్రస్తుత సంవత్సరం జనవరి వరకు కార్యక్రమం జరిగిన తీరును నిర్వాహకులు విశ్లేషించి జాతీయ స్థాయిలో ‘మహిళా భద్రత’ కేటగిరీలో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని ఖరారు చేశారు. దిశా కౌన్సెలింగ్‌ కేంద్రం ప్రారంభమైన తేది: 10.12.2020 ఎక్కడ?: స్వర్ణభారతి స్టేడియం, గదినెంబరు 12 కౌన్సెలింగ్‌ సమయాలు: ప్రతి మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి అందిన మొత్తం ఫిర్యాదులు: 297 పరిష్కరించినవి: 203

రికపాటి నరసింహారావుకు ‘సంస్కార్‌’ అవార్డు ప్రదానం

మానవ జాతి సంపూర్ణ వికాసానికి విద్యే మూలమని, దానిని సంపాదన మార్గంగా చూస్తున్న ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రవచనకారుడు, భాషావేత్త, ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావుకు పెంటమరాజు సుశీల, రంగారావు స్మారక ‘సంస్కార్‌’ అవార్డును ఉప రాష్ట్రపతి ప్రదానం చేశారు.

ఏఎస్‌ఐ రాముడికి ప్రతిభా పురస్కార ప్రదానం

దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న ఉందకోటి రాముడు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. దిల్లీ పోలీస్‌ కమిషనరేట్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు పురస్కారాలు ప్రదానం చేశారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్, ఉందకోటి రాముడుకు ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రాముడు 1994లో దిల్లీ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. 2018 నుంచి దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో ఏఎస్‌ఐగా సేవలు అందిస్తున్నారు.

సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ‘రోశయ్య స్మారక జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం

మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా శ్రీవాసవీ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ‘రోశయ్య స్మారక జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆమెకు ఈ అవార్డును అందజేశారు.

ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానం

తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఎక్స్‌లెన్స్‌ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉత్తమ సేవలందిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్న 19 పరిశ్రమలకు పురస్కారాలను అందజేశారు.

భారత్‌ - బ్రిటన్‌ అవార్డుల ప్రదానోత్సవం

వివిధ రంగాల్లో విజయ శిఖరాలను అధిరోహించిన భారత సంతతి వారికి అవార్డులిచ్చి సత్కరించిన సభలో బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42) తన భారతీయ మూలాల గురించీ, ఘన భారతీయ వారసత్వం గురించీ సగర్వంగా చాటుకున్నారు. లండన్‌ సమీపంలోని ఫెయిర్‌ మాంట్‌లో జరిగిన భారత్‌ - బ్రిటన్‌ అవార్డుల ప్రదానోత్సవ సభలో మాట్లాడుతూ.. తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చి స్థిరపడిన తమ కుటుంబం కష్టించి పనిచేసిపైకి ఎదిగిన విధాన్ని వివరించారు. తన తల్లికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తాత, అమ్మమ్మ తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్‌కు వలసవచ్చారని ఆయన వెల్లడించారు. వలస వచ్చిన వారు గొప్ప వ్యాపారవేత్తలుగా, గొప్ప శాస్త్రజ్ఞులుగా, గొప్ప కళాకారులుగా ఎదగాలనుకుంటే, వారు కష్టపడితే చాలు వారి కలలను పండించే కర్మ భూమి బ్రిటన్‌ అని సునాక్‌ పేర్కొన్నారు.

తెలంగాణ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త జాతీయ స్థాయి నేషనల్‌ జియోసైన్స్‌ అవార్డ్డుకు ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన ద్రోణ శ్రీనివాస శర్మ హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ)లో సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. మౌలిక భూభౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను ఆయనకు 2019 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నేషనల్‌ జియో సైన్స్‌ అవార్డు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. - దేశంలో బంగారు నిక్షేపాలపై ఆయన పలు పరిశోధనలు చేశారు. కర్ణాటకలోని హర్టిలో బంగారు నిక్షేపాలను గుర్తించేందుకు తొలిసారిగా శర్మ కొత్త సాంకేతికతను ఉపయోగించారు. అది భవిష్యత్‌ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడనుంది. శ్రీనివాసశర్మ పరిశోధనల వివరాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఒడిశాలోని సింగబంలో పరిశోధనల్లో ఆయన నిమగ్నమయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2003లో ఆయన డాక్టరేట్ పట్టా పొందారు. కాగా ఎన్‌జీఆర్‌ఐకు చెందిన ఆనంద్‌ ప్రకాశ్‌సింగ్, ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌కు చెందిన డాక్టర్‌ వేమవరపు ఎంఎస్‌ఆర్‌ మూర్తి నేషనల్‌ జియో సైన్స్‌ అవార్డులకు ఎంపికయ్యారు.

హైదరాబాద్‌ వైద్యుడు సాయిరాంకు డయానా పురస్కారం

బ్రిటన్‌లో ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యుడిని ప్రతిష్ఠాత్మక డయానా పురస్కారం వరించింది. కిమ్స్‌ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురాం, డాక్టర్‌ వైజయంతిల కుమారుడు డాక్టర్‌ సాయిరాం పిల్లారిశెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. బ్రిటన్‌లో దృశ్య మాధ్యమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. డయానా పేరిట 1999లో నెలకొల్పిన ఈ అవార్డును బ్రిటన్‌లో యువతకు లభించే అత్యున్నత గౌరవంగా భావిస్తారు. దార్శనికత, సామాజిక సేవ, యువతపై ప్రభావం, తదితర అంశాలను పరిగణిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ‣ ఇతర దేశాల నుంచి యూకేకు వైద్యవిద్యను అభ్యసించడానికి వచ్చే, సరైన మార్గదర్శనం లేని వారి కోసం ‘బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (బిడా)’ను స్థాపించారు. ఈ సంఘంలో విద్యార్థి విభాగాన్ని స్థాపించడంలో డా.సాయిరాం కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తెలంగాణలో స్థాపించిన ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రానికి సంబంధించిన యాప్‌ రూపకల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు. ఈ యాప్‌పై బ్రిటిష్‌ పార్లమెంట్‌లో మాట్లాడే అరుదైన అవకాశాన్ని సాయిరాం దక్కించుకున్నారు. వీటన్నింటినీ పరిగణిస్తూ సాయిరాంను డయానా పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. పురస్కార గ్రహీతలకు డయానా - చార్లెస్‌ల కుమారుడు ప్రిన్స్‌ ఆండ్రూ అభినందన సందేశం పంపించారు.