ఆర్ధిక రంగం

కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ద్రవ్యలోటు గణాంకాలు

కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022-23 మొదటి త్రైమాసికం చివరినాటికి ద్రవ్యలోటు విలువపరంగా రూ.3.51 లక్షల కోట్లుగా నమోదైంది. ఏప్రిల్‌- జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు 2022-23 బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యంలో 21.2 శాతానికి చేరింది. 2021-22 ఇదే కాలంలో ద్రవ్యలోటు అప్పటి (2021-22) బడ్జెట్‌ లక్ష్యంలో 18.2 శాతంగా ఉంది. ప్రభుత్వం మొత్తం ఆదాయాలు, వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. 2023 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేశారు. 2021-22లో ఇది 6.71 శాతంగా ఉంది. ‣ సీజీఏ గణాంకాల ప్రకారం.. జూన్‌ చివరినాటికి ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.5,96,040 కోట్లు లేదా 2022-23 బడ్జెట్‌ అంచనాలో 26.1 శాతంగా నమోదైంది. 2021-22 జూన్‌ చివరినాటికి మొత్తం ఆదాయం 2021-22 బడ్జెట్‌ అంచనాలో 27.7 శాతంగా ఉంది. ప్రభుత్వ మొత్తం వ్యయాలు రూ.9,47,911 కోట్లు లేదా బడ్జెట్‌ అంచనాలో 24 శాతంగా నమోదయ్యాయి. 2021-22 జూన్‌ చివరికి వ్యయాలు బడ్జెట్‌ అంచనాలో 23.6 శాతంగా ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ.16,61,196 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.

దేశంలో అత్యంత మహిళా సంపన్నురాలిగా రోష్ని నాడార్‌

దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకుందని కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ - హురున్‌ విడుదల చేసిన జాబితా తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వృత్తి జీవితాన్ని వదులుకుని, పదేళ్ల కిందట నైకా బ్రాండ్‌ను ప్రారంభించిన ఫల్గుణి నాయర్‌ సొంతంగా ఎదిగిన మహిళల్లో అగ్రపీఠాన్ని అధిరోహించారు. ఒక్క ఏడాదిలో నాయర్‌ (59) సంపద ఏకంగా 963 శాతం పెరిగి రూ.57,520 కోట్లకు చేరుకుంది. మహిళా సంపన్నుల మొత్తం జాబితాలో రెండో స్థానం ఈమెదే. ‘బయోకాన్‌’ కిరణ్‌ మజుందార్‌ షా నికర సంపద 21 శాతం తగ్గి రూ.29,030 కోట్లకు చేరడంతో ఒక స్థానం తగ్గి మూడో ర్యాంకులో ఉన్నారు. నాలుగో స్థానంలో హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ శాశ్వత డైరెక్టర్‌ (కమర్షియల్‌) నీలిమ ప్రసాద్‌ (రూ.28,180 కోట్లు) నిలిచారు. ఈ జాబితాలో దిల్లీ నుంచి 25 మంది ఉండగా, ముంబయి (21), హైదరాబాద్‌ (12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వొడాఫోన్‌ ఐడియా సీఈఓగా అక్షయ మూంద్రా

వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా అక్షయ మూంద్రా నియమితులయ్యారు. ప్రస్తుతం చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పించి, మూడేళ్ల కాలానికి సీఈఓగా నియమించినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుత ఎండీ - సీఈఓ రవీందర్‌ టక్కర్‌ పదవీ కాలం ఆగస్టు 18న ముగియనుంది. ఆగస్టు 19 నుంచి అక్షయ నియామకం అమల్లోకి వస్తుందని వీఐఎల్‌ తెలిపింది. రవీందర్‌ టక్కర్‌ ఇకపై నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ - నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టరు హోదాలో కొనసాగుతారని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సంస్థ సమాచారం ఇచ్చింది. ఎండీ - సీఈఓగా వేతనం తీసుకోకుండానే రవీందర్‌ బాధ్యతలు నిర్వహించినట్లు వీఐఎల్‌ తెలిపింది.

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి 4వ స్థానం: ఫోర్బ్స్‌

అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను ఆయన వెనక్కి నెట్టారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ కుబేరుల జాబితా ప్రకారం.. అదానీ సంపద 116.30 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9,30,000 కోట్లు) కాగా గేట్స్‌ సంపద విలువ 104.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8,36,800 కోట్లు). గత 24 గంటల వ్యవధిలో అదానీ సంపద 337 మిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. ‣ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద విలువ 235.80 బిలియన్‌ డాలర్లు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 90 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,20,000 కోట్లు) సంపదతో ఈ జాబితాలో 10వ స్థానం పొందారు.

దేశంలోనే తెలుగు రాష్ట్రాల ద్రవ్యోల్బణం జూన్‌లో అత్యధికం: ఆర్‌బీఐ

తెలుగు రాష్ట్రాల ద్రవ్యోల్బణం రేటు జూన్‌లో దేశంలోనే అత్యధికంగా ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా 10.05 శాతం ఉండగా 8.6 శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఏపీ ఉన్నట్లు విశ్లేషించింది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు 10.93 శాతం కాగా పట్టణ ప్రాంతాల్లో ఇది 9.23 శాతంగా ఉంది. జూన్‌లో ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు 8.65 శాతం కాగా పట్టణ ప్రాంతాల్లో ఇది 8.66 శాతంగా ఉంది. మేలో తెలంగాణ ప్రత్యేక డ్రాయింగ్‌ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్‌)ని రూ.711 కోట్ల సగటుతో 31 రోజుల పాటు ఉపయోగించుకోగా, వేజెస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులను రూ.1,295 కోట్ల సగటుతో 31 రోజులు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని రూ.912 కోట్ల సగటుతో 18 రోజులు వినియోగించుకున్నట్లు వెల్లడించింది.

ఎన్‌టీపీసీ, ఐఓసీ సంయుక్త సంస్థగా ఏర్పాటుకు ఒప్పందం

సంయుక్త సంస్థను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్‌టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐఓసీ రాబోయే ప్రాజెక్టుల కోసం అవసరమయ్యే విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు ఈ సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఇరు కంపెనీలు వెల్లడించాయి. దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సామర్థ్యాలను పెంచడమే లక్ష్యమని తెలిపాయి. ఐఓసీ రిఫైనరీల్లో పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌లను ఈ సంస్థలు నెలకొల్పనున్నాయి. దేశంలో శుద్ధ ఇంధనం దిశగా ఇది గొప్ప అడుగని ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య వెల్లడించారు.

బ్యాంక్‌ ఇండొనేషియాతో ఆర్‌బీఐ ఒప్పందం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంక్‌ ఇండొనేషియాలు (బీఐ) తమ చెల్లింపు వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని విస్తరింపజేసుకునేందుకు ఒక అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్‌ ఫైనాన్షియల్‌ ఇన్నొవేషన్, నగదు అక్రమ బదిలీ నిరోధం, తీవ్రవాద ఫైనాన్సింగ్‌పై పోరాటం (ఏఎంఎల్‌ - సీఎఫ్‌టీ) చేయనున్నాయి. ఈ ఒప్పందంతో ఆర్‌బీఐ, బీఐల సంబంధాలు బలోపేతం కావడంతో పాటు సమాచార మార్పిడి జరగనుంది. కేంద్ర బ్యాంకింగ్, చెల్లింపు వ్యవస్థలు, చెల్లింపు సేవల్లో డిజిటల్‌ ఇన్నొవేషన్, ఏఎంఎల్‌ - సీఎఫ్‌టీ కోసం నియంత్రణ, పర్యవేక్షణ నిబంధనల్ని కలిపి రూపొందించనున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్, బీఐ గవర్నర్‌ పెర్రీ వార్జియో సమక్షంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేవవ్రత పాత్రా, బీఐ డిప్యూటీ గవర్నర్‌ డోడీ బూడి వాలుయోలు ఈ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడిగా అనిల్‌ అగర్వాల్‌

ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా జీవకా ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ అగర్వాల్‌ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఎఫ్‌టీసీసీఐలో నిర్వహించిన 105వ వార్షిక సాధారణ సమావేశంలో అనిల్‌ అగర్వాల్‌ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు ఈయన సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సుధాకర్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మీలా జయదేవ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

జీఎస్టీ వసూళ్లలో 56% వృద్ధి

జీఎస్టీ ద్వారా జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,44,616 కోట్లు వసూలయ్యాయి. 2021 జూన్‌తో పోలిస్తే ఇది 56% అధికమని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలైన రూ.1,67,540 కోట్ల తర్వాత ఒక నెలలో వసూలైన గరిష్ఠ మొత్తం ఇదేనని ఆర్థిక శాఖ పేర్కొంది. - జూన్‌లో వసూలైన మొత్తంలో సీజీఎస్టీ కింద రూ.25,306 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.32,406 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.75,887 కోట్లు (ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వచ్చిన మొత్తం రూ.40,102 కోట్లు), సెస్‌ కింద రూ.11,018 కోట్లు (ఇందులో దిగుమతి వస్తువులపై రూ.1,197 కోట్లు) ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం సీజీఎస్టీ కింద రూ.29,588 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.24,235 కోట్లు పంపిణీ చేసింది. ఐజీఎస్టీ కింద తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 50:50 నిష్పత్తిలో రూ.27 వేల కోట్లను పంచింది. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు దాటడం ఇది అయిదోసారి.