క్రీడలు

దులీప్‌ ట్రోఫీ వెస్ట్‌దే

ఈ ఏడాది దులీప్‌ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు 294 పరుగుల భారీ తేడాతో సౌత్‌ జోన్‌ను చిత్తు చేసింది. 529 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 154/6తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌ 234 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు పడిన నాలుగు వికెట్లలో మూడు సామ్స్‌ ములానీ (4/51) ఖాతాలో చేరాయి. రవితేజ (53; 97 బంతుల్లో 3×4, 1×6), సాయి కిశోర్‌ (82 బంతుల్లో 7)తో కలిసి వెస్ట్‌ విజయాన్ని ఆలస్యం చేశాడు. కానీ సాయికిశోర్‌ను చింతన్‌ గజా (1/47) ఔట్‌ చేయడంతో సౌత్‌ ఇన్నింగ్స్‌ ఇంకెంతోసేపు కొనసాగలేదు. వెస్ట్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ (2/28), అతీత్‌ సేథ్‌ (2/29) కూడా ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌ 270 పరుగులు చేయగా సౌత్‌ 327 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను వెస్ట్‌ 585/4 వద్ద డిక్లేర్‌ చేసింది. వెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (265) డబుల్‌ సెంచరీ చేయగా సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (127) శతకంతో మెరిశాడు.

ప్రొఫెషనల్‌ ఆటకు ఫెదరర్‌ వీడ్కోలు

20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఖాతాలో వేసుకున్న ఫెదరర్‌ ఓటమితో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్‌ యూరోప్‌ కోసం తన చివరి మ్యాచ్‌లో నాదల్‌తో కలిసి డబుల్స్‌ ఆడాడు. ఫెదరర్‌ - నాదల్‌ జోడీ 6-4, 6-7 (2-7), 9-11 తేడాతో తియోఫొ - సాక్‌ (టీమ్‌ వరల్డ్‌) చేతిలో ఓడింది.

బౌలింగ్‌లో స్టార్‌ పేసర్‌ జులన్‌ మహిళల క్రికెట్‌కు వీడ్కోలు

మహిళల క్రికెట్‌ బౌలింగ్‌లో పేసర్‌ జులన్‌ గోస్వామికి మాత్రమే స్టార్‌డమ్‌ సొంతం. ‘ఛాక్డా ఎక్స్‌ప్రెస్‌’గా ముద్దుగా పిలుచుకునే జులన్, బాల్‌ గర్ల్‌గా మొదలై భారత మహిళల క్రికెట్‌పై తనదైన ముద్ర వేసింది. బెంగాల్‌లో చిన్న ఊరి నుంచి వచ్చినా ప్రపంచం తనవైపు చూసేలా చేసిన పేసర్‌ జులన్‌. భారత్‌లో మహిళల క్రికెట్‌ ఉనికే లేని స్థితిలో కెరీర్‌ ఆరంభించించింది. 1997లో ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్‌ ఫైనల్లో బాల్‌ గర్ల్‌గా పని చేసింది.

2002లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఆమె వేగంగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. దేశంలో అమ్మాయిల క్రికెట్లో ఫాస్ట్‌ బౌలింగ్‌కు చిరునామాగా మారింది. తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో 10 ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టింది ఈ పేసర్‌. కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌లోనూ 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 30 పరుగులే ఇచ్చింది. 39 ఏళ్ల వయసులోనూ యువ పేసర్లకు ధీటుగా బౌలింగ్‌ చేస్తూ క్రికెట్‌ నుంచి ఘనంగా రిటైరైంది.

‣ పేసర్‌గానే కాదు కెప్టెన్‌గా, లోయర్‌ఆర్డర్‌లో విలువైన బ్యాటర్‌గా రెండు దశాబ్దాల కెరీర్‌లో భిన్నమైన పాత్రలు పోషించింది జులన్‌. 2002లో ఇంగ్లాండ్‌పై టాంటన్‌ టెస్టులో మిథాలీరాజ్‌తో కలిసి నెలకొల్పిన 157 పరుగుల భాగస్వామ్యం జట్టును గట్టెక్కించింది. 2006లో ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలిసారి భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన ఆమె జట్టు సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌ తొలి టెస్టు విజయం అందుకుంది ఈ సిరీస్‌లోనే. కెరీర్‌లో ఉత్తమ మ్యాచ్‌ గణాంకాలు (10/78) నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించింది.

పేరు: జులన్‌ నిషిత్‌ గోస్వామి
పుట్టింది: బెంగాల్‌
అరంగేట్రం: 2002 ఇంగ్లాండ్‌పై
వీడ్కోలు: 2022 ఇంగ్లాండ్‌పై
టెస్టులు: 12; వికెట్లు: 44; పరుగులు: 291
వన్డేలు: 204; వికెట్లు: 255; పరుగులు: 1228
టీ20: 68; వికెట్లు: 56; పరుగులు: 405
- వన్డేల్లో జులన్‌ పడగొట్టిన వికెట్లు 255. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె ఘనత సాధించింది.

- వన్డేల్లో 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన 11 మంది క్రికెటర్ల జాబితాలో జులన్‌ కూడా ఉంది.


హాకీ ఇండియా అధ్యక్షుడిగా టిర్కీ

భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 1న హాకీ ఇండియా ఎన్నికలు జరగాలి. అధ్యక్ష పదవితో పాటు మరే పదవికి పోటీ లేకపోవడంతో ఫలితాలను ముందే ప్రకటించారు. అధ్యక్ష పదవికి టిర్కీతో పాటు యూపీ హాకీ సంఘం అధ్యక్షుడు రాకేశ్‌ కత్యాల్, జార్ఖండ్‌ హాకీ సంఘం అధ్యక్షుడు బోళా నాథ్‌సింగ్‌ పోటీపడ్డారు. రాకేశ్, భోళానాథ్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టిర్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఓ ఆటగాడు హాకీ ఇండియా అధ్యక్ష పదవి చేపట్టనుండడం ఇదే తొలిసారి. హెచ్‌ఐ ఎన్నికల ఫలితాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ధ్రువీకరించింది.

యుఎస్‌ ఓపెన్‌ విజేత అల్కరాస్‌

ప్రపంచ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేశాడీ స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్కరాస్‌. యుఎస్‌ ఓపెన్‌ను చేజిక్కించుకుని తన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటను ఘనంగా ఆరంభించాడు. అల్కరాస్‌ ఫైనల్లో 6-4, 2-6, 7-6 (7-1), 6-3తో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై విజయం సాధించాడు. కెరీర్‌లో కేవలం రెండో పూర్తి స్థాయి సీజన్‌ మాత్రమే ఆడుతున్న అతడు, లీటన్‌ హెవిట్‌ (20 ఏళ్ల 9 నెలలు, 2001)ను అధిగమించి అత్యంత పిన్నవయసు పురుషుల సింగిల్స్‌ నంబర్‌వన్‌గా నిలిచాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్‌ మొదలయ్యాక అగ్రస్థానం సాధించిన తొలి టీనేజర్‌ అల్కరాసే. ఆఖరి సమరంలో 14 ఏస్‌లు సంధించాడు. 55 విన్నర్లు కొట్టాడు.

యుఎస్‌ ఓపెన్‌ ఇగా సొంతం

ఫామ్‌ కొనసాగించిన స్వైటెక్‌ ఇగా యుఎస్‌ ఓపెన్లో టైటిల్‌ నెగ్గింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఈ టాప్‌ సీడ్‌ 6-2, 7-6 (7-5)తో అయిదో సీడ్‌ జాబెర్‌ను ఓడించింది. ఒక్క రెండో సెట్లో తప్ప ప్రత్యర్థి నుంచి స్వైటెక్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. తొలి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఆమె అదే జోరుతో 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి 14 పాయింట్లతో 12 స్వైటెక్‌ సొంతమయ్యాయంటే ఈ పోలెండ్‌ తార ఎంత దూకుడుగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. బేస్‌లైన్‌ ఆటతో అదరగొట్టిన ఆమె క్రాస్‌కోర్ట్‌ షాట్లతో పాటు, బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్లు, నెట్‌ డ్రాప్‌లతో పాయింట్లు సాధించింది. కోర్టులో అటు ఇటూ వేగంగా తిరుగుతూ మెరుపు రిటర్న్‌లతో అదరగొట్టిన ఇగా 6-2తో సులభంగా సెట్‌ గెలిచింది. ‣ యుఎస్‌ ఓపెన్‌ గెలవడం స్వైటెక్‌కు ఇదే తొలిసారి. ‣ యుఎస్‌ ఓపెన్‌ గెలిచిన తొలి పోలెండ్‌ అమ్మాయి ఇగానే.

యుఎస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ జో - రామ్‌ సొంతం

యుఎస్‌ ఓపెన్‌లో జో సాల్స్‌బరీ (బ్రిటన్‌) - రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ రికార్డు సృష్టించింది. ఓపెన్‌ శకంలో వరుసగా రెండో ఏడాదీ ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన రెండో జంటగా నిలిచింది. ఫైనల్లో జో - రాజీవ్‌ ద్వయం 7-6 (7-4), 7-5 తేడాతో వెస్లీ (నెదర్లాండ్స్‌), నీల్‌ (బ్రిటన్‌)పై గెలిచింది.

వన్డేలకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ వీడ్కోలు

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ వన్డే క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేనే ఈ ఫార్మాట్లో తనకు చివరి మ్యాచ్‌ అని తెలిపాడు. ఫించ్‌ ఇటీవల పేలవ ఫామ్‌లో ఉన్నాడు. జూన్‌లో శ్రీలంకతో వన్డేలో 62 పరుగులు చేసిన తర్వాత ఫించ్‌ సగటు 3.7 మాత్రమే. మూడుసార్లు డకౌట్‌ కూడా అయ్యాడు. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతను ఒక్కసారి కూడా 20 దాటలేకపోయాడు. ఫించ్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని, టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను నడిపిస్తాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. 35 ఏళ్ల ఫించ్‌ ఆసీస్‌ తరఫున 145 వన్డేలు ఆడాడు. 39.13 సగటుతో 5,401 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు ఉన్నాయి. ఫించ్‌ 54 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహిరించాడు.

డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ నీరజ్‌ సొంతం

భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సాధించాడు. ఫైనల్లో జావెలిన్‌ను 88.44 మీటర్లు విసిరిన నీరజ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో ఫాల్ట్‌ చేసిన ఈ 24 ఏళ్ల ఒలింపిక్‌ ఛాంపియన్‌ తర్వాత గొప్పగా పుంజుకున్నాడు. రెండో ప్రయత్నంలో 88.44 మీటర్ల త్రోతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌ రజత విజేత, చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు జాకబ్‌ వాద్లెచ్‌ (86.94 మీ.) రెండో స్థానంలో నిలిచాడు. జర్మనీ ఆటగాడు వెబర్‌ జూలియన్‌ (83.73 మీటర్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు.

అన్ని రకాల క్రికెట్‌కు సురేశ్‌ రైనా వీడ్కోలు

టీమ్‌ ఇండియా మాజీ బ్యాటర్‌ సురేశ్‌ రైనా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల రైనా 2020 ఆగస్టులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2021 వరకు ఐపీఎల్‌ ఆడాడు. కానీ 2022 సీజన్‌కు ముందు చెన్నై అతణ్ని వదిలేసింది. రైనా ఇప్పుడు విదేశీ లీగుల్లో ఆడేందుకు అర్హుడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత్‌ లేదా దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడడానికి వీల్లేదు.

తొలిసారి వరుసగా నాలుగో గ్రాండ్‌ ప్రి విజేతగా వెర్‌స్టాపెన్‌

ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ సీజన్‌లో తన కెరీర్‌లోనే తొలిసారి వరుసగా నాలుగో గ్రాండ్‌ ప్రి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తంగా పదో రేసు గెలిచాడు. డచ్‌ గ్రాండ్‌ ప్రి రేసులో ఈ బెల్జియం రేసర్‌ విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్‌ తరపున బరిలో దిగిన అతను ఒక గంటా 36 నిమిషాల 42.773 సెకన్లలో రేసు ముగించాడు. రసెల్‌ (మెర్సిడెజ్‌), లెక్లెర్క్‌ (ఫెరారీ), హామిల్టన్‌ (మెర్సిడెజ్‌) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పాయింట్లలో తన ఆధిక్యాన్ని వెర్‌స్టాపెన్‌ 109 పాయింట్లకు పెంచుకున్నాడు.

అరవింద్‌కు దుబాయ్‌ ఓపెన్‌ చెస్‌ టైటిల్‌

భారత గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం దుబాయ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. 9 రౌండ్ల నుంచి 7.5 పాయింట్లతో అతడు అగ్రస్థానం సంపాదించాడు. ఏడుగురు భారతీయులు టాప్‌-10లో నిలవడం విశేషం. అర్జున్‌ ఎరిగేశి 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.

టీ20 క్రికెట్‌కు ముష్ఫికర్‌ వీడ్కోలు

బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. అయితే లీగుల్లో ఆడడాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. 35 ఏళ్ల ముష్ఫికర్‌ కొంతకాలం పొట్టి ఫార్మాట్లో పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గత పది టీ20ల్లో మూడుసార్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు. ముష్ఫికర్‌ మొత్తం బంగ్లాదేశ్‌ తరఫున 102 టీ20 మ్యాచ్‌లు ఆడి 1500 పరుగులు చేశాడు.

అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఆఖరి మ్యాచ్‌

మహిళల టెన్నిస్‌పై తనదైన ముద్ర వేసిన అమెరికా తార సెరెనా విలియమ్స్‌ కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడేసింది. వీడ్కోలుపై ముందే ప్రకటన చేసిన ఆమె, దానిపై పునరాలోచన చేయనని స్పష్టం చేసింది. మహిళల సింగిల్స్‌లో 23, డబుల్స్‌లో 14, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 2 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, నాలుగు ఒలింపిక్‌ స్వర్ణాలతో శిఖరాగ్రానికి చేరుకుంది.

‣ వరుసగా అత్యధిక వారాల పాటు (186) అగ్రస్థానంలో కొనసాగిన క్రీడాకారిణిగా స్టెఫీగ్రాఫ్‌తో కలిసి సెరెనా అగ్రస్థానంలో ఉంది.

‣ ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు (23) గెలిచిన క్రీడాకారిణి సెరెనానే. ఓవరాల్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (24) తర్వాత రెండో స్థానంలో ఉంది.

‣ 2001లో ఇండియన్‌ వెల్స్‌ టోర్నీలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్న సెరెనా, ఆ తర్వాత 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడకుండా బహిష్కరించింది.

‣ సింగిల్స్‌లో సెరెనా గ్రాండ్‌స్లామ్‌ విజయాలు 23. ఇందులో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-7 (2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017), ఫ్రెంచ్‌ ఓపెన్‌-3 (2002, 2013, 2015), వింబుల్డన్‌-7 (2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016), యుఎస్‌ ఓపెన్‌-6 (1999, 2002, 2008, 2012, 2013, 2014) టైటిళ్లు ఉన్నాయి.


జాతీయ క్రీడల్లో రియాకు స్వర్ణం

జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం. స్కేటర్‌ రియా సాబూ రాష్ట్రానికి మొదటి పసిడిని అందించింది. సింగిల్‌ ఫ్రీస్టైల్‌ ఆర్టిస్టిక్‌ విభాగంలో 19 ఏళ్ల రియా ఛాంపియన్‌గా నిలిచింది. కాళ్లకు చక్రాలతో కళ్లుచెదిరేలా నృత్య విన్యాసాలు చేసిన ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 112.4 పాయింట్లతో బంగారు పతకం పట్టేసింది. ఏపీ స్కేటర్లు సంహిత (107), అన్మిషా (97.8) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మెరిసిన స్టార్లు: జాతీయ క్రీడల్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు అంచనాలను నిలబెట్టుకుంటూ సత్తాచాటారు. షూటింగ్‌ (10మీ.ఎయిర్‌ రైఫిల్‌)లో ఇలవెనిల్‌ వలరివన్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను (191 కేజీలు), ఫెన్సింగ్‌లో భవానీ దేవి, రెజ్లింగ్‌లో దివ్య కక్రాన్‌ స్వర్ణాలు గెలిచారు. అథ్లెటిక్స్‌లో ఏకంగా తొమ్మిది క్రీడల రికార్డులు బద్దలయ్యాయి. జావెలిన్‌ త్రో ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా ముఖ్య అతిథిగా హాజరై అథ్లెటిక్స్‌ పోటీలను ప్రారంభించాడు. ఓ భవన నిర్మాణ కూలీ తనయ మునిత (ఉత్తర్‌ప్రదేశ్‌) మహిళల 20 కిలోమీటర్ల నడకలో రికార్డు (1 గంటా 38 నిమిషాల 20 సెకన్లు) ప్రదర్శనతో పసిడి సాధించింది. 2018 ఆసియా క్రీడల డెకథ్లాన్‌ ఛాంపియన్‌ స్వప్న బర్మన్‌ ఈ క్రీడల హైజంప్‌లో 1.83 మీ. ప్రదర్శనతో స్వర్ణం నెగ్గింది.

డబ్ల్యూబీసీ ఆసియా కాంటినెంటల్‌ ఛాంపియన్‌షిప్‌లో శివకు టైటిల్‌

డబ్ల్యూబీసీ ఆసియా కాంటినెంటల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత సూపర్‌ మిడిల్‌వెయిట్‌ బాక్సర్‌ శివ ఠాక్రాన్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో శివ టెక్నికల్‌ నాకౌట్‌ (టీకేఓ)తో ఆదిల్‌ హఫీజ్‌ (మలేసియా)పై విజయం సాధించాడు. ప్రత్యర్థిపై శివ పంచ్‌ల వర్షం కురిపించడంతో రిఫరీలు ఎనిమిదో రౌండ్లో బౌట్‌ను నిలిపివేశారు.

ఖరీదైన ఆటగాడిగా ఎబ్డెన్‌

టెన్నిస్‌ ప్రిమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) క్రీడాకారుల వేలం పాటలో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) అత్యధిక ధర పలికాడు. వింబుల్డన్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ గెలుచుకున్న ఎబ్డెన్‌ను దిల్లీ బిన్నీస్‌ బ్రిగేడ్‌ రూ.8.45 లక్షలకు కొనుక్కుంది. తెలుగమ్మాయి సౌజన్య బవిశెట్టిని రూ.3.50 లక్షలకు తీసుకుంది. బెంగళూరు స్పార్టాన్స్‌ రూ.4.55 లక్షలకు విష్ణు వర్ధన్‌ను కొనుక్కుంది. దిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌ స్ట్రైకర్స్, ముంబయి లియోన్‌ ఆర్మీ, చెన్నై స్టాలియన్స్, పుణె జాగ్వార్స్, గుజరాత్‌ పాంథర్స్, పంజాబ్‌ టైగర్స్‌ జట్లు టీపీఎల్‌లో బరిలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబరు 7 నుంచి 11 వరకు పుణెలో లీగ్‌ జరుగుతుంది.

ఫిడె ప్రపంచ క్యాడెట్స్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో శుభి, చార్వీలకు టైటిళ్లు

ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత ప్లేయర్లు సత్తాచాటారు. ఫిడె ప్రపంచ క్యాడెట్స్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్స్‌లో శుభి గుప్తా, చార్వి టైటిళ్లు దక్కించుకున్నారు. బాలికల అండర్‌-12 విభాగంలో 11 రౌండ్ల నుంచి 8.5 పాయింట్లు సాధించిన శుభి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అండర్‌-8 విభాగంలో 9.5 పాయింట్లతో చార్వి ఛాంపియన్‌గా నిలిచింది. 11 రౌండ్లు ముగిసే సరికి బోధన శివానందన్‌ (ఇంగ్లాండ్‌)తో కలిసి సమంగా నిలిచిన ఆమె మెరుగైన టైబ్రేకర్‌ స్కోరుతో టైటిల్‌ ఖాతాలో వేసుకుంది. అండర్‌-8 బాలుర విభాగంలో సఫీన్‌ సఫరుల్లాఖాన్‌ 9 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు.

జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్‌ రన్నరప్‌గా అర్జున్‌

జులియస్‌ బేర్‌ జనరేషన్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి రన్నరప్‌గా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో జరిగిన ఫైనల్లో అర్జున్‌ ఓడిపోయాడు. రెండు రోజుల పాటు సాగిన ఈ తుది సమరంలో తొలి రోజు 0.5-2.5తో వెనుకబడ్డ అర్జున్, రెండో రోజు తొలి రెండు గేమ్‌లు ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. జూనియర్‌ పురుషుల ట్రాప్‌ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈ ఛాంపియన్‌షిప్స్‌ చరిత్రలో దేశానికి తొలి పతకం అందించారు. ఫైనల్లో శపథ్, శార్దూల్, ఆర్యతో కూడిన భారత త్రయం 6-4 తేడాతో ఇటలీపై విజయం సాధించింది. కాంస్యం అమెరికా ఖాతాలో చేరింది.

జాతీయ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో తెలంగాణ మహిళల జట్టుకు కాంస్యం

జాతీయ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో తెలంగాణ మహిళల జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీస్‌లో తెలంగాణ 0-3తో పశ్చిమ బెంగాల్‌ చేతిలో పరాజయం చవి చూసింది. సింగిల్స్‌లో ఆకుల శ్రీజ 2-3తో ఐహిక ముఖర్జీ చేతిలో ఓడింది. పశ్చిమ బెంగాల్‌ క్రీడాకారిణులు సుతీర్థ ముఖర్జీ, మౌమా దాస్‌ మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి జట్టుకు విజయాన్ని అందించారు. ఆ తర్వాత ఫైనల్లోనూ పశ్చిమ బెంగాల్‌ విజయం సాధించింది. 3-1తో మహారాష్ట్రను ఓడించింది. పురుషుల విభాగంలో గుజరాత్‌ స్వర్ణం సొంతం చేసుకుంది.

సినియకోవాకు పోర్టోజ్‌ డబ్ల్యూటీఏ టైటిల్‌ సొంతం

చెక్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి క్యాటరీనా సినియకోవా పోర్టోజ్‌ డబ్ల్యూటీఏ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో సినియకోవా 6-7(4-7), 7-6(7-5), 6-4తో ఎలెనా రిబకినాపై గెలిచింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన సినియకోవా రెండో సెట్‌ను టైబ్రేక్‌తోనే గెలుచుకుంది. మూడో సెట్‌లో స్కోరు 4-4తో ఉన్నపుడు సినియాకోవా బ్రేక్‌తో ముందంజ వేసి ట్రోఫీ దక్కించుకుంది.

పూవమ్మపై రెండేళ్ల నిషేధం

డోపింగ్‌ పరీక్షలో విఫలమైన ఆసియా క్రీడల పతక విజేత పూవమ్మపై యాంటీ డోపింగ్‌ అప్పీల్‌ ప్యానెల్‌ (ఏడీఏపీ) రెండేళ్ల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకం వాడినట్లు పరీక్షల్లో తేలింది. 2018 ఆసియా క్రీడల్లో 4×400 మీ. మహిళల, మిక్స్‌డ్‌ రిలే స్వర్ణాలు గెలిచిన జట్లలో పూవమ్మ సభ్యురాలు. 2012 ఆసియా క్రీడల 400 మీ. పరుగులో ఆమె వ్యక్తిగత కాంస్యం కూడా సాధించింది. పూవమ్మకు 2015లో అర్జున అవార్డు లభించింది.

ప్రపంచ పారా గ్రాండ్‌ప్రి గోల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ పారా గ్రాండ్‌ప్రి గోల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జీవాంజి దీప్తి చరిత్ర సృష్టించింది. మహిళల టి20 విభాగం 400 మీటర్ల పరుగులో ఆమె స్వర్ణ పతకంతో సత్తాచాటింది. ఈ టోర్నీలో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా దీప్తి ఘనత సాధించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌ దగ్గర ఆమె శిక్షణ తీసుకుంటోంది.

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బజ్‌రంగ్‌కు కాంస్యం

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బజ్‌రంగ్‌ పునియా (65 కేజీ) కాంస్యం సాధించాడు. రెపిచేజ్‌లో బరిలోకి దిగిన అతడు కాంస్య పతక పోరులో 11-9తో సెబాస్టియన్‌ రివెరా (పోర్టోరికో)పై విజయం సాధించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగు పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌ బజ్‌రంగే. అతను ఇంతకుముందు 2018లో రజతం గెలుచుకున్నాడు. 2013, 2019లో కాంస్యాలు సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంప్స్‌గా ప్రణవ్, ఇలంపర్తి

ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఓపెన్‌ విభాగం అండర్‌-16లో ప్రణవ్‌ ఆనంద్, అండర్‌-14లో ఏఆర్‌ ఇలంపర్తి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. మరోవైపు 15 ఏళ్ల బెంగళూరు కుర్రాడు ప్రణవ్‌ భారత్‌ 76వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గానూ అవతరించాడు. ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు సాధించిన అతను, ఈ టోర్నీలో 2500 ఎలో రేటింగ్‌ దాటాడు. ఈ టాప్‌సీడ్‌ ఆటగాడు 11 రౌండ్ల నుంచి 9 పాయింట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నాడు. టోర్నీలో అజేయంగా నిలిచిన అతను ఏడు విజయాలు, నాలుగు డ్రాలు నమోదు చేశాడు. మరో భారత ఆటగాడు, రెండో సీడ్‌ ప్రణేశ్‌ 8 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్‌-14 విభాగంలో ఇలంపర్తి దూకుడు ప్రదర్శించాడు. 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ముంబయి ఇండియన్స్‌ కోచ్‌గా బౌచర్‌

దక్షిణాఫ్రికా మాజీ వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌ ఐపీఎల్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో బౌచర్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడని ముంబయి ఫ్రాంచైజీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ముంబయి ఇండియన్స్‌ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మహేల జయవర్దనెకు పదోన్నతి కల్పించిన నేపథ్యంలో అతని స్థానంలో బౌచర్‌కు బాధ్యతలు అప్పగించింది. 45 ఏళ్ల బౌచర్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

టెన్నిస్‌కు రోజర్‌ ఫెదరర్‌ వీడ్కోలు

-ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో ఓ శకం ముగిసింది. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్‌కు తెరదించుతూ 41 ఏళ్ల వయసులో రోజర్‌ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. 20 విజయాలతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వచ్చే వారం లండన్‌లో జరిగే లేవర్‌ కప్‌ తనకు చివరి టోర్నీ అని వెల్లడించాడు. 103 టూర్‌ స్థాయి టైటిళ్లు, సింగిల్స్‌లో 1,251 మ్యాచ్‌లతో జిమ్మీ కానర్స్‌ తర్వాత ఓపెన్‌ శకంలో ఈ ఘనతలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

-కెరీర్‌ ఆరంభం: 1998

-కెరీర్‌ ముగింపు: 2022

-గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిళ్లు: 20

- ఇప్పుడు ఫెదరర్‌ అంటే ఓ దిగ్గజం. దాదాపు పాతిక ఏళ్ల పాటు ఆటతో అలరించిన ఈ యోధుడి ప్రయాణం బాల్‌బాయ్‌గా మొదలైంది. 40 విభిన్న దేశాల్లో టెన్నిస్‌ ఆడాడు.

- ర్యాంకింగ్స్‌లో రోజర్‌ నంబర్‌వన్‌గా ఉన్న వారాలు 310. 2021లో జకోవిచ్‌ అధిగమించే వరకు అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న రికార్డు అతడిదే.

- 2004 లో తొలిసారి నంబర్‌వన్‌ అయిన అతడు. 2008 వరకు కొనసాగాడు. ఆ తర్వాత మరో మూడు దఫాలు (2009, 2012, 2018) ఈ ర్యాంకు దక్కించుకున్నాడు. పురుషుల్లో, మహిళల్లో కలిపి వరుసగా అత్యధిక వారాలు (237) నంబర్‌వన్‌గా నిలిచిన ఘనత రోజర్‌దే. పెద్ద వయస్కుడైన (36 ఏళ్లు) నంబర్‌వన్‌ కూడా అతడే.

- వింబుల్డన్, యుఎస్‌ ఓపెన్‌ను నాలుగేళ్లు (2004 - 2007) వరుసగా గెలిచిన ఏకైక ఆటగాడు.

- ఫెదరర్‌ ఖాతాలో రెండు ఒలింపిక్స్‌ పతకాలు ఉన్నాయి. 2008 బీజింగ్‌లో డబుల్స్‌ స్వర్ణం గెలిచిన అతడు 2012 లండన్‌ క్రీడల్లో సింగిల్స్‌ రజతం సాధించాడు.

- కెరీర్‌లో రోజర్‌ సాధించిన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు 20. అత్యధికంగా ఎనిమిది వింబుల్డన్‌ టైటిళ్లు గెలిచిన అతడు ఆరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్, అయిదు యుఎస్‌ ఓపెన్, ఒకే ఒక్క ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గాడు. 2012లో రోజర్‌ 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించే సమయానికి నాదల్‌ (10), జకోవిచ్‌ (5) అతడికి చాలా దూరంలో ఉన్నారు. ఆ తర్వాత మూడు ట్రోఫీలు గెలవడానికి సమయం తీసుకున్నాడు. 2018లో చివరిగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రూపంలో ఫెదరర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గాడు.

- ఇక వ్యక్తిగత జీవితంలో సేవా కార్యక్రమాల్లో చేయడంలో అతనెప్పుడూ ముందే. రోజర్‌ ఫెదరర్‌ ఫౌండేషన్‌ ద్వారా నిస్సహాయులైన చిన్నారులకు విద్యను అందిస్తున్నాడు. 2021 చివరకు ఈ ఫౌండేషన్‌ ద్వారా 19 లక్షల 80 వేల మంది చిన్నారులకు సాయం చేశాడు. భూకంపాలు, సునామీ, వరదలు, తుపాను లాంటి ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డ ప్రజల కోసం విరాళాల సేకరణకు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు నిర్వహించాడు. అతని చేసిన సేవలకు గుర్తింపుగా స్విట్జర్లాండ్, ఆస్ట్రియా ప్రభుత్వాలు ప్రత్యేక పోస్టల్‌ స్టంపులు విడుదల చేశాయి. 2011లో రెప్యుటేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత గౌరవం, నమ్మకం కలిగిన, ఆరాధించే వ్యక్తుల్లో నెల్సన్‌ మండేలా తర్వాత ఫెదరర్‌ రెండో స్థానంలో నిలిచాడు.


భారత్‌దే శాఫ్‌ టైటిల్‌

అండర్‌-17 శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ నిలబెట్టుకుంది. ఫైనల్లో భారత్‌ 4-0 గోల్స్‌తో నేపాల్‌ను చిత్తు చేసింది. 18వ నిమిషంలో బాబీ సింగ్‌ కొట్టిన హెడర్‌ గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్, ఆ తర్వాత కోరూసింగ్‌ (29వ ని) గోల్‌ చేయడంతో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత కెప్టెన్‌ వాన్‌లాల్‌పెకా (63వ ని), ఇంజురీ సమయంలో అమన్‌ గోల్స్‌ కొట్టి భారత్‌ను విజయపథంలో నడిపించారు. ఈ టోర్నీలో విలువైన ఆటగాడిగా వాన్‌లాల్‌పెకా ఎంపికయ్యాడు.

ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వినేశ్‌ చరిత్ర

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. ఆమె బెల్‌గ్రేడ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. కాంస్య పతక ప్లేఆఫ్‌లో వినేశ్‌ 8-0తో స్వీడన్‌కు చెందిన ఎమ్మా జోనా మాల్‌గ్రెన్‌పై గెలిచింది. క్వాలిఫికేషన్‌లో బత్కుయాగ్‌ (మంగోలియా) చేతిలో ఓడిన వినేశ్‌ పుంజుకున్న తీరు అద్భుతం. బత్కుయాగ్‌ ఫైనల్‌ చేరడంతో రెపిచేజ్‌ రౌండ్‌కు అర్హత సాధించిన వినేశ్‌ మొదట కజకిస్థాన్‌కు చెందిన ఎషిమోవాను 4-0తో ఓడించింది. ప్రత్యర్థి లేలా గుర్బనోవా (ఉజ్బెకిస్థాన్‌) గాయపడడంతో తర్వాతి బౌట్లో గెలిచి కాంస్య పతక రౌండ్లో అడుగుపెట్టింది. 28 ఏళ్ల వినేశ్‌ 2019 ఛాంపియన్‌షిప్స్‌లోనూ కాంస్యం గెలుచుకుంది.

అన్ని రకాల క్రికెట్‌కు ఉతప్ప వీడ్కోలు

టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఉతప్ప అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లో దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించేశాడు. 36 ఏళ్ల ఈ కర్ణాటక బ్యాటర్‌ అన్ని రకాల భారత క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. చివరగా ఆడిన కేరళ క్రికెట్‌ సంఘం నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్న అతను విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడే అవకాశముంది. ‣ 2004 అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆడిన ఉతప్ప, 2006లో సీనియర్‌ జట్టులో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డే, 2007లో టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో పోరులో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అతను 2015లో జింబాబ్వే పైనే చివరి 50, 20 ఓవర్ల మ్యాచ్‌లు ఆడేశాడు. అతనికి టెస్టుల్లో ఆడే అవకాశం దక్కలేదు. 46 వన్డేల్లో 934, 13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క శతకమూ సాధించలేకపోయాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 142 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు సహా 9446 పరుగులు రాబట్టాడు. 2007 ప్రపంచకప్‌ విజయం అతని కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ‣ ఇప్పటివరకూ అన్ని ఐపీఎల్‌ సీజన్లలోనూ ఆడిన అతను ట్రోఫీలు నెగ్గిన కేకేఆర్‌ (2014), సీఎస్కే (2021) జట్లలో సభ్యుడు. దూకుడైన బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా తలుపు తట్టిన అతను 2007 టీ20 ప్రపంచకప్‌ తర్వాత పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమయ్యాడు. అనూహ్యంగా 2014 ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరపున చెలరేగాడు. ఆ సీజన్‌లో అత్యధిక పరుగుల (660) వీరుడిగా నిలిచి జట్టు టైటిల్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2014-15 రంజీ సీజల్లో టాప్‌ స్కోరర్‌గా నిలిచి కర్ణాటకను మరోసారి విజేతగా నిలిపాడు. చివరగా 2015లో జింబాబ్వే సిరీస్‌ తర్వాత మళ్లీ అతను జాతీయ జట్టుకు ఎంపికవలేదు. ఈ ఏడాది సీఎస్కే తరపున ఐపీఎల్‌లో ఆడాడు.

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌కు 16వ స్థానం

అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా సత్తాచాటుతున్న భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పురోగతి కనబరిచాడు. బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించిన జాబితాలో ప్రణయ్‌ రెండు స్థానాలు మెరుగై 16వ ర్యాంకు సాధించాడు. మరో స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ కూడా రెండు ర్యాంకులు మెరుగై 12వ స్థానంలో నిలిచాడు. యువ ఆటగాడు లక్ష్యసేన్‌ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ‣ మహిళల సింగిల్స్‌లో పి.వి.సింధు 7, సైనా నెహ్వాల్‌ 30వ ర్యాంకులతో ఉన్నారు. ‣ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు - చిరాగ్‌ శెట్టి జోడీ 8వ స్థానంలో కొనసాగుతోంది. ‣ మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి - అశ్విని పొన్నప్ప జోడీ 28, గాయత్రి గోపీచంద్‌ - ట్రీసా జాలీ జంట 35వ ర్యాంకులతో ఉన్నాయి.

లిచెన్‌స్టెయిన్‌ గోల్డెన్‌ ప్రై అథ్లెటిక్‌ మీట్‌లో జస్విన్‌కు స్వర్ణం

లిచెన్‌స్టెయిన్‌ గోల్డెన్‌ ప్రై అథ్లెటిక్‌ మీట్‌లో భారత లాంగ్‌ జంపర్‌ జస్విన్‌ స్వర్ణంతో మెరిశాడు. ఫైనల్లో జస్విన్‌ 8.12 మీటర్ల దూరం దూకి అగ్రస్థానంలో నిలిచాడు. రాడెక్‌ (7.70 మీ, చెక్‌ రిపబ్లిక్‌), హెన్రిక్‌ (నార్వే, 7.66 మీ) తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత అథ్లెట్‌ ప్రవీణ్‌ (7.58 మీ) నాలుగో స్థానంలో నిలిచాడు.

వ్రితికి మరో రెండు పతకాలు

జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ యువ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ అదరగొట్టింది. ఇప్పటికే రెండు రజతాలు సొంతం చేసుకున్న ఆమె చివరి రోజు మరో వెండి పతకం, కాంస్యం ఖాతాలో వేసుకుంది. మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రెండో స్థానంలో నిలిచిన ఆమె మహిళల 200 మీ. బటర్‌ ఫ్లైలో మూడో స్థానం దక్కించుకుంది.

జూనియర్‌ ప్రపంచ నంబర్‌వన్‌గా అనుపమ

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ అండర్‌-19 బాలికల ర్యాంకింగ్స్‌లో భారత యువ షట్లర్‌ అనుపమ ఉపాధ్యాయ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దేశం నుంచి ఆ ఘనత సాధించిన రెండో అమ్మాయిగా ఈ 17 ఏళ్ల పంచకుల క్రీడాకారిణి నిలిచింది. ఇప్పటికే తస్నీమ్‌ మీర్‌ నంబర్‌వన్‌ ర్యాంకును చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఉగాండా, పోలెండ్‌ జూనియర్‌ అంతర్జాతీయ టోర్నీల్లో టైటిళ్లు గెలిచిన అనుపమ, తస్నీమ్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 18 టోర్నీల నుంచి 18.060 పాయింట్లతో ఆమె తొలి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. తస్నీమ్‌ 2వ, 14 ఏళ్ల అన్వేష 6వ, ఉన్నతి 9వ స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని దక్కించుకున్న భారత ఆరో షట్లర్‌గా అనుపమ రికార్డు నమోదు చేసింది. అబ్బాయిల్లో ఆదిత్య (2014), సిరిల్‌ వర్మ (2016), లక్ష్యసేన్‌ (2017), ఈ ఏడాది ముత్తుస్వామి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచారు. ప్రకాశ్‌ పదుకొనే అకాడమీకి చెందిన అనుపమ సీనియర్‌ ర్యాంకింగ్స్‌లో 63వ స్థానంలో ఉంది.

ఆసియా జూనియర్‌ క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

ఆసియా జూనియర్‌ క్యాడెట్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో పయాస్‌ జైన్‌ - యశస్విని గొర్పాడే జంట స్వర్ణం గెలుచుకుంది. లావోస్‌లో జరిగిన జూనియర్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో పయాస్‌ - యశస్విని 11-9, 11-1, 10-12, 7-11, 11-8తో హన్‌ జియున్‌ - కిన్‌ యువాన్‌ (చైనా)పై గెలిచారు.

జాతీయ సీనియర్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో వృతికి రజతం

అసోంలోని గువహాటిలో జరుగుతున్న జాతీయ సీనియర్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి వృతి అగర్వాల్‌ మెరిసింది. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్‌ తుది సమరంలో వృతి రజతం గెలుచుకుంది. ఫైనల్లో 4 నిమిషాల 33.25 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె రెండో స్థానంలో నిలిచింది. జాతీయ సీనియర్‌ స్విమ్మింగ్‌ వృతికి ఇదే తొలి పతకం. ఈ పోటీలో సచ్‌దేవ భవ్య స్వర్ణం గెలుచుకుంది. భవ్య 4 నిమిషాల 30.25 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. సివంగి (4 నిమిషాల 35.83 సెకన్లు) కాంస్యం నెగ్గింది.

సాకేత్‌ జోడీకి టైటిల్‌

భారత జంట సాకేత్‌ మైనేని - యుకి బాంబ్రి రఫా నాదల్‌ ఓపెన్లో విజేతగా నిలిచారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాకేత్‌ - యుకి 6-2, 6-2తో మారెక్‌ - లుకాస్‌ రొసోల్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. ఈ సీజన్లో భారత జంటకు ఇది అయిదో ఛాలెంజర్‌ టైటిల్‌. ఈ టోర్నీ కన్నా ముందు సాలినాస్, చెక్‌ రిపబ్లిక్, పోర్టో, లిక్సింగ్‌టన్‌ల్లో టైటిళ్లు గెలిచారు. తాజా విజయంతో యుకి (ప్రస్తుతం 110) ర్యాంకింగ్స్‌లో టాప్‌-100లోకి రానున్నాడు. అతడి భాగస్వామి సాకేత్‌ 98వ ర్యాంకులో ఉన్నాడు.

సన్‌రైజర్స్‌ ప్రధాన కోచ్‌గా లారా

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌గా వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రయాన్‌ లారా ఎంపికయ్యాడు. ఇప్పటిదాకా కోచ్‌గా ఉన్న టామ్‌ మూడీ స్థానంలో 2023 సీజన్‌కు లారా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఓ టీ20 జట్టుకు కోచ్‌గా వ్యవహరించనుండడం 53 ఏళ్ల లారాకు ఇదే తొలిసారి. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ సలహాదారుగా బ్రయాన్‌ సేవలు అందిస్తున్నాడు. సన్‌రైజర్స్‌ కోచ్‌గా మూడీ రెండు పర్యాయాలు పని చేశాడు. మొదట 2013 - 19 వరకు ఈ బాధ్యతల్లో ఉన్న అతడు, గతేడాది మళ్లీ కోచ్‌గా వచ్చాడు. టామ్‌ హయాంలో అయిదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరిన సన్‌రైజర్స్‌ 2016లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్లో హైదరాబాద్‌ ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గి ఎనిమిదింట్లో ఓడి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో డెజర్ట్‌ వైపర్స్‌కు మూడీ డైరెక్టర్‌గా పని చేయబోతున్నాడు.

ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా చౌబే

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎన్నికల్లో దిగ్గజ ఆటగాడు బైచుంగ్‌ భుటియాకు చుక్కెదురైంది. ఏఐఎఫ్‌ఎఫ్‌ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఈస్ట్‌ బెంగాల్‌ మాజీ గోల్‌ కీపర్‌ కల్యాణ్‌ చౌబే విజయం సాధించాడు. 85 ఏళ్ల చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆటగాడిగా చౌబే రికార్డు సృష్టించాడు. చౌబేకు ముందు రాజకీయ నాయకులు ప్రియరంజన్‌ దాస్‌మున్షీ, ప్రఫుల్‌ పటేల్‌ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఎన్నికల్లో 34 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా చౌబే 33-1తో భుటియాపై గెలుపొందాడు. కర్ణాటక ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌.ఎ.హారిస్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కిపా అజయ్‌ (అరుణాచల్‌ప్రదేశ్‌) కోశాధికారిగా ఎన్నికయ్యాడు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సభ్యులుగా 14 మంది ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫాల్గుణ ఈసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.