సర్వేలు

మానవాభివృద్ధి సూచీలో మరింత దిగువకు భారత్‌: యూఎన్‌డీపీ

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) తాజా నివేదిక అభిప్రాయపడింది. అంతర్జాతీయ పరిణామాల ఫలితాలు భారత్‌లోనూ ప్రతిబింబించాయని పేర్కొంది. ఆరోగ్యం, విద్య, సగటు ఆదాయం అనే మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని గణించిన మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)-2021లో భారత్‌ ర్యాంక్‌ 132గా వెల్లడించింది. మొత్తం 191 దేశాలతో ఈ జాబితా రూపొందింది. 2020 మానవాభివృద్ధి సూచీలో 131 ర్యాంక్‌ పొందిన మన దేశం మరో స్థానం దిగువకు వెళ్లింది. ఆ ఏడాది హెచ్‌డీఐ జాబితాలో మొత్తం 189 దేశాలున్నాయి. 2021లో మన దేశ హెచ్‌డీఐ విలువ 0.633 కాగా అంతకు ఏడాది క్రితం (2020లో) ఇది 0.642గా ఉండడం గమనార్హం. సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాల నుంచి 67.2 ఏళ్లకు పడిపోవడమే దీనికి కారణమని యూఎన్‌డీపీ నివేదిక పేర్కొంది.

పట్టణాల్లో కాలుష్య కాసారాలవుతున్న నీటి వనరులు: నీతి ఆయోగ్‌

శరవేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ వల్ల వెలువడుతున్న వ్యర్థ జలాలు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి. వీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడంపై దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్‌ సూచించింది. ఇప్పటికే మన దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడుతున్న మురుగు, వ్యర్థ జలాలతో నదులు, చెరువులు, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని ‘అర్బన్‌ వేస్ట్‌వాటర్‌ సినారియో ఇన్‌ ఇండియా’ పేరుతో విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 చోట్ల నీటి కాలుష్యాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరీక్షించింది. 13 శాతం తీవ్రంగా, 17 శాతం మధ్యస్థంగా కాలుష్యం ఉన్నట్లు తేలింది. భారలోహాలు, ఆర్సినిక్, ఫ్లోరైడ్స్, విషపూరిత రసాయనాలున్నట్లు పలుచోట్ల గుర్తించారు. భూగర్భ జలాలు ఎక్కువగా కలుషితమైనట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న 1195 శుద్ధి ప్లాంట్లలో 102 పనిచేయడం లేదని గుర్తించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి శుద్ధి కోసం చేపడుతున్న చర్యల గురించి నీతి ఆయోగ్‌ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. నెక్నాంపూర్‌ చెరువు నీటిలో కదులుతూ శుద్ధి చేసే ‘ఫ్లోటింగ్‌ ట్రీట్‌మెంట్‌ వెట్‌ల్యాండ్‌’ వల్ల నీటి శుద్ధి నిర్వహణ మెరుగ్గా ఉందని తెలిపింది. ఈ చెరువు నీటి శుద్ధి కోసం 3000 చదరపు అడుగుల రాఫ్ట్‌ ఏర్పాటు చేసి దానిపై 3500 మొక్కలను నాటారు. ఇది నీటిలో కదులుతుంటే మొక్కల అడుగు భాగాలు నీటిని శుద్ధి చేస్తుంటాయి.


గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో6 స్థానాలు మెరుగైన భారత్‌

పలు అంశాల్లో రాణించడంతో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2022లో ఆరు స్థానాలు మెరుగు పరచుకుని మనదేశం 40వ ర్యాంకు సాధించింది. జెనీవాకు చెందిన వరల్డ్‌ ఇంçలెక్చువల్‌ ప్రోపర్టీ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూపీఐఓ) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. స్విట్జర్లాండ్, అమెరికా, స్వీడన్, బ్రిటన్, నెదర్లాండ్స్‌ ప్రపంచంలోనే అత్యంత వినూత్నత గల ఆర్థిక వ్యవస్థలుగా నిలిచినట్లు ఆ నివేదిక తెలిపింది. అగ్రశ్రేణి -10 దేశాల్లో చైనా కూడా ఉంది. వర్థమాన దేశాలు బలమైన పనితీరును స్థిరంగా కొనసాగిస్తున్నాయని.. ముఖ్యంగా భారత్‌ (40), టర్కీ (37) తొలిసారిగా టాప్‌-40లోకి చేరాయని ఆ నివేదిక చెబుతోంది. కెనడా తిరిగి టాప్‌-15లోకి చేరిందని వివరించింది.తాజా పరిణామంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ‘వినూత్నత విషయంలో మరింత ప్రగతి సాధించడానికి దేశం సిద్ధంగా ఉంది. మా వినూత్న రూపకర్తలను చూసి గర్విస్తున్నాం. మరింత ఎత్తుకు చేరాలని భావిస్తున్నామ’ని ట్వీట్‌ చేశారు. ఏడేళ్లలో 41 స్థానాలను మెరుగుపరచుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయెల్‌ పేర్కొన్నారు. 2015లో 81వ స్థానంలో; 2021లో 46వ స్థానంలో భారత్‌ ఉంది. ఇన్‌స్టిట్యూషన్లు, మానవ వనరులు-పరిశోధన, మౌలిక వసతులు, మార్కెట్‌ ఆధునికీకరణ, వ్యాపార నవీకరణ, పరిజ్ఞానం, సాంకేతిక ఉత్పత్తులు, ఉత్పత్తుల సృష్టి వంటి పలు అంశాల ఆధారంగా ఈ సూచీని లెక్కించారు.

గంజాయిలో ఏపీకి ప్రథమ స్థానం

ఆంధ్రప్రదేశ్‌లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక - 2021 పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. 2021లో స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలపై ఎన్‌సీబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి దొరికింది. ఇందులో 2,00,588 కిలోలను (26.75%) ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పొరుగు రాష్ట్రం ఒడిశా (1,71,713 కిలోలు) ఉంది.

- దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయిలో 50% ఈ రెండు రాష్ట్రాల్లోనిదే. తెలంగాణలో 35,270 కిలోల గంజాయి, 0.03 కిలోల హషీష్, 18.5 లీటర్ల హషీష్‌ ఆయిల్, 0.03 కిలో హెరాయిన్, 0.01 కిలోల కెటామైన్, 31 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 7,618 కిలోల హెరాయిన్‌ దొరకగా, అందులో అత్యధికంగా 3,334.96 కిలోలు గుజరాత్‌లో, 1,337.29 కిలోలు ఉత్తర్‌ప్రదేశ్‌లో, 501 కిలోలు మేఘాలయలో స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాదిలో కేరళలో అత్యధికంగా 339.93 కిలోల హెరాయిన్‌ దొరికింది. డ్రగ్స్‌ అత్యధిక ప్రభావం ఉన్నట్లు ప్రచారం జరిగిన పంజాబ్‌లో 443.51 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.


తగ్గిన శిశు మరణాల రేటు

దేశంలో శిశు మరణాల రేటు అయిదేళ్లలో 9 పాయింట్ల మేర తగ్గినట్లు విడుదలైన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం - 2020 నివేదిక వెల్లడించింది. 2015లో ఇది 37 ఉండగా 2020 నాటికి 28కి తగ్గింది. ఏటా సగటున 1.8 పాయింట్ల తగ్గుదల నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తగ్గుదల 41 నుంచి 31కి చేరగా, పట్టణ ప్రాంతాల్లో 25 నుంచి 19కి తగ్గింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పది పాయింట్లు, పట్టణ ప్రాంతాల్లో ఆరు పాయింట్ల మేర తగ్గుదల నమోదైందన్న మాట. 2014 నుంచి ఇప్పటివరకు నవజాత శిశువుల మొదలు అయిదేళ్లలోపు పిల్లల వరకూ అన్ని విభాగాల్లోనూ తగ్గుదల కనిపిస్తూ వచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యసాధనలో ఇదో ముందడుగుగా పేర్కొంది.

ముఖ్యాంశాలు.:-
- శిశు మరణాలు తగ్గినా జాతీయ స్థాయిలో ప్రతి 35 మంది శిశువుల్లో ఒకరు ఏడాదిలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 32 మందిలో ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 52 మందిలో ఓ చిన్నారి ఏడాది తిరగకముందే కన్నుమూస్తోంది.

- అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు 2019 - 2020 మధ్యకాలంలో 35 నుంచి 32కు తగ్గింది. ఇందులో మగపిల్లల మరణాలు 4 పాయింట్లు, ఆడపిల్లల మరణాలు 3 పాయింట్ల మేర తగ్గాయి.

- జనన సమయంలో లింగనిష్పత్తి 2017 - 19 మధ్యకాలంలో 904 ఉండగా, 2018 - 20 నాటికి అది 907కు చేరి 3 పాయింట్ల పెరుగుదల నమోదు చేసింది. ఈ విషయంలో కేరళ (974) తొలిస్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్‌ (844) చివరిస్థానంలో నిలిచింది.

- సంతాన సాఫల్య రేటు 2019 నుంచి 2020 మధ్య కాలంలో 2.1 నుంచి 2.0కు పడిపోయింది. ఇందులో బిహార్‌ (3.0) తొలి స్థానంలో ఉండగా, దిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు (1.4) చివరి స్థానంలో నిలిచాయి.

- క్రూడ్‌ బర్త్‌రేట్‌ (ప్రతి వెయ్యి మంది జనాభాకు) జాతీయ స్థాయిలో 2020లో 19.5 మేర నమోదైంది. 2019తో పోలిస్తే ఇందులో 0.2 పాయింట్ల తగ్గుదల కనిపించింది. బిహార్‌లో (25.5) అత్యధిక క్రూడ్‌ బర్త్‌రేట్‌ నమోదు కాగా, కేరళలో (13.2) అత్యల్పంగా నమోదైంది.

- 2020లో క్రూడ్‌ డెత్‌రేట్‌ (ప్రతి వెయ్యి మంది జనాభాకు) 6.0గా నమోదైంది. ఇందులో ఛత్తీస్‌గడ్‌ (7.9), దిల్లీ (3.6) తొలి, చివరి స్థానాల్లో నిలిచాయి.


ప్రపంచ అగ్రగామి-10 ఆహార డెలివరీ సంస్థల్లో స్విగ్గీ, జొమాటో

ప్రపంచంలో అగ్రగామి 10 ఆహార డెలివరీ కంపెనీల్లో భారతీయ సంస్థలు స్విగ్గీ, జొమాటో చోటు దక్కించుకున్నాయి. కెనడాకు చెందిన ఈటీసీ గ్రూప్‌ రూపొందించిన ఈ జాబితాలో చైనా సంస్థ మైతువాన్‌ అగ్రస్థానం పొందించింది. రెండు, మూడు స్థానాలు బ్రిటన్‌కు చెందిన డెలివెరూ, అమెరికా సంస్థ ఉబర్‌ ఈట్స్‌ దక్కించుకున్నాయి.

- జాబితాలో నాలుగు నుంచి 8 వరకు స్థానాల్లో ఎలె.మీ, డోర్‌డ్యాష్, జస్ట్‌ ఈట్‌ టేక్‌అవే/గ్రబ్‌హబ్, డెలివరీ హీరో, ఐఫుడ్‌ సంస్థలు ఉన్నాయి.

- భారత్‌కు చెందిన స్విగ్గీ, జొమాటో 9, 10వ స్థానాల్లో నిలిచాయి. దేశంలోని 100కు పైగా యూనికార్న్‌ (రూ.8000 కోట్ల విలువైన)లలో ఇవీ ఉన్నాయి.


టైప్‌-1 మధుమేహం ప్రబలంగా ఉన్న టాప్‌-10 దేశాల్లో భారత్‌

ప్రపంచవ్యాప్తంగా టైప్‌-1 మధుమేహ బాధితుల సంఖ్య గత ఏడాది 84 లక్షలుగా ఉన్నట్లు లాన్సెట్‌ ఓ అధ్యయన నివేదికలో వెల్లడించింది. 2040 కల్లా ఆ సంఖ్య కనిష్ఠంగా 1.35 కోట్ల నుంచి గరిష్ఠంగా 1.74 కోట్ల వరకు చేరుకునే ముప్పుందని తెలిపింది. టైప్‌-1 మధుమేహులు అత్యధికంగా ఉన్న 10 దేశాల్లో భారత్‌ కూడా ఒకటని పేర్కొంది. ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. 1.75 లక్షలు - టైప్‌-1 మధుమేహం కారణంగా గత ఏడాది ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య. మృతుల్లో 8,700 మంది దక్షిణాసియాకు చెందినవారు.

‘టైప్‌-1’ ప్రబలంగా ఉన్న టాప్‌-10 దేశాలు

అమెరికా, భారత్, బ్రెజిల్, చైనా, జర్మనీ, బ్రిటన్, రష్యా, కెనడా, సౌదీ అరేబియా, స్పెయిన్‌

- టైప్‌-1 మధుమేహ బాధితుల సంఖ్య (2021లో) - 84 లక్షలు

- వారిలో 20 ఏళ్ల వయసులోపు వారు - 18%

- 20-59 ఏళ్ల మధ్య వయసున్న వారు - 63%

- 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువున్న వారు - 19%


సురక్షిత మెట్రో నగరాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం

జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2021లో దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచిందని డీజీపీ కార్యాలయం తెలిపింది. ‘‘20 లక్షల జనాభా కలిగిన నగరాల్లో విచారణకు అర్హమైన నేరాల నమోదులో కోల్‌కతా (1034), పుణె (2568)ల తర్వాత హైదరాబాద్‌ (2599)లోనే తక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రతి 10 లక్షల జనాభాకు జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ కేసుల నమోదులో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా సూరత్, కొచ్చి, అహ్మదాబాద్, చెన్నై నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాది మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే తక్కువ నేరాలు నమోదయ్యాయి. హత్యల విషయానికొస్తే కోల్‌కతాలో 45, హైదరాబాద్‌లో 98, బెంగళూరులో 152, దిల్లీలో 454, ముంబయిలో 162 జరిగాయి. అత్యాచారాలు కోల్‌కతాలో 11, హైదరాబాద్‌లో 116, బెంగళూరులో 117, ముంబయిలో 364, దిల్లీలో 1226 జరిగాయి. మహిళలపై దాడులు కోల్‌కతాలో 127, హైదరాబాద్‌లో 177, బెంగళూరులో 357, దిల్లీలో 1023 నమోదయ్యాయి. దొంగతనాలు కోల్‌కతాలో 1246, దిల్లీలో 1980, హైదరాబాద్‌లో 2419, బెంగళూరులో 6066, ముంబయిలో 7820 నమోదయ్యాయని డీజీపీ కార్యాలయం వివరించింది.

జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ - 5 నివేదిక

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వివాహాల వల్ల యుక్త వయసులో గర్భదారణ, హెచ్‌ఐవీ బారినపడటం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రికార్డుల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు నమోదైన గర్భిణుల వివరాలు పరిశీలిస్తే 2000 మందికి చిన్న వయసులోనే వివాహమైనట్లు తేలింది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 213 మంది, అతి తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం ద్వారా తల్లీబిడ్డలు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, బాలికలను జాగ్రత్తగా పెంచలేమని తల్లిదండ్రుల అభద్రతాభావం, మూఢాచారాలు, ఇంట్లో వృద్ధుల ఒత్తిడి వంటివి చిన్న వయసులోనే పెళ్లిళ్లకు కారణాలవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

సాధారణ వయసులో వివాహాలు జరిగినవారితో పోల్చితే చిన్న వయసులో గర్భం దాల్చిన వారిలో కాన్పు సమయంలో మరణాలు రెండింతలు ఎక్కువగా ఉంటున్నాయి. శిశు మరణాల్లో 45.3% బాల్యంలో వివాహాల ద్వారా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలనలో తేలింది. ప్రసవ సమయంలో 42.3% మంది శిశువులు మరణిస్తున్నారు.

జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ - 5 అధ్యయనం ప్రకారం 20-24 మధ్య వయసున్న 29.3% మహిళలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరిగాయి. వీరిలో 21.7% పట్టణ ప్రాంతాల్లో, 32.9% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరిలో 29.3% మంది 15-19 ఏళ్ల మధ్యే గర్భం దాల్చినట్లు అధ్యయనంలో తేలింది. బాల్య వివాహాల్లో పశ్చిమబెంగాల్‌ (41.6%), బిహార్‌ (40.8%), త్రిపుర (40.1%), అస్సాం (31.8%) తర్వాత స్థానంలో ఏపీ ఉంది.

- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 37.3%, అనంతపురం 37.3%, కర్నూలు 36.9%, గుంటూరు 35.4%, విజయనగరం జిల్లాలో 33.7% మందికి 18 ఏళ్ల ముందు వివాహాలు జరిగాయి. సర్వే జరిగే నాటికి చిన్న వయసులోనే గర్భం దాల్చిన వారు అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20.7% ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 19.7%, ప్రకాశం 16.4%, నెల్లూరు 14.9%, అనంతపురం 13.6% కర్నూలు జిల్లాలో 12.4% బాల్యంలోనే గర్భం దాల్చారు.


ఆధునిక బానిసత్వంలో 5 కోట్ల మంది

ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో మగ్గిపోతున్న వారి సంఖ్య 2021లో 5 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం), అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్‌ ఫ్రీ సంయుక్తంగా వెలువరించిన నివేదిక వీరిని ఆధునిక బానిసలుగా వర్ణించింది. 2016తో పోలిస్తే 2021లో వీరి సంఖ్య అదనంగా కోటి పెరిగింది. ఆధునిక బానిసత్వం అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది.

- కొవిడ్‌ మహమ్మారి వల్ల అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, ఈజిప్ట్‌ తదితర దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయనీ, వాటిలో అత్యధికం బాల్య వివాహాలని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఆధునిక బానిసత్వ అంచనా పేరిట వెలువడిన నివేదిక ప్రకారం 2.8 కోట్ల మంది నిర్బంధ శ్రమలో, 2.2 కోట్ల మంది బలవంతపు పెళ్లిళ్లలో చిక్కుకుపోయారు. ఆసియా - పసిఫిక్‌ దేశాల్లో బలవంతపు వివాహాలు ఎక్కువ. ఇక్కడ ప్రతి 1000 మంది జనాభాలో 3.3 నిర్బంధ వివాహాలు జరిగాయి. జనాభా నిష్పత్తి పరంగా చూస్తే అరబ్‌ దేశాల్లో ఈ తరహా పెళ్లిళ్లు అధికం. అక్కడ ప్రతి 1000 మందిలో 4.8 కేసులు ఇవే. ఉత్తర, దక్షిణ అమెరికాలలో అతి తక్కువగా 1000 మందికి 1.5 బలవంతపు పెళ్లిళ్లు జరిగాయి.

- కొవిడ్‌ 19 వల్ల ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయి. 16 ఏళ్లు లేక అంతకన్నా తక్కువ వయసులోనే బలవంతపు పెళ్లి చేసుకోవలసి వస్తున్న బాలబాలికల సంఖ్య మనకు తెలిసిన దాని కన్నా ఎక్కువేనని సమితి అనుబంధ సంస్థల నివేదిక పేర్కొంది. నిర్బంధ వివాహాల్లో 85 శాతానికి పైగా కుటుంబ పెద్దలు జరిపిస్తున్నవే. 65 శాతం నిర్బంధ వివాహాలు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో జరుగుతున్నాయి.


భారత ఆరోగ్య వ్యయం రూ.5.96 లక్షల కోట్లు

ఆరోగ్యం కోసం 2018 - 19లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి రూ.5,96,440 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ‘నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ ఎస్టిమేట్స్‌’ (జాతీయ ఆరోగ్య ఖర్చుల అంచనాల) నివేదిక వెల్లడించింది. ఇది జీడీపీలో 3.16%కి సమానమని పేర్కొంది. ఆ ఏడాది వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు తలసరి రూ.4,470 ఖర్చు చేసినట్లు వెల్లడించింది. రోజువారీ వైద్య సేవల ఖర్చు రూ.5,40,246 కోట్లు (90.58%) కాగా, మూలధన వ్యయం రూ.56,194 కోట్లు (9.42%). వైద్య సేవల కోసం ప్రజలు సొంతంగా రూ.2,87,573 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం వ్యయంలో ప్రైవేటు ఆసుపత్రులు, ఔషధ దుకాణాలకే అత్యధిక మొత్తం వెళ్లింది. - మూలధనంతో పాటు రోజువారీ సేవలకైన వ్యయంలో ప్రభుత్వ వాటా రూ.2,42,219 కోట్లు. జీడీపీలో 1.28%కి ఇది సమానం. ప్రభుత్వపరంగా తలసరి వ్యయం రూ.1,815.

- 2018 - 19లో ప్రభుత్వాలు చేసిన మొత్తం బడ్జెట్‌ వ్యయంలో వైద్య రంగం కోసం కేటాయించింది 4.81%. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 34.3%, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65.7%.


కు.ని.పై అవగాహన తక్కువే

తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కుటుంబ నియంత్రణ (కు.ని.) విధానాలపై అవగాహన తక్కువేనని కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 62.8 శాతం మందిలో అవగాహన ఉండగా అతి తక్కువగా జగిత్యాల జిల్లాలో 24 శాతం మందికి మాత్రమే ఉంది. 2014 - 15తో పోల్చితే 2019 - 20లో కు.ని.పై అవగాహన 25 నుంచి 49.2 శాతానికి పెరిగింది. కు.ని. ఆపరేషన్లపై మహబూబాబాద్‌లో అత్యధికంగా 31.4 శాతం మందిలో అవగాహన ఉండగా అతి స్వల్పంగా వికారాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో 8.6 శాతం మందిలో మాత్రమే చైతన్యముంది. రాష్ట్రంలో ఏదో ఒక కు.ని. పద్ధతిని పాటిస్తున్న వారు 68.1 శాతం మంది నమోదయ్యారు. 2019 - 20లో ఇది 11 శాతం పెరిగింది. ఇలాంటి వారు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 78.7 శాతం, అతి తక్కువగా కుమురం భీం జిల్లాలో 49.4 శాతం మంది నమోదయ్యారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 2014 - 15, 2019 - 20 అంశాలను విశ్లేషిస్తూ కౌన్సిల్‌ తాజాగా నివేదికను విడుదల చేసింది.

శిరస్త్రాణం లేనందునే అధిక మరణాలు: ఎన్‌సీఆర్‌బీ

తెలంగాణలో ద్విచక్ర వాహనదారులు కష్టాలకు ఎదురీదుతున్నారు. రోడ్లెక్కే వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో సురక్షితంగా గమ్యం చేరేందుకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రహదారులపై ప్రమాదాల రూపేణా చోటుచేసుకుంటున్న మరణాల్లో ద్విచక్ర వాహనదారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మరోవైపు పాదచారులూ ఈ విషయంలో ద్విచక్ర వాహనదారులతో పోటీ పడుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే మృత్యువాత పడుతుండటానికి అతివేగం, రోడ్డు ఇంజినీరింగ్‌ లోపాలతో పాటు శిరస్త్రాణాలు ధరించకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా బైకుల పైనుంచి పడిన సందర్భాల్లో సున్నిత భాగమైన తలకు దెబ్బలు తగిలే ఎక్కువ మంది దుర్మరణం పాలవుతున్నారు.

ఖైదీల్లో హత్యా నేరాల్లో శిక్ష పడిన వారే ఎక్కువ

-ఏపీ రాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 70 శాతం మంది హత్యా నేరాల్లో శిక్ష పడినవారే. 2021 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలోని జైళ్లలో 2,104 మంది శిక్ష పడిన ఖైదీలు (కన్విక్టెడ్‌ ప్రిజనర్స్‌) ఉండగా వారిలో 1,472 మంది హత్యా నేరాలపై వచ్చినవారే. జైళ్లలోని ఖైదీల్లో 1,858 మంది (66.64 శాతం) జీవిత ఖైదు అనుభవిస్తున్నవారే. జిల్లా, సబ్‌ జైళ్లు తక్కువ మంది ఖైదీల్ని కలిగి ఉండగా కేంద్ర కారాగారాల్లో సామర్థ్యానికి మించి అదనంగా 32.3 శాతం మంది ఖైదీలున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘కారాగార గణాంక నివేదిక - 2021’ ఈ వివరాల్ని వెల్లడించింది.

- రాష్ట్రంలోని 106 జైళ్లలో 8,761 మంది ఖైదీలను ఉంచొచ్చు. ప్రస్తుతం 7,950 మంది (90.7 శాతం) ఉన్నారు. సెంట్రల్‌ జైళ్ల సామర్థ్యం 3,764 మంది అయితే ప్రస్తుతం 4,978 మంది ఉంటున్నారు.

- జైళ్లలో 2021లో అనారోగ్య కారణాలతో 40 మంది ఖైదీలు మరణించగా వారిలో 24 మంది గుండె, ముగ్గురు కాలేయ సంబంధిత వ్యాధులతో చనిపోయారు. ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

- జైళ్లలోని 7,950 మంది ఖైదీల్లో 224 మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు.

- ఏపీలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న, రిమాండులో ఉన్న ఖైదీల్లో అత్యధిక శాతం మంది 30-50 ఏళ్ల లోపు వయసు వారే. చదువు రానివారు, పదో తరగతి లోపు ఆపేసిన వారు ఎక్కువ మంది.

- జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 75.7 శాతం మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారే. 2-4 ఏళ్ల లోపు శిక్ష అనుభవించేవారు అతి తక్కువ మంది ఉన్నారు.


కరోనా కాలంలో ఆసుపత్రుల్లో తగ్గిన ప్రసవాలు: నీతి ఆయోగ్‌

ఆసుపత్రులు, ప్రసూతి కేంద్రాల్లో ప్రసవించిన మహిళల సంఖ్య కరోనా కాలంలో తగ్గినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది. 2019లో అక్టోబరు - డిసెంబరు మధ్య 54,98,000 మంది మహిళలు ఆసుపత్రుల్లో ప్రసవించగా కరోనా వచ్చాక 2020 అక్టోబరు - డిసెంబరులో వీరి సంఖ్య 53,48,000కి తగ్గింది. 2019 అక్టోబరు - డిసెంబరు మధ్య, ప్రసవానంతరం 48 గంటల్లోపు, 14 రోజుల తర్వాత నిర్వహించే పరీక్షలను 31,31,000 మందికి చేయగా 2020 అక్టోబరు - డిసెంబరు మధ్య ఈ సంఖ్య 30,52,000గా నమోదైంది.

99 శాతం మంది భారతీయులు పీల్చేది కలుషిత వాయువే

మన దేశంలో 99 శాతానికి పైగా ప్రజలు నిత్యం అత్యంత కాలుష్య పూరిత వాయువును పీలుస్తున్నారని ఓ అధ్యయనం తేల్చింది. అది డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన అతిసూక్ష్మ ధూళి కణ కాలుష్యం పీఎం2.5 ఆధారిత వార్షిక ఆరోగ్య మార్గదర్శకాలను మించి అయిదు రెట్లు ఉందని పేర్కొంది. ఈ మేరకు గ్రీన్‌పీస్‌ ఇండియా రూపొందించిన ‘డిఫెరెంట్‌ ఎయిర్‌ అండర్‌ వన్‌ స్కై’ పేరిట విడుదల చేసిన నివేదిక వివరించింది. అంతేకాకుండా దేశంలోని 62 శాతం మంది గర్భిణిలు అత్యంత కాలుష్య పూరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది. నివేదిక వార్షిక సగటు పీఎం2.5 కాలుష్య ఎక్స్‌పోజర్‌ విశ్లేషణ మేరకు దేశంలో అత్యంత కాలుష్యానికి గురయ్యేది దిల్లీ ప్రాంతమని పేర్కొంది. నాణ్యత లేని గాలి పీల్చడం వల్ల వృద్ధులు, శిశువులు, గర్భవతులు ఎక్కువగా దుష్ప్రభావాలకు గురవుతారని వివరించింది. అతి సూక్ష్మ ధూళికణ కాలుష్యాన్ని పీఎం2.5గా వ్యవహరిస్తారు. ఇది శరీరం లోపలికంటా చొచ్చుకుపోతుంది. ఈ కారణంగా ఊపిరితిత్తులు, శ్వాసనాళంలో వాపు వస్తుంది. అది గుండెజబ్బులకు, శ్వాసకోశ సమస్యలు, రోగనిరోధకశక్తి సన్నగిల్లడానికి దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి నివేదిక సూచించింది.

రోజుకు 86 అత్యాచారాలు: ఎన్‌సీఆర్‌బీ

దేశంలో గత ఏడాది సగటున రోజుకు 86 చొప్పున మొత్తం 31,677 అత్యాచారాలు నమోదయ్యాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదికలో వెల్లడించింది. అత్యధికంగా రాజస్థాన్‌లో 6,337 అత్యాచారాలు నమోదు కాగా తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (2,947), ఉత్తర్‌ప్రదేశ్‌ (2,845), మహారాష్ట్ర (2,496) ఉన్నాయని తెలిపింది. రాజస్థాన్‌లో సగటున ప్రతి లక్ష జనాభాకు 16.4 మంది అత్యాచారానికి గురయ్యారని పేర్కొంది. ఈ సగటు చండీగఢ్‌లో 13.3గా, దిల్లీలో 12.9గా, హరియాణాలో 12.3గా, మొత్తంగా దేశంలో 4.8గా ఉన్నట్లు వెల్లడించింది. భారత్‌లో అత్యాచారాల సంఖ్య 2020లో 28,046గా, 2019లో 32,033గా ఉందని గుర్తుచేసింది. దేశవ్యాప్తంగా సగటున గంటకు 49 చొప్పున 2021లో మహిళలపై 4,28,278 నేరాలు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.

తెలంగాణలో 14.5% పెరిగిన ఆత్మహత్యలు

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. అర్ధంతరంగా తనువు చాలిస్తున్న వారిలో నిరుద్యోగులు, కూలీలు, విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. 2020తో పోలిస్తే 2021లో నిరుద్యోగుల బలవన్మరణాలు 14.24%, రోజు కూలీల ఆత్మహత్యలు 20.51%, విద్యార్థుల బలవంతపు చావులు 11.51% మేర పెరిగాయి. 2020లో రాష్ట్రంలో మొత్తం 7,043 ఆత్మహత్యలు చోటుచేసుకోగా 2021లో 14.5% పెరిగి ఆత్మహత్యల సంఖ్య 8,067కు చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే గతేడాది బలవన్మరణాల పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన ‘వార్షిక నివేదిక - 2021’ ఈ విషయాల్ని వెల్లడించింది.

సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. గతేడాది మొత్తం ఇలాంటి 22 ఘటనల్లో 56 మంది చనిపోయారు. తొలి రెండు స్థానాల్లో ఉన్న తమిళనాడు, రాజస్థాన్‌ల్లో వరుసగా 33, 25 కేసులు నమోదయ్యాయి.