సైన్స్ అండ్ టెక్నాలజీ

డార్ట్‌ ప్రయోగం విజయవంతం

భూమి వైపునకు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాల బారి నుంచి జీవజాలాన్ని రక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇలాంటి రాకాసి శిలలను సురక్షితంగా దారిమళ్లించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా చేపట్టిన ప్రయోగం దిగ్విజయంగా సాగింది. ఈ సంస్థ పంపిన ‘డార్ట్‌ (డబుల్‌ ఆస్ట్రాయిడ్‌ రీడైరెక్ట్‌ టెస్ట్‌)’ వ్యోమనౌక అత్యంత కచ్చితత్వంతో డైమార్ఫస్‌ గ్రహశకలాన్ని ఢీ కొట్టింది. ‣ భూమికి దాదాపు 1.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న డిడిమోస్, డైమార్ఫస్‌ అనే జంట గ్రహశకలాల వద్దకు డార్ట్‌ వ్యోమనౌకను గత ఏడాది నవంబరులో నాసా ప్రయోగించిన సంగతి తెలిసిందే. 780 మీటర్ల వెడల్పున్న డిడిమోస్‌ చుట్టూ 170 మీటర్ల డైమార్ఫస్‌ తిరుగుతోంది. భూమికి చేరువలో ఉన్న గ్రహశకలాల్లో ప్రతి ఐదింట్లో ఒకటి ఇలాంటి జంట గ్రహశకల వ్యవస్థే. డైమార్ఫస్‌ను డార్ట్‌తో ఢీ కొట్టించాలన్నది నాసా లక్ష్యం. తద్వారా ఆ ఆస్ట్రాయిడ్‌ కక్ష్యలో ఎంతమేర మార్పు వస్తుందన్నది పరిశీలించాలని నిర్ణయించింది. దీని ఆధారంగా భవిష్యత్‌లో పుడమివైపు వచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే తీరుపై ఒక నిర్ధారణకు రావాలనుకుంది. ఈ విధానాన్ని ‘కైనెటిక్‌ ఇంపాక్ట్‌’గా పేర్కొంటారు.

అత్యంత స్వల్పశ్రేణి గగనతల క్షిపణి ప్రయోగం విజయవంతం

ఒడిశాలోని చాందీపుర్‌లో ఐటీఆర్‌ నుంచి చేపట్టిన అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డీఆర్‌డీవో పరిశోధన కేంద్రం దీన్ని రూపొందించింది.

ఆస్ట్రేలియా జలాల్లో ‘ఐఎన్‌ఎస్‌ సాత్పురా’ ప్రదర్శన

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సాత్పురా ఆస్ట్రేలియా నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించింది. జలాంతర్గాములు, యుద్ధనౌకలను వేటాడే సత్తాను ఇది చాటిందని అధికారులు తెలిపారు. గన్‌ ఫైరింగ్‌ విన్యాసాల్లో భాగంగా లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని వివరించారు. సముద్ర జలాల్లో మిత్ర దేశాలకు చెందిన నౌకాదళాల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించేందుకు ఈ విన్యాసాలను నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్‌ తీరంలో ఇవి జరిగాయి. ఇందులో 14 దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి. భారత నేవీ తరఫున పి-8ఐ సముద్ర నిఘా విమానం కూడా ఇందులో పాలుపంచుకుంది.

కొత్త అంతరిక్ష కేంద్రం నుంచి చైనా వ్యోమగాముల స్పేస్‌వాక్‌

భూ కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం నుంచి చైనా వ్యోమగాములు కాయ్‌ షుజె, చెన్‌ డాంగ్‌లు తాజాగా స్పేస్‌వాక్‌ నిర్వహించారు. అత్యవసర సమయంలో ఈ కేంద్రం తలుపును బయటి నుంచి తీయడానికి వీలుగా ఒక హ్యాండిల్‌ను వారు అమర్చారు. రోబోటిక్‌ హస్తంపై వ్యోమగాముల కాళ్లు ఉంచడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు. షుజె, చెన్‌లు చేపట్టిన రెండో స్పేస్‌వాక్‌ ఇది. అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం వారు ఆరు నెలల పాటు రోదసిలో ఉంటారు.

అంగారకుడిపై జీవం!

అంగారకుడిపై జీవాన్వేషణ సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌ కీలక ఆవిష్కరణ చేసింది. అరుణ గ్రహ జెజెరో బిలంలో ఆర్గానిక్‌ పదార్థాలను గుర్తించింది. అయితే దీన్నిబట్టి అక్కడ జీవం ఉనికి నిర్ధారణ అయినట్లు కాదు. కొన్నేళ్లలో ఈ నమూనాలను భూమికి రప్పించి పరిశోధిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. పర్సెవరెన్స్‌ కనుగొన్నదేమిటీ? ఆర్గానిక్‌ పదార్థాల్లో అనేకరకాల అణువులు ఉంటాయి. ప్రధానంగా అవి కార్బన్‌తో తయారవుతుంటాయి. వీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్‌ పరమాణువులు ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్‌ కూడా ఉంటాయి. అక్కడ గతంలో జీవం ఉండేదనడానికి వీటి ఉనికి ఓ సంకేతం కావొచ్చు. జెజెరో బిలం నుంచి పర్సెవరెన్స్‌ నాలుగు నమూనాలను సేకరించింది. జులైలో ‘వైల్డ్‌క్యాట్‌ రిడ్జ్‌’ అనే ప్రత్యేక శిలపై డ్రిల్లింగ్‌ నిర్వహించింది. ఆవిరైపోతున్న ఉప్పునీటి సరస్సుపై బురద, సన్నటి ఇసుక పేరుకుపోవడం వల్ల వందలకోట్ల ఏళ్ల కిందట ఇది ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని రోవర్‌ కొద్దిమేర అరగదీసి ‘షెర్లాక్‌’ అనే పరికరం సాయంతో పరిశీలనలు సాగించింది. ఇందులో ఒకరకం ఆర్గానిక్‌ అణువులు కనిపించాయి. అవి సల్ఫేట్‌ ఖనిజాలను పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. నీటితో కూడిన వాతావరణంలో ఇవి ఏర్పడి ఉంటాయని పేర్కొన్నారు. నాటి పరిస్థితులకు సంబంధించిన అనేక వివరాలను ఇది వెలుగులోకి తెస్తుందని వివరించారు. నాడు అక్కడ జీవులు మనుగడ సాగించి ఉండొచ్చని తెలిపారు. భూమి మీద పురాతన జీవుల శిలాజాలను పరిరక్షించడంలో అవక్షేపణ శిలలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ‣ జెజెరో బిలం ఒకప్పుడు నదీ డెల్టా ప్రాంతమై ఉండొచ్చని అంచనా. అందువల్ల అరుణగ్రహంపై సూక్ష్మజీవులు మనుగడ సాగించి ఉంటే వాటి ఆనవాళ్లను కనుగొనడానికి ఇదే అనువైన ప్రదేశమన్న నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు. శిలాద్రవం గట్టిపడటం వల్ల ఏర్పడిన అగ్నిశిల, విభిన్న రకాల అవక్షేపణ శిలలతో ఆ బిలం విభిన్నంగా ఉంటుంది. అంగారకుడి భౌగోళిక చరిత్ర గురించి అర్థం చేసుకోవడానికి ఈ శిలలు వీలు కల్పిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధనల కోసం విభిన్న రకాల నమూనాలను సేకరించడానికి అనువైన ప్రాంతాలు అక్కడ ఉన్నాయని వివరించారు. ఉదాహరణకు జెజెరో బిలానికి చాలా దూరంగా ఏర్పడ్డ రాతి తునకలు, రేణువులతో కూడిన ఇసుకరాయిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే అంతుచిక్కని ఆర్గానిక్‌ అణువులతో కూడిన బురదరాయినీ కనుగొన్నారు.

విజయవంతంగా క్యూఆర్‌శామ్‌ పరీక్ష

క్యూఆర్‌శామ్‌/క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్‌ (భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే సత్వర స్పందన క్షిపణి)ను భారత్‌ ఆరోసారి విజయవంతంగా పరీక్షించింది. సైన్యం చేపట్టే క్షిపణి మదింపు సన్నాహకాల్లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపుర్‌లోని సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ మేరకు డీఆర్‌డీవో వెల్లడించింది. విభిన్న పరిస్థితుల్లో ఆయుధ వ్యవస్థల శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి అత్యంత వేగంతో కదలాడే వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా ఈ పరీక్షను చేపట్టినట్లు తెలిపింది. క్షిపణి వ్యవస్థ పనితీరు చక్కగా ఉన్నట్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాడార్‌ ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ అందించిన సమాచారం నిర్ధారించిందని వివరించింది.

అంగారకుడిపై అతుకుల ప్రొటాన్‌ అరోరా గుర్తింపు

అంగారక గ్రహ వాతావరణంలో అరుదైన అతుకుల ప్రొటాన్‌ అరోరా (మేరుజ్యోతి)ను ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అరుణ గ్రహ ఊర్ధ్వ వాతావరణాన్ని సౌరగాలి నేరుగా తాకినప్పుడు ఈ అరోరా ఏర్పడుతున్నట్లు తేల్చారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన మార్స్‌ మిషన్‌ (ఈఎంఎం), నాసా ప్రయోగించిన మావెన్‌ ప్రొబ్‌ ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.

లాలాజల ప్రొటీన్లతో రొమ్ము క్యాన్సర్‌ గుర్తింపు

ప్రాణాంతక రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే నూతన విధానాన్ని ఐఐటీ రూర్కీ పరిశోధకులు అభివృద్ధిపరిచారు. లాలాజల గ్రంథిలో ఉండే మూడు ప్రొటీన్ల ఆధారంగా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన ట్రిపుల్‌ నెగటివ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ (టీఎన్‌బీసీ)ను గుర్తించవచ్చని తేల్చారు. ఈ క్యాన్సర్‌కు సంబంధించిన బయో సూచికలను లాలాజలంలో పసిగట్టే విధానాన్ని తమ పరిశోధక బృందం అభివృద్ధిచేసినట్లు ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలిపింది. రొమ్ము క్యాన్సర్‌ బాధితుల్లో లాలాజల గ్రంథి పనితీరు, దానిలోని ప్రొటీన్ల తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తున్నట్లు పేర్కొంది. ఈ వైరుధ్యాలనే బయో సూచిక ద్వారా గుర్తించి వ్యాధిని నిర్ధారించవచ్చని వివరించింది.

కాలేయంలో కొవ్వు చేరికకు సముద్రపు నాచుతో పరిష్కారం

మద్యపానంతో సంబంధం లేకుండా కాలేయంలో కొవ్వు చేరే పరిస్థితి (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)ని అడ్డుకునేందుకు సరికొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. జీవన శైలి వ్యాధులకు సహజ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన ‘సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీష్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ)’ సముద్రపు నాచును ఉపయోగించి ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీకి మందు తయారు చేసింది. ‘కడాల్మిన్‌ టీఎం లివ్‌క్యూర్‌ ఎక్స్‌ట్రాక్ట్‌’ పేరుతో దీన్ని రూపొందించింది. సముద్రపు నాచు నుంచి సేకరించిన బయోయాక్టివ్‌ పదార్థాన్ని ఇందుకు ఉపయోగించామని, ఇది కాలేయ ఆరోగ్యాన్ని ఇతోధికంగా పెంచుతుందని ప్రధాన పరిశోధనకర్త కాజల్‌ చక్రవర్తి తెలిపారు. మధుమేహం, కొలెస్ట్రాల్, బీపీ, థైరాయిడ్‌ తదితర ఇతర రుగ్మతలకూ ఇప్పటికే ఈ సంస్థ 9 రకాల ఔషధాలను తీసుకొచ్చింది.

కీమో దుష్ప్రభావాలకు చికిత్స

క్యాన్సర్‌ బారినపడ్డ కణాల్లోకి నేరుగా కీమోథెరపీ మందులను చేరవేసేందుకు గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు సరికొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతమున్న కీమోథెరపీ ఔషధాలు క్యాన్సర్‌ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలనూ చంపేస్తుంటాయి. దీనివల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి ప్రతికూల ప్రభావాల వల్ల కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ ఇబ్బందులను తగ్గించడానికి గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రత్యేక మాలిక్యూల్స్‌ను తయారు చేశారు. అవి తమంతట తాము ఒక చోట చేరి, కీమో ఔషధాన్ని ఒడిసిపడతాయి. శరీరంలో క్యాన్సర్‌ కణాలకు మాత్రమే అతుక్కుంటాయి. పరారుణ కాంతిని ప్రయోగించినప్పుడు అవి విచ్ఛిన్నమై, వాటిలోని మందు క్యాన్సర్‌ కణంలోకి ప్రవేశిస్తుంది.

గుండె వైఫల్యాన్ని గుర్తించే వినూత్న సాంకేతికత అభివృద్ధి

గుండె వైఫల్యాన్ని అత్యంత త్వరగా గుర్తించే వినూత్న సాంకేతికతను యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. సంప్రదాయ ఎంఆర్‌ఐ ద్వారా హృద్రోగ నిర్ధారణకు 20 నిమిషాలు పడుతుంటే శాస్త్రవేత్తలు రూపొందించిన తాజా సాంకేతికత ఫలితంగా కేవలం 8 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతున్నట్టు పరిశోధనకర్త హోసమాదిన్‌ అసాది వెల్లడించారు. ఎంఆర్‌ఐ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా గుండె రక్త ప్రవాహానికి సంబంధించి 4 డైమెన్షనల్‌ చిత్రాలను అభివృద్ధి చేశాం. ‘ఫోర్‌డీ ఫ్లో ఎంఆర్‌ఐ’గా పిలుస్తున్న ఈ టెక్నాలజీ, గుండె కవాటాలు, రక్త ప్రసరణకు సంబంధించి అత్యంత కచ్చితమైన చిత్రాలను అందిస్తోంది. తద్వారా సమస్యను లోతుగా అర్థం చేసుకుని, మెరుగైన చికిత్సను సత్వరం అందించేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. యూరోపియన్‌ రేడియాలజీ ఎక్స్‌పెరిమెంటల్‌ పత్రిక ఈ వివరాలు అందించింది.

మలేరియాపై పోరులో ముందడుగు

దోమల పొట్టలో మలేరియా కారక పరాన్నజీవుల వృద్ధిని నెమ్మదింపజేసే ప్రక్రియను శాస్త్రజ్ఞులు రూపొందించారు. ఈ ప్రక్రియతో దోమలకు జన్యు మార్పిడి చేస్తే మలేరియా వ్యాప్తిని అరికట్టవచ్చని బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిసీజ్‌ మాడలింగ్‌ పరిశోధకులు కనిపెట్టారు. ఈ పరిశోధనలో జన్యు మార్పిడి చేసిన దోమలు తమ పొట్టలో మలేరియా కారక పరాన్న జీవుల వృద్ధిని అడ్డుకునే రసాయనాలను ఉత్పత్తి చేశాయి. ఫలితంగా ఆ పరాన్న జీవులు దోమల లాలాజల గ్రంథులకు చేరలేకపోతున్నాయి. దీంతో ఈ దోమలు మనిషిని కుట్టినా వాటిలోని మలేరియా కారక క్రిములు రక్తంలోకి అంతగా చేరడం లేదు. ప్రపంచ జనాభాలో సగం మందికి మలేరియా ముప్పు పొంచి ఉంటోంది. 2021లో 24.1 కోట్ల మంది దీని బారిన పడగా, వారిలో 6.27 లక్షల మంది మృతి చెందారు.

హైబ్రిడ్‌ మోటార్‌ పరీక్ష విజయవంతం

ఉపగ్రహాల వాహక నౌకల్లోని ప్రొపల్షన్‌ వ్యవస్థకు ఉపకరించే హెచ్‌టీపీబీ (హైడ్రాక్సిల్‌ టెర్మినేటెడ్‌ పాలీబుటాడైన్‌) హైబ్రిడ్‌ మోటార్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో వీఎస్‌ఎస్‌సీ, ఇస్రోలు సంయుక్తంగా ఈ పరీక్ష చేపట్టాయి. ఇంధనం, ద్రవ ఆక్సిజన్‌ (ఎల్‌ఓఎక్స్‌) ఆక్సిడైజర్‌లతో కూడిన 30-కేఎన్‌ మోటారు దహన శక్తిని 15 సెకన్ల పాటు పరీక్షించారు. ఈ మోటార్లు వాహక నౌకలోని ప్రొపల్షన్‌ వ్యవస్థను నియంత్రించటం, పునఃప్రారంభ ప్రక్రియను సులభతరం చేస్తాయని ఇస్రో అధికారులు బెంగళూరులో వెల్లడించారు. ఇస్రో ఇప్పటి వరకు ఉపయోగించే ఘన-ఘన, ద్రవ-ద్రవ మిశ్రిత ఆక్సిడైజర్ల స్థానంలో ఇంధన- ద్రవ ఆక్సిడైజర్లను వినియోగించేందుకు ఈ మోటార్‌ ఉపయోగపడనుంది.

మింగడంలో సమస్యలకు ఎలక్ట్రికల్‌ ఉద్దీపనలతో పరిష్కారం

ఆహారాన్ని సజావుగా మింగడంలో ఇబ్బందులకు కారణమయ్యే రుగ్మతలను నయం చేసేందుకు ప్రస్తుతం వైద్యులు నోరు, గొంతు, స్వరపేటిక వంటి అవయవాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అయితే ఆ అవయవాలతో పనిలేకుండా ఎలక్ట్రికల్‌ ఉద్దీపనల ద్వారా సంబంధిత సమస్యల నుంచి వ్యక్తులను గట్టెక్కించొచ్చని జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇందుకోసం సరికొత్త సాంకేతికతను వారు ఆవిష్కరించారు. ‘బ్రెయిన్‌-మెషీన్‌ ఇంటర్‌ఫేస్‌’ పేరుతో దాన్ని పిలుస్తున్నారు. ఇందులో వ్యక్తుల మెదడు సంకేతాలను ప్రత్యేక కృత్రిమ మేధ (ఏఐ) విశ్లేషిస్తుంది. ఆహారాన్ని మింగడానికి సంబంధించి వ్యక్తుల ఉద్దేశాన్ని పసిగడుతుంది. అనంతరం నాడీకణాల్లో పొందుపర్చి ఉండే ఎలక్ట్రోడ్‌ల సాయంతో కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఆహారాన్ని మింగే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌తో రక్తంలో ఆక్సిజన్‌ స్థాయుల నిర్ధారణ

రక్తంలో ఆక్సిజన్‌ స్థాయుల నిర్ధారణ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఆక్సీమీటర్‌ వంటి ప్రత్యేక సాధనాల అవసరం లేకుండా ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్‌తో ఆ పనిని పూర్తి చేసే సాంకేతికతను అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా శాన్‌డీగో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఈ విధానంలో వ్యక్తులు తమ చేతి వేలును స్మార్ట్‌ఫోన్‌ కెమెరాపై ఉంచి.. ఫ్లాష్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్‌లోని ఓ డీప్‌ లెర్నింగ్‌ ఆల్గోరిథం రక్తంలో ప్రాణవాయువు స్థాయులను కచ్చితత్వంతో నిర్ధారిస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ సాచురేషన్‌ స్థాయి 70% వరకు పడిపోయినా ఈ విధానంలో గుర్తించొచ్చని పరిశోధకులు తెలిపారు.

ప్రకృతి హిత ఆవిష్కరణకు పేటెంటు

వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో రసాయన విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నాగరాజన్‌ పీహెచ్‌డీ విద్యార్థి అరుణ్‌కుమార్‌తో కలిసి చేసిన ‘ఎన్‌ - గ్లైకోజెల్‌ నాఫ్తాలిమైడ్స్‌’ ఆవిష్కరణకు భారతీయ పేటెంటు దక్కింది. కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల) నుంచి వెలికితీసిన ఎన్‌-గ్లైకోజెల్‌ అనే అణుపదార్థాన్ని (మాలిక్యూల్‌) కాటన్‌ వస్త్రంలో ప్రవేశపెడితే అది సెమీ కండక్టర్‌లా పనిచేస్తోంది. సాధారణంగా విద్యుత్తు ఉపకరణాల్లో వినియోగించే సెమీకండక్టర్‌ చిప్‌ల గడువు తీరాక ఈ-వ్యర్థాలుగా మారి పర్యావరణానికి హానిచేస్తాయి. ఇప్పుడు పరిశోధకులు వెలికితీసిన అణుపదార్థం కాటన్‌ వస్త్రంతో కలిపితే సెమీకండక్టర్‌గా మారుతోంది. 8 వోల్టుల సామర్థ్యమున్న ఈ చిన్నపాటి బట్ట నుంచి 8 నానో ఆంపియర్స్‌ విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ తరహా సెమీకండక్టర్లను తక్కువ ఖర్చుతో రూపొందించవచ్చని, వాటికి భూమిలో కరిగిపోయే లక్షణం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మాలిక్యూల్‌ తయారీకి వాడిన రసాయనాలు హానికారకం కావని వివరించారు. వీరి పరిశోధన లండన్‌కు చెందిన ‘గ్రీన్‌ కెమిస్ట్రీ జర్నల్‌’లో ప్రచురితమైంది. ఈ మాలిక్యూల్‌కు క్యాన్సర్‌పై సమర్థంగా పనిచేసే లక్షణమూ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

పర్యావరణహిత పాలిథిన్‌ సంచులకు సరికొత్త సాంకేతికతను ఆవిష్కరణ

పర్యావరణహిత పాలిథిన్‌ సంచుల తయారీ కోసం ఐఐటీ రూర్కీకి చెందిన ప్రొఫెసర్‌ పి.పి.కుందూ సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించారు. థర్మోప్లాస్టిక్‌ స్టార్చ్‌ అనే ప్రత్యేక సమ్మేళనాన్ని అభివృద్ధి చేశారు. తక్కువ సాంద్రతతో కూడిన పాలీఇథిలీన్‌ (ఎల్‌డీపీఈ)తో దాన్ని కలపడం ద్వారా జీవవిచ్ఛిన్నకర పాలిథిన్‌ సంచులను తయారు చేయడం సాధ్యం కానుంది. సంబంధిత సాంకేతికతను నోయిడాకు చెందిన అగ్రసర్‌ ఇన్నోవేటివ్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే కంపెనీకి బదిలీ చేశామని ఐఐటీ రూర్కీ తెలిపింది. వాణిజ్యపరమైన వినియోగానికి వీలుగా ఆ కంపెనీ భారీ స్థాయిలో జీవవిచ్ఛిన్నకర పాలిథిన్‌ సంచులను ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది.

చైనా శాస్త్రవేత్తల కరోనాను కనిపెట్టే మాస్క్‌ ఆవిష్కరణ

మన చుట్టూ ఉండే వాతావరణంలో కరోనా సహా పలు రకాల వైరస్‌ల ఉనికిని గుర్తించి అప్రమత్తం చేసే సరికొత్త వైర్‌లెస్‌ మాస్కును చైనా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. అప్టేమర్స్‌ అనే సింథటిక్‌ అణువులతో తయారు చేసిన ప్రత్యేక బయోసెన్సర్‌ను మాస్కులో వారు పొందుపర్చారు. వాతావరణంలో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌లను అది కేవలం 10 నిమిషాల్లో నిర్ధారిస్తుంది. ఆ మాస్కు ధరించిన వ్యక్తి ఫోన్‌కు సంబంధిత సమాచారాన్ని చేరవేస్తుంది.

క్యాన్సర్‌ కారకాలను గుర్తించే ఏఐ

ఔషధాలు వంటి రసాయన పదార్థాల్లో క్యాన్సర్‌ కారకాల (కార్సినోజెన్‌లు)ను గుర్తించే కృత్రిమ మేధ (ఏఐ) సాధానాన్ని దిల్లీలోని ట్రిపుల్‌ ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు మెటాబోకిల్లర్‌ అని పేరు పెట్టారు. కొన్ని దశాబ్దాల్లో అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతించిన అనేక మందులను ఉపసంహరించాల్సి వచ్చింది. వాటితో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉందని తర్వాత తేలడమే ఇందుకు కారణం. సౌందర్య, ఆహార ఉత్పత్తుల్లోనూ ఇది చాలా కీలకాంశం. మెటాబోకిల్లర్‌ ఏదైనా ఒక వస్తువులో కార్సినోజెన్‌లను గుర్తించడమే కాదు, తాను ఈ నిర్ధారణకు రావడానికి కారణాలనూ వెల్లడిస్తుంది.

కణితిని పర్యవేక్షించే పరికరం అభివృద్ధి

క్యాన్సర్‌ కణితి పెరుగుదలను పర్యవేక్షించే బుల్లి పరికరాన్ని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని పేరు ‘ఫ్లెక్సిబుల్‌ అటానమస్‌ సెన్సర్‌ మెజరింగ్‌ ట్యూమర్స్‌ (ఫాస్ట్‌). చర్మానికి ఇట్టే అతుక్కోవడంతో పాటు, శరీర కదలికలకు అనుగుణంగా సాగేలా ఇందులో సెన్సర్లను అమర్చారు. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ పరికరం, మిల్లీమీటరులో వందో వంతు పరిమాణంలో మార్పులు చోటు చేసుకున్నా ఇట్టే గుర్తిస్తుంది. కణితిలో ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌కు సమాచారం చేరవేస్తుంది. తద్వారా క్యాన్సర్‌ ఔషధాలు, చికిత్సల పనితీరును మరింత వేగంగా, కచ్చితంగా తెలుసుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. చర్మం మాదిరి ఉండే పాలిమర్లు, బంగారు సర్క్యూట్‌ లేయర్‌లతో ఫాస్ట్‌ పరికరాన్ని రూపొందించాం. దీని ధర తక్కువే. వైర్‌లెస్‌ సాంకేతికతతో పనిచేస్తుంది. తీగల అవసరం లేకుండా, చర్మానికి ఇట్టే అతుక్కుంటుంది. క్యాన్సర్‌ చికిత్సలను మరింత మెరుగ్గా అందించేందుకు, పర్యవేక్షించేందుకు దోహదపడుతుందని పరిశోధనకర్త అలెక్స్‌ అబ్రామ్‌సన్‌ తెలిపారు. ఈ పరికరాన్ని ఇప్పటికే ఎలుకలపై విజయవంతంగా పరీక్షించారు.

కరోనా వైరస్‌లను నాశనం చేసే కషాయం తయారు

కొవిడ్‌ చికిత్సల్లో కొత్త మలుపు! 11 రకాల కరోనా వేరియంట్లపై సమర్థంగా పోరాడి, వాటిని నాశనం చేయగల ప్రత్యేక కషాయాన్ని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ వైద్యులు, పరిశోధకులు తయారు చేశారు. ‘గోజీహ్వాదీ క్వాత్‌’ అనేది ఆయుర్వేద ఔషధం. దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు, నాసికా అవరోధాలు, వాసన, రుచి తగ్గడం మొదలైన సమస్యల నివారణకు ఆయుర్వేదంలో దీన్ని వాడుతుంటారు. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆయుర్వేద వైద్య నిపుణులు పరమేశ్వరప్ప, సుశీల్‌కుమార్‌ దుబే, బయోఇన్ఫర్మేటిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.రాజీవ్‌ మిశ్రల బృందం, ఈ ఔషధానికి సిట్రస్‌ జాతికి చెందిన పలు మొక్కల భాగాలను జోడించి ప్రత్యేకంగా కషాయం రూపొందించింది. కొవిడ్‌ మూడో ఉద్ధృతి సమయంలో 500 మంది బాధితులకు రోజూ రెండు డోసులుగా ఈ కషాయంను ఇచ్చి చూశారు. ఇందులోని ఫైటోకెమికల్‌ ఫార్చునెలిన్‌ అనే పదార్థం శరీరంలోని కరోనా వేరియంట్లను నాశనం చేస్తుందని గుర్తించారు.

అనేక రకాల క్యాన్సర్లను గుర్తించే రక్తపరీక్ష

పలు రకాల క్యాన్సర్లను గుర్తించే సామర్థ్యం కలిగిన ఒక కొత్త రకం రక్తపరీక్షను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వ్యాధికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ రోగుల్లో ఆ రుగ్మత జాడను ఇది పసిగట్టడం విశేషం. ‘మల్టీ క్యాన్సర్‌ ఎర్లీ డిటెక్షన్‌’ (ఎంసీఈడీ) అనే రక్త పరీక్షను ఇందుకోసం వినియోగించారు. పరిశోధనలో భాగంగా 6,662 మందిపై దీన్ని పరీక్షించారు. వీరంతా 50 ఏళ్లు పైబడినవారే. వీరిలో ఒక్క శాతం మందిలో క్యాన్సర్‌ వెలుగు చూసింది. ప్రస్తుతం ఎలాంటి స్క్రీనింగ్‌ విధానాలు అందుబాటులో లేని క్యాన్సర్‌ రకాలనూ ఇది పట్టించింది. దీన్ని ప్రామాణిక ప్రాథమిక పరిశీలన విధానాలతోనూ శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. ప్రస్తుత విధానాల్లో గుర్తించిన దాని కన్నా రెట్టింపు సంఖ్యలో క్యాన్సర్లను తాజా రక్తపరీక్ష కనుగొంది. కాలేయం, చిన్నపేగు, గర్భాశయానికి సంబంధించిన స్టేజ్‌-1 క్యాన్సర్లు, క్లోమం, ఎముక, గొంతుతో ముడిపడిన స్టేజ్‌-2 క్యాన్సర్లు వీటిలో ఉన్నాయి. ఈ విధానం వల్ల చాలా ముందుగానే రోగులకు చికిత్స చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పిన ‘డెల్టా’

కరోనా వైరస్‌లో అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌ డెల్టా. రెండో దశ ఉద్ధృతి సమయంలో దీని కారణంగా వేల మంది చనిపోయారు. మిగిలిన వేరియంట్లతో పోల్చితే ఇది ఎందుకంత ప్రమాదకరం? మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ ఎందుకు పోరాడలేకపోయింది? అన్న ప్రశ్నలకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లోని శాస్త్రవేత్తలు డాక్టర్‌ కృష్ణన్‌ హర్షన్, దివ్య తేజ్‌ సౌపతి ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం సమాధానం చెప్పింది. ‣ కరోనా వైరస్‌లోని వేర్వేరు వేరియంట్లు సోకితే మనిషిలోని రోగ నిరోధక శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే విషయంపై ఈ బృందంలోని విశాల్‌ షా, దీక్షిత్‌ టాండల్, నితీష్‌ సింగ్‌లు అధ్యయనం చేశారు. వీరి పరిశోధన ఫలితాలు ప్రముఖ జర్నల్‌ మైక్రోబియల్‌ స్పెక్ట్రమ్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా వైరస్‌లోని ఆల్ఫా, డెల్టాతో పాటు మరో మూడు వేరియంట్లను తీసుకుని అధ్యయనం చేశారు. మానవ కణజాలాన్ని ల్యాబ్‌ పరిస్థితుల మధ్య అభివృద్ధి చేసి ఆయా అయిదు వేరియంట్లను ప్రయోగించి పరీక్షించారు. రోగ నిరోధక వ్యవస్థపై కొన్ని వందలసార్లు ఆయా వేరియంట్లను ప్రయోగించి స్పందనలను నమోదు చేశారు. మిగిలిన నాలుగు వేరియంట్లు ప్రవేశించగానే రోగ నిరోధకాలు వేగంగా విడుదలై పోరాడుతున్నట్లు గుర్తించారు. డెల్టా వేరియంట్‌ విషయంలో మాత్రం రోగ నిరోధక వ్యవస్థ స్పందన తక్కువగా ఉందని, రోగ నిరోధకాలు పెద్దగా ఉత్పత్తి కాలేదని తేల్చారు. ఆ వ్యవస్థ స్పందించేలోపే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించిందని కనుగొన్నారు. అలాగే యాంటివైరల్‌ చికిత్సలో వాడే రోగ నిరోధకాలు, ఇంటర్‌ఫెరాన్స్‌ ప్రభావవంతంగా పనిచేయలేదని చెప్పారు. ‘డెల్టా వేరియంట్‌ ప్రభావమే కాదు, మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడికి వైరస్‌లు ఎలా స్వరూపాన్ని మార్చుకుంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు మా అధ్యయనం సహకరిస్తుంది’ అని కృష్ణన్‌ హర్షన్‌ వివరించారు.

పూతరేకుల యంత్రానికి పేటెంట్‌

అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన పూతరేకుల తయారీ యంత్రానికి కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ హక్కు ఇచ్చింది. పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ డాక్టరు పీవీకే జగన్నాథరావు ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయ తీపి పదార్థాలలో పూతరేకులది విశిష్ఠ స్థానం. ఉమ్మడి ఉభయ గోదావరి, విజయనగరం జిల్లాల్లో దీన్ని చాలా మంది కుటీర పరిశ్రమగా చేపట్టారు. ఆత్రేయపురంలో ప్రతి ఇంటిలోను పూతరేకులు తయారు చేస్తారు. సాధారణంగా పూతరేకులను కుండలపై చేస్తారు. ఈ విధానంలో అధిక వేడితో పాటు ధూళి, పొగ కారణంగా కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోంది. పూతరేకులు తయారీకోసం విద్యుత్తుతో పనిచేసే యంత్రాన్ని ఇంజినీరింగ్‌ శాస్త్రవేత డాక్టరు పి.శ్రీదేవితో కలిసి రూపొందించాం. యంత్రం ఖరీదు రూ.35 వేలు. దీనిపై 2016లో పేటెంట్‌కు దరఖాస్తు చేశాం. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 7న పేటెంట్‌ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది’ అని వివరించారు.

బాలల్లో చూపు సమస్యకు ఈ జన్యువే కారణం

చిన్నతనంలో వచ్చే రెటీనైటిస్‌ పిగ్మెంటోసా అనే అరుదైన నేత్ర వ్యాధికి జన్యు కారణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రుగ్మత వల్ల కంటిచూపు క్రమంగా తగ్గిపోతుంది. బీసీవోఆర్‌ జన్యువులో ఉత్పరివర్తనల వల్ల ఈ సమస్య వస్తుందని పరిశోధకులు తేల్చారు. నిజానికి ఇది క్యాన్సర్‌ జన్యువు. బి-సెల్‌ లింఫోమా, ఇతర రకాల క్యాన్సర్లలో కనిపిస్తుంటుంది. దీనిపై మరింత లోతుగా పరిశీలించగా బీసీవోఆర్‌ జన్యువులో ఉత్పరివర్తనల వల్లే కంటి చూపు మందగిస్తున్నట్లు గుర్తించారు. రెటీనాకు సంబంధించిన అనేక జన్యువులను ఇది నియంత్రిస్తున్నట్లు తేల్చారు. బీసీవోఆర్‌లో జన్యు లోపాలు తలెత్తితే ఈ ప్రక్రియ దెబ్బతిని, రెటీనా కణాలు చనిపోతాయని, అంతిమంగా దృష్టి లోపం తలెత్తుతుందని గుర్తించారు.

వరదల్లోనూ పైరుకు మెరుగ్గా ఆక్సిజన్‌ సరఫరా

వరదల కారణంగా పంట నష్టం చోటుచేసుకునే ముప్పును తగ్గించే దిశగా జపాన్‌లోని హిరోషిమా విశ్వవిద్యాలయం పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. వరదల సమయంలో మొక్కలకు ఆక్సిజన్‌ సరిగా అందని పరిస్థితిని హైపాక్సియాగా పిలుస్తారు. దానికి దారితీస్తున్న ప్రక్రియలను, వాటి వెనకున్న జన్యుపరమైన కారకాలను పరిశోధకులు నిర్దిష్టంగా గుర్తించారు. ఆయా జన్యువులను బలోపేతం చేయడం ద్వారా వరదల్లోనూ మొక్కలు/పంటలకు ఆక్సిజన్‌ సరఫరా మెరుగ్గా జరిగేలా తీర్చిదిద్దొచ్చని వారు తెలిపారు.

క్యాన్సర్‌పై పోరాటాన్ని ఉత్తేజపరిచే వ్యర్థ పదార్థం

వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోంచి స్వేదం, మృతకణాలు వంటి వ్యర్థాలు విడుదలవుతాయి. ఇలా కణాలు విసర్జించే మరో పదార్థమే లాక్టేట్‌! అయితే, క్యాన్సర్‌పై పోరాడే కణాలను ఉత్తేజపరిచే శక్తి దీనికి ఉన్నట్టు సిమన్స్‌ క్యాన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేచర్‌ కమ్యూనికేషన్స్‌ పత్రిక ఈ పరిశోధన వివరాలు అందించింది. తీవ్ర గాయాలు, కాలిన గాయాలు, శస్త్రచికిత్స చేసేటప్పుడు బాధితులు రక్తాన్ని కోల్పోయే సందర్భంలో; లేదంటే మూత్రపిండాల వైఫల్యం కారణంగా శరీరంలో ఆమ్లాలు పేరుకుపోయే పరిస్థితి (మెటబాలిక్‌ అసిడోసిన్‌)ని అధిగమించేందుకూ, రోగులకు లాక్టేక్‌ను ఎక్కిస్తారు. దీనిపై దృష్టి సారించిన పరిశోధకులు పెద్దపేగు క్యాన్సర్‌ ఉన్న ఎలుకలకు ఈ పదార్థాన్ని ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చారు. తర్వాత నిశితంగా పరీక్షించగా వాటిలో క్యాన్సర్, కణతి పెరుగుదల గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు.

పురుషుల్లో ‘సంతానోత్పత్తి జన్యువుల’ గుర్తింపు: సీసీఎంబీ

పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమవుతున్న 8 జన్యువులను హైదరాబాద్‌లోని సీసీఎంబీ పరిశోధకులు తొలిసారి గుర్తించారు. డాక్టర్‌ తంగరాజ్, దిగుమర్తి సుధాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరిశోధనలో భాగంగా సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న 47 మంది పురుషుల నుంచి జన్యువులు సేకరించారు. వాటిని నెక్ట్స్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ చేశారు. ముందుగా సంతాన లేమికి కారణాలు కనుగొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న 1500 మంది పురుషుల్లోని జన్యువులతో పరిశీలన చేసి ఆ ఫలితాలను నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో పురుషుల్లో సంతానోత్పత్తికి బీఆర్‌డీటీ, సీఈటీఎన్‌1, సీఏటీఎస్‌పీఈఆర్‌డీ, జీఎంసీఎల్‌1, ఎస్‌పీఏటీఏ6, టీఎస్‌కేఎస్, టీఎస్‌ఎస్‌కే4, జడ్‌ఎన్‌ఎఫ్‌318 జన్యువులు కారణమవుతున్నట్లు గుర్తించారు. ఆయా జన్యువుల్లోని సీఈటీఎన్‌1లో ఉత్పరివర్తనాలను పరిశోధన బృందం పరిశీలించింది. ఇందులో కణ విభజన సరిగా జరగకపోవడంతో శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు తలెత్తుతాయని వెల్లడైంది. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల్లో ఎక్కడా జన్యువుల పాత్ర వెలుగు చూడలేదని, తొలిసారిగా తమ బృందం కనుగొన్నట్లు తంగరాజ్‌ వివరించారు. సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్న సగం మంది దంపతుల్లో పురుషుల సంతానోత్పత్తి సమస్యలే కారణమవుతున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి పురుషుల్లో తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యులోపాలు కారణమై ఉండవచ్చని విశ్లేషించారు. వీరి పరిశోధన ఫలితాలు ప్రముఖ జర్నల్‌ హ్యుమన్‌ మాలిక్యులర్‌ జెనిటిక్స్‌లో ప్రచురితమయ్యాయి. పురుషుల్లో సంతానోత్పత్తికి మెరుగైన చికిత్స పద్ధతుల అభివృద్ధికి ఈ పరిశోధన కీలకం కానుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ నందికూరి తెలిపారు.

ఇంజెక్షన్‌ రూపంలో ప్రాణవాయువు

శరీరంలో ఆక్సిజన్‌ తదితర వాయువుల రవాణాను వేగవంతం చేసేలా థర్మోడైనమిక్స్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ‘మైక్రో పోరస్‌ వాటర్‌’ను హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన మాసన్స్‌ లేబొరేటరీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నెలల తరబడి దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ఈ శుద్ధ నీటిలోని స్పంజికలు గ్యాస్‌ను నిక్షిప్తం చేసి, ఆ తర్వాత సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాల కంటే 30 రెట్లు అధిక సామర్థ్యంతో మైక్రో పోరస్‌ వాటర్‌ ద్వారా రోగికి ఆక్సిజన్‌ అందించవచ్చని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ద్రవాన్ని అంబులెన్స్‌లు తదితర చోట్ల అందుబాటులో ఉంచితే, రోగులకు సాధారణ ఇంజెక్షన్‌ రూపంలో తక్షణమే ప్రాణవాయువును అందించే వెసులుబాటు కలుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వాయు కాలుష్యంతో శిశువుల పేగు బ్యాక్టీరియాలో మార్పులు

శిశువులు తమ జీవితంలోని మొదటి ఆరు నెలల్లో వాయు కాలుష్యం బారిన పడితే వారి పేగు బ్యాక్టీరియాపై దుష్ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జనన సమయంలో శిశువు పేగుల్లో కొద్ది పరిమాణంలోనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ తర్వాత 2-3 ఏళ్లలో పలు అంశాలు, ఆ చిన్నారి పేగుల్లోని సూక్ష్మజీవుల కూర్పును నిర్దేశిస్తాయి. పేగుల్లో ఆహారం, రసాయనాలను విచ్ఛిన్నం చేసేటప్పుడు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే మెటబోలైట్లు మనలో ఆకలి, ఇన్సులిన్‌ సెన్సిటివిటీ, రోగ నిరోధక శక్తి, భావోద్వేగాలు, విషయ గ్రహణ సామర్థ్యం వంటి అంశాలను ప్రభావితం చేస్తాయి. ఈ సూక్ష్మజీవుల్లో కొన్ని ఉబ్బసం, టైప్‌-2 మధుమేహం, క్రోన్స్‌ వ్యాధి వంటి వాటికి కారణమవుతుంటాయి. కర్మాగారాలు, కార్చిచ్చు, నిర్మాణ సంబంధ ధూళి, వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్‌ డైఆక్సైడ్‌లో ఉండే పీఎం 2.5, పీఎం10 రేణువులకు గురికావడం వల్ల శిశువుల పేగుల్లో హానికర ఇన్‌ఫ్లమేటరీ బ్యాక్టీరియా ఎక్కువవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోజనకర సూక్ష్మజీవులు తగ్గుతున్నట్లు తేల్చారు.

ఫ్యాటీ లివర్, మధుమేహం మధ్య లంకె ఇదే!

మద్యం తీసుకోనివారిలో వచ్చే ఫ్యాటీ లివర్‌ రుగ్మత (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)కు టైప్‌-2 మధుమేహానికి మధ్య ఉన్న జీవరసాయన లంకెను హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ అనేది ఇన్సులిన్‌ నిరోధకత, టైప్‌-2 మధుమేహానికి సూచిక. అయితే అది క్లోమంలో ఇన్సులిన్‌ను విడుదల చేసే బీటా కణాలను ఎలా ప్రభావితం చేస్తుందన్న దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. దీన్ని భారత శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. వీరు అధిక కొవ్వు ఆహారం పొందిన ఎలుకలు, ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ సమస్య ఉన్న మానవుల రక్త నమూనాలు విశ్లేషించారు. రెండు నమూనాల్లోనూ ఎస్‌100ఏ6 అనే క్యాల్షియం బైండింగ్‌ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది ఫ్యాటీ లివర్‌ వల్ల విడుదలవుతుంది. ఈ ప్రొటీన్, బీటా కణాల్లో ఇన్సులిన్‌ ఉత్పత్తిని దెబ్బతీస్తుందని కనుగొన్నారు. ఫలితంగా టైప్‌-2 మధుమేహం ఉత్పన్నం కావడం లేదా అప్పటికే ఉన్న వ్యాధి తీవ్రం కావడం జరుగుతుందని గుర్తించారు.

తక్కువ విద్యుత్తుతో వాడుక నీటి శుద్ధి

ఇళ్లల్లో వాడే నీరు వృథాగా పోతుంటుంది. వేసవి వచ్చేసరికి నీటి కొరత తలెత్తి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వాడుక నీటి పునర్వినియోగానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నా.. అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ విద్యుత్తు వినియోగంతో నీటిని పునర్వినియోగించే పద్ధతిని జేఎన్‌టీయూ-హెచ్‌ రూపొందించింది. వర్సిటీలోని పర్యావరణ కేంద్రం ఆచార్యురాలు వి.హిమబిందు నేతృత్వంలో దీన్ని ఆవిష్కరించారు. వీరు అనుసరించిన విధానంతో నీటిలోని కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీవోడీ) గణనీయంగా తగ్గింది. సీవోడీ ఎక్కువగా ఉంటే గాఢత అధికంగా ఉండి నీరు వినియోగానికి ఉపయోగపడదు. ఈ మేరకు జేఎన్‌టీయూలో ఎలక్ట్రో కోఆగ్యులేషన్, సాధారణ కోఆగ్యులేషన్‌ను ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రంతో చేపట్టారు. 30 నిమిషాల్లో లీటరు నీటిని ఈ యంత్రంతో ప్రయోగాత్మకంగా శుద్ధి చేశారు. శుద్ధి చేయక ముందు సీవోడీ 200 ఉండగా తర్వాత 20కి తగ్గినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియకు విద్యుత్తు వినియోగమూ తక్కువే అవుతుందని హిమబిందు వివరించారు. రోజుకు 200-250 లీటర్ల నీటిని శుభ్రపరచడానికి ఒక యూనిట్‌ లోపు విద్యుత్తు ఖర్చవుతుందని వెల్లడించారు. ఇలా శుద్ధిచేసిన నీటిని మొక్కలకు ఉపయోగించుకోవడంతో పాటు మరుగుదొడ్లలో పోసేందుకు వాడుకోవచ్చన్నారు.

కొవిడ్‌కు సరికొత్త చికిత్సలను కనుగొన్న శాస్త్రవేత్తలు

కొవిడ్‌ విజృంభణను అరికట్టడంలో దోహదపడగల సరికొత్త చికిత్సా మార్గాలను బ్రిటన్‌లోని కెంట్‌ విశ్వవిద్యాలయం, జర్మనీలోని గోటా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధక బృందం తాజాగా కనుగొంది. యాంటీ వైరల్‌ ఔషధాలైన రెమ్డెసివిర్, మోల్నుపిరవిర్, నిర్మట్రెల్విర్, ఎప్రొటినిన్‌లతో మరో యాంటీ వైరల్‌ డ్రగ్‌ బీటాఫెరాన్‌ను విడివిడిగా కలిపి కరోనాపై పోరులో ఆయా మిశ్రమాల సామర్థ్యాన్ని పరిశోధకులు పరిశీలించారు. రెమ్డెసివిర్‌తో కలిసినప్పటితో పోలిస్తే మోల్నుపిరవిర్, నిర్మట్రెల్విర్, ఎప్రొటినిన్‌లతో బీటాఫెరాన్‌ కొవిడ్‌ను ప్రభావవంతంగా నిలువరిస్తున్నట్లు వారు గుర్తించారు. భవిష్యత్తులో కరోనా కొత్త వేరియంట్లు రాకుండా ఈ మూడు మిశ్రమాలు సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు.