రాష్ట్రీయం-తెలంగాణ

సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రగతిభవన్‌లో సీఎం నిర్ణయాన్ని వెలువరించగా, ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. కొత్త సచివాలయాన్ని ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’గా పిలుస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని, ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు సీఎస్‌ తెలిపారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు.. ‘అంబేడ్కర్‌ దార్శనికతతో రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ 3 ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకే ఆ మహనీయుని స్ఫూర్తితో తెలంగాణ అన్ని రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. సమాఖ్య స్ఫూర్తితో అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తాయన్న అంబేడ్కర్‌ ఆలోచనలు మమ్మల్ని నడిపిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

టీహబ్, ఐఎఫ్‌సీసీల ఒప్పందం

భారత్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ టీ హబ్, ఇండో ఫ్రాన్స్‌ పరిశ్రమలు, వాణిజ్య మండలి (ఐఎఫ్‌సీసీఐ)ల మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు, ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌ల సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, ఐఎఫ్‌సీసీఐ అధ్యక్షుడు సుమిత్‌ ఆనంద్‌లు దీనిపై సంతకం చేశారు.

నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు తొలిసారి డ్రోన్‌తో మందుల సరఫరా

టీశా - మెడికార్ట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ డ్రోన్‌ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు విజయవంతంగా చేరవేసింది. నిర్మల్‌ పట్టణంలో వైద్యుడు ప్రశాంత్‌ ఆ మందులను స్వీకరించారు. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌ దాదాపు 70 కి.మీ. దూరంలో ఉంది. డ్రోన్‌తో అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఔషధాలు నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాయి. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్‌ ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. భూమికి 400 అడుగుల పైన గాలిలో ప్రయాణించే ఈ డ్రోన్‌ చేరుకోవాల్సిన ప్రదేశంలో క్యూఆర్‌ కోడ్‌ను అతికిస్తారు. 60 మీటర్ల దూరం నుంచే ఆ క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేసి డ్రోన్‌ అక్కడ దిగుతుంది. ఈ విధానంలో 20 కిలోల వరకూ మందులను సరఫరా చేసేందుకు అవకాశమున్నట్లు వైద్యుడు ప్రశాంత్‌ తెలిపారు.

ఏడో జాతీయ డిజిటల్‌ పరివర్తన సదస్సు

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలువురు వక్తలు తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏడో జాతీయ పరివర్తన సదస్సు జరిగింది. దీనికి ఒడిశా మంత్రి తుషారకాంతి బెహరా, తెలంగాణ నవీన సాంకేతిక విభాగం సంచాలకురాలు రమాదేవి, హెచ్‌పీఈ సంస్థ కంట్రీ మేనేజర్‌ మయాంక్‌ చతుర్వేది, అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ వాణిజ్య విభాగాధిపతి అజయ్‌కౌల్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మున్ముందు డిజిటల్‌ రంగం అద్భుతాలను సాధిస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణలో డిజిటల్‌ రంగంలో సాధించిన ప్రగతిని రమాదేవి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల్లోగా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల జీవో జారీ చేసి, అమలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసి, బంజారాల ఆత్మీయ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. బంజారా, గోండు భాషల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభించి ఆకట్టుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. శాసనసభ, మండలిలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు జాతీయ జెండాలను ఎగుర వేశారు. బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ జెండా ఎగుర వేశారు.

ఎనిమిది బిల్లులకు తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి 8 బిల్లులకు ఆమోదం తెలిపాయి. అందులో ఆరు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు గత ఏప్రిల్‌ 12న రాష్ట్ర మంత్రి మండలి అంగీకారం తెలపగా, తాజాగా అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వం 5 విశ్వవిద్యాలయాలకే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురునానక్, ఎంఎన్‌ఆర్, అమిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌(ఇక్మార్‌) విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రెండు ప్రధాన అంశాలపై రూపొందించిన తీర్మానాలను రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ ప్రతిపాదించిన ఒక తీర్మానాన్ని, నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రెండింటికీ ఆమోదం లభించింది. విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో, మండలిలో మంత్రి జగదీశ్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. పార్లమెంట్‌ నూతన భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, నిబంధనల ప్రకారమే పంజాగుట్టలో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది. 125 అడుగుల విగ్రహాన్ని ఐమాక్స్‌ పక్కనే కడుతున్నాం. జనవరిలోగా దాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అనంతరం తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. మండలిలో మంత్రి సత్యవతి రాథోడ్, పార్లమెంట్‌ నూతన భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించారు.

అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రే కులపతి (ఛాన్స్‌లర్‌)గా వ్యవహరించనున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్‌ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీకి ప్రత్యేక చట్టం చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బాసరలోని ఆర్‌జీయూకేటీకి మాత్రమే విద్యారంగ నిపుణుడు కులపతిగా ఉన్నారు. మిగిలిన అన్ని వర్సిటీలకు గవర్నర్‌ కులపతిగా వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా అటవీ వర్సిటీకి సీఎం ఛాన్స్‌లర్‌ కాబోతున్నారు. ఈ మేరకు బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర నియామకాలను చేపట్టేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు (టీయూసీఆర్‌బీ) - 2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు - 2022, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంతం రద్దు, మున్సిపల్‌ చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్య నిపుణుల వయో పరిమితి పెంపు, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లులను ఆయా మంత్రులు ప్రవేశపెట్టారు. - రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో ఛైర్‌పర్సన్, వైస్‌ ఛైర్‌పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్‌లపై నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా పురపాలక చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మూడేళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా ఉండగా దీన్ని నాలుగేళ్లకు పెంచేలా ప్రతిపాదించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్‌ చట్టంలో అవిశ్వాస తీర్మానం నాలుగేళ్ల తర్వాతే ప్రవేశపెట్టేలా ఉండగా ఈ మేరకు పురపాలక చట్టంలోనూ సవరించనున్నారు. ప్రస్తుతం ఎన్నికైన ఛైర్‌పర్సన్, వైస్‌ ఛైర్‌పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్‌ల మూడేళ్ల కాలపరిమితి 2023 జనవరి 26న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేలా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో పురపాలక చట్టంలో నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా చట్టసవరణకు ప్రతిపాదించినట్లు ప్రభుత్వం బిల్లులో వివరించింది.

జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం అయిదుగురు కోఆప్షన్‌ సభ్యులను నియమించుకునేందుకు అవకాశం ఉండగా 15 మంది సభ్యులకు అవకాశం కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టంలో సవరణకు ప్రతిపాదించారు. ప్రస్తుతం అయిదుగురిలో ఇద్దరు నిపుణుల వర్గానికి చెందినవారు. ముగ్గురు మైనారిటీలుగా ఉన్నారు. హైదరాబాద్‌ నగర విస్తరణ, డివిజన్లు 150కి పెరగడం, జనాభా పెరుగుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కో ఆప్షన్‌ సభ్యులను తాజాగా 15కి పెంచుతూ బిల్లును ప్రతిపాదించారు. ఇందులో 9మంది నిపుణుల వర్గానికి చెందినవారు. మిగిలిన ఆరుగురిని మైనారిటీల నుంచి కో ఆప్షన్‌ సభ్యులుగా నియమించుకునేందుకు వీలుగా సవరణను ప్రతిపాదించారు.

జీహెచ్‌ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లలో ప్రస్తుతం అయిదుగురు కో ఆప్షన్‌ సభ్యులను నియమించుకునేందుకు అవకాశం ఉండగా వీరి సంఖ్యను పదికి పెంచుతూ పురపాలక శాఖ చట్ట సవరణకు ప్రతిపాదించింది.

జిల్లా కేంద్రమైనా పంచాయతీగానే ఉన్న ములుగును పురపాలక సంఘం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ములుగు పర్యాటక హబ్‌గా మారిన నేపథ్యంలో పురపాలికగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి. ఈ 3 పంచాయతీలను కలిపి ములుగు పురపాలికను చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత (2.2.2024) కొత్త పురపాలక సంఘం ఏర్పాటవుతుందని పేర్కొన్నారు.


వైద్య సలహామండలిలో తెలంగాణకు స్థానం

జాతీయ వైద్య కమిషన్‌లోని సెక్షన్‌ 11(2)(సీ) ప్రకారం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య సలహామండలి (మెడికల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌)లో తెలంగాణకు స్థానం లభించింది. ఇందులో కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రతినిధి డాక్టర్‌ వి.రాజలింగ్‌లను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సభ్యులుగా నియమించింది.