రాష్ట్రీయం - ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా సంతోషరావు

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కె.సంతోషరావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నం) సీఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో న్యాయాధికారులుగా పని చేస్తున్న వీరికి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం నిర్ణయించి కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 24 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌ సుబానీ షేక్‌ పేరును కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయనతో పాటు, ఈ ఏడుగురి పేర్లకూ కేంద్రం ఆమోదముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది. గత రెండు రోజుల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం అలహాబాద్‌ హైకోర్టుకు 9 మంది, కర్ణాటక హైకోర్టుకు అయిదుగురు న్యాయాధికారుల పేర్లను సిఫార్సు చేసింది.

ఎంఎస్‌ఎంఈలకు యూనియన్‌ బ్యాంకుతో ఏపీఐఐసీ ఒప్పందం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో యూనియన్‌ బ్యాంకు ద్వారా మంజూరు చేసేలా ఆ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్ర రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ ఛైర్మన్, ఎండీ సుబ్రమణ్యం తెలిపారు. ఏపీఐఐసీ గుర్తించిన 39 పారిశ్రామిక పార్కుల్లోని ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించడంలో బ్యాంకు భాగస్వామ్యం కానుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం, యూనియన్‌ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బ్రహ్మానందరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఏపీకి ఉత్తమ ప్రింట్‌ ప్రమోషనల్‌ మెటీరియల్‌ అవార్డు

పర్యాటక రంగంలో రాష్ట్రానికి ఉత్తమ ప్రింట్‌ ప్రమోషనల్‌ మెటీరియల్‌ అవార్డు లభించిందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తెలిపింది. జులై 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ట్రావెల్‌ టూరిజం ఫెయిర్‌’లో ప్రింట్‌ ప్రమోషనల్‌ మెటీరియల్‌ విభాగంలో రాష్ట్రానికి అవార్డు లభించినట్లు ఏపీటీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కన్నబాబు వెల్లడించారు.

భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఆవిష్కరణ

బ్రిటిష్‌ పాలకుల్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశంలోని కోట్లాది ఆదివాసీల ధైర్యానికి, స్థైర్యానికి, సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ‘దమ్ముంటే నన్ను ఆపండి’ అని గర్జించి బ్రిటిష్‌ సైనికుల తుపాకులకు ఎదురొడ్డిన ఆ మహావీరుడి ధైర్యసాహసాలే స్ఫూర్తిగా, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై 130 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.